యెంకి పాటలు/ఆ కాలపు నాయెంకి

ఆ కాలపు నాయెంకి

దూరాన నారాజు కే రాయిడౌనో!
ఈ రోజు నారాత లే రాలపాలో!

సీమ సిటుకనగానె
సెదిరిపోతది మనసు__
కాకమ్మ సేతైన కబురంప డారాజు
దూరాన నారాజు కే రాయిడౌనో ......

కళ్ళ కేటో మబ్బు
గమ్మిన ట్టుంటాది__
నిదరల్లె నావొల్లు నీరసిస్తున్నాది
దూరాన నారాజు కే రాయిడౌనో!......

ఆవు 'లంబా' యంట
అడిలిపోతుండాయి__
గుండెల్లొ వుండుండి గుబులు బిగులౌతాది
దూరాన నా రాజు కే రాయిడౌనో !. . . . . .

తులిసెమ్మ వొరిగింది,
తొలిపూస పెరిగింది__
మనసులో నా బొమ్మ మసకమస కేసింది
దూరాన నారాజు కే రాయిడౌనో!......