వరవిక్రయము/చతుర్ధాంకము
చతుర్థాంకము
మొదటి రంగము
కమ :-(కాగితము చుట్టకట్టిన ఛాయాపటము పట్టుకొని ప్రవేశించి) ఎప్పుడో మేడమీఁది నుండి యేమరుపాటుగఁ జూచుటయే అని సూటిగ నెన్నడుఁ జూచియుండలేదు. అందువల్ల ముందుగానే నేను జూచి ఆ వెనుకక్కకుఁ జూపెద. (అని కట్టువిప్పి, పటమును బయిటకి దీసి, పరికించి) సెబాసు! చేసికొన తగ్గవాఁడే.
ఉ. కన్నులు చాల పెద్దయవి; కన్బొమలుం గడు దీర్చిదిద్దిన
ట్లున్నవి; సోగయై తనరు చున్నది నాసికయున్, లలాట మ
త్యున్నతమై యొసంగుఁ; గురులొత్తనియే యనవచ్చు; జాలునీ
వన్నెయు నన్నిటం దగినవాఁడె లభించెను నేఁటి కక్కకున్.
(బిగ్గరగా) అక్కా! అక్కా! ఒక్కసారి యిటు వచ్చితివా- నీకొక చక్కని తాయం చూపెద!
కాళిం :- (చటాలునఁ బ్రవేశించి) ఏమా తాయము?
కమ :- (పటమును దాఁచి) ఒకచిత్రము చూపిన నా కేమిచ్చెదవే?
కాళిం :- అబ్బా? చంపక అదేమో చెప్పవే?
కమ :- చెప్పితినిగా చిత్రమని.
కాళిం :- ఎవరి చిత్రము?
కమ :- బావది!
కాళిం :- ఏ బావది?
కమ :- ఇంకే బావ! అయిదు వేలా అయిదు వందల బావ! ఇదుగో చూడు! (అని పటముఁ జూపఁబోవును.)
కాళిం :- (తొలగి) చాలు! చాలు! చూడనక్కరలేదు? చూచినందులకుఁ గూడ సుంకమీయవలె నేమో!
కమ :- సుంక మిచ్చియైనఁ జూడఁదగిన యందమే యక్కా!
కాళిం :- అందమున కేమిలే అయిదు వేల అయిదువందల కిమ్మతు గల బొమ్మ కాపాటి యందమైన నుండకుండునా?
కమ :- అంతబెట్టుకూడదక్కా! అరకంటనైన నీ యంద మొక్కసారి చూడుము! (అని మరలఁ బటమును జూపఁబోవును.)
కాళిం :- (త్రోసివేసి తప్పించుకొని) అబ్బా! అంతకంతకు నీ యాగడ మధికమగుచున్నది సుమా! అంత యందగాఁడని తోఁచినచో హాయిగ నీవు పెండ్లి యాడుము!
కమ :- ఔనౌను! ఎక్కడ మగఁడు దొరకని యెడల నక్కమగఁడే దిక్కను సామెత యుండనే యున్నది గదా? ఇరువురము నింటఁబడితిమి, ఇచ్చిన సొమ్మునకు వడ్డీయైనఁ గిట్టించుకొందము.
కాళిం :- లేదా యిరువురము నీళ్ళబిందెలు మోసి యింటి వెచ్చమయినఁ గడుపుదుము.
కమ :- హాయి హాయి! ఆముక్క యందముగా నున్నదే!
కాళి :- సరికాని ఆ పటము నీకెట్లు వచ్చినది?
కమ :- శుభలేఖలలో వేయించుటకై మొన్న మన ఫోటోలు తీసిన నరేంద్రునిచేత నాన్నగారు తీయించినారట.
కాళి :- వ్యవహారమప్పుడే శుభలేఖల వఱకు వచ్చినదా?
కమ :- రాదా మరి? ముహూర్తమింక మూడు వారములే గదా యున్నది? అరుగో నాన్నగారు వచ్చుచున్నారు.
