రసికజనమనోభిరామము/తృతీయాశ్వాసము

శ్రిరస్తు

ఓం నమః కామేశ్వర్యై

రసికజనమనోభిరామము

తృతీయాశ్వాసము



లలితవృషతురంగా
శైలసుతాసంగ కలశజలధినిషంగా
కాలోన్మదభంగా ధృత
హేలాసారంగ కుక్కుటేశ్వరలింగా.

1


తే.

అవధరింపుము సురమౌని కబ్జగర్భుఁ, డవలికత దెల్పఁ బూని యి ట్లనుచుఁ బలికె
నట్ల వనవీథిఁ దిరుగుచు నరిగి నృపతి, యక్కజంబుగ ముందఱ నొక్కచోట.

2


సీ.

గుజ్జులమావిమ్రాఁకుల నంటిఁ బ్రాఁకిన, పరువంపుదాఁకపందిరుబదరులఁ
జలువచెంగలువబావులక్రేవ జాల్గొను, వలపుగొజ్జఁగినీటివంతచెంతఁ
బ్రోదికప్రపనంటిబోదెచాలుపుమ్రోలఁ, బొరలుపూలఁదేనెజక్కరలపజ్జ
మొల్లంపుఁదావు లీన్మల్లెక్రొన్ననతీవ, వెసగొన్నగున్నసంపెగలనీడ


తే.

మెఱుఁగుచందురురానిగ్గుటరఁగుమీఁద, నీటుగా గోర వీణియ మీటుకొనుచు
బోటులను గూడి జిలిబిలిపాటఁ బాడు, చున్నయెలజవ్వనపుటన్నుమిన్నఁ గనియె.

3


చ.

కని యెనలేనివేడ్క లెదఁ గ్రమ్మఁగ నమ్మగమిన్న మిన్నకా
వనజదళాక్షిచెంత కనివారణఁ జేరి జగజ్జనానురం
జన మొనగూర్చుదానివిలసన్మృదుగానకథాప్రశస్తి కా
త్మను గడు సోలి యి ట్లను ముదంబును నబ్బురముం బెనంగొనన్.

4


సీ.

సరససారంగాతిశయనిరూఢిఁ దనర్చెఁ, బొలఁతివాల్చూపులు పొలుపు మీఱి
లాలితగతిని వరాళివైఖరిఁ బొల్చెఁ, బల్లవపాణిధమ్మి గరిమ
శంకరాభరణంబు సౌష్ఠవంబును మించె, భామినీరత్నంబురోమరాజి
రహిని బున్నాగాభిరామలీల నెసంగె, నీలనీలాలకనిమ్ననాభి

తే.

యహహ యీచాన గానవిద్యావిధాన, మునఁ జెలఁగి రాగ మొనగూర్చు చొనరె దీనిఁ
గన్న మృగఖగపన్నగాగమము లెలమి, నుల్లసిల్లవె యని సోలుచున్నయెడల.

5


క.

అచలావల్లభుఁ గనుఁగొని, సచివగ్రామణి నితాంతసంతోషరస
ప్రచురత నెమ్మదిఁ బొదువఁగ, వచియించెన్ హితమృదూక్తివైఖరి మెఱయన్.

6


మ.

తలుకార్మేల్మిపసిండిబొమ్మకరణిన్, దట్టంపునెమ్మేనిచా
యలు నల్దిక్కులఁ గ్రమ్మి పర్వఁగ వయస్యామధ్యభాగంబునం
బలుకుంగిన్నరవీణె మీటుచుఁ గథాప్రాగల్భ్యము ల్చూపుని
క్కలకంఠీజనచూళికాభరణముం గంటే నృపాలాగ్రణీ.

7


చ.

ఉవిదవయోవిలాసవిభవోజ్జ్వలరూపకళాప్రచారముల్
తవిలినవేడ్క నీకు వితతంబుగ ము న్నెఱిఁగించితిం గదా
ప్రవిమలలీల నీ విపుడు బద్మముఖిం గనుఁగొంటివే కదా
యవనితలేంద్ర నావచన మాత్మఁ దలంచిన నిక్కమేకదా.

8


ఉ.

కూరిమి మీఱ నవ్వికచకోమలతామరసాయతాక్షి నిన్
గోరి వరించెనేని యిదుగో పదియాఱవవన్నెమేల్మిబం
గారముతోడ దివ్యతరకాంతిసముల్లసదబ్జరాగముం
గూరిచినట్ల సుమ్ము నృపకుంజ మాటలు వేయు నేటికిన్.

9


చ.

పలుకుల కేమి భూపకులపావన యీవనరాశివేష్టితా
చలఁ గలమేల్పొలంతుకల సారెకుఁ గల్గొనుచుందుమే కదా
భళిభళి యెందు నేని యొకపట్టున నీభువనైకమోహనో
జ్ఞలలలితాంగివంటి నెఱచందపుఁగుల్కుమిటారిఁ గంటిమే.

10


తే.

కంజముఖి నీమనోహాకారరేఖ, మంజుగతిఁ గన్గొనియెనేని మదనవి ఖ
పుంజనిష్పీడ్యమానయై పొదలి యాత, రంజిలుచు నిన్నుఁ గవయుఁ బో రాజచంద్ర.

11


వ.

అనిన నాసచివగ్రామణికి నృపాలాగ్ర యి ట్లనియె.

12


సీ.

అద్దిరా యీచిన్నిముద్దుక్రొన్ననఁబోఁడి, కలికినిద్దంపుఁగ్రొక్కారుమెఱుఁగు
మెఱుఁగు గా దిది యల్ల చెఱుకువిల్దొరచే, కడిదినెత్తావిచెంగలువదండ
దండగా దిది నల్వ దంటతనం బేరు, పడ నొనర్చినమేలిపసిఁడిబొమ్మ
బొమ్మ గా దిది జగంబుల కెల్ల మిన్న యై, సొంపారుబలుమానికంపుఁదొడవు

తే.

తొడవు గా దిది వలరాచపడఁతిమిన్న, వలనుగా నిడ్డ శృంగారవనములోన
మలయునెఱపూఁతగుజ్జులేమావిమోక, యహహ వనజాస్యఁ బొగడ శక్యమె వయస్య.

13


ఉ.

అందనిమ్రానుపండులకు నాస వహించినరీతి దివ్యసం
క్రందనపట్టణద్విరదగామినిపొం దెదఁ గోరి వేడ్కమై
నిందుల కేగుదెంచుట కొకించుక నెయ్య మెలర్ప నీజగ
త్సుందరి దా ననుం గవయఁ జూచునొ లేదొ కదా సుహృద్వరా.

14


ఉ.

కన్నియ వన్నియ ల్బెరయఁ గ్రన్నన నన్ననవిల్తుకేళికిన్
న న్నెన లేనికూర్మి మది నాటుకొనం గవకూడ కున్నచోఁ
గ్రొన్నెలవెన్నెల న్సమదకోకిలకాకలికారవంబులం
జెన్నఱి యెన్నిబన్నములఁ జెందఁగఁ గూడునొ యేమి సేయుదున్.

15


ఆ.

అని వచించి యిర్వురును దమ కొకతూరి, చనిన నవ్విశాలజలజనయన
సి గ్గెసంగ నెచట దిగ్గన జరుగునో, యనుచుఁ దలఁచి మరల నతని కనియె.

16


ఆ.

చెలిమికాఁడ నీవు వల నొప్ప ముంగలఁ, జని కడంకతోన యనుఁగుఁజెలులఁ
గూడి క్రీడ సేయు చేడెల తలమిన్న, గాంచి వేగ దానికరుణ వడసి.

17


క.

తిన్ననిజిలిబిలిపలుకులఁ, గన్నియడెందంబు మిగులఁ గరఁగింపుచు నీ
వున్నయెడ న్నే నచటికి, సన్నకసన్నన్ రయంబ. చనుదెంతుఁ జుమీ.

18


శా.

ఏచందంబున నింతిచెంత కఱ లే కీ వేగి దర్శించెదో
యేచందంబున మాటలాడి మదిలో నింపొందఁగాఁ జేసెదో
యాచంద్రాననపొందు నా కెటువలెన్ హత్తించెదో మేలు నీ
వాచాప్రౌఢిమ నేఁడు చూతము గదా బాలేందులీలాసఖా.

19


తే.

అని యతని వీడుకొల్పి యజ్ఞనవిభుండు, గోర్కె దైవార నొకచోటఁ గూరుచుండె
నృపసఖుంఢును వేల్పుఁగన్నియలచెంత, కబ్రముగ నేగి నిలుచున్న యవసరమున.

20


ఉ.

సామజరాజకుంభవిలసత్కుచకుంభభరానతాంగు లై
నేమ మెలర్ప లేచి యతనిం బ్రియమారఁగఁ జూచి భూరిను
త్రామమణిప్రభావళివిరాజితదివ్యసువర్ణపీఠికం
దామరసాయతాక్షులు ముదంబున నిల్పిరి రాజదూతునిన్.

21


వ.

అట్లు గూర్చుండంజేసి యున్న సమయంబున.

22

సీ.

నీలంపుగాజుల నెఱిమించుపచ్చల, కీలుకడెంబుడాకేలు మెఱుఁగు
వలిగబ్బిగుబ్బచ న్గెలనికి దార్చుచు, సొలపుక్రేఁగంటివాల్చూపు లలరఁ
జిన్నారితెలినవ్వు చెక్కుటద్దములు లే, వెన్నెలనిగ్గులవిధ మొనర్పఁ
గమ్మచక్కెరపానకమ్ము లిమ్ముగఁ గ్రమ్ము, ముద్దునిద్దంపుకెమ్మోవి గదలఁ


తే.

గలికి యారాచనెచ్చెలిఁ గని నయ మ్మె, నయ వసంతాగమారంభనవరసాల
కిసలయగ్రాసమత్తకోకిలవధూస, మంచితాలాపముల నిట్టు లనుచుఁ బలికె.

