మహాపురుషుల జీవితములు/రాజా సర్. దినకరరావు

రాజా సర్ దినకరరావు

ఈయన మహారాష్ట్రబ్రాహ్మణుడు. బొంబాయి రాజధాని యందలి రత్నగిరి జిల్లాలోనున్న దేవరూటు గ్రామ మీయన జన్మస్థానము. ఇతఁడు 1819 వ సంవత్సరము డిశంబరు 30 వ తారీఖున జన్మించెను. ఈయన తండ్రిపేరు రకోబాదాదు. ఆయనకు దినకరరావు ప్రథమ కళత్రమువలనఁ బుట్టిన పుత్రుఁడు. దినకరరావు యొక్క పూర్వులు మూడు నాలుగు తరములనుండి సింధ్యామహారాజుగారి గ్వాలియరు సంస్థానములో నేదోయొక పరగణాకు సుబేదారులుగ నుండుచువచ్చిరి. ఈతని యొక్క బాల్యమునుగూర్చి మన కంతగా తెలియదు. అయిదవయేటనే యక్షరాభ్యాసము చేసి మాతృభాషయగు మహారాష్ట్రమును వానికిఁ దండ్రిగారు చెప్పించుచు వచ్చుచుండిరనిమాత్రము తెలియుచున్నది. స్వభాషకుఁ దోడు దినకరరావు సంస్కృత పారసీభాషలఁ గూడ నేర్చెను. యుక్తవయస్కుడయినపిదప నితడు పూర్వాచార పరాయణుండయి చేయవలసిన కర్మలు కాలాతిక్రమణము కాకుండ యథా విధిగ జేయుటంబట్టి బాల్యమునం దీతనికి మత సంబంధమయిన బోధనము గట్టిగా జరిగియుండునని తోచెడును. ఈయనకు హిందువుల గానము నందు మిక్కిలి యభిరుచిగలదు; హిందూవైద్య శాస్త్రమునందు జాలమట్టు కభినివేశముగలదు; బుద్ధి సూక్ష్మత గలవాడగుటచే నేవిద్య నభ్యసించిన నది యల్ప కాలముననే రాదొడగెను. ఆతడును సమయము చిక్కినప్పుడు వదలక తన జ్ఞానాభివృద్ధి చేసికొనుటకు మిక్కిలి పాటుపడెను. ఈయనకు నలువది సంవత్సరములు వచ్చు వఱకు నింగ్లీషుభాషరాదు. చదువ నారంభించిన వెనుక నతఁడచిర కాలములోనే దానిని చక చక మాటలాడ నేర్చెను. దినకరరావు గారికి జ్ఞాపకశక్తి మెండు. గ్వాలియరు సంస్థానములో నితడు పదునైదవయేటనే యుద్యోగమునఁ బ్రవేశించెను. మొట్టమొదట నొకగొప్ప యుద్యోగస్థునిచేతి క్రింద కొంతకాల మతఁడు లెక్కలువ్రాయుచు వచ్చెను. ఈ చిన్న యుద్యోగములో నతడు చూపిన చాకచక్యము పూనిక గ్రహించి మెచ్చి తండ్రియనంతరమున నదివఱ కాయన చేయుచుండిన సుబేదారుపని దినకరరావుకిచ్చిరి. అతఁడు పరిపాలింపవలసిన పరగణా మిక్కిలి కష్టతరమయినదగుటచే దినకరరావు తనలో నడిగియుండిన యద్భుతశక్తినంతయు వెలికిదెచ్చి కడునేర్పుతో నధికారముజేసెను. అవసరమయిన చోటుల పోలీసుస్టేషనుల గట్టించెను. సర్కారుసిస్తు సరిగ వసూలు చేయుటకు తగినపద్ధతు లేర్పరచెను. క్రింది యుద్యోగస్థులు నడుపవలసిన నడత యిట్టిది యని దెలియ జేయుట కొకనిబంధన గ్రంథము వ్రాసెను. ఈ కార్యములను నతడు చేసిన తక్కిన మార్పులనుజూచి గ్వాలియరు మహారాజుగారును వారివద్దనుండు నింగ్లీషువారి రెసిడెంటును చాల సంతోషించిరి. ఈ కార్యములే దినకరరావు యొక్క భవిష్యదభివృద్ధికి యశస్సునకు విత్తనము లయ్యెను.

