మహాపురుషుల జీవితములు/సి. వి. రంగనాథశాస్త్రి

సి. వి. రంగనాథశాస్త్రి

కలమూరు వీరవల్లి రంగనాథశాస్త్రి చెన్నపురి రాజధానిలోని చిత్తూరుపట్టణమునకు సమీపముననున్న యొక గ్రామములో 1819 వ సంవత్సరమున జన్మించెను. ఆతని తండ్రి మిక్కిలి దరిద్రుఁడు. సంస్కృతమునందు గొప్పపండితుఁడు. నిరుపేదతనమునకు నిలయమైన యింటఁబుట్టి పెరుగుటచే దల్లిదండ్రు లాబాలునకు సంస్కృతవిద్య తప్ప మరియొక విద్య నేర్పింపలేకపోయిరి. బాల్యమందతఁడు కుశాగ్రబుద్ధి యని చెప్పుదురు. ఎనిమిదేండ్ల యీడుననే సంస్కృతము చక్కగ మాటలాడుటకు శ్లోక మన్వయించుటకు నతఁడు సమర్థుండయ్యెను. ఆటలయందు వానికి మిక్కిలి యభిరుచి కలుగుటచే నతఁడు వీధిబాలురతోగలసి గంతులు వేయుచుండును. పదియేండ్ల కాలమున నతఁడు గ్రామములోని పొడవైన చెట్లన్ని యెక్కి యెత్తయిన గోడలన్ని దాఁటి యాటలాడుచు వచ్చెను. అతఁడు పండ్రెండు సంవత్సరముల వయస్సువాఁ డైనప్పుడు ముందు ముందు వాని గొప్పతనమునకుఁ గారణమైన యొక సంగతి జరిగెను. అతని తండ్రి దొరతనమువారివద్దఁ గొన్ని గ్రామముల నిజారాకు పుచ్చుకొని పంటలు చెడిపోవుటచే దాను చెల్లింపవలసిన సొమ్ము చెల్లింపలేక పోయెను. ఆకాలపు పద్ధతినిఁబట్టి దొరతనమువారు శిస్తు చెల్లించనందున వానిం జెరసాలలోఁ బెట్టిరి. తండ్రి కారాగృహము నందుండగా రంగనాథుని తాతగారి యాబ్దికదినము సమీపించెను. రంగనాథునితల్లి యేమిచేయుటకుం దోచక యేడువసాగెను. రంగనాథుడు తల్లికడకుబోయి యామెదుఃఖకారణము దెలిసికొని మిక్కిలి జాలినొంది చెఱనుండి తండ్రిని విడిపించి తెచ్చుటకై చిత్తూరుపట్టణ


మునకుబోయెను. పోయి జిల్లాజడ్జిగారి దర్శనముచేసి తనవచ్చిన పని మనవిచేసి తండ్రిని విడిపింపుమని ప్రార్థించెను. ఆమనుష్యుని మరల దీసికొనివచ్చి యప్పగించుటకు దగినవారు జామీనుగానున్న పక్షమున చెఱనుండి విడువనగుననియు లేనిదే వలనుపడదనియు జడ్జి బాలకునితోఁ జెప్పెను. అప్పుడు రంగనాథుఁడు జడ్జితో "నేను తప్ప జామీనిచ్చువా రెవరులేరు. మాతండ్రి యాబ్దీకము బెట్టి మరల వచ్చువరకు వానిబదులు నేనాచెఱసాలలోఁ గూర్చుండెద"నని ప్రత్యుత్తరముగ బలికెను. పండ్రెండేండ్ల బాలుని నోటనుండి వచ్చిన యా సాహసపుఁ బలుకులు జడ్జి మనస్సును వెంటనేకరఁగించెను. తత్క్షణమే ఆజడ్జీ వానితండ్రిని జెరనుండి విడువవలసినదని యుత్తరువు జేసి రంగనాథునిఁగూడ తండ్రితో నప్పటికిఁ బొమ్మనిజెప్పి, మఱునా డొకసారి తనకు గనఁబడుమని యానతిచ్చెను. తండ్రిని విడువవలసినదని జడ్జీ వ్రాసిన యుత్తరవు రంగనాథుఁడే స్వయముగ కారాగృహాధికారుల యొద్దకుఁ దీసికొనిపోయి తండ్రిని విడిపించుకొని రాత్రి ప్రొద్దుపోవునప్పటి కిల్లుచేరెను. తలవని తలంపుగ భర్తబందెనుండి విముక్తుఁడై వచ్చుటఁ జూచి యాయిల్లాలు మిక్కిలి యక్కజపడి వానివిడుదలకు దన చిన్నబిడ్డఁడే ముఖ్యకారకుఁడని విని పట్టరాని యానందము నొంది బాలుని పలుమారు ముద్దుపెట్టుకొని మెచ్చుకొనెను. ఆనాటి రాత్రి తల్లిదండ్రులు తనకుఁజేసిన గారామును తనయెడఁ జూపిన యాదరమును రంగనాథశాస్త్రి పెద్దయైన పిదపఁ గూడఁ దలంచి మిత్రులతోఁ జెప్పి సంతసించుచు వచ్చెను. మఱునాఁ డుదయమున రంగనాథుఁడు దొరగారి యాజ్ఞ మరువక చిత్తూరునకు, బోయి వేళ మీరకుండ జడ్జీ దరిశనము చేసెను. ఆదొర వానినెంతయు గౌరవముతో నాదరించి సంసారస్థితి నడిగి "కర్చులన్నియు నేనే పెట్టుకొని యింగ్లీషు చెప్పించినచో నీవు చదువుకొందువా" యని యడిగెను.


