వరవిక్రయము/నవమాంకము
నవమాంకము
(ప్రదేశము: న్యాయస్థానము.)
(న్యాయపీఠమున గూర్చుండి, అభియోగ పత్రము చదువుకొనుచు న్యాయాధిపతి, యెదుటఁ గుర్చీలో వెంగళప్ప, అతని వెనుక నిలబడి లింగరాజుగారు, బసవరాజు, రెండవవైపునఁ పురుషోత్తమరావుగారు, కమల.)
పురు :- (తనలో) నిజమే, కోర్టెక్కుటకంటెఁ గొఱత యెక్కుటే మేలు.
చ. మనుజుని ముంగట న్మొరడు మాదిరిగా మనుజుఁడు నిల్చి వే
ర్మనుజుఁడు బల్ల గ్రుద్దుచును మాటికి మాటికి నేమి ప్రశ్న వే
సినఁ దలయొగ్గీ యుత్తరము చెప్పుచు, నూర్పులు పుచ్చుచుంట కం
టెను నవమాన మింకొకటి నిక్కముగా మహిలోన నున్నదే.
సీ. ధనలోభమో, పట్టుదలయో, దురాశయో
వేధింప నిలువెల్ల వెఱ్రి యెత్తి
కూటసాక్ష్యములను గూరిచికొని యిండ్లు
వాకిళ్లు ముదుసళ్ళ వశ మొనర్చి
బ్రోకర్లుసేయు దుర్బోధలు మది నమ్మి
ప్లీడర్లు కోరిన ఫీజు లిచ్చి
పూఁటకూళ్ళిండ్ల నూడ్పులు నాకి, వారి పం
చల దాటియాకు; జాపలఁ బరుండి
కోర్టే దేవాలయంబుగా కోర్టు నెదుటి
మఱ్రులుం గంగరావులె మంటపాది
కములుగా, జడ్జీ దైవంబుగా నిరంత
రంబుఁ దిరుగుదురేమి కర్మంబొ ప్రజలు.
ఇంతకును
సీ. కరణము తొలి మలి కట్నాల క్రిందను
కూటసాక్షుల గొఱుగుడుల క్రింద
వెంట దోడ్తెచ్చు నేజెంటు ఖర్చుల క్రింద
ప్లీడర్లు లాగెడు ఫీజుక్రింద
చల్లఁగాఁ బెరిగిన స్టాంపుడ్యూటీ క్రింద
తెమలని సాక్షి బత్తెముల క్రింద
కోర్టు గుమాస్తాల కొల్పు ముడ్పుల క్రింద
కడలేనియట్టి నకళ్ళ క్రింద
రైళ్ళక్రిందను, కాఫీ హొటేళ్ళ క్రింద
కొంపలుం గోడులును మాపుకొనుచు, నోడు
వాఁడు బయటను, గెలిచినవాఁడు లోన
నేడ్చుటెగాక, లాభ మింతేని గలదె.
బస :- (తనలో) పెంపుడు తండ్రి చివరకు నన్నెంత పేలవపఱచెను?
గీ. పెండ్లి కాఁగానె చదువు మాన్పించెఁ ప్రజలు
కేరడము సేయఁ గోర్టు కెక్కించె నేఁడు
ధనమె బ్రతుకైన పెంపుడు తండ్రి కంటె
సవతి తల్లియె మేలు నిశ్చయముగాను!
న్యాయా :- (కాగితములు బల్లపై నుంచి) వెంగళప్పగారూ! యీ వ్యవహార మింతవఱకు రావలసినది కాదండీ! ఉభయులకును రాజీ చేయుట యుక్తమని నా యభిప్రాయము.
వెంగ :- (లేచి) కోర్టువారలా సెలవిస్తే కొంప మునిగిపోతుంది. మాక్లయింటు వంటి మర్యాదస్తుడు మద్రాసులో కూడా లేడండి. ఆయన పెళ్ళికి అయిదువేల అయిదువందల కరుకులు కట్నము యిచ్చారు!
లింగ :- (వెనుకనుండి మెల్లఁగా) అయ్యయ్యో! ఆ సంగతి మన మొప్పుకొనఁగూడ దయ్యా బాబూ! ఆయన తండ్రికని దిద్దుకోండి!
