మహాపురుషుల జీవితములు/రాజా సర్. మాధవరావు

రాజా సర్ మాధవరావు

మాధవరావు 1828 వ సంవత్సరమున గావేరీ తీరమందలి కుంభకోణ పట్టణమందు జన్మించెను. ఈయన కుటుంబము మిక్కిలి గౌరవనీయమయినది. ఆయన తండ్రి రంగారావు కొంతకాలము తిరువాన్కూరు దివానుగా నుండెను. ఆయన పినతండ్రి రామరాయ వెంకట్రావుగూడ తిరువాన్కూరు సంస్థానమున మంత్రియై యుండెను. తండ్రి మాధవరావును జిన్నతనమందే చదువునిమిత్తము చెన్నపట్టణమున కంపెను. మాధవరా వప్పటి చెన్నపట్టణపు హైస్కూలులోఁ జేరి పవెలుదొరవద్ద విద్యారసముంగ్రోలెను. ఈయన సహాధ్యాయు లందరు మిక్కిలి సుప్రసిద్ధులైరి. మాధవరావు మిగుల జాగరూకతయు శ్రద్ధయుఁ గలిగి విద్యాభ్యాసము చేసెను. ఆయన గణితశాస్త్రము ప్రకృతిశాస్త్రము నేర్చుకొనుటయేఁగాక యుపాధ్యాయుఁ డగు పవెలుదొరగారి మేడమీఁది జ్యోతిశ్శాస్త్రము నభ్యసించెను. దాని నభ్యసించు నప్పుడు మాధవరావు వెదురుగొట్టముల కద్దపుబిళ్ళలదికి గ్రహసంచారమును జూచుటకై సూక్ష్మదర్శకయంత్రములుఁ జేసి గురువునకు బరమానందముఁ గలిగించుచు వచ్చెను. మాధవరావు 1846 వ సంవత్సరమందుఁ బట్టపరీక్షలోఁ గృతార్థుడై విద్యాభ్యాసము ముగించెను.

పవెలుదొర శిష్యునియం దధికాభిమానముఁ గలవాడగుటచే వానినివిడువనిష్టము లేక తనపాఠశాలలో వానికుపాధ్యాయత్వమిప్పించి వానిచేత గణితశాస్త్రము ప్రకృతిశాస్త్రముఁ జెప్పించెను. ఆ యుద్యోగమునం దతడు చిర కాలముండ లేదు. ఏలయన యల్పకాలము నందే తిరువాన్కూరు రాజకుమారున కింగ్లీషు నేర్పుట కుపాధ్యాయుఁడు కావలసివచ్చినందున మాధవరావా యుద్యోగమును బడ


సెను. స్వదేశ సంస్థానములలో నితఁ డుద్యోగస్థుఁడై పేరువడయుట కిదియే ప్రారంభము. మహారాజా రామవర్మయు మఱికొందఱు రాజకుమారులు వానిశిష్యులై విద్యనేర్చిరి. తిరువాన్కూరు సింహాసన మెక్కిన రాజులలో రామవర్మవంటివారు తరుచుగ లేరు. రామవర్మ నంతవానిం జేసినది మాధవరావేయని నిశ్చయముగఁ జెప్పవచ్చును. అట్లు రాజకుమారులకు గురువై మాధవరావు నాలుగు సంవత్సరము లుండి యాపనిమాని దివానుక్రింద మఱియొక యుద్యోగము వహించెను. అందుఁగొంత కాలమున్నపిదప నతనికి దివానుపేష్కారుద్యోగ మిచ్చి సంస్థానములో దక్షిణభాగమున బరిపాలింపఁ బంపిరి. ఆ కాల మందా దక్షిణభాగములో జనుల పరస్పర కలహములు పోరాటములు ప్రబలియుండెను. మాధవరావు తనయందలి శాంతరసము చేతను బుద్ధిసూక్ష్మత చేతను దేశమందలి కలహాగ్నిని త్వరలోనే నెమ్మది లేనిచోట నెమ్మది గలిగించెను. ఆప్తులగువారికి నిష్పక్షపాతముగ న్యాయ మొసగి నేరస్థులను నిర్భయముగ దండించెను. బందిపోటు దొంగల రూపుమా పెను. ప్రజలకు బాధ లేకుండ శిస్తులు హెచ్చించెను. ఆయన వ్యవహారపు కాగితములు దిన చర్యలు జూచితిమా యతఁ డెంత ధైర్యముతో నట్టికష్ట దినములలోఁ బనిచేసెనో తెలియును. రాజ్యము నాశనముకాకుండ రక్షించెను. రాజు కృతజ్ఞతకుఁ బాత్రుఁడయ్యెను. ఆయనయే మంత్రియగుననేని సంస్థానము మహావృద్ధినొందునని యానాటివారంద ఱభిప్రాయపడిరి. విద్య నేర్చిన స్వదేశస్థులు దేశపరిపాలనమందు దమకు సమానులగుదురని వివేకులగు తెల్లవారు గ్రహించిరి.

