మీఁగడతరకలు/చంద్రోదయము

చంద్రోదయము


అంబరం బను కమలాకరంబునందు
కైరవంబుల కైవడి తార లలర ,
అందు విహరించు కొదమరాయంచ యనఁగ
నిండుచంద్రుఁడు కన్నులపండు పయ్యె.

పొంచి తెరవెన్క దాఁగి దోబూచులాడు
ముద్దు గులికెడు పసిపాప మొగము వోలె,
కారుమబ్బుల సందునఁ గాన నగుచు
ఇందుబింబము లోచనానంద మయ్యె.

అంబరం బను నీలిపళ్లెంబునందు
అక్షతలు పూలె నక్షత్రకాళి మెఱయ,
తేజరిల్లెడు కపురంపుదీప మనఁగ
నిండుచంద్రుఁడు కన్నులపండు వయ్యె.


పానవట్టము తూరుపుపర్వతంబు,
దీపికారాజి తారలు, ధూప మిరులు
గా వెలుంగఁగ, స్ఫటికలింగంబొ యనఁగ
నిండుచంద్రుఁడు కన్నులపండు వయ్యె.

చిమ్మచీకటికుప్పల చెత్తమీద
బగ్గుబగున మండిడి యగ్గి వోలె
ఉదయరాగంపుకాంతుల సుజ్వలించి
ఇందుబింబము లోచనానంద మయ్యె

వెన్నెల యనంగ రాత్రి నా నెలయు తనదు
పత్నులిరువుర మేచ్చులఁ బడయఁ గోరి
తెలుపు నలుపులు గలమేన నలరే ననఁగ
నిండు చంద్రుఁడు కన్నులపండు వయ్యె.

మెల్ల మెల్లన చిఱుచేప లెల్ల మ్రింగి
పెద్దచేప క్రమంబుగ పెరిగినట్లు,
విన్నుకడలిని చుక్కలు సన్నగిల్ల
అంతకంతకు చందురుఁ డగ్గలించె.



తార లను ముత్తియంబుల నేరి తీయ
సమయనావికుఁ డాకాశజలధియందు
వెడలి చనుచున్న చక్కని పడవ యనఁగ
విదియచందురుఁ డందమై వెలయుచుండె.

నలువ మరునకు నభ మను పలకమీఁద
సుద్ద చేఁ బట్టి వ్రాసిన సున్న లనఁగ
తారకారాజి యొప్ప, 'అ' కార మనఁగ
అర్ధ చంద్రుఁడు మిసిమిమై నలరుచుండె.

నీలిగోళంబు రేకపైఁ దేలియాడ
కొదమజాబిల్లి రాజిల్లె చదలయందు,
పాలకడలిని తరిగొండ లీలఁ దాల్చు
ఆదికచ్ఛపమూర్తితో నవఘళించి.