23


ఉ.

ఎచ్చటనుండి యెచ్చటికి నేగెద వెవ్వరివాఁడ విచ్చమై
నిచ్చటి కేగుదేరఁ బని యెయ్యెది నీవు వసించునున్కిప
ట్టెచట నిన్ను నేలుమనుజేశ్వరుఁ డెవ్వఁడు దప్స కిన్నియుం
జెచ్చెర నింక మాకెఱుఁగఁజేయుము మాటలు వేయు నేటికిన్.

24


చ.

అన విని రాచదూత వినయమ్మున నమ్మధురాధరోష్ఠిఁ గ
న్గొని యనియె న్సరోజదళకోమలచారుశరీర యేను స
జ్జనపరిపాలనప్రథితసారగుణాకరుఁ డై సమున్నతిన్
దనరుఋతుధ్వజప్రభువంతంసముగారవపున్వయస్యుఁడన్.

25


క.

పేరు మతిమంతుఁ డం డ్రీ, ధారుణిఁ గల్యాణపురము తరుణీమణి మా
యూ రిచటికి వేఁటకు నా, భూరమణుఁడు సేనఁ గూడి పొలుపుగ వచ్చెన్.

26


ఆ.

వచ్చి కొంతతడవు వనవిహారము సల్పి, యిన్నగాగ్రమున మహేశుఁ గొల్చి
చనుచు నీవిచిత్రసంగీతనాదంబు, వీను లలర నిపుడు విని చెలంగి.

27


ఆ.

నిన్నుఁ జూచి వేడ్క నివ్వటిల్లఁగఁ కొన్ని, మాట లాడి చనఁగ మదిఁ దలంచి
వచ్చుచున్నవాఁడు వనజాక్షి మారాజు, మునుపడంగ నన్నుఁ బనిచె నిటకు.

28


క.

ఆపృథ్వీవరకుంజరు, రూపవయఃప్రాభవములు రూఢిగ నీ విం
దేపారఁ జూచి మదిలో, నోపైదలి యరిది వేడ్క నొందెదు సుమ్మీ.

29


శా.

ఓరాజీవదళేక్షణాజనమణీ యోవాక్సుధాధోరణీ
యోరాకామిహిరాకరోజ్జ్వలముఖీ యోగానవిద్యానిధీ
యోరోలంబకదంబలంబకబరీ యోభవ్వదివ్యాకృతీ
మారాజన్యమహేంద్రుసొంపు వినుతింప న్శక్యమే యేరికిన్.

30


మ.

తరుణాంభోజదళాయతాక్షి వినుమా తథ్యంబు నామాట కి
న్నరగంధర్వనిలింపమర్త్యవరుల న్వాక్రువ్వఁగా నేల యా
సరసాగ్రేసరుసోయగంబు దెగడం జాలు న్వసంతు న్నలుం

బురుహూతప్రభవస్మరైలబిలతుక్పూరూరవస్సోములన్.

31


ఉ.

ఇంచుకసేపులోన జగ మెల్ల వెలుంగఁగఁజేయుతేజుచేఁ
బంచశరోపమానుఁ డగుపార్థివశేఖరుఁ డిందు వచ్చినం
గాంచి మనోనురాగమునఁ గామిను లెల్లఁ గరంగి పాఱఁగాఁ
జంచలనేత్ర నాపలుకు సత్యముగా నపు డాత్మ నెంచుమా.

32


ఉ.

చెప్పెడి దేమి యానృపతిశేఖరించక్కదనంబు కన్నులం
దప్పక చూచిరేని పటుదర్పకఘోరశిలీముఖార్త లై
యొప్పులకుప్ప లైనగరుడోరగయక్షసుపర్వకన్యలున్
ముప్పిరి గొన్నమోహమున ముద్దియ తద్ద చలింపకుందురే.

33


క.

చనఁ బూని యొక్కపలు కే, ననఁ బూనిన నెచటఁ గోప మగుమో యని లో
ననుమానించెద నౌన, న్విసుమా నావిన్నపంబు వికచాబ్జముఖీ.

34


మ.

విమలాంగీతతుల న్శుభాకృతుల ము . న్వీక్షింపమో తత్ప్రకా
రము లెల్లం బరికింపమో యహహ యేరాజాస్యలం దైన నీ
రమణీయోజ్జ్వలరూపవిభ్రమకళాప్రాగల్భ్యముల్ గంటిమే
రమణీ సంతతసంశ్రితామరమణీ రామాజనగ్రామణీ.

35


క.

తలుకారుకుందనముతోఁ, దొలుకారుమెఱుంగుఁదీఁగెతోఁ దుల యగునీ
చెలువంపుమేని కారా, నెలపొం దలవడకయున్న నిష్ఫలము గదా.

36


తే.

వెలఁది నీరూపలావణ్యవిభ్రమముల, కమ్మహారాజుతోఁ జెల్మి యబ్బెనేని
కోరి పదియాఱువన్నెబంగారుతోడఁ, బద్మరాగంబుఁ గూర్చినపగిదిఁ జువ్వె.

37


క.

బంధురతేజస్సరసిజ, బంధుఁడు గుణసింధుఁ డగుచుఁ బరఁగెడుభూభృ
ద్గంధగజేంద్రము నిప్పుడు, గాంధర్వవివాహమునను గైకొను మబలా.

38


చ.

పలుకులు వేయు నేటి కిఁక భావభవప్రతిమానుఁ డైనయా
చెలువునితోడుతం జెలిమి చేకుఱ కున్న నయారె నీమెయిం
గలయలజవ్వనం బడవిఁ గాచినవెన్నెల సుమ్మ ముద్దులేఁ
జిలుకలకొల్కి నాపలుకు చిత్తమునం దలపోసి చూడుమా.

39


సీ.

కనకంబునకుఁ దావి గలుగంగఁజేయక, పిల్లిగడ్డలకుఁ గల్పించినట్లు
పనసపంటికి మంచిపస యొడఁగూర్పక, ముసిడిపండ్లకుఁ దద్ద యొసఁగినట్లు
బుధపుంగవులకు డంబుగఁ గల్మి యొసఁగక, కూళల కిరవారఁ గూర్చినట్లు
చిలుకను దడవేండ్లు జీవింపనీయక, మఱిమఱి కాకుల మనిచినట్లు

తే.

గాక యుండక సత్కళాకౌశలమునఁ, గోరి యారాజుతో నిన్ను గూర్చె నేని
తమ్మిపూచూలిప్రోడతనమ్ము మిగుల, మెచ్చవచ్చుఁ గదా నేఁడు మచ్చకంటి.

40


తే.

అనుచు నతఁ డిట్లు వలికిన నాత్మలోన, జాన యొకకొంతనొత్తఁబా టూని ఱేనిఁ
గనుఁగొనఁగఁ గోరి యత్తెఱం గనుఁగుఁజెలుల, కగుపడక యుండఁ గ్రమ్ముచు నతని కనియె.

41


చ.

అవు నవు మంచిప్రోడవె బళా యళు కించుక లేక మానినీ
నివహసభాగ్రభాగమున నిల్చి వినం గొఱగానివాక్యముల్
తవిలి వచింపఁ జాగితివి తాళుదుమే మఱియొక్కఁ డైన దూ
తవు నిను నేమియుం బలుక ధర్మము గా దని యుంటి మిత్తఱిన్.

42


క.

సురనారీమణు లెచ్చట, ధరణీజను లెచట నహహ తరతమభావం
బయంగ హస్తిమశకాం, తర మిట్టివెడంగుపనులు దలఁపం జనునే.

43


తే.

దూత వగుటను నోరికిఁ దోఁచినట్లు, దివిరి మోమోడ కాడెదు దిట్ట వగుచుఁ
గటకటా ధూర్త మేము నీ కంటి కిప్పు, డింత యెల్లిద మైతి మిం కేమి చెప్ప.

44


ఉ.

మాటికి నొక్కభూవరకుమారుని నీ నిపు డేమొ తద్దయున్
మేటి యటంచు నెంచెదవు మే లహహా యతఁ డెన్న మామరు
త్కోటులలోన నేరి కెన గూరుపఁగాఁ దగుఁ జాలుఁ జాలు నీ
మాటలు గట్టిపెట్టి చనుమా మును వచ్చినత్రోవచొప్పునన్.

45


తే.

అనుచు నవ్వేల్పుఁగెందలిరాకుఁబోఁడి, పలుకుటయు నాతఁ డెదఁ గొంత గలఁగుచుండె
నపుడు నృపుఁ డచ్చటికి వేగ నరిగి దాని, పజ్జ నిలిచిన నబ్బురపాటుతోడ.

46


సీ.

జిలుఁగుపైటాణికంచెల పిక్కటిలి వలి, కులుకుసిబ్బెపుగబ్బిగుబ్బ లుబ్బ
బిత్తరంపుఁబిసాళి బెళుకువాల్చూపుమొ, త్తమ్ములు తమ్ములఁ గ్రుమ్మరింప
గాటంపునిడందకీల్గంటు పెన్ వ్రేఁగున, నసదునెన్నడుము జవ్వాడి వడఁకఁ
గా ముత్యాలకమ్మలనునుడాలు, తళుకు లేఁజెక్కుటద్దములఁ బొదల


తే.

మంపుఁ దులకించుముత్తిగమానికముల, మొలకనిద్దాకడానిసొమ్ములమెఱుంగు
లుమ్మడిగఁ గ్రమ్మి నెమ్మేన నొఱపు చూప, రాజువరుఁ గాంచె లేచి యారాజవదన.

47

తే.

కాంచి యాతనిమోహనాకారరేఖ, కద్భుతం బంది మే ల్మే లయారె యిట్టి
సొగసుకాని మఱెం దైనఁ జూచి యెఱుఁగ, నంచుఁ దల యూఁచి యవ్వేల్పుమించుఁబోఁడి.

