వరవిక్రయము/ప్రథమాంకము
వరవిక్రయము
ప్రధమాంకము
ప్రదేశము: పురుషోత్తమరావుగారి లోపలి చావడి.
ప్రవేశము: పంటెను నూలు చుట్టుచు భ్రమరాంబ,
(చరకాగానముతో నూలు వడకుచు కాళింది, కమల.)
కాళింది, కమల:-(మోహనరాగము - ఆది తాళము.)
చరకా ప్రభావం బెవ్వరి కెరుక! జగతిలోన మనచరకా॥
సిరులతోడఁ దులఁదూగుచున్న యల-
సీమజాతి చూచుచున్న దేమఱక.చరకా॥
చ. సాలున కిరువదికోట్ల రూప్యములు - సంపాదించెడు వారికె గాక
మేలి చేతిపనులు మాపుకొని - మేటి బానిసలమైన వెనుక,చరకా॥
పాటవమగు సామ్రాజ్యముఁ గూర్చున్ - పరిమితి లేని ధనంబును
జేర్చున్ కాటక రాకాసిని బరిమార్చున్ సాటిలేని యొక జాతి నొనర్చెన్. చర.
కాళింది:- అమ్మా! అదేమే - చేతిలోని నూలు చేతిలోనే యున్నది!
భ్రమ:-ఈ పూఁట నా దృష్టి యీపని మీఁద లేదే! మీ నాయనగారు మిల్లెగరిటెఁడు కాఫీనీళ్లు గొంతులోఁబోసికొని, ప్రొద్దునబోయిన పోక - యింతవఱ కింటికి రాలేదు! పండ్రెండు కొట్టి పావుగంటయైనది! ఎక్కడికి వెళ్లినారో యేమి పనిమీఁద నున్నారో తెలియదు!
కమ:- నాయనగారి కిప్పుడింకేమి పని యున్నది? - అహర్నిశలు అల్లుళ్ళను వెదకుటక్రింద సరిపడుచున్నవి.
భ్రమ:-అమ్మా! యేమి చేయుమనెదవు? ఆఁడుపిల్లలఁగన్న వారి యవస్థ యిప్పు డీ స్థితికి వచ్చినది!
గీ.కన్య నొక్కరి కొసఁగి స-ద్గతులు గాంతు
మనుచు సంతోషపడు కాల - మంతరించి,
కట్నములు పోయఁ జాలక - కన్య నేల
కంటిమా యని వ్యథపడు - కాల మొదవె!
కమ:-అట్లే కాని ఆఁడుబిడ్డల తల్లి వ్యథకు మాత్రము అర్థము లేదమ్మా ఏమందువా?
గీ. కార్యమగుదాఁక నయ్యయో! - కాకపోయె
ననుచుఁ దపియించు రేపవ - లాత్మలోన;
కార్యమగునంత బిడ్డ నెక్కరిణి విడిచి
యుండనోపుదు నని దిగు-లొందు మదిని.
కాళింది:- హుష్! ఊరకుండుము! అదిగో చెప్పుల చప్పుడు - నాయనగారు వచ్చుచున్నారు.
పురు:- (ఆయాసముతోఁ బ్రవేశించి) ఔరా! యేమి విపరీతకాల మాసన్నమైనది!
మ. చెడెధర్మంబు నశించెనీతి! హరియించెం బూర్వమర్యాద! లం
గడిఁ గూరాకు విధాన, వేలమునఁ జొక్కా టోపీ పాగాల కై
వడి సంతం బశువట్లు పెండ్లికొడుకున్ వ్యాపార మార్గంబునం
బడయంగావలె ద్రవ్యముం గురిసి దైవంబైననేఁ డిమ్మహిన్.
యింతకన్న ఘోర మింకేమున్నది?
మ. పనిలేదంట కులంబుతోఁ, బడుచు రూపజ్ఞాన సంపత్తితోఁ
బని లేదంట ప్రతిష్ఠతోఁ బరువుతో బంధుప్రమేయంబుతోఁ
గనకంబున్, మృదులాంబరంబులును శుల్కంభ న్సమర్పించి, లాం
ఛనముల్ దండిగ ముట్టఁజెప్పుటె యవశ్యంబంట సంబంధికిన్!
(అని యనుకొనుచు ముందునకు నడుచును.)
భ్రమ:- (లేచి) ఇదేమి నేఁ డింత సే పున్నారు! భోజనమునకుఁ బ్రొద్దు పోలేదా?
పురు:- వెఱ్ఱిదానా! యెక్కడి భోజనము! - ఎక్కడి లోకము?
సీ. కంటిలోఁ బడు మశకంబు చందంబున
నరములపై లేచు కురుపు పోల్కి
తద్దయుఁ గదిలిన దంతంబు చాట్పున
మారువాడీ యప్పు మాదిరిగను
పలుసందులం జిక్కు పడిన పీచు విధాన
బెట్ట చెప్పులలోని బెడ్డ పగిది
కుత్తుకం బడు నాకు కుట్టు పుల్లం బలె
పుట్టంబులఁ జొచ్చిన పూతిక గతి
ప్రతినిమేషము బిడ్డల పరిణయంపుఁ
జింత వేధించునపు డన్య చింత యేడ!
