రాణీ సంయుక్త/పందొమ్మిదవ ప్రకరణము

పందొమ్మిదవ ప్రకరణము

దేవశర్మ వచించిన ప్రకారము కంచుకిపోయి భట్టుగారితో బండిని గుదుర్చుకొని రాత్రి పదిగంటలైనపిదప మనమందిరము వద్దకు గొనిరమ్మనివచ్చితి నన నతని బంపి దనకు జేదోడుగనున్న మిత్రుల నిరువురను బిలిపించి జరిగిన సంగతులన్నియు వారితో జెప్పి చేయవలసిన కార్యమునకై వా రిద్దఱికి మారువేషముల వేయించి ప్రొద్దుగ్రుంకిన పిదప బదిగంటలైన దాది బండికొరకై కనుపెట్టుకొని యుండెను. అత్తరి సూతుండొకఁడు బండిదోలుకొనివచ్చి బయట నున్నాఁడని సేవకులెఱుగింప నా యిద్దఱు మిత్రులతో వచ్చి బండియెక్కి సంయుక్త యుండు ప్రాసాదము వైపునకు నడిపించి యక్కడ నాపి సూతునివద్దకేగి వానిచేత కొంతధనమిచ్చి "ఓరీ! నీకింకను గావలసిన ధనమిచ్చెదను. నేడు నీబండియందు జరుగు సమాచారము లెక్కడను దెలియ నీయవలదు. అటు లొనర్చితివా నీ ప్రాణములు నీవి కా " వన " మహాప్రభో ! ఏలినవారియాజ్ఞకు భిన్నముగా నడచుకొందునా? యని సమ్మతించెను, పండ్రెండు గంటలగుడు సంయుక్త మేడ మీదనుండి బండివచ్చి సిద్ధముగనుండుట దెలుసుకొని తానిదివర కేర్పరచుకొని యుంచుకొన్న రహస్యమార్గమునఁ జనుదెంచి బండికడ నిలచెను. నిలచిన వెంటనే భట్టుగారుచూచి నమస్కరించి లోపల నొకప్రక్క నాసీనంజేసి మిత్రులను సూతుని స్థలమున గూరుచుండజేసి దీపములఁ దీయించి తానును లోపల నొకవైపునఁ గూరుచుండి బండిని మధురాపురము దారిబోనియ్య నాజ్ఞాపించెను. మైలుదూర మరిగినపిదప దానొక వస్తువు నింటికడ మఱచి వచ్చితిననియు నొకనిమిషములో దానిఁజేకొని వచ్చెద ననియు సంయుక్తకుజెప్పి బండిని మెల్లగ బోనిచ్చు చుండుమని సూతునకాజ్ఞాపించి తాను వెనుకకు మరలిపోయెను. భట్టుగారు చనిన పిమ్మట మఱియొక మైలు వరకు బండినిబోనిచ్చి యప్పటికి నతఁడు తిరిగి రానందునఁ దన ప్రక్కనున్నవారి " ఏమి !మీ యజమానుఁడు గారింకనురాలేదని" సూతుఁడడుగ నా యిద్దఱు రహస్యముగ " భట్టుగారికరారు. నీవు త్వరితముగ బండి నింకొక మైలుదూరము పోనిమ్ము. మనమీ బండియందలి కన్నియను జంపవలయు " నన సూతుండు దనలో “ఔరా ! దుర్మార్గులారా : మీయూహ" యని భట్టుగారు తప్పించుకొని పోయి నందులకు లోలోపల నొచ్చుకొనుచు ముందేగిన నేమగునో యనుతలంపున దానక్కడ దిగవలయునని వారితోఁజెప్పి దిగి యించుక వెనుకకేగి బట్ట మొదలగునవి బాగుగ సవరించుకొని బండి వెనుకనుండి వచ్చి యొకప్రక్కనున్నవాని తలనెగర గొట్టెను. రెండవవాడుక్రిందికి దుమికి యెదురింప వచ్చుచుండ వానిని బట్టుకొని నేలంబడదన్ని గొంతుకపై గాలువైచి దుష్టాత్ములారా ! రాకుమారిక నన్యాయముగాఁ జంపనెంచితిరా? పరులకెగ్గుసేయ దలపెట్టిరి గావున నాప్రాప్తి మీకే చేకూరినది, చావుఁ " డని వానింగూడ గడదేర్చెను. ఇంతలో నీకల్లోల మంతయుంగాంచి బండిదిగివచ్చి సంయుక్త విస్మయాక్రాంతయై నిలచియుండెను. సూతుఁడామె సమీపింపఁబోవఁ గోపమూని “ దురాత్మా ! ఇట్లేలఁజేసితివిరా " యని తనదగ్గరనున్న యొక చిన్నకత్తితో నతని పొడువంబోగా "ఆఁ ! ఆగుము. నే దేవశర్మ "నని నిజకంఠస్వరమునఁ బలికెను. దేవశర్మ యనుట తోడనే కత్తినాపి "యీ చీకటిలో నేనెట్లు గుర్తిడగలను. దేవశర్మయైననాకింత ద్రోహముఁ గలుగజేయ"డని యాకన్నియ పలుక బండిముందరి దీపమును వెలిగించిచూడు మని సూతుఁడు వక్కాణించెను. సంయుక్త దీపమువెలుఁగున సూతవేషముతో నున్న తనగురువును దేవశర్మం గుర్తించి తనచేతనున్న ఖడ్గము నవతలఁ బారవైచి యతని పాదములపైఁబడి " మహాత్మా ! ఎన్ని దినంబులకు భవదీయ దర్శనమబ్బెను ! మీ చరిత్రముం జూడ నాకాశ్చర్యము గలుగుచున్నది. మీకీబండివాని వేషమేలచేకూరె వీరల నేటికిట్లు వధించితి " రన " బిడ్డా : నే నీ దినముననే యీ గ్రామమున కేతెంచితిని. వచ్చినవెంటనే యీశ్వరభట్టు మొదలగువారు చేయుచున్న కుట్రలు తెలిసినవి. వీరలు నిన్ను వధింప గొంపోవుచున్నారను వార్తవిని సూతుని వేషమూని వచ్చితిని. అమ్మా ! దుర్మార్గులు వచించు కల్లమాటలకులోనై యతఃపురమువిడచి యొంటరిగ నిట్లురానగునా? నేను సమయమునకు వచ్చియుండ నిన్ను రక్షింపగలిగితి. లేకున్న నీవేమగుదు" వన నాశ్చర్యకలితయై యా దుష్టుఁడగు భట్టుపన్నిన పన్నుగడకు విస్మయమందుచు మహాత్మా ! చక్రవర్తిపైఁగల మోహమున నిట్టికార్యముంజేయఁ బాల్పడితిని. ఆదియుంగాక చక్రవర్తికడకు మీరుకొనిపోయిన లేఖను దెచ్చి యీశ్వరభట్టు నాకు గనుబఱచుటవలన రూఢియని నమ్మి మోసపోయితివి . మీరు కైకొనిపోయినలేఖ యా దురాత్మునికడ కెట్లు వచ్చినది? అని సంయుక్త యడుగ దానిసమాచారము సావకాశముగ దెలిపెద గాని నీ విఁక ముందెన్నటికి నిట్లురాకుము. ఈశ్వరభట్టు నీతో మాటలాడిన సంగతులన్నియు వానికడనుండు కంచుకివలన వినియున్నాను. వాఁడుచెప్పినదంతయు వట్టియబద్ధము, చక్రవర్తి రేపో మాపో యుద్ధమునకు రానున్నాఁడట ఘోరసంగ్రామంబు జరుగనున్నది. పురుషవేషమూని నీవాచక్రవర్తి సేనకు దోడ్పడుచు సంగరమున నీ మనోకాంతుండు మెచ్చుకొను కార్య మే దైన సలిపితివా యతఁడు నిన్ను ఢిల్లీకి గొనిపోవును. నేను మరల ఢిల్లీ కేతెంచి నీ మవోవాంఛితంబు నెరవేర్చెదను. నేను వచ్చువరకు నీవృత్తాంత మెవరికిఁ దెలియ పఱచవలదు." అని బోధించి మరల నా బండియందే కూరుచుండ బెట్టుకొని యామె నంతఃపురముఁ జేర్చి తాను వెడలిపోయెను,