యెంకి పాటలు/వుత్తమాటలు

వుత్తమాటలు

'వుత్తమాటలు నీవి పొ'మ్మందిరా,
యెంకి
'కొత్తపాటలు పాడుకొ'మ్మందిరా
వూరెల్త ననిపలికి
మారేస మేసుకొని
'సకినాల పాటొచ్చు
సకిన మడు'గన్నాను_
'వుత్తమాటలు నీవి పొ'మ్మందిరా,
యెంకి
'కొత్తపాటలు పాడుకొ'మ్మందిరా
'యీ రోజు నీ రాజు
వూరెల్లి నా' డంటి,
'యేరాపులోరూపు
మారిపోయిం' దంటి_
'వుత్తమాటలు నీవి పొ'మ్మందిరా,
యెంకి
'కొత్తపాటలు పాడు'కొమ్మందిరా

'మొదల మీ రీయేటి
మొగనె కలిశా' రంటి
'మెరుపల్లె పాటెత్తి
మురిపించి నా' డంటి
'వుత్తమాటలు నీవి పొ'మ్మందిరా,
యెంకి
'కొత్తపాటలు పాడుకొ'మ్మందిరా
'కొద్దిలో వొరహాల
కొడుకునెత్తే' వంటి
'యీ నిజము తేలేకె
యీనాములి'మ్మంటి
వుత్తమాటలు నీవి పొ'మ్మందిరా
యెంకి
'కొత్తపాటలు పాడుకొమ్మందిరా.

*