వెంగ :- అన్నట్టు పొరపాటు మనవిచేసాను. ఆయనకుగాదు కట్నం ఆయన కొడుక్కు. కాదు, కాదు తండ్రికి! ఆయన తండ్రి లక్షాధికారండి. మూడు పెండ్లిండ్లయినాయి. ముప్ఫయి వేలు కట్నాలు వచ్చాయి! మునిసిపల్ మెంబరీకోసం మూడుసార్లు స్టాండైనాఁడు.
న్యాయా :- (నవ్వి) ఆయన చరిత్ర ఇప్పుడవసరము లేదు కాని రాజీ మాట రవంత ఆలోచింపుడు!
వెంగ :- ఈ విషయంలో యీశ్వరుఁడు చెప్పినా మాక్లయింటు వినడండి. దావా మా పక్షం కావడానికిపట్టెడు రికార్డుంది. బోలెడు సాక్ష్యము వుంది. అలహాబాదు ట్వంటీ త్రీలో అత్తవారు పెట్టిన నగలును హరించకూడదని అయిదు పేజీలు వ్రాసాడు! కలకట్టా ట్వంటీ ఫోర్‌లో పిల్లను కాపరానికి పంపి తీరాలని వుంది!
న్యాయా :- మీ తీర్పులన్నియుఁ దీరిక సమయమునఁ జూచెదను! ఏమి లింగరాజుగారూ! మీ అబ్బాయిని మీ రొప్పింపలేరా?
లింగ :- చిత్తము చిత్తము. కోర్టువారి చిత్తమట్లున్నప్పుడు కోటిరూపాయలు పోయినఁ పోవుగాక! మా నగలు మాకిచ్చి, మా ఖర్చులు మాకిచ్చి, వారికిని మాకును సంబంధము లేకుండఁ జేసికొనుటకు వారు ఇష్టపడిన యెడల, మా అబ్బాయిని నే నొప్పించెద.
న్యాయా :- (పక్కున నవ్వి) ఏమీ, కోడలేల పనికి రాదు!
లింగ :- ఆ పిల్ల మా యింటఁ నణకువతోఁ కాఁపురము సేయదండి.
న్యాయా :- ఏమి పురుషోత్తమరావుగారూ! అమ్మాయికి నచ్చఁజెప్పి అత్తవారి యిష్టానుసారముగ నడచుకొనునట్లు చేయలేరా?
పురు :- అయ్యా! నే నసహాయవాదిని. అందువల్ల మీ ప్రశ్నమున కుత్తర మొసంగుటకు నా కవకాశము లేదు. న్యాయా :- న్యాయాధిపతిగాఁగాక గృహస్థుడుగా నడుగుచున్నాను.
పురు :- ఇది న్యాయస్థానము కాని తమ గృహము కాదు.
న్యాయా :- అట్లయిన నీ వ్యవహారమిఁక నిరుపక్షములకు అనుకూలముగా నిర్వర్తించుట కవకాశము లేదన్న మాటయే!
వెంగ :- ఆ సంగతి నే నాదిలోనే మనవి చేశాను.
కమ :- (తనలో)
మ. మనసూ! జంకకు, ధైర్యమా! చెడకుమీ మానంబు! నీమానశో
ధనకాల బిదె, దైవమా! యిపుడె చెంతంజేరి సాయంబు స
ల్పి ననుం దేల్చు ముహూర్త మిత్తఱిని దల్లీ! భారతీ నాదు వా
క్కున నిల్వంబడు మక్కరో కదిసి నాకుం దోడుగా నుండుమీ!
న్యాయా :- అందుచేతనె మీరు వకీలును బెట్టుకొనలేదన్నమాట.
కమ :- (కొంచెము ముందునకు వచ్చి) అయ్యా! తామధిష్ఠించినది ధర్మపీఠము, తాము ధర్మదేవతకుఁ బ్రతినిధులు. తమ కాఁడు బిడ్డయున్నయెడల నాబిడ్డయె యీ బిడ్డ యనుకొని తమ సన్నిధానమున ధర్మము విన్నవించుకొనుటకు నా కనుజ్ఞ దయచేయుడు!
వెంగ :- (చివాలున లేచి) నో! నో! నో! ఆ చిన్నది మాట్లాడడము అశాస్త్రీయం. అందుకు లా యెంతమాత్రం వప్పదు. ఏదీ సివిల్ ప్రోసీజరు కోడెక్కడుంది. (అని బల్ల మీఁద వెదకును.)
న్యాయా :- ఏమీ? ఏల మాటాడఁగూడదు?
