మహాపురుషుల జీవితములు/రాజేంద్రలాలు మైత్రా
రాజేంద్రలాలు మైత్రా
రాజేంద్రలాలు మైత్రా యను నతఁడు బంగాళాదేశములో గౌరవముగల శూద్రకుటుంబములో పుట్టినవాఁడు. ఆయన 1824 వ సంవత్సరమున సూరాయను గ్రామమున జన్మించెను. వానితండ్రిపేరు జనమేజయుఁడు. ఆయనకుఁ గలిగిన యాఱుగురు కుమారులలో రాజేంద్రలాలుమైత్రా రెండవవాఁడు. ఈమైత్రాను జిన్నతనమున నుండియుఁ గలకత్తానగరమున నున్న వానిమేనత్త పెంచెను. ఆ మేనత్త యీ బాలకుని పెంచుకొని తనకున్న సొత్తునంతయు నీయ వలయునని తలంచెను. కాని యట్టిపెంపు శాస్త్రసమ్మతముగాకుండుటచే నూరకొనవలసివచ్చెను. ఆ బాలకుఁడు స్వభాషయగు బంగాళిని తనకులగురువునొద్ద నేర్చికొని యనంతరము కలకత్తాలో సుప్రసిద్ధికెక్కిన రెండుపాఠశాలలలో నింగ్లీషు నభ్యసించెను.
ఆకాలముననే యీబాలకుని మేనత్త మృతినొందఁ గుమారునకు విద్య చెప్పించవలసిన భారము జనమేజయునిపైఁ బడెను. కుమారుఁడు కుశాగ్రబుద్ధియని యెరుంగుటచే తండ్రి వాని చదువును మానిపింపఁ జాలఁడయ్యె. కాఁబట్టి జనమేజయుఁడు చక్కగ విచారించి తనపిల్లవానికి విద్యార్థి వేతనమునిచ్చునట్టి పాఠశాలలో నెందైన బ్రవేశ పెట్టుట కర్తవ్యమని నిశ్చయించుకొని యట్టిబడి యెక్కడ నున్నదని వెతకనారంభించెను. ఆకాలమునఁ గలకత్తానగరమున వైద్యకళాశాల (మెడికల్ కాలేజీ)లో దొరతనమువారొక్క విద్యార్థికి నెలకెనిమిది రూపాయిల వంతున జీతమిచ్చి వారివద్దనుండి యేమియు మరల గ్రహింపకయే వైద్యశాస్త్రము చెప్పుట కేర్పాటు చేసిరి. ఆ పాఠశాలాధికారులు రాజేంద్రలాలు మైత్రాను గూడ నట్టి విద్యార్థిగఁ దీసికొనిరి. కాని యప్పుడే యతనికి దారుణజ్వరము సంభవించుటచే నతఁడందు వెంటనే చేరలేకపోయెను. రాజేంద్రుడు పదునై దేండ్ల ప్రాయముగలవాఁ డయినప్పు డనఁగా 1839 వ సంవత్సరమున వైద్యకళాశాలలో పైన పేర్కొనబడిన పద్ధతిని విద్యార్థి యయ్యెను. కళాశాలలో నతఁడు చేసిన విద్యాభివృద్ధి మిక్కిలి ప్రశంశనీయమై యుండెను.
