రుక్మిణీపరిణయము/ప్రథమాశ్వాసము

ప్రథమాశ్వాసము

కథాప్రారంభము

క.

అనుపమగుణుఁ డగుసూతుఁడు, మునుకొని మును శౌనకాదిమునులకు వినయం
బున భాగవతపురాణము, ఘనభక్తిఁ బ్రవిస్తరంబుగా నెఱిఁగించెన్.

33


గీ.

అవ్విధంబు పరీక్షిజ్జనాధిపునకు, ఘనుఁడు శుకయోగి దెల్పుచోఁ గౌతుకంబు
పల్లవింపంగ రుక్మిణీపరిణయప్ర, కార మెఱిఁగింపుఁ డని రాజు గోరుటయును.

34


క.

ధీవరుఁ డాశుకుఁడు జగ, త్పావన మగుతత్కథావిధం బెఱిఁగింతున్
గేవలభక్తి చెలంగ మహీవల్లభ విను మటంచు నిట్లని పలికెన్.

35


సీ.

శ్రీకారణాభ్యున్నతాకారసన్మణిప్రాకారసౌధవ్రజాకరంబు
సోపానవవజ్రగోపానసీచిత్రరూపానవద్యోరుగోపురంబు
గంభీరహితవినకుంభీరయుక్తాంబుగంభీరపరిఖావిజృంభణంబు
లీలావరోధేందుశాలావకీర్ణేంద్ర నీలావళీకుడ్యజాలకంబు


తే.

లసదసమసమసుమశరవ్యసనవసుని, వసనసంత్యక్తరత్నసారసనవసన
రసికయోషానుమోదకశ్వసనశిశువి, సరవిశాలంబు కుండినపురవరంబు.

36


మ.

మహి నవ్వీడు చెలంగు నిందుమణిహర్మ్యస్థాంగనాచారువి
గ్రహవిద్యుత్కచనీలవారిధరవిభ్రాంతిస్వచేతోముహు
ర్ముహురుద్భాసితవారియంత్రపతితాంభోబిందుసందోహసం
గ్రహణోదంచితిచాతకప్రకరమై రంగత్ప్రకాశోన్నతిన్.

37


చ.

అలరఁగ సంచరించుతురగావలివీచులు తూర్యఘోషముల్
సలలితభామినీరదనసారసముల్ ఘనరాజహంసముల్
చెలఁగుపదాఱువన్నియపసిండిమెఱుంగుటరుంగుదిన్నెలున్
గలిగి పురంబు భాసిలు జగద్వినుతామరగంగయో యనన్.

38


ఉ.

అన్నగరంపుఁగుందనపుహర్మ్యతలంబుల నాడుబాలికల్
పున్నమరేలుచందురునిఁ బొల్సుగఁ గన్గొని యాటవేడుకం
జెన్నుగ నెన్నొస ళ్లెదురుసేయుచు దీకొని తాఁక నుర్విపై
నెన్నఁ గళంకి యయ్యె శశి యింతులకస్తురిబొట్టు లంటుటన్.

39


ఉ.

ఆపురగోపురాగ్రసముదంచితకాంచనకుంభముల్ మహో
ద్దీపితలీలలన్ మెఱయుధీరత్ నందుల సుందరీజనం
బే పలరుం బయోధరము లీపగిదిం దమ కంచు నిర్జరేం
దూపమచారువక్త్రలకు నొయ్యనఁ జూపఁగ నిల్పిరో యనన్.

40


గీ.

వజ్రముక్తాబ్జరాగప్రవాళనీల, వితతిచే నొప్పుఁ బురిపణ్యవీథి పుండ
రీకకుముదాబ్జహల్లకాస్తోకనీల, కువలయశ్రేణిచే నొప్పుకొలనువోలె.

41

చ.

నగరివిశాలదేవభవనంబులపై విలసిల్లు నెల్లెడం
జిగిబిగికుందనంపుఁబని చేసినరత్నపుఁగీలుబొమ్మ లా
గగనమునందు నుండి పురిఁ గల్గువిలాసముఁ జూడఁగోరి వ
న్నెగ నరుదెంచి పాయ కటు నిల్చినయచ్చరకన్నెలో యనన్.

42


ఉ.

ఆనగరంబుత్రోవను దినాధిపుఁ డేఁగుచు దారి కడ్డమై
పూనికనున్నకోటఁ గని పోవఁగలేక యిరాఱుమేనులం
దానటు దిడ్లు చూఱి చనెఁ దథ్యము గాదని యంటిరేని యా
భానుని ద్వాదశాత్ముఁ డనిపల్కఁగఁ గారణ మేమి నిచ్చలున్.

43


గీ.

సరసులెల్లను బలుమాఱు సంస్తుతింపఁ, గువలయానంద మగుచు నక్కోటచుట్టుఁ
గడునలంకారవైఖరి గడలుకొనఁగ, పరిఖ దనరారు నెపుడు నప్పట్టణమున.

44


చ.

పురి కరిబృంద మందముగఁ బున్నమచందురుఁ గాంచి తెల్లదా
మరవిరి యంచుఁ దొండము లమందగతిం దివి కెత్తఁ దత్సుధా
కరుఁడు ననేకరాహువులుగా మది నెంచి భయంబు మించి దు
స్తరబహుళార్తిఁ గుందుచుఁ గృశత్వము నొందుఁ బదాఱువ్రక్కలై.

45


క.

నాగకకరికర్ణోదిత, సాగరముఖమదకదంబసాంద్రఝరీసం
యోగంబువలన జలధికి, సాగరనామంబు గలిగె జగము లెఱుంగన్.

46


క.

హరిణము లప్పురమునఁ గల, తురగంబులతోడఁ బోరి తుది నోడి మహా
త్వరితమునఁ బవనహిమకర, గిరిజేశుల శరణువొందె గేవలభీతిన్.

47


సీ.

