శాంతి మంత్రః

మార్చు
మంత్రము భావము

ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః
భద్రం పశ్యేమాక్షభి ర్యజత్రాః
స్థిరై రంగై స్తుష్టువాగ్ంస స్తనూభిః
వ్యశేమ దేవహితం యదాయుః
స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః
స్వస్తి న పూషా విశ్వవేదాః
స్వస్తి న స్తార్క్షో అరిష్టనేమిః
స్వస్తి న బృహస్పతిర్దధాతు

ఓ దేవతలారా, మా చెవులతో శుభమైనదానినే వినెదము గాక. పూజనీయులారా, మా నేత్రములతో శుభప్రథమగు దానినే దర్శించెదము గాక. మిమ్ములను స్తుతించుచు మా కొసగబడిన ఆయుష్కాలమును పూర్ణ ఆరోగ్యముతో, శక్తితో జీవించెదము గాక. సనాచన ఋషులచే స్తుతించబడిన ఇంద్రుడు మాకు శుభము నొనగూర్చు గాక. సర్వజ్ఞుడైన సూర్యుడు మాకు శుభమును కలుగజేయు గాక. ఆపదల నుండి కాపాడు వాయువు మాకు శుభమును అనుగ్రహించు గాక. మా లోని ఆధ్యాత్మిక ఐశ్వర్యమును రక్షించి కాపాడు బృహస్పతి మాకు శుభమును ప్రసాదించు గాక.
ఓం శాంతిః శాంతిః శాంతిః
ఓం శాంతిః శాంతిః శాంతిః

ప్రథమ ముండకము

మార్చు

ప్రథమ ఖండము

మార్చు
మంత్రము భావము

ఓం బ్రహ్మా దేవానాం ప్రథమః సంబభూవ
విశ్వస్య కర్తా భువనస్య గోప్తా
స బ్రహ్మవిద్యాం సర్వవిద్యా ప్రతిష్ఠా
మథర్వాయ జ్యేష్ఠపుత్రాయ ప్రాహ ||1||

సృష్టికర్త, జగత్ప్రభువగు బ్రహ్మదేవుడు దేవతలందరి కంటెను ముందుగ ఆవిర్భవించాడు. సకల విద్యలకు ఆధారము, ఆశ్రయముయైన బ్రహ్మవిద్యను బ్రహ్మ తన జ్యేష్ఠ కుమారుడగు అథర్వునకు తెలియజేసినాడు.

అథర్వణే యాం ప్రవదేత బ్రహ్మా
థర్వా తాం పురోవాచాంగిరే బ్రహ్మవిద్యామ్
స భారద్వాజాయ సత్యవాహాయ ప్రాహ
భారద్వాజోఽంగీరసే పరావరమ్ ||2||

ఏ విద్యను బ్రహ్మ దేవుడు అథర్వునకు తెలియజేసెనో అట్టి బ్రహ్మవిద్యను, అథర్వుడు పూర్వము అంగిరునికి తెలిపెను. అంగిరుడు భారద్వాజ గోత్రుడైన సత్యవాహునకు భోధించెను. ఈ పరావిద్యను సత్యవాహుడు అంగిరసునకు భోధించెను.

శౌనకో హవైమహాశాలేఽ ంగిరసం
విధివ దుపసన్నః పప్రచ్ఛ
కస్మిన్ను భగవో విజ్ఞాతే
సర్వమిదం విజ్ఞాతం భవతీతి ||3||

ఉత్తమ గృహస్తుడైన శైనకుడు యుక్తరీతిని అంగిరస మహర్షిని సమీపించి - హేభగవాన్, దేనిని తెలియుటచేత ఈ ప్రపంచ జ్ఞానమంతయు తెలియ బడుతుంది. - అని ప్రశ్నించెను.

తస్మై సహోవాచ - ద్వేవిద్యే వేదితవ్యే ఇతి హస్మయద్
బ్రహ్మవిదో వదన్తి, పరా చై వాపరా చ ||4||

శౌనకునికి అంగిరసుడు జవాబు చెప్పెను - పరావిద్యయని, అపరావిద్యయని తెలిసికొనదగినవి రెండు విద్యలు ఉన్నవని బ్రహ్మవోత్తలు చెప్పెదరు.

తత్రాపరా, ఋగ్వేదో యజుర్వేదః
సామవేదోఽ థర్వవేదః శిక్షా కల్పో
వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిష మితి
అథపరా, యమా తదక్షర మధిగమ్యతే ||5||

ఈ ఉభయవిద్యలలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము అనెడి నాలుగు వేదములు, శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషము అనెడి వేదాంగములు అపరావిద్యకు సంబంధించినవి. అక్షరపరబ్రహ్మను అందించు విద్యయే పరావిద్య.

యత్ తదద్రేశ్య మగ్రాహ్య మగోత్ర మవర్ణ
మచక్షుః శ్రోత్రం తదపాణి పాదమ్
నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం
యద్ భూతయోనిం పరిపశ్యంతి ధీరాః ||6||

ఏదయితే కనులకు గోచరించనిదై (imperceptible), మనస్సుచే గ్రహించుటకు వీలుకానిదై (ungraspable), పుట్టుకలేనిదై(without any lineage), రంగులేనిదై (attributeless), కన్నులు చెవులు లేనిదై, హస్తపాదములు లేనిదై, నిత్యమై, సర్వరూపధారియై, సర్వవ్యాపియై, సూక్ష్మతరమై, నశించనిదియైన అక్షరరూపమును జగత్తుకు మూలకారణముగ ధీరపురుషులు సర్వత్ర దర్శింతురు.

