మార్కండేయపురాణము/సప్తమాశ్వాసము

శ్రీరస్తు

మార్కండేయపురాణము

సప్తమాశ్వాసము


విభ్రాజితవైశ్రవ
ణావాసస్పర్ధినిజగృహామితవిభవా!
భావస్ఫురితభవానీ
శ్రీవనితాధీశ! గన్నసేనాధీశా!

1


వ.

పరమజ్ఞానచక్షు లైనపక్షు లాజైమిని కిట్లనియె మఱియు మార్కండేయుండు
గోష్టుకితోడ.

2

దక్షసావర్ణిమన్వాదివర్ణనము

ఆ.

మునివరేణ్య! దక్షతనయుండు సావర్ణి, యనునతండు నవమమనువు గాఁగ
నతని కాలమునను నమరులు నింద్రుండు, మునులు నృపులు నెవ్వ రనిన వినుము.

3


వ.

పౌరులు మరీచిగర్భులు సుధర్ములు నన నొక్కొక్కగణంబు పన్నిద్దఱేసిగా దేవ
తలు మూఁడుగణంబులై వర్తిల్లుదురు కార్తికేయుం డగుషడాననుఁ డింద్ర
చిహ్నంబులతో నద్భుతుం డనునామంబున దేవేంద్రుండగు మేధాతిథి వసువు
సత్యుఁడు జ్యోతిష్మంతుఁడు ద్యుతిమంతుఁడు సవనుఁడు హవ్యవాహనుండు నను
వారు సప్తమును లగుదురు ధృతకేతుండును ధృష్టకేతుండు పంచహస్తుండు నిరా
మయుండు పృథుశ్రవుం డర్చిష్మంతుండు భూరిద్యుమ్నుండు బృహద్భయుండు
ననుమనుపుత్రులు రాజులై వర్తిల్లుదు రని చెప్పి మఱియును.

4


సీ.

పదియవమను వైనబ్రహ్మసావర్ణినాఁ డమరులు వినుము సుఖాసనులు ని
రుద్ధు లనంగ నూర్వురు నూర్వు రొక్కొక్కగణము నై వర్తింపఁగలరు శాంతి
యను నాతఁ డింద్రుండు మును లేడ్వురును హవిష్మంతుఁ డాపోమూర్తి సత్యుఁ డొగి న
యప్రతిముఁడు వసిష్టాఖ్యుఁడు సుకృతి నాభాగుఁడు మఱి మనుప్రభవు లైన


తే.

మనుజపతులు భూరిద్యుమ్నుఁడును జయద్ర, థుండు వృషభుండు నుత్తమౌజుండును నన

మిత్రుఁడును సుపార్శ్వుండు సుక్షేత్రుఁ డనఘ, నులు శతానీకభూరిసైన్యులును ననఘ!

5


వ.

ఏకాదశమను వైనధర్మసావర్ణికాలంబున దేవతలు విహంగములు కామగులు నిర్మా
ణరతులు రన నొక్కొక్కగణంబు ముప్పండ్రు గా మూఁడుగణంబు లై వర్తిం
తురు వృషాఖ్యుం డింద్రుం డగు హవిష్మంతుండు వరిష్ఠుండు ఋష్టి యారుణి నిస్వ
రుఁడు ననఘుఁడు వృష్టియు సప్తమును లగుదురు సర్వత్రగుఁడు సుశర్మ దేవా
నీకుఁడు పురూద్వహుఁడు హేమధన్వుఁడు దృఢాయువు విరాధుండు ననునమ్మను
పుత్త్రులు ధాత్రీపతు లగుదు రని చెప్పి మార్కండేయుండు ద్వాదశం బైన
రుద్రసావర్ణిమన్వంతరంబున బృందారకులు సుకర్తులును మననులు హరితులు
రోహితులు సుదారులు నన నొక్కొక్ గణంబు పదుండ్రుగా నేనుగణంబు లైరి
ఋతధాముం డనువాఁ డింద్రుం డయ్యె ద్యుతియుఁ దపస్వియు సుతపుఁడును
దపోమూర్తియుఁ దపోధనుఁడును దపోనిధియుఁ దపోధృతియు ననువారు సప్త
మును లైరి వేదవంతుండు నుపదేవుండు దేవశ్రేష్ఠుండు విదూరథుండు మిత్ర
వంతుండు మిత్రదూరుండు ననుమనుపుత్త్రులు మహీపతు లై వర్తింపంగల రని
మఱియు.

6

రౌచ్యమనుజన్మప్రకారము

సీ.

ప్రకటత్రయోదశరౌచ్యమన్వంతరంబున నిలింపులు సుధర్ములు సుకర్ము
లును సుశర్ములు నన ననఘ! మూఁడుగణంబు లగుదురు దేవేంద్రుఁ డగు బృహస్ప
తి యనంగ నవ్యయధృతిమన్నిరుత్సుకనిర్మోహసుతపులు నిష్ప్రకంప
తత్త్వదర్శనులు సప్తమును లక్కాలంబు భూపాలనము సేయుపుణ్యనృపులు


తే.

చిత్రసేనుఁడు దృఢుఁడు విచిత్రనిర్భ, యనయభృత్సునేత్రసురథు లాదిగాఁగ
మనుతనూజులు వీరలు మునివరేణ్య!, యని మృకండనందనుఁ డిట్టు లనియె మఱియు.

7


వ.

ఆరౌచ్యునిజన్మప్రకారం బాకర్ణింపుము.

8


క.

జితమమతాహంకారుఁడు, సతతశమాఢ్యుండు రుచిప్రజానాథుఁ డహ
రృతి గ్రుంకినచోట సుఖ, స్థితి శయనించుచును దొల్లి క్షితిఁ జరియించెన్.

9


వ.

అనగ్ని యనికేతనుండు నసంగుఁడు నై యిట్లు చరియించునతనిం గని తత్పితృ
వరు లి ట్లనిరి.

10

పితృరుచిసంవాదము

చ.

తనరుచు నాకలోకసుఖదం బగుదారపరిగ్రహంబు సే
యనికత మేమి? బంధమున కాస్పదమా? యది యంద సంతతం
బును మునిదేవపిత్రతిథిపూజ లొనర్చుచుఁ బుణ్యలోకము
ల్గను గృహమేధి సర్వసుఖకారిణి వత్స! గృహస్థవృత్తి దాన్.

11

క.

దారపరిగ్రహ మొల్లక, యారయ సత్సుతులఁ బడయ కర్చనముల బృం
దారకపితృతతిఁ దనుపక, కోరుదు నీ వెట్లు సుగతి గుణరత్ననిధీ!

12


వ.

అనినఁ బితరులకు రుచి యి ట్లనియె.

13


క.

అతిదుఃఖము నఘము నధో, గతియుఁ బరిగ్రహమువలనఁ గరము కలిమి మ
న్మతిఁ గని మును దారస్వీ, కృతి యే నొనరింప నైతిఁ గృతమతులారా!

14


ఆ.

అఖిలకరణనిగ్రహమునఁ జేయఁగఁబడు, నాత్మసంయమము మహాత్ములార!
యతులముక్తిహేతు వాసంయమము పరి, గ్రహమువలన ముక్తి గానరాదు.

15


ఆ.

వినుఁ డనేకజన్మజనిత మై బహుకర్మ, పుంజకర్ధమమున బ్రుంగు నట్టి
యాత్మ నిర్జితేంద్రియాదులచేఁ గడు, గంగఁబడు మహాత్మసంగవారి.

16


వ.

అనినం బితృదేవతలు నియతేంద్రియు లగువారలకు నాత్మప్రక్షాళనంబు యుక్తం
బగు నైనను నీవు ప్రవర్తించునిమ్మార్గంబు గర్మలోపంబు నాపాదించు ఋణంబు
లేనుంద్రోచినం గాని యశుభంబు ద్రోపువడదు సక్తుండు గాక విహితకర్మంబు
లాచరించిన బంధంబు రాదు ప్రాజ్ఞులు పూర్వకర్మకృతం బైనసుఖదుఃఖజాతంబు
భోగంబున నాళంబు నొందించి యాత్మప్రక్షాళనంబు నేమఱ రనినఁ బితరులం
జూచి కరమార్గం బవిద్య యని వేదంబుల వినంబడు మీ రె ట్లందు నన్ను
నియోగించెద రనిన వార లది నిజంబు కర్మం బవిద్య యనం దగు నైనను విద్యా
ప్రాప్తికిం గర్మంబు కారణంబు గావున నీవు విధ్యుక్తప్రకారంబున దారపరి
గ్రహంబు సేయుము జన్మంబు విఫలంబు గావింపకుము లౌకికం బనుష్టింపు మనిన
నతం డిట్లనియె.

17


ఆ.

ఏను జాల వృద్ధు నెవ్వఁడు నా కిప్డు, గన్య నిచ్చు? నెట్లు గలుగుఁ బెండ్లి?
కరము పేద యైననరునకు నెందు భా, ర్యాపరిగ్రహంబు భరము గాదె?

18


క.

అనినఁ బితృదేవతలు మాకును నీకును నరకగతి యగుం జుమ్మీ నీ
మనమున మావచనంబులు, గొనియాడక విడిచితేనిఁ గులజలధిశశీ!

19


క.

అని చెప్పి యతఁడు చూడఁగ, మునిసత్తమ! వా రదృశ్యమూర్తు లయిరి పె
ల్చనఁ గరువలిచే నాఱిన, ఘనదీపంబులును బోలె గ్రక్కున నంతన్.

20


ఉ.

ఆరుచి పైతృకోక్తి హృదయంబున కార్తియొనర్ప నెల్లెడ
న్ధారుణిఁ గన్యక న్వెదకి తా నొకచోటను గాన లేక లో
నారట మగ్గలింప వెగడందుచు నిం కెటఁ బోదు నేను? నా
కోరిక దైవ మెట్లు సమకూరఁగఁ జేసెడు? నేమి సేయుదున్?

21


ఉ.

అక్కట మత్పితృప్రభృతి కభ్యుదయంబుగ దారసంగ్రహం
బెక్కడ గల్గు నాకుఁ దగ నిప్పుడ? యంచు విషాదవేదనం
బొక్కుచు నారుచి ప్రభుఁడు బుద్ధిఁ దలంచెఁ దపంబు సేసి యే
నక్కమలాసనుం గొలుతు నాదటతో నని నిశ్చితాత్ముఁ డై.

22

క.

అతినియమవ్రతనిష్ఠా, న్వితుఁ డై దారుణతపంబు విడువక చేసె
న్ధృతియుతుఁడు రుచి ప్రభుఁ డా, శతధృతి మతి నిలిపి దివ్యశతవర్షంబుల్.

23

తపఃప్రసన్నుఁ డైనబ్రహ్మవలన రుచి యిష్టార్థములఁ బడయుట

వ.

అంత లోకపితామహుండైన బ్రహ్మదేవుండు ప్రత్యక్షం బై భవదీప్సితం బెయ్యది
యెఱిఁగింపు మనిన నతండు ప్రణమిల్లి పితృవచనంబునఁ దనచేయం దలంచిన
కార్యంబు విన్నవించిన విని విరించి రుచి నాలోకించి నీవు ప్రజాపతిత్వంబు నంగీ
కరించి సకలప్రజలం బుత్రుల నుత్పాదింపుము నిఖిలకర్మకలాపంబు నిర్వర్తించి
కృతాధికారత్వంబు భజించి తుదిం బరమసిద్ధిం బొందుము పితృవాక్యంబు తప్పక
దారపరిగ్రహం బొనరింపుము నీకుం గన్యాలాభంబును బితృప్రసాదంబున సిద్ధించు
నత్యంతనియతిం బితృపూజనంబు గావించి పితరులం బ్రార్థింపు మనిన నమ్మహాత్ముం
డట్ల కాక యని యొక్కమహానదియందు వివిక్తం బగుపులినతలంబున వసియించి
పితృదేవతలకు మ్రొక్కి తర్పణంబు చేసి వివిధస్తవనంబులఁ బితృదేవతల నిట్లు
స్తుతింపం దొడంగె.

24

రుచి దేవతల స్తుతించుట

క.

దేవతలును మునులును నా, నావిధపూజనము లొగి నొనర్పఁగ శ్రాద్ధ
శ్రీవిభవాన్వితు లగుపితృ, దేవతలకు మ్రొక్కెదం బ్రదీపితభక్తిన్.

25


చ.

అరుదుగ భుక్తిముక్తులకు నఱ్ఱులు సాఁచుచు సిద్ధసాధ్యకిం
పురుషవియచ్చరు ల్నరులు భూసురభూవరవైశ్యశూద్రు లా
దరమున శ్రాద్ధకాలమునఁ దప్పక పూజలు ప్రీతితోడ నె
వ్వరికి నొనర్తు రట్టిపితృవర్యుల కే నతిభక్తి మ్రొక్కెదన్.

26


ఆ.

తిలల గంధపుష్పముల ధూపదీపోప, హారముల నిరంతరాతిభక్తి
భుజగదనుజవరులు పూజింప నొప్పారు, పితృగణంబులకు వినతి యొనర్తు.

27


క.

అమరత్వమును నింద్ర, త్వమునుం బ్రహ్మత్వమును ముదంబును బహుకా
మములు దయ నొసఁగుపితృవ, ర్గమునకు వందన మొనర్తుఁ బ్రకటితభక్తిన్.

28


సీ.

వెలుఁగుహుతాగ్నిలో వేల్చుహవిస్సుల నెవ్వరి కగుఁ దృప్తి యెవ్వ రెపుడు
విప్రదేహస్థు లై వేడ్క భుజింతు రెవ్వరు పిండవిధిఁ బ్రీతిభరితు లగుదు
రెలమి నెవ్వరు కృష్ణతిలలను ఖడ్గమాంసములను బరమహర్షము వహింతు
రెవ్వరు తగుకాల మెడపక యిడుకాల శాకసంసేవ నుత్సవము దాల్తు


తే.

రెవ్వ రర్థి వహింతు రహీనధవళ, తరవిమానములందు సంతతవిభూతి
నట్టి పితృవరు లన్నతోయములఁ దృప్తి, కలితు లగుచుఁ బ్రసన్నతఁ గాంత్రు నాకు.

29


తే.

భూసురుల కిందువర్ణులు భూపతులకు, జలజమిత్రవర్ణులు వణిజులకుఁ గనక
వర్ణు లొగి శూద్రులకు నీలవర్ణు లగుచు, వెలుఁగుపితరుల కొనరింతు వినతి భక్తి.

30

వ.

ఈశ్రాద్ధంబున నాచేత సంతర్పితు లైనపితృవరులం దగ్నిష్వాత్తాదులు తూర్పున
బర్హిషదులు దక్షిణంబున నాజ్యపులు పశ్చిమంబున సోమపు లుత్తరంబునఁ బితృ
పతి యగుయముండు సర్వదిక్కుల నున్న భూతపిశాచభయంబులు వొందకుండ
నెప్పుడు రక్షించునది యని మఱియు ననేకప్రకారంబులం బ్రస్తుతించిన రుచికిం
బ్రసన్నులై పితృదేవతలు వరం బిచ్చెదము వేఁడు మనిన నతండు లజ్జావనతా
ననుం డగుచు ని ట్లనియె.

31


క.

పితృదేవతలార! ప్రజాపతి నన్నుఁ బ్రజాపతిత్వపదవికి విభ్రా
జితుఁడ వగు మనినఁ గోరెద, సుతునిం గనుదాని దివ్యసుందరిఁ బత్నిన్.

32

పితృదేవతలు రుచికి వర మిచ్చుట

ఆ.

అనిన నపుడు నీకు నతిమనోహర యగు, భార్య గలుగు నందుఁ బడయు దీవు
సుతుని రుచిమునీంద్ర! యతఁడు మన్వంతర, ప్రభుత నొంది పరగు రౌచ్యుఁ డనఁగ.

