రాణీ సంయుక్త/పదునేడవ ప్రకరణము

పదునేడవ ప్రకరణము

మునాతీరమున గలిగిన యుద్ధజయమువలన బైరాగికిని చక్రవర్తికిని మైత్రి ప్రభలము కాసాగెను. పృధివీరాజతని బ్రాణన్నేహితునిగ నెంచుకొనుచు బ్రధానులతో సమానముగ గారవించుచు దనవద్దనే యుంచుకొనెను. ఇట్టుకొన్నిదినంబులు జరుగ నొకనాడాయోగి చక్రవర్తి నేకాంతస్థలమునకు గొనిపోయి యతనితో మహారాజా! నేను తమయెడలఁగావించిన యీచిన్న నేరమును క్షమింపుడు, దేవరవారితోడనే నన్నిసంగతులు వచించితినిగాని యొకటిమాత్రము చెప్పక దాచితిని. ఆనాడు కాళికాలయమున మీరు రక్షించినకన్య జయచంద్రునికూతు రని మాత్రము వచించియుంటిఁగాని యామెవిషయమై మఱేమియు జెప్పలేదు. ఆచిన్నదానిపేరు సంయుక్త యందురు. ప్రపంచము నందంతట సౌందర్యమున నగ్రగణ్యులని ప్రఖ్యాతిగాంచిన కన్యకా రత్నములలో నొకతెయైయున్నది. ఆమె గుణగణంబుల నేమని వక్కాణింతును. గురులయెడ నమ్రతయుఁ, దోడివారల యెడ విశ్వాసమును, బేదవారలయందు గరుణయు నందఱిపై సమదృష్టియుం గలిగి మూర్తీభవించిన సద్గుణపుంజయో యన నొప్పుచుండును. విద్యయందామెతోఁ దులఁదూగగల కాంత లిక్కాలమున లేరనియే వచింపనగును. ఇంతియేగాక శత్రు సమూహంబులు పురుషుఁడని భ్రమనొందునట్లు యుద్ధమున రణప్రావీణ్యము జూపఁగలదు. మఱియు చిత్రలేఖనమున గడునేర్పరి. చూపరులు ప్రకృతిసిద్ధములని భ్రమించుగతి పలురకములవస్త్వాళి నిర్మించుటలో ముందామెను జెప్పి తరువాత నింకొకరి జెప్పవలయు, ఆకన్నియ యిప్పుడు సుమారు పదునారుసంవత్సరములది. అట్టిసంపూర్ణ కళానిధియై రాజిల్లునా జవ్వని తనపంచప్రాణముల మీపై నిడుకొని రేయింబగళ్లు మీనామస్మరణయే చేసుకొనుచు నిద్రాహారములు సహితము మాని కృశించిపోపుచున్నది. జయచంద్రుడు స్వయంవరవిధి నామెకు వివాహముగావింప నెంచియున్నాడు. ఈ వార్తనే మీతోనపుడు చెప్పకదాచితి. వామమార్గలనుటతోడనే మీరు కత్తిగట్టి బయలువెడలుదు రనియు దమ్మూలమున నాకన్నియకు రక్షణగలుగు ననియు సావకాశముగ నీవార్త దెలియబఱచెదగాక యని యూహించి యిప్పటి కూరకుంటిని. ఎటులైనా కన్నియ మనోవాంఛితంబు నెరవేర్పుడు. మీకను జయచంద్రునకును గల వైరమునెంచి యుపేక్షషచేసినచో నిక్కముగనాకన్నియ యాశా భంగమయ్యెనని ప్రాణములఁ ద్యజించుగాని బ్రతికియుండ నేరదు. ఈ వృత్తాంతము మీ కెఱుకపఱచుటకై నేనెన్ని యో కష్టములంది వచ్చితి ఇక నాలుగుదినములుమాత్ర మీ నగరమున నుండెద. అనంతరము నాకు సెలవొసంగవలయునని వేడ నింతవరకు గనురెప్పలు వ్రాల్చక బైరాగివంకనే చూచుచు నతడు వచించుదాని వినుచున్న చక్రవర్తి దిగ్గునలేచి యతని హస్తములు పట్టికొని మహాత్మా ! నీవు కేవలము నాపాలిభాగ్య దేవతవుగాని వేరొండుగాదు. కొంచెమెడమైన నట్టేటం గలసి పోవునట్టి నా రాజ్యము నుద్దరించి పుణ్యంబు గట్టుకొంటివి. సంయుక్త గుణసౌందర్యాదులఁగూర్చి వినియున్నందున నిదివరకే ప్రేమంపుబీజము మొలగలెత్తి యుండెగాని యా కోరికయీ నడుమ నా కన్నియ మనంబు తెలియమిని. మా రెండు రాజ్యములకుఁ గల వైరమునను నించుకవాడఁ బారియుండెను. ఇత్తరి మీ వాక్యామృత ధారలచే మఱల రేకెత్తుచున్నది. మీవంటి యుత్తము లేకడకేగిన నే కొదువలు గలుగవు గాని యైనను నా మనవి జిత్తగించి నారాజ్యమందే వసింపుడు " అని నెయ్యము తొలూకాడఁ బలికిన రాజు వాక్యములకు సంతుష్ట మానసుడై బైరాగి మరలనిట్లనియె, “రాజచంద్రా ! నీ రాజ్యము నందుండుటకు నా కేయాటంకములు లేవుగాని నేనింకను గొన్నికార్యములు నెరవేర్పవలసియున్నది. నే మరల మిమ్ముఁగలసి కొనియెదను. నీవు మాత్రము జాగరూకుఁడవై సకలసైన్యముల నాయత్త పఱచుకొని యుంచుకొనుము. మహమ్మదీయుల యార్బాటములు చూచినను జయచంద్రుని మూర్ఖత్వము జూచినను నీ యార్యావర్తమునకు ఘోరసంగ్రామంబు పొడమునను యూహ కలుగుచున్నది. ప్రస్తుతము నిలువయున్న సైన్యములనే నమ్ముకొని యుండక నీ రాజ్యమందలి యౌవనవంతుల నందఱి రప్పించి వారికి యుద్ధశిక్షణ నేర్పించి యుంచుకొనుము. నే నెట్లునుపోవక తప్పదుగాన నాకు సెలవొసంగమన నెట్టకేలకు నాలుగు దినము లుండిపోవుటకు సమ్మతించెను. సంయుక్త సమాచారము వెలిబుచ్చిన పిమ్మట నా రాజున కామెపై ననురాగము కలిగినది లేనిది తెలుసుకొనుటకై నాలుగు దినముల వరకు నుండి యతని రహస్యవృత్తములవలన నామెయందు బద్దానురాగుఁడైనట్లు గ్రహించి యావల నతని యనుమంతంబు గొని బైరాగి వెడలిపోయెను. అతఁడేగిన దాది జక్రవర్తియు జింతాకులుఁడై మనము నంతయు సంయుక్తమీద నిడుకొని యామె నెట్లు బెండ్లాడ వలనుపడునా యని తలపోయు చుండెను. ఇట్లు దీర్ఘాలోచనపరుండై కాలమెట్లోగడుపుచుండ నదివరకే దేశములమీదఁ బోయియున్న చారులు కొందఱరుదెంచి కన్యాకుబ్జమున జరిగిన సమస్త వృత్తాంతముల నెఱుకపఱచిరి. అత్తరి జయచంద్రుఁడు చేసిన పనికి రోషమును సంయుక్త కావించిన దానికి మహానందమును గలుగ మఱునాఁడు కొలువుకూటమున మంత్రులు, దండనాయకులు మొదలగు వారందఱు పరివేష్టించి యుండ వేగులవారు తెచ్చిన సమాచారముల వెల్లడించి యేమి నేయుదమన గొందఱు దండనాయకులు జయచంద్రునిపై దాడి వెడలుదమనిరి. అత్తరి వారి నాపి ప్రధానియగు విజ్ఞానశీలుఁడు లేచి “రాజా ! పట్టుపట్టుమని తలఁచుకొన్నపుడెల్ల యుద్ధమున కేగుచుంటిమా యందువలన నమితమగు నష్టమగును. గౌరవము చెడును. అనుకొన్నపుడంతయు బోవుచుండుట వలన నొకవేళ నపజయము గలిగినను గలుగవచ్చును. సామదానభేదదండము లందు సామమున నెప్పటికిఁ గార్యములు చక్కపఱచుకొన నగును గాని ముందుగ దండమునకు దిగు టుచితముకాదు. మఱియు రణకారణమున ద్రవ్యనష్టమును వేలకొలది ప్రజా నష్టమును గలుగును. మొన్న మొన్ననే మహమ్మదీయులపై నెత్తివచ్చిరి. మరల నింతలో తొందరపడనేల? అదియుంగాక స్వదేశమందలి రాజు లొకరితో నొకరు పోరాడుకొనుచున్న పరదేశముల వారికి మిక్కిలి యలసగును, కావున జయచంద్రుని సమాచారమేమో యింకను గనుగొందము. ఇంచుక యోపిక పట్టి యుండుడు. అని వచింపఁ జక్రవర్తి వేరొండుపలుకనోడి యూరకున్న సమయమున బ్రతిహారియొకఁ డేతెంచి కన్యాకుబ్దమునుండి రాయబారి వచ్చి ద్వారమునఁ గాచుకొని యున్నాడని తెలుప నతని గొనిరమ్మన బ్రతిహారి యట్లే యొనరించి వెడలిపోయెను. వచ్చిన రాయబారి యుచితాసనం బంగీకరించి జయచంద్రుఁ డంపిన లేఖ రాజుగారి కొసగెను. చక్రవర్తి తన దగ్గరనున్న వేరొకనికిచ్చి చదువుమన నాతఁడిట్లు చదువ నారంభించెను. "నూతనముగ ఢిల్లీనింగొని చక్రవర్తి యనుపేరు పెట్టుకొన్న పృథివీరాజుగారికిఁ గన్యాకుబ్జ నగరాధీశుండగు జయచంద్రుఁడ్రు తెలియపరచు విషయములు :-