కాళి :- (ఒక నిట్టూర్పు విడిచి, లోపలికి జక్కంబోవును.)
కమ :- నాన్నగారు! నరేంద్రుఁడీ ఫోటో యిచ్చి వెళ్ళినాఁడు.
పురు :- (చూచి) సరే నీ యొద్ద నుంచుము. మీయమ్మ యేమి చేయుచున్నది? (అని పడక కుర్చీలోఁ గూలఁబడును.)
కమ :- ఇదిగో యిచ్చటికే వచ్చుచున్నది. (అని నిష్క్రమించును.)
భ్రమ :- అదే మట్లున్నారు? ఎక్కడికి వెళ్ళినారింత సేపయినది? పురు :- ఎక్కడికని చెప్పుదును. ఊరంతయుఁ దిరిగి వచ్చినాను.
భ్రమ :- అంత త్రిప్పుట కిప్పు డవసర మేమి వచ్చినది? కమల సంగతి ప్రస్తుతం కట్టిపెట్టఁ దలంచితిమిగా!
పురు :- అందులకుఁ గాదే, అప్పుకొఱకు. కట్నము సొమ్ము, ముందు పంపినగాని కార్యసన్నాహ మారంభింపమని లింగరాజుగారు వర్తమాన మంపినారు. అందుచేత బదులుకొఱకు బయలుదేరినాను.
భ్రమ :- యెక్కడనూ జూడలే దెక్కడిదీ పద్ధతి. కట్నమన, కళ్యాణ సమయమున నిచ్చునది కాని లంచమువలె, రహస్యముగా నింటికిఁ దీసికొనిపోయి యిచ్చునదియా?
పురు :- లింగరాజుగారి సంగతి యెరిఁగియు వెర్రిపడెదమేమి? ఐన నీ పాడుపని యందరిలో జరుగుట కంటె నిదే మేలు.
భ్రమ :- అందుల కిప్పుడయిన పని యేమి?
పురు :- అప్పు బుట్టుట యెంతకష్టమో అది తెలుసుకొనుటయైనది.
సీ. మానాభిమానముల్ మాపుకోవలయును
విసుగును గోపంబు విడువవలెను
సమయంబు గనిపెట్ట సంధింపవలయును
త్రిప్పినట్లెల్లను దిరుగవలెను
నీవె దేవుఁడవని సేవింపవలెను
ఇచ్చకంబుల మురియింపవలెను
బ్రోకరు రుసుమును బొడిగింపవలెను
దరి గుమాస్తాగానిఁ దనుపవలెను
నాల్గు రెట్లేని యాస్తి కన్పఱుపవలెను
వడ్డి యెంతన్నఁ దలయొగ్గవలెను షరతు
లేమి కోరిన శిరసా వహింపవలెను
పుట్టునెడ నప్పటికిఁగాని పుట్ట దప్పు.
భ్రమ :- ఇంతకు, మన కెచ్చటనైనఁ బుట్టినట్లా?
పురు :- పుట్టినచో నీ పురాణ మంతయు నెందులకు? ఆ పది యఎకరముల భూమిమీదను అయిదువేల కంటె నిచ్చువా రగ పడలేదు. భ్రమ :- మనకు గావలసిన దెంత?
పురు :- అయిదువేల యైదువందలు కట్నము గదా? ఆమీఁద వానికొక యైదువందలైనఁ గావలయును గదా? ఎటు జూచినా మొత్త మేడువేలైన లేకున్నఁ కార్యము జరిగి గట్టున బడలేము.
భ్రమ :- అందులకేమి యాలోచించినారు?
పురు : -అయినమట్టున కమ్మివేయుటకు నిశ్చయించుకొన్నాను. కాని యది మాత్ర మంత పయిపయి నున్నదా? అమ్మబోయిన నడవి, కొనబోయిన కొఱవి యన్నట్లు యేడువేల యైదువందలకన్న నెఱ్ఱని యేఁగాని పెట్టువా రగపడలేదు. పాపము పేరయ్యగా రీవిషయమునఁ బడుచున్న పాట్లకు మేరలేదు.