తడఁబాటుగాఁ బల్కి తలకొట్లబడియెఁ దా వేదవేదియె యంచు వేధ నెంచి
జగ మెన్నఁ ద్రిదశవేశ్యకుఁ బుట్టెఁ దాఁ గులశ్రేష్ఠుఁడే యంచు వసిష్ఠు నెంచి
యనుజునిల్లాండ్రఁ గూడెను దాను సాధువర్తనుఁడె యంచును శుకజనకు నెంచి
ప్రకటింప సర్వభక్షకుఁడు తా నాచారవంతుఁడే యంచుఁ బావకుని నెంచి


తే.

వేదతత్వజ్ఞు లత్యంతవిమలకులులు, సాధువర్తను లవిరళాచారయుతులు
నైనధాత్రీసురోత్తము లనుదినంబు, పూన్కిఁ జెన్నొందుచుందు రప్పురమునందు.

48


చ.

అమరఁ బదాఱువ్రక్కలు నిరాఱుదెఱంగులు నైరి చెల్లఁబో
తమకులకర్త లైనశశితామరసాప్తు లంచు వారలన్
విమలయశఃప్రతాపముల విస్తరిలంగ నొనర్తు రొక్కటన్
హిమకిరణార్కవంశ్యు లయి హెచ్చినయప్పురిబాహుజోత్తముల్.

49


చ.

ధన మెపుడుం బుధావలి కుదారత మీఱ నొసంగి యెంతయున్
ఘనులనఁ బోలి యప్పురిఁ బ్రకాశతఁ గాంచిన వైశ్యకోటులన్
ధనదు లటంచు నెన్నక సదా ధనరక్షకుఁ డైనయక్కుబే
రుని ధనదుం డటంచును నరుల్ వచియించుట దోసమేకదా.

50

క.

శూద్రులు గల రురుసుగుణస, ముద్రులు సతతస్వధైర్యమోఘీకృతహే
మాద్రులు ఘోరరణాంగణ, రుద్రు ననంబోలి మహితరుచి నవ్వీటన్.

51


సీ.

తమగానములకు సంతసిలి పున్నాగముల్ ప్రస్ఫుటభోగసంభ్రమత నలరఁ
దమవిహారముల కెంతయు భూజనుల్ చొక్కి సుమనోవికాసవిస్ఫూర్తిఁ దనరఁ
దమముఖాంభోజగంధములకు సరసాళు లుప్పొంగి మదబుద్ధిఁ గప్పుకొనఁగఁ
దమమణినూపురధ్వనులకుఁ బరమహంసలు సోలి మానసాసక్తి నఱుమఁ


తే.

గేరి పగ మీఱి బలుతూపు లేఱి నూఱి, తూఱి నడి నేయుశంబరవైరిఁ బారిఁ
గూరి వేసారి తముఁ గోరి చేరువిటుల, రతులఁ దేలింతు రౌ వారరమణు లందు.

52


ఉ.

తమ్ములు మొల్లలుం దొగలుదాసనముల్ విరిపొన్నలున్ శిరీ
షములు హల్లకంబులును జంపకజాలము లిప్పమొగ్గలున్
సమ్మతి నమ్మఁ జూపి తమచారుతరావయవద్యుతిప్రకా
శ మ్మెఱిఁగింతు రెంతయును జాణల కప్పురిఁ బుష్పలావికల్.

53


సీ.

చెలిమిఁ గైకొనియెదఁ జెం డ్లిమ్ము చెలియున్నఁ గొనుమారుబేరముల్ కొసర కిపుడు
పొదలెడుచివురు సూపెద విది ముద్దియ మేలనఁ బలుగెంపులోలి నింపు
సుమకలంబక్రీడ నమరింపు సఖి యన్న నది నీవి వదలింప కనువుగాద
యెల్లవేళల నుండుమల్లికల్ గా వేడ్క ననఁగ మూపురములోఁ గొనియనిచెద


తే.

ననుచుఁ దముఁ జేరి కేరెడుననుపుకాండ్రఁ, గనుచు నెఱదంటపలుకులు వినుచుమదినిఁ
బెనుచుమదమున ననలమ్ముకొ'నుచు మనుచుఁ, బుష్పలావిక లుందు రప్పురమునందు.

54


సీ.

ఈమంజులకుచంబు లీచానయన నివి కొనఁగోర నొక్కింతగొనబొనర్చు
నంటి ఫలంబు గైకొంట నీయెడఁదగు నన నటకానిమ్మ వెనుకరమ్ము
నెలఁత మాకందంబు ని న్గోరుట లనఁగఁ బలుమాఱు కేలికి నలరియుండు
మోవి పంటను గంటిఁ గావించి చూతునా యనఁ బండుఁ గని యిటు లాడనగునె


తే.

యనుచు ఫలములు గొనఁబూని నటులు నిటులు, మొనసి సరసోక్తు లాడుచు నెనసి తిరుగు
విటుల కింపుగ మఱుమాట వెస నొసఁగుచుఁ, ఫలము లమ్మెడిచెలు లుందు రెలమి నందు.

55


క.

ఆనగర మేలు మేలుగ, మానితకీర్తిప్రతాపమహిమోన్నతిచేఁ
బూనిక మీఱఁగ భీష్మక, భూనాయకుఁ డెపుడు సకలబుధజననుతుఁ డై.

56


సీ.

కువలయంబున కార్తిఁ గూర్పనియినుఁడు చక్రావళి నేఁచక యలరురాజు
ధర్మహింసనమునఁ దనరనిరాముఁడు భోగినీసురతేచ్ఛఁ బోనివిజయుఁ
డతిరాజసమున మిన్నందనిశూరుఁడు గోత్రాహితుఁడుగాని గోవిభుండు
పరమహంసలఁ బోవఁ దఱుమనిఘనుఁడు నెవ్వడిభంగ మొందనివాహినీశుఁ


తే.

