లిటిల్ మాస్టర్స్ సులభ వ్యాకరణము/ఛందశ్శాస్త్ర విభాగము

5. ఛంద విభాగము

ఛంద పరిచ్చేదము

షడంగములలో ఛందశ్శాస్త్ర మొకటి. ఛందస్సు అనగా పద్య లక్షణము. పద్య లక్షణమును తెల్పు శాస్త్రమును ఛందశ్శాస్త్ర మందురు.

కొన్ని అక్షరములు చేరి గణములగును.
కొన్ని గణములు చేరి యొక పద్యమగును.
గురు లఘువుల కలయికచే గణము లేర్పడును.

హ్రస్వాక్షరములు, లఘువులు (తేల్చి పలుకునవి)
దీర్ఘాక్షరములు, గురువులు (ఊది పలుకునవి) ఒక క్షణములో నాల్గవ భాగము మాత్ర.

ఒక మాత్ర కాలము లఘువు.
రెండు మాత్రల కాలము గురువు.
మూడు మాత్రల కాలము ప్లుతము.
లఘువును '|' ఈ గుర్తుతో చూపుదురు.
గురువును 'U' ఈ గుర్తుతో చూపుదురు.

          గురువుల గుర్తించు విధానము : -

1. దీర్ఘములన్నియు గురువులు.
         కా - రా - పా. మొదలైనవి.

2. బిందువుతో కూడినవి గురువులు.
         కం - రం - పం మొదలైనవి.

3. విసర్గముతో కూడినవి గురువులు.
         కః - దుః - మొదలైనవి.

4. పొల్లు హల్లులతో గూడినవి గురువులు.
          కన్ - రన్ - మన్ మొదలైనవి.

5. ఐ - ఔ లతో గూడినవి గురువులు.
          కై - రై - రౌ - పౌ మొదలైనవి.

6. ద్విత్వాక్షరమునకు, ముందున్నవి గురువులు
          అద్దము - గుఱ్ఱము
          ఇందు అ - గు - గురువులు.

7. సంయుక్తాక్షరమునకు ముందున్నవి గురువులు.
          రక్తము - ధర్మము
          ఇందు - ర - ధ గురువులు.
   మిగిలినవి లఘువులు.

సిద్ధ సమాసము లందు మాత్రము, ఉత్తర పదము మొదట నున్న హల్లుల సంయోగము, పూర్వపదము తుది అక్షరమునకు గురుత్వము కల్గింపగలదు.

శక్ర శ్రీ కిన్ - ఇది సిద్ద సమాసము.

ఇందు ఉత్తరపదము మొదటి అక్షరమగు శ్రీ అనుహల్లుల సంయోగము పూర్వ పదాంత అక్షరమగు, క్ర అనుదానికి గురుత్వము కల్గింప జాలినది

సాధ్య ఆది అన్యసమాసమునకు అట్లు కాదు.

శక్రుని శ్రీకిన్ - ఇది సాధ్య సమాసము.

ఇందు ఉత్తర పదాధ్యక్షరమగు శ్రీ అను హల్లుల సంయోగము పూర్వ పదాంతాక్షర మగు 'ని' అనుదానికి గురుత్వము కల్గింపదు.

చెట్టు ప్రకాండము - ఇది మిశ్ర సమాసము.

ఇందు 'ప్ర' హల్లుల సంయోగము 'ట్టు' అను దానికి గురుత్వము కల్పింపదు.
గురువును - 'గ' అని, లఘువును 'ల' అని గుర్తింతురు.

          రెండు అక్షరముల గణములు 4.
        గగము : U U రామా
        లలము : || రమ
        హగణము : లేక గలము
                  U | రామ
        వగణము : లేక లగము
                 | U రమా

మూడక్షరముల గణములు : 8 (నిసర్గ గణములు)

యమాతారాజభానస -

ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క గణము పేరు దెల్పును.

యమాతా = |UU - యగణము
మాతారా = UUU - మగణము
తారాజ = UU| -తగణము
రాజభా = U|U -రగణము
జభాన = |U| -జగణము
భానస = U|| -భగణము
నసయ = ||| -నగణము
సయమా = ||U -సగణము

"ఆది మధ్యావసానేషు యరతా
          యాంతిలాఘవమ్
భజసాగౌరవం యాంతి మనౌతు
          గురు లాఘవౌ"

య - ర - త గణములకు వరుసగా ఆది - మధ్య - అవసానము లందు, లఘువులును, - భ - జ - స లకు వరుసగా, ఆది - మధ్య - అవసానములందు గురువును, ఉండును. మ - న గణములలో మొదటిది కేవలము గురువుతోను, రెండవది కేవలము లఘువుతోను ఏర్పడునని పై శ్లోకమునకు భావము.