ఆతని బుద్ధికుశలత విని మహర్షి దేవేంద్రనాథ టాగూరుగారి తండ్రియగు ద్వరకానాథ టాగూరుగారు మైత్రా నింగ్లాండు దేశమునకుఁదీసికొనిపోయి యక్కడవిద్య పరిపూర్తి చేయింతుననిచెప్పెను. కాని తండ్రి మైత్రాను విదేశమునకు బంపడయ్యె. ఆ వైద్యకళాశాలలోనున్న కాలముననే రాజేంద్రుడు కేవలముతనయశ్రద్ధచేత దొరతనమువారి కైదువందల రూపాయిలు నష్టము గలిగించెను. ఒకనాడతడు కొన్నిలోహలను గరగించుచుండెను. అట్లు కరగించుటకు ప్లాటినం అను మిక్కిలి విలువగల లోహముతో చేయబడిన మూస యొకటి తెచ్చి దానిని నిప్పులమీఁదబెట్టి యా లోహమందువేసి కరగింప నారంభించెను. కొంతసేపటికి రాజేంద్రుడు తనప్రయత్న మెంతవఱకు నెర వేరినదో తెలిసికొందమని చూచునప్పటికి మూసయే కరగి పోయెను. అది చూచి బాలుఁడగు రాజేంద్రుడు భయమున గడగడ వడఁకుచు తనయొజ్జయగు ప్రకృతి శాస్త్రపండితున కాసంగతి విన్నవింప నతడు వానిని చీవట్లుపెట్టి కళాశాలకు నధికారియగు డేవిడ్ హైరుదొరగారి కాసంగతి దెలియజేసెను. ఆదొరగారును రాజేంద్రుని పిలిపించి వానిం దిట్టక కొట్టక కళాశాలలోనుండి తీసివేయక యట్టి పనులయెడల ముందు జాగరూకతతో మెలంగవలయునని చెప్పి మందలించి పంపెను. రాజేంద్రుడు వైద్యకళాశాలలోఁ జిరకాలముండ లేదు. అచ్చట విద్యార్థులు కొందరు దుష్ప్రవర్తకులై సంచరించినందున నధికారులు వారి నడతంగూర్చి విచారణ సలిపిరి. ఆరాజేంద్రు డాచెడునడత గల బాలకులలో నొకడు కాడుగాని యాదుర్మార్గులను బట్టియిమ్మని యధికారులు వాని నడిగినప్పుడు తనమిత్రులను బట్టియిచ్చుట కిష్టములేక యతఁ డూరకొనియెను. అది కారణముగ నధికారులు వానిని కళాశాలలోనుండి కొంతకాలము వెడలఁగొట్టిరి. రాజేంద్రుడు మరల నావైద్యశాలకు నధికారులు రానిచ్చినను రాదలపడయ్యె. ఆవైద్య పాఠశాలలో నుండగానే యతఁ డాంగ్లేయభాషలో మంచిసాహిత్యముగల కామరాన్ అను దొరవద్ద నింగ్లీషు చదివి యందు గట్టికృషి చేసెను. యీ కామరాను దొరవద్దనే రాజేంద్రుడు హూణభాష పదములను బ్రయోగించుటలో నిరుపమానమయిన ప్రజ్ఞను సంపాదించెను.
అనంతర మతడు ధర్మశాస్త్రము జదువ నిశ్చయించి న్యాయవాదిపరీక్షకు బోయెను. కాని ఆ సంవత్సరము ప్రశ్నాపత్రములు ముందుగా వెల్లడియగుటచే బరీక్షకులు జరిగిన పరీక్ష నిరర్థకముచేసిరి. అందుచే పరీక్షలో గృతకృత్యుడయితీరవలసిన రాజేంద్రునకు నష్టము సంభవించెను. రాజేంద్రలాలుమైత్రా వైద్యు డగుటకుగాని న్యాయవాది యగుటకుగాని యోగము లేకపోయెను.