ఆ కాలమునందు తిరువాన్కూరు సంస్థానము స్థితి చక్కగా నరసి పనిచేయలేని మంత్రి పాలనమున నుండెను. అప్పటిమహారాజు దుర్భలుఁడు ఆయన దేవాలయమునకుఁ బోవుట నిత్యకర్మలు సేయుట


మొదలగుపనులకే యలవడెనుగాని రాజ్యవ్యాపారములమీఁద దృష్టి నిలుపుట కలవడలేదు. సంస్థానమందలి యుద్యోగస్థుల జీతములు స్వల్పమగుట చేతను స్వల్పజీతములైన సరిగా నియ్యక యాఱు నెలల కొకసారి యేఁడాది కొకసారి యిచ్చుట చేతను వారు లంచగొండులై ప్రజలను బీడింపఁ జొచ్చిరి. ఖజానాకొట్లు వట్టివయ్యెను. ఇంగ్లీషువారికి రాజు కప్పము చెల్లింప లేకపోయెను. మార్గములు సరిగ లేక పోవుటచే వాణిజ్యమడుగంటెను. దేశస్థుల వృద్ధి దిగజారెను. ఆకాలమునందు హిందూ దేశమునకు డల్ హోసీప్రభువు గవర్నరుజనరలుగా నుండెను. స్వదేశరాజులను సింహాసనభ్రష్ఠులఁజేసి వారి రాజ్యముల గలుపుకొనుటలో నీ ప్రభువునకుంగల ప్రజ్ఞ యింతింత యనరాదు. మనదేశములో స్వదేశ సంస్థానమన్న పేరులేకుండఁ జేయవలయునని యీయన తలంపు. ఏ సంస్థానమందైన గొంచెము గడబిడ యల్లరి జరుగునేని యావంకబెట్టి సంస్థాన మక్రమముగఁ బరిపాలింపఁ బడుచున్నదని ప్రజలు బాధలు పడుచున్నారని వారి యిడుమ లార్చువాఁడు తీర్చువాఁడుబోలె నాయన యాసంస్థానముం గలుపుకొనుచు వచ్చెను. వారసులు లేనివారికి దొరతనమువారే వారసులని బిడ్డలు లేక మృతినొందిన మహారాజుల సంస్థానము లన్నియునీతం డింగ్లీషు వారికే జేర్చెను. ఆయన దృష్టి యాకాలమున తిరువాన్కూరు సంస్థానముపైఁ బడెను. క్రమ పరిపాలనము లేదను నెపమున దాని నతఁడు కలుపుకొనఁదలఁచి చెన్నపట్టణపు దొరతనమువారితో నాలోచించుటకు నీలగిరికిఁ బోయెను. అప్పుడు మహారాజు మేలుకొని మాధవరావును మంత్రిగాఁ దీసికొనెను. మాధవరావు తన కేఁడు సంవత్సరములు గడువిచ్చిన పక్షమున సంస్థానము మంచిస్థితిలోనికి వచ్చునని దొరతనమువారికి వ్రాసెను. ఎట్టెటో వారు దాని కంగీకరించిరి. 1857 వ సంవత్సరమున మాధవరావు తిరువాన్కూరు మంత్రి


యయ్యెను. మాధవరావు ముప్పదియేండ్లయిన నిండక మునుపే బుద్ధిబలము నీతిబలము విద్యాబలముగలవాఁడగుటచే గొప్ప సంస్థానమునకు మంత్రిత్వము వహింపఁ గలిగెను.