డనఁగఁ దేజఃకళానృపవినుతిశౌర్య, జనవిభనదానగాంభీర్యశాలి యగుచుఁ
బూని తనకీర్తి జగ మెల్లఁ బొగడనెగడె, వన్నె మీఱంగ భీష్మకావనివరుండు.

57

సీ.

గుఱుతు దప్పనిభూరిగోత్రధర్మముఁ బూని నిరుపమరాజశేఖరత నలరి
వినుతపాండుఁవర్ణమునఁ బ్రకాశత మీఱి బుధరక్షణోపాయబుద్ధిఁ జెలఁగి
వలనుమీఱ ననంతవాహినీయుక్తుఁడై భువనాభిరామవిభూతిఁ బొదలి
సంతతాహీనభూషణభూషితాంగుఁడై ప్రియకుమారగణాభ్యుదయ మెలర్పఁ


తే.

జారువృషకేతుమహితుఁడై స్మరవిరోధి, కరణి ధరణిఁ జెలంగువేడ్క లన శేష
జనమనోరథసంధానచతురుఁ డగుచు, వాసికెక్కినయానృపాగ్రేసరుండు.

58


సీ.

తనచంద్రహాసనితాంతవైఖరి మిత్రశత్రులఁ జిరసుఖాస్పదులఁ జేయఁ
దనమహాద్రవిణవిస్తారంబు బుధవీరవరులను నిత్యసవనులఁ జేయఁ
దనకమలాకరధామంబు హంసార్థితతుల మానసవిచింతనలఁ జేయఁ
దనదానధారావితతగోసమితి విప్రప్రార్థులఁ బూర్ణజీవనులఁ జేయ


తే.

నుండునుద్దామభుజదండమండనప్ర, చండకోదండపాండిత్యఖండితోగ్ర
భండనోద్దండశౌండారిమండలేశ, మండలుం డామహీస్థలాఖండలుండు.

59


గీ.

అతనిపూఁబోణి యొప్పు మత్తాలివేణి, సైకతశ్రోణి వికసితజలజపాణి
పనమకళ్యాణి నిజనేత్రనిరసితైణి, సతతవితతగుణశ్రేణి సత్యవాణి.

60


చ.

పలుమఱు జాహ్నవిం బరమపావని యందురు గాక యింతయు
నిలుకడలేక పంకముల నిండుకయుండి విషస్వరూపయై
కలఁగుచు వక్రపద్ధతులఁ గాంతునిశీర్ష ముఁ ద్రొక్కి నిల్చుఁ దాఁ
దుల యగు టెట్టు లవ్వికచతోయరుహాయతచారునేత్రకున్.

61


సీ.

నిరతపాతివ్రత్యగరిమ నరుంధతి నసమసంపద్వృద్ధి నబ్ధికన్య
నవిరళవాక్యవైభవమున భారతి నిష్టభోగనిరూఢి నింద్రురాణి
నధికక్షమాలీల నవనీవధూటిని విమలసౌంద్యసారమున రతిని
బరమపావనత నంబరచరద్వాహిని నురుతురైశ్వర్యవిస్ఫురణ నుమను


తే.

బోలు నితరులు తులయనఁ బొసఁగు టెట్టు, లనుచు జను లెల్లఁ దను సముదగ్రసరణిఁ
బ్రస్తుతులు సేయ నభిన్నప్రాభవమునఁ, జెలఁగు నప్పూర్ణతారేశలలితవదన.

62


తే.

ఆసరోజాక్షి క్రమమున నధిపువలన, రుక్మియును రుక్మరథుఁడును రుక్మబాహు
రుక్మకేశులు రుక్మనేత్రుఁడు ననంగఁ, బరఁగుతనయుస నేవురఁ బడసి మఱియు.

63


క.

సిరుల జవరాలియంశము, తిరమై తనకుక్షియందు దీపింపఁగ భా
సురలీల నమరి యాహిమ, కరముఖి యాఱవది యైనగర్భముఁ దాల్చెన్.

64


క.

నునుఁజెక్కులు దెలుపారెం, జనుముక్కులు నలుపువాఱె సమమగుచు వళుల్
పెనుస్రుక్కులు వడిఁ దీఱెం, గనుచొక్కులు మీఱె నంతఁ గంజేక్షణకున్.

65


తే.

కాంతగర్భాంతరంబునఁ గమలవేడ్క, నొయ్యనొయ్యనఁ బెరుగుచు నుంటఁజేసి
మధ్యమున కెప్పుడునుజోక మట్టుమీఱఁ, బేదఱికమంతయును దీఱి పెంపుదనరె.

66

తే.

పుడమిచేడియ యాపువ్వుఁబోణిగర్భ, మునఁ బ్రవేశించుచున్నదో జననమొందఁ
దలఁచియన మన్నురుచియంచుఁ దవిలి మెసఁగెఁ, గానిచో నింతి కది యేమి కారణంబు.

67


క.

అడు గామడయై తోఁచెను, నడచునెడం దృణము మేరునగమై తోఁచెం
దొడరి పనిసేయు నెడ న, ప్పడఁతికి గణుతింప గర్భభారము పేర్మిన్.

68


చ.

తలఁపునఁ గోరికల్ మొలచెఁ దద్దయు దేహము డస్సె గుబ్బ చ
న్నులు కడు నుబ్బె నారు సుమనోవరనీలరుచిం జెలంగెఁ
బొక్కిలి మఱి విస్తరిల్లెఁ బలుగెంపులసొంపుహసించుమోవియున్
వెలవెలఁ బాఱె నప్పు డరవిందదళాయతచారునేత్రకున్.

69


క.

అలినీలవేణి కిటువలె, నెల లలరఁగఁ దొమ్మిదియును నిండి తగం బ్రొ
ద్దులనెల మసలుటయును ని, ర్మల మగునొకపుణ్యవాసరంబున నంతన్.

70


క.

