వరవిక్రయము/సప్తమాంకము

సప్తమాంకము

మొదటి రంగము

(ప్రదేశము: లింగరాజుగారి పడక గది.)


(ప్రవేశము: కుక్కి మంచముపైఁ గూర్చుండి లింగరాజుగారు, చేరువను నిలుచుండి సుభద్ర.)

సుభ :- సరేగాని, నలుగురు నట్టింటికి వచ్చునప్పుడైన నా నగలు నాకీయఁగూడదా? ఇంట శుభకార్య మగునప్పుడు గూడ నేనిట్లు యుండవలయునా?

లింగ :- ఎందులకే యింత తొందర? ఎల్లుండి రాత్రికి గదా వివాహము? అకారణముగా నీ రెండు దినములు నఱిగిపోవుటయే గదా?

సుభ :- అబ్బబ్బ! యెప్పుడు చూచిన నగ తఱిగిపోవుననియు, బట్టలు చిఱిగిపోవుననియు, బియ్యము తఱిగిపోవుననియు నిదే గోల కద! ఎందులకీ భాగ్యమంతయు?

గీ. స్వారిచేయని గుఱ్ఱంబు, చదువనట్టి
   పుస్తకంబును, సేవింపఁబోని మందు,
   నారగింపని వంటక, మనుభవింప
   నట్టి ధనమును వ్యర్థంబు లనుట వినరె?

లింగ :- ఓసీ! యెందుల కేడిపించెదవు? రేపిచ్చెద యూరకుండుము.

సుభ :- రేపు శుక్రవారమని సున్న చుట్టుటకా?

లిం :- నేడు గురువారము, గురువారము బొత్తిగా గూఁడనిది.

సుభ :- ఈ వన్నెవారిఁకఁ గోడలి కేమి నగలు పెట్టుదురు?

లింగ :- ఇక్కడికి నీ సంగతి యైనది? ఇఁకఁ గోడలి సంగ తియా? అబ్బాబ్బా! ఆఁడువాండ్ర కీ యాభరణాల రుచి ఎవడు మప్పినాఁడో కాని యే యింట జూచిన నిదేగోల గదా! ఏడు వారముల నగలుఁగల యిల్లాలు కూడ ఎదురింటి ముత్తమ్మ ముక్కుపుడక యెరువు తెచ్చుకున్నదాఁక నిద్రపోదు! తాలూకాఁలట, జిల్లాలఁట, లోలకులఁట, డోలకులఁట, వాచీ గొలుసులఁట, పేచీ గొలుసులఁట, అటుకుల గాజులఁట, యిటుకుల గాజులఁట, యెప్పటికప్పుడు ఏమేమో రకములలో దిగుమతియగుచున్నవి! కమసాలులకుఁ కావలసినంత పని. షరాబులకు జాలినంత బేరము.

సుభ :- మీవంటి భర్తలకు మాత్రము ప్రాణసంకటము!

లింగ :- సరేకాని చెప్పవచ్చిన మాటలు పూర్తిగా జెప్పనిచ్చినావే కావు, అనుదినము మన యింటికి వారు అరిసెలు, సున్ని, అప్పడము, వడియాలు, విధవల కని పిండి, స్వయంపాకులకని యుప్పు, పప్పు, బియ్యం, నేయి, అల్లము, బెల్లము, చింతపండు, మిరపకాయలు, కూరలు, నారలు, తలంట్లకని నూనె, నలుగుబిండి, కుంకుడు కాయలు, షీకాయ, కట్టెలు, పిడుకలు, సబ్బు, సాంబ్రాణి, పసుపు, కుంకుమ మున్నగున వన్నియును బంపుదురు. అన్నియు జాగ్రత్తగా నందుకొని ప్రక్కగదిలో భద్రపఱిచి, ఆరవనాఁడు నా కప్పగించవలయును.

సుభ :- ఎందు నిమిత్తము?

లింగ :- ఏకముగ బజారునఁబెట్టి యమ్మించుటకు.