33


క.

అతని కుదయింతు రవవీ, పతు లగుసుతు లతులబలులు పలువు రొగిఁ బ్రజా
ప్రతతులు నిర్మించు ప్రజా, పతి వై తుది నీవు సిద్ధిఁ బ్రాపింపు రుచీ!

34


వ.

అని యతనికి వరం బిచ్చి పితరులు మఱియు ని ట్లనిరి.

35


చ.

అతులితభక్తి నీవు ప్రియ మారఁగ మాకు నొనర్చినట్టి యీ
స్తుతి మముఁ బ్రస్తుతించు మనుజుండు కృతార్థుఁడు వాని కెం దరో
గతయును పుత్త్రపౌత్త్రఘనకాంచనసంపదయు న్బ్రబోధము
న్సతతము నిత్తు మెంతయుఁ బ్రసన్నమనస్కుల మై మునీశ్వరా!

36


ఆ.

శ్రాద్ధమున భుజించు సద్ద్విజవర్యుల, యెదుర నుండి యెవ్వఁ డీస్తవంబు
పరమభక్తితోడఁ బఠియించు నాశ్రాద్ధ, మక్షయంబు మాకు నమితపుణ్య!

37


తే.

వేదహీనదత్తం బైన విధివిహీన, మైనఁ గాలంబు మఱి హీనమైన శ్రద్ధ
ముపహతం బైనఁ గుద్రవ్యయుక్త మైన, సద్గుణం బగు నీస్తోత్రజపము పేర్మి.

38


వ.

ఏతత్స్తోత్రపఠనంబునం జేసి మాకు హేమంతంబునం బండ్రెండేండ్లును శిశిరం
బున నిరువదినాలుగుసంవత్సరంబులును వసంతగ్రీష్మంబులఁ బదాఱేసిహాయనంబు
లును వర్షాగమంబున ననంతకాలంబును శరత్సమయంబునఁ బంచదశాబ్దంబులును
దృష్తియగుం గావున శ్రాద్ధంబున భుజించువిప్రులకు నీస్తవంబు నీ వెప్పుడు
వినిపించునది యని చెప్పి పితృదేవత లంతర్హితు లై రంత నమ్మహానదిమధ్యంబున
నుండి వెడలి ప్రమోచన యనునప్సరోంగన రుచిసవిూపంబునకుం జని వినయా
వనత యగుచు మధురవాక్యంబుల ని ట్లనియె.

39

రుచి మాలిని యనుకన్యకం బెండ్లాడుట

తే.

మునిజనాధిప! విను ప్రమోచన యనంగఁ, బరఁగునప్సరోంగన నేను వరుణపుత్రుఁ
డైనపుష్కరునకుఁ బుట్టినట్టినాకుఁ, దనయఁ గన్యకారత్నంబు వనజముఖిని.

40


క.

ఆర్యోత్తమ! నీ కిచ్చెద, భార్యంగా స్వీకరింపు బాహుబలశ్రీ

ధుర్యుఁడు మను వగుతనయుఁడు, సూర్యనిభుఁడు పుట్టు నీకు సురుచిరయశుఁ డై.

41


చ.

అనవుఁడు నట్ల కాక యని యారుచి పల్కినఁ బ్రీతి నప్సరోం
గన దనుఁ బిల్చిన న్జలము గ్రక్కున వెల్వడి వచ్చి యున్నమా
లిని యనుకన్యకం బ్రమదలీలఁ గరగ్రహణం బొనర్చె నా
ముని విధిపూర్వకంబుగ సముత్సుకుఁ డై వెస నానదీతటిన్.

42

రుచికి మాలినియందు రౌచ్యమనువు పుట్టుట

క.

రుచ్యాఖ్యానుగుణంబుగ, రౌచ్యుం డన మహితనామరమ్యత మెఱయ
న్రుచ్యాత్ముం డగుసుతుఁడు గు. ణాచ్యుతుఁ డుదయించి పరగె నవని న్మనువై.

43

భౌత్యమనుజన్మప్రకారము

వ.

ఇది రౌచ్యమనుజన్మప్రకారం బని చెప్పి మార్కండేయుండు క్రోష్టుకి కింకఁ జతు
ర్దశమను వైనభౌత్యునియుత్ఫత్తివిధంబు వివరించెద విను మంగిరశ్శిష్యుం డుగ్ర
కోపనుండు భూతి యనునొక్కమహాముని గలం డతనిమాహాత్మ్యం బాకర్ణింపుము.

44


సీ.

పవనుఁడు భయపడుఁ బటుగతిఁ జరియింప సూర్యుండు వేఁడిమిఁ జూపనోడు
శీతాంశు లదరింప భీతిల్లు శశి వాన రొంపిగా హరి గురియింప వెఱచు
ఋతువులక్రమ మేది యెల్లమ్రాఁకులనిండ నెపుడు పుష్పఫలంబు లిచ్చుఁ దరులు
వలసినచోటన జల ముప్పతిలు నేవి దలఁచిన నవి యెల్లఁ గలుగుచుండు


తే.

భూరిదారుణకోపవిస్ఫూర్తి భువన, ములకు నెల్ల భయంకరమూర్తి యైన
యమహాత్మునితీవ్రశాపాగ్నిఁ జేసి, శాంతిగుణవిభూషణ! తదాశ్రమమునందు.

45


ఉ.

ఆతఁ డపుత్రుఁ డై వగచి యాత్మజుఁ గోరి తపం బొనర్తు శీ
తాతపవాతపీడితుఁడ నై యని బుద్ధిఁ దలంచి నిశ్చలుం
డై తప మాచరింపఁ బవనార్కశశాంకులు నొంప నోడిన
న్భూతి యపీడ్యమానుఁ డయి పో విడిచె న్దపము న్సుతేచ్ఛయున్.

46

గురువు నగ్ని నశించుటచే శాంతి యనునతఁడు చింతాకులుఁ డగుట

వ.

అంత నొక్కనాఁ డతనిసహోదరుం డగుసువర్చసుండు చనుదెంచి యజ్ఞంబున కతని
నిమంత్రితుఁ గావించిన నాభూతి శాంతి యనువానిం దనశిష్యునిఁ బిలిచి యేను
మదీయభ్రాతృమఖంబున కరిగెద నీవు రేయునుం బవలును నేమఱక నిద్ర వోక
యెప్పుడు నాచేతం జేయంబడునిత్యకృత్యంబు లయ్యైప్రకారంబుల ననుష్ఠించునది
యని నియోగించి చనియె నతండును భయభ క్తియుక్తుం డగుచు సతతంబును సమీ
త్కుశఫలాదులు గొని వచ్చి గురుండు నియమించినట్టి విహితకర్మంబులు సలుపు
చుండ నగ్నిహోత్రకుండంబునం దనలం బాఱినం జూచి శాంతి నితాంతచింతా
క్రాంతుండై తల్లడిల్లుచు నంతర్గతంబున.

47


సీ.

ఏమి సేయుదు? గురుఁ డేఁగుదెంచిన దీని నే మని చెప్పుదు? నెందుఁ జొత్తు?
శమితానలం బైనసదనంబు గని ముని యెట్టిశాపము నాకు నిచ్చు నొక్కొ?

యొం డగ్ని యిడుదునేఁ గుండంబులోన నట్లైన నీఱుగఁ జూచు నతఁడు నన్ను
నతనికోపమునకు నమరుల గడుఁ దల్లడింతురు నరుఁడ నే నెంతవాఁడ?


ఆ.

ననుచు బహువిధముల వనరి భయం బంది, యనుపమానబుద్ధి యైనశాంతి
దీని కింక నొండుతెఱఁగు లేదు త్రిలోక, వరదు నగ్నిదేవు శరణుఁజొత్తు.

48


క.

అని యేకచిత్తుఁ డై మే, దిని జానులు మోపి భక్తిదీపితమతి ని
ట్లని స్తుతియింపఁ దొడంగెను, మునిశిష్యుఁడు గరయుగంబు మోడ్చిహుతవహున్.

శాంతి యగ్నిదేవుని స్తుతించుట

శా.

భూతాధారుఁడ వై మహాధ్వరకళాపూజ్యుండ వై యాగమ
వ్రాతస్తుత్యుఁడ వై సురార్చితుఁడ వై బ్రహ్మణ్యదేవుండ వై
శ్రాతస్మార్తశుభక్రియాధిపతి వై శాంతాంతరంగోజ్జ్వల
జ్యోతీరూపుఁడ వై వెలుంగు నిను సంస్తోత్రం బొనర్తున్ శిఖీ!

50


క.

దేవతలకు నీవ ముఖము, దేవతలకు నీవ బ్రదుకుతెరవు హుతవహా!
దేవతల కెల్ల నాత్మవు, నీవ సకలదేవతలును నీప్రాణంబుల్.

51


నీయం దెప్పుడు వేల్చుహవ్యము లొగి న్మేఘమ్ము లై వర్షము
న్జేయ న్మేదిని నోషధు ల్గలుగుఁ దత్సేవ న్జనశ్రేణి దీ
ర్ఘాయుర్వృద్ధి వహించి యధ్వరము లుద్యత్ప్రీతిఁ గావింపఁగా
నాయజ్ఞంబులఁ దృప్తిఁ బొందుదురు నాకాధీశ్వరు ల్పావకా!

52


క.

జలముల నీవ సృజించితి, జలముల యగ్ని యగునీకు జనన మొనర్చెన్
జలములు నీచేఁ బక్వ, మ్ములగుచుఁ బ్రాణులకుఁ జేయుఁ బుష్టి హుతవహా!

53


వ.

నీవు దేవతలయందుఁ దేజోరూపంబు నురగులయందు విషరూపంబును బక్షుల
యందు వాయురూపంబును మనుష్యులయందుఁ గ్రోధరూపంబును మృగాదుల
యందు మోహరూపంబును మహీరుహంబులయందుఁ గాఠిన్యరూపంబును జలంబు
లందు ద్రవరూపంబును ననిలంబునందు జవరూపంబును జేసీ సర్వంబు నభివ్యాపించి
యుండుదు సర్వభూతములయందు నగ్నిత్వంబునఁ జరింతువు సర్వంబును నీచేత
సృష్టంబైనది కవివరులు నిన్ను మూఁడువిధంబులు నెనిమిదివిధంబులుం గావించి
యజ్ఞవాహుం గావించిరి నీవు లేనియాక్షణంబ నిఖిలంబు నశించు మహాత్ములు
భవదీయదర్శనంబున నిజకర్మవిహితగతులు పడయుదురు నీజిహ్వ లైహికభయం
బులు చెందకుండ మ మ్మనుదినంబు రక్షించుచుండెడు మని మఱియు ననేకప్రకా
కంబులం బ్రస్తుతించిన నగ్నిదేవుండు దనశరీరంబు శిఖాజాలంబులం బ్రజ్వరిల్లం
బ్రసన్నత్వంబు నొంది కృతప్రణాముం డగునతనికి న్జలదనినదగంభీరస్వరంబున
నిట్లనియె.

54


క.

శాంతీ! నీస్తుతులకు నే, నెంతయుఁ బ్రీతుండ నైతి నిచ్చెద వర మ

త్యంతహితము నీ కెయ్యది, సంతసమున దాని నడుగు సౌజన్యనిధీ!

55

అగ్నిదేవుఁడు సంతుష్టుఁ డై శాంతికి వరమిచ్చుట

చ.

అనవుడు నాతఁడేను భవదాకృతిఁ గన్గొనఁ గంటి మంటి నా
మనమున వంత యంతయును మానెఁ గృతార్థుఁడ నైతిఁ జెప్పెద
న్వినుము మహాత్మ! మద్గురుఁడు నెమ్మి ననుం దనయాశ్రమంబునం
దునిచి సహోదరాధ్వరమహోత్సవదర్శనలాలసాత్ముఁ డై.

56


ఆ.

చనిన మదపరాధమున భవద్విరహిత, మయ్యె ధిష్ణ్య మిప్పు డందు నీవు
హవ్యవాహ! తొంటియట్ల వెలుంగఁగ, వలయు గురుఁడు సూచి యెలమిఁ బొంద.

57


సీ.

వెండియు నీవు నా కొండువరంబు ప్రసాదించె దేని యస్మద్గురునకు
సత్పుత్త్రు నొకనిఁ బ్రసాదింపు తనయుని యం దెట్టు లట్టు నాయందు నిఖల
సత్వంబులందు నాసంయమిహృదయంబు మార్దవం బొనరింపు మైత్రి వెలయ
నీస్తోత్రమున నిన్ను నెవ్వఁడు కీర్తించు నతనికి వరదుండ వగుము దేవ!


తే.

యనిన ననలుండు నీవు న న్నడిగినట్టి, వరము లన్నియు నిచ్చితిఁ గరుణ నీకు
ననఘ! యీస్తవంబున నను వినుతిసేయు, నతని కీప్సితవివిధపుణ్యములు గలుగు.

58


ఆ.

పూర్ణిమాదిపర్వములయందు బహువిధ, సవనతీర్థహోమసమయములను
భక్తి నీస్తవంబు పఠియించునరులకు, నఘము లాఁగు శుభము లావహిల్లు.

59


క.

అని చెప్పి యతఁడు చూడఁగ, ననలుఁడు హతదీపభంగి నంతర్ధానం
బునఁ బొందె శాంతి యంతం, దనమనమున సంతసంబు దనరంగన్.

60


ఆ.

గురుగృహంబుఁ జూచి కుండంబులోఁ దొంటి, యట్ల వెలుఁగుచున్న యనలుఁ జూచి
పూర్ణచంద్రుమాడ్కిఁ బొల్పారె నతఁడు హ, ర్షామృతంబు వొంగి యవల వెడల.

61


వ.

అయ్యవసరంబున.

62

భూతి శాంతికృత్యమునకు సంతోషించుట

క.

అనుజునియాగము చెల్లినఁ, దనయాశ్రమమునకు వచ్చెఁ దద్దయును ముదం
బున భూతి మ్రొక్కి యతనికి, నొనరించెను శాంతి సవినయోచితపూజల్.

63


ఉ.

డెందమునం బ్రమోదము ఘటిల్లఁగ నమ్ముని శిష్యుఁ జూచి నీ
యందును సర్వభూతములయందును నిప్పుడు సౌహృదంబు
యందుఁ గుమార! నిశ్చలితమైనది యీవిధ మేమి యొక్కొ య
స్పందితపుణ్య! యే నెఱుఁగఁ జయ్యనఁ జెప్పుము నాకు నావుడున్.

64


చ.

అనలవినాశ మాదిగ యథార్థము సర్వము శాంతి సెప్పిన
న్విని ప్రమదాశ్రు లాస్యమున వెల్లిగొనం బులకాంకురంబులన్
దను వమరంగ నమ్ముని ముదంబునఁ గౌఁగిటఁ జక్కఁ జేర్చి శి
ష్యుని నొగి సాంగవేదవిభవోజ్జ్వలుఁ గా నొనరించెఁ బ్రీతిచేన్.

65

భౌత్యమనుజననము

వ.

ఇట్లు హుతాశనవరప్రసాదంబునం జేసి.

66


క.

భూతికి భౌత్యుం డనఁగఁ బ్ర, భూతవిభూతిప్రభావభూరిభుజబల
స్ఫీతుఁ డుదయించె మనువై, యాతనికాలమునఁ గలసురాదుల వినుమా.

67

భౌత్యమన్వంతరమునందలి యింద్రాదుల వివరణము

వ.