భ్రమ :- అరుగో మాటలోనే యాయనయు వచ్చినారు.
పేర :- (వగర్చుచు బ్రవేశించి) బాబూ, తమవద్ద శలవు పుచ్చుకొని ఇంటికి వెళ్ళేసరికి అదృష్టవశాత్తూ మా అల్లుడీపూట రైలులో వూడిపడ్డాడు. సందర్భవశాత్తూ ఇతనితో సంగతంతా చెప్పవలసి వచ్చినది. అతగాడు విని విని "మాఁవా; అటువంటి గృహస్థుల కీలాటి సమయములో అడ్డుపడడం కంటె కావలసిన దేమిటి? ఇంకో ఐదువందలు వేసి ఆ పొలం నా పేర వ్రాయించం" డన్నాడు. ఆపాటున బ్రతుకుజీవుడా అని ప్రాశన కూడా చెయ్యకుండా పరుగెత్తుకు చక్కావచ్చాను. ఏమి శలవు?
పురు :- సెలవున కేమున్నది? చెడి యమ్ముకొన్నను బది యెకరములకుఁ బదివేలయిన రాకపోదనుకొన్నాను. ఎక్కడను చిక్కనప్పుడేమి చేయగలము? పోనిండు, అన్యులకుఁ బోవుటకంటె, మీ యల్లున కగుట నాకధిక సమ్మతము. దస్తావేజు వ్రాయుంపుఁడు.
పేర :- దస్తావేజు వ్రాయించడమే కాదు, తక్షణం రిజిష్టరీ కూడా కావాలి. యేమో అతగాడికి మళ్ళీ యేం బుద్ధి పుట్టునో ఎవరు చెప్పగలరు? క్షణములో దేవతార్చన చేసుకొని చక్కా వస్తాను. తమరుకూడా భోజనము చేసి, దానికి సంబంధించిన కాగితాలన్నీ తీసి వుంచండి. శలవు. (అని పోవుచుఁ దనలో) అదృష్టముగా యిదీ అధమం రెండువేలైనా లాభిస్తాయి. ప్రస్తుతం అల్లుడు పేర వ్రాయించి, పదిరోజులు పోయాక ఫిరాయించుకుంటాను. [నిష్క్రమించును] పురు :- ఏమే స్నానమునకు లేవవచ్చునా?
భ్రమ :- లేవవచ్చునుగాని యీ పది ఎకరముల భూమియుఁబోయినచో నిఁక మన బ్రతుకు తెరవేమిటి?
పురు :- వెఱ్రిదానా! యెంత మాటాడితివే!
సీ. కూలి నాలియు లేక కుడువ తోవయు లేక
మలమల పస్తులు మాడువారు
ఇల్లు వాకిలి లేక యిల్లాలు లేక, యే
చెట్టు నీడనొ నివసించువారు
పయిని పాతయు లేక, పండఁ జాపయు లేక
వడవడఁ జలిలోన -వడకువారు
కాళ్ళుఁ గన్నులు లేక, కదల మెదల లేక
దేవుఁడా! యనుచు వా-పోవువారు
కలరు మనదేశమునఁ గోట్లకొలఁది నేఁడు
వారి నెల్లర నెపుడుఁ గన్నాఱఁ గనుచు
బందలంబోలె మనమికఁ బ్రతుకు టెట్టు
లనుచుఁ జింతింపవచ్చునే యజ్ఞురాల!
భ్రమ :- నిజమే! నిజమే!
సీ. ఱాతిలోఁ గప్పను రక్షింపఁ గలతండ్రి
బొరియలోఁ జీమను బ్రోచు తండ్రి
గంగలోఁజేఁపను గాపాడఁ గలతండ్రి
మంటిలో నెఱ్ఱను మనుచు తండ్రి
పుట్టలోఁజెదలను బోషింపఁగల తండ్రి
కలుగులో నెలుకను గాంచుతండ్రి
నాభిలోఁ ద్రిముల కన్నము పెట్టఁగల తండ్రి
పేడలోఁ బురుగును బెంచుతండ్రి
భూజములకెల్ల నీరము పోయు తండ్రి
శిశువుతో స్తన్యముం దయసేయు తండ్రి
దయయె స్వస్వరూపంబుగాఁ దనరు తండ్రి
మనలఁ బోషింపఁడే వెర్రిమాటగాక!
