లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు/మన కొల్లూరు - కోహినూర్ వజ్రం

మన కొల్లూరు - కోహినూర్ వజ్రం

థేమ్స్ నది ఒడ్డున వున్న ఒక ప్రాచీనమైన కోట "టవర్ ఆఫ్ లండన్", మధ్యయుగంలో రాజప్రాసాదంగా విరాజిల్లి 15 ఎకరాలలో నేడు ప్రపంచ ప్రసిద్ధ పురావస్తుశాలగా వాసిగాంచిన కట్టడమిది. లండన్ టవర్లో కోహినూర్ వజ్రాన్ని తిలకించడం ఒక మధురానుభూతి. తెలుగునాట దొరికి, వజ్ర సంపదలో తలమానికంగా పేర్కొనబడే కోహినూర్ వజ్రం భారతదేశానికి గర్వకారణం. మహాభారత కాలం నాటి శమంతకమణి ఇదేనని కొందరు భావిస్తున్నారు. చిత్ర విచిత్రమైన చరిత్ర ఈ కోహినూర్ వజ్రాన్ని ఆవహించి ఉంది. ప్రముఖ పరిశోధకులు శ్రీ దిగవల్లి శివరావుగారు తమ "కథలు-గాథలు" 2వ భాగంలో కోహినూరు వజ్రం గురించి అనేక విశేషాలు వ్రాశారు. లండన్ టవర్లో కోహినూరు వజ్రాన్ని చూడగానే అవన్నీ నాకు గుర్తుకు వచ్చాయి. తిరిగి వచ్చిన తరువాత ఆసక్తి మరింత పెరిగి, కోహినూరు వజ్రానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే సంభ్రమాశ్చర్యాలను కలిగించే ఎన్నో విశేషాలు తెలిశాయి.

కోహినూరు (Koh--Noor) అనగా "తేజ పర్వతం" అని అర్థం. ఇది పర్షియన్ పదం. ఒక మహాపర్వతమంత కాంతిని ప్రసరింపజేయగల దివ్యరత్నమిది. ఈ వజ్రం యొక్క ప్రభావానికి సమ్మోహితులైన ఎందరో రాజన్యులు, చక్రవర్తులు దీనిని స్వంతం చేసుకోవడానికి తహతహలాడారు. ఈ వజ్రం కోసం యుద్ధాలు చెలరేగి, రక్తపాతం జరిగింది. బంధుత్వాలు, రక్త సంబంధాలు మరచి ఒకరినొకరు మోసం చేసుకున్నారు. హత్యలు చేశారు. తీవ్రమైన హింసలకు గురయ్యారు. దీన్ని రక్షించుకోవడానికి పడ్డ తపనలో ఎంతో మానసిక వేదన అనుభవించారు. శతాబ్దాల తరబడి చేతులు మారుతూ, ఈ వజ్రం చేసిన బహుదూర ప్రయాణం ఎంతో ఉద్విగ్నభరితం. ఈ వజ్రం చుట్టూ ఎన్నో చరిత్రలు తిరిగాయి. కథలూ, గాథలూ, కల్పనలూ అల్లుకున్నాయి. ప్రపంచంలో ఏ వజ్రానికి దక్కని ప్రత్యేకతను స్వంతం చేసుకున్న ఈ అనర్ఘరత్నం జన్మస్థానం ఆంధ్రదేశం!

ఈ వజ్రం గుంటూరు సీమలోని సత్తెనపల్లి తాలూకా కొల్లూరు గ్రామంలోని ఒక వజ్రపుగనిలో దొరికిందని అబ్దుల్ అజీజ్గారు "Journal of Indian Hisotry" అనే చారిత్ర విషయిక పత్రికలో వ్రాసిన వ్యాసం కలకత్తాలో మోడరన్ రివ్యూలో ప్రకటించబడింది. ఈ వ్యాసాన్ని 1938లో భారతి మాసపత్రిక — సంపుటం-10లో అనువదించి ప్రచురించారు.

ఈ వజ్రం ఐదువేల సంవత్సరాల నాటిదని భారతదేశ సంప్రదాయ చరిత్రలో ప్రచారం ఉన్నమాట వాస్తవమని, అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలు లభ్యం కావడం లేదనీ పాశ్చాత్య చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. లభిస్తున్న చారిత్రకాధారాల ప్రకారం ఈ వజ్రం ప్రస్తావన మొగల్ చక్రవర్తి బాబర్ తన జ్ఞాపకాలను 'బాబర్ నామా' పేరుతో వ్రాసుకున్న గ్రంథంలో ఉంది. బాబర్‌నామాలో ఈ విధంగా ఉంది. క్రీ.శ. 1300ల ప్రాంతంలో మాళవ (ప్రస్తుత గుజరాత్) రాజవంశం చాలా బలంగా ఉంది. నర్మదా నదికి వింధ్యపర్వతానికి మధ్యగల భూభాగాన్ని అప్పటికి వెయ్యి సంవత్సరాల బట్టీ వీరు పాలిస్తున్నారు. వీరు మహ్మదీయులకు గట్టి ప్రతిఘటన ఇచ్చారు. అయితే 1295 నుంచి 1316 వరకు ఢిల్లీని పాలించిన అల్లావుద్దీన్ ఖల్జీ తాను రాజ్యపాలనకు రావడానికి ఒక సంవత్సరం ముందు దక్కన్ పై దండయాత్ర చేసి, నర్మద, తుంగభద్ర, కృష్ణా నదుల మధ్యభాగాన్ని మాళవరాజు నుంచి కైవసం చేసుకున్నాడు. ఆ సందర్భంలో మాళవరాజ్యం నుంచి కొల్లగొట్టిన అపార ధనరాసుల్లో ఈ వజ్రం కూడా ఉంది. యువరాజుగా వుండిన అల్లావుద్దీన్ 1295లో తన పినతండ్రి అయిన ఢిల్లీ సుల్తాన్ జలాలుద్దీన్‌ను దారుణంగా హత్యచేసి, ఢిల్లీ సింహాసనం ఆక్రమించుకున్నాడు. ఆ తరువాత మాళవ రాజుల నుంచి గుజరాత్‌ను కూడా తన వశం చేసుకుని అక్కడి ధనరాసుల్ని ఢిల్లీకి తరలించాడు. ఒక వాదన అల్లావుద్దీన్ ఈ వజ్రాన్ని దక్కన్‌లో హస్తగతం చేసుకున్నాడని వుండగా, మరొక వాదన దీనిని గుజరాత్‌లో మాళవరాజుల నుంచి చేజిక్కించుకున్నాడని వినిపిస్తున్నది.

