మహాపురుషుల జీవితములు/వెంబాకం రామయ్యంగారు
వెంబాకం రామయ్యంగారు
ఈయన 1826 వ సంవత్సరమందు జెన్నపట్టణమున జన్మించెను. సర్. తామస్ మన్రోగారు గవర్నరుగానున్న కడపటిదినములలో నీయనతండ్రి రివిన్యూబోర్డులో రికార్డు కీపరుగా నుండెను. ముగ్గు రన్నదమ్ములలో రామయ్యంగారు కనిష్ఠుడు. తక్కిన సోదరు లిద్దఱు మేనమామయైన వెంబాకం కృష్ణయ్యంగారివద్ద బెఱుగుచు వచ్చిరి. ఈకృష్ణయ్యంగారు మనదేశము కంపెనీవారు పరిపాలించెడు దినములలోఁ దూర్పుసముద్రపు రేవులలో ధాన్యాదులవర్తకముఁ జేయుచుండెను. చిన్నప్పుడు రామయ్యంగారు మంచియారోగ్యము లేక తరచుగ జబ్బుపడుచు వచ్చినందునఁ దలిదండ్రు లాయనను గొన్నిసారులు పాలారునదీ తీరమందు సీవరము గ్రామమందున్న మేనమామవద్దకును గొన్నిసారులు చెంగల్పట్టువద్దనున్న స్వగ్రామమగు వెంబాకమునకును నీటిమార్పు గాలిమార్పుల నిమిత్తము పంపుచువచ్చిరి. చిన్న జీతములు పెద్దకుటుంబములుఁగల గృహస్థుల కేదినములలో నైనను బిడ్డలకు గొప్పవిద్య జెప్పించుట కష్టముగదా. కాని ముందు వెనుకలు చక్కఁగా దెలిసినదియు మితవ్యయము యొక్క యుపయోగ మెఱిఁగినదియుఁ బరమశాంతయు యోగ్యురాలు నగు రామయ్యంగారి తల్లి సొమ్ముక్లుప్తముగా వ్యయముఁ జేసి కుటుంబముఁ గడపి కుమారున కాదినములలో నున్న మంచివిద్యఁ జెప్పించెను. 1841 వ సం||న నెల్ఫిన్‌ష్టన్ ప్రభువు గవర్నరుగానున్నప్పుడు చెన్నపట్టణమందు గవర్నమెంటువా రొక హైస్కూలు స్థాపించిరి. అది బయలుదేఱఁగా నందులో నాఱుగురు విద్యార్థులు చేరిరి. అందులో రామయ్యంగా రొక్కరు. ఈయన సహాధ్యాయులైన తక్కిన యైదుగు రెవరనఁగా 1 మహామంత్రియైన రాజా సర్ టి. మాధవరావుగారు. 2. చెన్నపట్టణపు హైకోర్టులో మొదటి ప్లీడరు
గవర్నరుగారి శాసన నిర్మాణసభలో మొదటి స్వదేశసభికుఁడు నన శ్రీశఠగోపాచార్యులు, 3. దక్షిణహిందూస్థానమున విద్యాధికుఁడనిన పేరువహించిన లౌరీదొరగారు. 4. తిరువాన్కూరు సంస్థానమందలి హైకోర్టులో జడ్జీగాఁ జిరకాలముండిన సదాశివపిళ్ళేగారు. 5. గొప్ప విద్వాంసుఁడని పేరుపొంది బ్రతికినన్నాళ్ళు రోగములతో దీసికొనుచు స్వల్పకాలమే జీవించిన దీనదయాళు నాయఁడు.
ఈ యాఱుగురు విద్యార్థులు బరీక్షలో ఘనముగాఁ గృతార్థులైరి. ఆహైస్కూలు ప్రధానోపాధ్యాయుఁడగు పవెలుదొర తన విద్యార్థుల బుద్ధివిశేషము, గనిపెట్టి వారికిఁ పాఠశాలలోఁ జెప్పెడు చదువుఁగాక యింటివద్దగూడ ప్రకృతి శాస్త్రము మొదలయినవి చాలవఱకు చెప్పెను. ఆదినములలోనే రామయ్యంగారు ప్రకృతి శాస్త్రమును జ్యోతిశ్శాస్త్రమును నేర్చి వాటియందు మిక్కిలి యభిరుచిగలవాఁ డయ్యెను. రామయ్యంగారు పెద్దపుస్తకముల కట్ట చేతఁబట్టుకుని ముత్యాలుపేట నుండి ప్రతిదినము మిక్కిలి దూరమున నున్న తన పాఠశాలకు బోవుచు వచ్చెను. ఈకాలమందీయనకుఁ బరమమిత్రుఁ డీయన జ్ఞాతి యగు శఠగోపాచార్యుఁడు. ఈకాలములో రామయ్యంగారి కొకకష్టము సంభవించెను. ఈయన యన్నయు సర్వజనులకు నిష్టుఁడు గొంత కుటుంబభారము వహించిన వాఁడు నగు పార్థసారథియయ్యంగారు కాలధర్మము నొందిరి. ఆయన మరణము చేత దుఃఖితులైన తల్లి దండ్రులకు తనవిద్యాభ్యాసవ్యయము భారముగా నుండకుండ రామయ్యంగారు తనస్కూలుజీతము తానే తెచ్చుకొనవలసి వచ్చెను. ఆకాలములో శ్రీపచ్చయప్ప మొదలియారిగారి పాఠశాల పరిపాలనముఁ జేయుసభవారు, ఆంగ్లేయశాస్త్ర విద్యలను జదువుకొను విద్యార్థులతో మొదటివానికిఁ గొంత నెలవేతన మీయదలంచిరి. రామయ్యంగారు కష్టపడి చదివి తన వ్రజ చేతనే