(తెర పడును.)
చతుర్థాంకము
రెండవ రంగము
ప్రదేశము: పురుషోత్తమరావుగారి లోపలి చావడి.)
(ప్రవేశము: భ్రమరాంబ, కాళింది.)
భ్రమ :- అమ్మాయీ! యీ పూఁట నీ వన్నమునకు రాలేదేమి?
కాళిం :- ఆఁకలి లేదమ్మా!
భ్రమ :- అదేమే ! యే పూఁట కాఁపూఁట యాకలి లేదని మొదలు పెట్టినావు. పెండ్లి తలపెట్టఁగానే పెండ్లికూతుల కెక్కడలేని కళ వచ్చును. నీవేమిట్లు నీళ్ళు కారుచున్నావు?
కాళి :- అమ్మా! అడిగితివి కనుకఁ జెప్పుచున్నాను. ఈ పెండ్లి నా కిష్టము లేదే!
భ్రమ :- అదేమీ? ఆ పెండ్లి కొడుకు నచ్చలేదా యేమిటి?
కాళి :- పెండ్లికొడుకు కాదు. పెండ్లియే నచ్చలేదు.
ఆ. మీకుఁ గులము లేద మాకు రూపము లేద?
యింత దైన్యమునకు -హేతువేమి?
కట్నమిచ్చి వరుని గడియించుకొనుకంటెఁ
జిన్నతనము వేఱె మున్న దమ్మ?
భ్రమ :- ఇంతియే కద. ఈ దురవస్థ యిపుడు మనకే పట్టినదా?
ఉ. కొంచెముపాటి వారలును గొంపను గోడులు నమ్మియేనియున్
సంచులు చంకఁబెట్టుకొని సంతకుఁ బోయినట్లుఁ పోయి శో
ధించి బిగించి తండ్రులు విధించిన విత్తము ముందె చేతిలో
నుంచియ కాదె తెచ్చుకొను చుండిరి కూఁతుల కిప్డు భర్తలన్.
గీ. అడుగువారికిఁ బాప భయంబు లేక
యిచ్చువారికి సిగ్గును నెగ్గులేక
నడచుచున్నట్టి వరశుల్క నాటకమున
నకట! మనమును బాత్రలమగుట తగునె?
భ్రమ :- కాక చేయవలసిన దేమి?
ఆ. అప్పుకన్నఁ నలగ యావళీ దక్షిణ
కన్నఁ బన్నుఁ కన్నఁ గన్నతండ్రి
తద్దినంబుకన్నఁ తప్పనిసరియయి
యన్నదిపుడ కట్న మన్నియెడల.
కాళిం :- అమ్మా! అదేమన్నమాట?
చ. తిరముగ నింటిముందుఁ బెను దేవళముండఁగ మ్రొక్కుబళ్లతో
దిరుపతి కేగినట్లు కులదీపకు లెందఱొ లేమిచే వివా
హ రహితులై కనంబడెడు నప్పుడు బారిని రోసి కట్నమే
పరువుగ నెంచువారికయి పర్వులిడం బనియేమి వచ్చెనే?
భ్రమ :- తెలివిమాలినదానా! నీ విప్పటి దేశకాలపాత్రముల సంగతి తెలియక మాటాలాడుతున్నావు!
ఆ. పిండిబొమ్మయైనఁ బిల్లఁ నిచ్చెదమనఁ
గానె చేయిచాచుఁ గట్నమునకు;
ఇట్టి తరిని కట్న మీయకుండఁగఁ బుస్తె
కట్టువరుఁడు జగతిఁ గానఁబడునె?
