క.కందర్పరూప. ఖండిత
కందర్పవిరోధిచాప ! కరుణాద్వీపా !
వందిత శుభనామా. ముని
సందోహస్తుత్యభూమ . జానకీరామా
వ.శ్రీ నారదమునీశ్వరుండు వాల్మికీముని కెఱింగించిన
తెఱంగు వినిపించెద నాకర్ణింపుము........................... |2|
సీ.తనసుమంత్రాది ప్రధానులతోఁ గూడి
సుఖగోష్టి నుండంగ సఖిలజనులఁ
జక్కఁగా రావించి సమ్మదంబున వంశ
గురువుతో దశరధధరణినాధుఁ
డనియె నీభూభార మంతయు నొక్కట
నేలితిఁ జాలదె యేక హేళి
నటుగాక పగతుర నవలీల గెల్చితి
నిల్పితి ధర్మమ్ము నిష్ఠతోడ
తే.నింత చాలదె యాశకు నెంత కెంత
రామచంద్రుని ధరణి రాజు గాఁగ
మీరు సూడంగఁ బట్టంబు భూరిమహిమఁ
గట్టవలయును మంచిలగ్నమునఁ జెలగి................... |3|
తే.అనుచు గురునకుఁ దెల్పి తా నతనిసమ్మ
తమున సౌభాగ్యమంగళద్రవ్యసమితిఁ
గూర్చుఁ డనుచు మంత్రులకును నెఱుంగఁ
జెప్పి శ్రంగార మీ పురిఁ జేయుఁ డనియ....................|4|
  
 

వ.అట్టిసమయంబున............................................|5|
తే.పగలు ప్రాగ్భాగమున నుండి గగనవీథిఁ
జరమదిక్కున కేఁగంగా శ్రమము దోఁచి
చెమట పట్టిన స్నానంబుఁ జేయ నరుగు
కరణి నపరాబ్ధిలో దివాకరుఁడు గ్రుంకె........................... |6|
క.మేలిమి సంధ్యారాగము
వ్రాలినచీఁకటియుఁ గలిసి వరుణునివంకన్
నీలముఁ గెంపును సతికిన
పోలికఁ జూపట్టె నఋట నభోమణి తలగన్.................... |7|
క.వారకకల్పద్రుమమునఁ
గోరకములు పుట్టినట్లు గురుతరకాంతిన్
దారకముల్ తల సూపెన్
జోరానీకమ్ము మిగుల న్రుక్కుచు నుండన్.................. |8|
ఆ.కారుమొగులరీతిఁ గాటుకచందాన
నీటిభతి నింద్రనీలమహిమ
మాషరాశిపోల్కి మఱి మఱి యపు డంధ
కార యవని యెల్లఁ గలయఁ బర్వ...........................|9|
వ.అట్టిసమయంబున.........................................|10|
చ.తలవరులన్ నిజాధిపుల దర్పకునేర్పునఁ బ్రామియ
త్తలఁ దమపిన్నపాపల నుదారత నేర్పడ నిద్రపుచ్చిన ని
ర్మలకరకంకణావళుల రట్టుగ దా మటు మ్రోఁగనీక వి
చ్చలవిడిగాఁ జరించి రొగి జారలతాంగులు మధ్యరాత్రులన్.
చ.సురతము లేక యుస్సురనుజోటిమగండుడికించుకాంతయున్
 సరస మెఱుంగు చంద్రముఖి సొవడిదంటయు బేరకత్తెయున్
 