పిమ్మట చేయవలసిన దేమియులేక యతం డనేకభాషల జదువుటకు బ్రారంభించెను. అదివరకే వానికి పారశీభాష చక్కగవచ్చును. అప్పటికి సంస్కృతమందు వాని పాండిత్యము కొంచెమై యుండుటచే ముఖ్యమయిన యాభాషలో నధికకృషి చేయుట కతఁడు నిశ్చయించుకొనెను. అదిమొదలు రాజేంద్రుడాభాషలో నధికపాండిత్యము సంపాదించి గొప్పగొప్ప విద్వాంసుల మెప్పువడసెను. గ్రీకు లాటిను భాష లను మునుముందు నేర్చి యనంతరము ఫ్రెంచి జర్మనుభాషలనుజదివి పిమ్మట హిందీ ఉరుదు భాషల నభ్యసించి మొత్తముమీద పదిభాషలను జదువ వ్రాయ మాటలాడఁగల పండితుడయ్యెను. ఎన్ని భాషలు తనకువచ్చినను తనభాషలు తనకన్నము పెట్టజాలవని యెఱుగి రాజేంద్రుడేదైన యుద్యోగములో బ్రవేశింపవలయునని నిశ్చయించుకొని 1846 వ సంవత్సరమున బెంగాలు ఏషియాటిక్కు సొసైటి యను సంఘమునకు సహాయకార్యదర్శియు గ్రంథభాండార సంరక్షకుఁడు నయ్యెను. అప్పటికతని వయస్సిరువదిమూడు సంవత్సరములు. ఈయుద్యోగమువలన నుపయోగములగు ననేకగ్రంథములువాని స్వాధీనములో నుండుటచే నతడు వాని వన్నిటిని సారముగ్రహించి జ్ఞానాభివృద్ధి చేసుకొనఁజొచ్చెను. ఆసంఘముయొక్క కార్యదర్శుల సహాయమున నతఁ డింగ్లీషుభాషలో మంచిశైలిని వ్రాయుటకలవరుచుకొని కొలది కాలములోనే పైసహాయము లేక స్వయముగ మంచి వ్రాతలు వ్రాయనేర్చెను. ఆసంఘమువారి గ్రంథము లన్నియుఁ సరిగా జాబితా వ్రాసి యమర్చి తనకు తీరికయున్నప్పుడు సంఘమువారి మాసపత్రిక కేవైన వృత్తాంతములు వ్రాయుచువచ్చెను. అట్లుకొన్ని నాళ్ళు వ్రాసి 1850 వ సంవత్సరమున రాజేంద్రుఁడు భాషాగ్రంథములను ప్రకృతి శాస్త్రములను వ్రాసి ప్రకటించుటకై వివిదార్థ సంగ్రహమను పేరు గల యొకమాసపత్రికను బంగాళీభాషలో స్వయముగ బొమ్మలతోఁ బ్రకటింప నారంభించెను. అట్లతఁడు పత్రిక నేడు సంవత్సరములు ప్రకటించి మరుచటి సంవత్సరమున మైనరుజమీందార్లకు విద్యచెప్పు పాఠశాలకు నధ్యక్షుఁడుగ నియమింపఁబడెను. ఇందుమూలమున నతఁడు పాఠశాలలోఁజేరిన జమీందార్లబిడ్డలకు సంరక్షకుఁడయ్యెను. ఈజమీందారీ పాఠశాల యేకారణముచేతనో దొరతనమువా రనుకొనినంత వృద్దిని పొందకపోవుటచే 1880 వ సంవత్సరమున నదియెత్తి వేయఁ బడుటయు రాజేంద్రలాలున కుపకారవతన (పించను)మిచ్చుటయు సంభవించెను.
రాజేంద్రలాలు దొరతనమువారు తనకప్పగించిన యాపనిని మిక్కిలి శ్రద్ధగాను ప్రభువులకుఁ దృప్తికరముగాను నిర్వర్తించెనని చెప్పుకొనక తప్పదు. అప్పటి బంగాళా గవర్నరుగారు జమీందార్ల పాఠశాలవిషయమున రాజేంద్రుఁడు చేసిన పనిని మెచ్చుకొనుచు నిట్లువ్రాసెను. ఇట్లు పాఠశాలను పరిపాలించుట మిక్కిలి కష్టసాధ్యమయిన పనియయినను బాఠశాలఁ గాంచిన వృద్ధి దాని పరిపాలకునకు మిక్కిలి ప్రతిష్ఠఁ దెచ్చుచున్నది. ఈకాలమున బంగాళాదేశములో చక్కగ వ్యవహరించుచున్న జమీందార్లనేకులు గలరు. వారందఱు రాజేంద్రలాలుమైత్రాయొక్క శిష్యులే యగుటచేఁ దమకట్టి సామర్థ్య మీరాజేంద్రుని శుశ్రూషవల్లనే గలిగినదని యొప్పుకొని తమకృతజ్ఞత ననేక పర్యాయములు చూపియున్నారు.