యీడువచ్చిన కన్నియ లింటఁ గలుగు
తండ్రి దురవస్థ తెలియును దైవమునకే!
భ్రమ:- ఇంతకు నిప్పుడు చేసికొనివచ్చిన పని యేమిటి?
పురు:-కాళ్ళరుగునట్లు కాలేజియంతయఁ గలయఁదిరుగుటకంటెఁ జేసిన పని చిన్న మెత్తు లేదు!
భ్రమ:- కాలేజి యంతటిలోఁ బెండ్లి గావలసిన పిల్ల కాయ లెవ్వరును గానుపింపనే లేదా?
పురు:- కానిపింపకేమి - కావలసినంతమంది యున్నారు. కాని యేమి లాభము - గవ్వకుఁ గొఱగానివాఁడు గూడ కాసుల వెలలోనున్నాడు! ఒక్కటే లెక్క - స్కూలు ఫయినలు వానికి రెండువేలు - ఇంటరు వానికి మూడు- బియ్యే వానికి నాలుగు! ఆస్తి యేమయిన నున్నచో నంతకు రెట్టింపు! ఈ విధముగా రైలు తరగతులకు వలె రేట్లేర్పడియున్నవి! ఆ పయిని -
సీ. నీటైన యింగ్లీషు మోటారు సైకిలు
కొనిపెట్టవలెనను కూళ యొకఁడు
రిష్టువాచియు, గోల్డురింగును, బూట్సును
సూట్లుఁ గావలెనను శుంఠ యొకఁడు
బియ్యేబియల్ వఱకయ్యెడి కర్చు భ
రింపవలె నను దరిద్రుఁ డొకఁడు
భార్యతోడను జెన్నపట్టణంబున నుంచి
చదివింపవలె నను చవట యొకఁడు
సీమచదువు చాల సింపిలు నన్నట
కంపవలయు ననెడి యజ్ఞుఁ డొకఁడు
ఇట్లు కొసరుక్రింద నిష్టార్థములు వరుల్
దెలుపుచున్న వారు తెల్లముగను!
భ్రమ:- వారి వారి వర్తనాదికము లెట్టివి?
పురు:- ఆ సంగతి నీ వడగనక్కఱయు లేదు - నేను చెప్పనక్కఱయు లేదు!
సీ. పంచాద్రి క్రాపింగు ప్రక్క పాపిడి జూలు
లేనివాఁడు ధరిత్రి లేనిఁవాడు
కాఫీహోటళ్ళును, ఖాతాలు, బిల్లులు
లేనివాఁడు ధరిత్రి లేనిఁవాడు
సిగరెట్లు, బీడీలు, చెక్కిటి ఖిల్లీలు
లేనివాఁడు ధరిత్రి లేనిఁవాడు
చలువ యద్దములు, సైకిలుకట్టు పెడగోచి
లేనివాఁడు ధరిత్రి - లేనిఁవాడు
తనదు తలమించినట్టి వృధావ్యయంబు
లేనివాఁడు ధరిత్రిలో లేనిఁవాడు
ఇట్టులున్నారు విద్యార్థు లిప్పు డక్క
డక్క డొకరిద్ద రెవ్వరో - దక్క సుదతి!
భ్రమ:- వారి తలిదండ్రు లీపాటికి వారిచేతచదువులకు స్వస్తి యేల చెప్పింపరో!
పురు:- వెఱ్ఱిదానా! ప్రస్తుతము చాలమంది బాలురను పాఠశాలల కంపుట విరివిగా కట్నములు లాగుటఁకుఁగాని విద్యకొఱకుఁ గాదు. అందువలన మనువు కుదిరిన మరునాడు కాని మానిపింపఁ దలంపరు
భ్రమ:- అట్లయిన నా చూపుడు గుఱ్ఱములతో మన కవసరములేదు. గానీ మీతోపాటు సంఘసంస్కరణముకొఱకు సన్నద్ధులైన వారెందరో కలరు గదా - వారిలో నెవ్వరికిని వయస్సు వచ్చిన పిల్లకాయలు లేరా?
పురు:- లేకేమీ ఉన్నారు. ఉండి యేమి లాభము? ఉపన్యాస వేదికపై నుక్కిరి బిక్కిరి చేసుకొనుటయే కాని - పని వచ్చినప్పుడు పట్టుదల సున్న! బాల్య వివాహములనఁ బటబట పండ్లుకొఱకు బాపిరాజుగా రేమి చేసినారో విన్నావా?- అభము శుభము నెఱుంగని యాఱేండ్ల పిల్లను, నలుబది యేండ్లు గడచిన నాల్గవ పెండ్లి వానికి ముడిపెట్టి - అదే మన - అత్తగారి పట్టన్నారు! స్త్రీ పునర్వివాహముల కొఱకుఁ జిందులు తొక్కిన శివయ్యగారు బంగారు బొమ్మవంటి పదునారేండ్ల చెల్లెలికి భర్త చావఁగానే, వంటలక్కను మానిపించి, వంట తపేలా చేతికిచ్చి - అదేమన, మా యమ్మ చావనిమ్మన్నారు. శవవాహనమును గూర్చి శంఖములు పూరించు శరభయ్యగారు - ప్రక్క యింటి యిల్లాలు భర్త చచ్చి, శవవాహకులకు డబ్బిచ్చు శక్తి లేక దేవుడాఁ గోడా యని దేవులాడుచుండ వీధి తలుపునకు గొండ్లెము వైచి, విత్తెడు నై వేద్యముపట్టి, పెరటి త్రోవన పేకాటకు జక్కబోయి - అదేమన ఆమె వచ్చి అడుగలేదన్నారు! విన్నావా? వీరేకాదు- ఈ యూరి సంఘ సంస్కర్త లందఱు నిదే మాదిరి!