యథోర్ణనాభిః సృజతే గృహణతే చ
యథా పృథివ్యా మోషధయః సంభవంతి
యథా సతః పురుష,త్ కేశలోమాని
తథాక్షరాత్ సంభవతీహ విశ్వమ్ ||7||

సాలెపురుగు ఎలాగున సాలెగూడును తన నుండియే ప్రభవింపజోసి తనలోనే అంతర్లీనం చేసికొనునో, మహీతలము నుండి ఓషధులెలా ఆవిర్భవించునో, మానవుని తల మీద, శరీరము మీద కేశములు ఎలా ఉద్భవించపనో అలాగే అక్షర తత్వము నుండి ఆవిర్భవిస్తుంది.

తపసా చీయతే బ్రహ్మ తతోఽన్న మభిజాతే
అన్నాత్ ప్రాణో మనః సత్యం లోకాః కర్మసు చామృతమ్ ||8||

తపస్సులో యున్న బ్రహ్మము సృజనాత్మక స్పందనతో పెరుగినది. అతని నుండి అన్నం జనించింది. అన్నము నుండి ప్రాణము, మనస్సుట సత్యమైనవి, లోకములు, కర్మలు, కర్మఫలములు కలిగినవి.

యః సర్వజ్ఞ సర్వవిద్ యస్య జ్ఞానమయం తపః
తస్మా దేతద్ బ్రహ్మ నామ రూప మన్నం చ జాయతే ||9||

సర్వజ్ఞుడు, సర్వవిధుడు, జ్ఞానమే తపముగా గలవాడు అయిన బ్రహ్మ పదార్థము నుండి సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు, నామరూపములు, అన్నము ఉద్భవించినవి.
ఇతి ప్రథమ ముండకే ప్రథమ ఖంణ్డః
ఇది ప్రథమ ముండకములో ప్రథమ ఖండము.



ద్వితీయ ఖండము

మార్చు
మంత్రము భావము
తదేతత్ సత్యం మన్త్రేషు కర్మాణి కవయో

యాన్యపశ్యం స్తాని త్రేతాయాం బహుధా సన్తతాని
తాన్యాచరథ నియతం సత్యకామా
ఏషా వః పంథాః సుకృతస్య లోకే ||1||

శృతి మంత్రములలో ఏ కర్మలను ఋషులు దర్శించినారో అవి అన్నియు సత్యమైనవే. త్రేతాయుగములో ఇవి బాగా ఆచరించబడినవి. సత్యప్రియులై నిత్యమూ ఆ కర్మలను మీరూ ఆచరించండి. లోకములో పుణ్య ఫలములకు ఇదియే మార్గము.

యదా లేలాయతే హ్యర్చిః సమిద్దే హవ్యవాహనే
తదాజ్యభాగా వంతరే ణాహుతీః ప్రతిపాదయేత్ ||2||

హోమాగ్ని చక్కగా మండుతూ, జ్వాలలు కదులుతూ ఉన్నపుడు అగ్నికి రెండు భాగాలమధ్య ఆహుతులు సమర్పించబడవలెను.

యస్యాగ్నిహోత్ర మదర్శ మపౌర్ణమాస
మచాతుర్మాస్య మనాగ్రయణ మతిథివర్జితం చ
అహుత మవైశ్యదేవ మవిధినా హుత
మాసప్తమాం స్తస్యలోకాన్ హినస్తి ||3||

మానవుడాచరించు అగ్నిహోత్ర హోమము అమావాస్య నాడు ఆచరించ వలసిన కర్మ నాచరించకపోయినా, చాతుర్మాస్య వ్రతము నాచరించకపోయినా, నూర్పిడి సమయంలో అనుసరించ దగిన కర్మలు ఆచరించకపోయినా, అతిథులు పాల్గొనకపోయినా, వైశ్వదేవ ఆహుతులు లోపించినా, శాస్త్రవిరుద్ధముగా విధినిర్వహణ జరిగినా ఆ యజ్ఞము యజ్ఞకర్త యొక్క ఏడు లోకాలను ధ్వంసం చేస్తుంది.

కాలీ కరాలీ చ మనోజవా చ
సులోహితా యా చ సుధూమ్రవర్ణా
స్పులింగినీ విశ్వరుచీ చ దేవీ
లేలాయమానా ఇతి సప్తజిహ్వాః ||4||

కాలీ, కరాలీ, మనోజవా, సులోహితా, సుధూమ్రవర్ణా, స్పులింగినీ, విశ్వరుచీదేవీ అనునవి కదులుతున్న అగ్ని యొక్క ఏడు నాలుకలు.

ఏతేషు యశ్చరతే భ్రాజమానేషు
యథాకాలం చాహుతయో హ్యాదదాయన్
తం నయంత్యేతాః సూర్యస్య రశ్మయో
యత్ర దేవానాం పతిరేకోఽధివాసః ||5||

దేదీప్యమానములగు ఈ జ్వాలలో ఎవడు యథాకాలములో ఆహుతు లంద జేయునో, అతనిని ఆ ఆహుతులు సూర్యకిరణాలై దేవతలకు ప్రభువైన ఇంద్రుడు నివసించు స్థలమునకు తీసుకొని పోతాయి.

ఏహ్యేహీతి తమాహుతయః సువర్చసః
సూర్యస్య రశ్మిభి ర్యజమానం వహన్తి
ప్రియాం వాచ మభి వదంత్యోఽర్చయంత్య
ఏష వః పుణ్యః సుకృతో బ్రహ్మలోకః ||6||

మెరియుచున్న ఆహుతులు ప్రియ వచనములు పలుకుతూ, అర్చించుచూ, - మా పుణ్యఫల విశేషముచే లభించిన పవిత్ర బ్రహ్మలోకము ఇదే - అని తెలుపుచు - రండి రండి - అని ఆహ్వానించుచు యజమానిని సుర్యకిరణాల ద్వారా తాసుకొనిపోతాయి.