చాక్షుషులు కనిష్ఠులు పవిత్రులు భ్రాజితులు ధారావృకులు నన దేవత లేనుగణం
బులును శుచి యనువాఁ డింద్రుండును నాగ్నీధ్రాగ్నిబాహుశుచిముక్తమాధవ
శుక్రాజితులనువారు సప్తమునులును గురుగభీరబ్రధ్నభరతానుగ్రహప్రీతిమత్ప్ర
వీరవిష్ణుసంక్రందనతేజస్విసుబలాభిధాను లగుమనుపుత్రులు ధాత్రీశులై వర్తింపఁ
గలవారు స్వాయంభువస్వారోచిషోత్తమతామసరైవతచాక్షుషవైవస్వతసూర్య
సావర్ణిబ్రహ్మసావర్ణిధర్మసావర్ణిరుద్రసావర్ణిదక్షసావర్ణిరౌచ్యభౌత్యు లనునీమను
వులజన్మప్రకారంబు వినిననరునకుఁ గ్రమంబున ధర్మకామార్థజ్ఞానవృద్ధ్యారోగ్య
బలగుణవత్పుత్త్రపౌత్త్రమాహాత్మ్యశుభవిజయజ్ఞాతిప్రాధాన్యరిపువినాశదేవతా
ప్రసాదాద్యైశ్వర్యంబులు గలుగు మన్వంతరదేవతలను దేవేంద్రుని సప్త
మునులను రాజులను సావధానులై యాకర్ణించుమహాత్ములు సర్వపాపవిముక్తులు
సర్వశుభయుక్తులు సర్వకాల కుశలసమన్వితులు నగుదు రింద్రులుపదునలువురు
గలయంతకాలంబును బుణ్యలోకసుఖంబు లనుభవింతు రనిన మార్కండేయ
మహామునికిం గ్రోష్టుకి యిట్లనియె.

68

మహారాజవంశవర్ణనము

తే.

వింటి మన్వంతరస్థితివిలసనములు, క్రమముతో నీవు చెప్పఁగ నమితపుణ్య!
వినఁగఁ వేడ్క యయ్యెడు నాకు విస్తరింపు, నలువనుండి వచ్చిన రాజకులము నెల్ల.

69


క.

అనిన మృకండతనూజుండను విను చెప్పెదఁ జతుర్ముఖాద్య మయి జగ
మ్మునకు మొద లైననృపతుల, జననముఁ జరితంబు నీకు సౌజన్యనిధీ!

70


సీ.

ఎం దేనియు మనువు నిక్ష్వాకుఁడు ను ననరణ్యుండు నొగి భగీరథుఁడు నాది
గా ననేకులు ధరిత్రీనాథు లధికవిభూతిసమేతులు భూరిబలులు
ఛార్మికు లధ్వరతత్పరు ల్శూరులు పరమవిజ్ఞానులు భవ్యయశులు
జనియించి రేవంశమునయందు బహుసహస్రవిభేదవంశము ల్సంభవించె


తే.

మఱ్ఱి నూడలు దిగ్గినమాడ్కి నర్థి, మనుజు లేవంశమున పెంపు విని సమస్త
దురితనిరుక్తు లగుదురు ధరణి నట్టి, విమలవంశంబు చెప్పెద విను మునీంద్ర!

71

సూర్యుని జననప్రకారము

వ.

ప్రజాపతి ప్రజల సృజియింపఁ దలంచి దక్షిణాంగుష్ఠంబున దక్షుని వామాంగుష్ఠం
బునఁ దదీయభార్యను నుత్పాదించిన నాదక్షుని కదితి యనుకన్యక యుదయించె

దానియందుఁ గశ్యపుఁ డొకయండంబు పుట్టించె నయ్యండంబు బ్రహ్మస్వరూపం
బును సకలజగత్పరాయణంబును నుత్పత్తిస్థితివిలయకారణంబు నయి వెలుంగుచు.


తే.

సర్వభూతమయాత్ముండు శాశ్వతుండు, సఖలభువనైకమూర్తియు నవ్యయుండు
నైనభాస్వంతుఁ డాదిత్యుఁ డయ్యెఁ దొల్లి, యదితిచేత నారాధితుం డగుటఁ జేసి.

73


సీ.

అనినఁ గ్రోష్టుకి యిట్టు లనియె వివస్వంతు నాకార మెట్టి దయ్యాదిదేవుఁ
డనఘ! కశ్యపునకు నాత్మజుం డై యెట్టి కారణంబునఁ బుట్టెఁ గశ్యపుండు
నదితీయు నెమ్మెయి నతని నారాధించి రతఁడు వారల కేమి యానతిచ్చె
నవతరించినయమ్మహాత్ముమాహాత్మ్యంబువిధ మెట్టి దెఱిఁగింపు వినఁగ వేడ్క


తే.

యగుచు నున్నది మునినాథ! యనుడు నమ్మృ, కండతనయుండు వినుము మార్తాండుఁ డాది
నుద్భవించినవిధము నీ కున్నరూపు, తెలియఁజెప్పెద సంతతాతులితపుణ్య!

74


వ.

ఇంతయు నిష్ప్రభంబు నిరాలోకంబును నై యుండ నొక్కమహాండం బావిర్భ
వించె నందుఁ బ్రపితామహుండుం బద్మయోనియు బ్రహ్మయు స్రష్టయునై తాన
కలిగె నతనిముఖంబున మహానాదంబుతో నోంకారం బుద్భవించె దానివలన
భూరాదివ్యాహృతులు మూఁ డుద్భవించె నని సూర్యునిసూక్ష్మరూపంబులు
మహోజనస్తపస్సత్యంబు లనునాలుగుస్థూలరూపంబులు నిత్యుం డగుదివాకరు
నియం దియ్యేడురూపంబులు నుత్పత్తివిలయంబులయందుఁ గలుగుచు నడంగుచు
నుండు ము న్నేను జెప్పినయోంకారం బద్దేవుం డగుబ్రహ్మ తను వని వెండియు.

75


సీ.

నలువతొల్మోమున నవజపాచ్ఛవిరజోన్వితము నై వెడలె ఋగ్వేద మనఘ!
దక్షిణాస్యమున రక్తద్యుతిసత్త్వసముద్రిక్త మై యజు వుద్భవించె
చరమముఖంబున సామంబు తెలు పయి పుట్టఁ దమోగుణస్ఫూర్తి మెఱయ
నుత్తరాననమున నుద్భవించె నధర్వ మసిత మై సత్త్వతమోతిశయిత


తే.

నమరు నీనాల్గుశ్రుతులకు నాద్యమైన, యట్టిప్రణవంబు తేజోమహత్త్వమునను
ఋగ్యజుస్సామతేజంబు లేకభావ, మొంది త్రిగుణమయస్థితి నుల్లసిల్లు.

76


తే.

కెలఁకులందును మీఁదను గ్రింద దీప్తు, లెసఁగ మండలీభూతమై యివ్విధమున
వేదములమూఁటితేజంబు నాదిపరమ, తేజమునఁ జేసి యనఘ! యాదిత్యుఁ డయ్యె.

77


వ.

ఇట్లు విశ్వంబునకుఁ గారణంబై యవ్యయుం డైనభాస్వంతుండు ఋగ్యజుస్సామం
బులగుణంబులం జేసి క్రమంబునం బూర్వాహ్ణమధ్యాహ్ణాపరాహ్ణంబులయందు శాం
తికపౌష్టికాభిచారికంబు లంగీకరించి సర్వంబును దపింపఁజేసి సృష్టియందు బ్రహ్మయు
స్థితియందు విష్ణుండును సంహారంబున రుద్రుండు నై వెలుంగుచుఁ ద్రివేదమయుం
డును ద్రిగుణాత్మకుండును ద్రిపురుషమూర్తియు నని జగంబులు గీర్తింప నొప్పువివ

స్వంతుండు నుగ్రతేజంబున నజాండం బంతయు సంతప్యమానం బగుటం జూచి
సృష్టిరపరుం డగుకమలభవుండు చింతాక్రాంతత్వంబు నొంది.

78

బ్రహ్మ సూర్యునిఁ బ్రార్థించుట

ఉ.

ఏను సృజించుప్రాణిచయ మింతయు నొక్కట నాశ మొందెడు
న్భానునితీవ్రతేజముప్రభావముచే వెస నిం కెడు న్జగం
బీనరులు న్జగంబుల విహీనత నొందఁగ నేటిసృష్టియం
చానలినోద్భవుండు హృదయంబున భాస్కరు నిల్పి భక్తితోన్.

79


వ.

ఇట్లు స్తుతింపఁ దొడంగె.

80


తే.

యోగిజనము లెవ్వనిఁ బరజ్యోతి గాఁగఁ, దలఁతు రఖిలమయాత్ముఁడై వెలుఁగు నెవ్వఁ
డరయ సకలంబు నెవ్వనియందుఁ గలుగు, నట్టిరవికి మ్రొక్కెద నే సమగ్రభక్తి.

81


ఉ.

ఏమహితాత్ముఁ డెప్పుడును నెంతయు వెల్గుచునుండు ఋగ్యజు
స్సామకయైకమూర్తి రుచిసంపద నేనిగమాత్ముఁ డర్థమా
త్రామయసూక్ష్మత న్వెలుఁగుఁ దద్దయు నేత్రిగుణాత్ముఁ డోంకృతి
శ్రీమయలీల సంతతముఁ జెల్వగు నారవి కేను మ్రొక్కెదన్.

82


క.

శ్రుతిరూపుఁడు గ్రతురూపుఁడు, నతులబ్రహ్మైకరూపుఁ డాత్మవిదారా
ధితరూపుఁ డాద్యుఁ డవ్యయుఁ, డతితేజుం డగుదినేశు నభినందింతున్.

83


క.

అపరిమిత మైననీయు, గ్రపువేఁడిమిఁ బ్రాణు లెల్లఁ గ్రాఁగుడుఁ దేజం
బుససంహరింపు సృష్టికి, విపరీతము పుట్టకుండ విశ్వమయాత్మా.

84

బ్రహ్మకృతసురాసురనరతిర్యగాదిసృష్టిప్రకారము

వ.

అని సర్గోద్యుక్తుం డగు బ్రహ్మ బహువిధంబులం బ్రస్తుతించినఁ ప్రభాకరుండు నిజ
పరమతీవ్రతేజం బుపసంహరించి యల్పప్రభాసమన్వితుం డయ్యె నంతం బ్రజాపతి
పూర్వకల్పంబునం దెట్టులట్ల సర్వంబునుం గల్పించె సర్వలోకంబులు సర్వద్వీపంబులు
సర్వసముద్రంబులు సర్వవర్ణంబులు సర్వాశ్రమంబులు సర్వధర్మంబులు వేదసూక్త
క్రమంబున నావిర్భవించె నావిరించికి మరీచి జన్మించె మరీచికిఁ గశ్యపుఁడు పుట్టెఁ
గశ్యపునకు దక్షునికూఁతులు పదుమువ్వురు భార్యలైరి వారిలో నదితికి దేవ
తలు దితికి దైత్యులు దనువునకు దానవులు వినతకు ననూరుగరుత్మంతులు స్వసకు
యక్షరాక్షసులు గద్రువకు నురగేంద్రులు నావిర్భవించిరి క్రోధకు ఋషిగణాప్స
రోగణంబులు నిరకు నైరావతాదిగజంబులునుం బ్రభవించె మునికి గంధర్వు
లావిర్భవించిరి తామ్రకు శ్యేనీప్రముఖకన్యలు పుట్టిరి వారిసంతతి శ్యేనభాస
శుశాదిఖగము లయ్యె నిలకు వృక్షంబులు ప్రధకుఁ బక్షిగణంబులును బుట్టె నిట్లు
రెండవసర్గం బై కశ్యపప్రజాపతి సంతానంబు జగద్భరితం బయ్యె నందు.

85

తే.

సురలు సత్వరజస్తమస్స్ఫురణ నొంది, యధికు లై యందఱకు ముఖ్యులైరి వారి
నజుఁడు భువనత్రయమునకు నధిపతులను, యజ్ఞభుజులను గావించె నాదరమున.

86


ఉ.

దాని సహింప కెంతయును దర్ప మెలర్పఁగ దైత్యదానవు
ల్పూని సురావలిం దొడరి భూరిరణం బొనరించి గెల్చి శౌ
ర్యానుగుణంబు గా జగము లన్నియుఁ జేకొని యాగభాగము
ల్మానుగఁ దార గైకొని రమందభుజాబలజృంభణంబునన్.

87


వ.

అంత.

88


క.

దితి దనుతనయులచేఁ దన, సుతు లపహృతరాజ్యు లగుటఁ జూచి యదితి దా
మతి వారి నవిచ్ఛిన్న, క్రతుభాగులఁ జేయఁదలఁచి కడుభక్తిమెయిన్.

89

అదితి సూర్యుని స్తుతించుట

మహాస్రగ్ధర.

సవితృం దేజోభిరాము స్సకలమునిజనస్తవ్యుఁ బ్రత్యక్షమూర్తిన్
దివిజేంద్రారాధనీయు న్దినకరుఁ ద్రిజగద్దీపకు న్విశ్వవంద్యున్
రవి నారాధింపఁ జొచ్చె న్మతి నదితి ప్రయత్నంబుతోడ న్నిరాహా
రవిధిస్వీకారనానావ్ర తనియమధురారమ్య యై సంతతంబున్.

90


వ.

అ ట్లారాధించుచు.

91


క.

పరమం బై సూక్ష్యం బై, పరిపూర్ణంబై సుషుమ్నఁ బ్రభవం బై సు
స్థిర మైనబ్రహ్మతేజము, ధరియించిననీకు మ్రొక్కెదను నే ద్యుమణీ!

92


క.

జగముల కుపకారంబుగఁ, దగుతఱి నుదయించుచున్న తావకవిలస
న్నిగమమయతీవ్రమూర్తికి, గగనమణికి మ్రొక్కెద న్బ్రకాశితభక్తిన్.

93


క.

ఘనవర్షార్థము రసమో, చనముం జేయుచును సకలజగమున కాప్యా
యనకర మగురూపము గల, ఘనాత్ముఁ డగునీకు వినతి గావింతు రవీ!

94


మ.

అని యద్దేవి నిరంతరంబును నిరాహారత్వముం బూని కీ
ర్తనముం జేయుచు భక్తితోడఁ దను నారాధింప నయ్యుగ్రద
ర్శనుఁ డుష్ణాంశుఁడు పెద్దకాలమునకుం బ్రత్యక్ష మై నిల్చె న
వ్వనితారత్నముముందర న్వితతభాస్వద్ధీధితు ల్పర్వఁగన్.

95


సీ.

నిలిచినఁ గనుఁగొని నిర్జరజనని భయం బంది దేవ! నభంబునందు
వెలుఁ గొందుచున్నని న్వీక్షింప నాకు శక్యము గనిమాడ్కి భూగతుఁడ వైనఁ
గానఁజాలక యున్నదానఁ బ్రసన్నుఁడ నగుము భవద్రూప మస్మదీయ
లోచనముల కిఫ్డు గోచరముగఁ జేయు మతిదయ ననుఁ జూడు మధికభక్తి


తే.

భరిత నైననాతనయులఁ బ్రమదలీలఁ, గావు మఖిలలోకంబులు గలుగఁజేయ
వాని రక్షింప నడఁగింప వలఁతి వీవ, కాని నీకంటె నన్యుండు గలుగఁ డెందు.

96


తే.

బ్రహ్మకేశవరుద్రరూపములు నీవ, యింద్రపావకయమజలధీశపవన
ధనదరూపము నీవ చంద్రధరమేది, నీంద్రభూవార్ధిరూపము లీవె తరణి.

97

క.

యాగములను సతతాంత, ర్యాగములను నిను భజింతు రవనిసుపర్వు
ల్యోగులు త్రిదివాక్షయసుఖ, భోగంబులకై సమస్తభువనస్తుత్యా!

