యెంకి పాటలు/సరాగాలు
సరాగాలు
పూవునేనైతె?
నే
నీవలపునౌదు!
పూనిన్నె జగమంత
ధ్యానింపజేతు!!
... ... ...
నేను కోయిలనైతె?
నీ రాగమౌదు!
దిశలహోనిన్నె
కీర్తింపగాజేతు!!
... ... ...
రాయి నేనైతె?
నీ
ప్రాణమ్మునౌదు!
ముజ్జగము రానిన్నె
మొక్కగాజేతు!!
... ... ...
నీవు నేనైతె?
నిను నీలోనె కందు!
నేను నేనుగనుంటె?
నీలోనె యుందు!!