మాధవరావు మొట్టమొదట కొన్నియేండ్లు ప్రజాపీడకరములుగానున్న పన్నులఁ దగ్గించి మార్పుచేయుటలో గడపెను. క్రమము మితిమీర లేక వెనుకటి మంత్రులు పన్నులు గట్టుచు వచ్చినందున దేశస్థులు మిక్కిలి దరిద్రులైరి. సంస్థానమునందుఁ బ్రతివస్తువుఁగూడ నిజారా చేయఁబడుచువచ్చెను. పన్నులు ప్రజలను విసికించెను. అన్నింటిలో మిరియాల యిజారా జనులకు మిక్కిలి బాధకరముగ నుండెను. ఆ యిజారా మాధవరావు ముందుగాఁ గొట్టివేసి యందువలన సంస్థానమునకుం గలుగుఁ ధననష్టము గూడదీయుటకై నూటికి పదునైదు వంతున దానిమీఁద నెగుమతి పన్ను విధించెను. అదియు ప్రజలకు భారముగా నున్నందున గొంతకాలము కడచినపిదపనతడు నూటికి తొమ్మిదివంతున పన్నువిధించెను. మఱి కొన్నాళ్ళకదియే నూటికైదురూపాయల వంతగునట్లు చేసెను. ఆ సంస్థానమునం దది వఱకు పొగాకువర్తకము జనులుచేయుటకు వీలులేదు. సంస్థాన ప్రభుత్వమువారే విదేశ వర్తకులవద్దనుండి పొగాకు కొని నిలువజేసి చిల్లరగనమ్మి లాభము దీయుచువచ్చిరి. మాధవరావు పొగాకు యిజారా కొట్టివేసి యావర్తకము జనులేచేసి కొనవచ్చునని యుత్తరువుచేసి దానిమీద కొంతపన్ను విధించెను. ఆ పన్ను మొదట కొంచెము హెచ్చుగా నున్నందున నతడే కాలక్రమమున దానిని తగ్గించెను. ఇట్లుచేయుటచే దేశమున వర్తకము హెచ్చుటయు బ్రజలు బాగు పడుటయు సంభవించెను. అట్లు మాధవరా నిజారాలను రూపు మాపి తక్కిన పన్నులుతగ్గింప సంకల్పించి చిల్లరపన్నులు నూరుతీసివేసెను. ఈ నూరు పన్నులు సంస్థానమునకుఁ కలుగఁ జేయులాభముతక్కువ


ప్రజలకు గలిగించు పీడయెక్కువ. నేలపన్ను హెచ్చుగానున్న స్థలములఁదగ్గించి యతఁడు 1863-64 వ సంవత్సరములలో నెగుమతి దిగుమతి సరకులమీద విధింపబడిన పన్నులగూడ స్వల్పము చేసెను. మరుసటి సంవత్సరము కొచ్చిను రాజుతోడను నింగ్లీషుదొరతనము వారితోడను నతడు వాణిజ్యవిషయమున నొక యొడంబడిక చేసిఁకొనెను. ఆ యొడంబడికనుబట్టి యింగ్లీషు రాజ్యమునుండి కొచ్చిను సంస్థానమునుండి తిరువాన్కూరునకుబోవు సరకులను తిరువాన్కూరునుండి యా దేశమునకుఁ బోవు సరకులకును బన్నులు లేవు.

అట్లు మాధవరావు తిరువాన్కూరు సంస్థానమునకుఁ జేసిన యమితోపకారమునకు నింగ్లీషు దొరతనమువారు సంతసించి కె. సి. యస్. ఐ. యను బిరుదము వానికిచ్చిరి. అప్పుడు చెన్నపట్టణపు గవర్నరుగారుండిన నేపియర్ ప్రభువు మాధవరావును చెన్నపట్టణము రావించి యాబిరుదమును స్వయముగావచ్చి యిచ్చునప్పుడు విక్టోరియా రాణీగారు వాని చేసిన పనులకు మిక్కిలి సంతసించిరని చెప్పి పలు తెఱంగుల వాని గుణములం బొగడెను. ఆసంవత్సరమే మాధవరావు చెన్నపట్టణపు యూనివరిసిటీలో సభ్యుడయ్యెను. అట్లు చిరకాలము మంత్రిపదము వహించి దేశము క్రమస్థితిలోనికిదెచ్చి మాధవరావు హాయిగానుండదలప వాని తలఁపునకు వ్యాఘాతము సంభవించెను. మాధవరావుమీద గిట్టనివారు మహారాజుతో నెన్నో కొండెములు జెప్పి యాయన మనస్సు విరిచిరి. ఆ కొండెములు విని మహారాజు మునుపటియట్లనమ్మడయ్యె. అందుచేత మాధవరావు 1872 వ సంవత్సరమున మంత్రి యుద్యోగమును మానుకొనెను.

ఆమహామంత్రి చరిత్రమునందు బ్రథమాధ్యాయమింతతోముగిసెనని చెప్పవచ్చును. మాధవరావు తిరువాన్కూరులో నంధకారమయములగు ప్రదేశములందు వెలుతురు ప్రకాశింప జేసెను. అరాజకము