98

సూర్యుఁ డదితికిఁ బ్రసన్నుఁడై వర మిచ్చుట

చ.

అని వినుతించిన న్దపనుఁ డాపటుతేజముఁ బాసి తప్తతా
మ్రవిభవిభాతిభూతి దనరంగఁ బ్రసన్నత నొంది పల్మఱు
న్దన కభివందనంబు ప్రమదంబునఁ జేయునిలింపమాతఁ గ
న్గొని భవదంతరంగమునఁ గోరిక యెయ్యది సెప్పు మేర్పడన్.

99


ఆ.

అనిన నదితి జాను లవనీతలంబున, మోపి శిరము వాల్చి మ్రొక్కి దేవ!
యవధరింపుము మస్మదాత్మజు ల్గడుబలవంతు లైనదైత్యవరులచేత

100


వ.

త్రిలోకరాజ్యంబును యజ్ఞభాగంబులుం గోల్పడి దీను లై యున్నవారు గావునం
బ్రసన్నుండ వై నీవంశంబునం దద్భ్రాతృత్వం బంగీకరించి నాకు జన్మించి దైత్య
దానవనాశం బాపాదించి నానందనులకుం ద్రిలోకాధిపత్యంబును గ్రతుభాగ
భోక్తృత్వంబును బ్రసాదింపు మనినం బ్రభాకరుండు గరుణించి యద్దేవికి
నవ్వరం బిచ్చి అంతర్ధానగతుం డయ్యె నదితియుం దపోనివృత్త యయ్యె నంత.

101


తే.

సూర్యకరసహస్రములో సుషుమ్న యనఁగ, నెగడు రశ్మి నిలింపజనిత్రి యుదర
మునఁ బ్రవేశించె దాని నమ్ముదితఁ దాల్చెఁ, గృచ్ఛ్రచాంద్రాయణాదికక్లేశనియతి.

102

మార్తాండునియావిర్భావము - తద్దర్శనమున దైత్యదానవులు భస్మ మగుటయు

వ.

ఇట్లు నిత్యోపవాసవ్రతపరాయణ యై దివ్యగర్భధారిణి యైనయదితి నాలోకించి
కోపించి కశ్యపుఁ డిట్లనియె.

103


సీ.

ఏల యీగర్భాండ మిట్లు మారణ మొందఁ జేసెదు నిత్యోపవాసవృత్తి
ననవుడు నద్దేవి యలుగకు మిది మారితము గాదు చూడు ముద్దామశత్త్రు
సంక్షయకారి యై జన్మించు నని పల్కి పతిమాటఁ గోపంబు పట్ట లేక
యప్పుడ యద్దేవతారణి జాజ్వల్యమానతేజోరూప మైనయండ


తే.

మూడి పడఁ జేసెఁ గశ్యపుఁ డుద్యదర్క, ధామనిభ మై వెలింగెడుదానిఁ గాంచి
మ్రొక్కి ఋగ్వేదమంత్ర సముత్కరమున, నభినుతింపఁగ నంత నయ్యండ మనఘ!

104


ఆ.

ప్రకటదివ్యమూర్తి పద్మపత్త్రద్యుతి, స్ఫురితవర్ణుఁ డైనపురుషుఁ డయ్యెఁ
దేజమున సమస్తదిశలు వెలుంగఁగ, నపుడు దివ్యవాణి యంబరమున

105


వ.

నిలిచి మేఘగంభీరస్వనంబునం గశ్యపు నుద్దేశించి మహాత్మా! నీ వదితితోడ నీయండం
బేల మారితంబు గావించెద వని పలికి తది కారణంబుగా నీపుత్త్రుండు మార్తాండుం
డనునామంబునం బరఁగు సూర్యాధికారంబును జేయు శత్త్రుక్షయంబును గావించు
నని చెప్పిన నశరీరిణివచనంబులు విని.

106


స్రగ్ధర.

ఆనందం బంతరంగం బయి మనముల నిండార నింద్రాదిదివ్యుల్
నానాసైన్యస్ఫురద్దానవుల ననికి సన్నద్ధు లై పిల్చి రా దై

త్యానీకంబు న్మహోత్సాహమున వెడలె దేవాసురశ్రేణి కయ్యెం
దా నంతం గయ్య ముద్యత్పటుతరశరజాతప్రభ ల్మింటఁ బర్వన్.

107


క.

ఆతుములరణాంతరమున, నాతతమార్తాండతనుభవైకమరీచి
వ్రాతహతిఁ జేసి భస్మీ, భూతు లయిరి దైత్యదనుజపుంగవు లెల్లన్.

108


శా.

ఆమార్తాండు సమస్తదైత్యదనుజవ్యాపాదనప్రౌఢుఁ దీ
వ్రామేయారుణదేహదీప్తివిసరవ్యాప్తాఖిలాశాంతు సం
గ్రామోద్యద్విజయాభిరాము బహుమాంగళ్యప్రదున్ ఋగ్యజు
స్సామాలంకరణోజ్జ్వలు న్దినమణి న్సద్భక్తచూడామణిన్.

109


క.

ముదమునఁ గీర్తించుచు న, య్యదితిం గొనియాడుచుం బ్రియం బెలరారం
ద్రిదశులు గైకొని రొగిఁ దమ, పదములుఁ గ్రతుభాగములుఁ బ్రభాకరుకరుణన్.

110


చ.

అతులకదంబపుష్పసదృశాంశులు క్రిందను మీఁదఁ బర్వఁగా
హుతవహచారుపిండతులితోజ్జ్వల మైన యవిస్ఫుటాకృతి
న్శతదళబాంధవుండు గగనంబున నుండి నిజాధికార ము
న్నతి నొనరించె లోకము లనారతము న్దను భక్తిఁ గొల్వఁగన్.

111

కురుదేశమునఁ దపనతాపిత యై సంజ్ఞ బడబారూపమునఁ దపము చేయుట

వ.

అంత విశ్వకర్మప్రజాపతి తనకూఁతు సంజ్ఞ యనుకన్యక నావివస్వంతునకుం బ్రణ
తుండై ప్రార్థించి పత్నిం గావించె నద్దేవికి వైవస్వతమనువును యముండును యము
నయుం బ్రభవించి రాసంజ్ఞకథావృత్తాంతం బంతయు మున్న యేను నీకుం జెప్పితి
విను మట్లు పితృసదనంబునకు సంజ్ఞ చనుటయు ఛాయావధూటివలన నెఱింగి
మార్తాండుండు రోషంబున మండుచు మామయింటికిం జనిన నతండు నతని
నభ్యర్చించి సాంత్వనవచనంబుల ననునయించి యిట్లనియె.

112


ఉ.

కోపము సంహరింపు విను గోపతి! నీపటుతేజ మోర్వఁగా
నోపక పోయి పేరడవి నున్నది సంజ్ఞ మనోహరోల్లస
ద్రూపము దాల్చి నీవు తనుఁ దోకొని పోవుట గోరి భూరిని
ష్ఠాపరతంత్ర యై తగిలి సంతతముం దప మాచరించుచున్.

113


క.

శతధృతివాక్యంబును నా, మతమును నీ కించు కేని మానుగ విను దీ
పిత మగునీరూపము శో, భితమును శాంతంబు గాఁగఁ బ్రీతి నొనర్తున్.

114

విశ్వకర్మ సూర్యతేజము నల్పము చేయుట

తే.

అనిన నొడఁబడి వెలుఁగుఱేఁ డట్ల సేయు, మని యనుజ్ఞ యిచ్చుటయును నాక్షణంబ
విశ్వకర్మ శాకాహ్వయద్వీపమునకుఁ, జని దినాధీశ్వరునిఁ జక్రమున నమర్చి.

115


క.

అతిరయమునఁ దిరుగునహ, ర్పతితేజము దరువఁ దరువ బలవద్భ్రమణో
గ్రత నా కంపించె జగ, త్త్రితయము త్రుటితాంశుపవనతీవ్రత్వమునన్.

116


వ.

అప్పుడు.

117

సీ.

సకలరత్నాకరశైలాటవులతోన మేదినీచక్రంబు మీఁది కెగసె
నఖిలగ్రహేందుతారాన్వితంబుగ నింగి కూలి యెంతయు సమాకులత నొందె
వనధులు పిండలివండుగాఁ గలఁగి ఘూర్జిల్లుచు జగ మెల్ల వెల్లిగొనియెఁ
గులధరణీధరములు సానుబంధము ల్వెడలి నుగ్గై వడిఁ బుడమిఁ బడియెఁ


తే.

దేజరిల్లు ధ్రువాధారధిష్యతతులు, బహుసహస్రసంఖ్యలఁ బరిభ్రామ్యదరుణ
రశ్మిజాలరయంబున రాలఁ దొడఁగెఁ, దునియ లై మేఘపఙ్క్తులు దూలఁ జొచ్చె.

118

బ్రహ్మాదులు సూర్యుని స్తుతించుట

వ.

ఇవ్విధంబునం ద్రిభువనంబులు ప్రభాకరభ్రమణరయంబున విభ్రాజితం బైన నప్పుడు
భయం బంది బ్రహ్మాదిదేవత లయ్యాదిదేవుని ననేకప్రకారంబుల స్తుతించి రింద్రుండు
జయజయధ్వను లొనరించె వసిష్టాత్రిప్రభృతిసప్తఋషులును వాలఖిల్యప్రభృతి
మహామునులును బహువిధస్తోత్రంబులను ఋగ్యజుర్వేదసూత్రంబులనుం బ్రశం
సించిరి సిద్ధవిద్యాధరగరుడయక్షరాక్షసోరగపతు లంజలిపుటంబులు నిటలంబులం
గదియించి యందంద వందనం బాచరించిరి లిఖ్యమానుం డగుమార్తాండుసమీ
పంబున నుండి గాంధర్వవిద్యావిశారదు లగుతుంబురునారదాదిగంధర్వులు మధుర
గీతంబులు విస్తరించి రప్సరోంగనలును రంగంబుగా లలితనర్తనంబులు ప్రవర్తిం
చిరి వీణావేణుపణవశంఖకాహళఘంటాపటహమృదంగాదివాద్యంబులు హృద్యం
బులుగా మొరయించి రిత్తెఱంగునం గోలాహలంబులై నానానాదంబు లై చెలంగు
చుండ నద్దివిజవర్ధకి యల్లనల్ల నత్తేజోవర్ధనుఁ ద్రచ్చుచు నిట్లు స్తుతియింపం
దొడంగె.

119


క.

వనరుహభవరుద్రజనా, ర్దనవినుతుఁడు కాలకర్తృతామహనీయుం
డును నగునినుతనులిఖనము, విను నరుఁ డినలోకసౌఖ్యవిభవము నొందున్.

120


వ.

అని వెండియు.

121


చ.

కనదరుణాంబుజాతనవకాంతి నుదంచితభూరిచారుకాం
చనరుచిఁ దప్తతామ్రవిలసద్ద్యుతి నూత్నలసత్ప్రవాళదీ
ప్తి నిజతనూద్గతాంశుతతి దిక్కులఁ బర్వి వెలుంగ నొప్పునీ
దినమణికి న్నభోమణికి దేవశిరోమణి నేను మ్రొక్కెదన్.

122


చ.

ఘననిబిడాంధకారరిపుఖండనచండమయూఖరాజిచే
ననుదినము త్ప్రభాతములయం దమృతాంశుమరీచి వేఁడిగా
వనజము లుల్లసిల్లఁగఁ దొవల్ మొగుడ న్బ్రథమాద్రిఁ బొల్చునీ
దినమణికి న్నభోమణికి దేవశిరోమణి నేను మ్రొక్కెదన్.

123


చ.

అనుపమవేగసత్త్వసముదంచితవాహనవాహ్యమానకాం
చనరథచక్రసంకషణచారుసుమేరునగేంద్రసానుసం

జనితసువర్ణరేణుచయసంతతభూషితదీప్తి యైన యీ
దినమణికి న్నభోమణికి దేవశిరోమణి నేను మ్రొక్కెదన్.

124


వ.

అని మఱియును.

125


చ.

దినకర! యుష్మదీయతనుతేజము ద్రచ్చెద భక్తి నీకు వం
దన మొనరించుచు న్బహువిధంబుల నిన్ను నుతించుదు న్దయ
న్నను శుభదృష్టిఁ జూడుము సనాతన! కారుణికాగ్రగణ్య! య
త్యనుపమపుణ్య! సర్వనిగమాత్మక! నన్ను ననుగ్రహింపుమీ.

126

చెక్కినసూర్యునితేజముచే శూలాదులు నిర్మించుటయు - నాసత్యరేవంతులు పుట్టుటయు

వ.

అని బహువిధంబులఁ బ్రస్తుతించి విశ్వకర్మప్రజాపతి ప్రభాకరుతేజం బతనిమండలం
బున షోడశాంశంబు దక్కం బదియేను భాగంబులు వోవం ద్రచ్చి యాతేజః
ఖండంబుల విష్ణునికి సుదర్శనంబును జంద్రమౌళికి శూలంబును గుబేరునకు శిబి
కయుఁ గాలునకు దండంబును సేనానికి శక్తియు దేవగణంబుల కనేకాయుధంబు
లును గావించె నంత.

127


ఉ.

ఆతతవేదమూర్తి యగునాదిననాయకుఁ డట్లు మామచే
శాతితతేజుఁ డై కుసుమసాయకసన్నిభసౌకుమార్యము
న్భాతిగఁ దాల్చి యాత్మసతిపాలికి నేఁగె దురంగరూపముం
బ్రీతి ధరించి వారి కనపేతగుణు ల్జనియించి రశ్వినుల్.

128


వ.

సంభోగసమయాంతరంబున రేవంతుండు జనియించె నంత నిజరూపవంతుం డై
కాంతాసహితంబుగ గగనంబునకుం జని పూర్వప్రకారంబునం బ్రవర్తిల్లుచుండ
ఛాయాతనయుం డగుసావర్ణి యష్టమమనుత్వంబు గోరి మేరునగరంబున నిపుడు
దపంబు సేయుచున్నవాఁ డని చెప్పి మార్కండేయుండు.

129


తే.

సవితృసంతతిజన్మంబు చరితమును మృహాత్ముఁ డైనయాసవితృమహత్త్వమును బ
ఠించినను విన్న మనుజుల కంచితోరు, యశము చేకురు నాపద లడఁగిపోవు.

130


క.

ఇనునిమహత్త్వము వినిన, న్జనుల కహోరాత్రకృతవిషమకిల్బిషము
ల్మునివర! శాంతిం బొందును, ఘనరుజలు సదౌషధమునఁ గ్రాఁగువిధమునన్.

131

రాజ్యవర్ధనరాజచరిత్రము

మ.

అనినం గ్రోష్టుకి సంతసిల్లి మునివర్యా! సూర్యజన్మంబు పెం
పును దత్సంతతిసంభవంబును భవత్పుణ్యోక్తుల న్వింటి నిం
కను గౌతూహల మయ్యెడు న్విను త్రిలోకస్తుత్యుఁ డైనట్టియ
ర్కునిమాహాత్మ్యముఁ జెప్పవే మధురవాక్పూర్ణామృతం బారఁగన్.

132


వ.

అనిన భృగువంశ్యవర్యుం డి ట్లనియె.

133


తే.

యమునితనయుండు లోకవిఖ్యాతయశుఁడు రాజ్యవర్ధనుఁ డనియెడురాజు ధర్మ
పరతఁ జేకొని పాలించె ధరణితలము వివిధదానాధ్వరక్రియాప్రవణుఁ డగుచు.

134

వ.

