రాజశేఖరచరిత్రము/ప్రథమాశ్వాసము

చ.

ఎలుకల రాచతేజి నెఱ యెక్కుడుగాఁ డపరంజిపైఁడిని
గ్గులుగల మేనిపెన్వడుగు క్రొన్నెలదాలుపుముద్దుపట్టి కొ
మ్ములుగల వేల్పు విఘ్నతరుమూలములం బెకలించు బల్లిదుం
డలగణభర్త యప్ప సచివాగ్రణి కీవుత నీప్సితార్థముల్.

5


క.

ఆ కాళిదాస ముఖ్య
వ్యాకోచవచోవిలాసు లగు నామరభా
షాకవివర్యులకు నమో
వాకం బొనరించి యే నవారితభక్తిన్.

6


గీ.

సరససంస్కృతపుష్పగుచ్ఛప్రభూత
మగు తెనుంగను నెత్తావి కఖలదిశలఁ
దరుణపవమానమగు కవిత్రయవిశేష
చతురవాచానిరూఢి కంజలి యొనర్చి.

7


క.

చెప్పఁదగుఁ గవిత రసము
ల్చిప్పిల నప్పప్ప బళి బళీ యనలేదా
యెప్పుడు చేయక యుండుట
యొప్పుసుమీ సుకవి యెంత యుచితజ్ఞుఁడొకో.

8


శా.

గాడార్థప్రతిపాదనక్రమకళాకౌశల్యము ల్లేక వా
చాడక్కార్భటితోడఁ దామ తము మజ్ఝా యంచుఁ గైవారముల్
ప్రౌఢిన్ జేయుచుఁ బ్రాజ్ఞుల న్నగుచు గర్వగ్రంధులై యుండు న
మ్మూఢస్వాంతుల మెచ్చకుండుటయు సమ్మోదంబు మాబోంట్లకున్.

9


వ.

అని యిష్ట దేవతాప్రార్థనంబును బురాతనచతురసుకవిప్రశంస
నంబును గుకవినిరసనంబును గావించి యే నొక్కమహాప్రబంధంబు
నిర్మింపఁ దలఁచియున్న సమయంబున.

10

కృతిపతి ప్రశంస

సీ.

భట్టియుగంధరప్రముఖులకృత్యంబు
                       లొరగు లొత్తెడు మంత్ర లొక్కవంక

విక్రమార్కోదగ్రవిక్రమక్రమకళల్
                       లెక్కచేయని శూరు లొక్కవంక
శేషాహిభాషావిశేషంబు మెచ్చక
                       యుండు విద్వద్బహ్మ లొక్కవంకఁ
గాళిదాసాదులఁ గవితాప్రగల్భత
                       నొరయు సత్కవివర్యు లొక్కవంక


గీ.

దాసమానక్రియానూనగానసరణి
వెలయు తుంబురు నారదాదుల గుఱించి
యుల్లసంబాడు గాయకు లొక్కవంక
మహిమఁ గొలువఁగ నప్పన మంత్రివరుఁడు.

11


క.

పేరోలగ ముండి కవి
త్వారూఢవిశేషగోష్ఠి నాలించుతమిన్
రారమ్మని ననుఁ బిలిచి సు
ధారసమధురోక్తిఁ బలికెఁ దద్దయఁఁ బ్రీతిన్.

12


ఉ.

శంకరపాదసేవనవశంపదమానస పంకజాతని
శృంకవచోవిలాస రుచిసారవినిర్జితపూర్ణపూర్ణిమై
ణాంక దురక్షరాననభయంకర శౌనకగోత్రపాత్ర య
య్యంకిపురాగ్రహారవిభవాకర మాదయ మల్లసత్కవీ.

13


క.

నీ విపుడు చెప్పఁదలఁచిన
భావరసోద్యన్మహాప్రబంధము నాపైఁ
గావింపు మంకితంబుగఁ
గోవిదహృదయప్రమోదగుంభితఫణితిన్.

14


వ.

అని సబహుమానంబుగాఁ గర్పూరతాంబూలానర్ఘ్యమణిమయాం
బరాదు లొసంగిన బ్రీతచేతస్కుండనై యంగీకరించి నా రచియిం
పం బూనిన యిమ్మహాప్రబంధంబునకు సారఘనసారప్రాయం
బగు నాయకుని వంశావతారం బభివర్ణించెద.

15

కృతిపతివంశవర్ణనము

శా.

శశ్వత్తీవ్రతపోమహామహిమచే జంభాసురద్విట్పురీ
విశ్వైశ్వర్యకళాసమృద్ధి సరిగా వేర్వేర నిర్మించి
దశ్వాసుండకు వేల్పుఱేని కెనయై తా మించె నేమౌని యా
విశ్వామిత్రమునీంద్రు మామకమనోవీథిం బ్రంశంసించెదన్.

16


క.