48


తే.

చెలఁగి జగ మెల్ల మోహింపఁ జేయఁజాలు, నవవిలాసాప్తి నెసఁగుచున్నాఁడు చూడ
నహహ యీరాచమిన్నసోయగముఁ గన్న, వలసి పై వ్రాలరే యెట్టిపొలఁతు లైన.

49


ఉ.

కన్నులవింటిదంటయును గల్వలనెచ్చెలియు న్వసంతుఁడుం
గిన్నరరాజనందనుఁడు గి మ్మనఁజాల రొకింత యైన ని
వ్వన్నెలప్రోకమేనిచెలువమ్ము గనుంగొని మేలు మే లహా
కన్నులపండు పై యలరుఁగా జవరాండ్రకు వీనియందముల్.

50


ఉ.

తుమ్మెదదిమ్ముఁ బొ మ్మనుచుఁ ద్రోచునిగారపుసోగపెన్నెరుల్
కమ్మనితమ్మిక్రొన్ననలఁ గా దనుముద్దుమొగంబు మించుట
ద్దమ్ముల నిమ్ములన్ గెలువఁ దార్కొనునిద్దపుఁజెక్కుదోయిడా
లమ్మకచెల్ల వీనిచెలు వమ్మకరాంకుని నేలఁ జాలెడిన్.

51


సీ.

మొలకనవ్వులవాఁడు తళుమనిద్దామేల్క, డానిడా ల్గఱఁచుమేజానువాఁడు
తొగరువాతెఱవాఁడు తొగలసంగడికానిఁ, దెగడునున్ముద్దునెమ్మొగమువాఁడు
వెడఁదకన్నులవాఁడు వేల్పురారాసౌరు, నిరసించుసోగపెన్నెఱులవాఁడు
మెఱుఁగుఁజెక్కులవాఁడు మేటిసింగపుగున్న, నడలించుజిలుఁగునెన్నడుమువాఁడు


తే.

డంబు మీఱినబవిరిగడ్డంబువాఁడు, కంబునిభ మై తనర్చుకంఠంబువాఁడు
భళిర యీరాజకందర్పుచెలిమి నాకుఁ, గలుగ వలవదె తొలుపుణ్యఫలము కలిమి.

52


క.

అని యగ్గించుచు నెదుటం, గనుపట్టువధూలలామఁ గనుఁగొని యెకిమీఁ
డనుపమహర్షాన్వితహృ, ద్వనరుహుఁ డై యరిదివలపువలనం బలికెన్.

53


క.

మవ్వములప్రోఁక యతనుని, క్రొవ్వాఁడిలకోరి పూఁతగొజ్జఁగివలపున్
బువ్వలచెం డహహా యీ, జవ్వని యెవ్వనియనుంగుఁజానయొ కదరా.

54


ఉ.

వాలికమీల నేలనిడునాలుకనుంగవ మేలిజాలువా
డాలు గఱంచు మేను పగడాల నిసీ యను మోవి వేల్పురా
ఱాల జయించు వేనలితెఱంగుహొరం గవురయ్య ముజ్జగం

బేలుట గాదె యీకువలయేక్షణఁ గౌఁగిటఁ గూర్పఁ గల్గినన్.

55


ఉ.

దీనిమెఱుంగుఁజెక్కులును దీనివెడందపిఱుందునందమున్
దీనిచొకారపుందుఱుము దీనిమిటారపుగబ్బిగుబ్బలున్
దీనినిగారపుందొడలు దీనిమొగంబును దీనికన్నులున్
దీనివిలాసముం గని మదింగడు సోలరె యెట్టిదిట్టలున్.

56


క.

ఈహాటకనిభవిగ్రహ, నీహాపరితృప్తి యొదవ నెనసినయెడలన్
బాహాలింగనసౌఖ్యం, బాహా యింతింత యనుచు నలనియె తెలుపన్.

57


ఉ.

అద్దిర దీనిచక్కఁదన మద్దివిజాంగనలందుఁ జెంద దీ
ముద్దులగుమ్మకౌఁగిటఁ బ్రమోద మెలర్ప వసింప కున్న రేల్
నిద్దుర వచ్చునే మరుఁడు నిల్వఁగనిచ్చునె కోర్కె హెచ్చునే
సుద్దుల కేమి దీనిఁ గొని సూనశరాహవకేళిఁ దేలెదన్.

58


ఉ.

ఉబ్బుచు మాటిమాటికి సముద్ధత మోహనిబద్ధబుద్ధి మై
గొబ్బున నీ సరోజదళకోమలవిగ్రహమోవిచక్కెరల్
జుబ్బనజూఱగాఁ దవిలి జుఱ్ఱక కానిఁక నించు కైన న
బ్బబ్బ నితాంతకంతువిశిఖాగ్నిశిఖాపరితాప మాఱునే.

59


మ.

తలిరుంబోఁడులు లేరె రూపవతు లిద్ధాత్రీస్థలిన్ వారిని
ర్మలసౌందర్యవయోవిలాసవిభవప్రాగల్భ్య మేయెక్కు డీ
యలివేణీజనచూళికామణిని గన్నంతన్ మనోజాస్త్రసం
చలితస్వాంతసరోజు లై తిరుగరే సన్యాసులు న్వెంబడిన్.

60


సీ.

పుండరీకాక్షి యీభువనైకసుందరి, యాత్రేయవదన యీయబ్జగంధి
పర్వతజఘన యీభామాశిరోమణి, మాతంగగమన యీమంజువాణి
శాండిల్యకుచ యీయఖండతేజోనిధి, శుకవాణి యీమణిప్రకరరదన
భృగుకటిభాగ యీబింబఫలాధర, నారదవేణి యిన్నాతిమిన్న


తే.

యౌర యియ్యింతి పరమహంసాకృతిని బొ, సంగి యున్నది మది నరయంగ దీని
నెయ్య మొనగూడువానికు న్నిద్రనిబిడ, నిరుపమానందయోగంబు దొరకు టరుదె.

61


సీ.

ముగుదచూపులు శిలీముఖముల నిరసించుఁ, కచపాళి ఘననీలరుచుల నెంచు
సతిమోము కమలలక్షణలీల నలరారు, మధురాధరము విద్రుమముల గేరుఁ
గలికిపాదములు సౌగంధికంబుఁ బోలు, నఖరాళి తారాళి నవ్వఁ జాలు
నతివపిఱుందు ధరామితోన్నతఁ బొల్చు, గళసీమ శంఖపూగముల గెల్చు

తే.

నలిశరాభ్రేంద్రమణిశశిజలజకిసల, యప్రవాళాబ్జరాకల్హారమౌక్తి
కర్క్షనగభూదరక్రముకములు సంగ్రహించుకొని నల్వ దీని సృజించెనేమొ.

62


సీ.

తరుణి వేనలి పయోధరములఁ దెగడుఁ బ, యోధరంబులు బల్ధరాధరముల
నదలించు నెఱి యధరాధరం బెన్నుఁ బ, ల్లవముల మఱియుఁ బల్లవము లంబు
జంబుల గెల్చు భుజంబులు బిసనిక, రంబుల గేరుఁ గరంబు లెపుడుఁ
గలఁగించు హల్లకావళులను వళు లుదం, చితజలరాశివీచికల మించు


తే.

మించు నెమ్మేనిడాలు గఱంచుఁ బసిఁడి, నౌర యౌరగమహిలలసౌరు సౌర
సారసాక్షులచెలువంబు సవతు సేయ, నీల లనయంఘ్రనఖములఁ బోలఁ గలవె.

68


తే.

పస నెసంగెడుగజనిమ్మపండ్లు గిండ్లు, సిరులఁ జెన్నారుకుసుమమంజరులు గిరులు
నరయ నిమ్ముద్దుకెందలిరాకుఁబోఁడి, కులుకుసిబ్బెంపుగబ్బిగుబ్బలకు దొరయె.

64


సీ.

అవిరళవజ్రప్రహారంబులకుఁ దద్ద, చలియించునుత్తాలశైలములును
దుహినాంబుబిందువు లొరలిన బిగి చెడి, క్రుంకెడురాజీవకుట్మలములు
నగ్నిశిఖావాప్తి ననయంబు బిగి దప్పి, కరఁగి పాఱుసువర్ణకలశములును
జంద్రయోగమునకుఁ జాలఁ దల్లడ మంది, జత వీడి చనువలిజక్కవలును


తే.

సాటియే వజ్రహారతుషారనీర, కుంకుమసితాభ్రయుతము లై కుదురు మీఱి
జిగియు బిగి గల్గి యెడయక చెన్నొసంగు, కన్నియలమిన్నా యిఱిగుబ్బచన్నుఁగవకు.

65


తే.

కమలభవలీలఁ గాంచె మొగంబు నడుము, హరివిలాసంబుఁ దాల్చె బిత్తరపుగుబ్బ
చన్నులు గిరీశవైఖరిఁ జెన్ను మీఱె, నహహ యియ్యింతి మూర్తిత్రయాత్మిక గద.

66


సీ.

అలిశశికార్ముకతిలకుసుమోత్పల, కుందసౌగంధికకందుకములు
దర్పణశ్రీకారదరబిసాంబుజచక్ర, వాకగుహోరగావర్తములును
గగనతరంగసైకతపిప్పలచ్చదా, చలకరితుండనిషంగములును
గచ్ఛపవటఫలకల్హారతారకా, వసుపటీరశిరీషకుసుమములును


తే.

గూర్చి నలు వార నలువ యీక్రొమ్మెఱుంగుఁ, బోఁడిఁ బోడిమి నొనరింపఁ బోలు నట్లు
గాక యుండిన నీభువనైకమోహ, నాద్భుతాకారరేఖ యెందైనఁ గలదె.

67


క.