వెంగ :- ఆ పిల్లకు మైనార్టీ వెళ్ళలేదండి. మైనారిటీ వెళ్ళని వాళ్ళు మాటలాడ గూడదని బోలెడు బొంబాయి తీర్పులున్నాయి.
కమ :- అయ్యా! చట్టము వేఱు, సందర్భము వేఱు, సందర్భములను బట్టి చట్టములు మారునుగాని, చట్టములనుబట్టి సందర్భములు మాఱవు. నా తండ్రిగా రసహాయవాదులు. నాకు వకీలును బెట్టుకొనుట కవకాశము లేదు. చట్టమునందుఁ జెప్పఁబడిన యీడు రాకపోయినను స్వవిషయమును సమర్థించు కొనుటకుఁ జాలిన జ్ఞానమును సర్వేశ్వరుఁడు నాకుఁ బ్రసాదించినాఁడు. ఇట్టి స్థితిలో నామాట వినకుండుట నా కన్యాయము చేయుటకాదా?
న్యాయా :- చెప్పమ్మా, చెప్పు? నీవు చెప్పిన మాటలు రికార్డు చేయఁగూడదనవచ్చును గాని నన్ను వినఁగూడదనుటకు వీరెవరు?
కమ :- చిత్తము, చిత్తము. దావా సారాంశములు రెండు. మొదటిది నా తల్లిదండ్రులు నా నగలు హరింపఁదలఁచినారని. రెండవది అందులకై వారు నన్నుఁ గాపురమునకుఁ బంపలేదని. (నగలు మూట తీసి) ఇవిగో వారడిగిన వస్తువులు. వీనిని వారు నా వివాహ కాలమున నాకు బహూకరించినారు. బహూకరించిన వస్తువులు దిరుగఁ సంగ్రహించుటకు దాతకు హక్కు లేదు.
వెంగ :- కావలసినంత హక్కుంది. కలకత్తా తీర్పులు లక్ష చూపిస్తాను. ఏదీ నంబరు యైట్ వాల్యూము. (అని వెదుకును.)
న్యాయా :- ఆగవయ్యా నీ యల్ల లాటకాల! అమ్మాయి! రెండవ సారాంశమును గూర్చి యేమి చెప్పెదవు?
కమ :- ఇదియే తామించుక శ్రద్ధతో వినవలసిన విషయము. నా భర్త నా యింటికివచ్చి, నా యాజ్ఞానుసారము నడచుకొనవలసి యున్నదిగాని, ఆయన యింటికి నన్ను రప్పించుకొనుట కాయన కావంతయు నధికారము లేదు.
వెంగ :- కావలసినంత అధికారముంది. కలకత్తా ట్వంటీ సిక్సులో కాళ్లూ, చేతులూ కట్టి తీసుకుపోవచ్చునని కూడా వుంది.
న్యాయా :- అబ్బబ్బా! నీ వాఁగవయ్యా! ఎందుల కధికారము లేదమ్మా? కమ :- ఆయనను మేము వేలములో అయిదువేల యైదువందల రూపాయలకుఁ గొన్నాము.
న్యాయా :- (ఆశ్చర్యముతో) అదెట్లు?
కమ :- నాకు కాళింది యను నక్కగారుండెడిది. ఆమెకై మాతండ్రిగారీ సంబంధము కొఱకు యత్నించుతఱి మున్నంగివారు పోటీకి వచ్చినారు. అప్పుడు పెండ్లికొమరుని వేలము జరిగి, ఆ వేలములో అయిదువేల అయిదువందలకు మా సొత్తయినారు.
లింగ :- అయ్యా! వట్టిది వట్టిది! అట్టిదేమియు జరుగలేదు! (వెంగళప్పను చఱచి) నీ బొడ్డు పొక్క! నిజముకాదని చెప్పవేమయ్యా!
వెంగ :- (ఉలిక్కిపడి లేచి) అయ్యా! అయ్యా! అంతా అబద్ధమండి. కావలిస్తే మా క్లయింటు గంగలో దిగి ప్రమాణం చేస్తాడు.
కమ :- (రెండు కాగితములు తీసి) అయ్యా! యిదిగో యిది మొదటి అగ్రిమెంటు. ఇది సొమ్ము ముట్టినప్పటి రసీదు. (అని యిచ్చును!)
న్యాయా :- (చదివి) ఏమయ్యా! ఈ రశీదులు మీరిచ్చినవేనా?
లింగ :- (గొల్లున) కావు కావు! మహాప్రభో! కల్పించినారు.