ఆ తరువాత 200ల సంవత్సరాలకు 1526లో పానిపట్టు యుద్ధంలో బాబర్ అప్పటి ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీంలోడీని సంహరించి, ఢిల్లీని ఆక్రమించుకున్నాడు. ఈ యుద్ధంలో ఇబ్రహీంలోఢీ పక్షాన పోరాడిన గ్వాలియర్ రాజు విక్రమాదిత్య కూడా హతుడైనాడు. ఈయన ఆగ్రా కోటకు రక్షకుడు కూడాను. కాబట్టి యుద్దానికి వెళ్ళేముందు విక్రమాదిత్య తన సమస్త సంపదను భద్రత కోసం ఆగ్రా కోటకు తరలించాడు. అందులో ఈ అమూల్య వజ్రం కూడా వుంది. బహుశః అల్లావుద్దీన్ తాను దోచుకుతెచ్చిన ఈ వజ్రాన్ని విక్రమాదిత్య పూర్వీకులకు, వారు తన పట్ల చూపిన విశ్వాసానికి గుర్తింపుగా, గ్వాలియర్‌తోపాటు ఇచ్చివుంటాడు.

ఢిల్లీని ఆక్రమించుకున్న తరువాత బాబర్ ఆగ్రాకు 1526 మే 4వ తేదీన వెళ్లాడు. అక్కడ బాబర్‌కు లభించిన అపార సంపదలో ఈ వజ్రం కూడా ఉంది. ఆ విధంగా ఈ వజ్రం మొగలాయిూల వశమైంది. అయితే, బాబర్‌నామా ఈ సంఘటనను మరో విధంగా చెబుతున్నది. అది :

"బాబర్ కుమారుడు హుమాయూన్ ఆగ్రాకు వచ్చినపుడు, విక్రమాదిత్య అంతఃపుర పరివారం పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే హుమాయూన్ సైన్యం వారిని చుట్టుముట్టి కదలనీయలేదు. హుమాయూన్ వారిని దోచుకోవడానికి తన సైన్యాన్నీ అనుమతించలేదు. వారు ఇష్టపూర్వకంగా అనర్ఘరత్నాలు, ఆభరణాలు వున్న ఒక పేటికను హుమాయున్‌కు బహూకరించారు. అందులో సుల్తాన్ అల్లావుద్దీన్ మాళవరాజు నుంచి దోచుకొచ్చిన ఈ ప్రఖ్యాత వజ్రం కూడా వుంది. ఇది ఎంత విలువైందంటే - దీనిని పరిశీలించిన వజ్రాల నిపుణుడొకడు ప్రపంచం మొత్తం ఒక రోజులో చేసే ఖర్చులో సగం వుంటుంది దీని విలువ అని పేర్కొన్నాడు. హుమాయూన్ ఆగ్రా నుంచి తెచ్చిన సంపదతో పాటు ఈ అమూల్య రత్నాన్ని నాకు సమర్పించుకున్నాడు. అయితే, ఈ రత్నాన్ని అతనికి బహుమతిగా తిరిగి ఇచ్చివేశాను".

ఇంకొక కథనం ప్రకారం ఇబ్రహీంలోఢి తల్లి స్వయంగా ఈ వజ్రాన్ని హుమాయూన్ పరం చేసింది. ఆగ్రా కోట మొగలాయిల వశమైనపుడు ఇబ్రహీంలోఢి అంతఃపురస్త్రీలు, విక్రమాదిత్య అంతఃపుర స్త్రీలు ఒక భవనంలో తలదాచుకున్నారు. ఖజానా గురించిన సమాచారం కోటలో ఎవరూ ఇవ్వలేదు. చివరికి ఒక పరిచారిక ఆ భవనంవైపు చూపింది. హుమాయూన్ తన బలగాలతో, ఆ భవనంలో ప్రవేశించగా, విక్రమాదిత్య కుటుంబానికి చెందిన స్త్రీలు భయకంపితులై పెద్ద పెట్టున రోదించడం మొదలు పెట్టారు. అప్పుడు హుమాయూన్ వారి గౌరవానికి ఏ రకమైన భంగం వాటిల్లదని హామి యివ్వగా అల్లావుద్దీన్ తల్లి ఒక గదిలో నుంచి వణుకుతున్న చేతులతో ఒక బంగారు మందసాన్ని తెచ్చి హుమాయూన్ చేతుల్లో పెట్టింది. అందులో మిగతా ఆభరణాలతో పాటు ఈ వజ్రం కూడా వుంది. అయితే ఈ కథనాన్ని ఎవరూ నమ్మడం లేదు.

ఏది ఏమైనప్పటికీ ఈ వజ్రం ఆగ్రా కోట నుంచి మొగల్ చక్రవర్తుల చేతుల్లోకి మారిందన్నది మాత్రం సత్యం. బాబర్ కథనం ప్రకారం అప్పట్లో దీని బరువు సుమారు 8 మిస్కాలు. దీన్ని లెక్కించిన చాలామంది ఇది 186 (పాత) క్యారట్ల బరువుందని వ్రాశారు.

బాబర్ పానిపట్టు యుద్ధంలో ఘన విజయం సాధించిన నాలుగు సంవత్సరాలకు హుమాయూన్ జబ్బు పడ్డాడు. ఈ జబ్బు నివారణకు వైద్యులేమి చేయలేకపోయారు. జబ్బు మరింత ముదిరింది. అప్పడొకరు హుమాయూన్ ప్రాణాలు కాపాడ్డానికిగాను బాబరు తనవద్దనున్న అమూల్య వస్తువును వదులుకోవలసి వుంటుందని సూచించాడు. తన కుమారుడి ప్రాణాలకోసం బాబరు ఈ వజ్రాన్ని తప్పక త్యాగం చేస్తాడని, ఈ అవకాశాన్ని జారవిడుచుకోరాదని అతని ఉద్దేశం. అయితే, అతని అంచనా తప్పింది. ఈ వజ్రాన్ని వదులుకోవడానికి బాబరు ఇష్టపడలేదు. తన వద్ద నున్న అమూల్య వస్తువు తన ప్రాణాలేనని తెలియజేసి, జబ్బుపడివున్న హుమాయూన్ మంచం చుట్టూ తిరుగుతూ, హుమాయూన్ను రక్షించి, అందుకు ప్రతిగా తన ప్రాణాలు తీసుకోమని బాబరు భగవంతుణ్ణి ప్రార్ధించాడట. ఆ తరువాత హుమాయూన్ పరిస్థితి క్రమంగా మెరుగుపడిందనీ, దానితోపాటు బాబరు ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమై, చివరకు ఆయన 1530 డిసెంబర్లో చనిపోయాడనీ చెబుతారు.