ఆకౌశికవంశాబుధి
రాకాహిమరోచి సచివరత్నము పుణ్య
శ్లోకుఁడు వితరణరేఖా
నాకానోకహము మంత్రి నామన వెలసెన్.

17


చ.

అతనికి సింగమాంబకు మహామహు లాశ్రితవజ్రపంజరుల్
సుతులు జనించి రంచితవచోరచనాఫణి భర్తలోకస
మ్మతనుతిమార్గవర్తనుఁడు మాదయ మంత్రియు గంగనార్యుఁడున్
గతకలికల్మషుండు చిటిగంగనయు న్నిగమత్రయాకృతిన్.

18


ఉ.

సాళున నారసింహ మనుజప్రభు కార్యకళాదురంధరుం
డై లవణాబ్ధివేష్టితధరాధిపదుర్మతమంత్రమంత్రి శుం
డాలవితానకేసరి యనంగ ననంగసమానరూపరే
ఖాలలితాంగుఁ డట్టి చిటిగంగన యొప్పు గుణానుషంగుఁడై.

19


శా.

అంగాధీశ కళింగరాజ మగధాద్యక్షాది భూభృత్సభా
రంగాభంగవిహారముల్ ఘనశిలోగ్రావస్థలీసంసర
ద్గంగోత్తుంగతరంగనిర్గళితనిధ్వానోద్భటప్రక్రియా
సాంగత్యంబులు చిట్టిగంగవిభు వాచాసంభ్రమారంభముల్.

20


క.

అందగ్రజునకు ధృతిజిత
మందరకుధరునకు మాదమంత్రికి సౌంద
ర్యేందిర యగు నమలాంబకు
కుందనులు జనించి రార్యవందితు లగుచున్.

21

శా.

ఆరూఢోన్నతి నన్నపార్యుఁడును సింగామాత్యుఁడున్ సర్వవీ
ద్యారాజీవభవాకృతిన్ వరదదండాధీశుఁడున్ మంత్రి చూ
డారత్నంబగు మాధవుండు సరిరా డ్వర్గచ్ఛిదాపాదన
శ్రీరామాపరమూర్తి యీతఁ డనఁగా శ్రీరామభద్రాఖ్యుఁడున్.

22


గీ.

అందు వరదయమంత్రి సంక్రందనునకు
గోపమాంబకు నుదయించి రాపగేంద్ర
సన్నిభులు తిమ్మనార్యుఁడు జిన్నతిమ్మ
ఘనుఁడు గొండయమంత్రిపుంగవుఁడు ననఁగ.

23


ఉ.

వారలలోన నగ్రజుఁ డవారితశౌర్యుఁడు తిమ్మమంత్రి మం
రార ముదగ్రదోరసివిదారితదారుణవైరివీరకం
ఠీరవకంఠశోణితధునీఘనఫేనవిభాసితత్పత
ద్భూరిసితాతపత్రరణభూమి యతం డొకమంత్రిమాత్రుఁడే.

24


శా.

నాదిండ్లాన్వయవార్ధిశీతరుచిదానక్షాత్రసంపన్నుఁ డా
శాదంతావళదంతకుంతపటలస్పర్ధాళుసత్కీర్తి నా
నాదేశక్షితిపాలమంత్రికులరత్నం బాశ్రితవ్రాతవీ
క్షాదాక్షిణ్యనివాసభూమి యని లోకఖ్యాతి మించె న్మహిన్.

25


గీ.

సత్యగుణశీలి యమ్మహాసచివమణికి
గృష్ణమాంబకుఁ గోనమంత్రీశ్వరుండు
భాగ్యసంపన్నుఁ డప్పనప్రభుఁడు గోప
దండనాథుండుఁ బుట్టి రుద్దండలీల.

26


ఉ.

ప్రాపితరాజ్యవైభవనిరాకృతపాకవిరోధియైన యా
గోపనమంత్రి ధర్మధనగోపనసమ్మతి గుత్తి దుర్గ ల
క్ష్మీపరిపాలనక్రమసమిద్ధభుజాబలశాలి రూపరే
ఖాపరమత్స్యలాంఛనుఁ డయాహవకార్యధురంధరుం డిలన్.

27


సీ.

శీతలాకృతిఁ గొంత చెప్పంగఁదగుఁ జంద్రు
                       నెలనెల నుష్ణాంశుఁ గలయఁడేని

వితరణస్థితిఁ గొంత ప్రతివచ్చు మేఘుండు
                       చపలానుషంగంబు సడలెనేని
భోగసంపదఁ గొంత పురుడింపఁ దగు నింద్రుఁ
                       (బాకారి) యనుపేరఁ బరఁగఁడేని
సౌందర్యమునఁ గొంత సరివత్తు రాశ్వినే
                       యులు భేషజంబూని యుండరేని


గీ.

కొంత యెనవచ్చు గాంభీర్యగుణమునందు
నంబుధిస్వామి యొకవేళ నడఁగఁడేని
యనఁగ సర్వగుణఖ్యాతి నతిశయిల్లె
మానధనరాశి గోపన మంత్రివరుఁడు.