వెంగ :- నిశ్చయముగా ఫోర్జరీ అండీ! నిలువునా ఫోర్జరీ! ఇండియన్ పీనల్ కోడ్ నాలుగువందల అరవయ్యేడో సెక్షన్ ప్రకారము ఆపిల్లమీద ప్రాసిక్యూషనుకు ఆర్డరు దయచేయించక తప్పదు.
న్యాయా :- ఐతే అమ్మాయి! అగ్రిమెంటు ప్రకారము ఆ సంబంధము మీ యక్క కేల జరుగలేదు?
కమ :- కొనితెచ్చిన వరుని బెండ్లియాడుట గౌరవహీనమని మా యక్క బావిలోఁపడి మరణించినది. ఇదిగో యీ పత్రికఁ జిత్తగించినచో దమ కీ యంశము విశదము కాగలదు. (అని పత్రిక యిచ్చును.) న్యాయా :- (చదివి) హరహరా! యెంతపని జరిగినది. ఆ కారణముచే ఆ చిన్నవానికి నిన్నుఁ జేసినారన్నమాట.
కమ :- చేయక తప్పినది కాదు. చేజిక్కిన సొమ్ము మరల చేపుటకు వారు నిరాకరించినందున ఆక్రయము నాక్రింద మార్చవలసి వచ్చింది.
లింగ :- అయ్యా! వాదము నిమిత్తము, వారుసొమ్ము ఇచ్చినట్లే నిశ్చయింపుఁడు. అయిన నది కట్నమగును గాని క్రయధన మెట్లగును?
కమ :- కట్నమునకును, క్రయధనమునకును గాసింతయు బేధము లేదు. ఉన్నదన్నను కట్నములు వివాహకాలమున నిచ్చుట గలదు. గాని, వేలము, బజానా, అగ్రిమెంటు, ముందు చెల్లించుట ఇట్టి యాచారమెచ్చటను లేదు. అందువల్ల నిది క్రయధనమగుట కాక్షేపణ మేమియు లేదు. అది యటుండనిండు! శుభలేఖలలో సర్వత్ర "వారి కుమారునకు వీరి కొమార్తెనిచ్చి" అని కదా యుండును. వీనిని జిత్తగింపుడు. (అని రెండు శుభలేఖ లిచ్చును.)
న్యాయా :- (ఒక శుభలేఖనెత్తి) "నాకొమార్తె చి॥ సౌ॥ కమలకు బ్రహ్మశ్రీ సింగరాజు లింగరాజుగారి కుమారుడు బసవరాజు నిచ్చి" (అని పఠించి, పక్కున నవ్వి) ఇది పురుషోత్తమరావుగారి శుభలేఖ. లింగరాజుగారి శుభలేఖలో నెట్లున్నదో (అని రెండవ దాని నెత్తి) నా కుమారుడు చి॥ బసవరాజును బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారి కొమార్తె చి॥ సౌ॥ కమలకు ఇచ్చి" సరే ఇకనేమి స్పష్టముగానే యున్నదే! ఏమి లింగరాజుగారూ! మీకుమారు నామె కిచ్చివేసినట్లు మీరొప్పుకొనియే యున్నారే?
లింగ :- అయ్యా! అన్యాయ మన్యాయము. మీ శుభలేఖలతో పాటు మాకుఁ గూడఁ గొన్ని యచ్చువేయించి పెట్టుఁడని బుద్ధి గడ్డితిని పురుషోత్తమరావుగారిని కోరగా ఈ ద్రోహము ఆయన చేసినారు. వెంగ :- ఇదో ఫోర్జరీ, యిందుకోసం యీయన మీద కూడా ప్రాసిక్యూషనుకు ఆర్డరు దయచేయించాలి. ఇక వూరుకోవడానికి వీల్లేదు.
కమ :- అయ్యా! ఆయననేమియు నెఱుంగరు, నాకుఁగల హక్కును బట్టియఁ న్యాయమును బట్టియు నేనే ఈ విధముగా మార్చినాను. అందులకు వారప్పుడేమియు నభ్యంతరము చెప్పి యుండలేదు. తామీ సందర్భములన్నియుఁ జక్కఁగా నాలోచించి, నాపై నాభర్తకే యధికారము గలదో, నాభర్తపై నాకే యధికారము కలదో, నిర్ణయింపుఁడు.
బస :- (తనలో) నా యవజ్ఞచేతనే యీవ్యవహార యింతవఱకు వచ్చినది. ఇంకను నేనిట్లు మొరడునై యుండఁదగునా?