కలశాబ్ధివీచిలక్ష్మీ, లలనం గన్నట్లు మంచిలగ్నంబున సొం
పలరఁగ నజ్జలజానన, కులదీపక యైనముద్దుఁగూఁతుం గనియెన్.

71


తే.

పుట్టినప్పుడె కలిచల్లి బొడ్డుగోసి, నడి జలక మార్చి తడియొత్తి బడిసివైచి
మంత్రసానులు బాలికామణినిఁ బ్రేమ, దనర మెత్తనిపొత్తుల నునిచి రొగిని.

72


క.

పాలకడలిక్రియ నజ్జన, పాలకసదనంబు మెఱసెఁ బలుమఱు రోలం
బాలకయై విలసిల్లెడు, బాలకతన శుభవిభావిభాసిత మగుచున్.

73


ఉ.

అప్పుడు మానవేంద్రుఁడు ధరామరకోటి కభీష్టవస్తువుల్
కుప్పలుగాఁగ నిచ్చి కరిఘాటకహాటకచేలముల్ నయం
బొప్పఁగ బంధువర్గముల కున్నతలీల నొసంగి దీనులం
దప్పక సత్కృపం గని యథావిధిఁ దానములాడి వేడుకన్.

74


తే.

పదిదినంబులు పురిటింటఁ బగలు రేయుఁ, బదిలముగఁ గాపులిడి నరపాలుఁ డంత
పురుడు చేయించెఁ దనతోడఁ బురుడు సేయఁ, గలరె నృపతులు ధారుణీస్థలి నటంచు.

75


క.

జనులెన్నఁ బదునొకొండవ, దినమున బుధనికరమెల్ల దీవన లొసఁగం
దనయనుఁగుందనయకు వే, డ్కను రుక్మిణి యనుచు నామకరణం బిడియెన్.

76


తే.

నూనెఁ దలయంటి పసుపున మేను నలఁచి, చలువపన్నీటితోఁ గూర్చి జలకమార్చి
కజ్జలంబిడి ధూపముల్ కడునొసంగె, పాలు ద్రావించి బాల నుయ్యాల నునిచి.

77


క.

జోజో ముద్దులగుమ్మా, జోజో కపురంపుదిమ్మ జోజో కొమ్మా
జోజో బంగరుబొమ్మా, జోజో వెలలేని సొమ్మ జోజో యనుచున్.

78


తే.

జోలవాడంగ నిదురించి మేలుకాంచి, మేలుకాంచనకింకిణీజాలములు న
టించఁ బదములుఁ జేతు లాడించుకొనుచుఁ, బోరువెట్టిన నెఱిఁగి యాహార మొసఁగి.

79


ఉ.

అత్తఱిఁ గ్రొత్తముత్తియపుహర్మ్యతలంబున నిల్పి బిత్తరుల్
పుత్తడికీలుబొమ్మలును బొంగరముల్ మణికందుకంబులుం

జిత్తవికాసమై మిగులఁజెన్నగువన్నెలదొండపండులున్
మొత్తముగాఁగ నిందుముఖిముందర నుంచి విలాసవైఖరిన్.

80


ఉ.

అల్లదె చందమామ దివినంటి వెలుంగుచు నంటిపండులున్
బెల్లము వెన్న చక్కెరయు నెయ్యిని బాలును జున్ను మీఁగడల్
కొల్లలు మీఱఁ బట్టుకొని కూరిమి నాడుకొనంగ వచ్చె రం
జిల్లి చకోరనేత్ర యఱసేయక కల్గొనుమంచు వెండియున్.

81


ఆ.

వెండిగిన్నెలోన వెన్నయు బువ్వయుఁ, బసిఁడిగిన్నెలోనఁ బాలు నిడుక
చందమామ రావె జాబిల్లి రావె మా, పాపతోడ నాడ మాపులనుచు.

82


క.

నెలబాలుఁ జూపి నునుగి, న్నెలఁ బాలును నెయ్యి పోసి నెలఁతుక లాచి
న్నెలబాలకుఁ ద్రావించుదు, నెలమం గ్రీడింపఁజేసి రిం పలరారన్.

83


క.

దాదులు వెనుపఁగ నిటు జగ, దాదుల కాది యగుమగువ యనిశము సిరులం
బాదుకొని నృపతితికం, బాదుకరాఁ బెరుఁగుచుండె నంతగణంకన్.

84


ఉ.

అంగదముల్ వెలుంగ మణిహారము లక్కున వర్తిలంగ మే
ల్బంగరురావిరేక నొసలన్ మసలంగఁ బదాంగదధ్వనుల్
పొంగి చెలంగ రంగులను బొల్సగుపావడ సొం పెసంగఁగా
సంగడికన్నెలం దవిలి సారసలోచన క్రీడ సేయుచున్.

85


సీ.

మేలైనకెంబట్టుజాలె బిగ్గరఁజుట్టి తిరముగాఁ బసిఁడిబొంగరము లాడు
గుఱియంటఁబరువిడ్డతఱి యందియల్ పెల్లుమ్రోయంగ దాఁగురుమూఁత లాడు
గరకంకణధ్వనుల్ ఘలుఘల్లురని యింపు గావింప నచ్చనఁగాయ లాడు
నిలువెల్ల జెమటసోనలఁ దోఁగి విలసిల్లఁ దొడరి మానికపుఁగందుకము లాడు


తే.

దంటయై కేరి యోమనగుంట లాడుఁ, బోలురా సిరివెన్నెలప్రోగు లాడు
పేరిఁ జెలరేఁగి చిఱుతనబిల్ల లాడు, వేడుకలు మాఱఁ బింపిసలాడు మఱియు.

86


సీ.

బలుముత్తియంపుమేడలఁ గ్రీడ సేయుచు నాపఁక పసిఁడియుయ్యాల లూఁగుఁ
గమ్మపుప్పొడి మేనఁ గ్రమ్మ లీలావనతరువులఁ బరువంపువిరులు గోయు
బొమ్మపెండ్లిం డ్లొనర్చుచును గుజ్జనఁగూటియామెతల్ రాకన్నియలకు నొసఁగు
సారంపుఁగెంపుపంజరములలో నిడి సుకుమారకీరశారికలఁ బెనుచుఁ


తే.

