రాణీ సంయుక్త/మూడవ ప్రకరణము

మూడవ ప్రకరణము

ముత్రా నగరమునకు దూరపుదిక్కున నాలుగైదు మైళ్ళ దూరములో నొక చిన్నపర్వతము కలదు. దానినెత్త మతివిశాలమై చదరముగ నుండుటవలన భక్తులు కొందఱు పెద్దదేవాలయ మొక దానిని గట్టించి యందు శివలింగమును స్థాపించియుందురు. ఈ గుడిచుట్టు సుమారు పదియడుగుల యెత్తుగలిగి యొకమైలు చుట్టుకొలతగల ప్రాకారపుగోడ యొకటి యుండును. సింహ ద్వారముపైఁ బెద్దగాలిగోపురముగలదు. కొండ యడుగుననుండి పైవరకును సోపానములు గట్టఁబడి వాటి కిరుప్రక్కల దేవతా దర్శనార్థమెక్కు భక్తుల కెండతగులకుండునట్లు పలువిధములగు జెట్లు పెంచబడియుండును. ఈ వృక్షములపై నెల్లపుడు గుంపులు గుంపులుగ కోతులు వసింపుచు వచ్చిపోవువారి చేతులయందలి వస్తువులఁ దామే నైవేద్యము గొనుచుండును. మెట్లకు మొదట