హుమాయూన్ పరిపాలన 26 ఏళ్ళపాటు సాగింది. అయితే మధ్యలో ఎన్నో అవాంతరాలు. తొమ్మిదిన్నర సంవత్సరాల మొదటి పాలన తరువాత షేర్ఖాన్ ఆఫ్ఘన్ సైన్యంతో ఇతనిని భారతదేశం నుంచి తరిమేశాడు. హుమాయూన్ మొదట సింధుకు వెళ్ళి, అటుపిమ్మట పర్షియా చేరుకుని 15 సంవత్సరాల వరకు భారత్‌కు తిరిగి రాలేదు. తిరిగి అధికారం చేజిక్కించుకున్న తరువాత ఆయన పాలన ఆరు మాసాలకు మించి సాగలేదు. ఒక రోజు మసీదు నుంచి ప్రార్థనకు పిలుపువిని, ఒక్క ఉదుటున లేచి, తన గ్రంథాలయం మెట్ల విూద నుంచి, బహుశః నల్లమందు ప్రభావంతో, తలక్రిందులుగా పడిపోయి, చనిపోయాడు.

ఆఫ్ఘనుల చేతిలో రాజ్యభ్రష్టుడై దేశం వెలుపల తిరుగుతుండిన కాలంలో హుమాయూన్ తన తండ్రి ఆగ్రాలో తనకు తిరిగి ఇచ్చిన ఈ అమూల్య వజ్రాన్ని మాత్రం తనతోనే ఉంచుకున్నట్లు చారిత్రకాధారాలున్నాయి. అప్పట్లో రెండువందల సంవత్సరాల పాటు ఈ వజ్రం "బాబరు వజ్రంగా" పిలవబడేది. రాజ్యాన్ని ఒక్కగానొక్క ముద్దుల కుమార్తెను, అసంఖ్యాకంగా వున్న భార్యలను, ఆఖరికి తన ఆశాదీపం, వంశాంకురం అయిన తన కుమారుడు అక్బర్‌ను కూడా వదులుకుని 20 సంవత్సరాలు గడపగలిగాడు కాని, ఆయన ఈ వజ్రం నుంచి మాత్రం ఎడబాటు పొందలేదు. ఆయనకు ఈ వజ్రంపై గల వ్యామోహానికి ఈ ఒక్క సంఘటన చాలు. ఆయనకు ఆశ్రయం యిస్తున్న రాజ్యాధినేత ఈయన అశక్తతను సాకుగా తీసుకుని తనకు నమ్మకస్థుడైన ఒక వ్యక్తిని వజ్రాల వ్యాపారిగా హుమాయూన్ వద్దకు పంపాడు. అతడు తన వద్దనున్న వజ్రాన్ని కొనడానికి వచ్చాడని తెలుసుకొని హుమాయూన్ కోపోద్రిక్తుడై, "అటువంటి అమూల్య వజ్రాలను ఎవరూ కొనలేరు. వాటిని భగవదనుగ్రహం వల్ల లభించిన పరాక్రమంతో ఖడ్గ ప్రహరణ ద్వారా గెలుచుకోవాలి లేదా ఒక మహారాజు అనుగ్రహించి కానుకగా ఇవ్వాలి" అని చెప్పి ఆ వ్యక్తిని త్రిప్పి పంపాడు.

హుమాయూన్ రాజ్యభ్రషుడుగా తిరుగుతూ చివరకు పర్షియా చేరుకున్నాడు. పర్షియా రాజు షాతహమస్ ఈ మొగలాయి చక్రవర్తిని ఎంతో గౌరవాదరాలతో ఆహ్వానించి, ఆశ్రయమిచ్చాడు. షా తహమస్ ఆతిథ్యానికి ఉప్పొంగిపోయిన హుమాయూన్ ఆయనకు ఎన్నో అమూల్య రత్నాలను కానుకగా ఇచ్చాడు. అందులో "బాబరు వజ్రం" కూడా ఒకటని, అప్పట్లో ప్రముఖ చరిత్రకారుడు అబుల్ ఫజల్ వ్రాశాడు. ఈయన తదనంతర కాలంలో హుమాయూన్ కుమారుడు అక్బర్ షాదూషాకు కార్యదర్శిగా పనిచేసాడు. ఈయన వ్రాసిన "అక్బర్‌నామా"లో ఈ విషయం పేర్కొంటూ, ఈ వజ్రం ప్రపంచంలోని ఎన్నో దేశాల ఆదాయానికి సమానమని శాఘించాడు. హుమాయూన్ తనకు సమర్పించుకున్న రత్న సంపదను చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనైన పర్షియారాజు, రత్న నిపుణులను రావించి వాటి విలువను మదింపు వేయమని కోరాడు. వాటిని పరిశీలించిన రత్న నిపుణులు, ఆ రత్నాలకు విలువ కట్టడం సాధ్యం కాని పని అని, అన్ని రత్నాలలోకి బాబరు వజ్రం తలమానికమని చెప్పారు. "ప్రపంచపు ఒకరోజు ఖర్చుతో సమానమైనదని చెప్పటం తప్ప "దీని విలువ ఇంత అని ఈ వజ్రానికి ఏకాలంలోను విలువ కట్టలేకపోయారు.

హుమాయూన్ ఈ వజ్రాన్ని పర్షియా రాజుకు కానుకగా ఇవ్వడాన్ని అప్పడు పర్షియా రాజు దర్బారులో వున్న గోల్కొండ నవాబు కులీకుతుబ్‌షా రాయబారి ఖూర్‌షా ధ్రువీకరించాడు. దీని బరువు 6 మిస్మాలు ఉందనీ, మొత్తం ప్రపంచం చేసే రెండున్నర రోజుల ఖర్చుకు ఇది సమానమని ఆయన చెప్పాడు. అయితే, పర్షియారాజు షా తహమస్ దీనిని అంతగా నమ్మలేదని, తరువాత దీనిని భారత్‌లో తన మిత్రుడు అహ్మద్‌నగర్ రాజైన బర్హన్ నిజాంకు కానుకగా తనకు నమ్మకస్తుడైన మెహతర్ జమాల్ అనే వ్యక్తితో పంపాడని, అయితే ఈ వ్యక్తి ఆ కానుకను అందజేయక నమ్మకాన్ని వమ్ము చేసినందున అతనిని పర్షియారాజు అరెస్టు చేయించాడని ఖూర్‌షా వ్రాశాడు. ఆ విధంగా ఈ వజ్రం తిరిగి భారత్ చేరుకుని, ఎన్నో చేతులు మారింది. ఈ సంఘటన 1547లో జరిగింది. 1650లో పాలన చేస్తున్న మొగలాయి చక్రవర్తి షాజహాన్ తన మూడవ కుమారుడు ఔరంగజేబును దక్కన్‌కు గవర్నర్‌గా వేశాడు. ఔరంగజేబు సామ్రాజ్యవాది. దక్కన్‌లోని రాజ్యాలను కబళించడానికి పథకాలు వేసేవాడు. ముఖ్యంగా అపారమైన వజ్రాల గనులున్న గోల్కొండ రాజ్యం విూద తన దృష్టిని కేంద్రీకరించాడు.