ప్రబలిన తావులఁ రాజరికము నెలకొలిపెను. బందిపోటు దొంగలబారినుండి తప్పించి ప్రజల ధనప్రాణముల రక్షించెను. మట్టిగుడిసెలతో నిండిన పట్టణమున సుందర మందిరములు గట్టించి రాజధానియను పేరునకుం దగినట్లుజేసెను. కాలువలఁ ద్రవ్వించెను. వంతెనలు కట్టించెను. బావులు వేయించెను. దుర్గమ ప్రదేశములకు బయనము సులభముచేసెను. వట్టినేలల పంట భూములు చేసెను. కాఫీతోటలు మొదలగు నూతన వ్యవసాయములపై జనుల కభిరుచి కలిగించెను. వేయేల ! దేశమంతయు పాడిపంటలు సిరిసంపదలు గలిగి కనుల పండువై యుండెను. మాధవరావు మంత్రిపదముం బూనుకాలమున నింగ్లీషువారు సంస్థానము గలుపుకొందురని క్షణ క్షణము భయము కలుగజొచ్చెను. అట్టి సంస్థానము మాధవరావు విడుచునప్పుడు స్వదేశ సంస్థానములలో నగ్రగణ్యమని చెప్పదగి యున్నది. మహారాజు మాధవరావునకు నెలకు వేయిరూపాయి లుపకార వేతనము నేర్పరచెను. ఆ భరణము గ్రహించుచు మాధవరావు చెన్నపట్టణమున గాఁపురముండి జీవితకాల శేషము గడపఁదలఁచెను. అట్లు చెన్నపట్టణముననున్న కాలమున గవర్నరు జనరలుగారు తన యాలోచన సభలో మాధవరావు నొక సభ్యుఁడుగా నుండుమని కోరిరి. కాని మాధవరావుగారు సభ్యత్వ మక్కర లేదనిరి. మాధవరావు తిరువాన్కూరులో నుద్యోగము మానిన వార్త యింగ్లాండులోఁ దెలిసినప్పుడు హెన్నిఫాసెట్టను నతఁడు తిరువాన్కూరు సంస్థానమంత ప్రజ్ఞతోఁ బరిపాలించిన మంత్రి యుద్యోగములేక యుండవలసి వచ్చెనా ! ఇంగ్లీషువారు తమ రాజ్యములో నాయన కేదయిన యుద్యోగ మీయఁగూడదా యని యిండియా సెక్రటరి నడిగెను.

ఆ దినములలోనే 'కలకత్తారివ్యూ' యను పత్రికలో మాధవరావును గూర్చి యాతని ప్రియశిష్యుఁడగు రామవర్మ యొకవ్యాసము


వ్రాసి ప్రకటించెను. అందు మాధవరావు సహజముగా గట్టి దార్ఢ్యము కలవాఁడనియు నిప్పటికి నలువదియైదేండ్ల వయసు నుండుటచే మరి పదియేండ్లు పని చేయఁగలడనియు సంస్థాన వ్యవహారముల యందతనికిఁ గల నేర్పసమానమనియు స్పష్టముగాఁ దెలుపఁబడెను. ఆ సమయముననే యిండియా సెక్రటరి మాధవరావునకుఁ దగు నుద్యోగము నీయవలసినదని గవర్నరు జనరలునకు వ్రాసె. దాని కనుగుణముగా నిందూరు సంస్థానప్రభువగు తుకాజిరావు హోల్కారు తన సంస్థానమునకు మంచిమంత్రిని బంపవలయునని గవర్నరు జనరలును గోరెను. ఆ యుద్యోగ మంగీకరింపుమని గవర్నరు జనరలు మాధవరావును గోర నతఁ డందుకు సమ్మతించి 1873 వ సంవత్సరమున నిందూరులో మంత్రి పదస్థుఁడయ్యె. ఇందూరులో మాధవరావు రెండుసంవత్సరములే యుండుట కొప్పుకొని పనిఁ బూనెను. ఆ కాలమున నతఁడు చేసిన గొప్పకార్యము లంతగాలేవు. ఇందూరు సంస్థానమున కదివఱకు శిక్షాస్మృతి లేదు. అది మాధవరావు చేయ నారంభించెను. ఈయన జ్ఞాతియగు దివాను బహదరు రఘునాధరావు తరువాత నిందూరు మంత్రియై యా పుస్తకము పూర్తి చేసెను. రెండు సంవత్సరముల గడువు కాఁగానే మాధవరావు మంత్రిపదమును మాని పోవఁదలఁప హోల్కారు మఱియొక యేఁడుతుండవలయునని వానిని బ్రార్థించెను. ఆ ప్రార్థన మంగీకరించి యతఁ డక్కడ నుండ 1878 వ సంవత్సరమున బరోడా సంస్థానాధిపతి యగు మునహరరావు గైక్వారు రెసిడెంటునకు విషము పెట్టఁదలఁచినాడను నేరము మీఁద గవర్నరు జనరలు వానిని సింహాసన భ్రష్టునిఁ జేసి యుక్తవయస్కుఁడు కాని యాతని కుమారునకు రాజ్యమిచ్చి యా సంస్థానమునకు మాధవరావును మంత్రిగా యువరాజునకు సంరక్షకునిగ నేర్పరచెను. ఆ కాలమున బరోడా సంస్థానస్థితి మిక్కిలి శోచనీయమై భయంకరమై యుండెను. ద్రోపుడు ద్రోహము నరహత్య రాజ్యమందెల్ల చోటుల నిరంతరాయముగ గానంబడుచువచ్చెను. ఉద్యోగస్థులు పరస్పర మత్సరముచేత నొండొరుల నాశనము చేయదలఁచికుట్రలు పై గుట్రలుపన్ని సంస్థానమునకుఁ జాలనష్టములుఁ గలుగఁ జేయుచుండిరి. వారి నడఁచుటకు, సంస్థానము జక్కఁజేయుటకు మంచి యినుప మనస్సు, యినుపచేయిగల మనుష్యుడు గావలయు. అట్టివాఁడు మాధవరావుగాక యన్యుఁడు లేఁడు. అక్కఁడ యింగ్లీషు రెసిడెంటు మాధవరావునకు సమస్త విషయముల సహాయము చేసి వాని పూనిక గడముట్టించెను. మాధవరావు దాఁటవలసిన మొదటి కష్టసముద్రము బరోడాసంస్థానపు శిస్తు వ్యవహారము. బరోడా దొరతనమువారు శిస్తు వసూలు నిమిత్తము గ్రామములను సరదారు లనఁబడు కొందఱు జమీందారుల కమరకము చేయుచు వచ్చిరి. ఆసరదారులు స్వయముగ వ్యవహరింపక కొందఱు షాహుకార్లకు గ్రామములను దిరిగి యమరకము జేయుచువచ్చిరి. ఆషాహుకారులు దయదాక్షిణ్యము లేక పంటలుపండిన యేడనక పండని యేడనక ధనము స్వీకరించుటయే ప్రధానవృత్తి చేసికొని కత్తులు కఠారులుఁ బుచ్చుకొని ప్రజలపైబడి శిస్తులీయని వారినిఁ దిట్టి కొట్టి చంపి సొమ్ము దోచుకొనుచు వచ్చిరి. పన్నులు పోఁగుచేయు నెపమున షాహుకారులు దేశమున నరహత్యలు ద్రోపుడులు యధేచ్ఛముగ గావింపుచు వచ్చిరి. సరదారులు సొమ్మే కావలసినవారగుటచే నీ దుష్కార్యములఁ జూచియుఁ జూడనట్లుండిరి. మహారాజు మంత్రులు సరదారులు జోలికిఁ బోయినచో శిస్తు కొంచమైనఁ జేఁ జిక్కదని భయపడి యూరకుండ వలసిన వారైరి. ఆస్థితినిఁజూచి మాధవరావు