అమ్మహీపతి రాజ్యంబునం బ్రజ లాధివ్యాధులం బొందక క్షామడాంబరబాధలం
జెందక ధనధాన్యాదిసమస్తసంపదం బొంపిరివోవుచు నంతంతకు వర్ధిల్లుచుండి
రంత.

135


సీ.

అతఁడు విధూరథుం డనుమహీపతిసుత శుభలక్షణాన్విత సుందరాంగి
మానిని యను పేరిమానిని వరియించి యయ్యింతియందు బద్ధానురాగుఁ
డైకల నైనను నన్యకాంతలఁ గోర కాత్మధర్మములకు హాని గాని
క్రమమున వివిధసౌఖ్యము లొందుచుండఁగ సప్తసహస్రవర్షమ్ము లొక్క


ఆ.

దినము చనినభంగిఁ జనుటయు నొకనాఁడు, పౌరజానపదులు భూరమణులు
సచివవరులు నాప్తజనులును దగువారు, నర్థిఁ గొలువ నున్నయవసరమున.

136


ఆ.

మానినీవధూటి మగని కభ్యంగము, చేయువేళ నశ్రుశీకరంబు
లతనిమేన నించె నతఁ డిది యేమి యో, యనుచు మగిడి యాలతాంగిఁ జూచి.

137

మానినీరాజ్యవర్ధనసంవాదము

క.

పొలఁతి! యిది యేమి నావుడుఁ, బలుకక యతఁ డెన్నియేని భంగుల మఱియు
న్బలుమాఱు నడుగ నాతని, తల నొకనర యున్నఁ జూపి తరలాక్షి యనున్.

138


చ.

నరవర! నీదుమస్తకమున న్నర దోఁచిన దింతకంటె నా
కరయ విషాదహేతు వగునట్టిది యెయ్యది? యంచు బాష్పము
ల్గొరఁగఁగ గద్గదం బడర దుఃఖిత యైనలతాంగిఁ జూచి తా
దరహసితాననుం డయి ముదంబున నమ్మనుజేంద్రుఁ డి ట్లనున్.

139


క.

పౌరులు భూమిజనులు ధా, త్రీరమణులు బలసి యుండ ధృతి దొలఁగి వగం
గూరి కనునీరు నింపఁగ, నీరజదళనేత్ర! తగునె నీపెంపునకున్.

140


ఆ.

సకలజంతువులకు జన్మవర్ధనపరి, ణామగుణచయంబు నైజ మగుట
యెఱిఁగి యెఱిఁగి యింత యేటికి శోకింప?, విను లతాంగి! నాదువిధము దెలియ.

141


సీ.

చదివితి వేదముల్ శస్త్రాస్త్రవిద్యల నారూఢిఁ బొందితి నాహవమున
వైరుల నోర్చితి వసుధ నిర్వక్రంబు గాఁగఁ బాలించితిఁ గ్రతువు లెన్ని
యేని యొనర్చితి నీప్సితార్థంబులఁ బరితుష్టిఁ జేసితి బ్రాహ్మణులకు
మానిని! నీతో నమానుషభోగంబు లనుభవించితి నెయ్య మతిశయిల్ల


తే.

సకలపురుషార్థములు నాకు సంభవించె, నింక ముదిమికి శంకింప నేల చెపుమ?
వలులు పలితంబులును బెక్కు గలుగుఁ గాత, వాని కుచితంపువిధ మిప్పు డే నొనర్తు.

142


వ.

బాల్యకౌమారయౌవనవార్ధకావస్థలం దత్తదుచితప్రవృత్తిం బ్రవర్తించుట
యుత్తమక్షత్త్రియులకు విధివిహితకృత్యంబు మత్పూర్వులు నిట్ల వర్తించిరి
యిప్పుడు నామనంబు తపంబున కౌత్సుక్యం బొందుచున్న యది యిప్పలితాంకుర
దర్శనంబును నాకు నభ్యుదయకారణం బయ్యె నీ వింక నెవ్వగ దక్కు మని

యక్కాంతారత్నంబు నూఱడించుచున్న యన్నరపతివచనములు విని సచివులు
పౌరులు శోకాక్రాంతస్వాంతు లగుచు నమ్మహీకాంతున కిట్లనిరి.

143

రాజ్యవర్ధనభూపతికిఁ బౌరులకును సంవాదము

సీ.

ఆరయ దేవికిఁ గారణం బేమి యీవగపు మాయది గాక వసుమతీశ!
విపినంబునకుఁ దపోవృత్తి నీ వరిగినట్లైన సర్వక్రియాహాని గాదె!
యేడువేలేఁడులు నిల యేలి పడసిన సుకృత మిప్పుడు విడఁజూడఁదగునె?
ప్రజలఁ బాలించుధర్మము పదాఱవపాలుఁ బోలునే వని సేయఁబోవుతపము?


తే.

నింతయును నాత్మ నూహించి యీతపంబు, మాను మని యందఱును బలుమాఱు ప్రార్థ
నంబు సేయుడు నానరనాథవరుఁడు, గౌరవంబున వారలఁ గలయఁ జూచి

144


ఉ.

ఏలితి లీల నీవసుధ నింతయు సప్తసహస్రవర్షము
ల్పోలఁగ సత్కళత్రమునఁ బుత్త్రులఁ గాంచితి నెల్లవారలు
న్మేలన మంటి నింక నిటమీఁదటఁ బొందుతపోనివాసము
న్బోలునె కాలపాకమున యూరక యున్కి యేరికిన్?

145


క.

జనులార! మచ్ఛిరంబున, జనియించిన యీపలితము సమవర్తికిఁ గ
ట్టనుఁ గైనదూత గా మదిఁ, గనుఁగొనుఁ డట్లగుట నిజము గాదె తలంపన్.

146


ఉ.

కావున నైహికం బగుసుఖంబుఁ దొఱంగి తనూజు రాజ్యల
క్ష్మీవిభుఁ గాఁగఁ బ్రీతి నభిషిక్తుని జేసి ప్రబుద్ధబుద్ధి నై
యే విపినాంతరంబునకు నేఁగి కృతాంతునిదూత లెఫ్డు నా
పై వడి వత్తు రంతకుఁ దపం బొనరిం చెద నప్రమత్తతన్.

147


మ.

అని దైవజ్ఞులఁ జూచి పుత్త్రకుని రాజ్యశ్రీవిభుం జేయఁగా
దినలగ్నంబులు చెప్పుఁ డన్న విని ధాత్రీనాథునుద్యోగ మె
ల్లను దెల్లంబుగ వా రెఱింగి వగ లుల్లమ్ము ల్గలంపంగ నే
మనియుం జెప్పఁగ నేర కెప్పుడు సముద్యద్భాష్పదీనాస్యు లై.

148


వ.

అమ్మహీపతి నవలోకించి.

149


క.

జనవల్లభ! నీవాక్యము, విని మాహృదయములు శోకవికలము లగుట
న్దినలగ్నస్థితి దోఁపద, యని పలికిన నచట నున్న యఖిలజనంబుల్.

150


ఆ.

ఏకవాక్యముగ ననేకవిధములఁ, బ్రార్థనము చేసి రమ్మహీశుఁ
డచలితప్రయత్నుఁ డగుట గనుంగొని, యేమి సేయువార మింక ననుచు.

151

రాజ్యవర్ధనునియాయుర్వృద్ధికై పౌరులు సూర్యు నారాధించుట

వ.

అన్నరేంద్రచంద్రునిమీఁదియమందప్రీతి నందఱుం బెద్దయుం బ్రొద్దు విచారించి
యత్యంతనియతి భాస్వంతు నారాధించి యమ్మహీకాంతు నధికాయుష్మంతునిం
గావింతమని నిశ్చయించి యద్దిననాథు నుద్దేశించి.

152

సీ.

వేదసూక్తముల వినుతించువారును మౌనవ్రతంబులు పూనువారు
పుష్పగంధములఁ బూజించువారును విధివిహితంబుగ వేల్చువారు
జలమధ్యముల జపమ్ములు సేయువారలు నుపవాసనియతిమై నుండువారు
నవిరతధ్యానపరాయణు లగువారు నుచితోపహారంబు లొసఁగువారు


ఆ.

నై సమస్తజనులు నయ్యైవిధంబుల, నధికభక్తియుక్తి ననుదినంబుఁ
దపనుఁ గొల్వఁ దా సుదాముఁ డన్గంధర్వుఁ, డేఁగుదెంచి వారి కిట్టు లనియె.

153


క.

నరులార! కమలమిత్రుని, వరదుం గాఁ గోరి కొల్వ వలతుర యేని
న్వెర వే నిదె యెఱిఁగించెదఁ, బరమహితముఁ గోరి యెల్లభంగులఁ దెలియన్.

154


వ.

అగురువిశాలం బను నామంబునం బ్రసిద్ధం బైనవనంబు సిద్ధనిషేవితం బగుచు నుల్ల
సిల్లు నవ్వనంబునం గామరూపం బనుమహాపర్వతంబు గల దందుఁ జని భానుని నారా
ధించిన మనోరథంబు సఫలం బగు ననుటయు వార లట్ల కాక యని యచటి కరిగి
భాస్కరాయతనంబుఁ గని తత్సవిూపంబునం దప్రమత్తులు నియతాహారులు నై
యక్షతపుష్పగంధధూపదీపాద్యుపచారములను జపహోమాన్నహోమంబులను
వివస్వంతు నారాధించుచు ని ట్లని స్తుతియించిరి.

155

బ్రాహ్మణబృందము సూర్యుని స్తుతించుట

సీ.

ఆదిత్యు సూర్యుని నర్యముఁ బూషు స్వభాను దివాకరు భాను సవితృ
నక్షరుఁ బరము సితాసితవర్ణుని భాస్కరు దుష్ప్రేక్ష్యుఁ బంకజాప్తు
రవిఁ బ్రళయాంతకు రక్తపీతుని దీపదీధితి సవితర్కు దీర్ఘరూపు.
యాజ్ఞాగ్నిహోత్రవేదావస్థితుని యోగి నిత్యు ననంతుని నిగమవేద్యు


తే.

నాద్యు మిత్రుని నఖిలలోకైకరక్షు, వ్యక్తు గుణయుక్తుఁ బరమదయానురక్తు
శాంతు నిన్నుఁ బ్రభాకరు శరణు వేఁడి, సంతతము నినుఁ గొల్తు మనంతభక్తి.

156


క.

సురదనుజఖచరకిన్నర, గరుడోరగసిద్ధతారకాగ్రహములయం
దరయంగ నధికతేజ, స్స్ఫురితుం డగుదేవు శరణుఁ జొచ్చెద మర్థిన్.

157


తే.

గగనముననుండి నిజమయూఖములఁ జేసి, యవనితలమును దిశలును నంతరిక్ష
మును వెలింగించుచును వ్యాప్తమూర్తిఁ దాల్చి, పరఁగుదేవుని గొలుతుము శరణు వేఁడి.

158


ఆ.

అరయ బ్రహ్మ యన మహాదేవుఁ డన విష్ణుఁ, డనఁ బ్రజాపతి యన ననిలుఁ డనఁగ
నంబరం బనంగ నమరుఁ దా నేదేవుఁ, డట్టిభానుఁ గొల్తు మర్థితోడ.

159


తే.

అని యనేకవిధంబుల నఖిలజనులు, ప్రస్తుతించుచు నిశ్చలభక్తిపరత
ననుదినంబును గొలువంగ నాత్మ మెచ్చి,మూఁడు నెలలకు వరదుఁ డై వేడివెలుఁగు.

160


చ.

అమితనిజాంగకాంతి వియదంతర మంతయుఁ గప్ప నాత్మబిం
బముదెసనుండి సౌమ్య మగుభావము గైకొని వారియగ్రభా

గమునకు వచ్చి నిల్చుటయు గాత్రములం బులకాంకురంబు నే
త్రములఁ బ్రమోదబాష్పములదందడి గ్రందుకొనంగ నందఱున్.

161


వ.

భక్తినమ్రు లగుచు నమ్మార్తాండునికి నందంద నమస్కరించి ముకుళితాంజలు
లైనం జూచి యద్దేవుండు.

162

ఆదిత్యునివలనఁ బౌరజను లిష్టార్థములఁ బడయుట

క.

నావలన మీకు నిందఱ, కేవరములు వడయఁగా నభీష్టము చెపుఁడా
నావుడు నజ్జనులు ప్రమో, దావిష్టమనస్కు లగుచు నందఱు భక్తిన్.

163


వ.

మస్తకన్యస్తహస్తు లగుచు ని ట్లనిరి.

164


క.

ముదియక సంతతవిజయా, స్పదుఁ డై సుఖలీల నీప్రసాదమున భువిం
బదివేలవత్సరంబులు, బ్రదుకంగా వలయు మానృపాలుఁడు తరణీ!

165


చ.

అనవుడు నవ్వరం బొసఁగి యంబుజమిత్రుఁ డదృశ్యుఁ డైన న
జ్జనులు మనంబు లుత్సవరసంబునఁ దేలఁగ నేఁగి మానినీ
వనితయుఁ దాను నున్నజనవల్లభునిం దగఁ గాంచి తారు వో
యినవిధము న్రవిం గొలిచి యిష్టవరోన్నతి గన్నచందమున్

166


క.

మానుగఁ జెప్పిన విని యమానిని యానంద మొందె మానవనాథుం
డాననము వంచి యొకవడిఁ, దా నూరక పలుకకుండెఁ దద్దయుఁ జింతన్.

167

రాజ్యవర్ధనునికి మానినికి నాయుర్వృద్ధినిమిత్త మగుసంవాదము

క.

చింతాక్రాంతుం డగునృప, కాంతున కక్కాంత యేమి కారణ మధిపా!
సంతోషవేళ వికల, స్వాంతుఁడ వై యిట్టు లున్నవాఁడ? వనుటయున్.

168


సీ.

మానవనాథుఁ డమ్మానిని వీక్షించి యక్కట! వీర లాయాస మంది
జేసి యిది యేమి వేఁడిరి పదివేలువర్షము ల్బ్రదికి యుండి
మిత్రబాంధవపుత్రపౌత్రకళత్రాదు లందఱు దివమున కరుగఁజూచి
యే నతిదీనత నేకాకి నై మను మనికియుఁ దా నొకమనికి యగునె?


తే.

యిట్టిజీవన మిది గాల్పనే యనేక, దుఃఖములె కాక యిందు సంతోష మెద్ది?
యింతయును నాత్మ నరయక యింతి? నీవు, మేలు మే లని పల్కెదు బేల వగుచు.

169


వ.

అనిన నద్దేవి యనియె యానతిచ్చి, నట్టు లంతయు నిజము
యరయ కంటి దివాకరువరము దప్ప, దింక నిటమీఁదఁ గర్తవ్య మేమి చెపుమ.

170


వ.

అనిన నమ్మహీవల్లభుండు వల్లభ కి ట్లనియె.

171


క.

పౌరులు భృత్యులు నా కుప, కారం బొనరించి యుండఁగా నక్కట! నే
వారలకు మే లొనర్పక, యూరక భోగములఁ దగిలి యుండం దగునే!

172


సీ.

కావున నిప్పుడ కదలి యే నమ్మహీధరమున కరిగి యత్యంతభక్తి
భానునిగుఱిచి తపం బాచరింపఁగ నతఁడు ప్రసన్నుఁడై యరుగుదెంచి

మానిని! నీకును మనభృత్యతతికిఁ బౌరులకును బుత్త్రపౌత్త్రులకుఁ గూడఁ
బదివేలువర్షము ల్బ్రదుకంగ వరము నా కిచ్చినయట్టులు యిచ్చెనేని


ఆ.

యింపు సొంపు మిగుల నిందఱతోఁ గూడ, నఖిలరాజ్యసుఖము లనుభవింతు
నట్లు గాక యున్న నచ్చోన నిలిచి య,య్యుగ్ర కిరణుఁ గొల్తు నుగ్రనియతి.