దవిలి నిచ్చలు గౌరీవ్రతములు నోఁచు, నలఘుమతి నింపులగుపాట లభ్యసించుఁ
జెలఁగి భూసురవరసువాసినులఁ గొలుచు, దాది గాదన్నపనియె పంతిమునఁ జేయు.

87


క.

బింబోష్ఠి లేఁతయగుప్రా, యంబున నీరీతిఁ గన్నియఁలఁ గూడి ప్రమో
దంబునఁ గ్రీడించుచుఁ జె, ల్వంబున వర్తింపఁ గొన్నివాసరములకున్.

88


సీ.

నిద్దంపుబలుసోగనెఱులు క్రొమ్ముడి కందె నెమ్మొగంబునఁ దేట నేటుకొనియెఁ
గనుదోయి నఱసిగ్గుఁ గలికిచూపులు మీఱె జెక్కులనిగనిగ జిగి దనర్చెఁ

జెన్నొంద నెఱచిన్నిచన్ను లుద్భవమయ్యె మోవి యొక్కించుక జేవుఱించె
నూనూఁగునూఁగారు నునుఁజాయదలమయ్యెఁ గటిచక్ర మించుక ఘనతనొందె


తే.

నడల నొయ్యొయ్య మురిపంబు గడలుకొనియె, ముద్దుజిలిబిలిపలుకులు మొలచె సొలపు
చిఱుతతెలినవ్వు లంతంతఁ జెలువుమెఱసె, రమణికి నవీనయౌవనారంభమునను.

89


క.

సింగార ముప్పతిల్లఁగఁ, బొంగెడులేజవ్వనంబు పొడమిన నపు డ
య్యంగజునిచేఁ జెలంగెడు, బంగరుకీల్బొమ్మ యనఁగ బాలిక యలరెన్.

90


ఉ.

అంతటఁ జన్నుదోయి బటువై విలసిల్లె నితంబబింబ మ
త్యంతము విస్తరిల్లె మదనాంకురభానము లుప్పతిల్లె మో
మెంతయుఁ దేజరిల్లె సిరు లీనుచు వేనలి యుల్లసిల్లె న
క్కాంతకు నిండుజవ్వనము కన్నులపండువయై ఘటిల్లుటన్.

91


చ.

నిలుకడఁ గన్నక్రొమ్మెఱుఁగు నింగిఁ దొలంగినచంద్రరేఖ యిం
పలరఁగఁ బల్కుపుష్పలత ప్రాణము లున్నపసిండిబొమ్మ చే
ష్టలు గలగుజ్జుమావి ఘనసౌరభ మబ్బినమానికం బనం
జిలుకలకొల్కి యంత విలసిల్లె మనోహరయౌవనంబునన్.

92


ఉ.

ఆనవమోహనాంగి యనయంబు నయం బెనయం బుధావళుల్
దానగుణాఢ్యుఁ డైనతనతండ్రిసభం బ్రభమీఱ దేవకీ
సూనునిరూపయౌవనవచోబలవైభనముల్ గణింపఁ దాఁ
బూని పయోరుహాక్షుఁడె విభుండు తగం దనకంచు నెంచుచున్.

93


ఉ.

ఎన్నఁడు చూతు సాకసదళేక్షణుముద్దుమొగంబు శౌరి ద
న్నెనఁడు పెండ్లియాడుఁ జెలులెల్లను వేడుక నుల్లసిల్ల న
వ్వెన్నునిమస్తకంబున నవీనము లౌ తెలిముత్తియంపుఁబ్రా
లెన్నడు నింతు వానియెద నెన్నఁడు గూర్మి వసింతు నక్కటా.

94


క.

తమవా రాశౌరికి ను, త్తమమతిఁ ద న్బెండ్లి సేయఁ దలఁతురొ లేదో
కమలజునివ్రాఁత మఱి యే, క్రమమగునో నిర్ణయింపరా దింతైనన్.

95


తే.

మోహనాకారుఁడును సదామోదమతియుఁ, జారుకారుణ్యతారుణ్య సంయుతుండు
భాసురైశ్వర్యఖనియునౌ ప్రాణవిభుఁడు, గలుగు టెల్లను జెలిపుణ్యఫలము గాదె.

96


చ.

సరసవచోవిలాసనయచాతురిఁ దుల్యతినొంది యామినీ
కరముఖియుజ్"న్ సదాహృదయకౌతుకహేతుకళావిధిజ్ఞుఁ డౌ
పురుషుఁడు నెమ్మితోఁ గలసి భూరిసుఖానుభవాబ్ధిఁ దేలుటల్
చెఱకునఁ బండు పండుట పసిండికిఁ దావి ఘటిల్లు టారయన్.

97


సీ.

వామాక్షులకు వశంవదుఁడైనయాలీలఁ బాటిల్లుప్రియుఁడు తంగేటిజున్ను
మానినీమణులకు మదనకళాతంత్రకోవిదుం డగుపతి కొంగుపసిఁడి

పువుఁబోణులకు జగత్పూజితాకారుఁ డౌపురుషుఁడు వెలలేనిభూషణంబు
అలివేణులకుఁ బూర్ణయౌవనుండై చెలంగెడుమనోహరుఁడు ముంగిటినిధాన


తే.

మబ్జముఖులకు బలవైభవానురాగ, నిరతుఁ డగునాయకుఁడు చేతినిమ్మపండు
ఇన్నిగుణములు శౌరియం దెన్నఁబడియె, నతఁడు విభుఁ డౌటకన్న భాగ్యంబు గలదె.

98


క.

సరసోదారధరాధర, ధరమధురాధరసుధాసుధారాసిక్త
స్ఫురదమలతరమృదూక్తులు, పరమానందమున వినెడుభాగ్యం బెపుడో.

