కలత నిదర

ఈ రేయి నన్నొల్ల నేరవా? రాజా!
ఎన్నెలల సొగసంత యేటిపాలేనటర!

ఆకాశ మేమూలొ
అణిగిపోయిన రేయి
ఏటి సెందురుడల్లె
సాటుసూపుల కులికి_
ఈ రేయి నన్నొల్ల నేరవా? రాజా!
ఎన్నెలల సొగసంత యేటిపాలేనటర!

ఆకాశమోతీరు
అడిలిపోయిన రేయి
మాట లెరుగనిపాప_
ఏటి గిలగిల సూపి_
ఈ రేయి నన్నొల్ల నేరవా? రాజా!
ఎన్నెలల సొగసంత యేటిపాలేనటర!

ఆకాశమావొరస
ఆవులించిన రేయి
మిసమిసలతో యేటి
పసలతో ననుసుట్టి_
ఈ రేయి నన్నొల్ల నేరవా? రాజా!
ఎన్నెలల సొగసంత యేటిపాలేనటర!

యెలుతు రంతామేసి
యేరునెమరేసింది
కలవరపు నాబతుకు
కలతనిదరయ్యింది_
ఈ రేయి నన్నొల్ల నేరవా? రాజా!
ఎన్నెలల సొగసంత యేటిపాలేనటర!

ఒక్క తెను నాకేల
ఓపజాలని సుకము!
ఈ రేయి నన్నొల్ల నేరవా? రాజా!
ఎన్నెలల సొగసంత యేటిపాలేనటర!

*