రాజేంద్రలాలుమైత్రా కేవలము ప్రాచీన విద్యలయందె తన కాలముబుచ్చెను. అతఁడు చేసిన పరిశ్రమయంతయు నేషియాటిక్కు సంఘమువారి మాసపత్రికలోను తదితర పత్రికలలోను స్పష్టముగ గనఁబడును. అతఁడు రచియించిన గ్రంథములలో ముఖ్యమైనవి ఉత్కలదేశ ప్రాచీనచరిత్ర బుద్ధగయప్రాచీన చరిత్రయనునవి రెండు. యప్పుడప్పుడు అతఁడు వ్రాసిన వ్యాసములు "ఇండోఆర్యనులు" అనుపేర రెండు సంపుటములుగ ముద్రింపఁబడి యున్నవి. ఆయన మునిసిపల్ కమీషనరుగా కూడ నుండెను. ఆయుద్యోగమున నతఁడు కావలసినంత స్వాతంత్ర్యములఁజూపి న్యాయముకొఱకుఁ బోరాడుచు వచ్చెను. అప్పుడప్పుడాయన హిందూపేట్రియేటు పత్రికకుఁ గూడ కొన్నిసంగతులు వ్రాయచుండువాఁడు. కృష్ణదాసుపాలుని మరణాంతరమున పేట్రియేటు పత్రిక నితఁడె నడపెనని చెప్పవచ్చును. కాని యాపత్రిక నడపుటఁకుఁ గావలసినంత యోపిక యతనికి లేకుండుటచే నాపని యతనికి కష్టమని తోఁచెను. ఇట్లు తేజోవంతమైన జీవయాత్ర మఱువదియేడు సంవత్సరములవఱకుఁ జేసి రాజేంద్రలాలుమైత్రా 1891 వ సంవత్సరమున పక్షవాత రోగముచేతఁ గాలధర్మ మొందెను.
మేధావంతుఁడై మిక్కిలి పూనికతో పాటుపడు మనుష్యుఁడెంత యభివృద్ధినొందునో రాజేంద్రలాలుని చరిత్రమువల్ల తెల్సికొనవచ్చును. ఆంగ్లేయభాషలో వ్రాయుటకు మాటలాడుటకు నతని కద్భుతశక్తిఁ గలదు. సర్‌రిచర్డు టెంపిలు దొరగారు "ఆకాలము మనుష్యులు కార్యములు" అను నర్థముగల యాంగ్లేయ గ్రంథమును వ్రాయుచు రాజేంద్రునిఁగూర్చి యిట్లు వ్రాసిరి. "ఆంగ్లేయభాషను ప్రాగ్దేశభాషలను నేర్చిన పండితులలో నితఁ డగ్రగణ్యుఁడని చెప్పవచ్చును. పూర్వ హిందువుల యద్భుత ప్రజ్ఞలం దలంచి యతఁడు మిక్కిలి యక్కజమును గరువమును బొందుచు నీనాఁటి హిందువుల దురవస్థను గూర్చి మిక్కిలి వగచు చుండువాఁడు." మోక్సుమూలరుపండితుఁడు తన గ్రంథములలో నొకదానియందు వీనింగూర్చి యిట్లువ్రాసెను, "రాజేంద్రలాలు మైత్రుఁడు వృత్తిచేత పండితుఁడే గాక గట్టి విమర్శకుఁడు. ఏషియాటిక్కు సంఘము వారి యొక్క మాసపత్రిక కనేకములగు విషయములను వ్రాసి యతఁడు హిందూదేశ ప్రాఁచీన విద్యలనుగూర్చి యీవరకు తప్పులగు నభిప్రాయములు గల తన దేశస్థులందఱికంటె నెక్కువవాఁడని తేట పరచెను.
అతఁడు వ్రాసిన గ్రంథము లన్నియు నేఁబది. అవి నూట యిరువదిసంపుటములుగ విభజింపఁ బడియున్నవి. అ గ్రంథములయందలి పుటలు ముప్పదిమూఁడు వేల కంటె నెక్కువఁ గలవు. ఈ సంపుటములు హిందూదేశ ప్రాఁచీనవిషయములు సంస్కృతము నుండి చేసిన భాషాంతరీకరణములు స్వతంత్రముగ బంగాళి భాషలో రచించిన గ్రంథములు సభలో నిచ్చిన యుపన్యాసములు పత్రికలకు వ్రాసిన సంగతులు గలవై యాతని సర్వతోముఖ పాండిత్యమును వెల్లడి చేయుచున్నవి.