99


సీ.

పీతాంబరాస్యేందుబింబ మీక్షింపక నయనోత్పలంబు లేక్రియఁ జెలంగు
హరికరాంబురుహవిస్ఫురణ లభింపక కచమధువ్రతిము లేకరణిఁ బొదలు
శౌరివక్షఃకషాశ్మమున రాయక కుచకనకకందుకము లేగతిని మెఱయు
దైత్యారివాగ్వృష్టిధారలు సోకక శ్రవణకూపంబు లేసరణి మబ్బుఁ


తే.

గృష్ణలావణ్యగంగాసరిత్తరంగ, మాలికాడోలికాకేలిఁ దేలి లీలఁ
దేజరిల్లక మానసరాజహంస, మేతెఱంగున సంతతప్రీతి నలరు.

100


ఉ.

విందుము ముందు వీనుఁగవ విందుగఁ బొందుగనందు మంద నా
నందము నందమున్ మెఱయ నన్యవిలాసకళాసమగ్రుఁ డై
సుందరమందహాసరుచి శోభిల వ్రేతలఁ గూడి యాడుగో
విందునిఁ జెంద మున్ జెలులు వేమఱు నేమివ్రతంబు నోఁచిరో.

101


సీ.

తనశిరంబున శౌరి తలఁబాలు వోసిన మానికంబులు శంభుమాళి నునుతుఁ
జెలఁగి కృష్ణుఁడు నన్నుఁ జెట్టవట్టిన నుమాధవునకుఁ గేలెత్తి దండ మిడుదు
హరి తనమృదులపదాగ్రంబుఁ ద్రొక్కిన ఫణిహారునకుఁ బ్రదక్షిణ మొనర్తుఁ
ఋరుషోత్తముఁడు దనపొత్తునఁ గుడిచిన హరునకు నమృతోపహార మిడుదుఁ


తే.

జక్రి దనుఁగూడి మంగళస్నాన మెలమి, నాచరించినఁ బురనిశాటాహితునకుఁ
దనర నభిషేక మొనరింతు ననుచుఁ బెనుచు, పరిణయోత్సాహమునఁ బల్కుఁ బంకజాక్షి.

102


చ.

చెలులకు నిత్తెఱం గెఱుఁగఁ జెప్పినయప్పుడె గేలి సేయఁగాఁ
దలఁతురుగాని రాజునెడఁ దప్పక యిప్పని యొప్పుమీఱఁగాఁ
దెలుపుడుచేసి యొయ్యన మదీయమనోరథసిద్ధిగా శుభం
బెలమిని సంఘటింపఁగలరే చెలరేఁగి కృతోపకారలై.

103


క.

అని యిత్తెఱఁగున హరిపైఁ, దనరఁగఁ జిత్తంబు నిల్సి తనలోఁ దానే
యనవరతముఁ జింతించుచు, వనజేక్షణ పరమయోగివైఖరిఁ జెలఁగెన్.

104


ఉ.

ఆయెడ నొక్కనాఁడు సచివాప్తపురోహితరాహుతావనీ
నాయకగేయకార్యరతనాటకచేటకచాటుకావ్యసం
ధాయకగాయకార్యసముదాయకళాకుశలారిభేదనో
పాయవిదుల్ భజింప నిరపాయనృపాయతవైభవంబునన్.

105

సీ.

అందమై శుభవిభామందమై వృతసుధీబృందమై లోచనానంద మగుచు
సారమై భూరివిస్తారమై మరకతద్వారమై యాచకాధార మగుచుఁ
బూతమై భువనవిఖ్యాతమై సజ్జనోపేతమై మధురసంగీత మగుచుఁ
దివ్యమై బహుతరద్రవ్యమై సతతసంభావ్యమై సుభటసంసేవ్య మగుచు


తే.

శుంభిదంభోజరాగవిష్కంధశాత, కుంభజృంభితవిద్రుమస్తంభవితతి
జంభజిన్మణిగుంభితాదంభజాల, జాలకం బైనయొకసభాస్థలమునందు.

106


క.

నిండుఁగొలు వుండ దయ నధి, కుండన రూపాబ్జసాయకుండన సుగుణాం
కుండన నిశ్శంకుండనఁ, గుండినవిభుఁ డైనభీష్మకుం డినవిభుఁ డై.

107


క.

అతులగతి నిబ్లు కొలువై, హితులున్ బుధతతులు మతిమహితులున్ ధరణీ
పతులున్ ధృతిఁ గేరుపురో, హితులున్ సుతులు వినంగ నిట్లని పలికెన్.

108


చ.

తవిలి మదీయపుత్రి యగుతామరసాయతనేత్ర రుక్మిణిం
బ్రవిమలతేజుఁ డైననరపాలతనూజున కిచ్చి ధారుణీ
దివిజులు రాజులుం బొగడ దిక్కులఁ గీర్తి వెలుంగ భూరివై
భవమునఁ బెండ్లి సేయుటకు భావమునం దిపు డుత్సహించెదన్.

109


క.

కులమును రూపము విద్యయుఁ, దెలివియు జవ్వనము నీతి ధృతియున్ మతియుం
గలిమియు బలిమియుఁ జెలిమియుఁ, గలవరునకుఁ గన్య నొసఁగఁగావలె నెలమిన్.

110


క.

దానమ్ములలోఁ గన్యా, దానము ఘనపుణ్య మని బుధప్రకరము లిం
పూని వచింతురు గావున, మానవతతి కిది సుకర్మమార్గం బరయన్.

111


తే.

తగినవరునకుఁ గన్యకాదాన మొసఁగి, ప్రేమ నీరెడుతరముల పితరులకును
హర్ష మొనరించి యన్వయం బవిరళముగఁ, బావనము సేయు టుచితంబు ప్రాజ్ఞులకును.

112


క.