దినకరరా వొక్కడు సంస్థానములో నొక చిన్న భాగమును సరిగా బాలించిన మాత్రమున సంస్థానమున కంతకు నేమిలాభము కలుగును. తక్కినవారందఱు వానిలాగున పాటుపడినచో మిగుల లాభముండును. అట్లు గాకపోవుటచే 1844 వ సంవత్సరము మొదలుకొని సంస్థానము మిక్కిలి క్షీణదశకు వచ్చెను. పూర్వపు మహారాజు పోవుటచే నప్పటిమహారాజు; బాలుడు రాజకుటుంబము బహుకలహ భూయిష్టమయియుండెను. వ్యవహారము సరిగ జరుగదయ్యె. అర్ధ ప్రాణములకు క్షేమము తక్కువయ్యెను. ఎచ్చట జూచిన నేరములు తరుచయ్యెను. అధికారులు లంచగొండులయి ప్రజలను బాధింప జొచ్చిరి. సర్కారునకుఁ జెల్లుబడి గావలసిన సిస్తు సయితము తిన్నగా వసూలుచేయు దిక్కు లేకపోయెను. అందుచేత ధనకోశములు వట్టి వయ్యెను. ఈ దురవస్థకుఁదోడు గోరుచుట్టుపై రోకటిపోటుచందమున సంస్థానమున మన్నెములలోనున్న కాండులును వనచరులు పితూరీలు చేసి, యున్న కొంచెము నెమ్మదికి భంగము గలిగించిరి. కాఁబట్టి సంస్థాన మను నావకుఁ జుక్కాని త్రిప్పుటకు సమర్థుఁ డొకఁడు కావలసి వచ్చెను. తగినవాఁ డెవఁడని యందఱు విచారించుచుండ నంతలోఁ బ్రధాన మంత్రిపదవి కాళీయయ్యెను. వెంటనే సంస్థానము మేలుకోరినవా రందఱు దినకరరావే దానికిం దగినవాఁడని వాని నాపదవియందు 1852 వ సంవత్సరమున బ్రతిష్ఠించిరి.