బరబురషాభిలాషమును బాయనిభామిని పోరుకట్టునన్
జరఁగినభామలాది యుపభర్తలఁ గూడి జరించి రత్తరిన్.
ఉ. భానుసహస్రసత్కిరణపంక్తుల నుద్భవ యాబృహ
ద్భానునివెట్ట బెల్లుడకఁబడ్డసుధాంబుధిమీఁదిమీగడల్
పూని సమీరునిచేఁ దెరల పూర్వదిశం గనుపట్ట దానిపై
ఫేవ మనంగ నొప్పె శశిబింబము తూరుపుఁ గొండపైఁదగన్
చ.కుముదములుంజకోరములుఁ గోమలసస్యముఁజంద్రకాంతయు
రమణఁజెలంగ వెన్నెల తిరంబుగఁ జేసెజగంబులుబ్బఁగాఁ యల్
గమలములున్ వియోగులధికంబుగఁజోరులుఁజక్రవాకంబుల్
రమణఁ గలంగ వెన్నెలతిరంబుగఁగాచెజగంబులుబ్బఁగాన్.
ఉ. నారదు లైరి సన్మునులు నాకమహీజములయ్యే భూజముల్
శారద లైరి భామినులు శంకరశైలము లయ్యె గోత్రముల్
పారద మయ్యె నీరధులు పన్నగనాయకులయ్య్యె నాగముల్
వారిదవర్గ మెల్ల సితవర్ణము లయ్యెన్ బండువెన్నెలన్.
చ.కొడు కుదయించె సంచలరి కోరిమధాంబుధిమిన్నుముట్టియ
ప్పుడుజగమెల్లఁగప్పెననఁ బూర్ణతనొందెనుసాంద్రచంద్రికల్
పుడమికిఁ బాలవెల్లిగతిఁ బొల్పెసలారఁగఁజంద్రుఁడొప్పెన
య్యుడుపతిమేనిమచ్చయును నొప్పెఁబయోనిధిపద్మనాభుఁడై.
వ.అట్టిసమయంబున.....................................................
ఉ.కోరి చకోరదంపతులు గుంపులు గుంపులు గూడి రంతులన్
బేరిన చంద్రికారసముఁ బేర్కొనిమార్కొనిపొట్టనిండఁగాఁ
బారణ సేసి పెన్బయలఁబ్రాఁకుచుఁజంచుపుటంబు లెత్తుచున్
బేరము వారుచుండె మదిఁ బ్రేమ జనింప వధూటికోటికిన్.
ఉ.వెన్నెలతీఁగలన్ గొనలు వేడుక ముక్కలఁ ద్రుంచి తెచ్చిదా
ర్కొన్నప్రియాంగనాతతికిఁ గూరిమి నోరికి నిచ్చి కేళికిన్

సన్నపుఁ గంఠ నాళముల సన్నలు సేసి సుఖించె నింపుగన్
దిన్నని చంద్రకాంతమణి తిన్నెలమీఁదం జకోరదంపతుల్..................... ||19||

ప్రభాత వర్ణణము

తే. పాకశాసని చేమంతి బంతి దివికి
నెగుర వేచిన కైవడి నేమి సెప్పఁ
బాండువర్ణంబుతోఁ బూర్వభాగ మందు
సొంపు మీఱంగ వేగురుఁజుక్క వొడిచె............................................... ||20||
వ. అట్టి సమయంబున.............................................................. ||21||
క. రవి యుదయించెను జనుఁడీ
దివియలు, నక్షత్ర సమితి, తిమిరము, శశియున్
బవ లేమిటి కనురీతిని
గువలయమున గూళ్ళుఁ గోళ్ళు గూయ మొదలిడెన్............................ ||22||
చ. వదలక పద్మరాగ మణి వట్రువ గ్రాలగఁ బట్టి నేర్పు పెం
పొదవఁగఁ దూర్పు కొండపయికొప్పుగఁ దెచ్చి జగద్గురుండు దాఁ
ద్రిదశవరేణ్యు కట్టెదురఁ దేఁకువ నిల్పినదర్పణంబు నా
నుదయము నొందె భానుఁడు సముజ్జ్వలకోకనద ప్రదీప్తులన్...................... ||23||
వ.ఆరాత్రి రాజశేఖరునిచిత్తంబు వచ్చునట్టుగా మెలంగి యా
తఁడు దన్ను మెచ్చు టెరింగి కైక యిట్లనియె.......................................... |24|
ఆ. వసుమతీశ ! నాకు వరమిచ్చి తప్పుట
తగవు గాదు మీకుఁ, దలఁపులోన
మఱచినా రదేమొ మన్నించి తొల్లింటి
యీవు లీయవలయు నీ క్షణంబ ........................................................||25||
క. జననాథ ! నా కుమారుని
వినుఁడీ పట్టంబు గట్టి వేవేగను, రా
మునిగా మునిఁగా ననుపుఁడు మఱి
వనమునఁ బదునాలు గేండ్లు వర్తింపంగన్................................................... ||26||