178

భాస్కరు నారాధించి రాజ్యవర్ధనుఁడు తనజనులను దీర్ఘాయుష్మంతులఁ జేయుట

చ.

అన విని యింతి! నీ వరుగ నక్కట! యిక్కడ నేను నిల్తునే?
యనుడు ధరాధినాథుఁడు ప్రియం దగఁ దోడ్కొని వేడ్క నత్తపో
వనమున కేఁగి యందు దినవల్లభు వేదమయాత్ము నిత్యు నా
త్మ నిలిపి భక్తియుక్తి సతతంబు తపం బొనరించుచుండఁగన్.

174


ఉ.

మానవతీవరేణ్య యగుమానినియుం బ్రియుతోడ నెండకు
న్వానకు సంచలింపక దివాకరునంద మనంబు నిల్పి త
ధ్యానపరాయణత్వమునఁ దాను దపం బొనరించె నాత్మలో
నూనినభక్తి సంతతము నున్నతిఁ బొందఁగ మేను డయ్యఁగన్.

175


క.

భూరమణుఁడు సతియు నిరా, హారు లగుచు నిట్లు సార్ధహాయనము మహా
ఘోర మగుతప మొనర్చిన, వారికిఁ బ్రత్యక్ష మై దివాకరుఁడు దయన్.

176


క.

కర మెలమిఁ గోరినట్టుల, వరము ప్రసాదించి, చనిన వనితయుఁ బతియు
న్బరమానందముఁ బొందుచు, నరిగిరి తమపురికి భూసురాన్వయముఖ్యా!

177


మ.

చని యాభూపతి తాను భార్యయుఁ బ్రజాసందోహము న్పుత్త్రపౌ
త్త్రనికాయంబును బంధువర్గము నమాత్యశ్రేణియు న్నిత్యశో
భనలీల న్విగతామయత్వము జరాభారవ్యపేతక్రమం
బును నొప్ప న్బదివేలువర్షములు పెంపుం బొంది పొల్చెం గడున్.

178


మ.

క్రతువు ల్సేయుచు విప్రవర్గముఁ గృతార్థత్వంబు నొందించుచు
న్ప్రతిపక్షావళి నోర్చుచు న్సుకృతము ల్పాలించుచు న్మానినీ
సతియు న్దాను ననూనయోగవిలసత్సౌఖ్యంబుల న్బొందుచు
న్క్షితి యేలెం దగ రాజ్యవర్ధననృపశ్రేష్ఠుండు సద్వృత్తుఁడై.

179


వ.

అమ్మహీపతిచరిత్రంబు సమస్తంబు సవిస్తరంబుగా విని భృగువంశవరేణ్యుం డగు
ప్రమతి విస్మయావిష్టహృదయుం డై యి ట్లనియె.

180


తే.

ఇనునిమహిమసొం పిటు లుండు నే? తలంప, నధికభక్తిమై నమ్మహితాత్ముఁ గొలిచి
యాయురారోగ్యసత్త్వమహత్త్వరాజ్య, వర్ధనుం డయ్యె నారాజ్యవర్ధనుండు.

181


వ.

అని కొనియాడె నని చెప్పి మఱియు మార్కండేయుండు.

182


ఆ.

ఆదిదేవుఁ డైనయాదిత్యుమాహాత్మ్య, మెవ్వ రధికభక్తి యెసఁగ విందు
రట్టియుత్తములకు నాయురారోగ్యాది, సకలకామములును సంభవించు.

183

వైవస్వతమనుసంతతికథనప్రారంభము

వ.

ఈదృగ్విధప్రభావుం డగువిభాకరునకు సర్వార్థప్రదర్శనుం డైనవైవస్వతుండు
సప్తమమను వై జన్మించె నతనికిఁ బుత్త్రు లిక్ష్వాకుండును నరిష్యంతుండును గరూ
షుండును వృషధ్రుండును నాభాగుండును ధృష్టుండు ననువార లావిర్భవించి
శస్త్రాస్త్రపారగులును వివిధవిద్యావిశారదులును బలపరాక్రమవంతులును వినిర్మల
స్వాంతులును దిగ్భరితకీర్తులును సౌమ్యమూర్తులును బ్రత్యేకరాజ్యరక్షాదక్షు
లును వినిర్జితప్రతిపక్షులును ననం జాలి యుల్లసిల్లి రమ్మనువు వెండియు సుగుణ
సుందరుం డగునందనుం బడయం దలంచి మిత్రావరుణుల నుద్దేశించి యొక్క
యధ్వరం బాచరించిన నందు హోతృక్రియావైకల్యంబునం జేసి యిలాభిధాన
యొక్కకన్య ప్రభవించినం జూచి యతండు మిత్రావరుణులం దలంచి ప్రస్తవ
పూర్వకంబుగా ని ట్లనియె.

184


ఉ.

కడుభక్తి న్మిముఁ గొల్చి మీదయఁ ద్రిలోకఖ్యాతు సత్పుత్త్రు నేఁ
బడయం గోరఁగఁ గూఁతు రిప్పు డుదయింపం బాడియే యిప్పు డీ
పడఁతిం పుత్త్రునిఁజేసి మీ దగుకృపాప్రావీణ్యముం బెంపు నే
ర్పడ నాకోరిక మూరిఁబోవఁగఁ గృతార్థత్వంబు నొందింపరే.

185


వ.

అని ప్రార్థించినం బ్రసన్ను లై వా ర ట్లనుగ్రహించిన.

186


క.

ఇల యనునభిధానంబునఁ, బొలిచిన యక్కన్య యపుడు పురుషుండై తా
నిలుఁ డన సుద్యుమ్నుం డన, వెలనె న్ధారుణి ననంతవిశ్రుతమహిమన్.

187


క.

ఆసుద్యుమ్నుఁడు మృగయా, వ్యాసక్తి నుమేశుఁ డున్న వనమధ్యమునం
దాపవ యెఱుఁగక తిరుగఁగ, నాసురముగ నలిగి రుద్రుఁ డాతనితోడన్.

188


తే.

మగువ వై యుండి పడసిన మగతనంబు, మెఱయ నిటు వచ్చినాఁడవే మేలు మేలు
దుర్మదాంధ! యీమద మేల తొంటియట్ల, పొలఁతి నగుమన్న నతఁ డప్డు పొలఁతి యయ్యె.

189


ఉ.

ఆయిలయందు సోమసుతుఁ డైనబుధుండు పురూరవు న్గుణ
శ్రీయుతుఁ జక్రవర్తి నధరీకృతభాస్కరతేజుఁ గాంచెఁ దా
నాయిల యశ్వమేధసవనాచరణంబునఁ బుంస్త్వవిస్ఫుర
త్కాయము దాల్చి విస్మయముగా నిలుఁ డై విలసిల్లెఁ గ్రమ్మఱన్.

190


తే.

తనయు లమ్మహీపతికి నుత్పలుఁడు గయుఁడు, వినతుఁడును నాఁగ మువ్వు రావిర్భవించి
బహువిధాధ్వరకర్తలు బాహువీర్య, యుతులు నై లీలఁ బాలించి రుర్వి యెల్ల.

191

సీ.

ఇంతి యై యున్ననాఁ డిలుఁడు గాంచినసూనుఁ డాపురూరవుఁ డంత నరుగుదెంచి
ధర కొంత పంచి యీఁ దగు నాకు నావుడు నవ్వసిష్ఠుండును నట్ల చేయు
మని బుద్ధిగా నొత్తి తనకుఁ జెప్పిన విని యిలుఁ డట్ల కా కని యిచ్చగించి
యఖిలసుఖాస్పదం బగు ప్రతిష్టానపురంబున కాతని రాజుఁ జేసె


తే.

నందు సుఖలీల నతఁడు రాజ్యంబు సేయు, చుండె ననఘ! యయ్యిలుని సముద్భవప్ర
కార మిట్టిది యని చెప్పి గారవమున, నమ్మహాముని క్రోష్టుకి కనియె మఱియు.

192

వృషధున కావును జంపుటచే శాపము కలుగుట

క.

మనుతనయుండు వృషధుం డనయము మృగయాభిరక్తి నటవీస్థలికిం
జని యందుఁ గలయఁ గ్రుమ్మరి, ఘనాతపనిపీడ్యమానగాత్రుం డగుచున్.

193


క.

మృగము దన కొకటి యేనియు, నగపడమింజేసి యాత్మ నత్యంతము నె
వ్వగ మిగుల నొక్కరుండును, మగుడం గా వచ్చి వచ్చి మార్గముక్రేవన్.

194


వ.

ఒక్కమునిహోమధేనువుం గని గవయం బసుబుద్ధిఁ జేసి యేసిన బాణహతి
గతప్రాణయైన దాని నిరీక్షించి తద్రక్షకుం డగుబాభ్రవ్యుం డనుమునికుమా
రుండు నితాంతామర్షకలుషితస్వాంతుండును నారక్తనేత్రుండును బ్రస్వేదపరి
షిక్తగాత్రుండును నై యున్నం జూచి వృషధుం డి ట్లనియె.

195


తే.

కారణం బేమి యింత యాగ్రహముఁ బొందఁ?, గరుణమైఁ బ్రసన్నుండవు గమ్ము శూద్రుఁ
డైనఁ గా కెందు క్షత్రియుఁ డైన వైశ్యు, డైన నిట్టు తీవ్రక్రోధుఁ డౌనె చెపుమ.

196


తే.

పరమపావన మై యొప్పు బ్రాహ్మణాన్వ, యమున నెట్టులు పుట్టితో యకట! శూద్ర
జాతి వగుదు నీ వనుఁడు రోష ప్రపూర్య, మాణమానసుఁ డగుచు నమ్మౌనిసుతుఁడు.

197


వ.

అన్నరేంద్రున కి ట్లనియె.


తే.

గురునిధేనువు వధియించి కొంకు లేక, నన్ను శూద్రుఁడ వనుచు బన్నములు పలికి
తట్లు గావున నీవు విద్యాప్రభావ, మడఁగి శూద్రుఁడవే యగు మని శపించె.

199


వ.

అట్లు శపియించిన.

200


క.

అతఁ డతిరోషోద్ధతుఁడై, ప్రతిశాపం బిచ్చె నంత బాభ్రవ్యుఁడు నా
క్షీతిపతిఁ బొలియింపుదు నని, యతికోపనుఁ డైన నెఱిఁగి యాక్షణమాత్రన్.

201


వ.

తజ్జనకుం డైనయగ్నిశూలిసంయమి యెఱిఁగి యిద్ధేనువును వధించెనేని తనకర్మం
బునం దాన నిహతుం డయ్యెడు నజ్ఞానంబునం జేసిన నతని మూఢత్వంబు విచా
రించి సహించుట లెస్స గావున శాపం బప్రదేయం బని బోధించుచున్న నమ్మహీ
పాలకుండు మునిబాలకునకు సవినయంబుగా నిట్లనియె.

202


క.

నీగురునిహోమధేనువు, నే గవయం బని తలంచి యేసితిఁ గరుణా
సాగర! కరుణింపుము మది?, నేగతి మోసంబు లేదె యెవ్వరి కైనన్?

203

సీ.

అని యిట్లు నిభృతుఁ డై యాడినవాక్యంబు విని కరుణించి యమ్మునికుమారుఁ
డానరేంద్రునిఁ జూచి యే నెట్లు పలికితి నది యట్ల కాక తప్పదు మహీశ!
యెన్నఁడుఁ గావున నిచ్చినశాపంబు కుదియింప నెమ్మెయిఁ గొలఁది గాదు
కర మల్గి యిప్పు డీఁ గడఁగినశాపంబు పరిహరించితి నని పలికె నంత


తే.

నతనిఁ దోడ్కొని మౌని నిజాశ్రమమున, కరిగె శూద్రత్వముఁ బొందె నావృషధ్రుఁ
డనఘ కారూషుఁ డనఁగఁ బ్రఖ్యాతుఁ డైన, మనుతనూభవుఁ డేడ్వురఁ గనియె సుతులు.

204

కన్యకై నాభాగునకు వైశ్యునకును సంవాదము

వ.

వారలును గారూషు లనుపేర నారూఢు లైరి తత్సంతానంబు శతసహస్రసంఖ్యలం
బ్రవర్తిల్లె మఱియు మనుపుత్త్రుం డైనధృష్టునకు సమాచరితజనానురాగుండు
నాభాగుం డనుతనయుం డుదయించి నూత్నయౌవనోల్లాసభాసమానుండు వివిధ
విహారపరాయణుండు నై చరియించుచు నొక్కనాఁ డొక్కవణిక్కన్య ననన్య
సామాన్యరూపాభిశోభిత యవుదాని నభివీక్షించి తదాసక్తచిత్తుం డై చేతోజాత
శరాహతి కోర్వక యేకాంతంబున నక్కాంతగృహంబునకుం జని తజ్జనకున కి
ట్లనియె.

205


తే.

చారుతరరూపమహిమఁ బెంపారునీత, నూజఁ గనుఁగొని యేను మనోజబాణ
దళితహృదయుండ నైతి సంతసము మిగుల, నత్తలోదరి నాకు నిమ్మనుడు నతఁడు.

206


తే.

ఇల సమస్తంబు నేలు రాజులరు మీర లధిప! యే మరి యప్పన మచ్చి భృత్య
మాత్ర వర్తించు పేదకోమటుల మిట్టి, మనకు సంబంధ మెమ్మెయి నొనరుఁ జెపుమ.

207


వ.

అనిన నాభాగుండు.

208


క.

కలవారు పేదవా రనఁ, గలదే భోగముల సరియ కాక తలఁప దే
హుల కెల్ల నేల చెప్పెదు?, వలదని పరిహార మిట్లు వైశ్యవరేణ్యా!

209


సీ.

నావుడు వైశ్యుండు నాభాగుఁ గనుఁగొని యేను స్వతంత్రుండనే కుమార!
నీవును నాయట్ల కావున మన కెల్ల నొడయండు మీతండ్రి యున్నవాఁడు
చని యమ్మహారాజుననుమతి వడసి ర మ్మట్లైన సుత నిత్తు ననుడు నాతఁ
డీపని గురున కే నే మని చెప్పుదు మానుము నీ వెడమాట లనిన


ఆ.

నపుడు నగరి కరిగి యవ్వణిజుండు భూవిభున కంత తెఱఁగు విన్నవించెఁ
బతియు బుద్ధిఁ జెప్పఁ బనిచె రుచీకాది, భూమిసురుల నంతఁ బుత్త్రుకడకు.

210

తండ్రియానతి నిరాకరించి నాభాగుఁడు కోమటికన్నెం బెండ్లాడుట

ఉ.

ఆయవనీసురు ల్నృపవరాత్మజుపాలికిఁ బోయి క్షత్త్రియ
న్యాయము దెప్పి మున్న వణిగన్వయకన్య వరింపఁ గూడునే

ధీయుత! నీవు నీదుమది దీనికిఁ బ్రేమము సేయు దేని భూ
నాయకపుత్రిఁ బెండ్లి యయిన న్జను దీని తగ న్వరింపఁగన్.

211


మ.

అని విప్రు ల్దగ నాడిన న్గనలి నేత్రాంతంబులం గెంపు గ
ప్ప నిశాతాసి కరంబున న్వెలుఁగ నాభాగుండు నవ్వైశ్యనం
దన కెంగేలు దెమల్చి యెవ్వఁ డయిన న్దప్పించిన న్మాన్పఁ జ
య్యన రా ని మ్మిదె యేను రాక్షసవివాహస్ఫూర్తిమై నేఁగెదన్.

212


వ.

అని పలికి యవ్వనితామణిం దోడ్కొని చనుటయు.