తల్లిదండ్రులతో నాలోచింపక నేయుత్తరము నిచ్చుటకువీలులేదని పితృవిధేయుఁడగు నాబాలుఁడు ప్రత్యుత్తర మిచ్చెను. అది విని వెంటనే వాని తండ్రిం బిలిపించి కుమారు డింగ్లీషు చదువుకొనుటకు సెలవొసంగమని బ్రతిమాలి యెట్ట కేల కతని నొడంబరచి జడ్జి స్వయముగా రంగనాథున కింగ్లీషక్షరములు ప్రారంభించి చెప్పెను. రంగనాథుని బుద్ధి పాదరసమువలె ప్రవహించెను. ఆరంభించిన యాఱుమాసములకే యతడింగ్లీషు చక్కఁగ జదువనేర్చెను. జడ్జి కార్యభారముచేత తీరుబడిలేక బాలుని గ్రహణశక్తికిఁ దగినంతవిద్య నేర్పుటకుఁ దనకు వీలులేనందున జిత్తూరుపట్టణములో నివసించు చుండిన క్రైస్తవ మతబోధకుఁడగు గ్రోవుసుదొరగారికి బాలు నప్పగించి విద్యనేర్పి బాగుచేయుమని చెప్పెను. గ్రోవుసు దొరగారు ప్రాతఃకాలమంతయు రంగనాథునకు విద్య నేర్చుటలోనె గడపుచు వాని ననేక విధముల నాదరించుచు వచ్చెను. దొరసానియు వానిని బిడ్డవలె జూచెను. రంగనాథుని బసకు గ్రోవుసుదొరగారి బసకునైదు మైళ్ళుండెను. ఒకనా డుదయమున రంగనాథుఁడు కాళ్ళీడ్చుకొనుచు నైదుమైళ్లు నడిచిరా దొరసాని వానిం జూచి చద్దియన్నముఁ దిని వచ్చితివా యని వాని నడిగెను. లేదని బాలుడుత్తరము చెప్ప నా దయామయ తన సేవకునింబిలిచి "యీబాలుఁడూరినుండి రాఁగానే ప్రతిదినము వానికి మూడుసోలల పాలియ్యవలసిన" దని యానతిచ్చెను. రంగనాథుఁడు పెద్దయై గొప్పవాఁడైన పిదపఁ గూడ గ్రోవుసుదొరయు దొరసానియుఁ దన కప్పుడప్పుడు గావించుచు వచ్చిన మితిమీరిన మహోపకారములు నెన్నుచు వారియెడఁ గృతజ్ఞుడై యుండెను. గ్రోవుసుదొరకు గణితశాస్త్ర మభిమానశాస్త్రము రంగనాథునకు దానియం దభిరుచి మెండుగఁ గలిగెను. గణితశాస్త్ర ప్రవేశముచేత రంగనాథునకు జ్యోతిశ్శాస్త్రమునందుఁ జాల


యభిమానము పుట్టెను. ఈ యభిమానము వాని జీవితకాలాంతము వఱుకు నుండెను. కాలక్రమమున రంగనాథుని జ్ఞానము మిక్కిలి యభివృద్ధి నొందెను. కాని మేలుకోరిన జడ్జిగారు గ్రోవుసుదొరవద్ద నతఁడు చదివిన చదువుతోఁ దనివి నొందక యింక నెక్కుడు విద్య నేర్పింపవలయునని వానిం జెన్న పట్టణమున కంపఁదలచెను. తల్లిదండ్రులు మొదట దానికిష్టపడరైరి. కాని జడ్జీగారి ప్రేరణవలన తుదకు వారొడంబడ జడ్జీ చెన్నపట్టణములో గ్రామస్కూలులో ముఖ్యోపాధ్యాయుఁడుగా నున్న కెర్ దొరగారివద్దకు రంగనాథశాస్త్రిని కొన్నియుత్తరములు వ్రాసి యిచ్చి పంపెను. కెర్ దొర బాలుని విద్యాసక్తిజూచి యాశ్చర్యపడెను. కెర్ దొర దొరగారు మొదట కొంతకాలము చెన్నపట్టణములోను పిదప కొంతకాలము కలకత్తా నగరములోను ఉపాధ్యాయుడై యుండి హిందువుల కనేకులు కుపకారములు చేసి స్వదేశమునకుఁబోయి యచ్చట హిందువుల గృహ్యా జీవితములపేర నొక గ్రంథమువ్రాసి ప్రచురించెను. ఆగ్రంథములలో సందర్భవశమున నతఁడు రంగనాథశాస్త్రినిఁగూర్చి యిటులవ్రాసెను. "రంగనాథుఁడు నేను కలుసుకొనుట మా పరస్పరాభివృద్ధికే యని చెప్పవచ్చును. పగలు నిర్వహింపవలసిన కార్యములు నిర్వహించి మే మిరువురము సాయంకాలము యేదో విషయంగూర్చి చర్చలో దిగుచుండువారము. తెలివిగల దొరబుద్ధికిని రంగనాథుని బుద్ధికిని నా కేమియు భేదము కనఁబడ లేదు. బుద్ధియటుండ వాని సౌజన్యము సత్యగౌరవము మిక్కిలి శ్లాఘనీయములు."