భ్రమ:- అయిన నొకసారి యాలాపించి చూడకపోయినారా?
పుర:- ఆహా! ఆయాశ కూడ దీర్చుకొనియే వచ్చినాను ఎవరితోఁ బ్రస్తావించిన నొక్కటియే పల్లవి! నా కిష్టమే కాని మా వాళ్లు పడనివ్వరండి" యను మాటతప్ప మాఱుమాట లేదు!
భ్రమ:- వారన్నదియు వాస్తవమే. కట్నము లేదన్న నాఁడుది కంఠమున కురిపెట్టుకొను దినములు వచ్చి - మాట దక్కుట కవకాశము లేనప్పుడు, మాబాగని తలయూఁప వలసినవారె కాని - మగవారు మాత్రమేమి చేయఁగలరు!
పురు:- అదేమన్నమాట - ఆఁడుదానిమాట కింత యడుగుదాఁటలేని యధములు దేశారాధన మేమి చేయఁగలరు?
సీ. చదువులు మాని స్వేచ్ఛగ దేశభటకు లై
నట్టివారికి లేరె యాడుఁవారు
రాచఠీవుల నెట్టి రాట్నముల్ చేఁపట్టి
నట్టివారికి లేరె యాడుఁవారు
వృత్తులు రోసి, సంపత్తు లర్పణచేసి
నట్టివారికి లేరె యాడుఁవారు
భోగముల్ వీడి, కారాగారముల మాడి
నట్టివారికి లేరె యాడుఁవారు
కొంద ఱీ రీతి పందలై? గోడుమాలి
మగదనము చంపుకొని, తమ మగువల కెదు
రాడ నేరక వారలేమనిన శిరము
లూఁచుచుం గుక్కలైపడి యుంద్రుగాని!
భ్రమ:- చివరకేమి సిద్ధాంతపఱచినారు?
పురు:- అదే పాలుపోవుట లేదు. దారిలో దై వికముగా పెండ్లిండ్ల పేరయ్య యెదురుపడ - మా యింటి కొకసారి రమ్మని మఱి మఱి చెప్పిమాత్రం వచ్చినాను.
భ్రమ:- పెండ్లిండ్ల పేరయ్య యెవరు?
పురు:- ఎవరా? పెండ్లిండ్ల పేరయ్య యనియు, వివాహాల వీరయ్య యనియు నీ యూరిలో నిరువురు బ్రాహ్మణులు. ఈ చుట్టుపట్ల నే వివాహము జరిగినను వీరి చేతులపై జరుగవలెను.
భ్రమ:- సరిసరి తెలిసినది, చక్కని పని చేసినారు. ఆయనతో నాలోచించి, అతిశీఘ్రముగాఁగార్యములగు సాధనము చూడుఁడు. పెద్దమ్మాయికిఁ బదుమూఁడవ యేఁడు కూడ వెళ్లవచ్చినది. చిన్నమ్మాయి దానికన్న నొక యేఁడాది మాత్రమే చిన్నది. కట్నముల పట్టుదలచేత నిప్పటికే కాలహరణమైనది. ఈ మాఘములో నిరువురకును ముడి పడకున్నచో ముప్పు వాటిల్లకమానదు. ఏ యెండ కాగొడుగు పట్టకతప్పదని నే నెంత మొత్తుకున్నను వినిపించుకొన్నారు కారు. ఈపాటిమార్పు మీమనస్సున కిదివరకుఁగలిగినచో అల్లురతో నీపాటికి హాయిగా నుండెడివారము!
పురు:- వెర్రిదానా! అల్లురనెదవేమి? అల్లురుకారు - అధికార్లు! కావుననే - ఆఁడుబిడ్డలం గన్న యపరాధము క్రింద - సాగదీసి సంచుల కొలది జరిమానాలు వసూలు చేయుచున్నారు. కాకున్న కాళ్లు కడిగి కన్యనిచ్చువారి కీ కట్నముల దండన యెందులకు? గీ. అప్పొసంగినవాఁడును, అల్లుఁ, డద్దె
యింటియజమానుఁడును, జీతమిచ్చువాఁడు!
కులవినోదయు, పన్నులు కూర్చువాఁడు
బుస్తె కట్టని మగలె పో పూరుషులకు!
అందును, నల్లుర బాధ యనుభవించిన వారికి గాని తెలియదు!