ఆ కాలంలో గోల్కొండ రాజ్యంలో ప్రధాన మంత్రిగా పనిచేసిన విూర్ జుమ్లా గొప్ప రత్నాల వర్తకుడు. పర్షియా రాజ్యంలో మంచి పేరు ప్రతిష్టలున్న ఈయన చేతుల్లోనే గోల్కొండ రాజ్యపు వజ్రాల వ్యాపారం వుండేది. ఈయన గోల్కొండ రాజ్యంలోని విస్తారమైన గనుల నుంచి అపార రత్నరాసులను ప్రోది చేసుకోవడమేగాక రాజమాతతో అక్రమ సంబంధం పెట్టుకొని దొరికిపోయాడు. అందువల్ల ప్రాణభయంతో గోల్కొండ నుంచి పారిపోయి, మీర్ జుమ్లా దక్కన్ గవర్నర్‌గా పనిచేస్తున్న ఔరంగజేబును 1656లో కలిశాడు. ఆ తరువాత ఢిల్లీకి వెళ్ళి ఔరంగజేబు తండ్రి షాజహానును కలిశాడు. ఇతను తండ్రీ కొడుకు లిద్దరికీ అమూల్యమైన రత్న సంపదను బహూకరించాడు. అందులో "బాబరు వజ్రం" కూడా ఒకటని అంటారు. ఈస్టిండియా కంపెనీ ఏజెంటు ఒకరు విూర్ జుమ్లా 160 రతులున్న అమూల్య వజ్రాన్ని షాజహానుకు కానుకగా ఇచ్చాడని వ్రాశాడు.

మరొక అభిప్రాయం ప్రకారం గోల్కొండ మంత్రిగా ఉండి స్వతంత్ర ప్రభువైన విూర్ జుమ్లా ఔరంగజేబుకు స్నేహితుడైనాడు. ఈ విూర్ జుమ్లా ఆహ్వానం విూదే ఔరంగజేబు దక్షిణ దిగ్విజయ యాత్రను చేపట్టి కృతకృత్యుడైనాడు. ఔరంగజేబు చక్రవర్తికి విూర్ జుమ్లా, నమ్మినబంటుగా వుండి, ఆయనకు సేనాధిపతిగా, రాజప్రతినిధిగా చరిత్రపుటలకెక్కాడు. అహ్మద్‌నగర్ నవాబు నుంచి ఈ బాబరు వజ్రాన్ని విూర్ జుమ్లా చేజిక్కించుకుని, మెప్పు కోసం ఔరంగజేబుకు కానుకగా ఇచ్చాడు.

క్రీ.శ. 1638-1662 మధ్య ఆరుసార్లు తూర్పుదేశాలలో సంచరించిన టెవర్నియర్ అనే ఫ్రెంచి వర్తకుడు ఈ విషయం వ్రాస్తూ సానబట్టని స్థితిలో 900 రతులు లేక 787 క్యారట్ల తూనికగల ఒక గొప్ప వజ్రం కొల్లూరులో దొరికిందని, దానిని విూర్ జుమ్లా 1656-57 మధ్య షాజహాను చక్రవర్తికి సమర్పించాడని పేర్కొన్నాడు.

1707లో ఔరంగజేబు చక్రవర్తి చనిపోయే నాటికి మొగలాయి సామ్రాజ్యం మహోన్నత స్థితిలో ఉంది. షాజహాను చేయించిన అమూల్యమైన మయూర సింహాసనంతో పాటు, రత్నఖచితమైన ఇంకా తొమ్మిది సింహాసనాలు, అమూల్యమైన రత్నరాసులు, ధనకనక వస్తు వాహనాలతో పాటు అపూర్వమైన బాబరు వజ్రం ఖజానాలో వున్నాయి.

ఔరంగజేబు తదనంతర మొగలు చక్రవరులు బలహీనులు, భోగలాలసులు. అందువల్ల సామ్రాజ్య ప్రాభవం సన్నగిల్లడం ప్రారంభమైంది. 13 సంవత్సరాలలో ఆరుగురు పాలకులు మారారు. అందరూ అసహజ మరణాలకు గురైనవారే. చక్రవర్తులు బలహీనులు కావడంతో సామ్రాజ్యం కూడా బలహీనమైపోయింది. భోగభాగ్యాలను దోచుకోవాలనే దురాశ చుట్టుప్రక్కల రాజులకు, విదేశీయులకు కలిగింది. 1786లో పర్షియా రాజైన నాదిర్‌షా 1789లో భారతదేశం మీదికి దండెత్తి వచ్చాడు. అప్పటి మొగల్ చక్రవర్తి మహ్మద్‌షా 1719లో సింహాసనాన్ని అధిష్టించాడు. ఎల్లపుడూ అతని బాహువులలో మగువ, చేతిలో మధుపాత్ర వుండవలసిందేనట. నాదిర్‌షాతో కర్నాల్‌లో జరిగిన రెండుగంటల యుద్ధంలోనే అపారమైన మొగలాయి సైన్యం చెల్లాచెదరైపోయింది. 20 వేల మందికి పైగా సైన్యం హతులైనారు. అంతకంటే పెద్ద సంఖ్యలో బందీలైనారు. నాదిర్‌షా సరాసరి ఢిల్లీ కోటలో చొరబడి, అక్కడి సంపదనంతా తన వశం చేసుకున్నాడు. అతడి సైనికులు ఢిల్లీ నగరం విూద పడి దోచుకున్నారు. మొగల్ చక్రవర్తికి నాదిర్‌షాను మంచి చేసుకుని అతనికి ఆతిథ్యమివ్వక తప్పలేదు.

నాదిర్‌షా హస్తగతం చేసుకున్న సంపద విలువ ఇంత అని చెప్ప వీలు లేదు. ఇది 70 కోట్ల నవరసులుంటుందని ప్రెజర్ అనే అతను వ్రాశాడు. నగలే 25 కోట్ల విలువ గలవి. రత్నఖచిత మయూర సింహాసనం, ఇంకా తొమ్మిది సింహాసనాలు, వెండి, బంగారు, రత్న ఖచిత ఆయుధాలు, ఇతర వస్తువులు తొమ్మిది కోట్ల విలువ చేస్తాయట. నాదిర్‌షా 60 లక్షల వెండి నాణాలు, అనేకవేల బంగారు నాణాలు, కోటి విలువగల బంగారు సామాను, 50 కోట్ల విలువగల బంగారు నగలు పట్టుకుపోయినట్లు అతని కొలువులో వజీరుగా చేరిన ఒక భారతీయుడి క్రింది ఉద్యోగి అయిన ఆనందరాం వ్రాశాడు. నాదిర్‌షా యొక్క చరిత్రకారుడి లెక్కప్రకారం నాదిర్‌షా ఒకకోటి తొంభై వేల నవరసుల ఖరీదుగల నాణేలను పట్టుకుపోయాడు. స్కాట్లాండ్ దేశపు గ్రంథకర్త ఒకరు 11 కోట్ల 90 లక్షల నవరసుల ఖరీదుగల సంపదను నాదిర్‌షా తరలించుకుపోయాడని వ్రాశాడు.