రంగనాథశాస్త్రి చెన్న పట్టణములోఁ జదువుచుండిన కాలమున జడ్జీగారు వానినిగూర్చి మునుపటికంటె నెక్కువశ్రద్ధ వహించిరి. ఆయన కెర్ దొర పేర వ్రాసిన యొక యుత్తరములోని యీక్రింది సంగతులు చూచిన వాని యభిమానము తెలియును. "నీదగ్గిర రంగ


నాథుఁడు చదువుకోవలసినంత కాలము జ్ఞానాభివృద్ధికై జదువుకొనవలసినదని నాయభిప్రాయము. నీదగ్గరనుండుటచేత వానియదృష్టము బాగున్నదని నేదలంచెదను. ఆసంగతియెఱింగి అతఁడు గూడ నీబోధనవలనఁ గలుగు లాభము పొందుగాక ! అతఁడు నిఘంటువులు గొప్ప పుస్తకములు జదువుకొనగల సమర్థుడైన పక్షమున నెట్టి యాటంకము లేక వానికిఁ గావలసిన పుస్తకము లన్నియు నీయవలయును కాని యాపుస్తకము లతనికిఁ బూర్తిగ నిచ్చినట్లు చెప్పవద్దు. వలయు పుస్తకము లన్నియు మొదట నెరువిచ్చినట్లిచ్చి చదువుమాని వెళ్లునపుడు వానికి సొంతముగ నీయవలయును."

1839 వ సంవత్సరమున చిత్తూరులో నున్న యాజడ్జికి జెన్నపట్టణమందు సుప్రీముకోర్టులో జడ్జిపని యయ్యెను. కెర్ దొరగారు కలకత్తాకు వెళ్ళిరి. జడ్జీగారు రంగనాథుని వెనుకటి పాఠశాలలో నుంచుట కిష్టపడక దొరతనమువారి హైస్కూలుకు పంపఁదలఁచి ప్రధానోపాధ్యాయుఁడగు పవెల్‌దొరగారి కుత్తరమిచ్చి బాలకు నంపెను. రంగనాథునిజేర్చుకొన్న స్వల్పకాలములోనే వానిబుద్ధి యెట్టిదో పవెల్‌దొరకు తెలిసెను. ఆబాలునకు గణితశాస్త్రములోనున్న ప్రజ్ఞనుబట్టి పవెల్‌దొరగారు వానిచేతఁ గ్రింది తరగతుల కాశాస్త్రములోబాఠములు చెప్పించుచువచ్చిరి. రాజాసర్. టి. మాధవరావుగారప్పుడు చిన్న తరగతిలో నుండి రంగనాథశాస్త్రివద్ద చదువుకొనిరి. 1842 వ సంవత్సరమున రంగనాథశాస్త్రి హైస్కూలు పరీక్షకుఁ బోయి శ్లాఘనీయముగఁ గృతార్థు డయ్యెను. ఆపరీక్షకుఁ బోయిన వారిలో నతఁడె మొదటి వాఁడు. కృతార్థులైన వారిలోను మొదటివాఁడె. అతనిపేరిప్పటికిని జెన్నపురి ప్రెసిడెంసి కాలేజీలో గృతార్థులైన బాలకుల పట్టీలో మొదటనున్నది. పరీక్షయందు గృతార్థుడైన పిదప నతడు తనకు మహోపకారియైన జడ్జీని జూడబోయెను. ఆదొర


గారు వానినిజూచి లేచి చేతులుచాచి కౌఁగిలించుకొని "రంగనాథా నాకు మాట దక్కించితివి నేను ధన్యుఁడనైతి నిన్ను దేవుడు రక్షించుగాక!" యని బహూకరించెను.