ప్లవాహ్యేతే అదృఢా యజ్ఞరూపా
అష్టాదశోక్త మపరం యేషుకర్మ
ఏ తచ్ఛ్రేయో యేఽభినందంతి మూఢా
జరామృత్యుం తే పునరేవాపి యంతి ||7||

అపరమైన కర్మ పదునెనిమిది అంగాలతో కూడిన యజ్ఞకర్మల పైన ఆధారపడి ఉండును. ఇవన్నియు వాస్తవానికి బలహీనమైన తెప్పల వంటివే.

అవిద్యాయా మంతరే వర్తమానాః
స్వయం ధీరాః పండితం మన్యమానాః
జంఘన్యమానాః పరియంతి మూఢా
అంధేనైవ నీయమానా యథాంధాః ||8||

అజ్ఞానములో చరిస్తూ, తామే ధీరపురుషులని, ప్రజ్ఞావంతులని ఆత్మస్తుతి ఒనర్చుకొను మందమతులు శోకగ్రస్తులై, అంధునిచే నడిపించబడు అంధునివలె దిక్కుతోచక పరిభ్రమిస్తుంటారు.

అవిద్యాయాం బహుధా వర్తమానా
వయం కృతార్థా ఇత్యభిమన్యంతి బాలాః
యత్కర్మిణో న ప్రవేదయంతి రాగాత్
తేనతురాః క్షీణలోకా శ్ఛ్యవంతు ||9||

అజ్ఞానముతో చరించు ఈ మూర్ఖులు తాము ఆప్తకాములైనట్లు పిల్లలవలె భావిస్తుంటారు. రాగరతులై ఉన్నందున సత్యమును గ్రహించలేరు. అందువలన పుణ్యకర్మఫలముగా లభించిన స్వర్గాది లోకములు అనుభవించిన పిదప మళ్ళీ క్రందికి జారుదురు.

ఇష్టాపూర్తం మన్యమానా వరిష్ఠం
నాన్యచ్ఛ్రేయో వేదయన్తే ప్రమూఢాః
నాకస్య పృష్ఠే తే సుకృతేఽనుభూత్వే
మం లోకం హీనతరం వా విశంతి ||10||

కర్మపరులైన ఈ మూర్ఖులు యజ్ఞవిధులు, పుణ్యకార్యములు మాత్రమే శ్రేష్ఠమైనవని భావిస్తూ, అన్యమైన మరే శ్రేయోమార్గమును తెలియలేరు. వీరు ఉన్నతమైన స్వర్గలోకములో పుణ్యఫలము అనుభవించి మఱల ఈ లోకములో గాని, ఇంతకన్నా హీనమైన లోకములో గాని ప్రవేశించుదురు.

తపః శ్రద్దే యే హ్యుపవనం త్యరణ్యే
శాంతా విద్వాంసో బైక్ష్యచర్యాం చరంతః
సుర్యద్వారేణ తే విరజాః ప్రయాంతి
యత్రామృతః స పురుషో హ్యవ్యయాత్మా ||11||

శాంతమనస్కులు, విద్వాంసులు, భిక్షాటన జీవనముతో అరరణ్యములో తపస్సు శ్రద్ధలతో జీవితమును సాగించు బుధజనులు, శుద్ధిపడిన వారై, సూర్య మార్గము ద్వారా అమృతము, అవ్యయమునైన పురుషుడు ఉండు స్థానమునకు చేరుతారు.

పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రహ్మణో
నిర్వేదమాయా న్నాస్త్యకృతః కృతేన
తద్విజ్ఞానార్థం స గురు మేవాభిగచ్ఛేత్
సమిత్పాణిః శ్రోత్రియం బ్రహ్మనిష్ఠం ||12||

కర్మల ద్వారా లభించే లోకాలను పరీక్షించిన పిదప నిత్యమైనది కర్మలద్వారా పొందబడేదికాదు అని గ్రహించి ముముక్షువు కర్మల పట్ల నైరాశ్యమును పొందాలి. పరతత్వమును గ్రహించుటకు సమిధలను చేతపట్టుకొని శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైన గురువును సమీపించవలెను.

తస్మై స విద్యా నుపసన్నాయ సమ్యక్
ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ
యే నాక్షరం పురుషం వేద సత్యం
ప్రోవాచ తాం తత్త్వతో బ్రహ్మవిద్యాం ||13||

ఇంద్రియ నిగ్రహము కలిగి, ఉపశమించిన మనస్సు కలిగి, శాస్త్రోక్త రీతిని ఆచార్యుని సమీపించిన శిష్యునికి, బ్రహ్మవిదుడైన గురువు సత్యస్వరూపము, అక్షర విద్యయూనైన బ్రహ్మజ్ఞానమును భోధించవలెను.
ఇతి ప్రథమ ముండకే ద్వితీయ ఖంణ్డః
ఇది ప్రథమ ముండకములో ద్వితీయ ఖండము.



ద్వితీయ ముండకము

మార్చు

ప్రథమ ఖండము

మార్చు
మంత్రము భావము

తదేతత్ సత్యం యథా సుదీప్తాత్ పావకాద్
విస్పులింగాః సహస్రశః ప్రభవంతే సరూపాః
తథాక్షాద్ వివిధాః సోమ్య భావాః
ప్రజాయన్తే తత్రచైవాపి యన్తి ||1||

ఓ సౌమ్యుడా, ఇదియే సత్యము, జ్వలించు అగ్నినుండి అలాంటివేయగు నిప్పురవ్వలు ఎలా జనిస్తాయో, అలాగే అక్షర బ్రహ్మమునుండి నానావిధములైన జీవులు ఉద్భవిస్తాయి. మరల అందులోనే లయించి పోతాయి.