కాళిం :- పోనిమ్ము. లోకమంత గొడ్డుపోవునప్పు డీలొచ్చు పని కంటె వివాహమే విసర్జింపఁ గూడదా?
గీ. కట్నమే కోరి వచ్చిన ఖరముతోడఁ
తగుదునని కాఁపురము సేయు దానికంటెఁ
బెండ్లియే మానుకొని మగబిడ్డవలెనే
తల్లిదండ్రులకడ నుంట తప్పిదంబె?
సీ. పెరవారి పిల్లకు వరు డేరుపడె నవ
మనపిల్ల కెవ్వడోఁ మగఁడటంచు
పరుల పిల్లల పెండ్లి పరికించు నపుడెల్ల
మనపిల్ల కెప్పుడో మనువటంచు
ఎదుటి యింటికి నల్లుఁ డేతెంచినపుడెల్ల
మన యిల్లుఁ డెపుడింట మసలు ననుచు
పొరుగింటి పిల్ల కాఁపురము విన్నప్పుడెల్ల
మనపిల్ల కెట్టిదబ్బునో యటంచు
నాఁడుబిడ్డ జనించుటే యాదిగాను
బుస్తె మెడబడువరకు మాపులను బవలుఁ
గుడుచుచున్నను గూర్చున్నఁ గునుకుచున్నఁ
దల్లి పడుబాధ తెలుపఁగఁ దరమె బిడ్డ?
కాళిం :- అమ్మా! యిన్ని బాధలుపడి పెంచిన బిడ్డకు ఇట్టి లంచగొండులకు గట్టబెట్టుటకంటె నవమానమింకేమున్నది.
భ్రమ :- అయ్యవమాన మా లంచమాసించు వారికిగాని మనకేమి?
కాళిం :- అదేమన్నమాట?
గీ. త్రాగువా రుంటచేతనే తాళ్ళగీత!
గొనెడువా రుంటచేతనే గోవుల వధ
పోవువా రుంటచేతనే - భోగవృత్తి
అట్లె ప్రోత్సాహమే హేతు వన్నిటికిని.
భ్రమ :- (వినుట నభినయించుచు) ఆగుమాగుము. అదిగో! మీ నానగారు కావలయును దలుపు తట్టుచున్నారు. ఆ! వచ్చె వచ్చె. (అని నడచి తలుపు తెరచుట యభినయించును.)
పురు, పేర :- (ప్రవేశింతురు.)
భ్రమ :- వెళ్ళిన పని అయినదా?
పేర :- అవడంలో అఖండ దిగ్విజయంగా అయింది. ఆ రిజిష్టారు ముండాకొడుకు చేతుల్లో ఐదురూపాయల నోటూ పెట్టగానే, అదివరకు వచ్చిన వారినందరిని వెనకబెట్టి అరగంటలో తేల్చేశాడు.
పురు : -పెండ్లికొడుకు ముడుపు పేరయ్యగారిచేత బంపివేయమనెదవా? అదేమి నీ వట్లున్నావు?
భ్రమ :- కాళింది నాకీ పెండ్లి వలదని కావలసినంత గందరగోళము చేయుచున్నది! ఏమి చెప్పినను దాని తల కెక్కుటలేదు!
పురు :- అదేమీ?
భ్రమ :- కట్న మిచ్చి వరునిఁ దెచ్చుకొనుట గౌరవహీనమని. ఆనవాయత లట్టెపోవునా? మీ పోలికలు పుణికి పుచ్చుకున్నందులకు మీ తిక్కయే దానికిని బట్టుకొన్నది!
పురు :- నా తిక్క నా బిడ్డలకుఁ గూడ నంటుకొనుట నాకానందమే కాని భగవంతుడు ప్రతికూలుడైనందున మా తిక్కతీరుమార్గముమాత్రమే లేకపోయినది! ఏదీ యెక్కడనున్న దొకసారి యిటు పిలువు.