నదమా పొక్కిలి జాంబూ, నదమా మెయిచాయి కోకనదమా పద మా
పదమా జడ నడుము వియ, త్పదమా నూఁగారు గూఢపదమా చెలికిన్.

68


క.

రాజీవముఖికనుంగవ, రాజద్గతి నెప్పుడుం దిరస్కృతి సేయున్

రాజీవముల న్విచలిత, రాజీవములు బ్రఫుల్లరాజీవములన్.

69


తే.

సరసలీలమహాఘన చయము నాత్మ, దర్శకశ్రేణియును గూడి తరళనయన
కచకపోలవిలాసవైఖరులు పొగ, మొగి ననేకశతాబ్దంబు లగుచు నుండు.

70


మ.

గజయానం గుముదాక్షిఁ గేసరివలగ్న న్నీలనీకాశమ
స్తజఁ దారేశముఖి న్ఘనాంగదవిరాజద్భాహనుద్దీప్తతో
యజగర్భప్రసవోపమానరద రామాంగిం దగన్ దీని వే
భజియింప న్సుమనఃకదంబవరదర్పం బెల్లఁ జల్లాఱదే.

71


సీ.

చంద్రబింబస్ఫూర్తి జా నొప్పె నీనాతి, హాసాధరంబులు నాననంబుఁ
గోకనదాకృతిఁ గొనబారె నీకొమ్మ, స్తననాభిబిలములు చరణయుగముఁ
గమలధరోద్వృత్తిఁ గనుపట్టె నీయింతి, కరజఘనంబులు కచభరంబు
మధుకరసాదృశ్యవిధి నొప్పె నీలేమ, మృదువచనోరువు ల్మెఱుఁగుటారు


తే.

వజ్రపుష్పాతిశయలీల వఱలె నీవి, లాసినిరదాంగకంబులు నాసికయును
భళిర యీరామసౌందర్యపటిమ యెన్న, నన్నలినగర్భునకు నైన నలవి యగునె.

72


క.

అని యితరేతరమోహము, లనివారితగతులఁ బెరుఁగు ననిమిషనారీ
జనరత్నంబును భూభ్ళ, త్తనయశిఖామణియు వగలఁ దగిలిరి మిగులన్.

73


శా.

ఆవేళం జిగురాకుబాకుదొర ప్రత్యాలీఢపాదస్థుఁ డై
చేవ ల్దీరెడుతుంటవింట మధుసంసేవాంచదిందిందిర
జ్యావల్లీనిబిడార్భటు ల్నినిచి కోపాటోప మేపార బల్
పూవుందూపులు చిమ్మె నిర్వుగపయిం బుంఖానుపుంఖంబుగన్.

74


తే.

లేమవీక్షణమాలాశిలీముఖములు, శంబరారాతిశితసుమసాయకములు
గాటముగఁ బర్వియు న్మదిఁ గాఁడుటయును, వసుమతీజాని పరవశస్వాంతుఁ డయ్యె.

75


క.

అత్తఱి బిత్తరిఁ గని భూభృత్తనయోత్తముఁడు దత్తరిలుచిత్తమునన్
మెత్తఁబడి క్రొత్తవలపులు, హత్తఁగ నత్తెఱవ కిట్టు లనియెం బ్రేమన్.

76


క.

ఎవ్వరిదానవు నీపే, రె్వతె యేమిటికి వచ్చి తిచ్చెంగటికిన్
నెవ్వడి నీఱఁ గంతయుఁ, బువ్వారుంబోఁడి నాకు బొంకక చెపుమా.

77


చ.

తొలకరిక్రొమ్మెఱంగుక్రియఁ దోఁపఁ దళుక్కని నీవు ముంగలన్
నిలిచిన గుండె ఝల్లుమని నీసొగ సెల్ల గడంక మీఱఁ గ
న్నులఁ గనినంత నుండియు మనోభవుఁ డేమియు నిల్వనీఁ డహా
చిలుకలకొ్ల్కి న న్నెదను జేర్చి కృపామతి నుద్ధరింపవే.

78

క.

అకటా మరుఁ డిపు డుల్లం, బకటావికటముగఁ జేసి యడ లూన్చెను నీ
నికటాగ్రసీమ నిడి పూ, ని కటాక్షవిలోకసమున నెఱిఁ బ్రోవు చెలీ.

79


క.

వీటీపాటీరాగరు, హాటకతాటంకమణిమయాభరణంబుల్
గూటువలుగ నిడియెద నిఁక, జోటీ మాట్లాడి ముద్దు చూపం గదవే.

80


క.

ఈరేడుజగములం దిఁక నేరీ నీరీతిగోతు లెన్నిక గనునొ
య్యారీ తీ రగుకులుకుమి, టారీ వలఱేనిమేల్కటారీ నారీ.

81


క.

అలికీరపికమరాళా, వలికిం గరువలికి మరునివాలారుంబూ
ములికిగమిసోఁకులకు నో, కలికీ మదిఁ దాళఁజాలఁ గలఁత లి కేలా.

82


క.

కులుకుచు జిలిబిలిపలుకులు, చిలుకుచు వలిగుబ్బ లెదను జేర్పవె మరుపూ
ములికీ కలికీ చిలుకల, కొలికీ మది నూలుకొనెడు కోరిక దీరన్.

83


క.

కొమ్మా మదనునిపూవుం, గొమ్మా నెమ్మది యెలర్పఁ గొమ్మా కడుఁ దో
ర మ్మైనసొమ్ము లిడియెద, రమ్మా ననుఁ గూడి మాపురమ్మున కెలమిన్.

84


వ.

అని యనేకప్రకారంబులం బ్రార్థించిన నమ్మించుఁబోఁడి యించుక దల వంచి మిన్న
కున్న సన్న యెఱింగి యన్నెలంతుకబోటికత్తియ యగుమదనమోహిని యన్నరేం
ద్రచంద్రుం గాంచి యి ట్లనియె.

85


తే.

అవనినాయక సుశ్యామ యనెడుపేర, నలరు గంధర్వరాజకన్యాలలామ
యివ్వెలందుక దీనికై యిట్లు వగలఁ, దగులఁదగునయ్య మీవంటితగవరులకు.

86


తే.

కన్నవారెల్ల నగఁ దముఁ గన్నవారి, మిన్న కెంతయుఁ బోనాడి యెన్నరాని
మున్నెఱికెల మెలంగుట చన్నె యెందుఁ, జిన్నిప్రాయంపుముద్దురాకన్నియలకు.

87


తే.

అని పలికి కల్కిఁ దోడ్కొని యనుఁగుఁజెలులు, వెసఁ దదంతికలీలానివేశమునకుఁ
జని రటు ల్జనుచున్నఁ గన్గొని మహీవి, భుండు డాయంగఁ బోయి పూఁబోఁడి కనియె.

88


చ.

నిలు నిలు పోకు బాల హరినీలనిభాలక జాల నీకు నే
వలసితిఁ జాల న న్నిటుల వంచన సేయఁగ నేల చూడఁ బూ
విలుతుఁడు కూళ వాఁ డిడెడువేదన కోరువఁజాలఁ బ్రేమ న
న్గలయుము వేళ నమ్మరునిగర్వము దూల విలాసలీలలన్.

89


ఉ.

చక్కఁదనంబు జవ్వనము జాణతనంబును గల్గి ఠీవిఁ బెం
పెక్కినదాన నంచు నొకయించుక గర్వము పర్వ న న్నిటుల్

గిక్కరవెట్టఁ జూచెదు చెలీ పదమా ముదమార నింక నా
చక్కెరవింటిదంటనునుఁజాయలకోరుల నేమి యయ్యెదో.

90


క.

బాలా వేలాగుల బతి, మాలిన విన కిగ్గయాళిమడఁతుల వెంటన్
బేల వయి చనెదు మరువిరి, గోలలపా లై కరంబు గుందెదు సుమ్మీ.

91


సీ.

నీవు మాటలు నేర్పి నెమ్మితోఁ బ్రోచిన, చిల్క చిల్కగుఁజుమ్ము చిగురుఁబోఁడి
నీ వాట దిద్ది మన్నించి పెంచిన బర్హి, బర్హి యౌఁ జుమ్ము శంపాలతాంగి
నీకొలంకులఁ జేరి నెక్కొన్నకోకంబు, కోక మౌఁ జుమ్ము చకోరనయన
నీతోఁటమధు వానినీటు గాంచినయలి, యలి యగుఁ జుమ్ము మత్తాలివేణి


తే.

దైవబల మేరికి నొకింత దప్పెనేని, ప్రాణబంధువు లైనను బగతు లగుదు
రింతి యటు గాన వేగ న న్నేలుకొనుము, కాయజుఁడు ని న్జెనఁకకుండఁ గాచువాఁడ.

92


క.

అనుమాన ముడిగి వినుమా, నను మారునిబారిఁ ద్రోచి ననఁబోఁడి వేసం
జనఁ జూచెద వలవిధి నె, క్కొనునిక్కొల నిన్నుఁ గట్టి కుడిపెడిఁ జుమ్మా.

93


సీ.

వలఱేఁడు వాఁడిపూములికిమొత్తము లేయఁ, జలివెలుం గుడుకువెన్నెలలు గాయ
గద్దరిజమిలిముక్కాలిబారులు మ్రోయ, బలితంపుగండుఁగోయిలలు గూయఁ
దులువరాచిలుకబోదలు హళాహళి సేయఁ, గొలఁకుజక్కవపౌజు లెలసి రేయఁ
గొదమనట్టువపిట్ట రోదలు తాలిమిఁ ద్రోయ, వెలిలావుపులుఁగుచా ల్విసము గ్రాయఁ


తే.

గమ్మకపురంపుపెనుదుమారమ్ము రేచి, పొరిఁబొరిఁ బిసాళినాళితెమ్మెరలు డాయ
నయయయో గోల నలువకు నలవి గాని, కడిఁది వలవంత సెక కోర్వఁగలవె చెపుమ.