దివ్యో హ్యమూర్తః పురుషః
స బాహ్యా భ్యంతరో హ్యజః
అప్రాణో హ్యమనాః శుభ్రో
హ్యక్షరాత్ పరతః పరః ||2||

స్వప్రకాశము, నిరాకారము, అజము, విశుద్ధము, సర్వవ్యాపకము అగు పురుషుడు వెలుపల, లోపల ఉన్నవాడై, మనోప్రాణములు లేనివాడై, అక్షర స్వరూపమునకు అతీతముగా ఉన్నాడు.

ఏతస్మా జ్ఞాయతే ప్రాణో మనః సర్వేంద్రియాణి చ
ఖం వాయు ర్జ్యోతి రాపః పృథివీ విశ్వస్యధారిణీ ||3||

దానినుండి ప్రాణము, మనస్సు, సర్వేంద్రియాలు, ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, సకలాధారమైన భూమి అన్నీ పుడతాయి.

అగ్నిర్మూర్దా చక్షుషీ చంద్రసూర్యౌ
దిశః శ్రోత్రే వాగ్ వివృతాశ్చ వేదాః
వాయుః ప్రాణో హృదయం విశ్వమస్య
పద్భ్యాం పృథివీ హ్యేష సర్వభూతాంతరాత్మా ||4||

దానికి దేవలోకమే శిరస్సు, సూర్యచంద్రులే నేత్రములు, దిక్కులే చెవులు, వేదములే తెరిచియున్న నోళ్ళు, గాలియే ప్రాణము, విశ్వమే హృదయము. దాని పాదముల నుండియే భూమి ఉద్భవించినది. ఇదియే సర్వభూతాంతరాత్మ.

తస్మాదగ్నిః సమిధో యస్య సూర్యః
సోమాత్ పర్జన్య ఓషధయః పృథివ్యాం
పుమాన్ రేతః సించతి యోషితాయాం
బహ్వీప్రజాః పురుషాత్ సంప్రసూతాః ||5||

దానినుండి సూర్యుడే సమిధగాగల మొదటి అగ్నియైన దేవలోకము, చంద్రుని నుండి వర్షమేఘములు, మేఘముల వర్షము వలన భూమిపైన ఓషధులు, వాని నుండి పురుషుడు, ఆ పురుషుడు స్త్రీయందు రేతఃపాతం చేస్తాడు. ఈ విధముగా దాని నుండి ఎన్నో జీవులు ఉద్భవిస్తాయి.

తస్మాదృచః సామ యజూంషి దీక్షా
యజ్ఞాశ్చ సర్వే క్రతవో దక్షిణాశ్చ
సంవత్సరశ్చ యజమానశ్ఛ లోకాః
సోమో యత్ర పవతే యత్రసూర్యాః ||6||

దానినుండి వేద ఋక్కలూ, సామగానాలు, యజ్ఞవిధులు, వ్రతదీక్షలు, క్రతువులు, కర్మలు, యజ్ఞదక్షిణలు, యజ్ఞసమయమూ, యజమాని, సూర్యచంద్రులు, పునీతం చేయు లోకాలు జనించాయి.

తస్మాచ్చ దేవా బహుధా సంప్రసూతాః
సాధ్యా మనుష్యాః పశవో వయాంసి
పానౌ వ్రీహియవౌ తపశ్చ
శ్రధ్ధా సత్యం బ్రహ్మచర్యం విధిశ్చ ||7||

దానినుండి వివిధ దేవతలు, సాధ్యులు, మానవులు, పశువులు, పక్షులు, ప్రాణా పాన వాయువులు, వరి - యవ ధాన్యములు, తపస్సు, శ్రద్ధ, సత్యము, బ్రహ్మచర్యము, విధులు అన్నీ జనించాయి.

సప్తప్రాణాః ప్రభవన్తి తస్మాత్
సప్తార్చిషః సమిధః సప్తహోమాః
సప్త ఇమే లోకా యేషు చరన్తి ప్రాణా
గుహాశయా నిహితాః సప్తసప్త ||8||

దానినుండి సప్త ప్రాణములు, సప్తజ్వాలలు, సప్తసమిధలు, సప్తాహుతులు, హృదయగుహలో ఉంటూ ప్రాణశక్తులు సంచరించు ఏడుఏడు లోకములు అన్నీ జనించినవి.

అతః సముద్రా గిరయశ్చ సర్వేఽ
స్మాత్ స్యందంతే సింధవః సర్వరూపాః
అతశ్చ సర్వా ఓషధయో రసశ్చ
యేనైష భూతైస్తష్టతే హ్యంతరాత్మ ||9||

అన్ని సముద్రాలు, పర్వతాలు కూడా దాని నుండే ఆవిర్భవించాయి. అన్ని నదులు దానినుండే ప్రవహిస్తాయి. పంచభూతముల చేత ఆవరింపబడినది సూక్ష్మశరీరము కాగా, ఏ ఓషధుల రసాదుల చేత పంచభూతములు పోషించబడుచున్నవో ఆ ఓషధులు కూడా దానినుండే సంభవించినవి.

పురుష ఏ వేదం విశ్వం కర్మ

తపో బ్రహ్మ పరామృతం
ఏతద్యో వేద నిహితం గుహాయాం
సోఽవిద్యాగ్రంథిం వికిరతీహ సోమ్య ||10||

కర్మ, తపస్సు, ఈ విశ్వము అంతయూ పురుషడే. ఇది అంతయు పరమము, అమృతమునైన బ్రహ్మమే. ఓ సౌమ్యుడా, అది హృదయగుహలో నిండి యున్నదని ఎవడు తెలిసికొనునో వాడు అజ్ఞాన గ్రంథిని ఛేదించును.