             నాలుగక్షరముల గణములు. 3

నగణముపై లఘువు - నలము
         ||| + | = సరసము.

నగణముపై గురువు - నగము
         ||| + U = సరసుడా!

నగణముపై లఘువు - పలము.
         ||U + | = రఘురామ!

                గణముల సంఖ్య

రెండుక్షరముల గణములు - 4
మూడక్షరముల గణములు - 8
నాల్గక్షరముల గణములు - 3
మొత్తము పదునైదు గణములు

               సూర్యచంద్ర ఇంద్ర గణములు!

         "భ, ర, త, నగ నల నలంబులు
         వరుసగ నీయాఱునెన్నవా నవ గణముల్
         మఱి, స, హ, ము లి స గణంబులు.
         సరి విందక్కినవియెల్ల చంద్ర గణంబుల్.

భగణము - రగణము - తగణము - నగము - నలము - సలము - ఈ ఆఱును ఇంద్రగణములు.

నగణము - హగణములు - సూర్యగణములు

మిగిలిన గణము - లలము, వగణము - జగణము - సగణము - యగణము - మగణములు చంద్రగణములు.

జాతులు - ఉపజాతులు -వృత్తములు

పద్యములు వృత్తములు - జాతులు - ఉపజాతులని మూడు విధములు.

నిసర్గ గణములతో నేర్పడునవి వృత్తములు. దీనికి యతి - ప్రాసనియములు - పాద - అక్షర నియమముండును. ఇట్టివి చంపకమాల - ఉత్పలమాల మొదలైనవి.


జాతులు : ఇందు ప్రతిపాదములోని గణములు నియతములు. కాని క్రమమునకు నియతముండదు.

కందము - ద్విపద మొదలైనవి జాతులు.

మొదటి పాదము మొదటి అక్షరము గురు లఘువులలోనేదియున్నను చివరి వరకు అట్లే యుండవలయును.


ఉపజాతులు : వీటికి ప్రాస నియమము కూడ లేదు. యతిగాని ప్రాసయతిగాని వేయవచ్చును. ఆటవేలది - తేటగీతి - సీసపద్యము ఈ కోవకు చెందినది.

ప్రాసము : ప్రాసమనగా పాదములోని ద్వితీయాక్షరము, ఇందుహల్లు సమానముగా నున్న చాలును. అచ్చుదేనితో కూడియున్న నుండవచ్చును, అనగా మొదటి పాదమున ప్రాసాక్షరము 'కి' యున్నచో తక్కిన పాదములలో 'క' గుణింతములోని ఏఅక్షరమైన ఉండవచ్చును. మొదటి పాదమున ప్రాసాక్షరము, గురువైనచో తక్కిన పాదములందు కూడ గురువే యుండవలయును. లఘువైన లఘువే యుండవలయును. సంయుక్తాక్షరమైన - ద్విత్వాక్షరమైన - బిందుపూర్వకాక్షరములైన - అవే యుండవలయును.

ఉదాహరణములు -
కాలము మంచిదై విరివిగా తెగ పండిన ఓఇరుపంటలే
చాలవు పొట్టకూటికయిటి స్వర్గమునందు వసించువారికిన్
         
        ఇందు 'ల'కారప్రాసము. లఘువు.

ఏడీ మీ ప్రభువేడి? దేవగిరియందే గద్దెలై దీర్చియు
న్నాడా! యాలము పెండ్లి తొందరల నున్నాడా! మముం జూడగా!

        ఇందు 'డ' కారము ప్రాస - గురువు.

చిందఱ రేగి, శత్రువుల చివ్వనెదిర్చుచు, వీర బృందముల్
గ్రిందులు జేసి, యాంధ్రమున, గేవలమేలితి నింతదాక, పేరంది,

 - ఇందు బిందుపూర్వక ద కారము.

ఆశ్వయుజంబు వచ్చి, శరదంబుదముల్ వెల వెల్లబారె, భూ
మీశ్వర! దండయాత్రలకు నియ్యది మేలగువేళ గాని, దీ ల్లీశ్వర!