94


తే.

చాన ననుఁ జూడు గడితంపునాన వీడు, కేరి మాటాడు కుసుమాస్త్రకేళిఁ గూడు
చెలులఁ దెగనాడు నీకు నీచేత నాడు, తలిరుఁబ్రాయఁపుముద్దురాచిలుకతోడు.

95


క.

అనుమాటలు విని మానిని, యనుమానింపుచు నటున్న నపు డానృపుఁడున్
నెన రొదవ మదనమోహినిఁ, గనుఁగొని యి ట్లనియ నేర్పు గడలుకొనంగన్.

96


ఉ.

మోహసమగ్రతం బ్రియుఁడు ముద్దియయుం గవగూడి కోరి యు
త్సాహమునం జెలంగునెడ జంట దొఱంగి చనంగఁ జేయుటల్
ద్రో హము గాదె హెచ్చరికతో నిను వేఁడెద నాకు నీజగ
న్మోహినిఁ గూర్పవే మదనమోహిని శాశ్వతపుణ్య మబ్బెడిన్.

97


ఉ.

కామదురాపతాపహతిఁ గ్రాఁగుచుఁ జక్కనికోడెకాఁ డెదన్

వేమఱుఁ బ్రేమ ముల్లసిల వేఁడుకొనంగ ననంగసంగరో
ద్దామవిహారలీలల ముందం బొనరించి కఱంచ లేనియా
కామినిసోయగం బడవిఁ గాచినవెన్నెల గాదె చూడఁగన్.

98


క.

మీరామామణి కడిఁదియొ, యారముతో మమ్ముబోంట్ల కాస కొలుపుచున్
గారా మారఁగ గడితఁపు, టారామముల న్మెలంగు టర్హమె చెపుమా.

99


తే.

తలిరుఁబోఁడికి గాదిలిచెలులు మీర, లిందఱును గల్గుటకుఁ జేతి కందినట్టి
మేలు వోఁ ద్రోచెదరు గాని మీఁద వచ్చు, చెడు గొకించుక యైనఁ బో నిడఁగఁ గలరె.

100


క.

శుకవాణికి నాపై నిం, చుక కూరిమి గలిగియున్న చొప్పరయక యూ
గక యెడ సేయఁగఁ జూచెద, వకటా ముకురాస్య సరసురాలవు గదవే.

101


తే.

అద నెఱిఁగి యిందు నీయిందువదనపొందు, నాకు సమకూర్చితేని యనేకమణివి
భూషణాదు లొసంగి యెప్పుడును మదిని, మదనమోహిని నీమేలు మఱువ సుమ్మి.

102


క.

అని పలుకునెడలఁ జెలు లె, ల్ల ని దేమిటిజోలి సరి బళా పదపదరే
యని చెలిఁ దోడ్కొని గొబ్బునఁ, జని రంత విభుండు గుండె ఝల్లన లీలన్.

103


వ.

అచట నొక్కచొక్కటంపుఱిక్కరారాచట్టుపయిం జతికిలం బడి నెమ్మొగంబున
దైన్యం బిగురొత్త వెచ్చ నూర్చుచు సంగడికానిమొగంబు చూచి యి ట్లనియె.

104


ఉ.

అక్కట మిక్కు.టంపుగొన బారఁ దళుక్కని తొల్మెఱుంగున
ట్లక్కజ మొప్పఁ గానఁబడి యాసలు చూపి కఱంచి యిప్పు డా
చక్కెరబొమ్మ యెచ్చటికిఁ జాఁగెనొ న న్గికురించి యింక నా
చక్కెరవింటికూళనునుఁజాయలకోరుల కోర్వవచ్చునే.

105


చ.

ఎటువలెఁ దాళువాఁడ నిపు డెవ్వరి నేమని దూరువాఁడ న
క్కుటిలశిరోజ నెయ్యెడల గొబ్బునఁ గన్గొనువాఁడ నెట్టు లె
క్కటితలిరాకుబాకుమొనగానిహళాహళి కోర్చువాఁడ న
క్కటకట చెల్మికాఁడ వలకాఁకలఁ దాళ నిఁకేమి సేయుదున్.

106


సీ.

పొలఁతుకజిలిబిలిసొలపుఁబాటలకును, మగువనిద్దపుముద్దుమాటలకును
ననఁబోఁడిచిన్నారినగవుచూపులకును, గొమ్మవేడబపుమేల్కొలపులకును
రాకేందుముఖిచొకారంపువెన్నెలకును, జేడియమురిపెంపుఁజిన్నెలకును
గలికిచనుబ్బిగుబ్బలులనిక్కులకును, జెలువచొక్కపుఁదళ్కుఁజెక్కులకును

తే.

వలసి సొలసితి నది నన్నుఁ గలసి మెలసి, బలసి కోర్కెలు దీర్పక తులువకలువ
విరిలకోరీవజీరు బల్వెతలఁ ద్రోచి, చనె నయారె యిఁ కేజాడ సైఁపువాఁడ.

107


సీ.

బలితంపుగండుఁగోయిలలకూఁకలకును, దలిరువాల్తులువబల్దాఁకులకును
గొలఁకునెత్తావిసోఁకుడులవీఁక లకును, వలపుగొజ్జెఁగనీటివాఁకలకును
మెదలుటాటోటుతుమ్మెదలప్రోఁకలకును, గలువసంగడికానికాఁకలకును
జెన్నొందుకలికిరాచిలుకమూఁకలకును, మురిమించుక్రొమ్మావిమోఁకలకును


తే.

జాలఁ దూలెద నిఁకఁ దాళఁజాలఁ జాల, మేల మేలుర నమ్ముద్దుబాల లీల
వైళ మివ్వేళఁ గూర్చి న న్నేలుకొనుము, చెలిమి గడుడెందమున నిండఁ జెలిమికాఁడ.

108


వ.

అని యనేకప్రకారంబులం దగిలి వగలం బొగులుచున్నయారాచమిన్నం గనుంగొ
ని నర్మసఖుం డి ట్లనియె.

109


క.

ఓ ఱేఁడ నీవు పలుమఱుఁ, గాఱడవులవెంట నన్యకామినికొఱకై
కాఱియలఁ బడుచు వలపులు, మీఱఁగ నవియింపఁ జనునె మే నలయంగన్.

110


క.

పలుదెఱఁగులఁ బెఱచెలికై, వలకాఁకలఁ గ్రాఁగి నేఁగవలవదు నీకున్
వలసిన మఱి యెందును వలి, కులుకుంబ్రాయంపుముద్దుగుమ్మలు లేరే.

111


చ.

పటుమతిఁ జిత్తగింపుము నృపాల విరోధివరూధినీధవ
స్ఫుటమకుటాగ్రరత్నఘృణిశోభితపాదురోరుహుండ వీ
విటు లొకయన్యపంకజదళేక్షణకై పలుమాఱు సోలుచున్
గటకట యింత గాసిఁ బడఁ గారణ మేమి కడింది మీఱఁగన్.

112


క.

వేలాగుల నన్యవధూ, లోలుఁడ వై నాన యుడిగి లోఁగెదు ధరణీ
పాల విను "కాముకస్య కు, తో లజ్జా" యనెడునుడువు తుది నిజ మయ్యెన్.

113


క.

కొద లేనివగలఁ బొగలుచుఁ, గొదకొని వనిఁ దిరుగ నేల గొబ్బున నిపు డో
సుదతీజననవమన్మథ, పదమా ముద మార వసనభవనంబునకున్.

114


వ.

అని యనునయింపుచు నర్మసఖుం డతనిం గ్రమ్మఱఁ దోడ్కొని వచ్చుచున్నయెడ
నారాజన్యపుంగవుడు ము న్నన్నిలింపలితంబినీమణులు విహరించి చనినవనంబు
చొచ్చి.

115


సీ.

పద్మరేఖావృతాంబరచరప్రమదాంఘ్రి, పద్మలాక్షాంకితప్రాంగణములు
దివిషన్నితంబకబరీభర, స్రస్తామరద్రుప్రసవచయములు
గంధర్వకులరాజకన్యాస్తనాలిప్త, హారిద్రముద్రితాబ్జాకరములు
సౌరనారీమణీసరసవిహారక్రి, యాప్రఫుల్లన్మనోజ్ఞాగమములు

తే.

క్రతుభుగంభోజలోచనాకృతమనోజ, పూజనాయత్తఫలగంధపుష్పధూప
దీపనైవేద్యముఖ్యవిస్తీర్ణవస్తు, సంతతులు చూచి పరవశస్వాంతుఁ డగుచు.

116


సీ.

ఈకెళాకుళిచెంత రాకేందుబింబాస్య, తివిరి యంచకు నడ ల్దిద్దుచుండె
నీమహీజమునీడ నిందీవరేక్షణ, చిలుకకుఁ బలుకులు చెప్పుచుండె
నీదరీతటిదరి నిభరాజగామిని, నెమ్మికి నాటలు నేర్పుచుండె
నీనికుంజముదండ మానినీతిలకంబు, తొడరి శారికి మేత లిడుచునుండె


తే.

నీనిశాకాంతకాంతమణీనిశాంత, కాంతనవరత్నమయవేదికాంతరమునఁ
గాంత జిలిబిలిపాట లేకాంతలీలఁ, బాడుచుండెఁ గదా చెల్మిపడఁతు లలర.

117


సీ.

సక్రియక్రొందళుకుపిసాళిచూపులకోపు, ముగుదనిద్దపుముద్దుమోముగోము
కొమ్మసిబ్బెపుగబ్బిగుబ్బచన్నులచెన్ను, కోమలాంగివెడందకొప్పుకప్పు
రాకేందుముఖినిగారంపుఁజెక్కులటెక్కు, సుందరివలుదపిఱుందునందు
గంధసింధురయానఘనతరోరులతీరు, హరిణనేత్రమెఱుంగుంటారుసౌరు


తే.