ఇతి ద్వితీయ ముణ్డకే ప్రథమ ఖణ్డః
ఇది ద్వితీయ ముండకములో ప్రథమ ఖండము.



ద్వితీయ ఖండము

మార్చు
మంత్రము భావము

ఆవిః సన్నిహితం గుహాచరం నామ
మహత్ పదమత్రైతత్ సమర్పితం
ఏజత్ ప్రామన్నిమిషచ్ఛ యదేత జ్ఞనథ సదస
ద్యరణ్యం పరం విజ్ఞానాత్ యద్వరిష్ఠం ప్రజానాం ||1||

ప్రకాశవంతమైనది, అతి చేరువలో ఉన్నది, హృదయ గుహలో చరించునది అయిన బ్రహ్మము సకలమునకు ఆధారమై యున్నది. కదిలేవీ, శ్వాసించేవీ, రెప్పలార్పేవీ - సమస్త ప్రపంచము బ్రహ్మములోనే ప్రతిష్ఠితమై ఉన్నవి. స్థూల సూక్ష్మములు తానైనదీ, ఆరాధ్యమైనది, సర్వోత్కృష్ణమైనది, విజ్ఞానమునకు కూడా అతీతమైన బ్రహ్మమును తెలుసుకో.

యదర్చిమత్ యదణుభ్యోఽణుచ
యస్మింల్లోకా నిహితా లోకినశ్చ
తదేతదక్షరం బ్రహ్మ స ప్రాణస్తదు వాఙ్మనః
తదేతత్ సత్యం తదమృతం తత్ వేద్ధవ్యం సోమ్యవిద్ధి ||2||

ప్రకాశవంతము, అణువు కంటెను సూక్ష్మము ఐన అక్షర పరబ్రహ్మతత్వము సకల లోకములకు, ఆ లోకవాసులకును నిలయము. అదియే ప్రాణము. వాక్కు, మనస్సు, సత్యము, అమరత్వమును, తెలియదగినది అదియే. ఓ సౌమ్యుడా, తెలుసుకో.

ధనుర్గృహీ త్వౌపనిషదం మహాస్త్రం
శరం హ్యుపాసా నిశితం సంధయీత
ఆయమ్య తద్భావగతేన చేతసా
లక్ష్యం తదేవాక్షరం సోమ్య విద్ధి ||3||

ఓ సౌమ్యుడా, ఉపనిషత్తులు అందించు మహాస్త్రాన్ని ధనుస్సుగా తీసుకొని, నిత్యోపాసనచే పదునెక్కిన బాణమును సంధించు. అక్షర పరబ్రహ్మమే లక్ష్య స్థానము అని తెలుసుకో.

ప్రణవోధనుః శరోహ్యత్మా బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే
అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్ తన్మయో భవేత్ ||4||

ఓంకారమే ధనుస్సు. ఆత్మయే బాణము. బ్రహ్మమే లక్ష్స్థానము. ఏమరుపాటు లేని చిత్తముతో ఆ లక్ష్యాన్ని ఛేదించాలి. శరము లక్ష్యాన్ని ఛేదించి ఆ స్వరూపముతో ఏకమగునట్లు బ్రహ్మతో ఐక్యమైపోవాలి.

యస్మిన్ ద్యౌఃపృథివీ చాంతరిక్షమోతం
మనఃసహ ప్రాణై శ్చ సర్వైః
తమేకం జానథ ఆత్మనమన్యా
వాచో నిముఞ్చ థామృత స్యైష సేతుః ||5||

భూమ్యాకాశములు, వాటి మధ్యనున్న అంతరిక్షము, మనస్సు, పంచప్రాణాలు దేనియందు అల్లుకొని ఉన్నవో అదియే ఆత్మ అని తెలుసుకో. అన్యమైన వ్యర్థప్రసంగాలు వదిలిపెట్టు. అమృతత్వమునకు అదియే వారధి.

అరా ఇవ రథనాభౌ సంహతా యత్రనాఢ్యః
స ఏషోఽన్తశ్చరతే బహుధా జాయమానః
ఓమిత్యేవం ధ్యాయథ ఆత్మానం
స్వస్థి వః పారయ తమసః పరస్తేత్ ||6||

రథచక్రము లోని ఆకులు అన్నియు ఇరుసును చేరియున్నట్లు, ఎక్కడయితే నాడులన్నియు కలసిపోతావో, ఆ హృదయములో ఆత్మ అనేక విధములై చరిస్తూ ఉంటుంది. ఆత్మనే - ఓం - కారముగా ధ్యానించండి. అంధకారమును అధిగమించి ఆవలిగట్టు చేరుట లో మీకు శుభములు కలుగు గాక.

యః సర్వజ్ఞ సర్వవిద్యస్యైష మహిమా భువి
దివ్యే బ్రహ్మపురే హ్యేష వ్యోమ్న్యాత్మా ప్రతిష్ఠితః
మనోమయః ప్రాణ శరీరనేతా
ప్రతిష్ఠితోఽన్నే హృదయం సన్నిధాయ
తద్విజ్ఞానేన పరిశ్యంతి ధీరాః
ఆనందరూప మమృతం యద్విభాతి ||7||

బ్రహ్మము సర్వజ్ఞుడు, సర్వవిదుడు. ఈ జగత్తులో గోచరించున దంతయు అతని వైభవమే. ప్రాణ శరీరాలకు నాయకుడై, మనోవస్త్రమును ధరించి, హృదయాకాశము లోని తేజోవంతమైన బ్రహ్మపురిలో అతడు స్థిరమై ఉన్నాడు. హృదయములో ప్రతిష్ఠితమై శరీరమంతటా నివసించును. బ్రహ్మముయొక్క పరిపూర్ణ జ్ఞానమును పొంది ధీర పురుషులు ఆనంద స్వరూపుమైన అమృతత్వమును దర్శించెదరు.