ఇందు సంయుక్తాక్షరమైన 'శ్వ' ప్రాసాక్షరము.

మొన్నటి కావ్యగాధ తల పోతకు వచ్చెడి - మా గురూత్తముల్,
పన్నిన, గబ్బమంచు, గొనివచ్చిరి, యిర్వురు, దాని తీరుమే
మెన్నక -

ఇందు ద్విత్వాక్షరమైన 'న్న'కారము ప్రాసగా వచ్చినది.

ఇదే విధముగా ప్రాసాక్షరమునకు హల్ మైత్రి యుండవలెను గాని అచ్చు మైత్రితో పనిలేదు.

యతులు : పద్యపాదము యొక్క మొదటి అక్షరముతో నాపద్యమునకు నిర్ణయింపబడిన స్థానమందలి, యక్షరము, మైత్రికలిపి యుండుట యతిమైత్రి యనబడును.

ప్రాసయతి : యతిమైత్రికి బదులుగా పాదమందలి రెండవ అక్షరమునకును యతిస్థానము తరువాతి అక్షరమునకును ప్రాసమైత్రి కల్పించుటకు ప్రాసయతియనిపేరు. యతిమైత్రి అచ్చునకు, హల్లునకు రెండింటికి వేరువేరుగా సరిపడవలయును. ప్రాసమైత్రి హల్లునకే సరిపడవలయును. కాని అచ్చులకు మైత్రి అవసరములేదు.

ప్రాసలేని పద్యములుండును గాని యతి లేని పద్యములుండవు. యతికి, విశ్రాంతి, విరతి, విరయము, వళి అనుపేర్లు కలవు. యతికి స్వర ప్రధానము. అనగా పాద ప్రధమాక్షరమునకు, ఆయా నియమిత, యతిస్థానమునందలి అక్షరమునకు హాల్‌మైత్రితో బాటు స్వరమైత్రి కూడ ఉండవలెను.

యతిమైత్రి.

అచ్చులు :

        1) అ - ఆ; ఐ - ఔ - ం, - (య - హ)
        2) ఇ - ఈ; ఋ - ఋ; ఎ - ఏ
        3) ఉ - ఊ; ఒ - ఓ

హల్లులు :

        1) క - ఖ - గ - ఘ
        2) చ - ౘ - ఛ - జ - ౙ - ఝ
               శ - ష - స
        3) ట - ఠ, డ - ఢ
        4) త - థ, ద - ధ
        5) ప - ఫ, బ - భ
        6) ల - ళ
        7) న - ణ
        8) ఱ - ర
        9) మ
       10) పు - పు, బు - భు - ము
           ఇతర యతి విశేషములు గ్రహించవలెను.

పద్య లక్షణములు :

జాతులు :


1. కందము లక్షణము :

       "కందము, త్రిశరగణంబుల,
        నందముగా, భ - జ - స - న - ల - ము లటవడిమూటల్,
        బొందును - నల - జల - నాఱిట
        నొందుం, దుది హురువు, జగణ ముండదు బేసిణ్."
 
        వృత్తముల వలె దీనికి ప్రాసనియమము కలదు.

1) భ - జ - స - నల - గగ అను చతుర్మాత్రా గణములను కలిగియుండును.

2) 1 - 3 పాదములు 2 - 4 పాదములు సమానము.

3) రెండు, నాలుగు, పాదములలో, పైనచెప్పబడిన చతుర్మాత్రా గణములలో, ఏ ఐదు గణములైన నుండవలయును, ఒకే గణమైదుసార్లు వచ్చినను రావచ్చును, లేదా వేరు వేరు గణము లేదైన నుండవచ్చును.

1 - 3 పాదములలో పైవానిలో ఏగుణములైన నుండవచ్చును.

4) ఒకటి - రెండుపాదములు కలిసి మొత్తము ఎనిమిది గణములలోను బేసి స్థానమున జగణముండరాదు. రెండు నాలుగు పాదములలో మూడవ గణము తప్పక జగణముగాని, నలముగాని అయి యుండవలెను.

5) రెండు - నాలుగు పాదములలో మొదటి అక్షరమునకు, నాలుగవ గణము మొదటి అక్షరము యతి స్థానము. 1 - 3 పాదములలో యతిమైత్రి యుండదు.