విఘ్నేశ్వర దేవాలము కలదు. ఈ క్రిందనున్న గుడికిని పైయాలయమునకును నడుమ గాళికాశక్తి గుడిఒకటి యుండును. ప్రాకారముయొక్క లోపలిభాగమున వరుసగా విఘ్నేశ్వర, కాలభైరవ, వీరభద్ర, కామాక్షి మందిరములును గలవు, ఇదిగాక గోడలకంట నిర్మింపఁబడిని చిన్న చిన్న గదులనేకములు బారులు దీరి యుండును. ఈ శివాలయమంతయు ననగా గర్భగుడి యంతయు నల్లనిరాళ్ళచే నిర్మింపబడియున్నది. గర్భగుడి యెదుట విశాలమగు నొక గొప్ప మంటపము గలదు. ఈ పెద్ద మంటపముస కిరుపార్శ్వములఁ జిన్నచిన్న మంటపములు రెండు కట్టబడియున్నవి. ఇందొకటి కళ్యాణమంటపము. పెద్ద మంటపములో విగ్రహమున కెదురుగ సాధారణపు మానవుడు పరుండగలిగినంత విశాలమగు బొడ్డుగల పెద్దనంది యొకటి యుండును. ఇచట బ్రతిసంవత్సరము శివరాత్రినాడు గొప్ప యుత్సవము జరుగుచుండను, ఆ దినమున యాత్రాపరులు వేన వేలుగఁ జనుదెంచి స్వామిసేవ జేసుకొని కానుకలర్పించి పోవుచుందురు. క్రిందనున్న వినాయకుడి గుడిప్రక్క దిప్పకంటుకొని కోనేరొకటి యుండును. ఈ కోనేరతి యగాధమగు లోతుగలదై పైనుండి నీటిమట్టమువరకును మెట్లనొప్పియున్నది. ఇందలి నీటికిఁ గ్రమమగు వాడుకలేని కారణమునను, దగినంత సూర్యరశ్మి తగులని హేతువునను బచ్చపడి యొకవిధమగు దుర్గంధమును వెలువరించుచుండును, అచ్చట ననారతము సేవఁజేయుచుండు భక్తులగు నర్చకులు కొందఱు ఆలింగ మగస్త్య మహా ముని స్థాపించినదనియు, నా పుష్కరిణి దేవనిర్మిత మనియు, • నందులోని నీరుదక్క వేరొండభిషేకార్థము శివుఁడంగీకరింపఁ డనియు వచింపుచు నుత్సవమునకు వచ్చిన యాత్రాపరుల నందఱిని నా పాడునీటియందే ముంచుచుందురు. మఱియు నా పుష్కరిణియందు మునిగిపోయిన గాశీవిశ్వేశ్వరుని గుడియందు దేలుదురని ప్రతీతి యొకటిగలదు. గాని యటులొనర్చిన వాడు మాత్ర మొకడును గానరాడు. కన్యాకుబ్జమునుండి ఢిల్లీకిబోవు రాదారీ కొండప్రక్కగా బోవును. శివరాత్రినాడు మాత్రమేగాక యితర సమయములందును నా బాటనుబోవఁ దటస్థించిన భక్తులెల్లరు గుడికేగి స్వామిదర్శనము జేసుకొని పోవుచుందురు, ఇంత ప్రఖ్యాతివడసి మహోన్నత స్థితియందుండిన యీక్షేత్రము మనచరిత్ర ప్రారంభమగు నాటికి సంపూర్ణముగ శిథిలమై యుండెను. పదునొకండవ శతాబ్దారంభమున గజనీమహ్మదు ముత్రాపట్టణముపై దండెత్తి వచ్చినప్పుడీ కొండనెక్కి విగ్రహము లన్నింటిని ధ్వంసముచేసి మితిలేని ద్రవ్యమును గొనిపోయెను. నాటినుండియు నచటి మహత్వము చెడినందున దైర్థికులచటికేగుట మానివేసిరి. కాని తమదొర ప్రియజనకుండని జాలిబూని మూషిక వ్రజము మాత్రము శివలింగము మంచి స్థితియందుండునపుడు భక్తులనేకులు వచ్చి యుపచారములు సలుపుచుందురు గదాయని కొంచె మశ్రద్ధజేయుచు వచ్చినను భక్తుడొక్కడైన రాని యిట్టి దీనస్థితియందు దాముమాత్రము వదలక దమ జాతివారల నింకను ననేకులఁ గూర్చుకొని యభిషేకార్ఘ్యపాద్య నైవేద్యాది క్రియలఁ గ్రమముగ నొనర్చుచునే యుండెను. మఱియు గుడ్లగూబలు మొదలగుఁ బక్షులును దమశక్త్యానుసారముగ నుడుతబత్తిఁ జేయుచుండెను, గాలి గోపురము సగముకూలి దివాంధములకును గొండచిలువకును నావాసమై వాటియారావములతో నిండియుండెను. ప్రాకారపు గోడలన్నియు నెక్కడివక్కడ కూలి నేలతోఁ జదరమగు చుండెను. గుడివెలుపటి భాగమున ననగా బ్రాకారపు లోపలి భాగమున నున్న గుళ్ళన్నియుఁ బసులకాపరుల జంతువులు వైచిన పెంటలతో రోతగలుగఁజేయుచుండెను. కొండంతయు