సీ.ముడుపులు పూర్తిగా ముట్టుదాఁకను బుస్తె
ముట్టక చేతులు ముడిచికొనును
తరువాతఁబాన్పెక్కిఁదాఁచఁ బెట్టినయట్లు
జిలుగు కోరికలకు సిద్ధపడును
ఆవల గర్భాధాన మనినంతనే బిఱ్ఱ
బిగిసి లంచం బటఁబెట్టుమనును
అవిగాక పండుగు లరుదెంచినపు డెల్ల
తండ్రి తద్దినము చందాన దిగును
ఇన్నియుం బుచ్చుకొని, యెన్నఁడేని పిల్ల
నంపుమని ప్రార్థన మొనర్ప నదరిపడును;
ఆఁడపడుచుల, నల్లుర నాటకత్తి
యల నెవండేని తనియింపఁ గలఁడె వసుధ!
పెక్కు మాట లేల:
గీ. అప్పిడినవాని, నధికారి నతిశయించి
యల్లురొందించు బాధల నెల్లఁ గాంచి,
అడలి, నిజముగా హరిహరు లంతవారు
కూతులం గంటయె మానుచున్నవారు.
భ్రమ:- మరల వెనుకటి దారినబడి మనసు పాడు చేసికొనుచున్నారు. అమ్మయ్యో! ఇదిగో ఒంటి గంట! రండు స్నానమునకు రండు.
పురు:- స్నానము క్షణములో ముగించెదను. వడ్డనకానిమ్మని వంట లక్కతోఁజెప్పుము. పెద్దమ్మాయి! పేరయ్యవచ్చినచోఁగూర్చుండుమను. (అని భ్రమరాంబతో లోనికేగును.)
కాళిం:- చెల్లీ! మనవారి మాటలన్నియు వింటివి కదా - నిజంగా నీఁకేమి తోఁచుచున్నదే?
కమ:- (చివాలున లేచి) చెప్పుమనెదవా?
గీ. తండ్రులకుఁ గట్నబాధయుఁ - దల్లులకు వి
యోగ బాధయుఁ దమకు నింకొకరి యింటి
దాస్యబాధ దమకు దరిద్రంపు టాఁడు
పుట్టువే పుట్టరాదని బుద్ధి నెంతు.
కాళిం:-(లేచి కౌఁగిలించుకొని) బళి బళి! బాగుగా జెప్పితివే!
ఉ. కట్టగృహంబు లమ్ముకొని కట్నమునీయక పెండ్లికాని యీ
కట్టడి వక్రకాలమునఁ గానల మధ్యము నందు బుట్టగాఁ
బుట్టఁగఁ జెల్లుఁగాని యొక భూపతి కేమియు నాడుబిడ్డగాఁ
బుట్టగరాదు! పుట్టునెడఁ బుట్టినయప్పుడె గిట్టఁగాఁదగున్.
కమ:- అక్కా! ఒక్క సందేహము.
గీ. వెండినాణెంబె పెనిమిటి వేశ్య; కటులె
కట్నములె భార్య లిప్పటి కర్కశులకు!
వేశ్య వెలయా లనంబడె వెల గ్రహించి,
కట్నములచేత వెలమగల్ కారె వీరు?
కాళిం:- కాకేమి, కాని మనమిపుడు కావింపదగిన దేమియు లేదా?
కమ:-లేకేమీ?
చ. తనువు లశాశ్వితంబులు గదా? క్షణభంగుర జీవితార్థమై
ధన మిడి, భర్తలం బడసి దాస్య మొనర్చుటకంటె; బెండ్లియే
యనువుగ మానిపించుకొని, హాయిగ రాట్నముత్రిప్పుకొంచు యో
గినులగతి న్మెలంగిన సుఖింపమె? తీఱదె తండ్రి దీక్షయున్?
కాళిం:- సెబాసునే చెల్లీ! వయసునకుఁ జిన్నదానివైనను వరహాల కెత్తు కెత్తయిన మాట్లాడితివి! ఇదిగో.
గీ. నాదు ప్రతినంబు వినుము ప్రాణములనైన
విడిచెదంగాని, యడిగిన విత్తమిచ్చి
వరుని గొనితెచ్చినట్టి వివాహమునకు
సమ్మతింప నా రాట్నము సాక్షిగాను.
పేర:- (ప్రవేశించి) అమ్మా! పంతులుగారేంచేస్తున్నారు?
కాళిం:- మీ పేరు?
పేర:- నా పేరా? నాపేరొక విధంగా గడచి చచ్చిందా? చిన్నప్పుడు పేరడని, పేరగాడనీ అనేవారు. కాస్త ముదిరిన తర్వాత, పేరన్ననీ, పేరయ్యనీ అంటూ వచ్చేవారు. ఇప్పుడిప్పుడు పేరిశాస్త్రుర్లనీ, పేరిభొట్లనీ, పేరావధాన్లని, పేరిచైన్లనీ అంటున్నారు. ఇకముందేమంటారో ఈశ్వరునికే తెలియాలి.
కాళిం:- నాయనగారు భోజనము చేయుచున్నారు. అదిగో ఆకుర్చీపై గూరుచుండుడు.