బిద్యతే హృదయ గ్రంధిః ఛిద్యంతే సర్వసంశయాః
క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే ||8||

హెచ్చుతగ్గులను వీక్షించగానే అజ్ఞానపు ముడి వీడిపోతుంది, అన్ని సందేహాలు కరగిపోతాయి, కర్మలన్నీ నశించి పోతాయి.

హిరణ్మయే పరేకోశే విరజం బ్రహ్మ నిష్కలం
తచ్చుభ్రం జ్యోతిషాం జ్యోతిః తద్య దాత్మవిదో విదుః ||9||

నిర్మలమైనది, నిష్కల్మషమైనది, పరిశుద్ధమైనది, జ్యోతులకు జ్యోతియైనది యగు బ్రహ్మము నిగూఢమైన హిరణ్మయకోశములో ఉన్నట్లు ఆత్మవిదులు తెలిసికొనిరి.

న తత్ర సూర్యోభాతి న చంద్ర తారకం
నేమావిద్యుతో భాంతి కుతోఽయమగ్నిః
తమేవ భాంత మనుభాతి సర్వం
తస్యభాసా సర్వమిదం విభాతి ||10||

అక్కడ సూర్యుడు ప్రకాశింపడు, చంద్ర తారకలు వెలుగు నీయవు. మెరుపులు కూడా కాంతినొందవు. ఇక అగ్ని మాట చెప్పనేల. అతని ప్రకాశము ననుసరించే సర్వము ప్రకాశించును. ఈ యావత్ప్రపంచము అతని వెలుగు చేతనే వెలుగు చున్నది.

బ్రహ్మవేద మమృతం పురస్తాద్ బ్రహ్మ
పశ్చాద్ బ్రహ్మ దక్షిణత శ్చోత్తరేణ
అధశ్చోర్ద్వం చ ప్రసృతం
బ్రహ్మవేదం విశ్వ మిదం వరిష్ఠం ||11||

ఇదంతయు అమృతమయమైన బ్రహ్మమే. ముందు, వెనుక, ఈప్రక్కనూ, క్రిందా పైననూ సర్వత్రా బ్రహ్మమే వ్యాపించి యన్నది. ఈ సకల జగత్తు యథార్థానికి సర్వోత్కృష్టమైన ఆ బ్రహ్మమే అయి ఉన్నది.
ఇతి ద్వితీయ ముణ్డకే ద్వితీయ ఖణ్డః
ఇది ద్వితీయ ముండకములోని ద్వితీయ ఖండము.



తృతీయ ముండకము

మార్చు

ప్రథమ ఖండము

మార్చు
మంత్రము భావము

ద్వా సుపర్ణా సయుజా సఖాయా
సమానం వృక్షం పరిషస్వజాతే
తయో రన్యః పిప్పలం స్వాద్వత్త్య
నశ్నన్నన్యో అభిచాకశీతి ||1||

స్నేఙితులై, సదా కలిసి యుండే రెండు పక్షులు ఒకే చెట్టుపై ఉన్నవి. వాటిలో ఒకటి చెట్టు పండ్లను ఆసక్తిగా తింటుండగా, మరియొకటి ఏమీ తినక వీక్షించుచున్నది.

సమానే వృక్షే పురుషో నిమగ్నోఽ
నీశాయా శోచతి ముహ్యమానః
జుష్టం యదా పశ్య త్యన్య మీశమస్య
మహిమాన మితి వీతశోకః ||2||

ఒకే వృక్షము నాశ్రయించి యున్న రెండు పక్షులలో ఒకటైన జీవాత్మ అజ్ఞానంలో, భ్రాంతిలో మునిగి తన అశక్తతకు శోకించుచున్నది. పూజార్హమును, ప్రభువును అగు మరొక దానిని, అనగా పరమాత్మను, దాని వైభవమును చూడగానే దాని దుఃఖమంతా చెదిరిపోవుతున్నది.

యదాపశ్యః పశ్యతే రుక్మవర్ణం
కర్తార మీశం పురుషం బ్రహ్మయోనిం
తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ
నిరందనః పరమం సామ్య ముపైతి ||3||

స్వప్రకాశమై, బ్రహ్మయోనియై, విశ్వకర్తయై, విశ్వభర్తయైన పరమాత్మను సాక్షాత్కరించుకొనిన ప్రజ్ఞావంతుడు పాపపుణ్యముల నధిగమించి, నిర్మలము, సర్వోత్తమమునైన సమస్థితిని అందుకొనును.

ప్రాణోహ్యేష యః సర్వభూతై ర్విభాతి
విజానన్ విద్వాన్ భవతే నాతివాదీ
ఆత్మక్రీడ ఆత్మరతిః క్రియావాన్
ఏష బ్రహ్మవిదాం వరిష్ఠః ||4||

ప్రాణులకు ప్రాణమై, సర్వజీవులలో ప్రకాశించుచున్న బ్రహ్మమును తెలుసుకొనినవాడు, వ్యర్థప్రసంగములు చేయక నిజమైన విద్వాంసుడు అవుతాడు. అతడు ఆత్మయందే క్రీడిస్తూ, రమిస్తూ, పుణ్యకర్మల నాచరిస్తూ బ్రహ్మ విదులలో అగ్రస్థానం వహిస్తాడు.

సత్యేన లభ్య స్తపసా హ్యేష ఆత్మ
సమ్యగ్ జ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం
అంతః శరీరే జ్యోతిర్మయో హి శుభ్రో
యం పశ్యంతి యతయః క్షీణదోషాః ||5||

సత్యము, తపస్సు, సమ్యక్ జ్ఞానము మరియు బ్రహ్మచర్యముల నిత్య సాధనల చేత ఆత్మ లభ్యపడును గాన, వాటిని చక్కగా అలవరచుకొనుము. దోషములు అంతరించగానే జ్యోతిర్మయము, పరిశుద్ధము నైన ఆత్మను సన్యాసులు దేహములోనే దర్శింతురు.

