మొల్ల రామాయణము/సుందరకాండము/రావణుఁడు మదనాతురుఁడై సీతను బ్రార్థించుట

రావణుఁడు మదనాతురుఁడై సీతను బ్రార్థించుట

మార్చు

క. సీతను గనుగొని రావణుఁ
డాతత నయవాక్యఫణితి నతికుతుకమునన్‌
జేతోభవ నిశితాంబక
పాతంబులఁ జాల నొచ్చి పలుకఁగఁ జొచ్చెన్‌. 43
లయగ్రాహి.
తోయజ దళాక్షి! వలరాయఁ డిటు లేచి పటు
     సాయకము లేర్చి యిపు డేయఁగఁ దొడంగెన్‌,
దోయద పథంబున నమేయ రుచితోడ నుడు
     రాయఁడును మంచి వడఁ గాయఁగఁ గడంగెన్‌,
గోయిలలుఁ గీరములుఁ గూయఁగ నళి వ్రజము
     లే యెడలఁ జూచినను మ్రోయుచుఁ జెలంగెన్‌,
నా యెడఁ గృపారసము సేయ కవివేకమున
     నీ యెడల నుండు టిది న్యాయమె లతాంగీ!
44
వ. అని మఱియును, 45
సీ. అలకేశ్వరుం డుపాయనముగా నిచ్చిన-యంచిత చీనిచీనాంబరములు,
దివిజాధినాథుండు దిన దినంబును నిచ్చు-పారిజాతోల్లసత్ప్రసవములును,
దక్షిణాధీశుండు తగఁ గాన్క లంపిన-సురభి కర్పూరాది పరిమళములుఁ
బాతాళముననుండి ఫణిసార్వభౌముండు-పుత్తెంచినటువంటి భూషణములుఁ
తే. గలవు నా యింట నే ప్రొద్దుఁ గదమ లేక-దేహ పరితృప్తి గావించి మోహ మలరఁ
గాము కేళి సుఖంబులఁ గలయు టొప్పు-విడువు మడియాస రామ భూవిభుని మీఁద. 46
సీ. ఎవ్వాని వీటికి నేడు వారాసులు-పట్టని కోటలై పెచ్చు పెరుంగు,
నెవ్వాని సేవింతు రింద్రాది దేవత-లనుచర బలు లయి యనుదినంబు,
నెవ్వాని చెఱసాల నే ప్రొద్దు నుందురు-గంధర్వ సుర యక్ష గరుడ కాంత,
లెవ్వాని భండార మిరవొంద విలసిల్లు-నవ నిధానంబుల వివిధ భంగి,
తే. సకల లోకంబులును మహోత్సాహ వృత్తి-నెవ్వానికిఁ జెల్లుఁ బుష్పక మ్మెక్కి తిరుగ,
నాకె తక్కంగఁ గలదె యే నాట నైన?-మద్భుజాశక్తి ప్రతిపోల్ప నద్భుతంబు. 47
సీ. శ్వసనుండు లోగిలి సమ్మార్జనముఁ జేయ-నబ్ధినాథుఁడు కలయంపి సల్లఁ,
బావకుం డరుదెంచి పాకంబు లొనరింప-శమనుండు వెసఁ బరిచర్యఁ జేయఁ,
బాకారి కల్పక ప్రకరంబు లర్పింప-దనుజేశ్వరుండు కైదండ యిడఁగ,
నర వాహనుండు తా నగరి వెచ్చము వెట్ట-నీశానుఁడు విభూతి నెలమి నీయ,
తే. గురుఁడు పంచాంగ మెప్పుడు సరవిఁ జెప్ప-నమర కిన్నర గంధర్వ యక్ష భుజగ
సిద్ధ కింపురుషాంగనల్‌ఁ చేరి కొలువ-వైభవంబునఁ జెలు వొందువాఁడఁ దరుణి! 48
ఉ. ఎత్తితి శంకరాచల మహీన బలంబున బంతి లాగునన్‌
మొత్తితి సర్వ దిక్పతుల మూఁగిన గర్వము విచ్చిపాఱఁగా,
నొత్తితి శత్రు భూపతుల నుగ్ర రణంబున భూమిఁ ద్రెళ్ళఁగా
మొత్తితి భోగి కంఠము లమోఘ జవంబున మేటి కీర్తులన్‌. 49
తే. జడలు ధరియించి తపసుల చందంబునను
దమ్ముఁడును దాను ఘోర దుర్గమ్ములందుఁ
గూరగాయలు కూడుగాఁ గుడుచునట్టి
రాముఁ డే రీతి లంకకు రాఁగలండు? 50
ఆ. ఇంకఁ జేయఁ నేర, రీఁదంగ నోపరు,
కట్ట లేరు, చుట్టి పట్ట లేరు,
జలధి దాఁట లావు చాలదు నరులకు,
వచ్చు త్రోవ చెపుమ వారిజాక్షి? 51
క. దానవు లెప్పుడు చూచిన
మానవులను గెలువఁ గలరు, మది నూహింపన్‌
మానవ భక్షకులై మను
దానవులను గెలువ నరుల తరమే జగతిన్‌? 52
క. జగతీశుఁడు మానవుఁడట!
నగరే భుజ శక్తిచేత నా కెదు రన్నన్‌?
నగ ధరుఁడో, నగ ధన్వుఁడొ,
నగ భేదియొ, కొంత కొంత నాతోఁ బోరన్‌? 53
వ. ఆ సంగతి యట్లుండనిమ్ము. 54
క. నీ కన్నుల సౌభాగ్యము
నీకుచములఁ గలుగు మేలు, నీ ముఖ కాంతుల్‌
నీ కరముల లావణ్యము
నాక స్త్రీలందు లేవు నాకుం జూడన్‌. 55
మ. సుర కాంతల్‌ సరి రారు! యక్ష సతులున్‌ సూటింపఁగా రారు, కి
న్నర భామల్‌ ప్రతి రారు, సిద్ధ వనితల్‌ న్యాయంబుగాఁ బోల, రా
గరుడాబ్జాక్షులు సాటిరారు, తలఁపన్‌ గంధర్వ లోలాక్షులున్‌,
మఱి యేరీ నినుఁ జెప్పి చెప్పఁ దరుణుల్‌ మత్తేభ కుంభస్తనీ! 56
క. వ్రీడ యలంకారముగా
నాడుము భయ ముడిగి మధురమైన మృదూక్తుల్‌,
బేడిసల నేలు కన్నులఁ
జూడుము కనుఱెప్ప లెత్తి సుదతీ! నన్నున్‌. 57
వ. అని యిట్లు నోరికి వచ్చిన మచ్చునఁ బ్రేలుచున్న యా నీచుని
దుష్ట భాషణంబులకు రోసి తృణంబు చేపట్టి,
జనక భూపాల నందన యిట్లనియె. 58