పేర:- (కూర్చుండి) అయ్యో! నా యిల్లు బంగారము కానూ! అప్పటినుంచి యిప్పటిదాకా భోజనమేనా! బజార్లో పంతులుగారికి కనుపించిన తర్వాత, పండా కొండయ్య యింట్లో బారసాల సంభావన పుచ్చుకొని, వీసెడు వంకాయలూ, విస్తళ్ళూ కొనుక్కుని, యిద్దరితో మాట్లాడి యింటికి బోయి, స్నానంజేసి, సంధ్యావందనం చేసుకొని, జపంచేసుకొని, దేవతార్చన చేసుకొని, భోజనం చేసి, పొడుం చేసికొని, కాస్త మంచి శకునం కనపడేవరకూ గడపలో నుంచొని, అయిసర బొజ్జా అని అప్పుడు చక్కా వచ్చాను. అయితే, అమ్మా! మీరిద్దరూఁ పురుషోత్తమరావు పంతులుగారి పుత్రిక లనుకుంటాను, అంతేనా? ఆఁ! అదిగో! ఆ పోలికలే చెపుతున్నాయి! అయితే, మీ పేర్లేమమ్మా!
కాళిం:- నా పేరు కాళింది, మా చెల్లి పేరు కమల.
పేర:- ఏం చదువుకుంటున్నారు?
కమ:- ఇదివరకు ఇంగ్లీషు, తెలుగు చదివేవారము. ఇప్పుడు హిందీ, సంస్కృతము చదువుచున్నాము.
పేర:- ఓ యబ్బో! నా యిల్లు బంగారమైతే, నాలుగు భాషలే! అయితే ఆరుమోయన మేమయినా వాయిస్తారు? కమ:- (నవ్వి) హార్మోనియము కావలయును! ఆఁ వాయించగలము.
పేర:- అల్లికా, కుట్టూ - యివేమయినా చేతవునా? ఇదుగో? ఈ బ్రాహ్మడేమి, యిన్ని ప్రశ్నలు అడుగుతున్నా డనుకుంటారేమో? ఈ రోజులలో పెళ్లి కుమార్తెలకు కావలసిన లక్షణా లివ్వే. అందుకోసము అడుగుతున్నాను. అరుగో పంతులుగారు వస్తున్నారు. చిటికెడు పొడుం పీల్చుకుని సిద్ధంగా వుంటాను. (అని యట్లు చేయును.)
పురు:- (ప్రవేశించి) ఏమీ! పేరయ్యగా రెండలోనే వచ్చినారే. రవంతసేపు పండుకొని కాని రార నుకొన్నాను. (అనుచు నింకొక కుర్చీలోఁ గూరుచుండును.)
పేర:- సరిసరి యెంతమాట? తమ సెలవైనాక, తక్షణం చేతులు కట్టుకొని వచ్చి వాల్తాను గాని, నిద్రపోతానా!
పురు:- అమ్మాయిలను జూచినారు గదా? వీరికే యిపుడు వివాహములు కావలసియున్నవి. అమ్మా! మీరిఁక భోజనమునకు వెళ్ళి మీయమ్మ నొకసారి యిటు పంపుఁడు.
కాళి, కమ:- (లేచి నిష్క్రమింతురు.)
పేర:- తమ గోత్రమేమిటి?
పురు:- కౌశిక గోత్రము.
భ్రమ:- (ప్రవేశించును.)
పురు:- ఇరుగో! ఈయనయే పేరయ్యగారు. పాపము, నామాటమీఁద పడక కూడ మాని చక్కవచ్చినారు.
భ్రమ:- సంబంధము లెవ్వియైన సానుకూలపడు నన్నారా?
పేర:- అమ్మా! సంబంధాల కేమి లోటు? కో అంటే కోటి సంబంధాలు! అయితే సరా, వేలు పెట్టి చూపడానికి వెల్తిలేని సంబంధం సందర్భపడాలి. ఏం బాబూ! ఏమంటారు?
పురు:- అంతేకాని, అసలు సంగతి మీతోఁ జెప్పలేదు. నేను వరశుల్కము దూష్యమనే వాదములోని వాఁడను. ఈ దురాచారము మానిపింపవలెనని, యిప్పటికి ఐదేండ్ల నుండి పాటుపడుచున్న వాఁడను. ఈ కార ణములచేత నీ పిల్లలకుఁ గట్నమిచ్చి పెండ్లి సేయుట కిష్టములేక ...
