వల్లభాయి పటేల్/అసహాయోద్యమము
అసహాయోద్యమము
1918 లో యూరపు మహయుద్ధము ముగిసెను. ఈ యుద్ధములోఁ దిలకుగారు బ్రిటిషువారికి సహాయము చేయక పోయినప్పటికి గాంధిమహాత్ముఁడు పెక్కువిధములఁ దోడ్పడెను.
1919 లో బ్రజావాక్స్వాతంత్ర్యమును రూపుమాపుటకై ప్రభుత్వవారు రౌలటు చట్టమును బ్రవేశపెట్టిరి. ఈ చట్టమును వ్యతిరేకించుచు గాంధిజీ సత్యాగ్రహము ప్రారంభించెను. దేశమునం దంతటను హర్తాళములు. గొప్పగొప్ప సభలు జరిపి ప్రభుత్వ చర్యల కసమ్మతిఁ దెలిపిరి. ఈసభలపై సర్కారువా రాశ్వికులదాడిని బంపిరి. కొందఱ నరెస్టుచేసిరి. పంజాబు ప్రముఖులగు సత్యపాల్, దునీచందు మొదలగువారిని బందిఁబెట్టిరి. పంజాబులోఁ బ్రశాంతస్థితి నేర్పాటు చేయుటకు గాంధిజీ బయలుదేరఁగా నాయనను మధ్యేమార్గమున నరెస్టు చేసి బొంబాయిలో దింపిరి.
1919 లో ఏప్రిలు 13 తారీఖున నమృతసరులో జలియనువాలా బాగునందు శాంతముగా సభఁ జేయుచున్న నిరాయుధులగు ప్రజలను డయ్యరుసేనాని దయారహితుఁడై మర ఫిరంగులతోఁ గాల్చి చంపెను. పైగాఁ బంజాబుదేశమునఁ ప్రభుత్వమువారు సైనికశాసనము ప్రయోగించిరి. ప్రభుత్వము వారి యన్యాయప్రవర్తనమునకుఁ గినిసి గాంధిజీ ప్రభుత్వమున కెట్టి సహాయము చేయరాదని ప్రకటించెను. గాంధిజీ యీ విధముగా దేశమంతటను దన యుద్యమమును బ్రచారము సేయసాగెను. ప్రజలలో నిది యధికముగ వ్యాప్తిఁగాంచెను. కలకత్తా, నాగపూరు కాంగ్రెసులలో నసహాయోద్యమ మంగీకరింపఁబడినది. అసహాయోద్యమానుగుణముగఁ దన బారిస్టరువృత్తిని మాని తన పిల్లల నున్నత విద్యకై విదేశములకుఁ బంపించుట విరమించుకొని గుజరాతులోఁ బటే లసహాయోద్యమ ప్రచారము ప్రారంభించెను. ప్రభుత్వమువారి దండన విధాన మతి కఠోరముగా నుండెను. ప్రజలు దీనిని లెక్కసేయక యధికోత్సాహముతో నిందుఁ బాల్గొనజొచ్చిరి. గాంధిజీ వల్లభాయులు గుజరాతులో సత్యాగ్రహము ప్రారంభింప నహర్నిశలు కృషి చేయసాగిరి. బార్డోలీ, ఆనంద్ తాలూకాలు సత్యాగ్రహమునకై సర్వవిధముల నాయత్తము చేయఁబడినవి. బార్డోలీ నామము భరతఖండ మంతట విఖ్యాతిఁగాంచినది. చౌరాచౌరి హత్యాకాండ కారణముగా సత్యాగ్రహ మాపివేయఁబడెను. గాంధిజీ యరెస్టు చేయఁబడెను. దీని యనంతరము గుజరాతు భారమంతయు వల్లభాయి భుజస్కంధముల పైఁబడెను. ఆయన గుజరాతు కేకైక నాయకుఁడు. ఆ దినములలో నాయన గుజరాతు విద్యాపీఠమునకై బర్మాకుఁ గూడ వెడలి దాదాపు పదిలక్షల రూపాయలు వసూలు చేసెను.
నాగపూరు సత్యాగ్రహము
1923 ఏప్రిలు 13 న జబల్‌పూరులో జాతీయవారము జరిపినారు. ఆ సందర్భములోఁ కాంగ్రెసు యువకులు మ్యునిసిపలు భవనముపై జాతీయ పతాకమును బ్రతిష్ఠించిరి. పోలీసువారు దానిని లాగివేసి చించి పాఱవేసిరి. ఒక యూరపియను