యీవిద్యార్థివేతనము సంపాదించెను. తలిదండ్రులకు నిర్బాధకముగా దానుజదువుకొనుట కాధారమైన యావిద్యార్థివేతనముదనకు మహోపకారముచేసెనని యాయన యిటీవలపలుమాఱులు చెప్పుచువచ్చెను. అట్లు తానుపుచ్చుకొన్న విద్యార్థివేతనపుసొమ్మును రామయ్యంగారు ఋణముగా నెంచుకొని దానిని దీర్పఁ దలచి కొంత మూలధనమును తన్నిమిత్తమిచ్చి దానివడ్డివల్ల పట్టపరీక్షకుఁ బ్రకృతిశాస్త్రముజదువ దలఁచు విద్యార్థికి సహాయము జేయవలసినదని యేర్పాటు చేసి విద్య ముగిసినతోడనే యాకాలమున రివిన్యూబోర్డువారికి సెక్రటరిగా నుండిన పైప్రాపుదొర రామయ్యంగారిని తనకచేరీలో మహారాష్ట్రభాషకుఁ దర్జుమాదారుగ నేర్పరచెను. రివిన్యూబోర్డులో నిట్లుకొంత కాలము పనిచేయుట చేత రివిన్యూపద్ధతుల దెలిసికొనుట కాయన కెన్నో యవకాశములు కలిగెను. క్రమక్రమముగా రామయ్యంగారు పూనికతో బనిజేయుటవలన జాలమంది కలక్టర్ల కనుగ్రపాత్రుఁడయ్యెను. 1850 వ సంవత్సరమందు నెల్లూరు కలక్టరు తనకచ్చరీలో నున్న హెడ్డుమున్షీ పని రామయ్యంగారి కిచ్చెను. ఈయుద్యోగములో నీతడు నాలుగు సంవత్సరములుండెను. 1854 వ సంవత్సరమందు గవర్నమెంటువారు ఇంజనీరింగు డిపార్టుమెంటు క్రొత్తగా నిర్మించి యా శెక్రటెరిగారివద్ద రామయ్యంగారినిఁ బనిచేయఁ బంపిరి. అందులో గొంతకాల మున్నపిదప 1855 వ సంవత్సరమున నాయన యధికారులు రెండుద్యోగములు కనబఱచి యాయన యిష్టమువచ్చిన దానిలోనికి వెళ్లుమనిరి. మొదటిది నెల్లూరుజిల్లాలో నాయన సిరస్తదారు పని. రెండవది కృష్ణాజిల్లాలోనప్పుడేక్రొత్తగా నేర్పడిన సబుకలెక్టరు వద్ద సిరస్తదారుపని. రామయ్యంగారు తానదివఱకు కొంతకాలము పనిచేసిన నెల్లూరికేవెళ్ళి యక్కడికలక్టరు నమ్మకమునకుఁబాత్రుడై శ్రద్ధగా పనిజేసెను. ఈయుద్యోగమున రెండేండ్లున్న పిదప నతఁడు
తంజావూరుజిల్లా కలక్టరుకచేరీలో హెడ్డుశిరస్తదారుగ నియమింపఁబడెను. నెల్లూరు విడిచిపోవునప్పు డాజిల్లాకలక్టరు రామయ్యంగారి సామర్థ్యాదులం గొనియాడుచు నొకజాబువ్రాసెను. ఆజాబులోనితర విషయములు విడిచి నాలుగు మాటలు మాత్ర మిందుదహరించుచున్నాను. "నీవంటిమనుష్యులే దేశమునకు నిజమైన మిత్రులు. వారే యీదేశమును దక్కిన యెల్ల దేశములలో బేరుకల దానినిగాను యెల్ల సజ్జనుల స్తోత్రమునకు బాత్రమైన దానిగాను జేయగలవారు" ఈయుద్యోగమునం దొక సంవత్సర మున్న పిదప నాయన యాజిల్లాలోనే డిప్యూటీకలెక్టరయి హెడ్డుకలెక్టరునకు నమ్మదగిన సహకారియై యుండెను. 1859 వ సంవత్సరమందు తంజావూరు జిల్లాలోనున్న యీనాము భూములు పరిష్కరింపఁదలచి గవర్నమెంటువారు యీనాము కమీషనరయిన టెయిలరుదొరతోఁ గలసి మాటలాడుటకై రామయ్యంగారిని జెన్నపురము బిలిపించి టెయిలరువద్ద నుద్యోగ మిచ్చిరి. ఆయన చెన్న పట్టణమందుండగానే సర్ ఛార్లెస్ ట్రిమిలియన్ దొరగారాయనం బిలిచి కావేరీనది పాఱెడి భూములలోగొంత భూముల పరిష్కారము గావలసియుండెను. కనుక యచ్చోటికి వెళ్ళవలసియుండునని యాయనతో జెప్పెను. తంజావూరుజిల్లాలో కావేరీనది పారెడిభూములలో రహితులవద్ద శిస్తువసూలుచేయుట కొలుంగు పద్ధతియని యొక పద్ధతియుండెను. ఈ పద్ధతింబట్టి దేశమున పండినపంట హెచ్చుతగ్గుల ననుసరించి రహితులవద్ద శిస్తువసూలుచేయుట కొలుంగుపద్ధతియని యొక పద్ధతియుండెను. ఈపద్ధతిం బట్టి దేశమున పండిన పంట హెచ్చుతగ్గుల ననుసరించి రహితులవద్ద శిస్తు హెచ్చుగాను తగ్గుగానువసూలుచేయఁబడుచు వచ్చెను. స్థిరమైన పద్ధతిలేకయే యేటి కాయేడు మారుచువచ్చిన యీపద్ధతిని మాన్పి శాశ్వతమైన శిస్తు కట్టవలసినదని రామయ్యంగారిని నియమించిరి. అయ్యంగారు వెంటనే యాపనిలోఁ బ్రవేశించి కలెక్టరుగారి యుత్తరువులంబట్టి యెనిమిది మాసములలో నీపని పూర్తిఁజేసెను. ఈపని కొంత జరుగు
చుండగానే ట్రెమిలియన్ దొరగారు దక్షిణపు జిల్లాలనుజూడ బయలుదేఱి తంజావూరు జిల్లాలో రామయ్యంగారు చేయుచున్న పని బరీక్షింబగోరి చాల పట్టుదలతో శోధించి యాతడు చేసిన పని మిక్కిలి బాగున్నదని మెచ్చుకొని పోయెను.