28


క.

ఆయనుఁగుందమ్ముఁడు విన
యాయతమతిఁ గొల్వ నప్పనార్యుఁడు నతఁడున్
బాయక యన్యోన్య ప్రియు
లై యలరిరి రామలక్ష్మణాకృతు లగుచున్.

29


క.

ఆయప్పమంత్రిగుణములు
వేయితెఱంగులఁ జెలంగి వినుతి యొనర్పన్
డాయఁగఁ గాకోదరకుల
నాయకునకుఁ గాక కవిజనంబుల తరమే.

30


సీ.

నిజకీర్తిజలధికు న్నిద్రగుణస్ఫూర్తి
                       నిత్యపూర్ణేందుగా నిలిపినాఁడు
కరహేతి పరశిరఃకమ్రకిరీటాగ్ర
                       పీఠులపై వాడిఁ బెట్టినాఁడు
ధరదాల్ప హరిదంతదంతిసంతానంబు
                       మూలకు ముట్టఁగాఁ దోలినాఁడు
వాచానిరూఢిగర్వము చూప వచ్చిన
                       శేషాహినాలుకల్ చీరినాఁడు

గీ.

కపటరాజన్యమంత్రిదుర్వర్గభార
తిమిరపటలంబు శేముషీతీవ్రభాను
భానుమాలికచేఁ బటాపంచ చేసి
వెలసినాఁడన నప్పన వినుతిఁ గాంచె.

31


మ.

పలుమా ఱంబుధరంబు చూపు బహురూపం బంబరాసక్తి శీ
తలభానుండును బొట్టపెంచుటకు నై తాల్చుం గళాప్రౌఢి ని
చ్చలు వారింపఁ జరించువారినిధి యాశాబద్ధుఁడై వీరలన్
దిలకింపందగునోటు దాతలని నాదిండ్లప్పనిం జెప్పుచోన్.

32


సీ.

ఏమంత్రిమణి నిజస్వామికార్యక్రియా
                       తత్పరమానసోత్సాహశాలి
యేమంత్రి మణిమిత్రహితబాంధవాశ్రిత
                       ప్రకటరక్షణకళాప్రౌఢిబుద్ధి
యేమంత్రిమణి వచోహేలాతినైర్మల్య
                       శీతలతాధూతశీతరోచి
యేమంత్రిమణి సుధాధామశాంభవధామ
                       ధాళధళ్యసుతుల్యధవళకీర్తి


గీ.

యట్టి మంత్రికులోత్తంస మహితనృపతి
పటలమకుటాగ్రఘటితపత్పద్మయుగళి
సకలకర్ణాటరక్షావిచక్షణుండు
దీనసురశాఖి సాళువ తిమ్మమంత్రి.

33


గీ.

అమ్మహామంత్రి కతని యర్ధాంగలక్ష్మి
సకలపుణ్యాంగనాజనశ్లాఘనీయ
లక్ష్మమాంబకు నుదయించి లలిని మెఱము
తిరుమలాంబికఁ బెండ్లియై తేజరిల్లె.

34


ఉ.

చెప్పెడిదేమి నవ్వుచు రచించిన మాటలు రాము బాణముల్
దప్పినఁ దప్పఁ డాశ్రితకలాపము ముంగిట నున్నవేలుపుం

దిప్ప వివేకశాలి యువతీజనచిత్తవినూత్నదర్శకుం
డప్పన మంత్రి వానిఁ దరమా నుతియింప నిలింపకోటికిన్.

35


శా.

నాదిండ్లప్పని శుభ్రకీర్తు లమృతాంధస్సింధువీచీఘటా
తాదాత్మ్యంబు వహింపఁబోలు నదిగాదా తద్భుజాపీఠికా
ప్రాదుర్భూతపటుప్రతాపసుషమాభర్మాంబుజాతచ్చటా
శ్రీదాంపత్యము చూపు నెవ్వఁడు నభస్సీమ న్విజృంభించుచున్.

36


క.

అప్పన పెట్టక నాదిం
డ్లప్పన చేతికి నొసంగు నభిమతఫలముల్
తెప్పలుగాఁ గోకొమ్మని
యప్పనఁగా నెఱుఁగ రెందు యాచకముఖ్యుల్.

37

షష్ఠ్యంతములు

.
క.

ఈదృగ్గుణాహికర్ణున
కాదరసల్లసననవకృతాహృతిచాతు
ర్యోదయచక్షుఃకర్ణున
కాదిమవైష్ణవకథానియతకర్ణునకున్.

38


క.

కుటిలారి భయదసేనా
ర్భటికిన్ బలశౌర్యనిలయపటికిన్ రాధా
విటమంత్రలిఖితమతిసం
పుటికిన్ సత్రామృతాన్నపోషితజటికిన్.

39


క.

దంభేతర మతిగతి సో
హంభావ మ్మతికి సంభృతావని బాహా
స్తంభధృతకుంభినీధర
కుంభీనసజరఠకమఠకుంభీతతికిన్.