ఆ మహాపదవి నతఁడు బూని సంస్థానము సరిగా సిస్తు చెల్లక పోవుటచే ధనహీనతచేత జిక్కుపడు చున్నదని గ్రహించి తద్విషయమున ముందుగాఁ బనిచేయుటకు బ్రయత్నించెను. దరి యంచు లేక సంస్థానమందలి ధనమంతయు కర్చగుచుండుటచే నట్టివ్యయము నివారించుటకు నతఁడు చేసినపని మిక్కిలి యాశ్చర్యకరమయి శ్లాఘనీయమయి యున్నది. నిజమయిన స్వామిభక్తిగల దినకరరావు ప్రప్రథమమున తనజీతము నైదువేలరూపాయలనుండి రెండువేలగు నట్లు తగ్గించెను. ఆత్మలాభపరాయణుఁడుగాక కేవలస్వార్ధపరిత్యాగి యయిన యీ సత్పురుషుని పద్ధతి నవలంబించి యనేకులు తమజీతములుగూడ తగ్గించుకొనిరి. అందుచేత ప్రతిసంవత్సరము చాలసొమ్ము కూడివచ్చెను. ఈపని యయిన వెను కతఁడు సర్కారుసిస్తు వసూలు చేయుటనుగూర్చి యెక్కుడు శ్రద్ధచేసెను. ఈపని చక్కఁగా నిర్వహించుటకు దినకరరావు రివిన్యూడిపార్టుమెంటును బలపరచి లెక్కల డిపార్టుమెంటునుగూడ సృష్టించి దానిని సమర్థుఁడయిన యొక యుద్యోగస్తునిచేతిక్రింద నిలిపెను. ఇట్లు మూడు సంవత్సరములు పాటుపడి యామంత్రి సంస్థానపుఋణమంతయు దీర్చి వేయుటయేగాక ధనకోశములో గొంతసొమ్మునిలువగూడఁ జేసెను. సంస్థానమునందలి యుద్యోగస్థు లందఱు నడచుకొనవలసిన వ్యవహార ధర్మములను గొన్నింటినివ్రాసి యొకపుస్తకముగాఁ జేసి యానిబంధనలనుబట్టివారందఱు నడచుకొనున ట్లాజ్ఞాపించెను. ఈ పుస్తకమెంత యుపయోగకరముగా నుండెనో యీక్రింది సంగతినిబట్టి మీరేగ్రహింపవచ్చును. ఆకాలమున హైదరాబాదు సంస్థానములో రెసిడెంటుగా నుండిన బుష్టీ దొరగారు గ్వాలియరుసంస్థానములో రెసిడెంటుగా నుండిన మాక్పెరసను దొరగారికి జాబు వ్రాయుచు దినకరరావుగారు వ్రాసిన పుస్తకము మిక్కిలి యుపయోగకరముగా నుండుటచే నైజాం సంస్థానము నందుఁగూడ దాని నుపయోగింపవలెనని దన కభిప్రాయ మున్నట్లు వ్రాసెను. ఈ పనులకుఁ దోడు దినకరరావు 65 పాఠశాలలు సంస్థానములో స్థాపించి యొక చిన్న చదువుల డిపార్టుమెంటు కల్పించెను. పోలీసును న్యాయస్థానములును (కోర్టులు) చక్కపరచెను. కాలువలు త్రవ్వించి చక్కనిబాటలు వేయించి జనులకు ప్రయాణసౌఖ్యమును గలిగించెను; వాణిజ్యమునకు భంగకరములయిన సుంకములను గొట్టివేసి ప్రజలయొక్క స్థితిని బాగుచేయుట కెన్నివిధముల పాటు పడవలయునో యన్ని విధముల పాటుపడెను.

