శ్రీకపిలేశ్వరపురాధినాయక ప్రకటితము

శ్రీ

రాధామాధవము

ప్రథమముద్రణము ౧,౦౦౦

5,036 యువ మాఘ శు 7 గురువారము.

మునిపలుకు
విమర్శాదర్శక
శ్రీ నడకుదుటి వీరరాజప్రణీతము.

ముద్రాశాల

కాకినాడముద్రణాలయము

కాకినాడ.

విజ్ఞాపనము

ఆంధ్రభోజుఁడను ప్రఖ్యాతిఁ గని, కవిపోషకుఁడై, పండితుఁడై యలరారిన శ్రీకృష్ణరాయభూపేంద్రునికాలమున రచింపఁబడిన యీయమూల్యప్రబంధరత్నమును బ్రకాశ మొనర్చుభాగ్యము నా కలవడినందులకు నే నెంతయో సంతసించుచున్నాఁడను.

పూర్వకవివిరచితములై, కాలగర్భమున దాగియున్న ఆంధ్రప్రబంధములఁ గొన్నిటినైనను యథాశక్తిని ప్రకటింపవలయునను నుద్దేశము నాకుఁ గలిగి, వానికై, తడవులాడుచుండఁ బ్రప్రథమమున మదరాసుదొరతనమువారి ప్రాచీనపుస్తకభాండాగారమున నీరాధామాధవముయొక్క మాతృక లభించినది.

దాని నటనుండి తెప్పించి, ప్రతి వ్రాయించితిని. బ్ర॥ శ్రీ శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రిగారు చాలశ్రమపడి పరిష్కరించిరి. పిదప శ్రీపిఠాపుర సంస్థానకవులగు బ్త॥ శ్రీ ఓలేటి వేంకటరామశాస్త్రులుగారు సరిచూచిరి. విమర్శాదర్శకులగు నడకుదుటి వీరరాజకవిగారు గ్రంథమునకు మునిపలుకును వ్రాసి యొసంగిరి. ఈవిధముగ నాయుద్యమమునకుఁ దోడుపడిన యీపండితత్రయమున కేనెంతయుఁ గృతజ్ఞుఁడను.

కవితల్లజులలో నొకఁడై ప్రశస్తిఁ గనిన రాధామాధవునికవితామృతమును ఆంధ్రపాఠకలోకమునకుఁ జవిచూపించు నదృష్టము నాకుఁ గలుగఁజేసినపరమేశ్వరునకు వందనముల నర్పించుచున్నాఁడను.

ఇంకను నిట్టిగ్రంథమణులను బ్రకాశ మొనర్పవలయునను నాశ నా కెంతయేని కలదు. కాని అట్టియవకాశమును నాకు లభింపఁజేయుభార మాజగన్నియంతమీఁదను, ఆంధ్రలోకముమీఁదను గలదని నావిన్నపము.

కపిలేశ్వరపురము

తూ॥ గో॥ మండలము

శ్రీ బలుసు బుచ్చిసర్వారాయఁడు

యువ; మాఘ శు 7

జమీందారు