రాణీ సంయుక్త/ఎనిమిదవ ప్రకరణము

ఎనిమిదవ ప్రకరణము


అంతఁ దెల్లవారుజామున నాలుగు గంట లగుటయు నిదురఁ జెందియున్న సింగములు లేచి మందబుద్ధులగునో ద్వారపాలకులారా! జయచంద్రునకు బ్రాణసమానురాలగు సంయుక్తను దస్కరు లెత్తుకొని పోవుచుండ నజాగ్రతతో నిదురించు చుంటిరి గాన మిమ్మందఱ నిప్పుడే మ్రింగివై చెదము చూడుండని హుంకారములు సలుపుచున్న వోయన నొక్క పెట్టున భయంకరముగ గర్జింపసాగెను. అత్తరి నాగర్జనముల కుల్కిపడి లేచి మంజరి తన కట్టెదుట సంయుక్తను గానక సంభ్రమముంది పేరులుపెట్టి పిలచియు బ్రత్యుత్తరము గానకొకవేళ తననిద్రాభంగము సేయుట కిచ్చగింపక వేరొక చోటికేగినదేమో యని మృగశాల లన్నింట వెతకి యెచటనుం గానక దిగులొందుచు ద్వరితగతి నారామము బ్రవేశించి నల్గడలఁ బరికించి యెందును బొడగానరాని భయార్తయగుచు నేమియుఁ దోచక బిరబిర మేడనెక్కి ప్రతియంతస్థు నందును రోయుచు శయనమందిరము జేరి యచ్చోటను గానరానందున బొంగి వుచున్న ధుఃఖభారమున మొదలునఱకిన తరువువలె నిలువున నేలఁ గూలి... "హా : ప్రాణసఖీ ! నన్నొంటి దానింజేసి నీ వెచటికేగితివి? మనకు శరీరములు వేరైనను బ్రాణ మొక్కటియేయని ఇదివఱ కనేక మారులు వచించి యుంటివే. ఆయో?: సగము ప్రాణముతో బ్రోవ నీకు మససెట్లువచ్చెను. ఈ దుర్వార్త మీవారల కేమని వచింపుదు ? ప్రాతఃకాల మగునప్పటికి నీ తల్లిచనుదెంచి సంయుక్త యెక్కడని యడుగ నేమని చెప్పుదును? కట్టా! సంయుక్తను నా పొట్టను వైచుకొంటినని వచింపుదునా ! నా పై నింత కాటిన్యమేల పూనితివి. నీ సౌఖ్యమున కాశించియేగదా ! నీవు రమ్మనిన చోటికెల్ల వచ్చుచుంటిని. ఇయ్యెడనన్ను వెంటఁగొనిపోయిన నీయుద్దేశమునకుఁ బ్రతి బంధిక మగుదునని వదలి పోయితివా? హా! ఇంకెందు బోవుదాన” నని బిగ్గరగ నేడ్చిన వారు వీరు లేచివచ్చెదరను భయముస లోలోపలనే కృశింపుచు సముద్ర తరంగములపలె పొర్లి పొర్లి వచ్చుచున్న దుఃఖమున నేమిసేయుటకు దోపక మరల నారామము ప్రవేశించి వెదకిన చోటే వెదకుచు బిచ్చియెత్తిన దానివలె వనమంతట గలయం బరికించి మితిమీరిన శోకమున నటనుండ మనసొప్పక " హా ! నా ప్రాణపదమగు సంయుక్త నెడబాసి నేనేల యొంటరిగ నుండవలయును, నా నెయ్యంపుఁజెలి యెక్కడనో యే యిడు మలో పడుచుండ నేనింట సౌఖ్యముగ నుండ గలుగుదునా? నేనును దదన్వేషణార్థ మెచటికైనఁ బోయేదగాక యని దృఢచిత్తయై తత్క్షణంబ యాయుధాగారమున కేగి యటఁగల కొన్ని యుడుపులతోఁ బురుషవేషము వేసికొని లోపల నడుమున రెండు కత్తులఁ బదిలపఱచుకొని కావలివార లెవరును లేవకమున్నె యారామద్వారములన్ని యుఁ గడచి చింతాసాగరమున మునిగి తేలుచు నెక్కడికో పోయెను. అంతఁ గొంతవడికిఁ బక్షుల కలకలారావములు మిన్నుముట్టఁ జల్లని ప్రభాతవాయువులు మెల్లనవీవఁ దొడఁగెను. ముందు జరగఁబోవు రణమునందిట్లే రక్తసిక్తములగునని సూచించుభంగిఁ దూర్పుదిక్కునందలి యరుణ మరీచులు కన్యాకుబ్జ నగర ప్రాసాద తలముల పైఁ బ్రసరించు చుండెను. కావలివారెల్లరుఁ దమ్మునావేశించియున్న నిద్రా పిశాచముల నతికష్టముమీద వదలించుకొని ఖడ్గపాణులై జాగరూకత తోడ ద్వారముల గాచుచుండిరి. కాని రాత్రిజాము పరుండ బోవునపుడు మూసిన ద్వారము లిపుడు తెఱవబడిఁ యుండుటకేమి హేతువోయని