రాణీ సంయుక్త/ఇరువదినాల్గవ ప్రకరణము

ఇరువదినాల్గవ ప్రకరణము

అట్లు చక్రవర్తి కమలాకరు నొకనిముసమైన విడచియుండఁ జాలక యతనియం దత్యంతానురాగము కలవాడై తుదకుభోజన శయనాదులయందు సహితము తనవద్దనే యుంచుకొని యొక్కొక్కపర్యాయ మహా ! ఇతని బురుషునిగ నిర్మించిన యా పరమేశ్వరు నేమనవలయు. వీని ముఖలక్షణములు కేవలము సంయుక్తనే పోలియున్నవి. నిక్కముగ నీతని వదనంబు లక్ష్మీవిలాసమున కాటపట్టయి యుంటచేఁ గమలాకరుఁ డను నామము సార్థకమగుచున్నది. అని వాని కులగోత్రాదుల నడుగ నుంకించి యతఁడేమని భావించునో యని యడుగమానుచు నడుగకున్న మనసు నిలువమిఁ దనలో నెవనిగాని నీ కుల గోత్రాదు లేమని యడిగిన దప్పగునా యనుకొని వెండియు నిప్పు డడిగినయెడల నిన్నిదినంబులనుండి నా చేష్టల గాంచుచు సందేహము నొందియున్నందున నేమనుకొనునో యని తుట్టతుద కడుగుటమాని సంయుక్తాకృష్ట హృదయుడై దినములు గడుపుచుండెను. ఇంతలో బైరాగి చనుదెంచెద నని చెప్పిన గడువును . మీరిపోయెను. అంత బృథివీరా జగ్గలమగు మోహంబున “హా ! నా ప్రియురాలి సమాచారం బెఱుంగక దుఃఖించుచుండ నాకడ. కేతెంచి నన్నో దార్చి కొద్ది దినములలో వచ్చి నిన్నుఁ గలిసికొనెదనని వచించిన బైరాగి యింతవరకు రాకతడయుట కేమికారణము? అతండు రావలసిన దినంబు నిన్నటితో గడచిపోయె. ఆహా ! ఆ సొగసులాడిం జేపట్టి సుఖించు భాగ్యంబు నా కేనాటికైన లభించునా? ఆతన్వంగి కరస్పర్శనంబున మేనుగరుపార నుల్లాసము నొందుభాగ్యము నా కెప్పటికైనఁ జేకూరునా? లజ్ఞానతాననయై మందహాసమొలుకఁ బలుకు నా చిలుకలకొలికి వాక్యామృత ధారలచే నా మనోరధ తృష్ణను బాపుకొనుపున్నె మేనాటికైన సంభవించునా? ఆ వన్నెలాడికై కదా! అంత ఘోరరణము గావించితి. తుద కాకన్నెను కన్నులారగాంచు భాగ్యమునకైన నోచుకొననైతి. కట్టా ! మే మందఱము రణంబున మునిగియుండ దుర్మార్గు లెవరైన నామెం గడదేర్చి యుండరుగదా? కాకున్న నామె జనకుండు నన్నంత నీచముగ రాతిబొమ్మను జేసి యవమానపఱచినతరి నా విగ్రహము మెడను బుష్పహారమువైచి నా యవమానమునంతయు బోగొట్టిన యా జగన్మోహిని రణమున జయముగొనియున్న నన్ను వీక్షించుట కేలరాకుండును. తానవ రోధముఁబాసి రాకున్న మానె; నాయందంత ప్రేమగలిగియున్న వనిత నా సమాచార మరయుటకై దాసీజనంబునైన నంపదా? నిక్కముగ నామెకేదో కీడుమూడి యుండవచ్చును. నన్ను వలచియున్నదను రోషంబున నొకవేళ జయచంద్రుడే యామే కపకారము గావించి యుండడుగదా? అయ్యో! నా ప్రేమంపు దొయ్యలి కట్టియపకారమే కలిగియుండిన యోగి నా వద్దకేతెంచి యట్లేలవచించును? " ఆమె కేవిధమైన భయమును లేదు. నీ విప్పుడు రాజధానికేగుము. ఆమె నచటనే పెండ్లియాడగల " వవికదా బైరాగిచెప్పినాడు. అతడు నాతో నబద్ధము లెన్నటికైన వచించునా? వచింపడు. అతని నప్పుడే నా వెంటగొని రాక పోవుట నాదేతప్పిదము. పాప మతడే యిక్కటులఁ జిక్కెనో? ఆ యిందువదన సుందర లావణ్యాంబు రాశినిఁ దేలని నాజన్మము