ఏపనిలో బ్రవేశించుట బాగుండునని పిమ్మట వారిద్దఱు యోచించిరి. రంగనాథున కుపాధ్యాయుడుగ నుండవలయునని కోరికకలదు. అందుచేత జడ్జీగారు పవెల్‌దొరగారు చెన్నపురిలో లాయరుగానుండిన నార్టను దొరగారు రంగనాథున కాయుద్యోగ మీయవలసినదని దొరతనమువారికి సిఫారసుచేసిరి. ఎవరెంత ప్రయత్నము చేసినను వాని కాయుద్యోగము దొరకలేదు. అంతలోఁ దండ్రికిఁ బ్రాణముమీదికి వచ్చినదని వర్తమానము తెలియ రంగనాథుఁడు చిత్తూరు పోవలసి వచ్చెను. పోవునప్పు డతఁడు జడ్జినిజూచి వార్థకమునందు తండ్రిం గని పెట్టుకొని యుండుటకు వీలగునట్లు చిత్తూరులో నేదయిన యుద్యోగ మిప్పింపుమని యడిగెను. ఆదొరగారు రంగనాథు డేమడిగిన నదిచేయుటకు సిద్ధముగ నున్నందున వెంటనే చిత్తూరు కలక్టరు కొక జాబు వ్రాసి యిచ్చెను. ఆజాబు కలక్టరు చూచుకొన్న కొన్నినాళ్ళలోనే రంగనాథునకుఁ జిత్తూరు సబ్‌కోర్టులో నెలకు డెబ్బది రూపాయలు జీతముగల హెడ్డుగుమస్తాపని యయ్యెను. ఆపనిలో నుండగ నతనికి నెంతోతీరిక గలిగినందువలన గాలమువృధాసేయక యతఁడుజ్ఞాననిధిని వృద్ధిపరచుకొనఁ దలఁచి తెలుఁగు కన్నడము హిందూస్తానీ పారసీ భాషలఁ జదువ నారంభించెను. ఆభాషలలోనున్న కోర్టు కాగితము లన్నియు నతఁడే స్వయముగ నింగ్లీషులోనికి మార్చుచు వచ్చెను. ఆయఖండ శక్తిఁజూచి పై యధికారులందరు విస్మితులగుచువచ్చిరి.

అతనికి చెన్నపట్టణమందు హైకోర్టులో నుద్యోగము చేయవలయునని మహాభిలాష యుండెను. దానికిఁదోడుగ వానితండ్రియు మృతినొందుటచే నతఁడు చిత్తూరు విడువఁదలఁచి యదను వెదకు


చుండ నంతలో హైకోర్టులో భాషాంతరీకరణము చేయువానియుద్యోగము కాళీయయ్యెను. హైకోర్టువారు పరీక్షచేసి తగినవారి కాయుద్యోగ మీయదలచిఁరి. రంగనాథుని ప్రాపకుడగు జడ్జీ హైకోర్టులోనే యున్నందున వెంటనే యతఁ డా సంగతి రంగనాథున కుత్తరము వ్రాసి తెలిపి శీఘ్రముగ దరఖాస్తు పంపుమనియెను. రంగనాథశాస్త్రి తన దరఖాస్తులోఁ దాను ద్రావిడము తెనుగు మరాటి కన్నడము హిందూస్తానీ పారసీ ఇంగ్లీషను నేడు భాషలలో లేశమైన దడుముకొనక తర్జుమాచేయగల్గినట్లు వ్రాసెను. దరఖాస్తు దారులలో నంతటి వా డెవ్వడు లేనందున నుద్యోగము వానికే నీయపడెను. హైకోర్టు తర్జుమాదారగుటచే రంగనాథుని ప్రజ్ఞలువెల్లడియగు నవసరము లనేకములు వచ్చెను. హైకోర్టుజడ్జీలు ప్రత్యక్షముగ వాని భాషాంతరీకరణముఁ జూచుచుండుటచే వాని సామర్థ్యము త్వరలోనే తెలిసెను. అందుచేత వారుతరుచుగ కోర్టులోనే వానిసామర్థ్యములు మెచ్చి పొగడుచువచ్చిరి. దక్షిణహిందూస్థానములోని భాషలన్నియు నేర్చి రంగనాథశాస్త్రి, విద్యాశక్తియధికముకాగా యూరపుఖండములోని భాషలను చదువనారంభించెను. ఆరంభించిన స్వల్పకాలములోనే ఫ్రెంచిలాటినుభాషలలో దృఢప్రవేశము కలిగెను. ఒకనాడు ఫ్రెంచిభాష మాటలాడగల మనుష్యుని కొఱకు హైకోర్టువారు వెదకుచుండిరి. అప్పుడు రంగనాథశాస్త్రి సిద్ధమయ్యెను. ఫ్రెంచి యతనికివచ్చునని యెవ్వరెరుంగకపోవుటచే వానిసాహసమునకు జడ్జీ తెల్లబోయి కానిమ్మని యవలీలగను స్వచ్ఛముగను రంగనాథుఁడు చేయు తర్జుమాచూచి యద్భుతము నొందెను. అది మొదలు జడ్జీలు వాని నొక తాబేదారుగఁ దలఁపక సమానుఁడగు మిత్రుఁడుగా భావింపసాగిరి. తరుచుగ వారు వానిని దమగృహములకు సగౌరవ


ముగ రావించి సెలవుదినములలో ననేకవిషయములను గూర్చి వానితో జర్చింపుచు వచ్చిరి.