1885 వ సంవత్సరమున ఏషియాటిక్కు సంఘమునఁ కతఁ డధ్యక్షుఁడయ్యెను. అదివఱకు హిందువుల కెవరికి నంతటి గౌరవము పట్టియుండలేదు. కావున రాజేంద్రలాలు మైత్రున కింతటి గౌరవము కలిగినందులకు దేశస్థులందఱు మహానందభరితులైరి. 1886 వ సంవత్సరమున కలకత్తాలో దేశీయమహాసభ జరిగెను. అది రెండవ సభ. హిందూదేశము నంతనుండియు దేశీయమహాసభకుఁ ప్రతినిధులుగా వచ్చు పెద్దమనుష్యులను సన్మానము చేయుటకై యొకసభ యేర్పడెను. ఆసభకు నగ్రాసనాధిపతిగా నుండుటకు రాజేంద్రలాలు మైత్రునికంటె నర్హుఁడు లేఁడని కలకత్తానగరవాసులు వాని నైక కంఠ్యముగ నధ్యక్షునిఁ జేసిరి. ఇంతియగాక యతఁడు బ్రిటిషు యిండియా సంఘమునకుఁ గూడ నగ్రాసనాధిపతియై యుండెను. ఈ సంఘములో బంగాళా దేశమునందుఁ గల గొప్ప జమీందారులు విద్యావంతులు సభికులుగా నుండిరి. అట్టి సంఘమున కతఁడు సభాధ్యక్షుఁడుగా నుండుటచేతనే జనుల కతనియం దెంత గౌరవమున్నదో తెలిసికొనవచ్చును.
ఈ సంఘము దేశమున కెంతయు నుపకారముఁ జేసినది. ఇట్లు చేయుటకు సభాధ్యక్షుఁడగు రాజేంద్రుఁడే ముఖ్యకారణమని ప్రజలనుకొనిరి. అతని పాండిత్యమును పరిశ్రమను గనిపెట్టి హిందువులేగాక యితర దేశస్థు లనేకులు వానిని తమతమ దేశములందున్న విద్యావిషయక సభలలో సభ్యునిఁ జేసికొనిరి. కలకత్తా యూనివరు సిటీవారు వానికి డాక్టరను బిరుదము నిచ్చిరి. డాక్టరుశబ్దమున కిక్కడ వైద్యుడనే యర్థముగాదు. డాక్టరనఁగా పండితుఁడు. ప్రకృతి శాస్త్రము. ధర్మశాస్త్రము మొదలగు వానియం దసాధారణప్రజ్ఞఁగల పండితులకుఁ దరుచుగా నిట్టి బిరుదములు విద్యాశాఖావా రిచ్చు చుందురు. దొరతనమువారు వానియందుఁ దమకుఁగల గౌరవమును బట్టి సి. ఐ. ఇ, రావు బహదూరు రాజాయను బిరుదముల నిచ్చిరి. 1877 వ సంవత్సరమునందు జరిగిన దర్బారులో సర్ ఆష్లీఇడెం దొరగారు రాజేంద్రలాలునితో నిట్లనిరి. "కోర్టుఆఫ్ వార్డ్సువారి యధీనమునం దుండిన మైనరు జమీందారుల విద్య మీచేతిలో నుంచఁబడినది. అందుచేత బంగాళమునందున్న జమీందారులలో ననేకులు మీ ఋణమును దీర్చుకొనజాలరు. మీరు సంస్కృత భాషలో నధికపాండిత్యము సంపాదించి జగద్వ్యాప్తమైన కీర్తిని సంపాదించినారు. మీప్రజ్ఞ లన్నియు నెఱిఁగి దొరతనమువారు మీకు రావుబహదూరు బిరుదము నిచ్చినారు."