వ. అని ప్రార్థించిన విని పార్థివేంద్రుఁడు డిల్లపడి తల్లడిల్లుచు నుల్లంబు గలంగి ముసుంగిడి యచ్చేడియ పలికిన పలుకులకు మాఱాడ నోడి మిన్నక యున్న యున్న సమయంబున, సుమంత్రుం డేతెంచి "స్వామీ ! రామచంద్రుని బట్టంబు గట్ట సుమూహుర్తం బాసన్నం బయ్యెఁగావున మిమ్ము నచ్చటికి విచ్చేయ నవధరింపుఁ" డని వశిష్ఠ భగవానుండు విన్నవించు మని పంపె నని చెప్పిన కైక యిట్లనియె : ||27|

మ. అనిలో మున్ను నృపాలు చిత్తము కేనహ్లాదముం గూర్చి, నా
తనయుం బట్టము గట్టి, రాఘవుని బద్నాలుగేండ్లు కాంతారమం
దును వర్తిల్లఁగఁబంపఁగొన్న వరమున్ ద్రోయంగరా దెంతయున్
వనసీమన్ ముని వృత్తి నుండు మనుఁడీ వైళంబ యా రామునిన్ ||28||

క. అని పలుకు కైక పలుకులు
విని వేగము మరల వచ్చి విన్నఁదనంబున్
దనుక వశిష్ఠునితోడన్
వినుపించె సుమంత్రుఁ డట్టి విధ మేర్పడఁగన్. ||29||

సీతా లక్ష్మణులతొ శ్రీరాముని యటవీ నిర్గమనము

వ. అనిన విని వశిష్ఠాది ప్రముఖులును, సుమంత్రాది ప్రధాన జనంబులును, సైన్యంబులును, బరివారంబులును విన్ననై యున్న నా సన్న యెఱింగి, రామచంద్రుండు రాజ చిహ్నంబులు త్యజించి, జటా విభూతి వల్కలంబులు దాల్చి, ధనుర్ధరుండై యున్నంత; లక్ష్మణుండును భూ పుత్రికయును దోడం జనుదేరఁ, దల్లులకు నమస్కరించి, వశిష్ఠానుమతంబున నాశీర్వచనంబులు గైకొని, యాస్థానంబు వెలువడి యరణ్యంబున కరుగునప్పుడు పుర జనులందఱును బురపురం బొక్కుచు, దశరథ మహారజును దూషించుచుఁ, గైకను నిందించుచు, మూఁకలై శోకించుచుండనది యంతయు విని దశరథుండు పురోహితామాత్యబంధు వర్గంబులతో శ్రీరామచంద్రుం డేగినత్రోవం జన్నంత నా రాముడు దూరంబున జనియె దశరథుండును మరలి వచ్చి పుత్ర శొకంబున నాక పురంబునకుం జనియెఁద దనంతరంబ.


ఆ. చనుచు రాఘవుండు స్వర్ణది యొడ్డున గుహుని గాంచి యతనిఁ గుస్తరించి తడయ కోడఁ బెట్టి దాఁటింపు మనవుడు నట్ల చేయఁ దలఁచి యాత్మలోన ||32||

క. "సుడిగొని రాము పాదములు సోఁకిన ధూళి వహించి రాయి యే ర్పడ నొక కాంత యయ్యె నఁట, పన్నుగ నీతని పాద రేణువి య్యెడ వడి నోడసోఁక నిది యేమగునో" యని సంశయాత్ముఁడై కడిగె గుహుండు రామపద కంజ యుగమ్ము భయమ్ము పెంపునన్. ||33||

భరద్వాజ మునియాదరాతిథ్యము

ఉ. రాజ కులావతంసుఁ డగు రాముఁడు తమ్ముఁడుఁ దాను నా భర నా భర ద్వాజ మహా మునీంద్రు పద వారిజముల్ గని మ్రొక్క నాతఁడం భోజ హితాన్వ యాబ్ధి పరిపూర్ణ సుధాకరుఁడైన రామునిం బూజ లొనర్చి కంద ఫల మూలములం బరితృప్తుఁ జేసినన్ ||34||

వ. సంతసించుచు నా రాత్రి యచ్చట నివసించి మఱునటి దిన మర్కోదయమ్మున ||35||

వ. మదముతోడఁ దన్ను ముని భరద్వాజుండు భక్తి ననుప, రామభద్రుఁ డంతఁ జనియె భాతృ దార సహితుఁడై నన్ముని కూటమునకుఁ జిత్రకూటమునకును. ||36||