కోహినూర్ వజ్రాన్ని నాదిర్‌షా చేజిక్కించుకున్న వైనం ఈ విధంగా వుంది. ఈ వజ్రం వున్న ప్రదేశం అతనికి ఎవరూ చెప్పలేక పోయారు. చివరికి అహ్మద్‌షా అంతఃపుర స్త్రీ ఒకరు ఈ వజ్రం ఆయన తలపాగాలోనే దాచుకుంటాడని చెప్పింది. దాన్ని చేజిక్కించుకోవడానికి నాదిర్‌షా ఒక పథకం వేశాడు. ఒక విందు సమావేశం ఏర్పాటు చేసి, అందులో తమ స్నేహానికి గుర్తుగా తామిద్దరూ తలపాగాలు మార్చుకుంటామని ప్రకటించాడు. అప్పట్లో రాజులలో ఈ ఆచారం ఉండేది. అహ్మద్‌షాకు తలపాగా ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. అహ్మద్‌షా తలపాగాతో తన విడిదికి వెళ్ళిన నాదిర్ షా తలపాగా మడతల్లోని ఈ అమూల్య వజ్రాన్ని చూసి కోహినూర్ అని ఒక పొలికేక పెట్టాడట. "కోహ్-ఇ-నూర్" అంటే తేజః పర్వతం. ఒక పర్వతమంత వెలుగును ఈ వజ్రం ఇస్తుందని అతని భావన. అప్పటి నుంచీ ఈ వజ్రానికి "కోహ్-ఇ-నూర్" - కోహినూర్ అన్నపేరు స్థిరపడిపోయింది.

నాదిర్‌షాలో దురాశ పెచ్చరిల్లిపోయింది. ధనం కోసం తన-పర భేదం లేకుండా అందరినీ బాధించడం ప్రారంభించాడు. చివరికి తన మనుషుల చేతిలోనే 1747లో నాదిర్‌షా దారుణ హత్యకు గురయ్యాడు. కోహినూర్ వజ్రం మళ్ళీ చేతులు మారడం మొదలైంది. చివరికి ఆఫ్ఘన్ రాజ కుటుంబం వద్దకు చేరింది. 1810లో అహ్మద్‌షా అనే విప్లవ నాయకుడు రాచరికంపై తిరుగుబాటు చేశాడు. అప్పటి వరకు సింహాసనం కోసం పెనుగులాడుతూ ఒకరినొకరు పదవీభ్రష్టులను చేసుకుంటున్న ఆఫ్ఘన్ రాజకుమారులు మహ్మద్ షాషుజాలు ఇరువురూ దేశం వదిలి పారిపోయి 'పంజాబు సింహంగా పేరు పొందిన సిక్కు నాయకుడు రంజిత్‌సింగ్ శరణు జొచ్చారు.

షాషుజా వద్ద కోహినూర్ వజ్రం వున్న విషయం గ్రహించిన రంజిత్‌సింగ్ నయాన, భయాన అతని నుంచి ఆ వజ్రాన్ని 1813 జూన్ 1వ తేదీన రాబట్టుకున్నాడు. పంజాబ్ నేలిన బలీయుడైన సిక్కురాజులలో మొదటివాడు - చివరివాడు రంజిత్‌సింగే.

ఆయన తరువాత ఆయన కుమారులు ముగ్గురు ఒకరి తరువాత ఒకరు పంజాబును ఏలారు. వీరందరూ బలహీనులు; అందరూ అర్ధాంతరంగా చనిపోయినవారే. 1843లో రంజిత్‌సింగ్ చివరి కుమారుడు ధులీప్‌సింగ్ రాజ్యానికి వచ్చాడు. ఇతను మైనర్. ఇతని కాలంలో రెండు సిక్కు యుద్దాలు జరిగి, పంజాబు బ్రిటిష్ వారి పరమైంది. 1849 మార్చి 29న లాహోర్ రాజప్రాసాదం విూద బ్రిటిష్ పతాకం ఎగిరింది. పంజాబును బ్రిటిష్ సామ్రాజ్యంలో కలుపుతూ లాంఛనంగా చేసుకున్న ఒప్పందంలో "షాషుజా ఉల్ముల్క్ నుంచి రంజిత్ సింగ్ స్వాధీనం చేసుకున్న కోహినూర్ వజ్రాన్ని లాహోర్ మహారాజు బ్రిటిష్ రాణికి అప్పగించాల”న్నది ఒక అంశం.

కోహినూర్ వజ్రాన్ని ముగ్గురు బ్రిటిష్ సభ్యులతో ఏర్పాటైన పంజాబు ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. ఈ ముగ్గురిలో ఒకరైన జాన్ లారెన్స్‌కు దీని రక్షణ బాధ్యత అప్పగించడమైంది. అయితే ఈయన ఈ వజ్రాన్ని భద్రపరచిన పేటికను తన కోటు జేబులో వుంచుకుని, ఆ విషయం మరిచిపోయి కోటును విడిచి ప్రక్కన పడేశాడు. ఈ సంఘటన జరిగిన ఆరువారాలకు గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ నుంచి వర్తమానం వచ్చింది రాణీగారు వజ్రాన్ని బ్రిటన్‌కు తరలించే ఏర్పాటు చేయమని ఉత్తర్వులు జారీ చేశారని. ఈ విషయం ముగ్గురు సభ్యుల సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. అప్పడు కానీ జాన్ లారెన్స్‌కు గుర్తుకు రాలేదు - వజ్రాన్ని తాను కోటు జేబులో వదిలేశానని. ఆయన గొంతు తడారిపోయింది. తన నివాసానికి చేరిన వెంటనే వజ్రాన్ని వుంచిన్న పెట్టె గురించి పనివాణ్ణి అడిగాడు - "కొన్ని రోజుల క్రితం నా కోటు జేబులో నుంచి ఒక చిన్న పెట్టె తీశావా" అని. ఆ పనివాడు పెట్టెను కోటు జేబులో నుంచి తీసి లారెన్స్ కప్‌బోర్డులో ఉంచానని చెప్పాడు. లారెన్స్‌కు ప్రాణాలు లేచివచ్చాయి. ఆ పెట్టెను తెమ్మని పనివాడికి చెప్పగా అతనాపెట్టెను తెచ్చి, లారెన్స్ ముందే తెరిచి, గుడ్డ పేలికల మధ్య నుంచి వజ్రాన్ని బయటికి తీసి, తన చేతిలో వున్న వస్తువు ఎంతటి అమూల్యమైందో తెలియక, "దొరా ! ఇందులో ఏమి లేదు - ఒక చిన్న గాజు ముక్క తప్ప" అని చెప్పాడు. లారెన్స్ వెంటనే ఆ వజ్రం ఉన్న పెట్టెను నౌకరు నుంచి దొరక పుచ్చుకుని మిగిలిన ఇద్దరు సభ్యుల వద్దకు వెళ్ళి చూపించాడు. ఈ విధంగా కోహినూర్ వజ్రం దాదాపుగా పోయి, దాని విలువ గ్రహించలేని నౌకరు మూలంగా మళ్ళీ దొరికింది. ఈ వజ్రాన్ని బ్రిటిష్ మహారాణికి పంపడానికి అన్ని ఏర్పాట్ల చకచకా జరిగి పోయాయి. మొదట కోహినూరును లాహోరు నుంచి బొంబాయికి తరలించారు. దారి పొడుగునా దొంగలు, దోపిడిదార్లు ఉన్న ఆ రోజుల్లో ఈ పనే ఎంతో కష్టసాధ్యమయింది. దానిని అద్వితీయమైన రత్నంగా కొనియాడిన గరవ్నర్ జనరల్ డల్హౌసీ స్వయంగా ఈ పనికి పూనుకొని, కోహినూరును లండన్‌కుభద్రంగా పంపడానికి వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నాడు. 1850 మే 16న డల్హౌసీ ఈ విధంగా వ్రాశాడు.

