మొల్ల రామాయణము/అరణ్య కాండము/సీతను గానని శ్రీరామచంద్రుని విరహాతిశయము
సీతను గానని శ్రీరామచంద్రుని విరహాతిశయము
మార్చుఆ. పర్ణశాలలోనఁ బరికించి పరికించి,
సీత కానఁ బడమిఁ జిన్న వోయి,
చిత్తమంతఁ గలఁగి, శ్రీరామచంద్రుండు
పలువరింపఁ జొచ్చె బ్రమసి బ్రమసి. 51
సీ. నీ దృగ్విలాసంబు నెఱి నభ్యసించెడు-గురు కుచఁ గానవే హరిణ విభుఁడ?
నీ మంజులాలాప నిచయంబుఁ గైకొన్న-సుకుమారిఁ గానవే పిక కులేంద్ర?
నీ నిండు సత్కాంతి నెమ్మోము గలయట్టి-రుచిరాంగిఁ గానవే రోహిణీశ?
నీ పక్ష విస్ఫూర్తి నెనయు ధమ్మిల్లంబు-గల యింతిఁ గానవే యళి కులేశ?
తే. స్తన భరంబున నీ పోల్కిఁ దనరినట్టి-యతివఁ గానవె చక్రవాకాధినాథ?
నెఱయ నినుఁ బోలు నెన్నెడ నేర్చినట్టి-రమణిఁ గానవె నీవు మరాళ రాజ? 52
సీ. ఘనసార భూజంబ! కానవే నీ వంటి-గంధంబు గలయట్టి కరటియానఁ?
గదళికా తరురాజ! కానవే నీ యట్టి-మెఱుఁగుఁ బెందొడల మా మీననేత్ర?
విలసిల్లి చంపక వృక్షంబ! కానవే-లలి నీదు పుష్ప విలాస నాసఁ?
గమనీయ లత! నీవు కానవే నీయట్టి-కరములు శోభిల్లు కంబుకంఠిఁ?
తే. గ్రముక ధరణీరుహాధీశ! కానవయ్య-నీ ఫల స్ఫూర్తి కంఠంబు నీలవేణిఁ?
గళికలను మించు నవకుంద! కానవమ్మ-నీదు కోరిక నిభదంత నీరజాస్య? 53
సీ. వనజాస్య! నినుఁగూడి వర్తించు నతి ఘోర-వనములు శృంగార వనము లగును,
పడఁతి! నీతోఁగూడి పవళించు కర్కశ-శయ్యలు పూవుల శయ్య లగును,
గలకంఠి! నీచేతి కంద మూలాది భో-జనములు మధుర భోజనము లగును,
హరిమధ్య! నినుఁ గూడి చరియించు నటువంటి-తపములు సత్పుణ్య తపము లగును,
తే. ఇంతి! నీతోడఁ గూడి భోగించునట్టి-భోగమంతయు దేవేంద్ర భోగ మగును,
సుదతి! పొడకట్టఁ గదె నాకుఁ జూడవలయుఁ-గన్నులకుఁ గానఁబడ వేమి కమల నయన! 54
వ. అని మఱియును, 55
సీ. ఏ మృగంబును గన్న నేణాక్షిఁ గానవే?-యని పెక్కు భంగుల నడిగి యడిగి,
యే పక్షిఁ గనుఁగొన్న నెలనాఁగఁ గానవే?-యని పెక్కు భంగుల నడిగి యడిగి,
యే మ్రానుఁ బొడగన్న వామాక్షిఁ గానవే?-యని పెక్కు భంగుల నడిగి యడిగి,
యే గట్టుఁ బొడగన్న నిభయానఁ గానవే-యని పెక్కు భంగుల నడిగి యడిగి,
ఆ. కలఁగు, భీతి నొందుఁ, దలఁకుఁ జిత్తములోన,-సొలయు, మూర్ఛఁ బోవు, వలయు, నలఁగు,
సీతఁ గానఁబడమి శ్రీరామచంద్రుండు-విరహ తాప వహ్ని వేఁగి వేఁగి. 56
వ. ఇట్లు సీతా వియోగంబునకుఁ బలవరించుచున్న యన్నం గని సౌమిత్రి యిట్లనియె, 57