నిట్లు పాడుపడి ఉన్నను మధ్యనున్న కాళికాలయము మాత్రము శక్తిపూజాధురంధరులగు వామమార్గ మతస్థులవలన జాగరూకత తోడఁ గాపాడఁబడుచుండెను. గజినీచే మొండిగఁ జేయఁబడిన దేవీవిగ్రహమునకు వెండికన్నులు మొదలగునవి యలంకరించి శిధిలములైన గోడల బాగుపఱచుకొని ద్వారమొకదాని నేర్పఱచుకొని యందుపూజలు యధావిధిగఁ జేసికొనుచుండిరి. మఱియుఁగొండపైనున్న సగము పడిపోయిన గదులకుఁ బాషండులగు బైరాగులు కొందరప్పుడప్పుడు దర్శన మిచ్చుచుందురు. కొండదరికేగిన గంజాయి యొక్కయుఁ గబ్బిలపుఁ బెంటల యొక్కయు మురికికంపుతక్క వేరొండు శుభ్రమగు వాయువు లేని కారణమున సజ్జనులగు వారలచటి కేగుట మానివేసిరి. అట్టి యా పాడుపడిన మెట్లమీఁదుగ నొకనాఁటి సాయంకాల మాఱు ఘంటలవేళ బాటసారి యొకఁడు కొండపైకేగి యచటి స్థల మంతయు గూరుచుండుటకుఁ గూడ తగనిదిగ నున్నందున మరల గ్రిందికివచ్చుచు గొళ్లెము తగిలింపఁబడియున్న కాళికాలయముఁగాంచి తలుపుఁదెఱచుకొని లోనికేగి పైనఁ దాను చూచినదానికంటె నక్కడ బాగుగ నున్నందున నా రాత్రి నచటనే గడుప నిశ్చయించుకొని గుడి యవతలివైపునకుఁ బోయి యక్కడి వసారాలోఁ బైగుడ్డఁ బఱచుకొని పరుండి నిదుర పోయెను, నాఁటిదినమమవసయగుడుఁ గొంత సేపునకు దిక్కులు దెలియరాక మిట్ట పల్లము లేకములగునట్లు గాఢాంధకారము గ్రమ్ముకొనెను. అర్దరాత్ర మగునప్పటికి నాకటిక చీకటియందుఁ గొందఱు స్త్రీ పురుషులు చేతులయందుఁగాగడాల వెలిగించుకొని వచ్చి కొండనెక్కి కాళికాలయము బ్రవేశింప దొడగిరి. కొందరు మద్యభాండముల మోసుకొని వచ్చుచుండిరి. మఱికొందఱు బలిసిన గొఱ్ఱెలఁ వెంటగొని వచ్చుచుండిరి. వీరందఱు గుడిలో బ్రవేశించు తరిఁ గలిగిన రొదలకు వెనుకవైపుననున్న బాటసారి మేల్కొనిలేచి, యవతలిగుండ బారిబోవ బ్రయత్నించె గాని యా ప్రక్క ద్వారములేక గోడలెత్తుగ నుండెను. అంత నేమైన గావిమ్మని గుండెరాయి జేసికొని మరల నెప్పటి చోటికి వచ్చి నఖశిఖ పర్యంతము ముసుగిడుకొని కదలక పరుండి యుండెను. మతస్థులును గుడికి బ్రదక్షిణ మొనర్పసాగిరి. కాగడాల బట్టుకొని కొందఱు ముందు వెన్కలనడచిరా నోట వచింపరాని బూతుపాటల బాడుచు బ్రదక్షిణము చేయదొడగిరి. అట్లు వారంద రాలయము వెనుకకేగి యట భీతిచే గపట నిద్రాభిరతుడై యున్న బాటసారింగాంచి యతని చుట్టుఁజేరి నాల్గు తన్నులతోలేపి కూరుచుండబెట్టి “నీ వెవడ " వని యడుగ నతడింతమంది నడుమ నొంటిఁ జిక్కితిగదాయని యేమియు దోచక మాట్లాడక యూరకుండెను. అప్పుడు వారందఱలో బెద్దయగు బురోహితుడు ముందుకేతెంచి "వీ డతిదుర్మార్గుడు. మన రహస్యంబుల బరీక్షింప నిచటికి వచ్చియున్నాడు. వీని నిపుడు కాళికి సమర్పింపవలయు" ననెను. అందుమీద నలుగురు వానిని విఱిచికట్టి తమతో గూడ ప్రదక్షిణము సేయించుకొనివచ్చి దేవియెదుట నిలువబెట్టి తమ విధ్యుక్త క్రియల నొనరింప మొరలిడిరి. విగ్రహమున కెదుట బదిమండలములు రచించి వాని యందు దాము వెంటగొని తెచ్చిన మద్యబాండముల నుంచి గొరియెల ఖండింప నారంభించిరి. ప్రాణి హింసయనిన గంపమందు నా పాంథుడా దారుణకృత్యములను జూడజాలక మూర్చనొందిపడిపోయెను, తోడనే కొందరాతని మొగముపై జన్నీళ్లు పోసి మూర్ఛ దేర్చుచుండిరి. తక్కినవారు దెచ్చిన జంతువుల నన్నింటి దెగటార్చి వాటి కళేబరముల భాండముల ప్రక్క నుంచి యీ క్రింది మంత్రముల నుచ్చరించుచు బూజ నేయ గడగిరి.