పేర:- తెలిసింది తెలిసింది. అక్కడి కాగి, ఒక్క మాటకు సమాధానము చెప్పండి? పదేళ్ళ నుండి పాటుపడుతున్నారు గదా? యిప్పటి కొక్కరిచేత నయినా మానిపించగలిగారా? వట్టిది బాబూ! వట్టిది! మచ్చుకైనా మానేవారుండరు. వ్రేలెడు కుర్రవాడు కనబడితే వేలకు వేలు వేలం పాడేటప్పుడు, వెఱ్రా, పిచ్చా, మానడానికి! ఇంత యెందుకూ? ఇదివఱకు కోర్టులో, ఇంత ఇన్‌కమ్‌టాక్సు యిస్తున్నామంటే ఘరానా. ఇప్పుడో - మాఅబ్బాయి కింతకట్నం యిచ్చారంటే ఘరానా! ఈలాటి స్థితిలో ఎవరు మానుతారు! వద్దు బాబూ వద్దు! ఈ పిచ్చి మాత్రం యిక విడిచిపెట్టండి. అమలాపురంలో, వెనక, అయ్యగారి అంబయ్యగారిల్లాగె కట్న మివ్వనని భీష్మించి కూర్చుండేసరికి కన్య సమర్తాడి వూరుకుంది! ఆపాటున, నలుగురూ ఆంక్షచెయ్యడం, ఆబ్రాహ్మణుడాపిల్లనో బ్రహ్మసమాజిగాడి కంట గట్టడం, ఆపిల్ల కాపరానికి వెళ్లి అయిదుగురు బిడ్డలను కనడం యిన్ని జరిగాయి!
పురు:- అట్ల యినఁ,గట్నములేని సంబంధము కన్నొడుచుకున్నను లభింపదన్న మాటయేనా?
పేర:- లక్ష యేళ్ళు తపస్సు చేసినా లభించదు. ఎవరైనా తేగలిగితే కుండనాలు పెట్టుకుందామని కుట్లు పెంచుకుంటూ వున్న నా చెవులు కుదుళ్ళలోకి తెగగోయించుకపోతాను! ఇంతెందుకు పెద్ద పెద్ద లిప్పుడు బేరాలతో పనిలేకుండా బల్ల మీద రేట్లు రాయించి, బయట తగిలిస్తున్నారు. వెంగలేటివారు వేయిన్నూటపదహార్లు, రెటూరివారు రెండువేలు, ముంజులూరివారు మూడువేలు, నందరాజువారు నాలుగువేలు, అయ్యంకివారు అయిదువేలు, చింతలూరివారి చిన్నవాడు తూగినన్ని రూపాయలు ఎవరి మట్టుకు వారీవిధంగా యేర్పాట్లు చేసుకుని కూర్చున్నారు. ముందుముందు చీట్ల మీద రేట్లువ్రాసి షాపులలో వస్తువుల కంటించినట్లు పెళ్ళికుమాళ్ళ ముఖాలకు అంటిస్తారని కూడా అనుకుంటాను!
పురు:- రామరామా! రానురాను దేశ మే స్థితిలోనికి వచ్చినది?
పేర:- అయ్యా! మీరు దీనికే ఆశ్చర్యపడుతున్నారు. కట్నాల తమాషా కమ్మవారిలో చూడాలి! వారిలో నల్ల బంగారమే కాని తెల్లరూపాయలు పనికేరావు. ఆ నల్లబంగారం కూడా యకరాల లెక్కపోయి పుట్లలెక్కలోనికి దిగింది. పదిపుట్ల భూమికి వచ్చినవాడు పనికిమాలినవాడే? ఈ మధ్యనో యీత మొద్దుకు ఇద్దరు భార్యలుండగా ఇరవైపుట్ల భూమితో ఇంకో పిల్లను కట్టబెట్టారు! నాలుగురోజుల క్రిందట నలభయ్యారేళ్ళ నలుగురి బిడ్డల నాలుగో పెళ్ళి పెళ్ళికొడుకుకు నలభై పుట్ల యీనాంభూమి, నలభై వెయ్యినూటపదహార్ల రొక్కమూ, నలభైతులాల గోపతాడు, నాలుగుతులాల చుట్లూ, నాలుగుజతల యెడ్లూ, రెండు బళ్ళూ, పదివందల గజాల పాటిమన్నూ, ముప్ఫయిబళ్ళ ముక్కిన పెంటా సమర్పిస్తూ వియ్యపరాలికి ఆరుపాడిగేదెలూ, వియ్యంకుడి కైదుబళ్ళ గోగునార యిస్తె, పుస్తె ముడేశాడు! విన్నారా?
గీ. బ్రాహ్మణులయింటఁ దొలుఁదొ ల్తఁ - బ్రభవమొంది
కోమటింటను ముద్దులు గొనుచుఁ బెరిగి,
కమ్మవారింట పెళ్ళునఁ గాఁపురంబు
సేయుచున్నది కట్నంపుఁజేడె నేఁడు.
భ్రమ:- సరి కాని సంబంధము లేమున్నదో చెప్పినారు కారు.
పేర:- అలాగైతే, సంబంధాల విషయంలో మీ యభిప్రాయము ఏమిటో సంగ్రహముగా ముందు సెలవివ్వండి. మీకు కావలసింది: చదువా? చక్కదనమా? సంపత్తా? సంప్రదాయమా? లేక చదువూ సంప్రదాయమా, సంప్రదాయమూ సంపత్తూ; సంపత్తూ, చక్కదనమూ, చక్కదనమూ చదువూ, చదువూ సంపత్తూ, ఈవిధంగా వుండవలెనా?
పురు:- నాకేమో చదువు, సంప్రదాయము వీనిపై నున్నది. దానికేమో చక్కదనము, సంపత్తు వీనిపై నున్నది. మీరు మా యుభయుల కోరికలు తీఱునట్లు చూడవలెను.