కాని సరదారులు వానికిఁ లోఁబడుటకు సామాన్యులు కారు. వారు మహారాష్ట్రులు. భుజబలము టక్కరి తనము గల ప్రవీణులు వారిని లోబరచుకొనుటకు మాధవరావు కొన్ని కొత్త చట్టములఁ జేసెను. కాని వారు లొంగక యిండియా సెక్రటెరి కప్పీలుచేసియుఁ గుట్రలుఁ పన్నియుఁ జాలతొందరకలిగించిరి. అప్పుడు మాధవరావు ధైర్యముఁబూని కొందఱుసరదారులను దేశమునుండి యావలకుఁ బంపి కొందఱిని బెదరించి కొందఱిని బ్రతిమాలి దేశముమంచిస్థితిలోఁ బెట్టి జనుల దురవస్థఁ దొలఁగించెను.

ఈ సంస్థానమం దుండిన సరదారులు మహారాజునెడ నెట్లు నడచుకొనవలయునో సంస్థానమునం దెంతయధికారము గలిగియుండవలయునో మొదటినుండియు సరిగా నేర్పాటు చేయబడలేదు. సరదారులు మహారాజు కోరినప్పుడు యథాశక్తిగా సైన్యమునుగాని ధనమునుగాని సమర్పింప వలయునని యొక విధముగా నేర్పాటు కలదు. విశేషించి వారలేఁటేఁట గొంత శిస్తుఁగూడ నీయవలయును. సంస్థానప్రభుత్వము బలహీనముగా నుండుటఁజేసి యాసరదారులు తామీయవలసిన సొత్తు నీయక జమీనులను స్వేచ్ఛగా ననుభవించుచు నిరంకుశాధికారులై యెవరిమాట వినక సంస్థానమునకు గంటకులైయుండిరి. వారి నడఁపకపోయిన పక్షమున సంస్థానమునకు క్షేమములేదని మాధవరావు తెలిసికొని యాపనిఁ బూనెను. కాని యది సులభసాధ్యము గాదు. వారి భూముల నూడదీసికొనుట యధర్మము, ఊడఁదీసికొనక పోయినచో వారు లోఁబడరు. అందు చేత మాధవరావు పాఁత లెక్కల వెతికించి ప్రతిసరదారు సంస్థానమున కీయవలసిన పాఁతబాకీ నిమ్మని బలవంతముపెట్టెను. అది యిచ్చుకొనలేక కొందఱు తమ భూముల వదలుకొనిరి. కొందఱు తమ జమీనులు సంస్థానమునకే యమ్మిరి. ఎందుకునొడంబడక ప్రతి