40


క.

శ్రీకవితాపఘనోద్ఘు
ష్యా(?)కోటి నవీనరోమసంఘమిష వస
ల్లోకోత్తరగుణబీజా
స్తోకాంకురనిధికి దానదుర్గాంబుధికిన్.

41

క.

శీలవదాళి విధాతకు
సాళువ తిమ్మప్రధాన జామాతకు ను
ద్వేలస్పర్శనవిజిత
త్రైలోక్యచరాచరప్రదాతకుఁ బ్రీతిన్.

42


వ.

అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పంబూనిన యిమ్మహాప్రబం
ధంబునకుం బ్రధానకారణంబగు నావంచికపురం బెట్టిదనిన.

43

కథాప్రారంభము

.
సీ.

సౌధచరద్వధూజనదర్పణీభవ
                       ద్దివ్యలోకస్రవంతీజలంబు
రజతవప్రస్థాణుగజచర్మశాటీభ
                       వత్పరిఘావారివలయితంబు
శాతమన్యవశిలాస్థగితకాంచీదామ
                       భాసురోపవనాళిపరివృతంబు
పౌరప్రతాపవిభ్రాంతికృత్కుట్టిమ
                       స్థలశోణమణిరుచిస్థపుటితంబు


గీ.

బహువిధామోదమోదితభసలకలభ
విసరవిసృమరఝంకారవేణునినద
సరసగాయకగానప్రసంగసౌఖ్య
కరణకరమగు నావంచికాఖ్యపురము.

44


శా.

నీడల్పాఱు పసిండిమేడలపయిన్ నీలాలకల్ పుట్టచెం
డాడం దాఁకిన కందుగాని శశియం దంకంబు గా దంచు వా
దాడన్ వచ్చిన యంకకానికిఁ దదీయాశంకతో వీటిపెన్
బ్రోడల్ తోడ్కొనిపోయి చూపుదురు తన్నూత్నక్రియాకేళికల్.

45


ఉ.

వారణవారకర్ణపుటవాతకిశోరవిసారసారక
ర్పూరపరాగముల్ నెఱియుఁ బో పురవీథులఁ దారతార ము
క్తారమణీయమంటపవితానవినిర్గతకాంతి వాహినీ
పూరములోపలం గలయఁ బొల్చు వినిర్మలవాలుకాకృతిన్.

46

ఉ.

వాడల వాడలన్ మెఱయు పౌరవధూటుల వక్త్రపద్మసం
క్రీడ దనూనవాసనకుఁ గేలిసరోవరఫుల్లహల్లక
క్రోడసుగంధిగంధములకుం గలహంబులు చక్కఁబెట్టి చె
ల్లాడఁగఁ జేయు సజ్జనుక్రియన్ మలయాచలవాతపోతముల్.

47


ఉ.

గబ్బి పిసాళి వాలుఁ దెలికన్నుల తేటమిటారి చూపులన్
మబ్బుకొనంగఁ జేసి విటమానసముల్ దమివెల్లి ముంపుచున్
గుబ్బమెఱుంగుఁ జన్నుఁగవ కుంకుమపూతల కమ్మతావి యా
గుబ్బులుగాఁ జరింపుదురు కొమ్మలు తత్పురమార్గవీథులన్.

48


చ.

అరవిరిబాగుతో నలరు లమ్ము లతాంగుల లేఁతనవ్వులన్
బెరసి సరంబు లప్పటికిఁ బెంపు వహించుట జేసి చూపరుల్
గర మనురక్తిమై నిలిచి కైకొని పిమ్మటబోయి చూచి యా
సరములుగావు పొమ్మనుచు సారెకుఁగ్రమ్మఱ వత్తు రేమనన్.

49


ఉ.

కాఁకరపండువంటి జిగి గల్గినమేలి పసిండిధాత్రికిన్
వ్రేఁకము ద్రవ్వి పోసినను వేయియుగంబులు చెల్లుధాన్యముల్
పోఁకకుఁ బుట్టె డమ్మినను బోనొకకల్పము పట్టుఁజూడ్కి పే
రేఁకటి దీఱ వైశ్యపతు లిండ్లు గనుంగొన నొప్పు నప్పురిన్.

50


క.

అన్నగరి చిఱుత యేనుఁగు
గున్నలపై నెక్కి నిక్కి కోయఁగవచ్చున్
మిన్నేటి పసిఁడితామర
లన్నన్ మఱి యేమి చెప్ప నందలి కరులన్.

51


చ.

బిసరుహబంధు కొండచఱిఁ బెట్టుటయొండెఁ బయోధినీటిలో
మసలక వైచుటొండె నడుమ న్నిలఁ బట్టఁగరావు వాగవె
క్కసములు మాకు నెందుసరి గావుసుమీ యని యాడుచుండు సం
తసమున భానురథ్యములఁ దత్పురితుంగతురంగసంఘముల్.