నీవు రాజ్యమందల్లరులు సాగించి జనసంచయముల హింసించుచున్నావని వినియు వాటికి నాకు నేమాత్రము సంబంధము లేనందున నూరకుంటిని. ఇప్పుడు నాకడకంపించిన లేఖవలన నీసమాచారమంతయుఁ బూర్తిగ వెల్లడియైనది. “నీవు నాతో మైత్రిఁ బాటింపఁ దలచితివా సంయుక్తను నాకొసంగుము. లేకున్న రాక్షస వివాహమునైనఁ గైకొనెద, "నని బింకములు పలికి వ్రాసియున్నావు. నీతో మైత్రి పాటింపకున్న నాకు బ్రతుకు దెరువులేదని దలఁచితివా? చేతనైన పక్షమున నట్టిమాటలతోఁ గాక క్రియఁగనుఁబఱచి నాకూతుఁగైకొనుము. అందులకునే వెనుదీయవాడఁగాను. సర్వసిద్ధుఁడనై యున్నాను.

"జయచంద్రుఁడు"

అని చదువుచున్నంత సేపు నక్షౌహిణీపతులు రోషావేశులై చూచుచు కూరుచుండిరి. చక్రవర్తియు నాగ్రహవ్యగ్రుఁడై కోపము బైటరాకుండా నాపుకొని " విజ్ఞానశీలా ! ఇప్పుడు నీవే మనియెదవు ?" అన నిత్తరి నే మఱియొకవిధముగ విన్న వింతునే ? దేవరచిత్తానుసారము చేయవచ్చును. ఇంతకు మన దేశమున కిడుములు ప్రాప్తింపనున్న వి కాఁబోలు ? అందువలననే జయచంద్రునకిట్టి బుద్ధిపుట్టినది. అని వచించి విజ్ఞానశీలు డూరకుండెను, అంత జక్రవర్తిలేచి యక్షౌహిణీపతుల నవలో కించి “మీ మీ సేనల సన్నాహ పరచుకొని యప్రమత్తులరై నే లేనికాలమున మన దుర్గమతి జాగ్రత్తతోడఁ గాపాడు చుండుడు. ప్రస్తుతము నాతోఁగూడ నా తతాయి చనుదెంచు " నని మంత్రులవంకదిరిగి "మీరు యుద్ధమునకు వలసిన వస్తు సామగ్రుల ముందుఁబంపి దారియం దచ్చటచ్చట నాగియుండ వలయునని సేవకులకు జెప్పి పంపుడు, నే లేనితరి మహమ్మదీయ ఖైదీలను, కరీమును జాగ్రత్తమై కాపాడుడు. అని తగినట్టు లందఱ కాజ్ఞాపించి మూడుదినములకు యుద్ధప్రయాణ మేర్పఱచి వెడలిపోయెను. ' ఈ పేజీ వ్రాయబడి ఉన్నది.

ఈ పేజి వ్రాయబడి ఉన్నది.