ఘటించిన సరదారులను మాధవరావు బలిమిం బట్టించి కాశీ మొదలగు పట్టణములకు బంపించి దేశమునిష్కంటకము చేసెను. అంతతో సరదారుల బాధ కొంతవఱకుఁ దొలఁగెను. ఇదిగాక మాధవరా వెక్కవలసిన కష్టపుగట్టు మరొకటి యుండెను. అది సైన్య సంబంధమైనది. సంస్థానములో నిరర్థకముగ గొంతసేన యుండెను. ఈసేనకగు కర్చు లెక్కువ వారివలనగు పనితక్కువ. పనులటుండగా సైనికు లాయుధపాణులై యెక్కడిబోయిన నక్కడజనులను బలు బాములఁ బెట్టుచుండిరి. మాధవరావు వ్యర్థమగు సైన్య వ్యయము తగ్గింపఁదలఁచి యా పటాలమును విడగొట్టి సేనాపతులకుఁ దక్కిన సైనికులకు సంస్థానములో నితరోద్యోగములిచ్చెను. ఇవియే గాక మాధవరావు మఱియు ననేక కార్యములు చేసెను. ప్రజలకు భారముగ నుండు పన్నులు తీసివేసెను. పాఠశాలలుస్థాపించెను. కోర్టులు పెట్టించెను. మురికి సందులలోనున్న యిండ్లు పడగొట్టించి వీధులు వెడల్పు చేయించి మంచి యిండ్లు గట్టించెను. పట్టణమున కలంకారములుగ నుండు గొప్పమేడలు భవనములు గట్టించెను. సంస్థానములో గొప్ప యుద్యోగమునకుఁ దగిన సమర్థులు లేనందున మాధవరావు సమర్థులను బొంబాయినుండి చెన్న పట్టణమునుండి పిలిపించెను. ప్రజలకు భారము లేకుండగనే శిస్తులు మునుపటికంటె హెచ్చెను. సమర్థులు దొరకుటకును దొరకినవారికి లంచముల మీఁదికి బుద్ధి పోకుండుటకును మాధవరా వుద్యోగస్థుల జీతములు హెచ్చించి ప్రతిమాసము నందు సరిగా నిప్పించుచు వచ్చెను. ఈయన మంత్రిగానున్నపుడె ప్రస్తుతము హిందూదేశ చక్రవర్తిగానున్న ఎడ్వర్డురాజుగారు యువరాజుగానుండి హిందూస్థానము సందర్శింపవచ్చి బరోడాకుఁ బోయి మాధవరావుచేత సత్కృతుఁడై చాల సంతసించెను.

అతఁడెన్ని మార్పుల జేసినను మునుపటివాని నాధారముగా నుంచుకొనియే చేసెను. కాని వెనుకటివన్నియు నిర్మూలించి క్రొత్త


పద్ధతి పెట్టలేదు. వెనుక మైసూరు సంస్థానములో దివానుపని జేసిన పూర్ణయ్య యను మహామంత్రివంటి బుద్ధికుశలత మాధవరావువద్ద లేకపోయినను నితఁడు పూర్ణయ్యకంటె స్థిరమనస్కుఁడు, సత్ప్రవర్తకుఁడు నని చాలమంది తెల్లవా రభిప్రాయపడిరి. హిందూదేశ ధనాదాయ విషయమున నింగ్లాండులో నొక సభ వారియెదుట సాక్ష్య మిచ్చుటకు మాధవరావుగారి నా దేశము వెళ్ళుమని యప్పటి గవర్నరు జనరలుగా రాయనపేర వ్రాసిరి. కాని మాధవరావు విదేశయాత్ర తన మత మొప్పదని మానుకొనెను.