1860 వ సంవత్సరమున ప్రెసిడెన్సీ కాలేజీ సంవత్సరోత్సవసమయమున ప్రసగించుచు ట్రెమిలియన్ దొరగారు రామయ్యంగారినీక్రింద విధమున బ్రశంసించిరి. "పై జెప్పిన తరగతిలో జేరిన మఱియొక స్వదేశీయుడగు నుద్యోగస్తుడు తంజావూరుజిల్లాలో మిక్కిలి కష్టమైన పనిని నేర్పులో నెఱవేర్చెను. ఈకార్యసాధనమం దితడుజూపిన సామర్థ్యము, నీతియు నతని కేగాక హిందూజాతి కెల్ల గౌరవముఁ దెచ్చుచున్నది." 1870 వ సం||ర మందు స్వదేశస్థులకుఁ గొప్పయుద్యోగము లియ్యవచ్చునని పార్లమెంటుసభలో నొకచట్టము పుట్టునపుడు యీ దొరగారే రామయ్యంగారి కీ క్రింది విధమున వ్రాసిరి. "హిందువుల కిప్పుడు గొప్ప యుద్యోగము లీయవచ్చునను మంచిస్థితికి వచ్చితిమి. ఇపుడు పార్లమెంటులోనున్న బిల్లు హిందువులుగూడ నింగ్లీషువారితో సమానముగఁ జూడవలయునను న్యాయపద్ధతిమీఁద నిలిచియున్నది. ఇదివఱకు గవర్నమెంటు కొలువులో నుండుటచేతఁ గాని లేక గౌరవమైన స్వతంత్రవృత్తులలో నుండుటచేతఁగాని గొప్ప యుద్యోగములకుఁ దగియున్న స్వదేశస్థులందఱ నట్టియుద్యోగములలో గవర్నమెంటువారు ప్రవేశపెట్టుదురు. ఈసమయమున గవర్నమెంటువారు నిన్నట్టి గొప్ప యుద్యోగములోఁ బ్రవేశపెట్టకపోయిన పక్షమున నాకు విషాదముగ నుండును. నీవు నూరు సంవత్సరములు దొరతనమువారి కొలువుచేసినను తంజావూరులోని కొలుంగు వ్యవహారములవంటి కష్టమయిన వ్యవహారము మరల చేయవలసి యుండదు. నీవు చెన్నపురి రాజధానిలో నున్న స్వదేశస్థులకంటె
తెల్లవారికంటె నాపనికిఁ దగినవాఁడవని నీవిషయమై సిఫారసు చేసిరి. తంజావూరు మండలములో సగము భాగములోనున్న జనుల యదృష్టములు నీచేతిలోనున్నను నీపూర్వప్రవర్తనముమీఁద నెక్కడనొకమచ్చ లేకుండ ననుమానపునీడయైన నీమీఁద సోకకుండ నీవా వ్యవహారము న్యాయైకదృష్టితో నెల్లరకుఁ దృప్తికరముగఁ బరిష్కరించితివి. తంజావూరులో వ్యవహారము ముగియగానే యీనాము కమీషనులోఁ జేరవలసినదని యదివఱకు రామయ్యంగారి కుత్తరువులు వచ్చెనుగాని తంజావూరు కలక్టరాయనను విడువక తనకు సహాయుఁడుగ నేర్పఱచుకొనెను. ఇక్కడ నుండగానే గవర్నమెంటువా రాయనను మఱియొక వ్యవహారముఁ బరిష్కరింపుమని పంపిరి.