మ. ఘనుఁడా రాముఁడు చిత్రకూటమున వేడ్కంజేరి యున్నంతలో

నన దంతావళవాజిరత్నరథనానా యోధసంఘంబుతో
డ నమాత్యద్విజబంధువర్గముతోడం గూడి వాద్యంబులన్
జనుదెంచెన్ భరతుండు రాముకడకున్ సద్భక్తియేపారగన్ ||37||

సీ. చనుదెంచి రామునిచరణంబులకు మ్రొక్కి,
కై కేయి చేసి కపటమునకు
నగరంబు విడిచి యీ పగిది ఘోరారణ్య
మన కిట్లు రా నేల మునుల పగిది
నది గాక మనతండ్రి యత్యంత మైనట్టి
పుత్ర శోకంబునఁ బొక్కిపొక్కి
త్రిదశాలయమ్మున దేవేంద్రుఁ గనఁ బోయె,
నని చెప్ప విని రాముఁ డంతలోన
తే. భరతలక్ష్మణశత్రుఘ్న ధరణిసుతలఁ
గూడి దుఃఖించి దుఃఖించి కొంతవడికి
నాప్తవర్గంబుచే మానె నంతమీఁద
భరతుఁ డిట్లనె శ్రీరామభద్రుతోడ; ||38||
తే. రాజు లేకున్నచో మఱి రాష్ట్ర మందుఁ
గార్య మెట్లౌను మీ రెఱుంగనిది కలదె
నేఁటిసమయానఁ బట్టంబు నిలుపుకొనఁగఁ
దిరిగి విచ్చేయుఁ డనుడు నా భరతుతోడ. ||39||
వ. శ్రీ రామచంద్రుం డిట్లనియె ||40||
చ. జనకుఁడు సేసినట్టిమితిఁ జక్కఁగఁ దీర్చ కడంక నేను వ
చ్చిన గుఱిదాఁక, భూతలముఁ జేకొని రాజ్యముఁ జేయు మాట గా
దనకు మటన్న నొల్ల నన నాతనికిం దనపాదుకాయుగం
బొనరఁగ నిచ్చి పొమ్మనుచు నుర్వికిరాజుగఁ బంచె సొంపుగన్ ||41||

వ. ఇట్లు భరతుని భరతాగ్రజుం డనునయించి మరలించి నాక లోకకవాటం బగుచిత్రకూటంబు కదలి సౌమిత్రిభూపుత్రు లం గూడి పోవునెడ నటవీమధ్యంబున విరాధుం డను దైత్యాధముం డపరాధంబుచేసి దిగ్గిన డగ్గఱి జగతీతనూభవ నెత్తుకొని గగనమార్గంబున కెగిరిపోవునెడ వాఁడిబాణం బున వాలికంఠంబును ద్రుంచి గారుడాస్త్రంబున మరల నొయ్యన జనక నందనం డించి భయంబు వాపి ప్రియంబు సూపి యొయ్యె నొయ్యన నయ్యెడ నున్నయత్రి మహాముని యాశ్రమంబునకుం జని ఘనంబుగ నా ఘనుండు సేయు పూజలం గైకొని రామచంద్రుం డచ్చటిమునీంద్రులకు దైత్యులవలనిభయంబు లేకుండ నభయం బిచ్చి మన్ననం గొన్ని దినంబు లాయామునుల యాశ్రమంబుల నిలుచుచు వార లనుప శరభాదిమృగోత్కరశరణ్యం బగునరణ్యంబు జొచ్చిపోయెనని చెప్పిన విని నారదుని వాల్మీకిమునీంద్రుం డటుమీఁదికథావిధానం బెట్టిదని యడుగుటయు ||42||

క. జలజాక్ష ! భక్త వత్సల !
జలజాసనవినుత పాద జలజాత ! సుధా
జలరాశి భవ్య మందిర
జలజాకరచారు హంస. జానకి నాథా ! ||43||

గ. గద్యము ఇది శ్రీ గౌరీశ్వర వరప్రసాద లబ్ధగురుజంగమార్చన వినోద సూరిజనవినుతకవితాచమత్కారాతుకూరి కేసన సెట్టితనయ మొల్లనామధేయవిరచితం బైన శ్రీ రామాయన మహా కావ్యంబునం దయోధ్యాకాండము సర్వము నేకాశ్వాసము.