6) రెండు - నాలుగు పాదములకు, చివర గురువుగల గణము మాత్రమే, యుండవలెను. అనగా భ - జ - నలములు పనికిరావు. నగణము - గగములలో నేదైన ఉండవలెను.

ఉదా :

గగ నల
UU !!!! U !!
శ్రీరా ముని దయ చేతను
గగ నల నల గగ సగ
UU !!!! !!!! UU !!U
నారూ ఢిగసక ల జ ను లు నౌ రా యనగా!

రా - రూ - ప్రాసాక్షరములు.

ఆ - ఔ - యతి స్థానాక్షరములు.

2. ద్విపద - లక్షణము :

       'ఇంద్రగణములు మూడు, ఇన గణంబొకటి
       చంద్రాస్య! ద్విపదకు జనురెంటవిరతి'

       ఇందు రెండు పాదములు మాత్రముండును.

ప్రతిపాదమునకు, మొదటి మూడు ఇంద్ర గణములు, తరువాత ఒక సూర్యగణ ముండును.

మూడవ గణము, మొదటి అక్షరము యతి స్థానము. ప్రాస నియమముండును.

యతికి బదులుగా ప్రాస యతి పనికిరాదు.

ప్రాస నియమములేకుండ ఎన్నిపాదములైన చెప్పినచోమంజరీ ద్విపదయగును.

ఉదా :

నల సల
!!!! ǃǃUǃ UǃU
సురపతి త్రితయంబు సూర్యుడొ క్కండు
నల నగ
ǃǃǃǃ ǃǃǃU UUǃ
బరగును ద్విపదయన్ పదంబు నందు

ప్రాస - ర - ర

యతి - సు - సూ; ప - ప

3.'తరువోజ - లక్షణము :'

మూడింద్ర గణములు - ఒక సూర్యగణము. మరల మూడింద్ర గణములు, 1 సూర్య గణము కలిసి ఒక పాదమగును. మూడు - ఐదు - ఏడు గణముల మొదటి అక్షరములు యతి స్థానములు.

ఉదా :

నల
UUǃ UǃU ǃǃUǃ
భూనాధ నీ గుణం బులు హంస చేత
నగ నగ సల
ǃǃǃU ǃǃǃU ǃǃUǃ
బొలుపుగా వినిమనం బున నిల్పి యున్న
మొదటి అక్షరము 'భూ' అనుదానికి, మూడు ఐదు - ఏడు గణముల మొదటి యక్షరమయిన బు - బొ - బు - అనువానికి యతిమైత్రి సరిపడినది.

4. ఉత్సాహము - లక్షణము :

వరుసగా ఏడు సూర్య గణములు, ఆపై ఒక గురువుండును. 5 వ గణము మొదటి అక్షరము యతిస్థానము. ప్రాసనియమము కలదు.

ఉదా : -

నగ నగ నగ
ǃǃǃ ǃǃǃ ǃǃǃ U
పోలు ననుచు పెరిగి రాజ పుత్రు లదిగి యార్చి పాం
నగ నగ నగ
ǃǃǃ ǃǃǃ ǃǃǃ U
చాలు పురము ముట్టి కొనిరి సంఖ్య బలస మేతు లై

మొదటి పాదములోని మొదటి అక్షరము 'పో'కును - అయిదవ గణములోని 'పు'కును యతి చెల్లినది. అట్లే రెండవ పాదములోని 'చా'కును 'సం'కును యతి చెల్లినది.
5. మధ్యాక్కర - లక్షణము :

2 ఇంద్ర గణములు 1 సూర్యగణము. 2 ఇంద్రగణములు, 1 సూర్యగణము. ఈవిధమున వరుసగా ప్రతి పాదమున ఆరు గణములుండును. ఐదవ గణము మొదటి అక్షరము యతి స్థానం.

ఉదా :

నగ నగ
ǃǃǃǃ UǃU UUǃ UUǃ ǃǃǃ
నరసుర స్తుత్య మై యెంత కాలంబు నా కీర్తి నిలుచు

న - నా - యతి - చెల్లినది

ఉపజాతులు

సూర్యగణములు, ఇంద్ర గణములు కలిగి యతితో కూడి యుండును. ప్రాస నియమము లేదు. ప్రాస యతి వేయవచ్చును.