1857 వ సంవత్సరమునం దుత్తరహిందూస్థానమున గొప్ప సిపాయి పితూరి జరిగెను. ఆ కాలమున నింగ్లీషు దొరతనమువారికి దినకరరావు చేసిన యుపకార మింతింత యని జెప్పరాదు. హిందూదేశమందున్న స్థానాధిపతులందఱిలో సింథ్యావిషయముననే గవర్నమెంటు వారి కాదినములలో నెక్కువ యలజడి కలిగెను. సింథ్యా మహారాజుయొక్క సైనికులుగూడ పితూరీదార్లతోఁగలిసి సర్కారు వారితోఁ బోరాడ నభిలషించుచుండిరి. సింథ్యాగూడ నొకచేయి చూచి విడుచుట మంచిదని యాలోచింపఁ దొడఁగెను. అట్టిసమయమున దినకరరావుయొక్క బుద్ధినిపుణతచేత సింథ్యామహారాజు తన ప్రయత్నము మానుకొనియెను. సైనికు లింగ్లీషువారిమీఁదికిఁ దమ్ము పంపుమని పలుమారు వేఁడుటచే దినకరరావు మేరమీరినవారి యుత్సాహమును మాన్పలేకపోయినను వారు పితూరి దారులతోఁ గలసి దొరతనమువారిమీఁద బడకుండ నెప్పటికప్పు డేవో వంకలు చెప్పి యాపజాలెను. అధికమయిన బుద్ధినిపుణత యుండుట చేతనే పితూరిదారులు గ్వాలియరు సంస్థానమున ప్రవేశించినపుడయిన తమ సైనికులు వారితోఁ జేరకుండ నాప గలిగెను. అప్పటి రెసిడెంటుగారు దినకరరావువలననే సింథ్యామహారాజు రక్షింపఁబడెనని స్పష్టముగాఁ బలికెను. ఆయన చేసిన పనినిగూర్చి యొక దొరగా రీక్రింది విధముగ వ్రాసిరి. "ఆకళవళములో దినకరరావు తనయజమానికి జేసిన యుపకారమిట్టిదియని చెప్పనలవికాదు. అతఁడు తన స్వామియెడల మూర్తీభవించిన రాజభక్తియయి యడ్డమువచ్చినదాని నెల్ల దుడిచిపెట్టుచు మహావేగముతో వచ్చిన యా సంక్షోభమునకు మూర్తీభవించిన ధైర్యమయి మెలఁగెను. అత్తరి నాంగ్లేయ ప్రభుత్వమునం దాఁతడు చూపిన యాదరము నాంగ్లేయుల కతఁడు చేసినసహాయము నప్పుడది చూచినవారు స్వయముగ ననుభవించినవారు జన్మమధ్యమున మరచి పోఁదగినది కాదు." 1859 వ సంవత్సరమున గవర్నరుజనరలుగారకు కానింగుప్రభువుగారు ఢిల్లీలో నొక దర్బారు చేసి యచ్చటికి దినకరరావును రావించి యతఁడు చేసిన యుపకారమునకుఁ గృతజ్ఞుఁడయి వందనములు సేయుటయేగాక కాశీజిల్లాలో నొక జాగీరును బహుమాన మిచ్చెను.

1859 వ సంవత్సరమున దినకరరావు గ్వాలియరులో మంత్రి యుద్యోగమును మానుకొనెను. అనంతరము కొంత కాలమునకు నతఁడు డోల్పూరు సంస్థానమునకు మంత్రియయ్యెను. 1861 వ సంవత్సరమున గవర్నరు జనరలుగారి శాసననిర్మాణసభలో హిందువుల నేర్పరచవలసి వచ్చినపుడు దినకరరావుగా రొక సభికుఁడుగా నియమింపఁబడెను. అతఁడాసభలోమూఁడుసంవత్సరములు మాత్రమే పనిచేసినను నాస్వల్పకాలమున దేశోపకారకములగుపనులే చేసెను. 1866 వ సంవత్సరమున నతనికి సర్ యను బిరుదమువచ్చెను. 1877 వ సంవత్సరమున జరిగిన ఢిల్లీ దర్బారులో దొరతనమువారు వానికి రాజా బిరుదము నిచ్చిరి. 1886 వ సంవత్సరమున డఫ్రిన్ ప్రభువుగారు రాజాబిరుదము వారివంశస్థు లందఱికుండునట్లు చేసెను. దినకరరావు మిగిలినదినములను నిర్వ్యాపకముగానేగడపి 1896 వ సంవత్సరమున జనవరి 9 వ తారీఖున కాలధర్మమునొందెను.

దినకరరావు పలుచని మొగము గలిగి పచ్చనిచాయ గలిగి యౌవనమున స్ఫురద్రూపియయి యుండెను. అతని యాకృతిపొట్టిగ నుండును. అతనిమాటలు మిక్కిలి మృదువులయి యెదుటివారిం దనపక్షముద్రిప్పుకొనునట్లుండును. అతఁడు నిశ్చలమయిన చిత్తధైర్యము గలవాఁడు. ఇంగ్లీషు విస్తారము రాకపోవుటచే నతఁడు దొరలపద్ధతి నెప్పు డవలంబింపి లేదు. స్త్రీవిద్య మొదలగు సంస్కారము లతనికిష్టములుకావు. కాని సంస్థానపరిపాలనమునుందు మంచి బుద్ధిశాలియయి సహాయుఁడయి పనిచేసెను.