మారిషస్‌లో తెలుగు తేజం/మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు

మారిషస్ లో తెలుగు తేజం

ఒక్క సంగీతమేదో పాడునట్లు భా

షించు నప్డు విన్పించు భాష

విస్పష్టముగ నెల్ల విన్పించునట్లు స్ప

ష్టో చ్చారణంబున నొనరు భాష

రసభావముల సమర్పణ శక్తియందున

నమరభాషకు దీటైన భాష

జీవులలోనున్న చేవయంతయు చమ

త్కృతి పల్కులన్ సమర్పించు భాష

భాషలొక పది తెలిసిన ప్రభువు చూచి
భాషయన నిద్దియని చెప్పఁబడిన భాష
తనర ఛందస్సులోని యందమ్ము నడక
తీర్చి చూపించినట్టిది తెలుగు భాష

తెలుగుభాష సుమధుర మాధుర్యాన్ని సొగసైన ఇంపుసాంపుల్ని వర్ణిస్తూ కళ్ళకు కట్టినట్టు కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి హృదయాంత రాళాలలో నుండి వెలువడిన హృద్యమైన పద్యమది.

పంచదారకన్న -- పనసతొనలకన్న
కమ్మని తేనెకన్న -- తీయని తెలుగు మిన్న

అన్న భావన మన మదిని పులకరింప చేస్తుంది. వొడలు జలదరింప చేస్తుంది. తెలుగు అనగానే మన సంస్కృతి, మన జాతి ఔన్నత్యం, మన చరిత్ర ఒక్కసారి స్పురణకు వచ్చి ఏదో మధురానుభూతి మనల్ని ఆవహిస్తుంది. ఏవేవో దివ్యలోకాలకు ఆ అనుభూతి మనల్ని తీసుకుని వెళ్తుంది.

మనోభావాల్ని చక్కనైన రీతిలో ఎదుటివారికి వ్యక్తపరచటానికి భాష ప్రధానమైన వారధి అవుతుంది. తెలుగుభాషాపరంగా చూస్తే దానికి మహోన్నతమైన చరిత్ర వుంది.

ప్రాచీనమైన సాహిత్యం వుంది.

క్రీ.శ. 6వ శతాబ్దం నాటినుండి తెలుగులో శాసనాలు, 11వ శతాబ్దం నుండి సాహిత్య రచనలు లభ్యమవుతున్నాయి. రెండువేల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల తెలుగుభాషకు 'ఆంధ్రము, తెనుగు, తెలుగు అను మూడు పేర్లు వ్యవహారనామములుగా వర్ధిల్లుతున్నాయి.

11వ శతాబ్దం మధ్యలో చాళుక్యరాజైన రాజరాజనరేంద్రుని ఆస్థానంలో వున్న నన్నయ్య భట్టారకుడు రచించిన భారత భాగమే తెలుగున సలక్షణమైన ప్రధమాంధ్ర కావ్యము.

"శ్రీవాణి గిరిజా" అని మంగళప్రదముగ భారత రచనకు శ్రీకారం చుట్టి తెలుగుకు మొట్టమొదట కావ్యత్వ గౌరవాన్ని సంతరించిపెట్టి నన్నయ్య "ఆదికవి" అయినాడు. నన్నయ్య చూపిన కావ్యరచనా మార్గమే ఆ తర్వాత వారగు నన్నేచోడ, తిక్కన, ఎఱ్ఱన, శ్రీనాధ, పోతన, పెద్దనాది కవులకు మార్గదర్శకం అయినది. నాటినుంచి తెలుగు భాష బహుశక్తివంతమై సాహిత్యాన్ని పుష్టివంతం చేయసాగింది.

త్యాగయ్య, అన్నమయ్య, క్షేత్రయ్య, రామదాసులు తమ పద కీర్తనలలో తెలుగుకు క్రొంగొత్త వెలుగులు తెచ్చారు. వారి కీర్తనలలో సంగీత, సాహిత్యాలు సమపాళ్ళలో మేళవించబడి తాళయుక్తముగా తరుముకుంటూ నడిచి 'తెలుగు తీపి'ని పరభాషల వారికి రుచి చూపించాయి.