సుభ :- రామ రామా! నలుగురు నవ్వరా?

లింగ :- నవ్వుట కేమున్నది? ఉమామహేశ్వరరావుగారు మొన్న నుప్పుతోఁ గూడ నూరను త్రిప్పి యమ్మించలేదా?

సుభ :- అట్లయిన సదస్య సంభావన కూడ ఆయన యిచ్చినట్లే యిచ్చెదరు కావలయును.

లింగ :- ఆయన, కాని కానియైన నిచ్చినాఁడు. నే నఱగాని గూడ నీయను. పదిరూపాయలు పోలీసువారి మొగమునఁగొట్టి పందిటిచుట్టున పారాలేసినచో పయిన సంభావన పనియుండదు.

సుభ : -చివరకు నా చీరల సంగతి కూడ నింతియేనా యేమిటి?

లింగ :- వెఱ్ఱిమొగమా! నీకుఁ చీరల కేమిలోటు! అయిదురోజులు నైదు చీరలు. అప్పగింతచీరతో నాఱు. ఆఱుచీరలు నాఱేండ్లు కట్టవచ్చును. ఒక్క చీరలేనా? నీకు రావలసిన లాంఛనములింకనూ లక్ష యున్నవి. అయిదు రోజులు అయిదు మొహిరీలు, అయిదు కాసులు, అయిదు వెండి పలుదోము పుల్లలు, అయిదు బంగారు తాటియాకులు, అయిదు వెండి పలుగుట్లు పుల్లలు, అయిదు వెండి కాఫీ కప్పులు, అయిదు వెండి యుప్మా ప్లేట్లు; అయిదు కుర్చీలు, అయిదు కాలిపీటలు; అయిదు మెత్తలు, అయిదు బాలీసులు, అయిదు బొట్టుపెట్టెలు, అయిదు అద్దములు, అయిదు దంతపు దువ్వెనలు, అయిదు కుంకుమ బరిణెలు, అయిదు కాటుక కాయలు, అయిదు గంధపు గిన్నెలు, అయిదు తలనూనె బుడ్లు, అయిదు సెంటు బుడ్లు, అయిదు సబ్బు పెట్టెలు, అయిదు పవుడరు డబ్బీలు, అయిదు చేతిరుమాళ్లు, అయిదు గంధపు చెక్కలు, అయిదు చీనా విసనకఱ్ఱలు, భోజనములో వెండిచేపలు, ఫలహారములో పసిఁడిపీతలు ఈలాటి వింకను నెన్నియో వచ్చును. అవన్నియు జాపితా వ్రాసి యుంచినాను. సాఁగదీసి సకలము రాబట్టుకో. ఆ యైదునాళ్ళును నీ యధికారమున కడ్డన్న మాటలేదు.

గీ. గ్రామదేవత కొకనాఁడె కానుకలును
   గొలుపులు న్వేటపోతులును గుంభములును;
   బింకముగ నైదు దినములు పెండ్లి కొడుకు
   తల్లి కొలు పక్క కొలుపును దాసి కొలుపు?

సుభ : -సరేకాని పెండ్లికైన క్షౌరము చేయించుకొనెదరా లేదా?

లింగ :- అదిగో మొదలు పెట్టితివా? ఆ మాట మాత్రము మఱచిపోవు. అవల నాకుఁ జాలపనియున్నది పోయెద! (నిష్క్రమించును.)

సుభ :- ఔరా! సృష్టివైచిత్ర్యము.

చ. కనికరమా కనంబడదు, కన్పడ బోవదు ప్రేమ, పొట్ట చీ
    ల్చినఁ గనుపట్ట దె య్యెడను సిగ్గను నట్టిది, పాపభీతి మ
    చ్చునకును గానిపింప దిఁక సూనృతమన్నది లేనే లేదు, లో
    భిని భువి నే పదార్థములు పెట్టి విధాత సృజింపఁ గల్గెనో!