52


వ.

మఱియు నప్పురంబు పురందరశిలాశకలనికరనిచితరచితవప్రప్రభా
పూరంబులు పురరాజపట్టాభిషేచనోచితకచనిచయగళితకళి
తోల్పలకందళంబులం బోలి పొలయ నికటఘటయంత్రసలిలసం

వర్ధితారామస్థలపరితోదారశాలికేదారంబులు సతతసన్నిహిత
దర్పకకల్పితానల్పకనకమయవేదికలం బోలి మించ నంచితం బై
యంగజహరశరీరంబును, నయోధ్యాపురంబునుం బోలి సదా
రామాభిరామక్రీడావర్ణనీయం బై విష్ణువక్షస్స్థలంబును విమలాపగా
జలంబును బోలి పద్మాలంకృతం బై నీతివిహారయోగ్యం బయ్యు ననీతి
విహారయోగ్యం బై ఖండనవక్రమంబులు శాస్త్రంబులయంద
శూన్యగృహంబులు చతురంగఫలకంబులయంద కార్శ్యంబులు
కామినీమధ్యంబులయంద కాని తనయందు మెరయనీక యొప్పు నప్పు
రంబున కధీశ్వరుండు.

53


సీ.

శ్రీసతి సీమంతసిందూరవేదిక
                       కపటారి కాసారగంధకరటి
గంభీరగుణకథాకలశపాథోరాశి
                       సాతత్యసత్యవిశ్రమణసీమ
సకలబాంధవకలాపికలాపనీరదం
                       బుదితాఘధరణిబృద్భిధురపాణి
నిజకీర్తివల్లరీనీరంధ్రదిగ్వీథి
                       కవికుటుంబత్రాణకల్పశాఖి


గీ.

సజ్జనానూన కరుణారసప్రవర్తి
భూజనాత్యంతసంస్తుత్యపుణ్యమూర్తి
కామినీలోకహృద్వశీకరణపుష్ప
ధన్వుఁడన నొప్పు నా హేమధన్వనృపతి.

54


మ.

అతఁ డుత్తుంగతురంగధాటి రభసుం డై విద్విషన్మండలీ
నతపైదాంబుజుఁడై యయాతి రఘు మాంధాతృ ప్రభావప్రభా
న్వితుఁడై తాల్చె నశేషభూభరము కంఠే కాలకంఠస్థల
స్థితిసంభావితసంభ్రమభ్రమితుఁడై శేషాహి చెల్లాడఁగన్.

55


క.

కనికరము మోడ్చు పగరం
గనికరమునఁ బ్రోచు లేక కలహించెద నే

ననిలోనఁ జలము పూనిన
ననిలో నిజకోపవహ్ని కాహుతి చేయున్.

56


సీ.

కడుపారఁగాఁ బచ్చికలు మేసి తముఁ దామె
                       యావులు చేసి చన్నవసి పితుకు
దతికాల మొక్కింత తప్పనీక మొగుళ్ళు
                       నెల మూఁడు వానల నెలమి గురియుఁ
బెరిఁగి దట్టంబులై బీరువోక తనర్చి
                       సకలసస్యములు దున్నకయె పండు
దలపూవు వాడక తామరతంపరై
                       ప్రజలు నూఱేండ్లును బరిణమింత్రు


గీ.

మునులు తపములు నిర్విఘ్నముగఁ జెలంగ
నెందుఁ గలిదోష మావంత జెందనీక
క్రతుఫలంబుల సురల యాకండ్లు దీర్చి
దరణిఁ బాలించె నా హేమధన్వ నృపతి.

57


క.

ఈలీల సకలధాత్రీ
పాలన మొనరింపుచును విభావసుతనయం
బాలిక యను బాలిక కుల
పాలికగా నతఁడు సౌఖ్యపరతంత్రుండై.

58


గీ.

పెద్దకాలంబు నడపిన పిదపఁ దనకు
బుత్త్రలాభంబు లేమికిఁ బొగిలి పొగిలి
యొక్కనాఁడు మనంబున నోర్వలేక
పలికె నారాజు పాలికాలలనఁ జూచి.

59


చ.

మలయజగంధి యీకరిసమాజము నీహయపంక్తి యీభటా
వలియును గల్గి నాబ్రతుకు వన్నెకు నెక్కదు పుత్త్రహీనతన్
గలువలవిందు పొందువెలిగా నుడుపంక్తులు మింట మిన్కనన్
బొలుపరి యున్నరాత్రిగతిఁ బూర్వకృతంబది యెట్టిదోగదా.

60

ఉ.

మచ్చికతోడఁ బాఱులు కుమారుని నక్కునఁ జేర్చి వీథికిన్
వచ్చిసుఖోపలాలనమునన్ మునుమాపులు ముద్దుసేయగా
నిచ్చల నిచ్చలుంగని యొకించుక యేనియుఁ బాయ వేకటుల్
ముచ్చటదీఱ నింక మనముుం గయికొందుమె యట్టిభాగ్యముల్.