అందుకే శ్రీ రాయప్రోలువారు -

తన గీతి యరవ జాతిని పాటకులనుగా

దిద్ది వర్తిల్లిన తెనుగు వాణి'

అంటూ ప్రస్తుతించారు. తెలుగుభాషలోని మాధుర్యమూ, సారళ్యమూ అనే గుణాలు సంగీతానికి ఉపకరించి గానానికి అనుకూలించాయి.


నన్నయ్యనుంచి నారాయణరెడ్డి వరకు తెలుగు సాహిత్యం కాలానుగుణంగా పరిణితి చెందుతూ వచ్చింది. సుమధుర వాహినిగా. . పలురకాల ప్రక్రియల రూపానా తెలుగుభాష బహురూపాలను సంతరించుకుంది.

కన్నడ రాయడు, తెలుగు వల్లభుడు, శ్రీకృష్ణదేవరాయలు "దేశ భాషలందు తెలుగులెస్స" అని కీర్తించిన అపురూపమైన భాష తెలుగుభాష. పాశ్చాత్యులు తెలుగు భాషని "ఇటలీయన్ ఆఫ్ ది ఈస్టు" అని ఘనంగా కీర్తించారు. 

ప్రపంచాన ప్రసరించిన తెలుగు వెలుగు

1990 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు మాట్లాడే వారి సంఖ్య యితర రాష్ట్రాలలోనూ, యితర దేశాలలోనూ వున్నవారిని కలుపుకుంటే తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఆరు కోట్లు వుండొచ్చు. భారతదేశంలో హిందీ ప్రథమ స్థానం ఆక్రమిస్తే తెలుగు ద్వితీయ స్థానంలో వుంది. ప్రపంచ జనాభాలో భారతీయుల సంఖ్య ఆరవ వంతు అయితే భారతదేశ జనాభాలో ఆంధ్రుల సంఖ్య పదోవంతు వుంది

బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో చాలామంది తెలుగువారు యితర దేశాలకు కార్మికులుగానూ - కూలీలుగానూ తరలి వెళ్ళారు. అక్కడి వ్యవసాయం-పరిశ్రమల పెంపుదలకు శ్రమశక్తిని ధారపోస్తూ స్థిరపడటం జరిగింది.

మలేషియా, మారిషస్, బర్మా, శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఫిజీవంటి దేశాలకు అలా వలస వెళ్ళిన వారు అక్కడ రబ్బరు తోటల్లో, కాఫీ తోటల్లో, చెరుకు తోటల్లో, పారిశ్రామిక కేంద్రాల్లో పనిచేస్తూ కూడా తమ స్వభాషా, సంస్కృతీ, సంప్రదాయం పరిరక్షించుకునేందుకు తపిస్తూ ఆంధ్ర సంఘాలను ఏర్పరచుకున్నారు.

విశ్వాంధ్ర హృదయబంధం


ఆంధ్రప్రదేశ్‌లో సుమారు రెండు శతాబ్దాలపాటు వేర్వేరు పరిపాలనలలో విభిన్నసంస్కృతుల ప్రభావానికిలోనైన తెలుగు వారిలో భావసమైక్యత లోపించింది. తెలుగు వారం మనమంతా ఒక్కటే అన్న సమైక్య భావం కొరవడి రెండు వేర్పాటు ఉద్యమాలు ఆంధ్రా తెలంగాణాలుగా రాష్ట్రం విడిపోవాలంటూ ప్రజ్వరిల్లాయి.

ఈపరిస్థితుల్లోయిటు స్వరాష్ట్రంలోని ఆందోళనలను ఉపశమింపచేసేందుకు, అటు యితర దేశాలలోనూ, ఇతర రాష్ట్రాలలోనూ వున్న తెలుగువారి ఆశలకూ, ఆశయాలకు ఒక ఆకృతితెచ్చి భాషా సంస్కృతుల ప్రాతిపదికమీద భావసమైక్యతను సాధించేటందుకు "ప్రపంచ తెలుగు మహాసభలను" జరపాలనే నిర్ణయాన్ని అప్పటి ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు నాయకత్వాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది.


