మీఁగడతరకలు/సూరకవి—క్షత్రియుఁడు

సూరకవి - క్షత్రియుఁడు


హస్తమున నొక్క తాటాకుపు స్తకంబు
దాల్చి చనుచుండె నొక కవితల్లజుండు;
వానిఁ బొడఁగని " యీ వేళ వర్జ్య మెప్పు ?"
డనుచు క్షత్రియుఁ డొక్కరుఁ డడిగె నతని.

అనుడు, వెఱఁ గంది కవివర్యుఁ డనియె నిట్లు:
"కవివరుల గుండె లల్లాడ కవిత చెప్ప
పేరు గాంచిన అడిదము సూరకవిని,
తిథులు చెప్పఁగ నేను వైదికుఁడఁ గాను. "

"భార మైనట్టి యొక పెద్ద భారతంబు
వంటి గ్రంథము చేఁ దాల్చి, వర్జ్య మెపుడో
చెప్పలే నని నుడువుట సిగ్గు గాదె ? "
అనుచు క్షత్రియుఁ డతని హాస్యంబు చేసె.



ఒక దినంబున క్షత్రియుఁ డుదయవేళ
ఖడ్గ మొక్కటి కరమున కరము మెఱయ,
వడి హుటాహుటినడలతో నడచుచుండ,
సూరకవి చూచి యాతనిఁ జేర నరిగి,

" ఓయి నా కీవు క్షురకర్మ చేయ గలవె  ? "
అనుచు ప్రశ్నింప, క్షత్రియుఁ డలుక గదుర
"కనులు గానవ? నీ కింత కావరంబె !
మూఢుడా ! నేను మంగలివాఁడ నటర?”

అంచు గద్దింప, చాలు శాంతించు మయ్య!
ఇంత పొడనైన కత్తి నీ చెంత నుండ
ఔర ! క్షురకర్మ నైన చేయంగ లేవె ?
అనుచు నెంచితి " నని కవి యపహసించె.