1. తేటగీతి - లక్షణము :

            "సూర్యుడొక్కరుండు రరాజు లిద్దరు
             దిన కరద్వయంబు తేటగీతి"

నాలుగు పాదములు సమానములు. ప్రతిపాదమునను, మొదట ఒక సూర్యగణము, తరువాత రెండు ఇంద్రగణములు, తరువాత రెండు సూర్యగణములు ఉండవలెను. నాల్గవ గణము మొదటి అక్షరము యతి స్థానము. ఉదా :

UǃU UǃU
చిత్ర చిత్ర స్వ భావ దా క్షిణ్య భావ

చి - క్షి - యతి చెల్లినది.

2. ఆటవెలది - లక్షణము :

          "ఇన గణత్రయంబు, ఇంద్ర ద్వయంబును
           హంస పంచకంబు, ఆటవెలది.

1 - 3 పాదములు 2 - 4 పాదములు సమాన లక్షణములు కలిగియుండును. 1 - 2 పాదములకు కలిపి లక్షణము చెప్పుకొనవలెను. మొదటి పాదమునకు ముందు మూడు సూర్యగణములును, తరువాత రెండు ఇంద్రగణములు నుండును. రెండవ పాదమునకు వరుసగా ఐదు సూర్యగణము లుండును, మూడు నాల్గు పాదములు ఒకటి రెండు పాదములతో సమానము. నాల్గుపాదములందును నాలుగవ గణము మొదటి అక్షరము యతిస్థానము.

ఉదా :

సల
UǃU ǃǃUǃ
ఉప్పు కప్పు రంబు నొక్కపో లికనుండు
ǃǃǃ
చూడ చూడ రుచుల జాడ వేరు

ఉ - ఒ - యతి

చూడ - జాడ - ప్రాసయతి.
3. సీసపద్యము - లక్షణము :

         ఇంద్రగణము లారు, నిన గణంబులు రెండు
         పాదపాదమునకు బరుగుచుండు
         ఆట వెలదియైన, తేటగీతియునైన,
         చెప్పవలయు మీద, సీసమునకు.

వరుసగా ఆఱు ఇంద్రగణములు, తరువాత రెండు సూర్యగణములు గల నాల్గుపాదములు చెప్పి ఆమీద ఒక తేట గీతిగాని, ఆటవెలదిగాని చేర్చవలయును.

మొదటి నాలుగు పాదములలోను ఒక్కొక్కటి రెండేసి చరణములగును. అనగా మొదటి చరణమునకు నాలుగింద్ర గణములుండును. రెండవ చరణమునకు మొదటి రెండు ఇంద్రగణములు తరువాత రెండు సూర్యగణములు నుండును. రెండు చరణములకు వేర్వేరు యతియుండును. చరణము యొక్క మొదటి అక్షరము మూడవ గణముయొక్క మొదటి అక్షరముతో యతిమైత్రి కలిగియుండును. ప్రాసయతి వేయవచ్చును.

ఉదా : -

సల
UUǃ UǃU ǃǃUǃ UUǃ
రాకేందు బింబమై రవిబింబ మైయొప్పు
UǃU Uǃǃ
నీరజా తేక్షణ నెమ్మొ గమ్ము

ఇందు మొదటి పాదమున మొదటి అక్షరము 'రా'కును మూడవ గణము మొదటి అక్షరము 'ర'కును యతి చెల్లినది. రెండవపాదమున మొదటి అక్షరము 'నీ' కిని అందలి మూడవ గణము మొదటి అక్షరము 'నె'కును యతి మైత్రి చెల్లినది.

విశేషాంశము : గణముల నియమమును బట్టి పాదములు సమానములే అయినప్పటికిని, ఈ గణము అని నిర్దేశము లేక సూర్యగణములు చంద్రగణములు నని చెప్పబడినందున - కొన్ని సూర్యగణములు రెండక్షరములనియు, కొన్ని మూడక్షరములనియు, అట్లే కొన్ని యింద్ర గణములు, మూడక్షరములనియు కొన్ని నాలుగక్షరములవియునై యుండుట చేత, పాదములయందలి అక్షరముల సంఖ్యలో భేదము వచ్చును. కావుననే యతి స్థానము యిన్నవ అక్షరమనిగాక యిన్నవ గణము మొదటి అక్షరమని చెప్పబడుచున్నది.