కాళిం :- (తలవంచుకుని ప్రవేశించి) ఇదిగో యిక్కడనే యున్నానండి!
పురు :- (దగ్గరకు దీసికొని, తలనిమురుచు) అమ్మా! మీయమ్మతో నేమో యన్నావా టేమిటి!
కాళిం :- అమ్మతో నన్నమాట మీతోగూడ ననుటకే వచ్చినాను. నాన్నగారు? నాయెడ మీకు నిజముగా ప్రేమయున్నదా?
పురు : -అమ్మా! నీ కట్టి సందేహమేల గలిగినది?
కాళిం :- ఉన్న యెడల -
ఆ. కూతురనుచు బరుల చేతిలోబెట్టక
కొడుగటంచు నన్ను గొంపలోనె
యుంచుకొనుడు, మీరు పెంచలేకున్న గ
ష్టించి మిమ్ము నేనే - పెంచుదాన.
పురు :- (గడ్డము పుడుకుచు) వెర్రితల్లీ! బిడ్డను బెరవారికిచ్చుట ప్రేమలేక కాదు, మరేమందువా!
ఆ. ఆఁడుబిడ్డ యెపుడు నన్యుల సొత్తౌట
దాని వారికడకు దానిఁ జేర్చు
భారమెల్లఁ దండ్రిపైనుండుఁ గావునఁ
దండ్రి ఱాతిగుండెఁ దాల్పవలయు!
కాళి :- నాన్నగారూ! నాకీ పెండ్లి ఎంతమాత్రము నచ్చలేదు! ఎందుచేత నందురా?
గీ. కట్న మర్పించి వరునిచే గంఠమునకు
బుస్తె కట్టించుకొని తృప్తిఁ బొందు కంటెఁ
దనకుఁ దానుగ ముప్పేట త్రాటితోడఁ
గంఠమునకు కురియిడుకొంటె గౌరవంబు!
పురు :- (చటాలున గౌఁగలించుకొని) నాతల్లి! నా తల్లి! నాకడుపున బుట్టి, నాకు బుద్ధి చెప్పగలదాని వైనందులకు, నా యాయువు గూఁడ బోసికొని బ్రతుకుము!
చ. సొరిదిగ హెచ్చుచున్న వరశుల్క విపద్దశ మాన్పఁబూని, బి
ట్టఱచితి వేదికాస్థలుల, నాడితి బెక్కు సభాంతరంబులం,
బఱబఱ వ్యాసముల్ బరికి పత్రికలం బ్రచురింపఁ బంపితిన్,
హరహర! నీదుపాటి తెగువైనను లేక భ్రమించితిం దుదన్!
భ్రమ :- సరి సరి! చక్కగానే యున్నది? దాని పాటకు మీరు తాళము గూడా మొదలు పెట్టినారా?
పురు :- తాళమును లేదు, తప్పెటయును లేదు గాని, దాని నేమియు ననక, తగు మాటలతో నచ్చజెప్పుము.
కాళిం :- నాన్నగారూ! నాకీ యేహ్యకృత్య మే మాటల చేతనూ నచ్చదు. నా యెడ నిజముగ దయకలదేని నాపలుకులను బాటించి, ఈ యవమానపు వివాహప్రయత్న మింతటితో విరమింపుఁడు, లేదా, (అనిపై మాట రాక, యేడ్చుచుఁ గాళ్ళపై బడును.)
పురు :- (లేవనెత్తి) అయ్యోతల్లీ! నేనేమి చేయుదును? ఆడుపడుచు అవివాహితయై యింటబడియున్న, అపనిందల పాలు గాదా?
ఆ. లోటులేని యెడనె లోపంబు కల్పన
చేసి దానఁ దుష్టిఃఁజెందు జగమ!
ఇక రవంత లోపమే నిక్కముగఁ గాన
వచ్చెనేని బ్రతుక నిచ్చు నమ్మ.
