యెంకి పాటలు/తెరచాటు
తెరచాటు
లేపకే నా యెంకి లేపకే నిదరా!
యీపాటిసుకము నే నింతవరకెరుగనే!
లేపకే నా యెంకి....
కలలోన నాయెంకి
కతలు సెపుతున్నాది_
వులికులికి పడుకొంట
’ఊ’కొట్టుతున్నాను! లేపకే...
కతలోని మనిసల్లె
కాసింతలోమారి
కనికట్టు పనులతో
కతనడుపుతున్నాది! లేపకే...
రెక్కలతొ పైకెగిరి
సుక్కల్లె దిగుతాది_
కొత్తనవ్వుల కులుకు
కొత్తమెరుపుల తళుకు! లేపకే...
తెలివి రానీయకే
కలకరిగిపోతాది_
ఒక్కనేనే నీకు
పెక్కునీవులు నాకు! లేపకే...