"బొంబాయి నుంచి కోహినూరు 'హెచ్.యం.యస్. - విూడియా" అన్న ఓడలో ఏప్రిల్ 16న బయలుదేరింది. దీన్ని లాహోరు నుంచి ఎంత రహస్యంగా బొంబాయికి తీసుకురావలసి వచ్చిందంటే, నేనే స్వయంగా నా చేతులతో ఈ పని చేశాను. దీన్ని తెచ్చి బొంబాయిలోని ట్రెజరీలో భద్రపరిచే వరకు నేననుభవించిన ఆందోళన అంతకు ముందెప్పడూ నా జీవితంలో లేదు. దాన్ని ట్రెజరీలో భద్రపరిచిన పిమ్మట నా ఆనందానికి అవధుల్లేవు. ఎంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. నా నడుముకు కట్టుకున్న బెల్టుకు కోహినూర్ వజ్రం ఉన్న పెట్టెను పెట్టిన సంచిని ఒకటికి రెండు సార్లు గట్టిగా కుట్టాను. ఆ బెల్లు ఒక చివరను ఒక గొలుసుతో నా మెడకు బంధించాను. రాత్రి - పగలు తేడా లేకుండా దాన్ని నా ఒంటికి అలాగే ఉంచుకున్నాను. నా అదృష్టం బాగుండి, దాన్ని భద్రంగా ఘాజీఖాన్‌తో కలిసి, కాప్టెన్ రాంసేకు అందజేసి, అతను దాన్ని ట్రెజర్ ఛెస్ట్‌లో భద్రపరచడం స్వయంగా వీక్షించి, బయటకు వచ్చి కుదుటపడ్డాను. దాన్ని వదలించుకుని ఎంతో రిలీఫ్ పొందాను. బొంబాయిలో దీన్ని రెండు నెలలపాటు ఓడ అందుబాటులో లేక ఉంచాల్సి వచ్చింది, అది జూలై నాటికి భద్రంగా మహారాణీ వారికి చేరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. దీనిని ఆధికారికంగా అధికారగణానికి, మహారాణీ వారికి మెయిల్ ద్వారా తెలియజేసుకున్నాను".

దీన్ని లండన్‌కు తరలించడానిక ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కోహినూర్ వజ్రాన్ని మొదట ఒక ఇనుపపెట్టెలో పెట్టారు. దాన్ని ఒక డిస్పాచ్‌బాక్స్‌లో ఉంచి ప్రభుత్వ ఖజానాలో ఉంచడం జరిగింది. ఇందులో ఏముందో ఇటు ట్రెజరీ అధికారులకు కానీ, అటు ఓడలో షిప్ కాప్టెన్ కమాండర్ లక్కియర్‌కు గాని తెలియనివ్వలేదు. దాన్ని గురించిన రహస్యం తెలిసిన వారిద్దరే - వారు లెఫ్టినెంట్ కల్నల్ మ్యాక్సన్, కెప్టెన్ రాంసే. ఈ అమూల్య వజ్రాన్ని బ్రిటిష్ రాణికి సురక్షితంగా చేర్చే బాధ్యత వారిద్దరికే అప్పగించడమైంది. ప్రయాణంలో ఓడ రెండు సార్లు అనుకోని చిక్కుల నుంచి బయటపడి, కోహినూర్ భద్రత గురించి భయాలు వెంట్రుక వాసిలో తప్పిపోయాయి. ఓడ మారిషస్ దీవిని చేరుకున్నప్పడు ఓడలోని ప్రయాణీకులకు కలరా వ్యాపించింది. అందువల్ల స్థానిక ప్రజలు ఓడ సిబ్బందికి అవసరమైన పదార్ధాలు అమ్మడానికి నిరాకరించారు. రేవు నుంచి ఓడను వెంటనే ఖాళీ చేయమని స్థానిక అధికారులు ఆదేశించారు. ఓడ వెంటనే బయలుదేరకపోయే సరికి ఓడపై కాల్పులు జరిపి, దాన్ని ధ్వంసం చేయడానికి అనుమతించవలసిందిగా గవర్నర్‌ను కోరారు. ఆ పరిస్థితుల్లో మారిషస్ ను వదిలిన "మీడియా"కు కొన్ని రోజుల్లోనే మరో ప్రమాదం ఎదురైంది. సముద్రంలో ప్రచండమైన ఝంఝామారుతం చెలరేగి, పన్నెండు గంటల పాటు నానా బీభత్సం సృష్టించింది. ఇబ్బందులన్నీ అధిగమించి, ఓడ ఇంగ్లాండ్‌లోని ఫ్లెమౌత్ రేవుకు చేరుకుంది. అక్కడ ప్రయాణీకులను, మెయిల్ను దింపివేశారు. కానీ కోహినూర్‌ను మాత్రం దింపలేదు. దాన్ని పోర్టుమౌత్‌లో దింపారు. అక్కడి నుంచి కోహినూర్‌ను ఈ ఇద్దరు అధికారులు ఈస్టిండియా హౌస్‌కు తీసుకువెళ్ళి, కంపెనీ చైర్మన్‌కు, డిప్యూటీ ఛైర్మన్‌కు దాన్ని అప్పగించారు. కంపెనీ డిప్యూటీ ఛైర్మన్, బకింగ్హాం పాలెస్‌లో కోహినూర్‌ను 1850 జూలై 3వ తేదీన విక్టోరియా మహారాణికి అందజేశాడు.

లండన్‌లోని హైడ్ పార్క్లో ఏర్పాటుచేసిన గ్రేట్ ఎగ్జిబిషన్‌లో కోహినూర్ వజ్రాన్ని ప్రజల సందర్శన కోసం ఉంచారు. మొత్తం ఎగ్జిబిషన్ కంతటికి కోహినూరే పెద్ద ఆకర్షణగా మారి ప్రజలు దీన్ని చూడటానికి తండోప తండాలుగా విరగదొక్కుకుని వచ్చారని, దీని రక్షణ కోసం ఎన్ని ఏర్పాట్ల చేసినా తక్కువే అనిపించాయని "ది టైమ్స్" దిన పత్రిక వ్రాసింది.