1877 వ సంవత్సరము ఢిల్లీలో జరిగిన దర్బారునకు సగౌరవముగ బిలువఁబడి మాధవరావు తన చిన్న రాజును వెంటబెట్టుకొని పోయెను. అక్కడ మాధవరావునకు విశేష గౌరవము జరిగెను. అప్పుడే గవర్నరు జనరల్ లిట్టను ప్రభువు వానికి రాజా బిరుద మిచ్చెను. మాధవరావు తన కాలోచన చెప్పుటకు రెసిడెంటు మఱికొందఱు గొప్ప యుద్యోగస్థులు గల యొక సభ నిర్మించి దాని యాలోచనముం బట్టి నడచుచుండెను. చిన్న రాజునకు విద్య నేర్పుటకు బొంబాయినుండి యీలియెట్టను నొక తెల్లవానిని పిలిపించి శ్రద్ధతో విద్య చెప్పించుటయేగాక విద్యాభివృద్ధినిఁ గూర్చి స్వయముగాఁ గనుగొనుచువచ్చెను. 1882 వ సంవత్సరమున నా చిన్నరాజునకు యుక్తవయస్సు వచ్చినందున నింగ్లీషువారు వాని నాసంవత్సరమే సింహాసన మెక్కించిరి. గద్దెయెక్కినతోడనే మహారాజునకు మంత్రికి మనస్పర్థలుపుట్టెను. అందుచేత మాధవరావు 1882 వ సంవత్సరమున సెప్టెంబరు నెలలో నుద్యోగము మానుకొనెను. బరోడా మహారాజు మంత్రి తనయొద్ద నుద్యోగము మాని పోవునపుడు మూడులక్షల రూపాయల బహుమాన మిచ్చెను. ఇట్లు మాధవరావు యొక్క చరిత్రలో రెండవయధ్యాయము ముగిసెను. అనంతరము మాధవరావు రాజ్యవ్యాపారవిహీనుఁడై చులుక నగు హృదయముతో తనజీవిత శేషమును జెన్న పట్టణమునగడపెను. ఆయన కాంగ్లేయులలోను స్వదేశస్థులలోను మిత్రు లనేకులుండి నందున నిర్వ్యాపారజీవనము భారమనిపించ లేదు. అప్పటికి రాజకీయ వ్యవహారములలో వాని కభిరుచి విశేషముగ నుండెను. ఇంగ్లాండు పత్రికలు, స్వదేశపత్రికలు చాలదెప్పించి యితఁడు చదువుచుండును. ఆదినములలో నతనికి సంఘసంస్కరణమునం దభిమానము కలిగెను. అతి బాల్యవివాహమువలన కలుఁగు నష్టములఁ దొలఁగింపవలెనని యతని ముఖ్యసంకల్పము. తక్కిన సంస్కరణములలోఁ గూడ మనము శాస్త్రములనేబట్టి పోఁగూడదనియు శాస్త్రములే కొన్నిస్థలములలో మార్పు చేయఁబడదగి యున్నవనియు నతఁ డభిప్రాయపడెను. అట్లభిప్రాయపడియు మాధవరావు సంస్కరణము వేగిధ పడక జాగరూకతతో జేయవలె నను తలంపు గలవాఁడు. పూర్వాచారములు నాశనము చేయఁగూడదనియు వానిని చక్కఁగామార్చుకొని యవలంభింప వలయుననియు నతఁడు జెప్పుచువచ్చెను.

1885 వ సంవత్సరమందు చెన్న పట్టణపుగవర్నరగు గ్రాండు డఫ్ ప్రభువు కోరికమీఁద మాధవరావు మలబారు నేల పన్ను విషయమున నేర్పడిన సభ కగ్రపీఠస్థుఁడై దొరతనమువారికి సాయము జేసెను. 1887 వ సంవత్సరమున గవర్నరగు కానిమరాప్రభువు శాస్త్రబ్రహ్మచారులకు శాస్త్రపండితులకు హితోపదేశము చయుటకు మాధవరావును నియోగించెను. అప్పుడాయన యిచ్చిన యుపన్యాసము వలన దక్షిణహిందూస్థాన మంతను వెలిగించిన యాతని జ్ఞాన జ్యోతియొక్క తేజస్సు నెల్లవారు జూడగలిగిరి. 1887 వ సంవత్సరమున నేషనల్ కాంగ్రెస్సనబడు దేశీయ మహాసభ చెన్నపట్టణమునం గూడెను. మాధవరావు దాని సన్మాన సంఘమున కగ్రాస


నాధిపతియై కార్య నిర్వాహము జేయుటయే గాక దేశీయసభతో గవర్నరులయొక్కయు గవర్నరు జనరల్ యొక్కయు నాలోచన సభలు పెద్దవి చేయవలయునని చక్కగా ముచ్చటించెను. మాధవరావు తన జీవితకాలములో గడపటి నాలుగైదేండ్లు హెర్బర్టుస్పెన్సరను మహాతత్వవేత్తయొక్క గ్రంథమును జదివి సాంఘిక రాజకీయ విషయములలో వానిమతమే మంచిదని యనుసరించుచువచ్చెను. ఇట్లు చదువుటతో తనివినొందక యతఁడు చెన్నపురమందలి వార్తా పత్రికలకు దరచుగా వ్యాసములు వ్రాసి పంపుచు వచ్చెను. ఆకాల మందాయన వ్రాతలకు మిక్కిలి గౌరవ ముండుటచే బత్రికాధిపతులు వాని లేఖలను గన్నుల నద్దుకొని గ్రహించుచు వచ్చిరి. ఇప్పుడె కాదు. మాధవరా వుద్యోగములో నున్నప్పుడు సయితము యెట్లో తీరిక చేసికొని పత్రికల కుపయుక్తమయిన సంగతులు వ్రాసిపంపుచు వచ్చెను. 1875 వ సంవత్సరమందీయన శుక్రగ్రహ సంచారమును గురించి యుపన్యాసము వ్రాయ దాని జదివి పశ్చిమఖండ జ్యోతిశ్శాస్త్రజ్ఞులు స్వదేశదైవజ్ఞులు వాని ఖగోళశాస్త్ర పాండిత్యమున కచ్చెరు వడిరి.