దలఁచుకొన్న జగం బెల్లఁ దన్మయముగఁ, గనఁబడుచునున్న దింక నక్కలికిమిన్న
నెందుఁ గన్గొనువాఁడ నాడెందమునకు, నక్కటా మిక్కుటం బైనయార్తి వొదవె.

118


క.

ఏలా హేలాలీలల, నోలిం గ్రీడించునద్దివౌకఃకులరా
డ్బాలామణిఁ బోఁ బనిచితి, బేలతనం బొదవ రిత్త బెదరించి యయో.

119


క.

నిర్భరపుణ్యఫలప్రా, దుర్భవు లగుసుజనులకును దొరకుం గా కా
స్వర్భామాసాంగత్యము, నిర్భాగ్యుఁడ నైననాకు నేఁ డెటు లబ్బున్.

120


వ.

అని తలంచుచుండి మఱియు సంగడికాని కి ట్లనియె.

121


క.

చెలికాఁడ యెట్టినోములు, సలిపెనొ యిగ్గోఁగుమ్రాను జలజేక్షణ నున్
జిలిబిలిముద్దుంబలుకుల, నలరించినఁ బెంపుఁ గాంచె నభినవలీలన్.

122


చ.

చెలిమి దలిర్ప నానవకుశేశయపత్రవిశాలనేత్ర ను
న్గలపపుఁగమ్మఁదావులు ఘనమ్ముగ నిమ్ముగఁ గ్రుమ్మరించుబ
ల్కులుకుమిటారిగబ్బిచనుగుబ్బల నొత్తి కవుంగిలించె నా
భళి భళి యిక్కురంటకముభాగ్యము చెప్పఁ దరంబె నెచ్చెలీ.

123


చ.

వలఁతితనం బెలర్ప నలవారిజపత్రవిశాలలోచనా
తిలకము న న్నొకించుకయుఁ దేఱి కనుంగొన దయ్యెఁ గాని యీ
తిలకమహీజరాజము నతిప్రియతం దనసోయగంపుడా
ల్సొలపుఁబిసాళిక్రొందళుకుఁజూపుల బి ట్టలరించెఁ బో సఖా.

124

క.

విధుబింబానన పుక్కిటి, మధు విడి యిప్పొగడమ్రాను మన్నించెఁ జెలీ
మధురాధరాధరాంచ, న్మధురస మిడి కనికరమున నన్ బ్రోవదుగా.

125


క.

మహిలామణిపాణిసరో, రుహసంస్పర్శం జెలంగి క్రొన్నన లెత్తెన్
సహకారభూజరాజం, బహహా నా కిట్టిభాగ్య మబ్బునె సఖుఁడా.

126


క.

వలనుగ నమ్ముద్దుం బై, దలి వలి నిట్టూర్పుకమ్మతావులచే వా
విలి ననిచె ననఁగ నిది వే, ల్పుల ము న్నెవ్వారి నెట్లు పూజించెనొకో.

127


తే.

చేడియలమిన్నమృదుపదతాడనంబు, గాంచి యంచితసుమనోవికాసలీల
నలరుచున్నది కంకేళి యహహ దీని, పుణ్యఫల మెన్నఁ దరమె యింపుగ వయస్య.

128


క.

పాటలగంధిచొకారపుఁ, బాటల నీప్రేంఖణంబు బహుతరసుమనః
పాటనమున నలరెడు ని, ప్పాటలఁ బాడింప నెంత భాగ్య మనుంగా.

129


తే.

కన్నియలమిన్న చిన్నారిక్రొన్నగవుల, వన్నియలు మీఱ నిప్పొన్నగున్న నలరఁ
జేసెఁ గాని యయో నేఁడు చెలిమికాఁడ, నన్నుఁ గన్గొని యొక్కింత నవ్వ దయ్యె.

130


క.

చెలిమోము కళలసంపఁగి, నల రొందం జేసె నది వయస్యా ననుఁ దాఁ
దల యెత్తి చూడదయ్యెను, జెలువకు నే నేమి తప్పు చేసితిఁ జెపుమా.

131


వ.

అనుచు వెండియు.

132


క.

అమ్మానిసిఱేఁడు వనిం, ద్రిమ్మరుచో నొక్కపువ్వుదీవియనా జుం
జుమ్మని మొఱయుచు నాడెడు, తుమ్మెదఁ గనుఁగొని కడంకతో ని ట్లనియెన్.

133


చ.

అమరనితంబినీసురుచిరాననసారససారసౌరభ
భ్రమఁ బఱతెంచె దేమొ మదబంభరరాజమ శంబరాహితా
సమసుమసాయక వ్యథలఁ జాలఁ గలంగుచు నున్న నా తెఱం
గమలకృపాంతరంగమున నప్పువుఁబోఁడి కెఱుంగ జెప్పుమా.

134


క.

అలికులతిలకమ నినుఁ గ, న్నులఁ జూచినయంతలోనె నూల్కొను ప్రేమం
జెలితుఱుము నారుఁ జూపులుఁ, దలఁ పయ్యెడు నింక నెట్లు దాళుదుఁ జెపుమా.

135


మ.

క్రతుభుక్కంజముఖీవియోగభరవిక్లాంతుండ నై యివ్వనిన్
వెతలం గుందుచు నున్న నన్ను గరుణన్ వీక్షించి నీ యెడన్
బ్రతికింపంగఁ దలంచి వచ్చితిని మేల్భవ్యాంగశోభాధరీ
కృతజంభారిశిలావినిర్మలఘృణీ యిందిందిరగ్రామణీ.

136

ఉ.

అక్కట మిక్కుటంపువిరహానలవేదన కోర్వలేక ని
న్నక్కఱతోడ వేఁడెద దయామతి నోయెలదేఁటిమిన్న నీ
ఱెక్కలమీఁద న న్నునిచి ఱింగున నుప్పడవీథి నేగి యా
చక్కెరబొమ్మపాదజలజమ్ములసన్నిధిఁ జేర్పు నేర్పునన్.

137


తే.

అక్కటా నీకుఁ గల్గిన ఱెక్క లిపుడు, నాకుఁ గల్గిన మింట నందముగఁ బఱచి
యమరభామినికుచగుళుచ్ఛములమీఁద, వ్రాలి సుఖియింతుఁ గద మధువ్రతకులేంద్ర.

138


సీ.

అవనిఁ బరోపకారార్థ మిదం శరీ, ర మని యార్యజనము లెపుడుఁ
బలికెడుమాట యేర్పాటుగా నీవు ము, న్వినియుండుదువె కద విను మలీంద్ర
నాకొఱ కిపుడు క్రన్నన నేగి గంధర్వ, కాంతాలలామంబు గాంచి వెరవు
మెఱయ నిత్తెఱఁ గెల్ల నెఱిఁగించి దాని నె, ట్లును బుజగించి తోడుకొని రమ్ము


తే.

కాక యుండిన నామాఱు గాఁ దదంఘ్రి, వనజయుగ్మంబుపై వ్రాలి వినతు లొసఁగి
యడుగుకొనియైన నిచటి కప్పడఁతిఁ దెచ్చి, యనుపమాగణ్యపుణ్యవర్తనల మనుము.

139


వ.

అని యెడయనియెడరుల బడలి యడలుచున్నయొడయని మెల్లనే యూరార్చి స
ఖుం డెట్టకేలకుఁ బటకుటీరాభ్యంతరంబునం జేర్చిన నమ్మహారాజచంద్రుండు.

140


సీ.

పగడంపుఁగంబము ల్పచ్చరాబోదెలు, గొనబారుమొకమాలు గోడబారు
కుతినీగుడారు తళ్కుపసిండికుండలు, జరబాబుచందువా సౌరుమాఱు
గుజరాతికెంపురాగుంపుజొంపములు ము, త్తెంపుజాలీలు దట్టంపుతావి
నింపు నున్మంచిగందంపుమేకులు జగా, డంబారుహొంబట్టుపంబుదాళ్లు


తే.

గలిగి యభినవశృంగారగౌరవమునఁ, జాల నలరారు డేరాహజారమునను
గడిఁదిదంత పుఁగోళ్లచెక్కడపుఁబనిక, డానిమంచముమీఁదనె మేను చేర్చి.

141


క.

ఉసు రసు రంచుం బొడలుచుఁ, గసరుచుఁ క్రొవ్వేఁడియూర్పుగాడ్సులు నిగుడన్
బస చెడి బుసగొట్టుచు వెస, ముసుఁ గిడి పలకాఁకకడలి మునుఁగుచు నుండెన్.

142


వ.