యొక్కడైనఁ దలపడయ్యెను. అత్తరిఁ జెలికత్తెలెల్లరు మేల్కని సంయుక్త శయనమందిరములోనికేగి యామెఁ గానక మంజిరియు లేకుండుట వలన నిరువురు దమకన్న ముందుగాలేచి ప్రాతఃకాల వనవిహారమున కేగి యుందురను తలఁపున వారిఁగలిసికొనుటకై క్రిందికి వచ్చి తోటయందు బ్రవేశించి యన్నిమూలల వెదకి వారిఁ బొడగానక ద్వారములకడకేగి " ఓరీ ! మంజరీ సంయుక్త లెక్కడికైనఁ బోవుట చూచితిరా?" యని యచటి కావలి వారల నడుగ "అమ్మలారా రాత్రంతయు నిదే ప్రకారము గాచుకొనియున్నాము. మాకెవ్వరు గాన్పించలేదని" వచింప నందఱు సంభ్రమాక్రాంత హృదయులై వేవేగ నంతఃపురమున కేగి రాణికాసమాచార మెఱిఁగించిరి. ఆమెయుఁ దల్లడమంది లేచిపోయి జయచంద్రునకు విన్నవించ భయాకులుఁడై యేమి చేయుటకును గాలుసేతులాడక కోట నాల్గుమూలల వెదకించియు గార్యముగానక భటులఁ గొందఱ నన్నికడల పురము లోపల వెలుపల రోయఁబంచి.. యాందోళనమున సుండెను. రాణివాస మంతయు నల్లకల్లోల మగుచుండెను. ఈ సమాచార మప్పుడే నగరమంతట వ్యాపింపఁ బౌరజనంబు లెల్లరుసు విచారపడ సాగిరి. పట్టణమందలి జనంబు కెల్లరు నామె సుగుణములకును, విద్యకుసు, జక్కఁదనమునకును నావాసమని వేనోళ్ళ శ్లాఘింపు చుందురు. మఱియుఁ గాన్యకుబ్జమున రూపొంది వెలసిన లక్ష్మి యని భావించుచుందురు. పౌరులెల్లరు దమ స్వంతబిడ్డలు పోయినట్లు విలపింపసాగిరి. ఇక రాణియొక్క యవస్థ నేమని చెప్పనగు ! జయచంద్రు డించుక ధైర్యవంతు డగుటచే మంజరియు లేనందున వారిద్దరు గలిసి యెక్కడికో పోయియుందురనియు, నిరువురు గలసియున్నంతవరకు వారి కేయిక్కట్టులు సంభవింపవనియు నెంచుకొనుచుఁ గంటికి మంటికి నేకధారగా విలఫించుచున్న రాణినోదార్చి కొలువు కూటమునకేగి చారు లనేకుల నన్నిదిక్కుల వెతకఁబంపి పురమునం దంతట సంయుక్తను గొనితెచ్చువారికి బహుమానము లియ్యబడునని చాటింపించెను. ఆ చాటింపు విని పలువురు బీదలు నగరము వెడలి యనేక గ్రామములు వెతకి యెచ్చోటనుం గానక తిరిగి వచ్చుచుండిరి. మఱికొందఱు రాకొమారికను గనుఁగొన కేల మరలిపోవలయునని పట్టుపట్టి మఱింత దూరదేశముల కేగుచుండిరి. రాణివాస మిట్టి దురవస్థనుండ నైదురాత్రులు గడచెను. ఒక్కరును సంయుక్త వార్తదేరైరి. అనుదినమునుఁ జూడనిదే ప్రాణముల నిలుప నోపనిరాణి తన ముద్దుకూతురు పోకడవలన మంచముపట్టి నిద్రాహారములుమాని యహోరాత్రము లొక్కతీరున విలపించుచుండెను. "హా ! కుమారీ! నవశిరీష కుసుమకోమలాంగి వగు నీ వెక్కడ నున్నావు? నిర్దయులారా! నాతో నొకమాటైనను వచింప కెచ్చటి కేగితివి? కట్టా ! నవమాసములు మోచి. కని, యింతపెద్దదాని గావించినందులకుఁ దుదకిదియా తల్లియెడ గనఁబఱచు కృతజ్ఞత. అయ్యో ! పున్నమచందురుబోలు నీ ముద్దుమో మింకెన్నడు కాంచగలను ? హా ! నా దౌర్భాగ్యము. నా ముద్దు కూన నెడబాసి నేనెట్లు ప్రాణముల భరింపగలను." అని గోలు గోలున వలవింపుచుండ నెల్లరుఁ జెంతఁజేరి యోదార్చుచుండిరి. జయచంద్రుడును బుత్రికావార్త తెలియనందున గొలువు కూటమున కేగుటమాని రాచకార్యము లన్నియుఁ జక్కబఱుప మంత్రి కాజ్ఞాపించి తా నంతఃపురంబువదలక చింతాసాగరమున మునిఁగి కూతురు సమాచార మెవరు కొనితెచ్చెదరా యని దినములు లెక్క పెట్టుకొనుచుఁ గాలము గడుపుచుండెను.