61


సీ.

లోచనానందకల్లోలినీభర్తకు
                       దోయజారాతి పుత్త్రుండె కాఁడె
శ్రవణహితాలాపరత్నాంకురాళికి
                       రోహణాచలము పుత్త్రుండె కాఁడె
యమితపాతకపుంజతిమిరమండలికి న
                       ఖండదీపంబు పుత్త్రుండె గాఁడె
సంసారసుఖమహీజాతసంఘమునకు
                       దోహదసేవ పుత్త్రుండె కాఁడె


గీ.

దుఃఖములఁ బాసి ముక్తికి ద్రోవ చూపి
ప్రోవఁజాలినవాఁడు పుత్త్రుండె కాఁడె
కాన నిహపరసాధనకారణంబు
తల్లిదండ్రుల కాత్మీయతనయుఁ డబల.

62


ఉ.

చందురువంటి నెమ్మొగము చక్కటిఁ దూలఁగఁ బుట్టు వెండ్రుకల్
గెందలిరాకుఁబాదములఁ గీల్కొన జేసిన యట్టిచిన్నిపై
డందెలు గల్లు గల్లుమన నాడుచు నల్లన చేరవచ్చి నా
ముందఱ నాడ నెన్నఁడొకొ ముద్దియ ముద్దుగుమారుఁ గాంచుటల్.

63


గీ.

తోయజానన యొకబుద్ధి తోఁచె నాకు
నాదికారణ మీశ్వరుం డఖిలమునకుఁ
గాన నద్దేవదేవుని కరుణ లేక
యీప్సితార్ధంబు లేరికి నేల కలుగు.

64


గీ.

నీలకంఠుని శిరసుపై నీళ్ళు చల్లి
పత్తి రిసుమంత నెవ్వఁడు పాఱవైచుఁ

గామధేనువు వానింటి గాడి పసర
మల్లసురశాఖి వానింటి మల్లెచెట్టు.

65


సీ.

నవరత్నమయభూషణములు దాల్చినవారు
                       సింహాసనస్థులై చెలగువారు
పరతత్వవాసనాపరత గాంచినవారు
                       నిఖిలవిద్యాప్రౌఢి నెరయువారు
చిరకాలజీవులై క్షేమమొందెడువారు
                       వితరణ విఖ్యాతి వెలయువారు
బంధుమిత్రస్ఫూర్తిఁ బాయకుండెడువారు
                       బహుపుత్త్రలాభంబుఁ బడయువారు


గీ.

చక్కదనమున వన్నెకు నెక్కువారు
తొంటి మేనుల సద్భక్తి తొంగలింప
కాశికానాథుఁ గామారిఁ గాలకంఠు
పూజ చేసినవారెపో పువ్వుబోఁడి.

66


సీ.

కడలేని సంసారజడధిలో మునిఁగిన
                       జనులపాలిటి నావ శంభుసేవ
కడుదూరమైయున్న కైవల్యసీమకుఁ
                       జక్కని పెనుద్రోవ శంభుసేవ
యతిభోగభాగ్యంబు లనుముత్తియంబుల
                       సరులఁగూర్చిన కోవ శంభుసేవ
సకలాగమజ్ఞానసారమహీజాత
                       జాతంబులో చేవ శంభుసేవ


గీ.

నిరవధిక్రూరపాతకదురవగాహ
గహనదహనసమున్నిద్రగంధవాహ
సఖశిఖామాలికలఠేవ శంభుసేవ
(సద్గుణలతాంతముల తీవ శంభుసేవ.)

67

క.

కావున మన మద్దేవుని
భావంబున నిలిపి సుతుని బడయుద మనుచున్
దేవియును దాను భూపతి
కేవలతరశైవమార్గకృతనిశ్చయుఁ డై.

68


క.

హాకటశైల ధనుర్ధరుఁ
బాటింపనివాఁడు నాకు బగవాఁ డనుచున్
గూటపరిపంథిగర్వో
చ్చాటన గుణశాలి యతఁడు చాటం బంచెన్.

69


ఉ.

ఎచ్చటఁ జూచినం బ్రమథహిండితచండనిశాతవర్తనం
బెచ్చటఁ జూచినన్ గుహగణేశ్వరభవ్యగుణానువాదనం
బెచ్చటఁ జూచినన్ శివసమీహితపుణ్యకథానుకీర్తనం
బచ్చుపడంగఁజేసె నతఁ డాదిమశైవకులాగ్రగణ్యుఁ డై.

70


శా.

చూడం జిత్రము పత్రపుష్పముల కంచుం జేరనేతెంచి పెన్
ప్రోడల్ శైవకథారహస్యములకై పోరాడుచుం బోవుచోఁ
గూడ న్వచ్చి తదీయవాదముల చిక్కు ల్దీర్చుఁ బో పట్టణ
క్రీడాకాననవీథికాగ్రశుకశారీకిన్నరద్వంద్వముల్.