చ. పరువు నశించెఁ! బండితులు బామరులు న్విని యింట నింట నా
చరితమె చెప్పుకొంచు నెకసక్కెములాడు నవస్థపట్టె! ము
ష్కరమునఁ దండ్రి కిప్పటికి గల్గకపోయె నుదార బుద్ధి! యీ
తరుణము నందు మూర్ఖుని విధంబున నుండుట నాకుఁబాడియే!
గీ. ఆమె చెప్పినదెల్ల యధార్థ మీతఁ
డాచరించినదెల్ల నా యాత్మ యెఱుఁగు
నిట్టిచో న్యాయమున కేసు గట్టువడక
యున్న దేవుఁడు నను జూచి యోర్చువాఁడె.
న్యాయా :- ఏమి వెంగళప్పగారూ! మీరేమి చెప్పెదరు?
బస :- (యింతలో ముందునకు వచ్చి) అయ్యా! యిప్పుడు మాటాడవలసినవాఁడను నేను గాని, ఆయన గాదు. ఈ దావాకు సంబంధించిన కాగితములపై నేను సంతకములు చేసినది, నా తండ్రి బలవంతముచేఁగాని, నా స్వబుద్ధిచేఁ గాదు. అందువల్ల నా దావాను నేను రద్దు చేసికొనుచున్నాను. ఆ చిన్నది చెప్పిన మాటలలో నణువంతయు నసత్యము లేదు. నా తండ్రి మాటలలో నలుసంతయు నిజములేదు. ఈ వ్యవహా రములో నా తండ్రి చేసిన దుస్తంత్రములన్నియు నిచ్చట వెల్లడించుట నా కిష్టము లేదు. పెక్కు మాటలేల?
ఉ. అమ్మెను నన్ను నా జనకుఁడాయన నన్గొనె రొక్కమిచ్చి; యీ
కొమ్మకు నేను భృత్యుఁడను, గొంకక యే పని సేయు మన్న ని
క్కముగఁ జేయువాఁడ, నిటు - కట్నములం గొనువారు రూఢిగా
నమ్మడుకాండ్రె కాక, మగలంటకు నర్హులుకారు లేశమున్.
న్యాయా :- సెబాసు నాయనా సెబాసు! చెప్పవలసిన రీతిగాఁ చెప్పితివి! కాన చెప్పినది చెప్పినట్లు చేయుట గూడ జరిగెనేని, లోకమున కొక శ్రేష్ఠమైన పాఠము నేర్పినవాఁడ వగుదువు?
బస :- అయ్యా! తమకా సందేహమేల? (అని కమల వంకకు నడచును.)
లింగ :- (ఆవేదనతో) ఆఁ, ఆఁ, ఆఁ, ఓరి నిర్భాగ్యుఁడా? నిర్భాగ్యుఁడా, నీకేమి వినాశకాలమురా యిది. అయ్యో? అయ్యో? ఇంకేమున్నదింకేమున్నది? (అని గుండె బాదుకొనును.)
బస :- (తిరిగి చూడకయే కమలను సమీపించి) ఓ సుగుణవతీ!
చ. ధనము గణించి నీ యెడల దారుణవృత్తి మెలంగియుండె మ
జ్జనకుడు, దాని నించుకయు స్వాంతమునందిడఁబోక నన్ను దా
సునిగ గ్రహించి యిష్టమగు చొప్పున నానతుఁలిమ్ము నీవు చె
ప్పిన పనిచేయు దెల్ల పుడు భృత్యుఁడనై పడియుండు నీకడన్.
కమ :- (మందహాసముతో) ఇదిగో యీ నగల మూటయు నీ కాగితముల కట్టయుఁబట్టుకొని నావెంట రండు. యిరువురమును గలిసి యీ వరవిక్రయ దురాచారమును రూపుమాపుటకై పాటుపడుదుము. (అని మూటయుఁ గట్టయు నిచ్చును.) బస :- (తీసుకొని, తలపై నిడుకొనును.)
లింగ :- ఓరి నీచుడా! చివర కెంత నైచ్యమునకు సిద్ధపడితివిరా? ఇదిగో, నా యాస్తినుండి నీకు నలుసంత ముట్టనిచ్చితినా, నా మెడలోనిది యజ్ఞోపవీతము కాదు.(అని చనుచుండగా)
(తెరపడును.)
ఇది నవమాంకము
★ ★ ★