1858, 59 వ సం||రములలో కావేరీనది వలన దేశమునకు గొప్పనష్టము కలిగెను. అప్పుడు చెడిపోయిన ప్రదేశములకు మరమ్మతులు చేయుటకై గవర్నమెంటువారు మిరాశిదారులకు గుత్త దారులకు వేలకొలఁది రూపాయలిచ్చిరి. ఆమరమ్మతులు సరిగా జరిగినవో లేదో తెలిసికొని గవర్నమెంటువారికి గుత్తదారులకుఁగల వ్యవహారముఁ బరిష్కరించుటకు రామయ్యంగా రేర్పడెను. ఈకృత్యము నతఁడు శ్రద్ధతో నెఱవేర్చి గుత్తదారులవల్ల దొరతనమువారికి రావలసినసొమ్ము విశేషముగా రాఁబట్టెను. తరువాత నతఁడు తంజావూరు జిల్లలోనేయున్న నల్లతాడిగ్రామ వ్యవహారముఁ బరిష్కరించుటకై నియమింపఁబడెను. ఈగ్రామము చెన్నపట్టణపు నివాసులైన యొక కుటుంబమువారికి మొఖాసాగా నుండెను. గవర్నమెంటుకుగ్రామము మీఁద జెల్లవలసిన శిస్తు మితిమీరి యుండుటచే ముఖాసాదారులు దానిమొగముఁజూడక పాడుపెట్టిరి. రామయ్యంగారు శిస్తు తగ్గించి
క్రొత్తపద్ధతిగా శిస్తునేర్పఱచి కలెక్టరు యొక్కయు దొరతనమువారి యొక్కయు నంగీకారమునంది గ్రామము బాగుచేసెను.
1861 వ సంవత్సరమున సేలము జిల్లాకు సేలము పట్టణమే ముఖ్యపట్టణముగా నేర్పడెను. అదివఱకు మైసూరులోనున్న పెద్ద కలెక్టరు కచ్చేరీ సేలమువచ్చెను. అ జిల్లాలోని నాముకాలు పట్టణమందు సబుకలెక్ట రొకరుండు నట్లేర్పాటు చేయఁబడెను. గవ్వర్నమంటువారు రామయ్యంగారిని మొదటితరగతి డిప్యూటీ కలెక్టరుద్యోగమున ఖాయపఱచి నాముకాలో సబుకలెక్టరుగా నుండవలసినదని పంపిరి. అక్కడ సబుకలెక్టరుగా నాయన 1864 వ సంవత్సరమువఱకు నుండిరి.
ఈసమయమున నిండియాగవర్నమెంటువారు కాగితములనాణెములను క్రొత్తగానిర్మింపఁదలంచిరి. కాగితముల నాణెములనఁగాబ్యాంకునోట్లు. ఇవియు రూపాయలు కాసులువలెనే యిప్పటికి దేశమున నాణెములుగజెల్లుచున్నవి. రామయ్యంగారు నమ్మదగిన మనుష్యుఁడగుటచే నిండియాగవర్నమెంటువారాయన నీడిపార్టుమెంటులోఁబెట్టదలచి తిరుచునాపల్లిలో నెల కాఱువందలు మొదట జీతముఁ గలిగిక్రమాభి వృద్ధిగా నెనిమిదివందలవఱకు జీతముగల నశిస్టాంటు కమీషనరుగా నియమించిరి. ఈ యుద్యోగములో నతఁడు 1865 వ సంవత్సర ప్రారంభమందుఁ బ్రవేశించెను. ఒక సంవత్సరములోఁ బనిచేయునప్పటికి తనకుఁ దగినంత పనిలేదని తెలిసికొని జీతముపుచ్చుకొనుచు సుఖముగాఁ గూర్చుండుట కిష్టములేక యాసంగతి నతఁడు గవర్నమెంటువారికిఁ తెలియఁజేసెను. గవర్నమెంటువారు వెంటనేయాయనను ప్రధానపు సెక్రటరిగా యాఫీసుకుమార్చి యతఁ డదివరకు
చేయుచున్న యుద్యోగమవసరమే లేదని తీసివేసిరి. 1866 వ సంవత్సర మంతయు నితఁడా యుద్యోగమునం గడపెను. 1867 వ సంవత్సరమందు స్టాంపులసూపరింటెండెంటగు టెంపిలుదొర కాలధర్మము నొందగా దొరతనమువారు నెలకు వేయిరూపాయల జీతముమీఁద రామయ్యంగారి నాయుద్యోగమునం బ్రవేశపెట్టిరి.
మఱుసటి సంవత్సరము గవర్నరుగారి శాసన నిర్మాణసభలో నొక సభికుఁడుగ నతఁడు నియమింపఁబడెను. ఈ సభలో నతఁడు పండ్రెండు సంవత్సరములు సభికుఁడుగనుండి క్రొత్తచట్టములునిర్మించునపుడు గవర్నమెంటువారి కెంతో సహాయముఁజేయుచు వచ్చెను. అతఁడు ముఖ్యముగ శ్రమపడి పనిఁజేసినవి రెండు విషయములు గలవు. అవి యేమనఁగా మునిసిపలు లోకలుఫండు సంబంధమయిన పన్నులు కట్టుటకు గవర్నమెంటువారు నిర్మించిన చట్టములోనితఁడు మిక్కిలి సహాయముఁచేసెను. ఆచట్టము నిర్మించిన అలెగ్జాండరు ఆర్బత్తుదొరగారు వ్రాసిన యీక్రింది జాబుఁ జదివినయెడల రామయ్యంగారెంత సాయముచేసెనో తెలియును. "ఇవి యిప్పుడు చట్టములైనవిగనుక నిదివఱకు నే నన్న నోటిమాటలే యిప్పుడు కాగితము మీఁద