తద్దయు శుభకార్యంబులు, పెద్దలతో నూహ చేసి పిదపన్ వారల్
దిద్దినరీతి నొనర్చుట, నుద్దామం బైనభద్ర మొదవుచు నుండున్.

113


క.

హితకార్యం బతిసత్వర, గతిఁ జేయఁగవలయుఁ బూని ఘనులకు నెల్లన్
క్షితియం దనవద్యంబుగ, స్మృతు లెన్నుంగద శుభస్య శీఘ్ర మ్మనుచున్.

114


క.

కావున రుక్మిణికిం దగు, భూవర సుతు నాత్మ నరసి పొలుపొందఁగ మా
కావిధ మెఱిఁగింపుఁడు స, ద్భావంబున బుధులు హితులు బాంధవతతులున్.

115


చ.

అనుటయుఁ జారుకార్యగతి యారసి యారసికాగ్రగణ్యుఁ గ
న్గొని మనుజేశ నీతనయకుం దగురాజకుమారు మారుఁ బో
లినసుకుమారు ధీరు నవిలీనబలాహవశూరు మాకుఁ దోఁ
చినపగిదిన్ వచించెదము చిత్తమునం గలరీతిఁ జేయుమా.

116


చ.

గొన బగురూపభావితునిఁ గోరును గన్నియ వన్నెమీఱఁ ద
జ్జననిధనంబుఁ గోరు శ్రుతశాలిని గోరును దండ్రి చుట్టముల్

ఘనకులజాతుఁ గోరుదు రిలం బరులెల్లను సూపమిశ్రితో
దనము భుజింపఁ గోరుదురు తద్దయు శోభనకార్యవేళలన్.

117


క.

అది గావున మామాటలు, హృదయంబున కిష్ట మయ్య నేనిఁ బ్రమోదం
బొదవ విను నీకు సతతా, భ్యుదయపరంపరలు చెందు నుర్వీనాథా.

118


చ.

యదుకులవార్థిచంద్రుఁడు దయాగుణసాంద్రుఁ డమందసుందరా
స్పదుఁ డమఃలప్రతాపుఁడు విశాలయశస్సహితుండు సంతత
త్రిదశగణార్చితుండు వసుదేవతనూజుఁడు కృష్ణుఁ డాతఁడే
మదిఁ బరికింప నీప్రియకుమారిక కాత్మవిభుండు గాఁ దగున్.

119


మ.

వసుధాధీశ్వర యమ్మహాత్మునిప్రభావం బెన్నఁ జిత్రంబు దా
వసుధాభారనివారణార్థముగ మున్ వందారులై భీరులై
వసుదేవాదులు ప్రస్తుతింపఁ గరుణావర్ధిష్ణుఁ డావిష్ణుఁ డీ
వసుదేవాత్మజుఁడై జనించె సుగుణవ్యాపారపారీణతన్.

120


క.

నూతనలీలల నందని, కేతనమునఁ బెరుఁగుచుండి కృష్ణుఁడు కడిమిం
బూతన యనియెడునసురి న, చేతనఁ గావించె భువనచిత్రము గాఁగన్.

121


క.

నికటమున దనుజమాయం, బ్రకటం బగుచుండు టెఱిఁగి పటుబలయుతుఁ డై
శకటం బొకటి ముకుందుఁడు, వికటంబుగఁ గూలఁదన్నె విబుధులు పొగడన్.

122


సీ.

మారుతాసురుఁ ద్రుంచె మద్దులఁ బెకలించెఁ గినిసి వత్సకుఁ జంపెఁ దునిమె బకుని
నఘదానవునిఁ గూల్చె నలరి కాళియు నొంచె దనశిఖి మ్రింగె గోత్రము ధరించె
శంఖచూడునిఁ దేర్చె సాధించె వృషదైత్యుఁ గేశి నణంచె ముగించె వ్యోముఁ
జాణూరుఁ దెగటార్చెఁ జక్కాడెఁ గంసునిఁ దవిలి యొయ్యనఁ గాలయవనుఁ జిదిమె


తే.

నల జరాసంధముఖ్యు లౌఖలులఁ దఱిమె, ద్వారక యనంగ నొకరాజధాని నిలిపె
బాంధవులకెల్ల నిత్యశుభంబు లొసఁగె, మనుజమాత్రుండె దేవకీతనయుఁ డరయ.

123


చ.

సకలబుధానుసారి యగుశౌరికిఁ గన్య నొసంగి భూమినా
యక శుభలీలలన్ వెలయు టందము డెందమునందు నీవు వే
ఱొకనృపసూతికిన్ వికసితోత్సలనేత్ర నొసంగఁ జూచుట
ల్నికటరసాల మొల్లక చలించి ముసిండిఫలంబుఁ గోరుటల్.

124


క.

అని సభ్యు లాడుపలుకులు, తన చెవులకు ములుకు లగుచుఁ దగిలినఁ గోపం
బునఁ గటము లదర నందఱఁ, గనుఁగొని యపు డనియె రుక్మి గర్వోద్ధతుఁ డై.

125


చ.

అవునవు మంచిపెద్దలె బళా నరపాలునిమ్రోల నూరకే
చివుకుల కెందుఁ జొప్పడని చేవలు వెట్టుచు గట్టిపట్టుగాఁ
జెవులకు ముల్కు లై వినఁగఁ జెల్లనిపల్కులు మాటిమాటికిం
దవిలి వచింపఁ జాఁగితిరి దబ్బర లింకను జాలు మానుఁడీ.

126

తే.

మదిని మీమాటె పరమధర్మం బటంచు, నమ్మియుండినఁ గార్య మెంతయును జెడదె
పెద్ద లనియెడిగంపంతపేరె కాని, బుద్ధి ముదిమది దప్పినఁ గొద్దిగాదె.

127


ఉ.