"బ్రహ్మశాపం విమోచథా "

అనగా ఓ మద్యమా ! నీవు బ్రహ్మ మొదలగు వారి శాపముల నుండి కూడ రహితమవై యున్నావు. మరియు-

 
“మద్యంమాం సంచమీనంచ ముద్రామైధునమేవని,
 ఏ తేపంచమకారాః స్యుర్మోక్షదాహియుగేయుగే ."

కాళీ తంత్ర గ్రంథము.



"ప్రపృత్తే భైరవీచక్రే సర్వే వర్ణాద్విజాతయః,
 నివృత్తే భైరవీచక్రే సర్వేవర్ణాః పృథక్ పృథక్.”

కులార్ణవతంత్ర గ్రంథము.



"పిత్వాపిత్వాపునః పీత్వాయావత్పతతీ భూతలే,
 పునరుద్దాయవై పీత్వా పునర్జన్మ నవిద్యతే.”

మహానిర్మాణతంత్ర గ్రంథము.



"మాతృయోనింపరిత్యజ్య విహరేత్ సర్వయోనిభు,
 వేదశాస్త్ర పురాణాని సామాన్యగణికా ఇవా.”

జ్ఞానసంకలినీతంత్ర గ్రంథము.



  • సమాంసభక్షణేదోషోనమద్యేనచమైధునే.

 ప్రవృత్తిరేషాభూతానాం నివృత్తిస్తు మహాఫల? "

మను, అధ్యా 6



“సౌత్రామణ్యాం సురాంపిబేత్ ప్రోక్షితం,
 భక్షయేన్మాం సంవైదికీహింసాహింసానభవతి."

మను, అధ్యా 5



"ఏకైవశాంభవీముద్రా గుప్తాకులవధూరివ ” "
"పాళబద్ధోభవేజ్జీవః పాళముక్తస్సదాశివః."

జ్ఞానసంకలినీతంత్ర గ్రంథము.

ఇత్యాది జారగ్రామణులుసు. స్వార్ధపరాయణులును, సత్య విద్యావిహీనులునగు దుష్టులు రచించిన తంత్ర గ్రంధములలోని మంత్రములఁబఠించుచు శాంభవీ, భైరవీ, కాళి, చాముండా ! యను నామంబులనుచ్చరించుచుఁ బూజసేయుచుండిరి. అంతవరకును మూర్ఛఁదేరి యా క్రూరకర్మలఁ జూచుచున్న పాంథుఁడు తన మనమున నిట్లు తలపోయ గడఁగెను.