వృత్తములు

పేరు గణములు యతి మొదటి గణము అక్షరములు
ఉత్పలమాల భ ర న భ భ ర వ 10 20
చంపకమాల న జ భ జ జ జ ర 11 21
శార్దూలము మ స జ స త త గ 13 19
మత్తేభము స భ ర న మ య వ 14 20
మత్తకోకిల ర స జ జ భ ర 11 18
తరలము న భ ర స జ జ గ 12 19
పంచచామరము జ ర జ ర జ గ 10 16
మానిని భ భ భ భ భ భ భ గ 13 22
మాకిని న న మ య య 9 15
స్రగ్ధర మ ర భ న య య య 8, 15 21

1. ఉత్పలమాల :

"భాను సమానవిన్ భ, ర, న, భా, ర, ల, గం, బు, ల గూడి మిశ్రమ స్థానమునందు, పద్మజయుతంబుగ, నుత్పమాల యై చునున్,"

భ, ర, స, భ, భ, ర, వ, (లగము) లు వరుసగా నుండి 10 వ స్థానమున యతి చెల్లిన ఉత్పలమాల యగును.

ఉదా :

Uǃǃ UǃU ǃǃǃ Uǃǃ Uǃǃ UǃU ǃU
నీవుజ నించిన ట్టి స్మర ణీయ ది నంబది విశ్వశాం తికిన్

యతి - నీ - ణీ - ప్రాస 'వు'

అక్షరములు 20. పాదములు నాలుగు.

2. చంపకమాల :

        న జ భ జ జ జ ల్, జరెఫల, బెనంగ, దిశాయతి తోడ కూడినన్
        త్రిజగదభిస్తు తా ! బుధనిధీ ! విను చంపకమాల యైచనున్;

న జ భ జ జ జ ర అను గణములు వరుసగానుండి, 11 వ స్థానమున యతి చెల్లిన, చంపకమాల పద్యమగును. పాదమున అక్షరములు 21. పాదములు 4. ఉదా :

ǃǃǃ ǃUǃ Uǃǃ ǃUǃ ǃUǃ ǃUǃ UǃU
కదలె నుకార్మి కుండుక లకాల మునూడి గమాచ రించినం

యతి క - కా - ప్రాస - ద

3. శార్దూలము :

       సారాసారవిశారదా ! యిన యతిన్, శార్దూలవిక్రీడితా
       కారంబై, మన జమ్ములిమ్ముగ, సతాగప్రాప్తమై చెల్వగున్.

మ, స, జ, స, త, త, గ, అను గణములు వరుసగ నుండి, పదమూడవ, అక్షరమున, యతిచెల్లిన శార్దూలమగును. అక్షరములు 19.

ఉదా :

UUU ǃǃU ǃUǃ ǃǃU UUǃ UUǃ U
భిన్నత్వం బున, నే కసూత్ర మును, భా వించెన్ క్రి యాశీల సం

యతి - భి - వి - 1 - 13. ప్రాస 'న్న'.
4. మత్తేభము : -

        స్మయదూరా ! విలస త్రయోదశ యతిన్ మత్తేభ వి క్రీడితా
        హ్వయమయ్యెన్, సభరమ్ములున్, సమయన వ్రాతంబులున్ గూడగాన్.

స, భ, ర, న, మ. య. వ - అనుగుణములు వరుసగా నుండి, 14 వ అక్షరము యతి చెల్లిన, మత్తేభము. అక్షరములు 20.

ఉదా :

ǃǃU Uǃǃ UǃU ǃǃǃ UUU ǃUU ǃU
మహిళా మండలి కీవునే తవయి సన్మానం బులన్‌గాం చియీ

యతి - మ - న్మా - ప్రాస - హి.

5. మత్తకోకిల :

        శ్రావకాభరణాంక ! విన్ రసజాభ రేఫలదిగ్విరా.
        మావహంబుగ, మత్తకోకిల యండ్రు, దీని కవీశ్వరుల్;

ర, స, జ, జ, భ, ర - అను గణములు వరుసగా నుండి 11 వ అక్షరము, యతి చెల్లిన మత్తకోకిల. అక్షరములు 18. ఉదా :

UǃU ǃǃU ǃUǃ ǃUǃ Uǃǃ UǃU
స్నాతకుం డునుఋ త్విజుండు నుసద్గు ణుండును నిష్టుడున్

యతి - స్నా - స - 1 - 11 ప్రాస - త.