గొల్లలయిండ్లఁ బా ల్పెరుగుఁ గొల్లలుగా సతతంబుఁ ద్రావి మ
త్తిల్లి యరణ్యదేశములఁ ద్రిమ్మరుక్రేపులకాపరిన్ గడున్
బల్లిదుఁ డంచు నెన్నెదరు నవ్వెడువారి నెఱుంగ కియ్యెడం
బెల్లుగ గొల్లబోయనికి బింకము బంటుఁదనంబు గల్గునే.

128


చ.

చివికినబండి ద్రొక్కుటయుఁ జెట్లు పెకల్చుట పా లొసంగుదా
నవి భువిఁ గూలద్రోయుట వనంబునఁ బామును గొంగ నెద్దు వా
రువమును గర్దభంబును విరోధు లటంచుఁ దలంచి చంపుటల్
శివశివ విక్రమంబు లని చెప్పఁగఁ జిత్రము లయ్యె నియ్యెడన్.

129


క.

మంచిది మీ పలు కిప్పుడు, వంచింపఁగ వలదు బాంధనమునకుఁ దగునే
క్రించుఁ డయి మేనమామం, ద్రుంచినఖలుఁ డెంతబలయుతుం డై యున్నన్.

130


చ.

సరిసరి విూవిచార మిఁకఁజాలు శిరీషసుమోపమానభా
సురసుకుమార యై సకలసూరిజనాభినుతోల్లసద్గుణా
కర యగురుక్మిణిం బసులకాపరి కియ్య మదిం దలంతురే
గురుతరరత్నహార మొకక్రోతి మెడం దవిలింపఁ జూతురే.

131


క.

మీ కిష్టం బని వరచా, మీకరనిభగాత్రి నెట్లు మీఁ దెఱుఁగక నేఁ
డాకఱిగొల్ల కొసఁగుదురు, కాకిమెడం దొండపండు గట్టినభంగిన్.

132


చ.

కటకట సర్వభూభరణకారణభూరిభుజాగ్రజాగ్రదు
త్కటపటుశింజినీనినదకార్ముకముక్తశరాహృతారిరా
డ్భటపటలుండు భీష్మకనృపాలుఁ డనం బ్రభ మీఱి యీతఁడే
కుటిలతనొంది గొల్లనికిఁ గూఁతు నొసంగిన నవ్వరే జనుల్.

133


క.

మావాక్యము గొఱ గాదని, తా వేఱొక టనుట పడుచుఁదన మిది యనుచున్
భావింపక దయఁ జూడుఁడు, వేవిధములఁ గేలు మొగిచి వేఁడెద మిమ్మున్.

134


తే.

ఘనుల కెల్లను దమడెందమునకు నిష్ట, మగు తెఱంగున నొనరింపఁదగును గార్య
‘మాత్మబుద్ధిస్సుఖంచైన' యనెడువచన, మరయ నిద్ధాత్రిపై నిశ్చయంబు గాదె.

135


క.

శశిముఖి యగురుక్మిణి న, ప్పశుపాలున కొసఁగ నొల్లఁ బదివే లైనన్
మశకీకృతపరబలుఁ డగు, శిశుపాలున కిపుడు పెండ్లి సేయుదుఁ బ్రీతిన్.

136


ఉ.

సంగరరంగరంగదరిసామజభీమజనప్రదీపితో
త్తుంగమృగేందుఁ డంగభవతుల్యమనోహరమూర్తి భూమిభృ
త్పుంగవవర్ణనీయపరిపూర్ణగుణాకరుఁ డిందుచంద్రికా
భంగయశోన్వితుండు శిశుపాలుఁడు చూడ నృపాలమాత్రుఁడే.

137

తే.

అనుచుఁ బెద్దల నదలించి యాడురుక్మి, మాట గాదన కపుడు భీష్మకనృపాలుఁ
డొనర నారాజునకుఁ గన్య నొసఁగఁదలఁచి, యవిరళామోదమానసుఁ డై చెలంగె.

138


క.

అని శౌనకాదిమునులకు, ఘనుఁ డాసూతుండు దెలుపుగతినిఁ బరీక్షి
జ్జనపతికి శుకుఁడు చెప్పిన, విని యవ్వలికథయుఁ దెలియ వినఁగోరుటయున్.

139


మ.

పరుహూతాబ్జభవాచ్యుతార్చికకుదాంభోజాతశీతావనీ
ధరకన్యాకుచకుంభసంభృతసత్కస్తూరికాశాదమే
దురదోరంతరహాని రహీరశరగోదుగ్ధేందురత్నావళీ
శరదభ్రాభ్రధునీసితాభ్రశశభృత్సంశుభ్రగాత్రప్రభా.

140


క.

కనకాచలరుచిరశరా, సన కాకోదరవిభూష సనకాదిసదా
వనకారణగుహకరిముఖ, జనకానుతచరితే దీనజనకార్యరతా.

141


తరల.

సమరభీషణ సత్యభాషణ సారసాహితభూషణా
సమదవారణ చర్మధారణ సంతతాగమకారణా
ప్రమథనాయక భద్రదాయక పద్మలోచనసాయకా
శమనశిక్షక సాధురక్షక శత్రుగర్వవిమోక్షకా.

142


మాలినీ.

సరసగుణకలాపా సర్వలోకప్రదీపా, సురుచిరతరరూపా శోషితాశేషపాపా
పరిహృతసుమచాపా భాసురోగ్రప్రతాపా, నిరుపమహరిరోపా నిత్యసత్యానులాపా.

143


గద్య.

ఇది శ్రీమత్కుక్కుటేశ్వరవరప్రసాదలబ్ధకవితాసామ్రాజ్యధురంధర కౌండి
న్యసగోత్రపవిత్ర కూచిమంచి గంగనామాత్యపుత్ర బుధజనవిధేయ తిమ్మయ
నామధేయప్రణీతం బైన రుక్మిణీపరిణయం బనుశృంగారప్రబంధంబునందుఁ
బ్రథమాశ్వాసము.