213


చ.

మదగజహస్తలగ్నలతమాడ్కిఁ గుమారునిచే గృహీత యై
నదళితపద్మపత్త్రనయనం దననందనఁ జూచి వైశ్యుఁ డా
ర్తి దనుకఁ జయ్యనం జని పతిం గని యంతయుఁ జెప్పెఁ జెప్పినం
త దనతురంగమాదిపృతనాతతిఁ బంపె నతం డుదగ్రుఁడై.

214


చ.

పనిచినయబ్బలంబులఁ గృపాణవిదారణమారణక్రియా
ఘనభుజలీలఁ గూల్చుటయు గ్రక్కున నెక్కుడువిక్రమం బెల
ర నిఖిలసైన్యయుక్తుఁ డయి రాజశిఖామణి దాను వీఁక మైఁ
జని నిజనందనుం బోదివి శస్త్రపరంపరఁ గప్పె నుగ్రుఁ డై.

215


ఉ.

కప్పిన నస్త్రశస్త్రముల ఖడ్గమునం దునుమాడి పీనుఁగుం
గుప్పలు గాఁగఁ గండ లొగిఁ గొండలు గా రుధిరంపుటేళ్లు గా
నిప్పులు కన్నులం దొరఁగ నిర్భరబాహుపరాక్రమంబు పెం
పొప్పఁగ నక్కుమారవరుఁ డుక్కున సేనలఁ ద్రుంచెఁ ద్రుంచినన్.

216

పరివ్రాజుఁ డనుముని ధృష్టనాభాగుల యంద్ధ ముడిగించుట

చ.

జనకుఁడు పుత్రబాహుబలసంపదకు న్వెఱఁ గంది యుండ స
న్ముని యొకరుండు భూవరునిముందటికి న్దివినుండి వచ్చి యి
ట్లనియె నరేంద్ర వీఁ డతిదురాత్ముఁడు కయ్యము నీవు మాను వై
శ్యునితనయ న్వరించినయశోధనుఁ డీతఁడు నీకు యోగ్యుఁడే?

217


వ.

బ్రాహ్మణక్షత్త్రియవైశ్యులు నిజవర్ణంబులకన్నియల మున్ను పరిగ్రహించి మఱి
తమతమదిగువకులంబులయంగనల వరియించుట శాస్త్రచోదితం బట్లు గాక
తొలుత హీనజాతి యగునాఁతిం బెండ్లి యయినయుత్తమవర్ణుం డాహీనజాతి
యగుం గావున నిప్పు డింతకు వైశ్యాపరిగ్రహంబునం జేసి వణిజుం డయ్యె శుద్ధ
క్షత్రియుండ వైన నీ కతనితోడియుద్ధం బనర్హం బని యమ్మునివరుం డరుగుటయు.

218

వైశ్యకన్యం బెండ్లాడుటచే నాభాగుఁడు వైశ్యుఁ డగుట

క.

తనయునితో సంగరమున, వినివర్తితుఁ డయ్యె నిట్లు విభుఁ డానృపనం
దనుఁడును గోమటికన్నియ, ననురక్తిం బెండ్లి యయ్యె నంత మునీంద్రా!

219

వ.

వణిక్కన్యాస్వీకారంబున వైశ్యత్వంబు నొంది తండ్రి కడకుం జని నరేంద్రా! నాకె
య్యది కర్తవ్యంబు నిర్దేశింపు మనిన నిమ్మహీపతి ధర్మాధికరణనియుక్తు లైనబాభ్ర
వ్యాదిమునీంద్రులు నీ కెయ్యది ధర్మంబు గావించి రదియ నా చెప్పుట యనిన
నత్తపోధను లతనికిం బాశుపాల్యకృషివాణిజ్యంబులు ధర్మకర్మంబు లని చెప్పి
రారాజనందనుండునుం దదుపదేశమార్గంబున వర్తించుచుండె నంత.

220


తే.

అతని కుదయించె లోకవిశ్రుతుఁడు శౌర్య, ఖని భనందాఖ్యుఁ డాపుత్త్రు జనని పిలిచి
నీవు గోపాలుఁడవు గమ్ము నెమ్మితోఁడ, ననినఁ దల్లికిఁ బ్రణమిల్లి యాతఁ డరిగి.

221

నీపుఁ డనురాజర్షి వలన భనందుఁ డస్త్రము లెల్ల నార్జించి చేసిన శత్రువధాదికము

సీ.

హిమనగంబునఁ దపం బెలమిఁ జేసెడునీపురాజర్షివరుఁ గని ప్రణతుఁ డైన
నతఁడు నీరాకకుఁ గత మేమి యెఱిఁగింపు ధర్మజ్ఞ! యన్న మాతల్లి నన్ను
గోపాలకుండ వై దీపింపు మనవుడు గో వెప్పు డొకొ సమకూరు నాకుఁ
బ్రబలదాయాదులు పాలించుచున్న యీగోరూప యగుభూమిఁ గొన వశంబె


తే.

యని తలఁచి వచ్చితిని నిను నాశ్రయింప, నను నృపాలునిఁ జేయవే మునివరేణ్య!
నుతగుణాకర! కరుణామనోజ్ఞ! నీవు, పనిచినట్ల చేసేద నతిభక్తితోడ.

222


చ.

అని యెఱిఁగించిన న్విని దయామతి నమ్ముని యస్త్రవిద్య లె
ల్ల నొసఁగిన న్భనందుఁడు చెలంగుచు నిశ్చలభక్తియుక్తి నా
తనికి నమస్కరించి ప్రమదంబున వీడ్కొని యేఁగి శౌర్యధు
ర్యునిఁ దమపిన్నతండ్రితనయు న్వసురాతుని గాంచి యి ట్లనున్.

223


క.

పితృపైత్రామహ మగునీ, క్షితి యంతయుఁ జక్క సగము చెచ్చెర నా కి
మ్మితరునిఁ గా ననుఁ జూడకు, ధృతి నీ నని బిగిసి తేని తెగి ర మ్మనికిన్.

224


క.

అనవుడు వసురాతుఁడు వైశ్యునికొడుకవు భూమి యేల యోగ్యుఁడవే నీ
వనుచుఁ గడు నలిగి సంగర, మునకు వెడలె సకలసైన్యములు తో నడువన్.

225


మ.

వసురాతుండు భనందుఁడు న్భుజబలావష్టంభము న్విక్రమో
ల్లసనంబుం జలముం బలంబు రణలీలాస్ఫూర్తియుం జాల నొ
ప్పెసఁగం బోరిరి చూచుఖేచరులు కిం పెక్కంగ దివ్యాస్త్రశ
స్త్రసముద్భూతమహోగ్రదీప్తు లఖిలాశాభిత్తులం బర్వఁగన్.

226


తే.

భూరిదివ్యాస్త్రవైభవస్ఫూర్తి మెఱయఁ, గా భనందుఁడు వసురాతుఁ గదనమందు
సానుజుని నోర్చి సకలరాజ్యమును లీలఁ, గొని ముదంబునఁ జని జనకునకు మ్రొక్కి.

227


క.

దాయాదుల నే సమర, న్యాయంబున గెలిచికొంటి నవనీరాజ్య
శ్రీ యెల్ల దీనిఁ జేకొను, మాయతభుజశౌర్య! యనుడు నతఁ డాత్మజునిన్.

228


చ.

కనుఁగొని ప్రీతి ని ట్లనియెఁ గాంత వినంగ భనంద! యిప్పు డే
మనుజవిభుత్వముం దొఱఁగి మానుగ వైశ్యత నొందినాఁడ మ

జ్జనకుని యాజ్ఞఁ జేసి నృపసత్తమ! యట్లును గాక నీవు నీ
యనుజుల నోర్చి కొన్న మహితావనిరాజ్యము నాకు నేటికిన్?

229

నాభాగునితో సుప్రభ చెప్పిన తనజనకునిపూర్వజన్మవృత్తాంతము

క.

అనుపతిపలుకులు సుప్రభ, విని నవ్వుచు నతని కనియె విను వైశ్యత్వం
బునఁ బొంద వీవు వైశ్యుని, తనయను గా నేను నివ్విధం బె ట్లన్నన్.

230


క.

ఘనుఁడు సుదేవుం డనునొక, జనపతి యింతులును దాను సఖుఁ డగుధూమ్రా
శ్వునిసుతుఁడు నలుఁడుతోడం, జనుదేరఁగ లీలఁ గేలి సలిపెడువేడ్కన్.

231


వ.

ఆమ్రవనంబునకుం జని మధుపానమదాయత్తచిత్తు లై విహరించుచుండ నన్న
లుం డవ్విపినంబునం దపోవృత్తిఁ జరియించు ప్రమతి యనుమునిభార్యం గనుంగొని.

232


తే.

కామరాగాంధచిత్తుఁ డై కదిసి బలిమిఁ, బట్టికొనుటయుఁ దలఁకి యాపద్మనయన
యంట కంటకు మోరి దురాత్మ! యేను, భూసురాంగన ననుచు వాపోవుటయును.

233


వ.

ప్రమతి యయ్యెలుంగు విని పఱతెంచి.

234


తే.

నలునిచేఁ బట్టువడి మదనాగకరగృ, హీత యగుకల్పలతమాడ్కి నెంతయును భ
యమున నల్లాడుచున్నట్టి యతివఁ గాంచి, కనలి యాసుదేవునకు ని ట్లనియె ననఘ!

235


సీ.

పరదారహరణైకపరుని నికృష్టాత్ము ధరణీశ! దండింపఁ దగదె నీకు?
ననవుడు నవ్వుచు నతఁ డేను వైశ్యుండ రక్షణక్షముఁ డైన రాజుకడకుఁ
జను మని గేలి చేసినఁ గ్రుద్ధుఁ డై ముని యధిప! నీపలికినయట్ల కరముఁ
గుచ్చితం బైనట్టికోమటికులమున జన్మింపు మీ వని శాప మిచ్చి


ఆ.

కన్నుఁగడల నశ్రుకణములు రాలంగ, నలునిఁ జూచి యోరి నాదుభార్య
బలిమిఁ బట్టికొనినపాపాత్ముఁడవు గాన, నిమిషమాత్రమునను నీఱు గమ్ము.

236

నలుని శాపాగ్నిదగ్ధుఁ గావించి యాచించుసుదేవునిఁ బ్రమతి రక్షించుట

వ.

అని శపించిన నలుండు నిజశరీరజనితానలంబున భస్మం బగుటయు సుదేవుండు
భయంబునం దల్లడిల్లి భార్గవునకుం బ్రణమిల్లి మహాత్మా! మదిరాపానమదాతిరే
కంబునం జేసి నాపలికినపలుకు సహింపుము కోపం బుపసంహరింపుము నీయిచ్చిన
శాపంబు గ్రమ్మఱింపు మని ప్రార్థించిన నమ్మునివరుండు ప్రసన్నుం డై యతని
కి ట్లనియె.

237


క.

నీ ఱైననలునితోడన, యాఱె మదీయోగ్రరోష మవనీశ్వర ! నీ
వేఱిఁడితనమున వచ్చిన, కాఱియ పడఁకేల పోవఁగా నగు నీకున్?

238


వ.

నావచనంబు తప్ప దవశ్యంబును నీవు వైశ్యుండ వై పుట్టు దాపుట్టువునందు
నీకూఁతును క్షత్త్రియుం డెప్పుడు బలిమిం బరిగ్రహించు నప్పుడె వైశ్యత్వంబును
బాసి శుద్ధక్షత్త్రియుండ వగుదు వని యనుగ్రహించె నది కారణంబుగా సుదే
వుండు మజ్జనకుండు వైశ్యుం డై జన్మించె నాజన్మప్రకారం బాకర్ణింపుము.

239

నాభాగునికి సుప్రభ చెప్పినతనపూర్వజన్మవృత్తాంతము

ఆ.

అధిప తొల్లి సురథుఁ డనియెడి రాజర్షి, గంధమాదనమునఁ గరము నెమ్మి
నుండె నియతభోజియును నసంగుండు నై, ప్రీతి దపమునందుఁ బ్రిదుల నీక.

240


వ.

అ ట్లుండ నొక్కనాఁడు.

241


ఉ.

శ్యేనముఖంబునం బ్రిదిలి చెచ్చెర మేదినిఁ బడ్డశారిక
న్మౌనివరుండు గన్గొని సమగ్రకృపారతిఁ జొక్కి తేఱుచో
నేను దదంగయష్టి జనియించినఁ జూచి మదిం గృపాక్రియా
ధీనుఁడ నైనచో నిది మదీయతనూద్భవ యయ్యెఁ గావునన్.

242


క.

ఈరమణి కృపావతి యను, పేరం బరగు నని పలికి ప్రేమముతోడ
న్గారా మారఁగఁ బెనిచిన, నారాజర్షీంద్రుచేత నభివర్ధిత నై.

243


వ.

వయోరూపగుణంబుల నాకు సదృశు లైనసఖులతోడం గూడి యాడుచు
నొక్కనాఁ డగస్త్యమునితనయుం డైనజాతాగస్త్యునాశ్రమంబునకుఁ జని విహ
రించుచున్నంత.

244


చ.

వినుము నరేంద్ర! నాసఖులు వేడ్క విశృంఖలలీల నవ్వన
మ్మున విహరింపఁ జొచ్చినఁ దపోధనసత్తముఁ డాగ్రహించి న
న్గనుఁగొని నీవయస్యలవికారమున న్జనియింపు వైశ్య వై
వనజదళాక్షి నీ వని యవారణ నమ్ముని శాప మిచ్చినన్.

245


వ.

కళవళించి యే నమ్మహామునికి నమస్కరించి యంజలి యొనరించి యి ట్లంటి.

246


క.

మునివల్లభ! యే నొకయె, గ్గొనరించిన యదియుఁ గలదె యొరు లపరాధం
బొనరించి యుండ నీకుం, జనునే శపియింప నన్ను శాంతిప్రవణా!

247


వ.

అనిన నతం డి ట్లనియె.

248


ఆ.

పంచగవ్యపూర్ణభాండంబు మధుకణ, స్పర్శనమున నశుచిభావ మొందు
నట్లు దోషరహిత వయ్యును దుష్టసం, గతి లతాంగి! దోషకలిత వైతి.

249


వ.

అని మఱియును బ్రణత నై యేను బ్రార్థించిన నమ్మునీంద్రుండు.

250


సీ.

తరుణి! నావచనంబు తప్పదు కోమటిపొలఁతి వై పుట్టుదు పుట్టి రాజ్య
మునకు నైయని సేయఁ దనయుని నెపుడు నియోగింతు ని న్నపు డొందుఁ జుమ్మి
జాతిస్మరత్వంబు క్షత్త్రియజాతుల రగుదురు నీవు నీమగఁడు నంత
నని నా కనుగ్రహ మొనరించె నామునివరుఁ డివ్విధంబున వైశ్య నైతిఁ


తే.

దండ్రియును నేను నవ్వణిక్త్వమును దొఱఁగి, యత్తపోధనులయనుగ్రహమున నిపుడు
క్షత్త్రజాతుల మైతిమి గానఁ బాసె, వైశ్యభావంబు నీకును వసుమతీశ!

251


క.

అనిన సతిపలుకు లేర్పడ, విని నాభాగుండు కొడుకు వీక్షించి భవ

జ్జననివచనములు నిజ మైనను జెప్పెద నీకు విను జనస్తుతచరితా!

252


ఆ.

తండ్రియాజ్ఞ నేను దలకొని రాజ్యంబు, విడిచి యిట్లు వైశ్యవృత్తి నున్న
వాఁడ నొల్ల నిక వసుధాధిపత్యంబు, నకును దఱమ కుడుగు నరవరేణ్య!

253


వ.