నిరర్ధకము." అని పెక్కు గతుల విచారించుచు బైరాగిపోవునపు డిచ్చిన సంయుక్త చిత్రపటముం గైకొని " ఆహా ! పటము నందే యింత కళావిలాసమైయున్న నీ మోహనాంగి రూపము బ్రత్యక్షముగఁ జూడగల్గిన నెటులుండునో కదా? దీని చిత్రించిన చిత్రకారునకు బ్రాణముఁబోయు సామర్థ్యము లేకుండు టెంతయు విచారకరము. ఱెప్పలల్లార్పక సరసీమధ్యమందలి రాయంచల విహారములు గాంచుచున్నట్లీ బాలికెంతయో నిపుణముగఁ జిత్రింపబడినది. ఔరా ! మందయానంబున నీ వనీతల విహారము లొనర్చు మలయమారుతుఁడు నాకన్న నెన్ని మడుగులో ధన్యాత్ముడుగ గాన్పించుచున్నాడే. లేకున్న వంకరలై ముఖసరోజము నావరించియున్న యీ కన్నియ ముంగురుల స్పృశించి యేలచలింపఁజేయును?" అని మిక్కుటమైన మదనోన్మాదంబునఁ జిత్రపటిమను మాట మఱచి "మారుతాధమా ! నేను కట్టెదుటనుండ నా ప్రియురాలి వదనమేల స్పృశించెద " వని దండింపఁబోయి మరల దెలివి దెచ్చుకొని తాను గావింపఁబోయిన పనికి సిగ్గుపడుచు నిట్టూర్పుఁబుచ్చి యిటునటుఁజూడఁ గమలాకరుఁడ చెంతనుండెను. అత్తరి జక్రవర్తి మనస్సు నిలుపలేక యతని దరిజేరి "కమలాకరా ! ఇటు జూడుము. ఈ చిత్రపటమునందున్న కన్యకయొక్క రూప వైఖరులు నీయందుఁ గన్పట్టుచున్నవి. ఈపె నీకేమైనఁ గావలయునా?" అని యడుగ “రాజేంద్రా! శైశవమాదిగ నీకన్యయు నేనును నన్న చెల్లెండ్రభావముతో నొకటిగ నుంటిమి. మా ఇరువురరూప మొకటియే. ఇందు నీ వేమియుఁ దప్పుదలంపలేదు. రూపమొక్కటి యగుటవలననే జయచంద్రుడు మొదలగువారు మా యిద్దఱ నొకరీతిగఁ జూచుకొనుచు వచ్చిరి. ఇప్పుడీమె మారువేషముతో నెక్కడనో యున్నదని నాకొక యోగిచెప్పినాడు. మరల కొద్ది దినములలో మే మిద్దఱ మొకటియగుదు మను ధైర్యము నాకున్నది." అని కమలాకరుండు పలుక “బాలకా ! నీయీ చెల్లెలిం గాంచకున్కి నా కన్నులు వాచి యున్నవి. ఎటులైన నీమె దర్శనలాభము నాకుఁ గలుగఁ జేయుము. ఇన్ని దినంబుల నుండియు నీ వదన సందర్శనమున బ్రాణంబుల నిలుపుకొని యుంటి. ఈమె ప్రస్తుత మెచ్చట నున్నదో వచింపు" మని దీనముగ వేడుకొనుచున్న చక్రవర్తి యవస్థనంతయు గాంచి కమలాకరుఁ డేమియుఁ జేయఁజాలక యూరక నిలచియుండెను. అత్తరిఁ జక్రవర్తి యుస్సురని నిట్టూర్పులు విడచుచు “హా ! మనోహరిణీ ! నన్నిట్టి బెట్టిదములకుఁ బాలుచేసి నీ వెచటి కేగితివి? ఇంత యవస్థపడు నన్నుఁ గాంచిన నీకు భయము గలుగదా? నా సహృదయస్థురాలవైన నాటినుండియుఁ దిన్నగ నిద్రాహారంబులుగూడ లేవు. రమ్మా ! ఏల జాలముఁ జేసెద" వని యొక సోఫాకుఁ జేరగిలంబడి కనులు మూసుకొనియుండఁ గమలాకరుండు చెంతకేగి యతని శరీరము నిమురుచు " రాజచంద్రా! లెమ్ము ! ఇట్టి దీనాలాపంబు లాడుట నీవంటి ధీరులకుఁ దగునా?" యన స్పర్శసౌఖ్యము నంది చక్రవర్తి దిగ్గునలేచి చెంత గమలాకరుఁడు దక్క పరులెవ్వరు లేకుండుటఁ జూచి విషణ్ణుడై కమలాకరా ! నీ కరస్పర్శనంబున నమితమగు నానందము గలిగినది. ఆహా ! నీహస్త మెంత మృదువుగనున్నది. ఇటుర " మ్మని చేరువఁ గూరు చుండబెట్టుకొని యేమేమో వచింపుచుండ నూకొట్టుచు “నయ్యో! నా యుపాధ్యాయుఁ డేతెంచి యితని మనోరధ మెప్పుడు దీర్చునోగదా” యని కమలాకరుండు తలవోయుచుండెను. ఇట్లు చక్రవర్తి చింతాకులుడై యుండ రెండురాత్రులు గడచెను. మూడవనాడు తెల్లవారి యేడుగంట లగునప్పటికి గమలాకరుండు నిదురలేచి ప్రాతఃకాల కృత్యముల నెరవేర్చుకొని చక్రవర్తి యప్పటి కింకను లేవనందున దా నొంటరిగ బయటికేతెంచెను. ద్వారము బయట నడుగు బెట్టినతోడనే యతనికి గల్గిన సంతసముఁగూర్చి యేమని చెప్పనగును ! ఉత్కంఠుడై యెవరికొరకు నింతకాలము గనుపెట్టుకొని యుండెనో యతఁ డెదురుగ వచ్చుట సంభవింప నతని పాదముల కెఱఁగి యేకాంతమగు చోటికిం గొనిపోయి వృధివీరాజు వృత్తాంత మంతయు నెఱుకపఱచి " తండ్రీ ! ప్రతినిముసము నీ రాకకై యెదురుజూచు చున్నాను. వచ్చెదనని చెప్పిన గడువునాటికి రాకుండుటకు మీకేమి యాటంకములు సంభవించిన" వన నావచ్చిన మనుజుడు " కుమారీ ! ఇల్లు బయలుదేరినది మొదలన్నియు నాటంకములే. చుట్లుపట్ల మ్లేచ్ఛులు చేయుచున్న యార్భాటము లెక్కువైనవి. గ్రామస్తులున్న యూళ్ళవదలి యడవుల పాలగుచున్నారు. ఎవరెట్లగుచున్నను ముందు జన్మింపబోవు వారలకు నాధారములగు గ్రంధజాలములు నాశనమైపోవుచున్నవి. నేను మీతో వచించిన ప్రకారము మొన్నటికే రాకపోవుటకుఁ గారణము వినుము. ఇక్కడ కరువదిమైళ్ళ దూరముననున్న యొక యూరిలోఁగల గొప్ప పుస్తకభాండాగారములు మ్లేచ్ఛులు తగులఁబెట్టి తత్గ్రామ వాసుల నాశనముచేయ నున్నారవి విని యా యూరికేగి నిరాధారులై విలపించుచున్న యక్కడివారి నందఱఁ బురికొల్పి మహమ్మదీయు లేతెంచిన నెదురింప సిద్ధము చేసితివి. అంత నానాఁడు ప్రొద్దుగ్రుంకిన యెనిమిది గంటలకుఁ గొందఱు మ్లేచ్చులు మండుచున్న కాగడాల బట్టుకొని గ్రామము బ్రివేశింపఁదొడఁగిరి. అత్తరి నేసిద్ధము చేసియుంచిన గ్రామవాస్తవ్య సంఘమును మ్లేచ్ఛులూరిబయట నుండగనే వారిపై నడిపించితి. గ్రామస్తులు నాయుత్సాహంపు వాక్యములచే దైర్యమూని శత్రువులతోఁ బోరాడి చివరకు నందరి వధింపఁ గొద్దిమంది తప్పించుకొని పరువెత్తిరి. మరల నట్టి సమయము తటస్థించిన బోరునకుఁ బురికొల్పుకొని పోవుట కొకని నేర్పరచి నేనిట్లు బయలువెడలి వచ్చితి," అన "తండ్రీ! నా యెడఁ జక్రవ ర్తికి గల యనురాగ మంతయు వెల్లడియైనది. అతఁడు నిద్రహారంబులు మాని కృశించుచున్నాడు. ఎటులైన నతని వాంఛితంబు ద్వరలో దీర్పు " మన కుమారీ : నేడే నీకోర్కె నెరవేర్చెదను. నీ విఁక నీ పురుషవేషము నుజ్జగించి చెలికత్తెలఁ గూడుకొని చక్రవర్తియుండు ప్రాసాదము చెంతనున్న కేళీవనిలో విహరించుచుండుము. అని యా నూత్నమనుజుఁ డాజ్ఞాపింప నామెయు నట్లనే యొనరింపఁ బోయెను. అనంతర మతఁడు బైరాగివేషము దాల్చి యప్పుడే సార్వభౌమ కేళీవనిం జేరి యేమిజరుగునో యని యొక పొదరింట డాగియుండెను. అంతఁ గొంతసేపటికి జక్రవర్తి సంయుక్త వచ్చి తన యంకతలంబున గూరుచున్నట్లొక కలగని దిగ్గున నులికిపడిలేచి యెవరును లేకుండుటచే విభ్రాంతుఁడై పార్శ్వవర్తులఁ బిలచి కమలాకరుఁ డెక్కడనవి యడుగ "నతఁ డుదయముననే లేచియెక్కడకో పోయినాడు. ఇంతవరకు మఱలిరాలే " దని వారు వచించిరి. చక్రవర్తి యా మాటలకు విచారమూని ప్రాసాదము నల్గడల వెతకిం చికార్యముగానక వెతంబడుచు హా ! 