6. తరలము :

         ప్రవర, రుద్రవిరామయుక్తి సభంబులన్, రసజాగముల్
         కవిజనాశ్రయ ! పొందియుందముగా ధరందరలంబగున్.

న, భ, ర, స, జ, జ, గ అను గణములు వరుసగా నుండి, 12వ అక్షరము యతి చెల్లిన తరలమగును. అక్షరములు 19.

ఉదా :

ǃǃǃ Uǃǃ UǃU ǃǃU ǃUǃ ǃUǃ U
ధరణి లోగల రాజులె ల్లరుదా రుణక్ష యకాల సా

యతి - ధ - దా - 1 - 12. ప్రాస - ర.

7. పంచచామరము :

         జరల్, జరల్, జగంబు, గూడ, సన్నుతిన్ రచింపగా,
         బరాజి తారివీర ! పంచచామరంబగున్, వెసన్.

జ, ర, జ, ర, జ, గ అను గణములు వరుసగా నుండి 10వ అక్షరము యతి చెల్లిన పంచచామరము. అక్షరములు 16.

ఉదా :

ǃUǃ UǃU ǃUǃ UǃU ǃUǃ U
కిరాత రాతలం పుహత్తి కేవలం బుభుక్తి మై

యతి - కి - కే. ప్రాస 'రా'

8. మానిని :

          కారకముల్ క్రియగన్గొన, నేడు భకారము లొక్కగ కారముతో,
          గారవమైచనగా, వళులన్నియు గల్గిన, మానిని కామనిభా !

భగణములు ఏడు వరుసగానుండి చివర ఒక గురువున్న మానిని వృత్తము. యతి 13వ అక్షరము. అక్షరములు. 22.

ఉదా :

Uǃǃ Uǃǃ Uǃǃ Uǃǃ Uǃǃ Uǃǃ Uǃǃ U
చూచుచు వీనుల కింపెస గన్‌విను చున్‌శుక కోకిల సుస్వర ముల్

యతి - చూ - చున్ - ప్రాస - చు.
9. మాలిని : -

         న న మ య య, యుతంబైనాగ విశ్రాంత మైయి
         ట్లనుపమగుణ ! మాలిన్యాహ్వయంబయ్యె ధాత్రిన్.

న, న, మ, య, య, అను గణములు వరుసగా నుండి, 9వ అక్షరము యతి చెల్లిన, మాలిని వృత్తమగును. అక్షరములు 15.

ఉదా :

ǃǃǃ ǃǃǃ UUU ǃUU ǃUU
సురప తిసభ ఁజూడంజూ డనంగా రవృష్టుల్

యతి సు - జూ - ప్రాస - ర.

10. స్రగ్ధర : -

         శ్రీమన్మూర్తీ ! మకరా శ్రి తరభనయయా సేవ్యమై సానుమద్వి
         శ్రామంబున్ సానుమద్విశ్రమమున మరగాస్రగ్ధరావృత్తమయ్యెన్.

మ, ర, భ, న, య, య, య గణములతో కూడియుండి 8 - 15 అక్షరములు యతి చెల్లిన స్రగ్ధరావృత్తమగును. అక్షరములు 21 ఉండును.

ఉదా :

UUU UǃU Uǃǃ ǃǃǃ ǃUU ǃUU ǃUU
ధ్వాంతారా త్రిప్రభుం డైతన రుచువె లిగెన్‌త ద్రణవ్యో మవీధిన్

యతి - 1 - 8 - ధ్వాం - త
       8 -15 - త - త
      ప్రాస బిందు పూర్వక తకారము.

ఈ పది వృత్తములకు చెప్పిన కొన్ని లక్షణ పద్యములు ఆయా పద్యగణములను, యతులను సూచించుచున్నవి అని గ్రహింపవలెను.

ఇతర ముఖ్య పద్య లక్షణములు.


1. మహాస్రగ్దర : -
       స, త, త, న, స, ర, ర, గ అను గణములు.
       పాదమునకు 22 వర్ణములు. 6 - 16 యతి స్థానము.


2. సుగంధి : -
       7 హగణములు వరుసగా ఉండును. చివర ఒక గురువుండును. 9వ వర్ణము యతి స్థానము.


3. స్వగ్విణి : -
       నాలుగు రగణములు వరుసగా నుండును. 12 వర్ణములుండును.
       7వ వర్ణము యతి.