కాళిం :- అయ్యయ్యో? మీరుగూఁడ నట్లనెదరేమి? నా కింగ్లీషు చెప్పిన దొరసానికి నలుబదియారేండ్లున్నవి. ఇప్పటికిఁ బెండ్లి లేదు. ఆమె యేమి అపనిందలపాలైనది?
భ్రమ :- సరే యిఁక నేమీ! చక్కని యుపమానమే దొరకినది. ఆమెకును మనకును గల యంతరమేమో తెలియునా? మన దేశములో, నాఁడుది యాడుదే, మగవాఁడు మగవాఁడే. అక్కడనో ఆఁడుది మగవాఁడు, మగవాఁ డాడుది. తెలిసినదా? ఈ మంకుతన మిఁకఁ జాలునుగాని, ఈపాటికి లోపలికి బోవుదము రమ్ము. (అని బలవంతముగాఁ కాళిందిని దీసికొని పోవును.)
పురు :- పేరయ్యగారూ, విన్నారా సంగతి?
పేర :- విన్నాను బాబూ, విన్నాను. ఏమిటో యెరిగి ఎరగని పిల్లల కేం తెలుస్తాయి కష్టసుఖాలు.
పురు :- ఇప్పుడేమని మీ సలహా?
పేర :- తమకు నేను సలహా చెప్పాలా. అయినా దీనికంత సలహాతో పనేముంది? కట్నం సొమ్ము పంపివేసినట్లు తెలిస్తే, కార్యం లేదని ఆ చిన్నదే వూరుకుంటుంది. ఆ కాస్త ముడి పడిందా పెనిమిటి బెల్లమే అవుతాడు.
పురు : -అట్లయిన నిఁక నాలస్య మెందులకు? ఇదిగో సొమ్ము ఇచ్చి చక్కరండు. (అని నోట్లు లెక్క పెట్టి) బజానాక్రింద నిచ్చిన పదిరూపాయలు మినహాయింతమా?
పేర :- ఆ బ్రాహ్మణుడు నోట్లకు మారకం అడక్కుండా విడిచిపెడతాడా? ఆ పదిరూపాయలూ అందుక్రింద సరిపుచ్చుతాను.
పురు :- అట్లే కానిండు. (అని నోట్లిచ్చి) మీరొకసారి చూడుడు.
పేర :- (లెక్కచూచి) ఐదు వేలా ఐదువందలు సరిగా వున్నాయి. ఈదారినే వెళ్ళి యిచ్చివేసి, ముట్టినట్టు ముక్కకూడా వ్రాయించుకు వస్తాను. శలవు. (అని కొంచ మావలికి వచ్చి) బ్రతుకుజీవుడా, బ్రాహ్మడు పప్పులో అడుగువేస్తాడేమో అని ప్రాణాలు కొట్టుకొన్నాయి. లేచిన వేళ మంచిది. ఐనా ఆడపిల్ల నింత హద్దు మీరనివ్వగూడదు. అందుకనే ఆడు పిల్లలకు చదువంటే, నా అరికాలు మంట నెత్తి కెక్కుతుంది. వెనక నో సారి మా పెంకిముండ ప్రక్కయింటి పిల్లతో బళ్ళోకి వెళ్ళడానికి సిద్ధపడితే నేనేం చేశాను? స్తంభానికి కట్టి చావగొట్టాను అక్కడితో ఆరోగం వదలి అయిదుగురు బిడ్డల తల్లయ్యింది. (అనుకొనుచు నిష్క్రమించును.)
పురు :- (రవంత నడయాడి) ఔరా! దురదృష్టము.
చ. కరమును నీతిబాహ్యములు కట్నపుఁ బెండిళు లంచు సుద్దులన్
గురిసెను నిన్నదాఁక, దన కూతుఁ వివాహముపట్ల నేడు కి
క్కురు మనకుండఁ గాళ్ళకడకున్నడిపించెను గట్న మంచు న
ల్గురు ననుగురించి లేవిడులు గొట్టెడు యోగముపట్టె నేమనన్.
(తెరపడును.)
ఇది చతుర్థాంకము
★ ★ ★