అన్నిటికంటెను జిత్రమేమా?

గీ. ప్రాయకంబుగ రాజు దు-ర్మతినె పెంచు;

    మగువ తుంటరినే తన మది వరించు
    అంబుదంబులు కొండలయందె కురియు,
    లచ్చి పెనులోభి యింటికే వచ్చి తనియు.

అయినను వీరి ననవలసిన పనిలేదు. ఐశ్వర్యమునఁ గాలచక్రమువలె నదేపనిగఁ తిరుగుచుండునది కాని యొకచోటనె యుండెడిది కాదు!

గీ. బేదదాని కొడుకు పెనులోభియై కూర్చు
   నతని కొడుకు త్యాగియై చరింతు,
   త్యాగి కొడుకు మరల దారిద్ర్యయుతుఁ డగు;
   సిరులు చక్రమట్లు - తిరుగు నిట్లు!

(తెర పడును.)

రెండవ రంగము


(ప్రదేశము: పురుషోత్తమరావుగారి పెరటిలోని పెండ్లి పందిరి.)

పురు :- (కన్యాదాత వేషముతోఁ బ్రవేశించి) ఈ ప్రొద్దు మూడవదినము ఇఁక రెండు దినములు గడపవలెను. ఆడుపిల్లలకుఁ పెండ్లి చేయుట కంటె అశ్వమేధయాగము సేయుట సులభము.

సీ. తెల్ల వాఱఁగనె బిందెలతోడ నీళ్ళును
        పలుదోము పుల్లలఁ బంపవలయు
    కావిళ్లతో వెన్క కాఫీయు, దోసె, లి
        డ్డెనలు, నుప్మాయు నడిపింపవలయు
    తరువాత భోజనార్థము రండు రండని
        పిలిచినవారినే పిలువవలయు
    కుడుచునప్పుడు పంక్తి నడుమ నాడుచుం బెండ్లి
        వారి వాంఛలు కనిపెట్టవలయు
    నొకఁడు రాకున్న వానికై యోర్పుతోడ
        మంచినీరైన ముట్టక మాడవలయు

    నిన్నిటికి సైచి, వేలు వ్యయించి, గౌర
          వించినను నిష్ఠురములె ప్రాప్తించు దుదకు!

ఘంట :- (ప్రవేశించి) అయ్యా! వియ్యపురాలుగారు లేచే వేళయ్యింది. అమ్మగార్నింకా పంపించారు కారేం?

పురు :-ఎందు నిమిత్తము?

ఘంట :- యెందునిమిత్త మంటారేమిటి? వియ్యపురాలు గారికి తెలివిరాగానే కండ్లు తుడవాలి; కాళ్ళు మడవాలి; కోక సర్దాలి; కిందకు దింపాలి; పెరట్లోకి పంపాలి; నీళ్ళచెం బందివ్వాలి; రాగానే కాళ్ళుగడగాలి; పండ్లు తోమాలి; మొహం తొలివాలి; నీళ్ళు పోయ్యాలి; వళ్ళు తుడవాలి; తలదువ్వాలి; కొత్తచీర కట్టాలి; కుర్చీ వెయ్యాలి; కూర్చోబెట్టాలి; పారాణి రాయాలి; గంధం పుయ్యాలి; అత్తర్లివ్వాలి; పన్నీరు చల్లాలి; మొహాన్ని మొహరీలద్దాలి! కళ్ళకు కాసులద్దాలి! వంటిని వరహాలద్దాలి; వెండి పలుపు వెనకను కట్టాలి; బంగారు పలుపు పక్కకు చుట్టాలి; దిష్టి తియ్యాలి; హారతివ్వాలి; అద్ధాన్న మివ్వాలి; యిల్లాంటి వింకా నా తలవెంట్రుక లన్ని వున్నాయి. ఆలశ్యమైతేఁ అలక కట్నం చెల్లించవలసి వస్తుంది. త్వరగా పంపించండి. (అని నిష్క్రమించును.)