మఱియు నద్ధరావరపుంగవుడు నిజాంతరంగం బయ్యంగనామణి జగన్మోహనాంగ
శృంగారరసాభంగరంగత్తరంగిణీసంగతం బై మునుంగ నింగితం బెఱుంగక లొంగి
కలంగి బెంగగొని నింగియుఁ బుడమియుం గనరానియంగభవదురాపతాపాటోప
మాయాంధకారంబు ఘోరంబుగఁ దోరంపుఁగన్నుఁగవం గుప్పునం గప్పుకొన్న నే
మియుం గానరాక చీకాకుపడి వీఁక చెడి యడలి బడలి యొడలిబిగి సడలి గడగడ

వడంకుచుఁ గొంకుచు బెగడి దైవంబుఁ దెగడి నిగనిగ జిగిదళు కొత్తుక్రొత్తనెత్తమ్మి
ఱేకులపస న్నిరసించునిడువాలుకన్నుగవం దొఱఁగుబుడిబుడివేఁడికన్నీరు బడిబడి
నిద్దంపులేఁజెక్కుటద్దంబులం జాలువాఱ రాకానిశాకరబింబప్రతిమానమానితవదనా
రవిందంబు వాడుదేఱ గుజరాతిపచ్చరాతిమెఱుంగుహొరంగులం బొంగారుబంగా
రుచిలుకతాళిమేలిపసిండివన్నియజన్నిదంపుగుంపుతోడం బెనంగొని కరంబు నురంబు
నం చారజగానిగారంపుసొంపుపెంపునం గనుపట్టు హొంబట్టుబొందు పొందుపడం జుట్టి
కట్టినవెడందక్రొమ్ముడి సడలి నెత్తావి క్రొత్తచెంగలువక్రొవ్విరు లుర్వింగూరఁ జిన్నా
రిక్రొన్నెల నెన్ను నెన్నొసలం జెన్నారుతిన్ననిసన్నంపుకమ్మకస్తురిరేఖ యొక్కుమ్మ
డి ముమ్మరంపుచెమ్మటలం బద నెక్కి నెమ్మొగంబునం గ్రమ్మి పాఱ హారకేయూ
రకటకకంకణక్షుద్రముద్రికాదిమహాభరణంబులు సడలి జాఱ బలితంపువేఁడినిట్టూ
గాడ్పుసెగలం గంది కెందలిరుటాకుబృందంబులం దెగడుతొగరువాతెఱ తెలు
పు మీఱ నుస్సు రనుచు నుమ్మలింపుచు నుదరిపడుచు బెదరి బెదరినడెందంబుతోడం
గళవళింపుచుం గటకటా యనుచుం గ్రన్నన లేచి తల యూఁచి దిశలు చూచి వి
వేకంబు ద్రోచి విరిసరంబు లవని వైచి యేచినతమకంబున నాచిగురుటాకుఁబోఁడి
నాడెంపుగడానిమేనిజాను మానసంబునం దలపోసి గాసిలి వాసిం బాసి చెయివులు
రోసి కఱకుబెఱకుచెఱకువిలుకాఁడు బిఱబిఱం బఱగించు చుఱుకువిరిచిలుకుమొత్తంబు
లు చుఱచుఱ నదరంటం గాఁడిన సోలి తూలి తాలిమి వ్రేలి పర్యంకభాగంబున వ్రా
లి ఘోరమారవికారాపస్మారదూరితవివేకుం డగుచు నంత నప్పంకజాక్షి సమక్షంబు
న సాక్షాత్కరించిట్లు గనుపట్టినఁ బట్టరానియాశాపాశంబులం గట్టువడి గుట్టు చె
డి బిట్టువడి నెట్టకేలకు హాబాలఫాలతలాలోలనీలనీలాలకజాల జాల మేల జాలిం దా
ళఁజాలఁ జాల నిక్కరాళమయూరకీరశారిహారీతపారావతపరభృతప్రముఖవివిధవ్రా
తసమేతాయాతమనోజా కిరాతకరాతతాతిశాతస్ఫీతచూతాబ్జాతశిలీముఖసంఘాత
యాతనోద్ధూతభీతభీతచేతస్కుండ నైననన్ను నన్యు గాఁ గనుకొనక కనకకలశోప
మానానూనపీనపయోధరంద్వయం బురంబునం గదియించి కుదియించుచు హాళిం బైకొ
ని మనోజసరోంతరాళనాళీకమృణాళనాళసదృగ్భుజలతాయుగంబున బిగ్గఁ గౌఁగి
లించుచు ధగద్ధగాయమానమానితహీరప్రభాపుంజరంజితహాటకతాటంకంబులు మక
రకేతననూతనముకురఫలకోపమానంబు లగుగండభాగంబులం దాండవం బాడ సురేం
ద్రనీలనీకాశకేశపాశం బవటుప్రదేశంబునం జిందాడఁ దిన్ననిసన్నంపునెన్నడుము గడ
గడ వడంకఁ గ్రొత్తహురుమంజిముత్తియంపుసరంబులు దిరంబుగఁ గులుకుసిబ్బెంపు

గబ్బిగుబ్బలపయిం బరిపరిగతుల నర్తింప మంజుమంజీరకంకణకింకిణీవిరావంబులును
గళరవసీత్కారంబులం జెలంగ నఱమోడ్పుకన్నుగవం జుఱుకుఁదళుకువాలుజూపు
లేపు చూపఁ గమ్మకస్తురికలపంపుఁబూఁత దట్టంపుజెమ్మటసోనలం గరఁగి నెమ్మె
యిం జాలువాఱఁ గేరి డాకేలం జెక్కిలి గొట్టి దట్టించి రెట్టించుతమకంబున నుప్పొం
గి విప్పుగ నాగొప్పకన్నుంగనం గప్పుకొనం గప్పురంపురజం బొప్పుగ గుప్పుగుప్పున
గుప్పి కొలందిగ గుప్పుచుం జక్కెరకెమ్మోవి పంటం బట్టి చుఱుక్కన నొక్కి చొ
క్కుచుఁ గులికి కిలకిల నగి కిలికించితరసంబు చిలుకుచుఁ దేనియ లొలుకం బలుకు
చుఁ బలుదెఱంగులఁ బుంభావసంభోగక్రీడావినోదంబుల మోదం బొడఁగూర్చి
యాదరించి మనుచు మనుచుం బాణియుగం బెత్తి మ్రొక్కి బతిమాలుచు బయలు
కౌఁగిలింపుచుఁ బలుకరింపుచు బాష్పాంబుపూరంబు నించుచుఁ బలవరింపుచు నుండి
కొంతసేపునకుఁ దెలివిం దెచ్చుకొని మరునిప్రభావంబునకు మెచ్చుకొని తనుఁ దా
నె నొచ్చుకొని క్రచ్చుకొని యింక నెవ్వా రివ్విధం బప్పువ్వుఁబోఁడికి నెఱింగించి
మది కడఁగించి కూర్చి పేర్చు నిమ్మదనవేదనానలంబు చల్లార్చం గలవా రని యనేక
ప్రకారంబుల మనోవికారంబులం బొరలుచుండి దానహీనభూనాయకుండునుం
బోలె నాశుకవిసంభాషణప్రసంగవిముఖుం డై శాస్త్రజ్ఞానానభిజ్ఞభిషగ్వరుండునుం
బోలె సంపూర్ణచంద్రోదయలక్షణపరీక్షానపేక్షితుం డై కుకవియుంబోలె సుశబ్దా
లంకారమార్గరహితుం డై సమరభీరుండునుంబోలెఁ బరశిలీముఖగరున్మరుఝ్ఝంకార
వికంపితస్వాంతుం డై బలవంతం బగువలవంతం బొగలుచుండె వెండియు.

143


ఆ.

పరవశాత్ముఁ డై ప్రపంచంబు మఱచి జ, గంబు దన్మయంబు గాఁగఁ దలఁచి
గుణవిహీనుఁ డగుచు గణుతింప నతఁడు వి, యోగి యై కృశింపుచున్నయెడల.

144


క.

మతిమంతుఁ డట్టిగాటపు, వెతలం బడి పొరలునవనివిభుఁ గన్గొని హా
క్షితివర నీ విత్తెఱఁగున, ధృతి చెడి యడలంగఁ దగునె దీనతతోడన్.

145


క.

పురములు విడి పాఱవె కుల, తరుణులు వెత పడరె బుధులు తప్పెన్నరె నీ
సరిదొరలు నగరె వంతలఁ, గర మడలరె ప్రజలు నీప్రకారము విన్నన్.

146


మ.

అకటా భూపకులాగ్రగణ్య నయవిద్యాభ్యాసపారీణతా
ధికసంశుద్ధమనస్సరోరుహుఁడ వై దీపించునీ విట్లు నేఁ
డొకసీమంతవతీవతంసమునకై యో ర్పింతయు న్లేక యూ
రక చింతాకులవృత్తి నుండఁ దగునే ప్రజ్ఞావిహీనుండ వై.

147


మ.

కరు లశ్వంబులు నందలంబులు శతాంగంబు ల్మణీభూషణాం

బరవీటీమృగనాభివందనధనప్రాసాదదాసాదులుం
దరుణు ల్కాళెలు ఛత్రచామరము లుద్యల్లీలలం గ్రాలుని
ర్భరసామ్రాజ్యభరంబు వో విడిచి చేడ్పా టొంద నీ కేటికిన్.

148


క.

ధరణిం గలజను లందఱు, దిరముగఁ దమయాజ్ఞ మెలఁగ దృఢతర సామ్రా
జ్యరమాయుతు లగునరపా, లుర కెందును దైన్యవృత్తి లోఁగం దగునే.

149


క.

వసుధాధిప మృగయాద్యూ, తసతీముఖ్యంబు లగుచుఁ దనరెడుసఫ్త
వ్యసనములఁ బొరలుమనుజుం, డు సెడుం గడుసౌఖ్య మెన్నఁడుం గనకార్తిన్.

150


క.

భళిభళి విను మీ వెదలోఁ, దలఁచినఁ బదివేలు ముద్దుతలిరుంబోఁడుల్
గలిగెద రిటువలె గడితపు, వలవంతం జెంది కందవలదు నృపాలా.

151


క.

మదిరాక్షులవలలం బడి, మొదలం బెక్కండ్రు బన్నములఁ జెంది రహా
పదివేలు వచ్చె నింకం, బొదమా రొద మాని వేగఁ బురవరమునకున్.

152


వ.

అనిన నతని కానృపతి యి ట్లనియె.

153


మ.

పురము ల్వోయినఁ బోవనీ బంధులు తప్పు ల్వట్టినం బట్టనీ
తరుణు ల్లుందినఁ గుందనీ ప్రజలు వంతం జెందినం జెందనీ
సరివా ర్నవ్విన నవ్వనీ సచివ నే సంప్రీతిఁ దద్దేవతా
హరిణాక్షీనిబిడోపగూహనసుఖ్యాయత్తుండనై యుండెదన్.

154


సీ.