71


శా.

కించిన్మర్దళనృత్యగీతసరసక్రీడావిధంబుల్ శుకీ
చంచూచంచదమానరత్నఖచితస్తంభంబు లభ్రంకషో
దంచద్గోపురపంక్తులు న్మెఱయ నుద్యద్భక్తి నూరూరఁ గ
ట్టించెన్ భూపతి దేవతానిలయకోటిన్ జాహ్నవీజూటికి.న్

72


సీ.

చంద్రకాంతోపలస్వచ్ఛవేదీస్థలుల్
                       కఱ్ఱజవ్వాదిచేఁ గలయనలికి
యనవుగాఁ గ్రొత్తకట్టాణిముత్తియముల
                       నిగ్గులు వెదచల్ల మ్రుగ్గు వెట్టి
యర్ఘ్యోదకంబుల నభిషేక మొనరించి
                       రమణీయరత్నపీఠమున నునిచి

మృగమదపంకంబు మేననిండ నలంది
                       మేలేర్చి క్రొవ్విరుల్ గీలుకొలిపి


గీ.

ధూపమర్పించి కర్పూరదీప మొసఁగి
యమృతదివ్యాన్నరుచిరోపహార మిచ్చి
వనితయును దాను సాష్టాంగవినతిఁ జేసి
చంద్రధరుఁ గొల్చు నా రాజచంద్రుఁ డెపుడు.

73


శా.

రాజచ్చంద్రశిలాతలాంతరలతారమ్యప్రదేశంబులన్
గాజుంగుప్పెలలోని యచ్ఛతరగంగావారి నోలార్చి యా
రాజుం దేవియు మంత్రపూతముగ హేరాళంపుఁబూగుత్తులన్
బూజల్ సేయుదు రిచ్చలం జెలఁగి ముప్పూటం బురారాతికిన్.

74


క.

సంతానకాంక్ష నాశ్రిత
చింతామణి సకలలోకసేవితుఁ గరుణా
స్వాంతుని రాజతశైలని
శాంతుని భజియింతు రెపుడు సతియున్ బతియున్.

75


క.

ఆమానవపతి చిత్తా
రామములో నుండమరగి రాజతభూభృ
త్సీమకయి పోఁదలంపక
సోమకళాధరుఁడు మిగులసోమరి యయ్యెన్.

76


వ.

ఇవ్విధంబున బరమశైవాచారసంపన్ను లగు దంపతు లప్పరమేశ్వ
రుని సేవింప నొక్కనాఁడు.

77


చ.

కలగని యమ్మహీవిభుఁడు గ్రక్కున లేచి నిజంబుగా మదిన్
దలఁపుచు మేను గర్పొడవ నల్గడలుం బరికించి యోకృపా
జలనిధి యోమునీంద్రవరసంస్తుత యోజగదేకనాథ నిన్
గల గనుగొంటిఁ దొంటి కలికల్మషజాలము వీడుకొంటినే.

78


మ.

అని యంతంతకు నమ్మహామహిమ కత్యాశ్చర్యముం బొంది య
జ్జననాథాగ్రణి పాహిపాహి యనుచున్ సంతాన దానక్రియా

జనకంబైన ఫలంబు మౌళినిడి వక్షఃపీఠిపైఁ దార్చి లో
చనయుగ్మంబునఁ జేర్చుచుం బొగడుచున్ సంతోషితస్వాంతుఁడై.

79


ఉ.

పాలిక మేలుకొల్పి నరపాలశిఖామణి వింటివే వినీ
లాలక నిన్నరేయి యొకయచ్చెరు వాశ్రితపారిజాత మ
బ్బాలశశాంకమౌళి మనపాలికి కొంగుపసిండి మందమం
దాలసలీల వచ్చె దరహాసవిభాసిముఖారవిందుఁడై.

80


క.

వచ్చి భవద్భక్తికి నే
మెచ్చితి నీఫలము నీసమీహిత మొసఁగున్
బుచ్చుకొను మనుచుఁ జేతికి
నిచ్చి భవానీశుఁ డరిగెనే లలితాంగీ.

81


క.

అని పలికి యభవుడిచ్చిన
యనర్ఘ్యఫలము విభుఁ డిచ్చె నాత్మాంగన కెం
దును శివభక్తులకును గలఁ
గనిన ఫలం బెన్న నిజముగాఁ జేకుఱుఁగా.

82


ఉ.

ఇచ్చిన మ్రొక్కి పుచ్చుకొని యింపును సొంపును బల్లవింపఁగా
నచ్చపలాయతేక్షణ శివార్పణమంచు సుధారసంబుతో
మచ్ఛరికింపఁజాలు రుచి మత్ఫల మాదట నారగించి వా
క్రుచ్చఁగరాని మోదమునకు న్నెలవై పెనుపొందె నంతటన్.

83


సీ.