పేర:- అంటే నాలుగూ వున్నవాడు కావాలన్నమాట. కాని, నాలుగూ వున్నవాణ్ణి నేనుగాక సరిగదా నన్ను పుట్టించిన బ్రహ్మదేవుఁడు కూడా తేలేడు! ఏమంటారా? వారాలు చేసుకున్న వాజెమ్మకుగాని చదువబ్బదు; పరువొల్లని పీనాసికికాని భాగ్యం పట్టదు! ఇట్టి స్థితిలో, నాలుగూ వున్నవాణ్ని తేవడానికి నాతరమా, నాయబ్బతరమా? భ్రమ:- అట్ల యినచో, నేటి స్థితినిబట్టి, నేను గోరినవే ముఖ్యంగాఁ జూడదగినవి. ఏమనెదరు? బియ్యే ప్యాసయినవా రుద్యోగములు లేక, ప్లీడరు గుమాస్తాపనికోసము పిచ్చెత్తినట్లు తిరుగుచున్నారు! ప్లీడర్లు బోణీలేక, వీసెడు వంకాయల ఫీజునకు విలేజి కోర్టులకు సిద్ధపడుచున్నారు! చదువుల సంగతి యీ సరణిగా నున్నది. ఇఁక సంప్రదాయము సంగతి చూచినచో అయిన కుటుంబము లడుగునఁబడినవి. కాని కుటుంబములు గణనకు వచ్చినవి! ఇంత యేల! నిత్యము మనము చూచు నిర్భాగ్యులలోఁ జాలమంది సంప్రదాయ కుటుంబములలో జన్మించిన వారే! ఏమి లాభము! సంపత్తులేని కులీనుఁడు శ్మశానములోని తులసి మొక్క వంటివాఁడు! కాబట్టి ఈ దినములలో నింత కలిగిన సంబంధమే యాలోచింపఁదగును.
పేర:- అమ్మా! మీ మాటలు నాకు అరటి పండొలిచి చేతిలో పెట్టినట్లున్నాయి. కాని కలిగినవారి కోసం చూస్తే కట్నం కాస్త హెచ్చు కాకమానదే? నిన్నగాక మొన్న, నీళ్ళ కావిళ్ళ నీలకంఠం గాడి కొడుకుకు వెయ్యిన్నూటపదహార్లు రొక్కం, వెండి కంచం, వెండి చెంబులు, బంగారం భరువు, పట్టు తాబితా, రిస్టువాచీ, సిగరెట్ల కేసూ ఇంకా ఏమిటో వాటిపేర్లు నాకు తిన్నగా రావు. బ్యాట్టట, సెల్ఫు షేవింగు రేజరట, ప్యాకెట్టు టాయిలెట్టు బాక్సట, వ్యాసలైను సీసా అట; వల్లకాడట, యిన్నిస్తే పుస్తె ముడేశాడు. గొప్పవారిమాట చెప్పవలసిం దేముంది?
భ్రమ: -సరే కానిండు, సమయమును బట్టి నడువక తప్పునా?
పేర:- అయితే యింకేమీ! ఆపాటి ధైర్యమిచ్చారంటే కొండమీని కోతిని తేగలను. ఇదుగో ఇప్పుడు చెపుతాను వినండి. మంత్రిప్రగడ మాధవరావుగారి పిల్లవాడికి మాన్యాలమీద రెండువేలు వస్తాయి. మాటాడమంటారా?
భ్రమ:- ఆ పిల్ల వానిది అడ్డతలండీ!
పేర:- అయితే పోనివ్వండి. పచ్చమట్ట బాపిరాజుగారి పిల్లవాడికి పన్నెండు వందలు వస్తాయి. ప్రేమరీ పేసయ్యాడు. కుదర్చనా?
భ్రమ:-రంగు. పేర:- రంగుకేమీ రాజా రంగు. అంత యెరుపూ కాదు. అంత నలుపూకాదు, చక్కని చామనచాయ.
భ్రమ:- చామనచాయ యిప్పటివారికి సరిపడుట లేదండి.
పేర:- అలాగైతే నాదెళ్ళవారి పిల్ల వాడు మీ నాకాని కాగుతాడు. పచ్చిగా పనసపండు. నలుగు రన్నదమ్ములు. నలుగురకూ నాలుగైదువందలు రెండువేలు వస్తాయి.
భ్రమ:- అబ్బే! ఐదువంద లీదినములలో నొక యాదాయమా?
పేర:- ఐతే, ముంజులూరి ముత్తయ్యగారి దత్తపుత్రుడికి మూడువేలు వస్తాయి. ముఖం చంద్రబింబాన్ని మించి వుంటుంది.
భ్రమ:- అవునుగాని అతఁడు మా పిల్ల కంటె ఆరంగుళాలు పొట్టి?
పురు:- ఓసి, నీ యెంచుబడి యేట గలియా! ఈ విధముగా నెంచుటకు మొదలు పెట్టినచో లోపము లేనివాడు లోకములో నుండునా?