తెలుగుజాతి చరిత్రలో ఒక మహెూజ్వల ఘట్టానికి నాంది పలుకుతూ 1975 ఏప్రిల్ 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ ప్రథమ ప్రపంచ తెలుగుమహాసభలు సుమారు 20 లక్షల మంది ప్రజలు పాల్గొనగా వైభవంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జరిగాయి.  మారిషస్, మలేషియా, శ్రీలంక, ఫిజీ, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ పశ్చిమ జర్మనీ, సింగపూరు, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, అమెరికా, బ్రిటన్, కెనడా, రష్యామొదలైన దేశాలలోని తెలుగు ప్రతినిధులు విశ్వాంధ్ర హృదయబంధంగా యీ ప్రపంచ తెలుగు మహాసభలలో అమితోత్సాహంతో పాల్గొన్నారు.

ఈ మహాసభల వలన తెలుగు వారిలో భావ సమైక్యత సాదించటంతో బాటు తెలుగు భాష భారతదేశంలో హిందీ తర్వాత ప్రధానమైన జాతీయ భాష అని ప్రపంచానికి చాటి చెప్పటం జరిగింది.

అంతర్జాతీయ తెలుగు సంస్థ ఆవిర్భావం

"తెలుగు సంస్కృతీ సాహిత్యాల పఠన పాఠనాదుల పరిశోధనలను, యితర రాష్ట్రాలలో, యితర దేశాలలో వున్న తెలుగు వారితో-తెలుగు అభిమానులతో సాంస్కృతిక సంబంధాలను అభివృద్ధి చేసే నిమిత్తం 'అంతర్జాతీయ తెలుగు సంస్థ"ను నెలకొల్పవలెనని ఇంగ్లాండు నుంచి వచ్చిన ప్రతినిధి శ్రీ జె. పి. ఎల్. గ్విన్ తెలుగు మహాసభలో ప్రతిపాదించారు. అధికార భాష కమిషన్ అధ్యక్షులు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య అధ్యక్ష స్థానంలో ఉన్నారు. ఈ ప్రతిపాదనను అమెరికా నుంచి వచ్చిన ప్రతినిధి ఆచార్య కెల్లి బలపరిచారు. ఈ తీర్మానానుసారం నాటి విద్యా సాంస్కృతిక శాఖామాత్యులు శ్రీ మండలి కృష్ణారావుగారి అధ్యక్షతన అంతర్జాతీయ తెలుగుసంస్థ ఏర్పడింది.

ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభలకు అంకురార్పణం

ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల వలన అమితంగా ఉత్సాహం చెందిన విదేశాంధ్రులు రెండవ ప్రపంచ తెలుగు మహాసభలను విదేశాలలో జరుపుతామని ముందుకు వచ్చారు.

మలేషియావారు తమ దేశంలో జరుపుతామనీ-మారిషస్ వారు తమ దేశంలో జరుపుతామనీ ఉత్సాహం చూపారు. తెలుగువారు అధిక సంఖ్యలో వున్న మలేషియాలో (లక్షా యాభై వేలమంది) రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు జరిపేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల ఆహ్వానసంఘ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఆనాటి విద్యాశాఖమంత్రి, మా నాన్నగారు శ్రీ మండలి వెంకట కృష్ణారావుగారు. ఆయన చేతుల మీదుగా యీ మహత్తర కార్యక్రమం జరగడం వలన నేను కూడా ఉడుతా భక్తిగా ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో పాలుపంచుకునే అదృష్టం కలిగింది.

నాటి మహాసభల్లో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులతోనూ, కవి, పండితులతోనూ, ప్రసిద్ధ కళాకారులతోనూ పరిచయభాగ్యం కలగడమే కాకుండా వారితో సన్నిహితమయ్యే సదవకాశం కూడా నాకు లభించింది.