సత్యమేవ జయతే నానృతం
సత్యోన పంథా వితతో దేవయానః
యేనాక్రమన్తి ఋషయో హ్యాప్తకామా
యత్ర తత్ సత్యస్య పరమం నిధానం ||6||

సత్యమే జయిస్తుంది. అసత్యము కాదు. సత్యము చేతనే దేవయానము ఏర్పడియున్నది. ఆప్తకాములైన ఋషులు ఈ మార్గము ద్వారానే సత్యనిలయమైన పరంధామము చేరుతారు.

బృహచ్చ తత్ దివ్య మచింత్య రూపం
సూక్ష్మచ్చ తత్ సూక్ష్మతరం విభాతి
దూరాత్ సుదూరే తదిహాంతికేచ
పశ్య త్స్యిహైవ నిహితం గుహాయాం ||7||

పెద్దది, దివ్యమైనది, చింతించుటకు వీలుకానిది, సూక్ష్మాతి సూక్ష్మమునునై బ్రహ్మము ప్రకాశిస్తుంది. దూరాతి దూరమునై ఉన్నది. ఇది ఇక్కడే ఈ శరీరములోనే ఉన్న హృదయగుహలోనే ఉన్న దానిని ఋషులు సాక్షాత్కరించుకొందురు.

న చక్షుషా గృహ్యతే నాపివాచా
నాన్యైర్దేవై స్తపసా కర్మణావా
జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్త్వస్తతస్తు తం
పశ్యతే నిష్కలం ధ్యాయమానః ||8||

ఆత్మను కన్నులు చూడలేవు. మాటలు వర్ణించలేవు, ఇతరములైన ఇంద్రియములు గ్రహించలేవు. కర్మలు, తపస్సు దానిని వ్యక్తపరచలేవు. అవగాహన శుద్ధిపడి, ప్రశాంతత నొందినపుడు, ధ్యానస్థితిలో ముముక్షువు అద్వయమైన ఆత్మను దర్శించుతాడు.

ఏషోఽణు రాత్మా చేతసా వేదితవ్యో
యస్మిన్ ప్రాణః పంచధా సంవివేశ
ప్రాణైశ్చిత్తం సర్వమోతం ప్రజానాం
యస్మిన్ విశుద్ధే విభవత్యేషు ఆత్మా ||9||

ఐదు విధములుగ ప్రాణము వ్యాపించి యున్న ఈ దేహములోనే బుద్ధిప్రకాశం ద్వారా ఆత్మను తెలుసుకోవాలి. మానవుని బుద్ధి ఇంద్రియములతో అల్లుకుపోయి ఉన్నది. బుద్ధి నిర్మలము కాగానే ఆత్మ అందు ప్రకాశిస్తుంది.

యం యం లోకం మనసా సంవిభాతి
విశుద్ధ సత్త్వః కామయతే యాంశ్చ కామాన్
తం తం లోకం జయతే తాంశ్చ కామాం
స్తస్మా దాత్మజ్ఞం హ్యర్చయేత్ భూతి కామః ||10||

విశుద్ధ బుద్ధి కలవాడు ఏయే వస్తువులను వాంఛిమచినా, ఆయా వస్తువులను, లోకములను అతడు పొందుతాడు. కనక శ్రీమంతుడు కాగోరువాడు బ్రహ్మజ్ఞానిని ఆరాధించాలి.
ఇతి తృతీయ ముంణ్డకే ప్రథమ ఖణ్డః
ఇది తృతీయ ముండకములోని ప్రథమ ఖండము.



ద్వితీయ ఖండము

మార్చు
మంత్రము భావము

స వేదై తత్ పరమం బ్రహ్మధామ
యత్ర విశ్వం నిహితం భాతి శుభ్రం
ఉపాసతే పురుషం యే హ్యకామాస్తే
శుక్ర మే తదతి వర్తంతి ధీరాః ||1||

దివ్యమై ప్రకాశించునది, సమస్త విశ్వమునకు ఆధారమైనది యగు పరబ్రహ్మమును ఆత్మజ్ఞాని తెలుసుకొనును. కోరికలు లేనివారై అట్టి ఆత్మజ్ఞానిని ఆశ్రయించువారు పునర్జన్మను అధిగమిస్తారు.

కామాన్ యః కామయతే మన్యమానః
స కామాభి ర్జాయతే తత్ర తత్ర
పర్యాప్త కామస్య కృతాత్మనస్తు
ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామాః ||2||

విషయాలను సదా స్మరించుకొంటూ వాటి కొరకు అర్రులుచాచువారు తమ వాంఛలు తీరడానికి అక్కడక్కడ జన్మిస్తుంటారు. ఐతే ఆత్మానుభూతి పొందినవానికి సర్వ కోరికలు తీరనివి కాగా, ఈ జన్మయందే అన్ని కోరికలు నశించును.

నాయ మాత్మ ప్రవచనేన లభ్యో
సమేధయా న బహునా శ్రుతేన
యమే వైష వృణుతే తేన లభ్య
స్తస్వైష ఆత్మా వివృణతే తనుం స్వాం ||3||

ప్వచనముచేత గాని, గొప్పగా శాస్త్రాధ్యయనము చేయుట చేత గాని, మేధస్సు చేత గాని ఆత్మ పొందబడదు. ఎవరైతే హృత్పూర్వకముగా పొందుటకు ప్రయత్నించునో అట్టి వారికి ఆత్మ తన స్వరూపమును చెలియజేస్తుంది.