పురు :- యెన్నఁడూ వినలే దివెక్కడి పద్ధతులు దేవుఁడా! దాని యవస్థతో బోల్చి చూచిన నా యవస్థయే మెఱుగు! ఓసీ యెక్కడ?

భ్రమ :- (ప్రవేశించి) ఎందులకు బిలచినారు?

పురు :- వియ్యపురాలు లేచువేళ యైనదట. వర్తమానము వచ్చినది.

భ్రమ :- ఇదిగో వెళ్ళుచున్నాను. మొహిరీ లెక్కడ నున్నవి?

పురు :- నా చేతిపెట్టెలో నున్నవి. ఇవిగో తాళములు.

భ్రమ :- (తాళములు తీసికొని నిష్క్రమించును.)

పేర :- (ప్రవేశించును.)

పురు :- వచ్చినారా! ఇక రెండుదినములున్నవి! ఈ రెండు దినములుఁ కూడ దాటించితిరా యీ జన్మమున కీ శిక్ష చాలును. పేర :- ఇది గడ్డురోజు! ఈ రోజు గడిచిందంటే యిక భయమే లేదు. లింగరాజుగారు సంచులు కోసి సంభావనలిస్తారని పై వూళ్లనించి కూడా బ్రాహ్మలు కూడా వచ్చిరట. ఆయనేమో, పోలీసువార్ని అరంజిమెంటు చేస్తున్నారట, విన్నారా?

వీర :- (ప్రవేశించి) అయ్యా! ఫలహారాల కావిళ్ళింకా పంపించినారే కారు. పెళ్ళివా రెంతసేపు ఆగుతారు? ఎవరిమటుకు వాళ్ళు కాఫీ హోటళ్ళకు ప్రయాణమవుతుంటే, పరుగు పరుగున నేను చక్కా వచ్చాను. మగ పెండ్లి వారినిలా చూస్తే మర్యాద దక్కుతుందా?

పురు :- ఇదుగో యిప్పుడే పంపెద. ఈపాటికి సిద్ధమయ్యుండును.

వీర :- ఏమి కావడమో. నిన్నటి వుప్మాలో నిమ్మపండ్ల రసమే లేదట. ఇడ్డెన్లలో అల్లము ముక్కలు లేవట. కాఫీలో పంచదారలేదట. ఈ పూటయినా కాస్త యింపుగా వుండకపోతే పట్టుకు వచ్చిన వాళ్ళ మొహాన్ని పెట్టికొట్టాలని పదిమందీ ఆలోచిస్తూన్నారు. ఖారాఖిల్లీలు కాస్త ఎక్కువగా పంపండి. చుట్టలు, సిగరెట్లు, బీడీలూ కూడా కాస్త శుభ్రమైనవి చూడండి. నిన్న పంపిన చీట్ల పేకలు నిన్ననే చిరిగిపోయాయి. ఈ పూటింకోనాలుగెక్కువ పంపండి. మదరాసు నశ్యము మాట మరిచిపోకండి. శలవు. మఱి యాలస్యమైతే మాటదక్కదు. (అని నిష్క్రమించును.)

పురు :- ఏమి నిరంకుశాధికారము! ఏమి మిలటరీ ఫోర్సు! మగపెండ్లి వారన మరిడీ దేవతలు కారుగదా. (అనుచు లోనికేగును.)