సకలమహీరాజ్యంబును నేను నీ కిచ్చితి నుపభోగింపు మొల్ల వైతి వేని విడిచి
పొ మ్మనిన నెట్టకేలకు నొడంబడి తండ్రిచేత ననుజ్ఞాతుండై పూజ్యం బగు
సామ్రాజ్యంబు గైకొని దారపరిగ్రహం బొనరించి ధర్మమార్గంబునం బ్రజాపరి
పాలనంబుఁ జేయుచు వివిధాధ్వరంబు లాచరించుచుఁ జతురుదధివలయితవసుంధ
రావలయంబునకుం దానొక్కరుండ యధీశ్వరుండైన నమ్మహారాజునకు వత్సంధుం
డనుపుత్త్రుం డుద్భవించె నవ్వీరుండు విదూరథుం డనురాజుకూఁతు సునంద
యనుకన్యం గుజంభుం డనుదనుజుండు పట్టుకొని చనిన నద్దానవుం దెగటార్చి
దాని వరియించె ననిన విని కోష్టుకి తద్వృత్తాంతం బంతయు నా కెఱింగింపవే
యనిన మార్కండేయుండు.

254

విదూరథునితో సువ్రతుఁ డనుముని చెప్పిన కుజంభముసలవృత్తాంతము

సీ.

వినుము విదూరథుం డనుపృథివీశుండు సుమతిసునీతులు సుతులు దాను
నడవికి మృగయార్థ మరిగి యం దొక్కెడ ధర నోరు దెఱచినకరణిఁ జూడ
ఘన మైనవివరంబు గని భయం బడరంగ నిది యేమియో యని మదిఁ దలంచి
పాతాళబిలముగా భావించి యీక్రొత్తగహ్వరం బిల నెట్లు గలిగె నొక్కొ!


తే.

యనుచు నన్నరేంద్రుఁ డయ్యెడ సువ్రతుఁ, డనుమునీంద్రుఁ గాంచి యనఘ! పుడమి
కడుపులోఁతు చూపువడువున ని ట్లున్న, దీనితెఱఁగు నాకుఁ దెలియఁ జెపుమ.

255


చ.

అనిన మునీంద్రుఁ డి ట్లను జనాధిప! యిత్తెఱ గీ వెఱుంగవే?
విను దనుజుం డొకం డతులవీర్యఘనుం డతలస్థుఁ డై కుజం
భనపరతం గుజంభుఁ డనుభైరవనామము దాల్చి భూతల
మునఁ ద్రిదివంబునందుఁ గలభూరిసువస్తువు లాహరించుచున్.

256


వ.

విశ్వకర్మ నిర్మించినసునందం బనుముసలంబు పుచ్చికొని దాన నరిభంజనం బొనరిం
చుచుఁ బాతాళంబుననుండి భూమికిఁ దూఁటులు పుచ్చి రాక్షసులకు వెలువడ
ననేకద్వారములు గావించుచుండు నిమ్మహావివరం బమ్మహాసురునిచేతం జేయఁబడి
నది యని చెప్పి.

257


క.

క్రతువిధ్వంసియుఁ ద్రిదశ, స్థితినాశకరుండు నైనదితిజుని ముసలా
న్వితహస్తుని భంజింపక, క్షితివర! భూరాజ్య మెట్లు చేసెదు చెపుమా?

258


ఆ.

అతలమునకు నరిగి యమ్ముసలాయుధు, నతులశౌర్యధుర్యు నతిరయమున
నాజి నోర్చి యేలు మఖిలంబు నీపర, మేశ్వరత్వ మెల్ల నెఱుక పడఁగ.

259


వ.

వానికిఁ బరమసాధనం బైనముసలంబుబలాబలంబులతెఱం గెఱింగిం చెద విను మది
వనితాకరస్పర్శంబున నొక్కదినంబు నిర్వీర్యత్వంబు నొంది మఱునాఁడు వీర్య

వంతంబగు నద్దురాచారుం డవ్విధం బెఱుంగఁ డింతయు నెఱింగించితి నెట్లు వోలు
న ట్లనుష్ఠింపు మని యమ్మునివరుండు చనియె నంత నమ్మహీపతియుఁ బురంబున కరిగి.

260


ఆ.

ఆత్మమంత్రివరుల నందఱఁ బిలిపించి, తాను వినినతెఱఁగు దప్పకుండ
నాకుజంభువిధము నమ్ముసలప్రభా, వంబు తెలియఁజెప్పి వారి కపుడు.

261

కుజంభుని వధింప నేఁగినవిదూరథుసుతు లచట బద్దు లగుట

క.

ఆవసుధాపతితనయ ము, దావతి తండ్రికడ నుండి తద్విధ మెల్ల
న్దా వినియె నంత నొకనాఁ, డావెలఁదుక సఖులు దాను నారామమునన్.

262


వ.

విహరించుచుండం గుజంభుండు చనుదెంచి దానిం బట్టికొని చనుట విని కోపించి
యన్నరవరుండు కొడుకుల నాలోకించి మీరు సమస్తసైన్యసమన్వితుల రై యరిగి
నిర్వింధ్యాతటగర్తముఖంబునం బాతాళంబునకు డిగ్గి యన్నిశాటునిం గీటడఁ
గించి ముదావతిం దోడ్కొని రం డని పనుచుటయు.

263


చ.

సుమతియు నాసునీతియును శూరత సొం పెసలార సర్వసై
న్యములుకు దోడ రా నరిగి యవ్వివరంబున నారసాతలం
బు ముద మెలర్పఁ జొచ్చి వడిఁ బోరిరి పేర్చి కుజంబుతోడ ఖ
డ్గముసలశూలశక్తిపరిఘప్రదరప్రముఖాయుధంబులన్.

264


చ.

దనుజుఁడు రాజనందనులదర్పము సైఁపక రోషదీప్తుఁ డై
తనఘనమాయఁ జేర్చి వెసఁ దద్బలముం దెగటార్చి యార్చి పా
రి నణఁగఁ బట్టి విక్రమధురీణత బద్ధులఁ జేసెఁ జేసినన్
విని మదిలో విదూరథుఁడు వెన్బడి దానవు నోర్వఁ జాలమిన్.

265


క.

దనుజు దునిమి యెవ్వఁడు నా, తనయుల విడిపించు నట్టిధరణీశ్వరనం
దనునకు నిచ్చెద నాసుత, నని పురిలోఁ జాటఁ బనిచె నతఁ డార్తుం డై.

266


వ.

ఇట్లు చాటం బనిచి తనబిడ్డల చెఱలు దలఁగునట్టివీరుం డెవ్వఁడును లే కున్న నిరా
శుండై యుండె నంత భనందసుతుండు వత్సంధుం డంతయు విని యతనికడ కరు
గుదెంచి యే నద్దానపు నిర్జించి నీకొడుకులం గూఁతుం దెచ్చెద నన్నుఁ బనుపు
మనిన నవ్విదూరథుండు హర్షించి నిజమిత్రపుత్త్రుం డైనయాశౌర్యధుర్యునిం
గౌఁగిలించుకొని దీవించి వీడుకొలిపిన నతండు.

267


తే.

అతినిశాతఖడ్గంబు బాణాసనంబు, లలితగోధాంగుళిత్రాణములు ధరించి
యమ్మహాముఖబిలమున నతలమునకు, నమితసైన్యముతోఁ జని యార్చుటయును.

268

వత్సంధ్రుండు కుజంభుని వధించుట

క.

దారుణ మగుతన్నాదం, బారాక్షసవరుఁడు విని మహాక్రుద్ధుండై
బోరన వెడలె బలమ్ముల, తో రణకౌతుక మెలర్ప దోర్దర్పమునన్.

269


శా.

ఆవత్సంధుఁడునుం గుజంభుఁడును శౌర్యస్ఫూర్తియు న్సంగర
ప్రావీణ్యంబుఁ బరస్పరాంగదళన ప్రౌఢత్వము న్భూరిబా

హావష్టంభము నుల్లసిల్లఁగ నితాంతామర్షు లై దందశూ
కావాసంబు చలింపఁ బోరిరి గుణవ్యాపారఘోరంబుగాన్.

270


వ.

ఇవ్విధంబున నయ్యిద్దఱు ఘోరయుద్ధం బొనరించి రప్పు డద్దనుజుండు నరేంద్ర
నందనుచేత నొచ్చి కోపించి యక్షతగంధపుష్పధూపార్చితం బై యంతఃపురం
బున నున్నముసలంబునకుం జని యంతకుమున్న యమ్మహనీయసాధనప్రభావంబు
ముదావతి యెఱింగినయది గావునఁ బూజావ్యాజంబున నిచ్చలుం దనకరంబున
నంటుటం జేసి నిర్వీర్యత్వంబు నొందినదానం బుచ్చికొని వచ్చి యరిబలంబుమీఁదం
బ్రయోగించినం దదీయపాతంబులు వ్యర్థంబు లగుటయు.

271


క.

వివిధాస్త్రశస్త్రముల న, య్యవనీశకుమారుతోడ నసుర గడంకం
బవర మొనరించె నయ్యిం, దువదనచే ముసల మట్లు దుర్బల మైనన్.

272


వ.

అంత.

273


మ.

అవనీనాథతనూజుఁ డద్దనుజు శస్త్రాస్త్రావలిం ద్రుంచిన
న్దివిజారాతి కృపాణముం గొని మదోద్రేకం బెలర్బంగఁ బైఁ
గవియం జూచి భనందనందనుఁ డుదగ్రక్రోధుఁ డై వానియ
క్కు వెస న్వ్రయ్యఁగ నేసె నుజ్జ్వలశిఖాఘోరానలాస్త్రంబునన్.

274


మహాస్రగ్ధర.

అనిలాస్త్రం బట్లు వక్షం బవియఁ గొనిన వీతాసుఁ డై యాజి గూలెన్
దనుజేంద్రుం డప్పు డత్యుత్సవమున ఫణభృద్ధామ ముల్లాసి యయ్యె
న్దనర న్గీర్వాణవాద్యధ్వనులు చెలఁగె గంధర్వగీతంబు లింపొం
ద నవోద్యత్పుష్పవృష్టి న్ధరణిపసుతమూర్ధస్థలం బొప్పె నంతన్.

275


క.

ఆవత్సంధ్రనృపుఁడు త, ద్భూవరుపుత్రులను గూఁతు భూరిప్రియసం
భావన బంధచ్యుతులం, గావించె భుజంగవరులు గడు వెఱఁ గందన్.

276


వ.

అప్పు డశేషోరగేశ్వరుం డైన శేషుండు కుజంభునిముసలంబు పుచ్చికొని ముదావతి
నిత్యంబును మనంబునం దన్ను నారాధించుచు సునందస్పర్శనం బాచరించుటం
జేసి ప్రసన్నుం డై దానికి సుసంద యనునామం బొనరించె నంత నారాజ
పుత్రుండు భ్రాతృసహితంబుగా సునందం దోడ్కొని తదీయజనకునికడ కరిగి
యతనికి నమస్కరించి యి ట్లనియె.

277


క.

జనవల్లభ! భవదాజ్ఞం, జని యద్దానవుని దునిమి శౌర్య మెసఁగ నీ
తనయురఁ గూఁతుం దెచ్చితి, నొనరింపుము ప్రీతి యెద్ది యుచితము దానిన్.

278

వత్సంధ్రుఁడు విదూరథపుత్రిక యగుముదావతిని బెండ్లాడుట

సీ.

అనిన విదూరథుం డానందరసభరితాతుఁ డై వత్సంధు నాదరమునఁ
గనుఁగొని వత్స! నీయనుపమశౌర్యంబు గొనియాడ నేరికిఁ గొలఁది యగునె!
యమరాదులకు నెల్ల నక్కుగొఱ్ఱైన కుజంభు భయంకరుఁ జంపి నాదు
బిడ్డలఁ దెచ్చినపెం పల్పమే యిట్టిఘను నిన్ను నల్లుఁడు గాఁగఁ బడసి


తే.

యేఁ గృతార్థుండ నైతి నరేంద్రతనయ, మత్తనూజ ముదావతి మదగజేంద్ర

యాన నిచ్చితి నీకు నయ్యతివఁ బెండ్లి, గమ్ము నను సత్యవాక్యుని గా నొనర్పు.

279


ఆ.

అనిన నక్కుమారుఁ డధిప నీపనిచిన, కరణి నడచువాఁడఁ గాక యిప్పు
డేను గార్యకర్త నే? యనుటయును బెం, పార నప్పు డవ్విదూరథుండు.

280


వ.

శుభముహూర్తంబున వత్సంధ్రముదావతులవివాహంబు చేసిన భనందనందనుండు
పరమానందంబున సునందాసహితంబుగా నిజపురంబున కరిగి.

281


క.

అతిముదమునఁ దాను ముదా, వతియును లలి నుపవనముల వనజాకరతీ
రతలములఁ గృత్రిమప, ర్వతముల మణిరుచిరహర్మ్యరమ్యస్థలులన్.

282


వ.

మనోహరవిహారంబు లొనరించుచుండి రంతఁ బెద్దకాలంబున భనందుండు జరా
క్రాంతుండై వత్సంధు నఖిలమహీరాజ్యభారధౌరేయుం గావించి తాను దపో
వనంబునకుఁ జనుటయు.

283


శా.

ఆవత్సంధ్రమహీశ్వరుం డతులరాజ్యశ్రీధురం దాల్చి తే
జోవిభాజితమూర్తి యై సమధికస్పూర్తిం బ్రజాపాలన
ప్రావీణ్యంబుం నొప్పెఁ దద్వసుమతీభాగంబు శోభిల్లెఁ జో
రావగ్రాహవిరోధిడాంబరభయవ్యాధివ్యపేతస్థితిన్.

284

ఆశ్వాసాంతము

ఉ.

వారవిలాసినీవదనవారిజమిత్ర! సమగ్రవిద్విష
ద్భూరుహవీతిహోత్ర! గుణభూషణభూషితగాత్ర! నిర్మలా
చారపవిత్ర! సూరివనచైత్ర! వివర్ధితగోత్ర! భూమిపం
కేరుహకేళిలోలసితకీర్తిరమేశ్వర! పూజితేశ్వరా!

285


క.

శరనిధిసమగాంభీర్యా, మరుదగనిభధైర్య! సతతమహితౌదార్యా
సురపురసదృక్ష కాకతి, నరపాలకకటకపాలనస్థిరశౌర్యా!

286


మాలిని.

నిరతగుణధురీణా! నీతివిద్యాప్రవీణా!
పరభయదకృపాణా! భామినీపంచబాణా!
స్ఫురితవివిధపుణ్యా! సూరిలోకాగ్రగణ్యా!
దలితరిపుశరణ్యా! దానకేళీవరేణ్యా!

287


గద్యము.

ఇది శ్రీమదుభయకవిమిత్ర తిక్కనసోమయాజిప్రసాదలబ్ధసరస్వతీపాత్ర
తిక్కనామాత్యపుత్ర మారయనామధేయప్రణీతం బైనమార్కండేయమహా
పురాణంబునందు దక్షసావర్ణి ధర్మసావర్ణి రుద్రసావర్ణి మనువుల సంభవంబులు
రౌచ్యమనూత్పత్తియు భౌత్యమనుజన్మంబును సూర్యునిప్రభవంబును బ్రభా
వంబును రాజ్యవర్ధనాఖ్యానంబును నిలునిపుట్టుటయుఁ బురూరవస్సంభవంబును
బృషధుడు శూద్రత్వంబు నొందుటయు ధృష్టపుత్రుండగునాభాగునకు
వైశ్యకన్యకకు భనందుం డుదయించుటయు దచ్చరిత్రంబును వత్సంధ్రచరిత్రం
బును ననునది సప్తమాశ్వాసము.