పేర:- బాబూ! యింకా యేం చూశారు! ఇతర్ల తో పోల్చిచూస్తే యీ యమ్మ చాలా మెరుగు. ఒక్కొక్క ఇల్లాలి సంగతి చూస్తే వొళ్లు మండిపోతుంది! సర్వవిధాలా నచ్చిన సంబంధమేమైనా వచ్చి యడిగినప్పుడు వంకలు పెట్టడం, మించిపోయాక మిడకడం!
భ్రమ:- అయ్యా! ఆఁడుపిల్ల లకుఁ గావలసిన హంగులు మగవారి కేమి తెలియును? ఆఁడుబిడ్డ పెండ్లి యన, మగవారికి అప్పుదీర్చుకొనుటఁ యని యభిప్రాయము!
పేర:- అవునమ్మా! అవును అవశ్యం ఆలోచించవలసిందే కాని మీ మాటనుబట్టి, మీ మనసులో ఏదో సంబంధం తగిలే వున్నట్టు తట్టుతోంది. అట్టే మమ్మల్ని చంపక, అదేమో చెప్పితిరా బ్రతుకుతాం.
భ్రమ:- (నవ్వి) చెప్పమనెదరా? సింగరాజు లింగరాజుగారి దత్తపుత్రుడు, నా బుద్ధికి రవంత నచ్చినాఁడు.
పురు:- ఆ పిల్లవాఁడాలోచింపఁ దగినవాఁడే. స్కూలు ఫయినలు చదువుతున్నాఁడు, చూపరి, నడతగూడ నాణెమయినదె యని విన్నాను. కాని, రెండు సందేహము లున్నవి. మొదటిది యేఁబదియవ వడిలో మూఁడవపెండ్లి చేసికొన్న మూఢునితో సంబంధము చేయనాయని. రెండ వదిపిల్లవానికిఁ పదునారేండ్లకు బయినుండవు. వరహీనమగునేమోయని.
పేర:- మీ రెండుసందేహాలూ మినహాయించ తగ్గవే, ఏమంటారా? దీపం పెట్టే దిక్కు లేనప్పుడు ఏ గడ్డీ కరవక యేం చేస్తారు? ఇక వరహీనం మాటా? ఆ పిల్లవాడికీ, మన పెద్దమ్మాయికి ఒకటి కాదు రెండా కాదు మూడేళ్ళు తేడా! ఇంకా వరహీనమేమిటి? కోమట్లలో యిప్పుడు కొంచెం పెద్దపిల్లలను కూడా చేస్తున్నారు. అంతగా చాదస్తులెవరైనావుంటే అబ్బాయి కధికమాసాలు చేర్చీ, అమ్మాయికి తగ్గించి సరిపుచ్చుకొంటున్నారు. అందుకూ వప్పరనితోస్తే జాతకాలు ఫిరాయిస్తున్నారు. ఇన్నెందుకూ?
గీ. వయసుతోడనే బనిలేదు వావితోడ
నంతకన్నను బనికల్గ -దరయ నొల్ల
రింటి పేరును: గోత్ర, మింకేదియుఁ గూడ;
ఆస్తియొక్కటియే యిపు డన్నిటికిని.
భ్రమ:- అన్నట్లు మఱచినాను వారికిని నాకు మూడేండ్లే తేడా!
పేర:- అవునుగదా? యింకేమీ?
పురు:- సరే యిక నా సందేహములమాట విడిచిపెట్టి, ఆ సంబంధము పెద్దమ్మాయి కాలోచింపుఁడు.
పేర:- ఆలోచించడాని కభ్యంతర మేమియులేదు. కాని లింగరాజుగారు మాత్రం లిక్కికి లక్కనే మనిషి. కట్నం దగ్గర కంఠానికి ముడి వుండదు. సరే, సర్వవిధాలా ప్రయత్నంచేద్దాము. అయితే అమ్మాయి లిద్దరికీ బాలతొడుగు లేపాటి వుంటాయి?
పురు:- వేయేసి రూపాయలకు వెలితియుండదు. అవికాక వారి బారసాలలనాఁడు వారి మాతామహుఁడు వారికి వ్రాసి యిచ్చిన పదేసి యెకరముల భూములవల్లను నైదేసి వందలు వచ్చుచున్నవి.
పేర:- అలాగైతే యిఁక నంత భయపడవలసిన పనిలేదు. అమ్మగారన్నట్లు పెద్దమ్మాయి సంగతి ముందు తేల్చుకుని ఆ వెనుక చిన్నమ్మాయి సంగతి ఆలోచింతాము. (అని లేచును.)
పురు:- మరల మీదర్శన మెప్పుడు? పేర:- రేపు దుర్ముహూర్తం పోగానే లింగరాజుగారి ఇంటికి వెళ్ళి, సంగతి సందర్భాలు చూచుకుని, సాయంకాలంలోగా వస్తాను.
భ్రమ:- ఏమో, యేమి చేసికొని వచ్చెదరో పిల్లల వివాహము భారము మీది. మిమ్ములను సంతోషపెట్టు భారము మాది!
పేర:- అమ్మా! ఆమాట మీరు వేరే సెలవివ్వాలా! కార్యమయిందాకా కన్ను మూస్తే ఇది గాయిత్రి గాదు! శలవు!
(తెరపడును.)
ఇది ప్రథమాంకము.
★ ★ ★