బెట్టుచున్నాను. ఈశాసన నిర్మాణములో నీవుచేసిన యపార సహాయమునకుఁ జెప్పిన యాలోచనకు నేను మిక్కిలి కృతజ్ఞుఁడనై యున్నాను. జాగ్రత్తతో అమలుజఱుపఁబడిన పక్షమున నీ రెండు చట్టములు జనులకు మిక్కిలి లాభకరములుగ నుండునట్లు నిర్మింపఁబడినవని నాయభిప్రాయము. మనమనుకున్నట్లే నిజముగా జరిగిన పక్షమున మొదటిశాసనము నిర్మాణముఁ జేయునపుడు రెండవసారి దానిం దిరుగ వేయునపుడు నీవుచేసిన సహాయమే దానికి గారణము" రామయ్యంగారు చదువుకొన్న పాఠశాలయొక్క సంవత్సరోత్సవము
రాఁగా నర్భతునాటుదొరగారా సమయమున మాటలాడుచు రామయ్యంగారినిఁ గూర్చి యిట్లు ప్రశంసించిరి. ఆకాలమున నీపాఠశాలలో నొక స్వదేశస్థుఁడనగా నిప్పుడు గవర్నరుగారి శాసననిర్మాణసభలో సభికుఁడుగానున్న యొక పెద్దమనుష్యుఁడు విద్యఁ గఱచుచుండెను. ఆ బడి యిట్టివానిఁ బ్రభవింపఁ జేయగలదని యెన్నడనుకోలేదు. ఆయన సత్ప్రవర్తనముంబట్టియు బుద్ధికుశలతం బట్టియు నీతినిం బట్టియు కార్యా చరణమునందు జూపెడు స్వతంత్రభావముం బట్టియుఁ జూడఁగా మన హిందూరాష్ట్రమందున్న శాసననిర్మాణ సభలలో నెక్కడ నింతవాఁడు లేడని ధైర్యముతోఁ జెప్పగలను. రామయ్యంగారు చెన్నపట్టణము మ్యునిసిపల్ సభలో నెనిమిది సంవత్సరములు సభికుఁడుగ నుండెను. ఆకాలములో నతఁడు పట్టణాభివృద్ధికి మిక్కిలి పాటుపడెను. ఒకసారి యప్పటిగవర్నరు రామయ్యంగారికి మునిసిపల్ ప్రసిడెంటు పనినియ్యఁదలంచెనుగాని రామయ్యంగారే దాని నంగీకరింపడయ్యె. 1871 వ సంవత్సరమందు విక్టోరియారాణిగా రాయనకు సి. యస్. ఐ. యను బిరుదమిచ్చిరి. ఆసమయమందు గవర్నరుగారగు నేపియం ప్రభువు రామయ్యంగారికీ క్రింది యర్థము వచ్చు నట్లింగ్లీషుతో నొకజాబు వ్రాసిరి. "నీకు సి. యస్. ఐ బిరుదువచ్చినది. అది కొద్ది దినములలోనే యథాగౌరవముగా గవర్నమెంటు సెక్రటరీచేత నీ కీయఁబడును. సత్ప్రవర్తనచేతను యోగ్యతచేతను గవర్నమెంటువారి చిరకాలసేవచేతను మిక్కిలి తగినవాఁడవగు నీకు విక్టోరియా రాణీగారు దీనిని దయచేసినందుకు నేనునిన్ను బహూకరించుచున్నాను." 1873 వ సంవత్సరమందున హిందూదేశపు ధనస్థితినిఁగూర్చి పార్లమెంటు సభవా రేర్పచిన కమిటీయెదుట సాక్ష్య మిచ్చుటకై యింగ్లాండు వెళ్ళవలసినదని దొరతనమువారు రామయ్యంగారి
నడిగిరి. కాని రాజా మాధవరావుగారి వలెనే రామయ్యంగారు కూడ వర్ణ ధర్మము చెడిపోవునను భయమున సీమకు వెళ్ళననిరి. 1875 వ సంవత్సరమందు రిజష్ట్రారు జనరలుపని కాళీరాగా దొరతనమువారు రామయ్యంగారికా పనినిచ్చిరి. 1877 వ సంవత్సరము జనవరి యొకటవ తేదీని ఢిల్లీనగరమున జరిగిన గొప్ప దర్బారునకుఁ జెన్నపురి గవర్నరుగారు రామయ్యంగారి నాహ్వానము చేసిరి. ఆ దర్బారునకు బోయి యాయన గవర్నరు జనరలుగారివలన బంగారు పతకమును బహుమానము వడసిరి. రామయ్యంగారు కాలానుసారముగ నన్నో కమిటీలలో సభికుడై మిక్కిలి యుపయోగములగు పనులంఁ జేసెను. ఆకమిటీలలో గొన్నియిక్కడ పేర్కొనఁబడును. 1. ఇంజనీరింగు డిపార్టుమెంటు స్థాపించుటకై యేర్పడిన కమిటీ. 2. చెన్నపట్టణము మునిసిపలు చట్టము మార్పుచేయుట కేర్పడినకమిటీ. 3. చెన్నపట్టణము మునిసిపాలిటీలో టీకాయల స్థితినిగూర్చి రిపోర్టు చేయుట కేర్పడిన కమిటీ. 4. చెన్నపురి రాజధానిలోనున్న బాలుర చేత నుపయోగింపబడు పుస్తకములను నిర్ణయించుట కేర్పడినకమిటీ. 5. హిందూమత స్థానములు, అనగా దేవాలయములు, మఠములు మొదలగు వాటి పరిపాలనము సరిగా నుండునట్లుచేయుట కేర్పడిన కమిటీ. 6. గ్రామమునసబు నిబంధనలను వ్రాయుటకై యేర్పడిన కమిటీ.