"అయ్యో ! ఇల్లు వెడలినదాది నా కన్నియు నష్టములే ప్రాప్తించుచున్న విగదా ! నేటితో నిక్కడ నా చావునిశ్చయము. నాగతి యెట్లయిన గానిమ్ము. నా కొఱకై దినములు లెక్క పెట్టుకొనుచు నిరీక్షించుచుండు నా కన్యగతి యేమికాఁగలదు. ఆహా ! ఈ దుర్మార్గుల హృదయములం దావంతైనఁ గరుణయనునది లేదుకాబోలు? వీరలనెట్టి పాపకర్ములనఁదగును. ఇట్టిస్వార్థపరులగు కుమార్గగాములు ప్రబలియుండ నిఁక నార్యావర్తము బాగుపడుటెట్లు ? కట్టా ! దుర్మార్గులారా ! మీకీవిధియంతయు నెవరు బోధించిరి. పాషండులారా ! మద్యమాంసములనా మీరు పూజించునది ? హా ! నేనేమి సేయుదు : ఓ రాజపుత్రీ! నీ కోరిక నెరవేర్పజాలనై తినని నన్ను నిందించెదవుసుమీ ? విధివశంబున బెట్టిదములగు చిక్కులంబడతిగాని నా యజాగరూకతవలన గాదు. పరమేశ్వరా ! నీ కించుకైన సజ్జనులగు వారిపై దయగలుగదా ! అని కడువిలపించి తన కట్టెదుట జరుగుచున్న యసహ్యపు జనులగాంచి కనులు భైరవులుగ్రమ్మ మరల గ్రిందబడిపోయెను. అంతవానికి మరల గొందరుపచారములు సలుపసాగిరి. ఇంత వరకు జరిగిన సంగతులన్నియు జూచుచు వామమార్గులం గలసి మూల గూరుచుండియున్న పురుషుఁడొకడు తన కార్యము నెరవేర్చుకొన మంచిసమయము దొరకెగదాయని యున్నటులుండి యూగులాడ సాగెను. చెంతనున్న కొందఱేమట్లూగెదవని యడుగ మారుపల్కక మఱింత తలద్రిప్పుచు నాపాదమస్తకము గడగడ వడకింపుచు బండ్లు పటపట గొఱుకుచు కన్ను లెఱ్ఱఁజేసి చూడ మొదలు పెట్టెను. దానిఁగాంచి యందఱు వానిచుట్టుఁజేరి దేహము స్పృశించి యేమనియడుగ వారిఁజావమోదుచు "ఆరే! దుర్మార్గులార ! మీరు నన్నెఱుగరా?” యని గద్దించిపల్కెను. అంతనెల్లరు గాళికాదేవి పూనినదని నిశ్చయించి సాంబ్రాణి గుగ్గిలపు ధూపములు వేయుచు వానిపాదములపైబడి మ్రొక్కి " అమ్మా ! దేవీ ! శాంతింపుము. మావల్ల యే మపరాధమువచ్చినదో చెప్పుమ" నిబద్దాంజలులై ప్రార్ధింప నా ధూర్తుండు “ ఛీ ! మూర్ఖులారా మీకావంతైన జ్ఞానములేదు. నీచజాతి సంభవుడగు మానవునొకని నాకుబలినొసంగదలచి యున్నారు. మిమ్మందఱి భక్షించెదను. చూడుడ" ని భయంకరమగ హుంకరించుచు బలికిన" అమ్మా ! భగవతీ ! శాంతింపుము ; ఎఱుకలేనితనమున నిట్టికార్యము సేయఁబూనుకొంటిమి. క్షమించి నీ యభీష్టమేమో తెలిపిన నెరవేర్చేదమ" నిరి, అంతనా పురుషుండు "బుద్దిహీనులారా ! నాకు సకల కళావతియు, సౌందర్యవతియునగు రాకొమారికఁదెచ్చి సమర్పించితిరా సరి. లేకున్న మిమ్మందఱ నాశనము గావించెదనని పల్కెను. దానికెల్లరు సమ్మతించి " తల్లీ ! నీ యిష్టానుసారమటులే సమర్పించెద " మని ఒప్పుకొని సాష్టాంగ నమస్కారము లాచరించిరి. కొంతసేపైన తరువాత నా శివమెత్తిన వానికిఁ గుత్తుకబంటిగ గల్లుబోసి యొకచోఁ బరుండబెట్టి తామును ద్రావసాగిరి, కొందఱు బాటసారికడ కేతెంచి కట్లువిప్పి “నేఁడు నీవు మా దేవీ ప్రసాదమువలన బ్రతికిపోతివి. పొమ్మని బయటికిగెంట నతఁడును బులినోటజిక్కి చావక బయటబడిన మేకవలె లోలోన సంతసించుచు బురిదారిబట్టి పోయెను. ఇట గుడియందలి దుష్టులెల్లరు దెల్లవారునప్పటికి తమగార్యముల నన్నింటి నెరవేర్చుకొని దేవీవాంఛితమునకు నే రాజకన్యక తగి యుండునాయని యాలోచించుకొనుచు దమదారింబోయిరి.