1888 వ సంవత్సరమున గవర్నరు జనరలగు డఫ్రన్‌ప్రభువు తన యాలోచనసభలో మాధవరావు నొక సభ్యుడుగ నుండుమని కోరెను. మాధవరావు వయస్సు ముదిరినకారణమున దాని కొప్పుకొనలేదు. 1889 వ సంవత్సరమున మాధవరావు స్వదేశబాలురకు విద్యనేర్పు విధమను పేరుపెట్టి యొక చిన్న పుస్తకమును వ్రాసెను. అది మనబాలురకు మిక్కిలి యుపయుక్తమయినది. ఆచిన్న పుస్తక మిప్పటికి ద్రవిడ మహారాష్ట్ర మళయాళ భాషలలోనికిఁ దరుజుమా జేయఁబడినది. ఆసంవత్సరమందే యితఁడు జర్మనీవారి యాఫ్రికా ఖండా క్రమణమును గూర్చి యొక చిన్న వ్యాసము వ్రాసి జర్మనీరాష్ట్ర


మంత్రియగు బిస్‌మార్కు ప్రభువునకుఁ బంపెను. బిస్మార్కు వ్యాసములోనున్న విశేషాంశమును గ్రహించి సంతసించి స్వహస్తముతో మాధవరావునకు స్తోత్రపూర్వకముగా నొక జాబు వ్రాసి యావ్యాసమును జర్మనిభాషలోనికి దర్జుమా చేయించి ప్రతిసిపాయికి బంచి పెట్టించెను.

మాధవరావు స్వభాషయగు మహారాష్ట్రమందు జాల గృషి చేసి కవిత్వము చెప్ప నేర్చెను. ఆభాషలోనున్న కవిత్వము కఠిన పదములు లేక స్త్రీలకు బాలురకు నుపయుక్తముగ నుండును.

నిండుయవ్వనమున మాధవరావు తిరువాన్కూరు బరోడా సంస్థానములగూర్చి మిక్కిలి కష్టపడుటచేత దేహస్థితి త్వరలో చెడిపోయెను. అతనికి 1890 వ సంవత్సరం డిసెంబరు 22 వ తారీఖున పక్షవాతము ప్రవేశించెను. ఆ రోగముచే నతఁడు రమారమి మూడు మాసములు తీసికొని 1891 వ సంవత్సర మేప్రియల్ నాలుగవ తారీఖున గాలధర్మము నొందెను. ఇంగ్లాండులో హిందూ దేశములో నఖండ ఖ్యాతిని సంపాదించిన ఈ మహాత్మునిగూర్చి వేరువ్రాయవలసిన దేమియులేదు. హిందూదేశస్థులు దేశపరిపాలనమునకుఁ బనికిరారని తెల్లవారు పలికెడు పలుకులు వట్టి బూటకములని యీయన చరిత్రమువలన దెలిసికొనవచ్చును. హిందూదేశమునకు గవర్నరు జనరలుగా మాధవరావు నియోగింపబడిన పక్షమున నీతెల్ల గవర్నరు జనరలులలో ననేకులకంటె మిక్కిలి చక్కగా బరిపాలనము జేసియుండును. అతఁడు సంపాదించిన ధనములో నొక గవ్వయయిన నన్యాయార్జితము లేదు. చిన్ననాటనుండియు నతఁడు మహోన్నత పదవులలో నుండుటంబట్టి యతఁడు కొంచెము బెట్టు సరిగ నుండున ట్లగుపడుచువచ్చె. కాని చూడవచ్చిన వానిని గౌరవించుట కలసిమెలసి మాటాడుట మొదలగు గుణముల కేలోటు


లేదు. చిత్తరువులను వ్రాయించుట వ్రాసిన వానిని దెప్పించి తన మందిరమున నుంచుకొనుట వానికి మిక్కిలి యిష్టము. మతసంబంధములగు వ్యాసంగములలో గాలము విస్తారము గడపుట వాని కిష్టములేదు. మనుష్యులు సత్ప్రవర్తన గలిగియుండి సుందరమయిన యీ ప్రపంచమందు భగవంతుడిచ్చిన పదార్థములజూచి యానందించిన చాలునని వాని యభిప్రాయము. జ్యోతిశ్శాస్త్రమందు మాధవరావు జాలకృషిచేసి సిద్ధాంత భాగ మొకటే నమ్మదగినది కాని జాతకముహూర్త భాగములు నమ్మదగినవి కావని యభిప్రాయపడి తన యభిప్రాయమును లోకమునకు వెల్లడించెను. రాజా సర్ మాధవరావు భరతఖండమాత కన్న పుత్రరత్నములలో నమూల్య మణి యని చెప్పవచ్చును.