ఆ దినములలో హైకోర్టులోఁ దర్జుమాదారుగ నున్నవారి కిప్పటివలె జీతమిచ్చుటగాక తర్జుమాచేసిన కాగితములకు రుసుము ముట్టుచు వచ్చినందునను రంగనాథునకుఁ జాల భాషలలోఁ బ్రవేశ ముండుటచేత నెలకు రమారమి రు. 2500 లు వానికివచ్చు బడి యుండెను. అప్పటికతనికి సంస్కృతమునందుఁ బాండిత్యము పరిపూర్ణమగుటచే హైకోర్టులో హిందూధర్మశాస్త్ర విషయములుగల వ్యాజ్యములన్నిటిలోను జడ్జీలు వాని యాలోచనమును ముఖ్యముగ గ్రహించుచు వచ్చిరి. 1857 వ సంవత్సరమున జెన్నపట్టణపు యూనివర్సిటీస్థాపింపబడినప్పుడు రంగనాథుఁ డొక ఫెల్లోయయ్యెను. 1859 వ సంవత్సరమున సర్. చార్లెసు ట్రెబిలియన్ దొరగారు చెన్నపట్టణపు గవర్నరుగా వచ్చినప్పుడు కొందఱుదొరలు రంగనాథశాస్త్రిని దీసికొని స్వదేశస్థులలో గౌరవనీయుఁడని గవర్నరుగారికిఁ బరిచితునిఁ జేసిరి. ఆదినము మొదలు గవర్నరుగారు రంగనాథశాస్త్రి సామర్థ్యము మెచ్చుకొని వానిం దరుచుగ దనమందిరమునకుఁ బిలిచి హిందువుల సంఘస్థితినిగూర్చి పలుమారు వానితో జర్చించుచు వచ్చెను.

1859 వ సంవత్సరముననె చెన్నపట్టణము స్మాలుకాజుకోర్టులో నొకజడ్జీపని కాళీవచ్చెను. అది రంగనాథశాస్త్రికిచ్చిన బాగుండునని కొందఱనిరి. స్వదేశస్థుడగుటచే నతనికీయగూడదని దొరలందఱు గంఠోక్తిగ వాదించిరి. కాని గవర్నరుగారు తెల్లవారి యాలోచనలు వినక యాయుద్యోగము రంగనాథునకే యిచ్చెను. ఆపనిలో నతఁడు చూపిన చాకచక్యమునుబట్టియు సామర్థ్యమునుబట్టియు మొదట నతఁడనర్హుడనివాదించుచున్న వారు సిగ్గుపడవలసివచ్చెను. పట్టణమందెచ్చట విన్నను రంగనాథుని యద్భుతశక్తి వర్ణనములే వినంబడుచు


వచ్చెను. ఈపని ఖాయమైనప్పుడు రంగనాథశాస్త్రి హైకోర్టులోఁ దనకున్న తర్జుమాదారుపనిని మానుకొనగా హైకోర్టులో మొదట జడ్జీయగు సర్ స్కాట్లండు దొరగారును మరొయొక జడ్జీగారును గలసి వానికి గొప్ప యుద్యోగమైనందుకు సంతసించు చుంటిమనియుఁ దమ వద్దనుండి యతఁడు వెళ్ళవలసివచ్చినందుకు విచారించితిమనియు నొక జాబు వ్రాసి పంపిరి. రంగనాథశాస్త్రి సమర్థుఁడు చాకచక్యము గలవాఁడు నగుటచేఁ దన చేయవలసిన పని నతి శీఘ్రముగ జేసికొని తక్కిన కాలము గ్రంథావలోకనమునందు గడపసాగెను. అందఱియెడ గౌరవము గలిగి యందఱకు సులభుఁడై యుండినందున జను లిప్పటికి రంగనాథశాస్త్రివంటి జడ్జీలు స్మాలుకాజుకోర్టులకు రా లేదని చెప్పుకొనుచుందురు. ఈయుద్యోగమైన తరువాత నతఁ డరబ్బీభాష గృషిచేసి యల్పకాలములోనే మంచిపాండిత్యము సంపాదించెను. పారసీభాషలో మంచి కవీశ్వరులగు సాదీ మొదలగువారి పుస్తకముల నుండి యెన్నో పద్యము లతఁడు కంఠపాఠముగ వల్లించెను. అతఁ డేభాషలోఁ గృషి చేసినను దేనినిఁ బూనినను రక్కసిపట్టుపట్టి దానిని తుద ముట్టించును. జనులతనిని పురుషసింహమని వేనోళ్ళం బొగడుచు వచ్చిరి. అతని సర్వతోముఖపాండిత్య మాకాలమున నెల్లవారికిఁ బ్రశంశనీయ మయ్యెను. గవర్నరు లందరు వాని సమాన గౌరవముతో నాదరించుచు వచ్చిరి. చెన్నపురి గవర్నరులలో సంస్తవనీయుఁడు ధాత సంవత్సర కాటకములో నన్నములేక చచ్చిపోవు బీదలకుఁ బని గల్పింపఁదలచి బెజవాడనుండీ చెన్నపట్టణము వఱకు నొక గొప్ప కాలువ త్రవ్వించిన దయాళువునగు బక్కింగుహాం ప్రభువుగారు రంగనాథశాస్త్రి వైదుష్యమును మెచ్చి జర్మినీభాష గూడ జదువుమని ప్రేరణ చేసిరి. 1867 వ సంవత్సరమున రంగనాధుఁడు పచ్చయప్ప మొదలియారుగారి ధర్మకార్య నిర్వాహణసభలో నొక సభ్యుఁడుగ నియమింపఁబడి యందు మిక్కిలి శ్రద్ధతో బనిచేసెను. 1877 వ సంవత్సరమున ఢిల్లీదర్బారు జరిగినప్పుడు గవర్నరు జనరలుగారు రంగనాథశాస్త్రి నక్కడకు సగౌరవముగారావించి యొకపతకమును యోగ్యతాపత్రికను స్వయముగా వానికిచ్చి పంపిరి. ఇట్లు సర్వజనశ్లాఘనీయముగ దొరతనమువారివద్ద కొలువుచేసి రంగనాథశాస్త్రి 1880 వ సంవత్సరం ఫిబ్రవరు 16 వ తారీఖున పింఛను పుచ్చుకొని యుద్యోగము మానుకొనెను. అతడు చేసిన ప్రశస్తసేవను గుర్తెఱింగి దొరతనమువారు వానిని జెన్నపట్టణపు గవర్నరుగారి యాలోచనసభలో సభ్యుఁడుగ నేర్పరచిరి. ఆసంవత్సరమే జూలై నెలలో హైదరాబాదు దివానుగారగు సర్. సలారుజంగుగారు రంగనాథశాస్త్రిని నెలకు 2,500 రూపాయలజీతము మీఁద తనకు ప్రయివేటు శక్రటరిగా నుండుమని కోరిరి. కాని శాస్త్రిగారు ధనమే పావనమని యెంచక తన జీవిత కాలములో సాయంసమయమును విద్యావ్యాసంగముల లోను దన మనుమల విద్యాబోధనములలోను గడుపఁదలఁచి యా యుద్యోగ మక్కర లేదని వ్రాసెను. కాని యతఁడు చేయఁదలఁచిన రెండుకార్యములు నిర్వహించు నదృష్టమతనికి లేకపోయెను. మృత్యు దేవత మనుష్యులను గొప్పతనమునుబట్టి గౌరవింపదుగదా ! పాప మాయన 1881 వ సంవత్సరం జూలై నెల 5 వ తారీఖున గాల ధర్మము నొందెను.