రామయ్యంగారు స్టాంపుల యధికారియైన తరువాత నతఁడు చెన్నపట్టణములో స్థిరముగా నుండునని తెలిసిన పిదప నార్టనుదొరగారాయనను పచ్చయ్యప్ప మొదలియారుగారియాస్తికి ధర్మకర్తగా జేసెను. అట్లు ధర్మకర్తగానుండి యాయన యింతింతనరాని పని జేసెను. పచ్చయ్యప్పగారి పాఠశాలను ధర్మములను మొదలంట
నాశనము చేయునట్టి యొకవ్యాజ్యము తేబడెను. ఆ వ్యాజ్యములో రామయ్యంగారుపడిన పాటువలననే పచ్చయ్యప్పగారి పాఠశాలనిలిచెను. విద్యా శాలలయందు రామయ్యంగారికి మిక్కిలి యభిమానముండుటచే పచ్చయ్యప్ప పాఠశాల స్వదేశస్థులయొక్కయు నాంగ్లేయులయొక్కయు నుపాధ్యాయులయొక్కయు విశ్వాసమునకు గౌరవమునకు బాత్రమైన దానిగా జేసెను. రామయ్యంగారు ధర్మకర్తగా నున్న కాలమందె పచ్చయ్యప్ప పాఠశాల సమర్థుఁడగు ప్రాధానో పాధ్యాయుఁడు కలిగి మంచి హైస్కూలులలో నొకటై క్రమ క్రమముగ రెండవ తరగతి కాలేజి యయ్యెను. ఈయన సభికుడుగా నున్న కాలమందె చెంగలరాయ నాయకుడను నతఁడు ధర్మకార్యముల నిమిత్తము వినియోగింపవలసినదని మరణశాసనము వ్రాసి యిచ్చిన యాస్తి ధర్మకర్త యధీనమయ్యెను. ఈ మరణశాసన మనేక సంశయములతో గూడియుండెను. తక్కిన ధర్మకర్తలు రామయ్యంగారి యాలోచనము మన్నించి విని యేసత్కారముల నిమిత్తమా యాస్తియుద్దేశింపబడినదో యాసత్కారములనిమిత్తము వినియోగించిరి. 1880 వ సంవత్సరమందు రామయ్యంగారు దొరతనమువారి కొలువు విడిచిపెట్టి తిరువాన్కూరు మహారాజుగారి యాహ్వానముమీద యా దేశమునకు మంత్రియయ్యెను. ఈయన మంత్రికాకమునుపే యామహారా జుత్తర ప్రత్యుత్తరముల మూలమున రామయ్యంగారి విద్యాసంపత్తి వివేకము గౌరవము పరిపాలన సామర్థ్యము దెలిసికొనుచు వచ్చెను. మహారాజు రామయ్యంగారినిఁ గూర్చి పడిన యభిప్రాయ మంతయు నాయన మంత్రియైన పిదప సరియె యని స్పష్టమయ్యెను. ఆయన తిరువాన్కూరులో నేడు సంవత్సరములు మంత్రియై యుండి యా కాలమందు సంస్థానమందలి
ప్రతి డిపార్టు మెంటులోను చాల మార్పులు చేసెను. ఆయన వెళ్ళునప్పటికి సంస్థానమందలి క్రిమినలు కోర్టులే చట్ట మాధారము లేక యేపద్ధతి ననుసరింపక నియమితమయిన మార్గము లేక వ్యవహారములు జరుపుచుండెను. అది గ్రహించి యాయన యింగ్లీషు ప్రభుత్వములోనున్న శిక్షాస్మృతి (పీనలుకోడ్డు) చర్య స్మృతి (క్రిమినలు ప్రొసీజరు కోడ్డు) తెప్పించి సంస్థానమందలి కోర్టులలో వాడుక చేయించెను. అదివఱకు సంస్థానమందలి పోలీసు బలగము తక్కువజీతములు గలిగి శిక్షలేక నేరస్థులను సరిగా బట్టుకొనలేక మిక్కిలి దుస్థితిలో నుండెను. రామయ్యంగా రీలోపము నివారించుటకు జెన్నపట్టణపు పోలీసుచట్టము దెప్పించి సంస్థానమందు వాడుకచేయించెను. అనంతరము రామయ్యంగారు న్యాయస్థానములను జక్కఁజేయఁ బూనెను. ఆదేశములో స్టాంపుడ్యూటి యెక్కువ పెట్టవలసి వచ్చినను జనులు విశేషముగా వ్యాజ్యములు వేయుచు వచ్చిరేకాని తగ్గలేదు. అందుచేత పని తెమలక కోర్టులో వ్యాజ్యములతో నిండియుండెను. అందుచేత మునసబులకు స్మాలుకాజుల యధికార మిచ్చి వారిజీతములు వృద్ధిచేసి జిల్లాజడ్జీల సంఖ్య తగ్గించి మొత్తము మీఁద న్యాయాధికారుల కందఱకు జీతములు హెచ్చుచేసి మేజస్ట్రీటులకు పోలీసధికారము తీసివేసి యనవసరముగ నధికసంఖ్యగ నున్న మేజస్ట్రీటులను తగ్గించి వారికి యెక్కువ యధికారములిచ్చి తిరువాన్కూరులోనున్న హైకోర్టును దగిన స్థితిలోఁ బెట్టెను. అనంతర మతఁడు రివిన్యూవ్యవహారములఁజక్క జేయనారంభించెను. ఈడిపార్టుమెంటులో న్యాయస్థానములోనున్న పద్ధతులకంటె పురాతన పద్ధతులు చెడుపద్ధతులు బ్రబలియుండెను. ఈ రివిన్యూ శాఖలోనున్న కొలువుగాండ్రకు జీతములు తక్కువ, పనిచేయుటకు సామర్థ్యము