చూపుఁ దేటుల పిల్లలూ పాడఁజొచ్చెఁబో
                       యాడక యనియేల యడఁగియుండుఁ
జనుఁగవ జక్కవల్ పెనుపొంది యుబ్బెఁబో
                       యుబ్బక యవియేల యూరకుడు
వేణికానీలాహివిస్ఫూర్తి మించెఁబో
                       మించక యదియేల మిన్నకుండు
చిఱునవ్వు మొలకలు చిగురొత్తఁ దలఁచెఁబో
                       తలఁపక యవియేల నలఁగియుండు

గీ.

ననఁగ నొకకొత్తచెల్వ మయ్యంబుజాత
గంధి కెంతేని గల్గె నక్కనకశైల
కార్ముకానూనకరుణావికాసలబ్ధ
ఫలరసామృతధార లల్పంబె తలఁప.

84


క.

ఈరీతి నమ్మృగేక్షణ
యారూఢమనోనురాగ యై యుండు తఱిన్
మేరుమహీధరకార్ముక
కారుణ్యము కతనఁ గొన్నిఘస్రంబులకున్.

85


సీ.

కౌను దొడ్డతనంబుఁ గని చింతపడుగతిఁ
                       గుచముఖంబులు నీలరుచి వహించె
మందస్మితంబున మరగి రాదన ముద్దు
                       బలుచనిచెక్కులు పలకఁబాఱె
ఫలరసంబుల కెవ్వి ప్రతిరామి నొల్లదో
                       యన జిహ్వ కన్నిట నరుచి పుట్టె
గర్భస్తుఁడగు బాలు కమనీయగుణభార
                       మహిమ నా నడ లతిమంద మయ్యె


గీ.

గలికి బేడిసమీలతోఁ గలహమాడు
వాలుఁజూపుల దాటులు డీలుపడియె
మంటి కమ్మనితాలిపై మనసు పాఱె
నాఁడు నాటికి బాలి కానలినముఖికి.

86


వ.

అట్లు గర్భభరాలసయైన యయ్యంగనకుం బుంసవనాది కృత్యంబులు
నిర్వర్తించిన యనంతరంబున నవమాసావసానం బగుటయు శుభ
ముహూర్తంబునఁ గుమారుం డుదయించిన.

87


మ.

కురిసెం బువ్వులవాన చూపరుల చూడ్కుల్ వేడ్క నోలాడఁగా
నెరసెన్ మెల్లనిచల్లగాలి కొదమల్ నెత్తావి నిండారఁగాఁ
బొరసెన్ దిక్కులు నొక్కవింతచెలువంబున్ దత్కుమారప్రతా
పరుచిం బోలమి నాఁ బ్రశాంతగతి సంప్రాప్తించె వైశ్వానరున్.

88

ఉ.

అప్పుడు బంధుమిత్రసచివాన్వితుఁడై మహనీయవైభవం
బుప్పతిలన్ ధరామరసముత్కరముం బిలిపించి యిచ్చెఁ బో
తెప్పలుగాఁ గరుల్ హరులు ధేనువు లంబరముల్ మణివ్రజం
బప్పతి యప్పతిం దెగడునట్టి సమున్నతదానవైఖరిన్.

89


మ.

నరనాథోత్తముఁ డీగతిన్ వివిధదానప్రౌఢిఁ బుత్త్రోత్సవ
స్ఫురణంబొప్ప ఘటించి సూతకదినంబుల్ పుచ్చి దాక్షాయణీ
వరకారుణ్యవిశేషబంధుఁ డగుటల్ వర్ణింపుచున్ రాజశే
ఖరనామం బొనరించెఁ బుత్త్రకునకుం గౌతూహలాయత్తుఁ డై.

90


శా.

వైరించప్రతిభావదావదవచోవైయాత్యసాతత్యస
త్యారూఢస్థితి పాండవాగ్రజమహీయస్వచ్ఛకీర్తిచ్చటా
పారావారనిమగ్నశత్రుగణశుంభత్పూర్వభూభృద్దిశా
నారీమన్మథబంధురక్షణచణా నాదిండ్లవంశాగ్రణీ.

91


క.

చతురతరవచనరచనా
చతురానన త్రిచతురాశ్వసప్తిజవానీ
చతురంగఖురరజోవిక
చతురాషాణ్నయనకమల సముదగ్రబలా.

92


మాలిని.

హరిచరణపరయోజధ్యానసంధానమార్గా
స్థిరమతిగుణధారా శిక్షితాఘప్రచారా
సురసురభివితీర్ణిస్తోత్రపాత్రప్రకారా
గిరిచరదరివీరా కృష్ణమాంబాకుమారా.

93

గద్య
ఇది శ్రీమదఘోర శివాచార్య గురుకరుణావిశేషలబ్ధసారస్వత
మాదయామాత్యపుత్త్ర మల్లయనామధేయప్రణీతం బైన
రాజశేఖరచరిత్రంబును మహాప్రబంధంబునందుఁ
బ్రథమాశ్వాసము.