రంగనాథశాస్త్రి సాధారణ మనుష్యులకంటె పొడగరి. అతని దేహదార్ఢ్యముజూచి తెల్లవారుసైతము మిక్కిలి విస్మితులగుచు వచ్చిరి. అతని దేహచ్ఛాయ యించు మించుగ తెల్లవారి దేహచ్ఛాయవలెనే యుండును. వానిఁజూచినవా రందఱు


తప్పక యతఁడు గొప్పవాఁడనుకొని తీరవలయును. అతని ఫాలము మిక్కిలి విశాలమైయుండెను. అతఁ డెన్ని వేలమందిలో గూర్చున్నను వానిముఖవర్చ స్సందఱకు దర్శనీయమై గంభీరమై కానఁబడుచు వచ్చెను. అతని కఠధ్వని గంభీరమై యెల్లవారిని విధేయుల జేయునట్లుండును. ఏవిషయమందైన నభిప్రాయభేదము వచ్చినప్పు డతఁడు ప్రతిపక్షుల హేతువులువిని తన యభిప్రాయమును మార్చుకొనును. మంచి సబబులుచెప్పి యతఁడు తరుచుగ నితరులఁ దనతో నేకాభిప్రాయులఁ జేయుచుండును. అతని ప్రవర్తన మంతయు గడియారము వలెనే జరుగుచుండును. అనగాప్రతిదినము బ్రతికార్యమునకు నతఁడు కొంతకాలమునేర్పరచి యాపని యాకాలమందె సరిగ జేయుచుండును. అతని నెఱిఁగినవారు గడియారములో నెన్నిగంటలైనదో తెలిసికొనక్కర లేదు. రంగనాథశాస్త్రి యాసమయమున నేపని చేయుచుండునో యాపని జ్ఞప్తికిఁదెచ్చుకొనినయెడల కాలము తెలియును. అతఁడు దేహపరిశ్రమయందు మిక్కిలి నిష్టకలవాఁడై ప్రతి దినము ప్రాతఃకాలము నాలుగుమొద లైదుగంటల వఱకు హిందూ దేశపు కసరతు తప్పక చేయుచుండువాఁడు. వ్యాయామము ముగిసిన వెనుక నైదు మొద లేడుగంటలవఱకు గుఱ్ఱపుసవారు చేయుచుండును. గుఱ్ఱముమీఁద నతఁడు నిశ్చలుఁడై కూర్చుండిన యొప్పిదముఁ జూచి తీరవలయునని తెల్లవా రభిప్రాయపడుచు వచ్చిరి. ప్రతి దినము సాయంకాలమాయన చాలదూరము కాలినడకను షికారు పోవు చుండును. ఇట్లుదయము సాయంకాలము తప్పక దేహపరిశ్రమ చేయుటచే రంగనాథశాస్త్రి మంచిదేహారోగ్యముఁ గలిగియుండి యొక్కనాడైన జబ్బుపడి మంచముమీఁద బండుకొనియెఱుఁగడఁట. దినమున కాఱుగంటలు రంగనాథశాస్త్రి చదువునకై వినియోగించుచు వచ్చెను. ముసలితనమందుఁ గూడ చదువుకొనుచు బుస్తకము చేతఁ