లేకపోవుటయను రెండుదోషములు పట్టియుండుటచే రామయ్యంగారుద్యోగస్థుల సంఖ్య తగ్గించిజీతములు వృద్ధిఁ జేసియాడిపార్టుమెంటు నంతను స్థిరమయిన పునాదిమీఁదఁబెట్టెను. ఉప్పుకొఠారులమీఁదఁ దగినంత యదపు గలుగునట్లా డిపార్టుమెంటునంతను మంచి స్థితిలోనికి దెచ్చెను. వీని యన్నిటికంటె శ్లాఘనీయమైన కార్యమేమనఁగా రామయ్యంగారు తిరువాన్కూరు సంస్థానమంతయుఁ గొలిపించి భూములయొక్క శిస్తు స్థిరపరచెను. అనఁగా సర్వే సెటిలుమెంటును జేయించెను. ఈసర్వే లేకపోవుట సంస్థానమునకు మిక్కిలి నష్టకరముగా నుండెననియు నదిచేయించుటచే జాల లాభములు కలుఁగుననియు నయ్యంగారి తరువాత వచ్చిన మంత్రులు గూడ నొప్పుకొనిరి. వెనుకటి నేలకొలతలు రివిన్యూలెక్కలు సరిగా నుండనందున వ్యవహారము చక్కగా జరుపుట యవశ్యమయ్యెను. అందుచేత రామయ్యంగారా కొఱత నివారించుటకు సమగ్రముగా నేల సర్వే చేయించుటయే యుత్తమ సాధనమని తగువిధమున నట్లు చేయించెను. ఈసర్వే సెటిలుమెంటులు నేలయొక్క పరిమితిని సారమును నిరూపించెను. శిస్తు వృద్ధిజేసెను. ఖజానా ధనముతో నింపెను. భూమి విషయమయి వివాదములు వచ్చినప్పుడు వెనుక నెట్లున్నదో చూచుకోవలయునన్న తగిన యాధారములుగ నేర్పడెను. తిరువాన్కూరు చెఱసాలలోనున్న ఖైదీలచేత నదివఱకు పురవీధులలోఁగూడ పని చేయించుచు వచ్చిరి. రామయ్యంగా రట్టివాడుక మానిపించి ఖైదీలు చెరసాలలోనే పనిచేయునట్లు విధించెను. సంస్థానమందలి ప్రజ లదివఱకు చిల్లరపన్ను లనేకము లిచ్చుకొనుచు వచ్చిరి. ఇవి ప్రజలను వేధించునవి. సర్కారునకు లాభము లేనివి యగుటచే వానిని రూపుమాపెను. ఇవిగాక యా సంస్థానములో మరియొక చిత్రమయిన
వాడుక యుండెను. పన్ను లిచ్చుకొనలేని పేదజనులు కొన్ని వస్తువులను సర్కారున కుచితముగాఁగాని లేక మిక్కిలి స్వల్పధరకుఁగాని తెచ్చి యిచ్చుచుండవలెను. అట్టివాడుక యుండకూడదని దాని నితఁడు నిర్మూలించెను. ఆదేశమునందలి చేతిపనులను విశేషముగ వృద్ధిచేసి నూతన వస్తు నిర్మాణయంత్రములను పెట్టించెను. ఇందు ముఖ్యమయినవి పంచదారచేయు యంత్రము. కాగితములుచేయు యంత్రము, దూదియంత్రము. వెండియు నతఁడు స్టాంపుచట్టము నొకటి నిర్మించి కాఫీగింజలు పండెడు నేలలకు పన్నులు కొట్టివేసి చిల్లరసరకులమీద నెగుమతి పన్నులు తీసివేసి భూమిలో పండిన వస్తువుల నేఁటేఁట ప్రదర్శనములు పెట్టించి జనులకుఁజూపి కృషి నభివృద్ధిఁజేసి జనులుపెట్టుకొన్న చిన్న పాఠశాలలకు నేటేటఁ గొంత ధనసహాయమిచ్చి విద్యాభివృద్ధి జేయుచు నార్మలు పాఠాశాలలు స్థాపించుచు నల్ల మందుమీద దిగుమతిపన్నుఁ గొట్టివేసి తిరువాన్కూరులోనున్న జలాధారములను వృద్ధిబఱచి శాశ్వతమయిన యుపకారముఁ జేసెను. వేయేల ? సంస్థానమందతడు బాగుచేయని డిపార్టుమెంటొకటియు లేదు. ఆతని ప్రజ్ఞ యేమోకాని యాతడు సంస్థానపు సొమ్ము ఖర్చు పెట్టి చేయించిన పనులలో నొకటియుసొమ్ము దండుగ యగునట్లు నిష్ఫలము కాలేదు. అట్లు తానుచేసిన యనేక సంస్కారములచేత సంస్థానమంతయు రత్న గర్భమయి ధనముతో దులదూగుచున్నందున దన కార్యముల ఫలితములం జూచుచు జిరకాలము సంస్థానమునందు బనిజేయవలయునని రామయ్యంగారు తలంచిరి. కాని యట్లు చేయుటకు వీలుపడదయ్యె. ఇప్పటికి మహారాజుగారివద్ద నొక సంవత్సరము పనిచేసి తాను ప్రారంభించిన సర్వేసెటిలుమెంట్లు రెండు తాలూకాలలోమాత్రమే సమాప్తమగునప్పటికీ నతఁడు తిరువాన్కూరువదిలి పెట్టవలసివచ్చెను. రామయ్యంగారు సంస్థానమును విడిచి వెళ్ళుటకు కొన్ని దినముల పూర్వమందు ప్రస్థుత మహారాజుగారు మంత్రిపేర నొకజాబువ్రాసిరి. ఆజాబులో రామయ్యంగారు జనుల యభివృద్ధికై యాఱు సంవత్సరములు పాటుపడినట్లు వ్రాసిరి. ఈవిధముగానే ఇంగ్లీషువారు రెసిడెంటుకూడ వ్రాసెను. 1887 వ సం|| మున రామయ్యంగారు తిరువాన్కూరు సంస్థానము విడిచి తనజీవితకాల శేషము మత వ్యాసంగములలో గడఁపదలఁచి చెన్నపురముంజేరెను. కాని యా సంవత్సరము చెన్న పట్టణములలో గాసిన యెండల వేడిమి యాయన శరీరమునకు బడక జ్వరబాధగలిగించెను. ఎన్ని చికిత్సలు చేసిననది నివారితముగాక యెట్లకేల కాయన ప్రాణము దీసి చెన్న పట్టణమునకు సత్పురుష వియోగము గావించెను.