కోహినూర్ వజ్రాన్ని సరిగ్గా సానబట్టలేదని, దీన్ని అన్ని కోణాల్లో తగిన విధంగా సానబట్టితే, కోహినూర్ అందాలు ద్విగుణీకృతమవుతాయని బ్రిటిష్ వజ్ర నిపుణులు భావించారు. ఆ ప్రకారం ఎంతో మంది శాస్త్రవేత్తలను, వజ్రనిపుణులను రావించి, కోహినూర్ను పరిశీలింపజేసి, సుదీర్ఘంగా చర్చలు జరిపి, కోహినూర్ సహజ అస్థిత్వానికి భంగం వాటిల్లకుండా దానిని తిరిగి సానబట్టడానికి ఒక సమగ్ర కార్యాచరణ పథకాన్ని రూపొందించారు. ఈ సానబట్టే పనిని ఎప్పటికప్పుడు వివరంగా రికార్డు చేయాలని కూడా నిర్ణయించారు. ఆ విధంగా కోహినూర్‌ను సానబట్టే పని 38 రోజులు కొనసాగింది. దీనికి 8,000ల బ్రిటిష్ ఫౌండ్లు (40,000ల అమెరికన్ డాలర్లు) ఖర్చయ్యాయి. చివరికి 108.98 మెట్రిక్ కారెట్స్‌తో కోహినూర్ వజ్రం నిగ్గు తేలింది. ఈ క్రమంలో వజ్రం తన పరిమాణంలో 43 శాతం నష్టపోయింది.

ఈ అమూల్య వజ్రాన్ని భారత్ నుంచి స్వాధీనం చేసుకోవడంపై ఇంగ్లండ్‌లో అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ఇది ఇంగ్లండ్ సొత్తు కాదనీ, దౌర్జన్యంగా దానిని స్వాధీనం చేసుకోవడం అనైతికమని వాదిస్తున్నవారి నోళ్ళ కట్టేయడానికి ఒక పథకం వేయబడింది. పంజాబ్ రాజ్యవారసుడు ధులీప్ సింగ్ మైనర్ అన్న కారణంగా అతని రాజ్యాన్ని కోహినూర్ వజ్రాన్ని స్వాధీనం చేసుకున్న ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం, అతని సంరక్షణ భాధ్యతలను లోగిన్ అన్న అతనికి అప్పగించింది. లోగిన్ మరణానంతరం ఈ బాధ్యత అతని భార్య లేడీ లోగిన్‌కు అప్పగించబడింది. ఒకరోజు ధులీప్సింగ్‌ను లేడి లోగిన్ విక్టోరియా మహారాణి సమక్షానికి తెచ్చింది. విక్టోరియా రాణి ధులీప్ సింగ్ ను దగ్గరికి తీసుకుని, తిరిగి చెక్కడం మూలంగా ఆకారం మారిపోయిన కోహినూర్ వజ్రాన్ని అతనికి ఇచ్చి, దీనిని గుర్తుపట్టగలవా అని ప్రశ్నించింది. ధులీప్‌సింగ్ ఆ వజ్రాన్ని చూసి అస్పష్టంగా ఏదో చెప్పి, విక్టోరియా రాణికి దాన్ని తిరిగి ఇచ్చివేశాడు. దీనితో ధులీప్‌సింగ్ ఇష్టపూర్వకంగానే కోహినూర్ వజ్రాన్ని విక్టోరియా మహారాణికి సమర్పించాడని ప్రచారం చేశారు. అయితే, ఈ ప్రచారాన్ని ఎవరు నమ్మలేదు. ధులీప్‌సింగ్ విధిలేని పరిస్థితులలోనే కోహినూనూర్ ను విక్టోరియా రాణికి ఇచ్చాడన్నది జగమెరిగిన సత్యం.

కోహినూర్ వజ్రం ఇంగ్లాండ్ చేరిన పిమ్మట ఆదేశంలో కొన్ని అరిష్టాలు సంభవించాయి. ఇదంతా కోహినూర్ వల్లే జరిగిందని ప్రచారం జరిగింది. కోహినూర్ ఎవరివద్ద వుంటే వారికి కీడు జరిగిందని, అశాంతికి, రక్తపాతానికి కోహినూరు కారణమవుతూ వచ్చిందని పెద్ద దుమారం రేగింది. దీనిని తిప్పికొడుతూ డల్‌హౌసీ 7.1.1858న మాల్టా నుంచి ఒక లేఖ వ్రాశాడు. అందులో :

"కోహినూర్ వల్ల దానిని గోల్కొండ నుంచి పొందిన అక్బర్ చక్రవర్తికి ఏ అపకారం జరగలేదు. అతని కుమారునికి, మనుమనికి కూడా ఏ కీడు జరగలేదు. మొగల్ చక్రవర్తులలో అత్యంత ప్రసిదుడైన ఔరంగజేబుకూ దానివల్ల ఏ అరిష్టం జరగలేదు. నాదిర్‌షా, అహ్మద్‌షా దులానీ దీనివల్ల లబ్దినే పొందారు. మహారాజా రంజిత్‌సింగ్ ఈ వజ్రాన్ని తన వద్ద నుంచుకొని మొత్తం సిక్కు జాతికే తిరుగులేని నాయకుడుగా ఎదిగాడు. చరిత్రలో చక్రవర్తులకు, మహారాజులకు, మహాయోధులకు ఈ వజ్రం విజయచిహ్నంగా నిలిచింది. ఒకవేళ దీనివల్ల అరిష్టం ఉందని మహారాణి వారు భావిస్తే, ఆ వజ్రాన్ని నాకు ఇచ్చివేయండి. అరిష్టమేదో నేనే భరిస్తాను".

విక్టోరియా మహారాణి కోహినూర్‌ను డల్‌హౌసీకి తిరిగి ఇచ్చివేయలేదు. అది బ్రిటిష్ రాణుల ముఖ్య ఆభరణాలలో ఒకటయి పోయింది. 1911లో క్వీన్ మేరీ పట్టాభిషేకం సందర్భంగా తయారు చేసిన వజ్రాల కిరీటంలో కోహినూర్ వజ్రం కిరీటం ముందుభాగంలో మధ్యన నిలిచి ప్రముఖ స్థానం పొందింది.

20వ శతాబ్దంలో కోహినూర్ వజ్రం ఎవరికి చెందాలి అన్న విషయమై పెద్ద వివాదమే చెలరేగింది. రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా ఈ వివాదాన్ని బాగా వాడుకున్నాయి. 1947లో భారత ప్రభుత్వం కోహినూరు వజ్రాన్ని తిరిగి ఇచ్చి వేయమని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరింది. కోహినూర్ వజ్రం రంజిత్‌సింగ్‌కు సంక్రమించిందని చరిత్ర చెబుతున్నా ఈ విషయాన్ని రంజిత్ సింగ్ కోశాధికారి బలపరుస్తున్నా ఒరిస్సా ప్రభుత్వం ఈ వజ్రం జగన్నాథ స్వామిదనీ కాబట్టి దానిని తమకు అప్పగించాలని కోరింది.