కలకంఠిసిద్దంపుగబ్బిగుబ్బల సౌరు, తరుణిలేఁజెక్కుటద్దములతీరు
నెలఁతనిద్దపుముద్దునెమ్మొగంబుహొరంగు, చాననాడెంపునున్మేనిరంగు
కలికిబిత్తరివాలుతళుకుఁజూపులయొప్పు, విరిఁబోఁడిమెఱుఁగుపెందుఱుమువిప్పు
కరిరాజయానచక్కెరకెంబెదవిసొంపు, సుందరివలుదపిఱుందుపెంపు


తే.

డెందమున నాట మిగులఁగడిందివలపు, గందళించుచు నున్ననమ్మందయాన
పొందు చేకూఱ కెవ్వ రేంచందమునను, మందలించిన సడల దే మందు సఖుఁడ.

155


క.

వారువము లందలంబులు, వారణరమణీమణీనివసనవసనభూ
షారజితకాంచనము లా, నారీమణిజోక లేక నా కేమిటికిన్.

156


ఉ.

సంగడికాఁడ చేడియలు చాలఁ గలా రని నీకు నిప్పు డీ
భంగి వచింపఁగాఁ దగునె భావమునం బరికించి చూడుమా
యంగన లెందఱైన సరి యౌదురె యాపదియాఱువన్నెమే
ల్బంగరుబొమ్మకున్ దలిరుఁ బ్రాయపువేలుపుముద్దుగుమ్మకున్.

157


చ.

సచివకులేంద్ర యవ్వికచసారసపత్రవిశాలనేత్రపొం

దచిరగతి న్ఘటించి నను నర్మిలిఁ బ్రోవుము కాకయున్న నీ
యచలగృహప్రదేశమునయందుఁ దపం బొనరించుచుందు నీ
విచటఁ దొలంగి వేగఁ బురి కేగుము మాటలు వేయు నేటికిన్.

158


తే.

అనుడు నెయ్యుఁడు వెఱఁ గంది యకట యితని, కగ్గలం బయ్యె విరహార్తి యంతకంత
కింకఁ గానకుఁ దోడ్కొని యేగి కొంత, వంత మరలింతు నని యంత సంతసమున.

159


వ.

అతనిం దోడ్కొని చని వనిం బ్రవేశించిన నమ్మహీమహేంద్రుండు.

160


సీ.

పొలఁతిపాలిం డ్లంచుఁ బొన్నకాయలు వట్టి, హా యివి పొన్నకాయలె యటంచు
నతివపెన్దొడ లంచు నంటికంబము లంటి, భళి యివి యంటికంబములె యంచుఁ
గలికిముంగురు లంచు నెలదేంట్లఁ బట్టి య, యో యిని యెలదేఁటులే యటంచు
మగువకేల్గవ యంచుఁ జిగురుటాకులు ముట్టి, చెల్లఁబో యివి లేఁజిగుళ్లె యనుచు


తే.

వనితవాతెఱ యని పరువంపుదొండ, పండు వట్టి యహా యిది పరువు గూరి
యెఱుపు మీఱినదొండపండే యటంచు, నెంచుకొంచు విరాలిం జలించుచుండె.

161


తే.

అపుడు చెలికాఁడు నృపతి కయ్యతివమీఁది, తలఁ పొకించుక మఱలింపఁ దలఁచికొనియు
నచట నచటఁ జరించుచుఁ బ్రచురఫణితి, నింపు రాణింప నాతని కిట్టు లనియె.

162


క.

అవె చూతలతలు నునుఁగెం, జివురులతోఁ దేజరిలెదు క్షితివర కంటే
యవు నవు ననుంగ యివియ, య్యువిదకరాబ్జములఁ బోలి యున్నవి సుమ్మీ.

163


క.

వసుధాధీశ శిరీష, ప్రసవము లవె చూడు సిరులఁ బరఁగెడు నౌ నౌ
రసికుఁడ యిత్తెఱఁగునఁ బొ, ల్పెసఁగుం గద దానిమేనిమృదులత మిగులన్.

164


ఉ.

మారెడుపండ్లు చూడు మవె మానవనాథకులావతంస సొం
పారుచు నెమ్మనంబునకు హర్ష మొనర్చుచు నున్న వౌ భళా
కూరిమిసంగడీఁడ యలకోకిలకాకలికానులాపవ
క్షోరుహయుగ్మ మిప్పగిది సొంపు వహించుఁ గదా యుదారతన్.

165


క.

జననాథ మొల్లమొగ్గలు, గనుఁగొను మవె మదికి ముదము గదియించుచు సొం
పునఁ దనరెడు నౌ నిట్టులె, తనరుం గద సఖుఁడ దానిదంతాళిరుచుల్.

166


క.

రంభాస్తంభము లవె సం, రంభం బలరారఁ జూడు రాజోత్తమ య
య్యంభోజవదనయూరు, స్తంభము లి ట్లలరుఁ జుమ్ము సంగడికాఁడా.

167


చ.

కనుఁగొను కేతకీకుసుమగర్భదళంబు లుదగ్రవైఖరిన్

దనరుచు నున్నవల్లవె శతక్రతుసన్నిభ మే లయారె య
వ్వనజముఖీశిరోమణియవక్రనఖాంకురపంక్తి యివ్విధం
బునఁ దనరుం గదా సచివపుంగవ నవ్యవిలాసలీలలన్.

168


తే.

ప్రభుజనోత్తమ చూడు జపాప్రసూన, మదె మనోహరలీలచే నలరుచున్న
దౌ భళా సంగడీఁడ యయ్యన్నుమిన్న, ముద్దుకెమ్మోవి యివ్విధంబుననె యలరు.

169


క.

ఎకిమీఁడ చూడు మిదె చం, పకముకులము లెదకుఁ జాలఁ బ్రమద మిడెడు న
వ్వికచాంబుజాతముఖినా, సిక యి ట్లలరారుఁ జుమ్ము చెలికాఁడ కడున్.

170


క.

పున్నాగమ కనుఁగొను మదె, పున్నాగము ననిచి సిరులఁ బొలుపారెడు నౌ
నన్నాగయానపొక్కిలి, యన్నా యిన్ననలపగిది నలరారుఁ గదా.

171


తే.

అని వచించుచు వార లవ్వనిఁ జరించు చున్నచోఁ గీరశారీమయూరపికమ
రాళరోలంబజాలంబు వ్రాలి కడు హ, ళాహళి యొనర్ప నులికి యిలావిభుండు.

172


వ.

వెండియు నతని కి ట్లనియె.

173


సీ.

కొఱవిదయ్యమ్ములతెఱఁగునఁ జిగురాకు, గుబురులయం దున్నకోకిలములు
బమ్మరాకాసులభంగిని జె ట్టెక్కి, పదరుచు నున్నట్టిబర్హిణములు
పురుటిండ్లబూచులపోల్కెఁ బూఁబొదలపై, సందడి నెఱుపునిందిందిరములు
పెనుగత్తులట్ల కంపిలఁజేయుచుకు గోనఁ, బొదలి యావడి సేయుమదశుకములు


తే.

మఱియుఁ గపురంపుకమ్మదుమార మెలయ, వీఁకఁ బైకొనుచిఱుగాడ్పుసోఁకుడులును
నలముకొనఁగ భూతాక్రోశ మైనయిట్టి, వనికి న న్నేల తెచ్చితి వనుఁగ యిపుడు.

174


తే.

కుసుమబాణున కెప్పుడు కువలయనవ, మాలికాశోకకమలరసాలములను
సాయకము లైదు గల వండ్రు సఖుఁడ యిపు డి, దేమి వని యెల్లఁ దూపు లై హెచ్చు మీఱె.

175


తే.

మరునిపూఁదూపు లిందాఁకఁ గెరలి వెలికిఁ, గానరాకుండ నెదలోనఁ గాఁడుఁ గాని
కడఁగి యిపు డేమి మే నెల్లఁ గాఁడఁ జాఁ గె, ననుగ యని సోలెఁ బై రాలుననల కులికి.

176


వ.

అట్లు సోలినధరావరామరాధీశ్వరుం గ్రమంబున శిశిరోపచారంబుల సేదఁ దీర్చి

నర్మసఖుండు యథాస్థానంబునఁ జేర్చె నని నారదునకు శారదామనోహరుం డెఱిం
గించిన నతం డతని నవ్వలికథావిధానం బడుగుటయును.

177


చ.

పరమకృపానివేశమృదుభాషణ భోగికులేంద్రభూషణా
హరిహయముఖ్యనిర్జరగణావన సంతతవిశ్వభావనా
కరిదనుజేంద్రదుర్మదవిఖండన బాలశశాంకమండనా
యరిబలహృద్భయంకరమహాగ్రహ కుక్కుటరాజవిగ్రహా.

178


క.

స్వర్గాపవర్గఫలదని, సర్గా దుర్గాధినాథ సంభృతసుమనో
వర్గా దుర్గాయితనగ, భర్గా గర్గాదివినుతపటుసన్మార్గా.

179


సుగంధివృత్తము.

తారకాశతారకాశతారకాశరాట్పయ
శ్శారదాభ్రశారదాభ్రసామజామరద్రునీ
హార నహారఫేనహారిభూరికీర్తివి
స్తారఘోరబాహుసారదారితారిమండలా.

180


గద్యము.

ఇది శ్రీమత్కుక్కుటేశ్వరకరుణాకటాక్షనిరీక్షణసంలబ్ధసరసకవితాసామ్రాజ్య
ధురంధర ఘనయశోబంధుర కౌండిన్యసగోత్రపవిత్ర కూచిమంచిగంగనామాత్యపుత్త్ర
సకలసంస్కృతాంధ్రలక్షణకళాకౌశలాభిరామ తిమ్మకవిసార్వభౌమప్రణీతం బైనరసి
కజనమనోభిరామం బనుశృంగారరసప్రబంధంబునందుఁ దృతీయాశ్వాసము.