పేర :- ఎనిమిది వేలకూ, యేభయ్యో, వందో వుంటాయి. ఇంతవరకూ నాచేతిలో పైసా పడలేదు. యిప్పుడే నాది నేను వడుక్కోవాలి కాని, ఆనక వీరిచ్చేదేమిటి చచ్చేదేమిటి. ఆనక వీరి కన్నముంటెగద. ఈరోజుల్లో ఆడపిల్ల పెళ్లి చేశాక, యింకా వుండే దేమిటి, వుద్ధరి! తొలినా డడావడి, మలీనా డాయాసం; మూడు మంగళాష్టకాలు; నాలుగు సిగపట్ల గోత్రాలు; అయిదు అప్పగింతలు; ఆరు అంపకాలు; ఏడు వంట బ్రాహ్మల తగవు; ఎనిమిది ఋణదాత నోటీసు; తొమ్మిది జవాబు; పది దావా; పదకొండు స్టేటుమెంటు; పన్నెండు విచారణ; పదమూడు డిక్రీ; పద్ధానుగుట మటమా; పదిహేను వేలము; పదహారు చిప్ప. ఈ రోజుల్లో యిదే పదహారురోజుల పండుగ. కాబట్టి, వెళ్ళీ కదిపి చూస్తాను. (నిష్క్రమించును)

మూడవ రంగము

(ప్రదేశము: పురుషోత్తమరావుగారి భోజనముల పందిరి.)

పురు :- ఇప్పుడు రెండు గంటలైనది. ఇంతవర కొక్కరునూ రాలేదు. వంటలు చల్లారిపోవుచున్నవి. వంటవారు కస్సుమనుచున్నారు.

సీ. పిలిచిన బలుకక బిగఁదన్నుకొని లోన
        ముసుఁగుఁ పెట్టెడు శుద్ధ మూర్ఖుఁడొకఁడు
    ఇదె వత్తు మీ వెన్కనే మీరు పొండని
        చుట్ట ముట్టించెడు శుంఠ యొకఁడు
    ఒగిఁ దనకై వేచి యుంద్రో లేదో చూత
        మని జాగుసల్పెడి యల్పుఁడొకఁడు
    ముందువచ్చినఁ బర్వు ముక్కలౌ ననుకొని
        కడను రాఁజూచు ముష్కరుఁ డొకండు

    కుడిచి యింటను హాయిగా గూరుచుండి
    వత్తురానని చెప్పని వాజెయొకఁడు
    వచ్చి కోపించిపోవు నిర్భాగ్యు డొకఁడు
    ఆఱు వేల్వారి నిందుల - తీరు లివ్వి.

పేర :- (వగర్చుచుఁ బ్రవేశించి) బాబూ! యీ పూట నామచ్చ మాసింది. తిరిగి తిరిగి కాళ్ళు విరిగాయి. (అని కూలఁబడును.)

పురు :- ఏమన్నారు? పెండ్లి వారెవరైన వచ్చుచున్నట్లా?

పేర :- ఏం పెళ్ళివారు! ఏం రావటం? పోలీసు వారిచేత పొడిపించినందుకు బయటకువస్తే బ్రాహ్మణులు చంపేస్తారని, ఈపూట లింగరాజు గారింటిలోనే అత్తీసరు వేయించుకుని ఆరగించారు.

పురు :- కడమవారు?

పేర :- ఇదిగో వస్తున్నా. లింగరాజుగారి మొదటిభార్య మేనమామ బావమరిది తోడల్లుడు తమ్ముడట, ఆయనకీ పూట యిడ్డెన్లలో అల్లం ముక్కలు తక్కువైనాయట, అందుకోసం అలిగి కూర్చున్నాడు. పెళ్ళికొడుకు జనక సంబంధము బాపతు పినతండ్రిగారి సవతితల్లి తమ్ముడు బావమరిదికి వేలువిడిచిన మేనమామ కొడుకట. ఆయనకు రాత్రి చిన్న పీట వేశారట. అందుకోసం భీష్మించి కూర్చున్నాడు. వియ్యపురాలిగారి అన్న పిన్నత్తగారి ఆడపడుచు తోడికోడలు సవతితల్లి తమ్ముడు మేనమామగారి మేనత్త కొడుకు మేష్టరుగారితో వచ్చిన స్నేహితుఁడు గారఁట. ఆయన్ను రాత్రి మీ రందరితోపాటాదరించ లేదట, అందుకోసం రైలుకు పోతానని రంకెలు వేస్తున్నాడు. స్టూడెంట్లకు రాత్రి బంగాళాదుంపల కూరా, పకోడీల పులుసూ చేయించారు కారట, అందుకోసం వారీపూట వెళ్ళడం మానివేదామా అని ఆలోచిస్తున్నారు. వారంతా రానిది మే మెలా వస్తామని కడంవాళ్ళు కాళ్ళు చాచుకొని కూర్చున్నారు. ఇక తమరు వెళ్ళి తంటాలు పడవలసినదే కాని నావల్లకాదు.