4. లయగ్రాహి : -
       పాదమునకు 39 మాత్రలు గల 30 అక్షరములుండును. అనగా భ - జ - స - న - భ - జ - స - న - భ - య - 9 - 17 - 25 అక్షరములు ప్రాస యతులుండవలెను.


5. లయవిభాతి : -
      పాదమునకు 34 మాత్రలు గల 34 అక్షరములుండును. అనగా న - స - న - న - స - న - న - స - న - న - స - గ - 10-19-28 ప్రాస యతులుండవలెను.


6. లయహారి : -
      పాదమునకు 39 మాత్రలుగల 37 వర్ణములుండవలెను. అనగా 11 నగణములు 1 నగణ 1 గురువు. 11-21-31 ప్రాస యతులు.


7. మంజరి : -
      3 ఇంద్రగణములు 1 సూర్యగణమునుండి మూడవగణము మొదట యతిగలది. దీనికి ప్రాసముండదు.


8. సరసిజము : -
      మ - త - య - న - న - న -న - స గణములుండును. 10-18 వర్ణములు యతి స్థానములు.


9. క్రౌంచపదము : -
      భ - మ - స - భ - న - న - న - య అనుగణములుండును. 11-19 యతిస్థానములు.


10. మహాక్కర : -
      1 సూర్యగణము, 5 ఇంద్రగణములు, 1 చంద్రగణము. ఇట్లు 7 గణములుండును. 5 వ గణము మొదట యతి ప్రాసనియమముండును.


11. మధురాక్కర : -
      పాదమునకు 1 సూర్యగణము, 3 ఇంద్రగణములుండును. 1 చంద్రగణములు మొత్తము 5 గణములుండును. 4 వగణము మొదట యతి స్థానము ప్రాసముండును.


12. అంతరాక్కర : -
       పాదమునకు 1 సూర్యగణము, 2 ఇంద్రగణములు, 1 చంద్రగణముండును. 4వ గణము మొదట యతి ప్రాసముండును.


13. దండకము : -
       మొదట - న - స - హ - ములలో, నొకదానిని గాని, తగణమునుగాని, కూర్చి చివరవరకు తగణములను, చివర గురువును, చేర్చవలెను. ఇష్టమైనంత వ్రాసికొనవచ్చును.


14. మంగళమహాశ్రీ : -

       పాదమునకు 26 అక్షరములు. 9 - 17 వర్ణములు యతులు. భ - జ - స - న - భ - జ - స - న - గ - గ ములుండును.

వృత్తములమార్పు :

ఉత్పలమాల యందలి, మొదటిగురువును, రెండు లఘువులుగా, మార్చినచో చంపకమాల యగును.

చంపకమాల యందలి, మొదటి రెండు లఘువులను ఒక గురువుగా మార్చిన అది ఉత్పలమాల యగును.

శార్దూలమందలి, మొదటిగురువును రెండు లఘువులుగా, మార్చిన అది మత్తేభమగును.

మత్తేభమందలి, రెండు మొదటి లఘువులను, ఒకగురువుగా, మార్చిన అది శార్దూలమగును.

మత్తకోకిల, లోని మొదటి గురువును, రెండు లఘువులుగా, మార్చిన అది తరళమగును.

తరళము మొదటి రెండు లఘువులను ఒక గురువుగా మార్చిన, నది మత్తకోకిల యగును.

ద్విపద యొక్క పాదమును రెట్టించి అనగా రెండు ద్విపదపాదముల నొక్క పాదముగా చేర్చి 3-5-7 గణముల మొదటి అక్షరములకు యతికల్పించినచో నది తరువోజ యగును.

తరువోజ పాదమును రెండు సమభాగములుగా చేసిన, నది ద్విపదయొక్క రెండు పాదములగును.

ప్రశ్నలు

1) గురు లఘువునెట్లు గుర్తింతువు ?
2) యతి - ప్రాసల గూర్చి వ్రాయుము ?
3) సూర్య - చంద్ర - ఇంద్ర గణములేవో వివరింపుము.
4) పద్యము లెన్ని రకములు ? అవి యేవి ?
5) ఉపజాతుల లక్షణములేవి ?
6) ఈ క్రింది పద్యములకు లక్షణములు దెల్పుము.

1) శార్దూలము 2) మత్తకోకిల 3) స్రగ్దర 4) మహాక్కర 5) తరలము 6) చంపకమాల 7) సుగంధి 8) మాలిని 9) ఆటవెలది 10) కందము.