'మొన్నడిగి నందుల కలుకపొడమి కమలాకరుఁ డెక్కడికో పోయియుండునని " అయ్యో ! నా ప్రియురాలి దర్శనము గలుగకబోయినను నతని గాంచుటవలన నింత సంతసింపుచుంటి. ఇక నెవ్వరిఁ గాంచి మోదమందుదు" నని వంతనొందుచు నటనుండ మనసొప్పక వనము బ్రవేశించి యందొక మూల సంచరించుచున్న స్త్రీ సంఘముంగాంచి యెవరోయని యించుక దగ్గరికేగి యందఱు తన పరిచారికా జనంబులై యుంట గుర్తించి వారి నచ్చోటు బాసిపొండని చెప్పుటకు మఱింత దగ్గరకేగి వారిమధ్య నవకళా నిధిబోలెనున్న సంయుక్తంగాంచి పెన్నిధింగన్న పేదవోలె సంభ్రమాక్రాంత చిత్తుఁడై కొంతతడ వామెను గనురెప్పలు వ్రాల్చక గనుంగొనుచు నలువఁబడి తుదకు " ఆహా ! ఈ తొయ్యలియేకదా ! నా మోహంపు మొలక. ఎన్నిదినంబులకు నా నేత్రసాఫల్యము గలిగినది. ఈ లావణ్యగాత్రి యీ యుపవన మెట్లుప్రవేశించెనో " యని యాశ్చర్యపడుచుండ సంయుక్తయు వాల్గన్ను లఁ దనప్రియుని వీక్షించుచుఁ దన్న తఁడు గాంచినతరి మరియొక వైపున జూచుచుఁ దలవంచుకొని నిలువబడి యుండెను. చక్రవర్తి యామె విలాపముంగని పట్టరాని తమకంబునఁ జేరవచ్చుచుండ జెంతనున్న పరిచారికలు పొదల మాటున కేగిరి. తోడనే యతఁ డామె పాణిగ్రహము గావించెను. అప్పుడు వారిరువురకు గలిగిన యానంద మింతింతయని వచింప నలవికాదు. ప్రవ్వేదముద్భవింప బులకలునిండార నిరువురు గొంత సేపటివరకు దేహములు మఱచియుండిరి. అప్పటి వారి సౌఖ్యము కేవల మనుభవైకవేద్యమే గాని వేరుకాదు. జక్రవర్తి స్నిగ్ధమై కళలదేరుచున్న యా బాలిక మోమునుగాంచి మోహమగ్గలమై త్రిప్ప ముద్దిడుకొనబోయెను. గాని యామె తటాలున ముఖము నవతలకు త్రిప్పుకొని చేయివిడిపించుకొని యించుక దూరమునకేగి నిలచెను. అంత నతడు మరల నామెను గలుసుకొన బోవుచుండఁ బొదరింట డాగియున్న బైరాగి బయటికేతెంచి యెదుటనిలచెను. చక్రవర్తి యతని గాంచుటతోడనే తత్తరమంది నమస్కరించి నిలువ “రాజేంద్రా ! నీపై మోహము గలిగియున్నను నీపె యింతవరకుఁ గన్యకయేగదా. గురుజనంబులు లేనియెడ నీమె నొంటరిగఁ జేపట్టుట యుక్తమగునా ? ఇప్పుడీమెం దగిన పరిచారికలతో నంతఃపురముఁ జేరఁబంపుము. నీవు నీ మందిరమున కేగియుండుము. పురమంతయు నలంకరింప నాజ్ఞాపించి రేపే మీ వివాహము నెరవేర్చెద " నని బలుక యోగికి మారుబల్కనోడి యభీప్సిత కార్యసిద్ధి కాటంకము లెన్నైన గనుగుచుండు ననుకొనుచుఁ జక్రవర్తి యచ్చోటు విడచిపోయేను. సంయుక్తయుఁ దరువాత దన్నుఁ జేరవచ్చిన పరిచారికలం గూడి రాణివాసమున కరిగెను. బైరాగి వివాహప్రయత్నము లొనరింప వెడలిపోయెను.