తన దేశస్థుల కెపుడైనకూడనియపకారము జరిగినపుడు దానిని బయలుపెట్టి మిక్కిలి కఠినోక్తులతో దానింగూర్చి ప్రశంసించుచువచ్చెను. దీనికొక్క యుదాహరణము చెప్పవలసియున్నది. నీలిమందుతోటల యజమానులు బంగాళాదేశమునందలి రహితుల కొత్తుడు గలుగఁ జేసి బాధించినపుడు రాజేంద్రలాలు దిక్కుమాలిన రహితులపక్షముఁ బూని తోటల యజమానుల ప్రవర్తనము సరిగా నుండలేదని కలకత్తాలో నొకమహాసభలోఁ బలికెను. ఇట్లతఁడు బహిరంగమైనసభలో తమ్ము నిరసించినాడనికోపించి నీలిమందుతోటల యజమానులగు నాంగ్లేయులు కొందఱు కడుపుమంట తీరక పోటోగ్రాఫిక్కు సంఘమున జేరి రాజేంద్రలాలుమైత్రుని సంభాషణము సరిగా నుండ లేదని ఖండించి యతని నా సంఘములోనుండి తొలఁగింప బ్రయత్నించిరి. రాజేంద్రుఁడు సంఘములో చిరకాలమునుండి సభ్యుడుగా నున్నందున వానిం దీసివేయుటకుఁ వీలులేక యా దొరలు తుదకిట్లు తీరుమానము చేసికొనిరి. "నగరమందిరమున రాజేంద్రలాలు మైత్రుఁడుచేసిన యుపన్యాసమునందలి మాటలఁ నీ సంఘమువారు విని యందు మొదటినుండి చివరవఱకుఁ నబద్ధములే యుండుటచేత నట్టి యుపన్యాస మిచ్చి నతడీ సంఘములో సభికుఁడుగా నుండుటకు తగఁడని నిశ్చయించి యట్టివానిం దీసివేయుట కిప్పటి నిబంధనలలో నేవియు నాధారములు గనబడకపోవుటచే రాజేంద్రలాలు తనంతట తానే యీ సంఘమునుండి మానుకొనవలయునని యిందుమూలముగా తెలియజేయు చున్నారు."
మేజర్ థల్లియర్ దొరగారు రాజేంద్రుని పక్షముబూని యతనివలన లోపము లేదనియు ననేకపర్యాయములు నాంగ్లేయులు పెక్కండ్రు హిందువుల నింతకంటె నెక్కుడు కఠినోక్తులతో నిందించిరనియు రాజేంద్రలా లాంగ్లేయుల నందఱిని తిరస్కరింప లేదనియు తప్పుచేసిన నీలిమందుతోటల యజమానులనే నిరసించెననియు సంఘము వారట్లు తీర్మానము చేయఁగూడదనియు వాదించెను. హ్యూము దొరగారు మొదలగు కొంద ఱాంగ్లేయులు థల్లియరు దొరగారితో నేకీభవించిరి. కాని యా సంఘమువారిలో నెక్కువమంది రాజేంద్రునకుఁ బ్రతిపక్షులుగా నున్నందున వారిమాటలు సాగవయ్యె. అది కారణముగ రాజేంద్రలాలుతోపాటు థల్లియరు దొరగారుకూడ నా సంఘము విడిచిరి.
అతని మరణాంతరమున వానింగూర్చి వ్రాసిన స్వదేశ పత్రికలు రాజేంద్రలాలుమైత్రుఁడు రామమోహనరాయలు కంటెను, కేశవచంద్రసేనుని కంటెను, మేథావంతుఁడనియు మేథావంతుఁడే గాక విద్యావంతుఁడనియు వానిమరణము దేశమున కంతకు నష్టముఁ గలిగించెననియు నివారించెను. పదిభాషలలో నిరర్గళ పాండిత్యము గలిగి సంస్కృతమునం దింతింత యనరాని ప్రజ్ఞ గలిగి యింగ్లీషులో నాంగ్లేయులకు సయితము నీర్ష్యఁ బొడమింపఁగల సామర్థ్యము గలిగి ప్రపంచము నందుండిన సమస్తవిద్యా సంఘములలోను సభ్యుఁడుగా నున్న హిందువుఁడు పందొమ్మిదవ శతాబ్దమునఁ రాజేంద్రలాలుఁ డొక్కఁడేయని తెలిసికొనవలయును.