బట్టుకొని ప్రాణములువిడిచిన హిందువుఁడితడొక్కఁడేయని చెప్పవచ్చును. అతఁ డేదిచేసినను సగముసగము చేయక సంపూర్ణముగఁ జేయును. అతడు మనోవాక్కాయ కర్మములందు సత్యమే యాచరించుచు వచ్చినందున యబద్ధమును బరమశత్రువునట్లు ద్వేషించును. 1853 వ సంవత్సరమున నార్టను దొరగారింగ్లాండులో పార్లమెంటు సభవారివద్ద హిందూ దేశస్థితిగతులఁగూర్చి సాక్ష్యమిచ్చు సందర్భవశమున రంగనాథశాస్త్రి ప్రశంసరాఁగా "నతడు బుద్ధికుశలతయందు దెల్లవారితో సమానుఁడనియు నింగ్లాండు సర్వకళాశాలలో జదివిన పక్షమున నతఁడు మిక్కిలి గొప్పవాఁడై యుండు" ననియుఁ జెప్పెను.

ఇంగ్లీషులో నతఁడు సులభశైలిని మనోహరముగ వ్రాయఁగలఁడు. ఏభాష నతఁడు చదివినను మంచికవుల గ్రంథముల నుండి యెన్నో పద్యములు కంఠ పాఠముగ వల్లించును. అతని గ్రంథ భాండారములో మూడువేల పుస్తక సంపుటములుండెను. ప్రతిపుస్తకమందు జదివినట్లానవాలుగా చేతిమరకలుఁ గూడనుండును. అతఁడేదైన నొకసారి చదివిన నర్థమగును. రెండవసారి చదివెనా కంఠపాఠముగ వచ్చును. మూడవసారి చూచెనా మనసులో నొకమూల స్థిరమై యుండిపోవును. అతఁ డరబ్బీ పారసీభాషలను మహమ్మదీయ పండితుఁ డట్లవలీలగ మాటలాడగలఁడు. ఇంగ్లీషులో మంచికవులు లేరనియుఁ గవులను బిరుదునకుఁ దగినవారు మన యాసియాఖండములోనేగాని యూరపులో లేరని వాని యభిప్రాయము. విద్యను ధనముకొఱకుగాక కేవలము జ్ఞానముకొఱకే యతఁడు నేర్చికొనెను. అందుచేతనే యతఁడు చనిపోవు నప్పటికి పదునాలుగు భాషలలోఁ బండితుఁడై పదునేనవభాషయగు హీబ్రూ నేర్చికొనుచుండెను. సంస్కృత మతనికిఁ బ్రాణపదమైనభాష ఆభాషలోనతఁడు చదువని పుస్తకము లేదు. ఒక్కొక్కదాని కెంతో సొమ్మిచ్చి యతఁడు


తాటియాకుల పుస్తకముల నెన్నియో తెప్పించెను. ఆతఁడు పండిత పక్షపాతి. ఒక పండితున కతఁ డప్పుడప్పు డిచ్చిన బహుమానముల మొత్త మైదువందలరూపాయలు ఫ్రెంచి లాటినుభాషల నేర్చుకొనుటకై పుదుచ్చేరినుండి యతఁడు ప్రత్యేక మొకదొరనునెలకు నూరు రూపాయల జీతముమీఁద బిలిపించి చదువుకొనెను. ఒకరివద్ద తాను చదువుకొనుటయా తా నొకరికిఁ జెప్పుటయో యతనికి మిక్కిలి యిష్టము. వానిచుట్టు నెల్ల పుడు పలుభాషలు నేర్చిన పండితులు పరివేష్ఠించియుండ వారి నడుమ నతడు పరమసంతోషముతో కాలము బుచ్చు చుండును. పేదబాలురకు నింట నన్నము పెట్టి యతఁడు విద్య చెప్పించుచు వచ్చెను. ఒకప్పుడతనియింట నట్లు చదువుకొను బాలు రాఱుగు రుండిరి. సంఘసంస్కరణమం దతనికి ప్రీతి గలదు. అతడు మనలో నున్న దురాచారముల జనులకుఁ దెలియపరచి వానినవలంభించుట చేతనే మనమింత యధమస్థితిలో నున్నారమని చెప్పుచు వచ్చెను. అతఁడు దురాచారములనడంచుటకుఁ బ్రయత్నించెను కాని యసహాయుఁ డగుటచే నెరవేర్చ లేకపోయెను. చెన్నపురిలో మొట్ట మొదట షరాయి బూట్సు తొడగిన బ్రాహ్మణుఁ డతఁడే. ప్రథమమున బంధుమిత్రులు వాని నెగతాళిచేసి చిట్టచివరకు వాని మార్గమునే యనుసరించిరి. స్త్రీవిద్య వానికిష్టము. ఆవిషయమును గూర్చి యతఁడు చదువుకొనుచున్నపుడె యొక యుపన్యాసము వ్రాసి యందుఁ దుట్ట తుద నిట్లు వ్రాసెను. "ఇతర దేశములలో ముందు పురుషవిద్య ప్రబలినవెనుక స్త్రీవిద్య ప్రబలెను. పురుషులు విద్వాంసులయినం గాని స్త్రీలు విద్యావతులు కారు. కావున మన దేశములో గూడ మగవారి విద్య వ్యాపించునట్లు చేయవలయును."