నాయమాత్మా బలహీనేన లభ్యో
న చ ప్రమాదాత్ తపసో వాప్యలింగాత్
ఏతై రుపాయ ర్యతతే యస్తు విద్వాం
స్త స్యైష ఆత్మా విశతే బ్రహ్మధామ ||4||

బలహీనులకు, అవిధేయులకు, తగని తపస్సులు చేయు వారికి ఆత్మ లభించదు. దృఢాభిప్రాయులై ఉచిత రీతిన ప్రయత్నంచే వారి ఆత్మ బ్రహ్మైక్యము పొందును.

సంప్రా ప్యైన మృషయో జ్ఞానతృప్తాః
కృతాత్మానో వీతరాగాః ప్రశాంతాః
తే సర్వగం సర్వతః ప్రాప్య ధీరాః
యుక్తాత్మానః సర్వమే వావిశంతి ||5||

ఆత్మలాభము పొందిన ఋషులు జ్ఞానముతో తృప్తి చెందిరి. కోరికలు తీరిన వారైరి. సంగరహితులై ప్రశాంత చిత్తులైరి. సర్వగతమైన ఆత్మను సాక్షాత్కరించుకొని, యుక్తాత్ములైన ఆ ఋషులు అన్నింటిలో ప్రవేశింతురు.

వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః
సన్యాస యోగాద్ యతయః శుద్ధసత్త్వాః
తే బ్రహ్మలోకేషు పరాంతకాలే
పరామృతాః పరిముచ్యంతి సర్వే ||6||

సన్యాస యోగము చేత పరిశుద్ధమైన అతఃకరణ గలవారగు పవిత్రాత్మలు ఉపనిషత్తులయందు తెలుపబడిన జ్ఞానమును క్షుణ్ణముగా తెలుసుకొను చున్నారు. వారందరును జన్మాంతమందు బ్రహ్మలోక ప్రాప్తిని పొంది విముక్తు లగుచున్నారు.

గతాః కలాః పంచదశ ప్రతిష్ఠా
దేవాశ్చ సర్వే ప్రతిదేవతాసు
కర్మాణి విజ్ఞానమయశ్చ ఆత్మా
పరేఽవ్యయే సర్వ ఏకీ భవంతు ||7||

వారి పదిహేను అంశాలు వాటి కారణాలలో చేరిపోతాయి. ఇంద్రియాలు వాటి అధిదేవతలలో కలిసిపోతాయి. వారి కర్మలు, వ్యక్తిత్వము పరమ మైన అక్షరతత్వంలో లీనమవుతాయి.

యథా నద్యః స్యందమానాః సముద్రేఽస్తం
గచ్ఛంతి నామరూపే విహాయ
తథా విద్వాన్ నామరూపా ద్విముక్తః
పరాత్పరం పురుష ముపైతి దివ్యం ||8||

ప్రవహించు నదులు నామరూపాలు వదిలి ఎలా సాగరములో ఐక్యమగునో అలాగుననే ఆత్మజ్ఞాని నామరూపాలనుండి విడిపడి సర్వోత్కృష్టము, ప్రకాశవంతము నైన పరబ్రహ్మలో లీనమగును.

స యో హవైతత్ పరమం బ్రహ్మవేద
బ్రహ్మైవభవతి నాస్యాబ్రహ్మవిత్ కులే భవతి
తరతి శోకం తరతి పాప్మానం
గుహా గ్రంథిభ్యో విముక్తోఽమృతో భవతి ||9||

బ్రహ్మమును తెలిసినవాడు బ్రహ్మమే కాగలడు. బ్రహ్మవిదుడు కాని వాడు అతని వంశములో జన్మిచడు. హృదయ గ్రంథులు వీడిపోగా శోకమునకు, పాపమునకు దూరుడై అతడు అమరుడౌతాడు.

తదేత దృచాభ్యుక్తం -
క్రయావంతః శ్రోత్రియా బ్రహ్మనిష్టాః
స్వయం జుహ్వతి ఏకర్షిం శ్రద్ధయంతః
తేషా మేవైతాం బ్రహ్మవిద్యాం వదేత
శిరోవ్రతం విధివద్ యైస్తు చీర్ణం ||10||

ఇదియే వేదముచేత ప్రవచించబడినది. సక్రమ కర్మాచరణగల వారికి, వేద పారంగతులకు, బ్రహ్మనిష్టగల వారికిట ఏకర్షి అగ్నిహోమ మాచరించువారికి, శాస్త్రోక్తరీతిని శిరోవ్రతాన్ని అనుసరించువారికి మాత్రమే ఈ బ్రహ్మవిద్య నుపదేశించాలి.
తదేతత్ సత్య మృషి రంగిరాః

పరోవాచ నై తదచీర్ణ వ్రతోఽధీతే
నమః పరమ ఋషిభ్యో
నమః పరమ ఋషిభ్యోః

ఇదియే సత్యము. ఈసత్యమును ప్రాచీన కాలములో అంగిరస మహర్షి తన శిష్యులకు తెలియజేసెను. ఏ వ్రతమును ఆచరించనివాడు దీనిని అధ్యయనము చేయరాదు. పరమ ఋషులారా మీకు నమస్కృతులు. మహా ఋషులారా మీకు నమస్సులు.
ఇతి తృతీయ ముణ్డకే ద్వితీయ ఖణ్డః
ఇది తృతీయ ముండకములో ద్వితీయ ఖండము.
ఇతి ముణ్డకోపనిషద్ సమాప్తాః
ముండకోపనిషత్తు సమాప్తము.


జై గురుదేవ్
ఓం శాంతిః శాంతిః శాంతిః
సర్వేజనాః సుఖినో భవంతు