రామయ్యంగారు పుస్తకములు చదువుటయందు మిక్కిలి తమకము గలవాడు. చెన్నపట్టణపు పుస్తకముల దుకాణములలో గ్రంథములు కొననినెల, సీమనుండి పుస్తకములు తెప్పింపని నెల లేదని, చెప్పవచ్చును. ఆయన మరణానంతరము భార్య యాతని గ్రంథ భాండారము శ్రీపచ్చప్పయ్యగారి కళాశాలకు బహుమానముగా నిచ్చెను. అక్కడ నిప్పటికి రామయ్యంగారు శ్రద్ధతోఁ జదివిన యానవాళ్ళు గల పుస్తకములు మనమిప్పుడు చూడవచ్చును. తనవద్దకు వచ్చిన వారి కందఱకు నతఁడు మంచిపద్ధతుల నేర్పరుచు సంభాషణమునందు
గాని వ్రాతయందుగాని యతిశయోక్తి గర్హించుచుండెను. రామయ్యంగారు మితభాషి. ఏ సంగతినిగాని జరిగిన యధార్థమంతయు దెలిసికొనక ముందతడు నమ్మువాడుకాడు. ఈ సంగతి యాయన జాబులు చూచినవారికి దెలియును. ఆయనకు స్వభావముచేతనే కొన్ని విషయములం దిష్టము కొన్ని విషయములయం దనిష్టము గలుగుచు వచ్చెను. కాని తన తప్పులను తనకు సహేతుకముగ నెవరయిన నెఱిగించిన నవియొప్పుకొని తన నడత దిద్దుకొనుచు వచ్చెను. అతడు తాబేదారులవద్దనుండి కఠినముగ బనిబుచ్చుకొనునట్టి యజమానుడు. తన పై యధికారులవద్ద తానుకూడ నట్లే పనిచేసెను. వ్యవహారములలో గఠినుఁడగుటచేత నతని యాప్తులైనవారే యనేకులు తమ్మతడు గౌరవభంగము చేసెనని విచారించుచు వచ్చిరి. అతఁడు ప్రాచీన పద్ధతుల యందభిమతము గలవాడైనను నూతన పద్ధతులమీద మార్పులను మెల్లఁగా జేయ నిచ్చగలవాడు. తన యిల్లు యూరోపియనుల గృహముల విధమున నుంచుకొని తన యాఁడువాండ్రకు నింగ్లీషు సంగీతము జెప్పించి యింగ్లీషు వారిని తనయింటికి విందునకుఁ బిలిచి వారితో నెక్కువమైత్రి నడపిన స్వదేశస్థులలో నితడే మొట్టమొదటివాడు. యూరోపియనులకు స్వదేశస్థులకు సాంఘిక సంబంధములను వృద్ధిజేయుట కప్పటి గవర్నరుగారగు నేపియరు ప్రభువు కాస్మాపాలిటను క్లబ్బనుపేర నొకసభ స్థాపింపుమని చెప్ప నట్టిసభ స్థాపించినయతఁడితడే. దానికి మొదటి కార్యదర్శి యితఁడే. గవర్నరుగారి శాసన నిర్మాణసభలో స్వదేశ సభికుల నెక్కువమందిని చేర్చవలసినదనియు బడ్జటు విషయమయిన చర్చ జరిగించుటకు యవసరమయినప్పుడు గవర్నమెంటువారిని ప్రశ్నలడుగుటకు సభికుల
కధికారమీయ వలసినదనియు దొరతనమువారిని మొట్టమొదట నడిగిన ధైర్యశాలి యితడే. ఇవి యన్నియు గ్రమక్రమమున మన దేశస్థులకు లభించినవికాని యీయన మరణానంతరమందు ననగా నీయన యడిగిన చాలాకాలమునకు లభించినవి. తిరువాన్కూరులో నున్నప్పుడీయన "పరలోకమే మన మనోరథము" అను నర్థము వచ్చునట్టి యింగ్లీషు మాటలను బంగారపు టక్షరములలో నొక్కొక్కయక్షర మొక్కొక్క బొమ్మగా నుండునట్లచ్చు వేయించి ప్రతి దినమది తన కగపడునట్లు గృహమునఁ గట్టుకొనియెను.