పురు :- ఊరివారు?

పేర :- వూరివారు మామూలు పాటే "యిదుగో వస్తున్నాము పదండి."

పురు :- రామమూర్తిగారు రాలేదేమీ?

పేర :- పట్టుబట్ట మరచెంబూ తేవడానికి బ్రాహ్మడు దొరకలేదట, బ్రాహ్మణ్ణి వెతికించడానికి కూలిమనిషి కోసం బయల్దేరారు.

పురు :- చైనులుగారో?

పేర :- నిన్న తలవెంట్రుకలున్న పూర్వసువాసినీ ఎవరో వంటశాల వైపునకు వచ్చినదంట, పాప మందుకోసం ప్రాయశ్చిత్తం చేయించుకుంటున్నారు. ఈ పూట శాక పాకాలేమిటని అడిగితే, పనసకాయ కూరా, పులిహోరా, బొబ్బట్లు, బూంది మిఠాయి అని చెప్పినాను. అయితే, ఐదునిముషాలలో వస్తాను పద మన్నారు.

పురు :- అచ్యుతరామయ్యగారో?

పేర :- ఈ మధ్య బ్రహ్మసమాజిగా డెవరో పై అధికారిగా వస్తే ఆయనకోసం యజ్ఞోపవీతాలు తీసిపారవేశారట. నిన్న చొక్కాతో వస్తే నలుగురూ నవ్వారట. సాయంకాలానికి జంధ్యము సంపాయించుకొని వస్తానన్నారు.

భ్రమ :- (కోపముతో ప్రవేశించి) పేరయ్యగారూ! ఏరి ఏరి చివర కెంతచక్కని సంబంధము సంపాదించినారండి! వారి లాంచనములు వారు పుంజలు తెంపి పుచ్చుకొనుచున్నారు! మన కీయవలసి వచ్చినప్పుడు "మా కానవాయిత లే" దనుచుఁన్నారు. మన మిచ్చిన కట్నమునుబట్టి మంగళ హారతిలో మన కైదు నూటపదాఱులు రావలెను గదా? వారు వరహాకంటె వేయరట!

పురు :- ఈ మాట చెప్పుటకేనా నీ విపుడు వచ్చినది?

భ్రమ :- ఇది కాదు. ఈపూట వియ్యపురాలి పినతల్లి కూతురు తోడికోడలి యక్క యాఁడబిడ్డ సవతి మొగమున నద్దిన మొహిరీ మోటుగా నున్నదఁట. అందులకై యామె యలిగినదఁట. వియ్యపురాలు విచారించుచుఁ గూర్చున్నదఁట. అమ్మలక్క లందఱుఁ జుట్టునుమూఁగి యామెకుఁ బురెక్కించుచున్నారఁట.

పురు :- సరే వెళ్ళికాళ్లమీదఁబడి కటాక్షింపుమని వేడుదము పద! పేరయ్యగారూ! నేను వచ్చువరకును మీరిచ్చట నుండుఁడు. (అని భార్యతోఁ బరిక్రమించి, ఆకసమువంకఁ జేతులు జోడించి)

గీ. ఆఁడుబిడ్డ పెండ్లి అతి లోభితోఁడఁ జు
   ట్టఱిక మెముకలెల్ల గొరుకు లౌక్య
   జాతి కింట విందు సర్వేశ్వరా? పగ
   వారికి న్విధింప వలదు, వలదు.

(తెరపడును.)

ఇది సప్తమాంకము.


★ ★ ★