1953లో క్వీన్ ఎలిజబెత్-II పట్టాభిషేక సందర్భాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం మరోసారి కోహినూర్‌ను భారత్ కు అప్పగించమని కోరింది. అయితే నిజమైన పోరు 1976లో పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికల్ ఆలీ భుట్టో కోహినూరు పాకిస్తానుకు చెందుతుందని ప్రకటించడంతో ప్రారంభమైంది. ఆయన వాదన ప్రకారం రంజిత్ ఏలిన పంజాబ్ రాజధాని లాహోర్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది, కాబట్టి ఆ వజ్రం పాకిస్తాన్‌ది. ఈ వాదనను బ్రిటిష్ ప్రభుత్వం త్రిప్పికొడుతూనే, కోహినూర్ వజ్రాన్ని ఎవరికీ ఇచ్చేది లేదని, దీనిని ఏ యుద్ధంలోను బ్రిటన్ స్వాధీనం చేసుకోలేదని, దీనిని బహుమతిగా పొందడం జరిగిందని తమ ఉద్దేశ్యం తేల్చి చెప్పింది. అయితే పాకిస్తాన్ ఈ వాదనతో ఏకీభవించలేదు. పంజాబ్ రాజవంశీకుల నుంచి దీనిని ఒప్పందంలో భాగంగా స్వాధీనపరచుకున్నట్లు చరిత్ర చెబుతున్న విషయాన్ని గురు చేసింది. భారత్ ఈ వాదనను వ్యతిరేకిస్తూ, కోహినూర్ తమకే చెందుతుందని నొక్కి చెప్పింది. టెహరాన్లోని ఒక ప్రముఖ వార్తాపత్రిక ఈ వజ్రం ఇరాన్‌కు చెందుతుందని ప్రకటించింది. డల్‌హౌసీ మునిమనుమడు ఒకడు ఇది డల్‌హౌసీ ఆధీనంలో ఒక సంవత్సరానికి మించి వున్నందున, ఈ వజ్రం ఆయన వారసుడుగా తనకే చెందుతుందని వాదించాడు.

బ్రిటిష్ పరిపాలనా దక్షులలో ఒకడుగా పేరుపొందిన సర్ ఓలాఫ్ క్యారో 'ది టైమ్స్' పత్రికలో ఈ విధంగా వ్రాశాడు. "కోహినూరు మొగలుల ఆధీనంలో 213 సంవత్సరాలు, ఆఫ్ఘన్ల ఆధీనంలో కాందహార్‌లోను, కాబూల్‌లోను 66 సంవత్సరాలు, బ్రిటిష్ వారి ఆధీనంలో” 127 సంవత్సరాలు ఉంది. బ్రిటిష్‌వారు దీనిని లాహోరు నుంచి స్వాధీనం చేసుకున్న మాట వాస్తవమే. అయితే అంతకు ముందటి వారసులు కూడా ఇంకా వున్నారు. ఢిల్లీని పాలించిన మొగలులు వాస్తవానికి టర్కీ దేశస్తులు. బ్రిటిష్ వారు వజ్రాన్ని స్వాధీనం చేసుకునే నాటికి లాహోరును పాలించినవారు సిక్కులు. కాబట్టి దీనిని ఎవరికి తిరిగి ఇవ్వాలి అన్నది తేల్చడం కానిపని" చారిత్రకంగా కోహినూర్ ఎవరికి చెందుతుందన్న విషయం తేల్చడం కష్టసాధ్యమే. కానీ రత్నశాస్త్రపరంగా చూస్తే ఇది భారతదేశపు మట్టిలో పుట్టింది. కాబట్టి దీనిపై భారతదేశపు హక్కు ఎవరూ కాదనలేనిది.

ఏది ఏమైనప్పటికీ తెలుగుగడ్డపై పుట్టిన ఒక అనర్ఘరత్నం దేశదేశాలు తిరిగి, రాజ్యాధినేతల తలరాతలు మార్చి ప్రపంచ ప్రసిద్ధి పొంది, ఈ నాటికీ, ఏనాటికీ విలువ కట్టలేని అపూర్వ వస్తువుగా నిలిచి పోయింది.

దురానీ చక్రవర్తి షాషుజా భార్య బేగం షా చెప్పినట్లుగా డల్‌హౌసీ కోహినూర్ వజ్రం విషయంలో వ్రాసిన ఈ క్రింది వాక్యాలు అక్షర సత్యాలు :

ఒక బలిష్టుడైన వ్యక్తి ఐదు గులకరాళ్ళను తీసుకుని, తన శక్తి కొద్ది ఒక రాయిని తూర్పువైపుకు, ఒక రాయినీ పశ్చిమ దిశగా, ఒకటి ఉత్తర దిశగా, మరొకటి దక్షిణ దిశగా విసరిచేసి, ఐదవరాయిని తన తలపైకి వెళ్ళగలిగినంత ఎత్తుకు విసరగా, ఈ నాలుగు రాళ్ళు పడ్డ విస్తీర్ణంలో పైకి విసరిన రాయి వెళ్ళినంత ఎత్తులో ఈ ప్రపంచంలోని బంగారును, వజ్రాలను నింపితే కూడా ఆ సంపద విలువ కోహినూరు వజ్రానికి సరి సమానం కాలేదు".

మన మట్టిలో పుట్టిన అపూర్వమైన, అమూల్యమైన కోహినూర్ వజ్రాన్ని మనం దక్కించుకోలేకపోయినందుకు అపరిమితమైన బాధ, శతాబ్దాల పాటు ఎక్కడెక్కడో తిరిగి, మరుగునపడిపోకుండా చివరకు బ్రిటిష్ మహారాణుల కిరీటంలోస్థానం పొంది, లండన్ టవర్ మ్యూజియంలో సందర్శకులను అలరిస్తూ, తను పుట్టినగడ్డకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చినందుకు ఆనందం ఒక్కసారిగా నన్ను ముంచెత్తాయి.

ఈ కోహినూర్ వజ్రం తెలుగునాట లభించడం తెలుగువారుగా మనందరికీ గర్వకారణం. ప్రముఖ కవి తుమ్మల సీతారామమూర్తిగారి "తెలుగుతల్లీ! నీకు జోహారు, దేశమాతా! నీకు జోహారు" అనే గీతంలో -

"కొల్లూరి కోహినూరు కొప్పలో బూవటే
 కోలారు గనులు నీ కోశంబటే....."

అనే చరణాలు ఈ సందర్భంగా గుర్తుకొచ్చాయి.

★★★