అతఁడు చెప్పినట్లాచరించువాఁడు. అందు చేతనే తనకుమార్తె కరవము సంస్కృతము తెనుఁగు స్వయముగ జెప్పెను. అతఁడు వేద


ములు బైబిలు ఖురాను జక్కగ నేర్చినవాఁడై యాయామతస్థులతో వాదములు చేయుచు హిందూమతమే యుత్కృష్టమైనదని సిద్ధాంతము జేయుచు వచ్చెను. హిందూమతము మనవృత్తికినడ్డుగనుండఁ గూడదని దానిని బ్రస్తుత నాగరికతకు సరిపుచ్చవలయునని వాని యభిప్రాయము. అతనికి హిందూమతముమీద నత్యంతమైన యభిమానముగలదు. ఒకప్పుడు క్రైస్తవమతములో గలిసిన బ్రాహ్మణ బాలకు నతఁడు మరల హిందూమతములో గలిపించెను. వర్ణ భేదమందతనికి విశేషగౌరవము లేదు. ధర్మమార్గమున మనము నడచుకొంటిమా దేవుఁడే మనల రక్షించునని యతని మతము. సత్యమే వాని దేవత. అతఁడు జన్మమధ్యమం దెప్పుడు నొక యబద్ధమైన నాడి యెఱుంగఁడని వాని శత్రువులుసయితము చెప్పుదురు. ఆ సద్గుణ మాతనికిఁ జిన్ననాటనుండియు గలదు. ఆయన మితభాషి. అతనికి మిత్రులు కొందఱు మాత్రమే యుండిరి. పరిచితుల నందరను మిత్రులుగ భావించువాడు కాడు. వ్యర్ధప్రసంగములు డంబములు వానికిఁ గిట్టవు. మితభాషియగుటచే మొదట నతనిఁ జూచినవారు గర్వి యనుకొందురు. కాని పరిచయమైన వెనుక నట్లనుకొనరు. అతనికి మరియాదలలో మిక్కిలి పట్టుదల గలదు. అవమానమన్నమాట యతడు సహింపలేడు. అమర్యాద మనుష్యుల నతఁడు మిక్కిలి యేవగించును. అతఁడు తెల్లవారు నల్లవారు నను భేదములేక యెల్లర సమగౌరవముతోఁ జూచువాఁడె కాని వారి నొకరీతి వీరి నొకరీతి గౌరవించువాఁడు కాఁడు. అంత గొప్పవాడయ్యు నిగర్వచూడామణి. అతఁడు మిక్కిలి స్వతంత్రస్వభావము గలవాఁడె కాని చేతులు నలుపుకొనుచు నక్కవినయములను జూపి యుపకారములను యాచించు వాఁడు కాఁడు. తెల్లవారతనిని సమానుడుగ భావించిరి. చెన్నపట్టణపు హైస్కూలులోఁ జదివి పరీక్షలోఁ కృతార్థుడైన హిందువులలో


నతఁడే ప్రథముఁడు. మదరాసు యూనివరిసిటీలో సభ్యుడైన హిందువులలోఁ బ్రథముఁడు. స్మాలుకాజు కోర్టులలో జడ్జీలుగా గూర్చుండిన హిందువులలోఁ బ్రథముఁడు. అనేక భాషలు నేర్చిన స్వదేశపండితులలోఁ బ్రథముఁడు.

ఉదరపోషణము నిమిత్త మొక్కభాష కష్టముగా నేర్చుకొనుటయే చాల శ్లాఘనీయము. రెండుమూడునేర్చుకొనుటమిక్కిలి యుత్కృష్టము, అట్టియెడ పగలెల్ల కార్యభారముచేత దీరికయించుకయు లేనివాఁడు పదునెనిమిది భాషలలోఁ బ్రజ్ఞావంతుఁడగుట మహాశ్చర్యకరము కాదా ? ఉద్యోగమైన తరువాత మనలోవిద్యావ్యాసంగము చేయువారు లక్ష కొకరైన యుందురో సంశయింపవలసి యున్నది. రంగనాథశాస్త్రి హిందువుఁడయ్యుఁ దక్కిన హిందువులవలె కేవల ముదరపోషణార్థమే విద్యనేర్చుకొనక జ్ఞానాభివృద్ధి నిమిత్తమై బహుభాషాపరిశ్రమముచేసి దక్షిణహిందూస్థానమునకు వన్నె తెచ్చెను. ఈనాటి యుద్యోగస్థులు విద్యార్థులు రంగనాథశాస్త్రి జూపిన మార్గము నవలంభించి క్రొత్తభాషలు నేర్చుకొందురు గాక! నేర్చుకొని యాభాషల యందలి మంచిగ్రంథములను స్వభాషలోనికి భాషాంతరీకరించి లోకోపకార మొనర్తురుగాక ! రంగనాథుఁడువలెనే యీనాటి యుద్యోగస్థులు తమ యధికారులగు తెల్లవారి యెదుట స్వతంత్రభావమునుజూపి వర్తింతురు గాక ! నక్కవినయములుసేయకపోవుదురు గాక!