మహాపురుషుల జీవితములు/మానమోహన ఘోషు

మాన మోహన ఘోషు

ఈతఁడు హిందూదేశమందు సుప్రసిద్ధిఁగాంచి 1903 వ సంవత్సరమున చెన్న పట్టణమందు జరిగిన దేశీయ మహాసభ కధ్యక్షుఁడగు 'లాల్‌మోహను ఘోషు' గారి సోదరుఁడు. ఆయనది ఢక్కా జిల్లాలోని విక్రమపురము కాపురము కులముల నితఁడుకాయస్థుఁడు. అతని తండ్రియగు 'రామలోచనఘోషు' సబుజడ్జీ యుద్యోగముచేసి రాజరామమోహన రాయలువారు తలపెట్టిన సంఘసంస్కరణ మహాకార్యమునం దభిమానము కలిగి వానికి కుడిభుజమైపనిచేసెను. మానమోహనుఁడు 1854 వ సంవత్సరము 13 వ మార్చినాఁడు జన్మించెను. బాల్యమం దితఁడు 'కిష్ణఘరు పాఠశాలలోఁ జదువుకొనెను. 1859 వ సంవత్సరమున మార్చి నెలలో మానమోహనుఁడు ప్రవేశపరీక్షయందు గృతార్థుఁడై 1861 వ సంవత్సరమున కలకత్తా ప్రెసడెన్‌సీ కాలేజీలో చేరెను. అచ్చట నత డొక్క వత్సరము మాత్రమే చదివి మరుసటి సంవత్సరము 'సివిల్ సర్వీసు పరీక్షకు' చదువుకొనుట కింగ్లాడునకు బోయెను. 1860 వ సంవత్సరమునందు (అనగా మానమోహనుడు క్రిష్ణఘరు నందున్న కాలముననే) బంగాళాదేశమున నీలిమందు కఱవుపట్టెను. ఆకఱవువలన ననేకులు చెడిపోయిరి. ఆక్షామమువలనఁ గలిగిన దారుణ నష్టములం గూర్చి మానమోహనుఁడు 'హిందూ పేట్రియాటు' అను పత్రికకుఁ దఱుచుగా లేఖలను వ్రాసి పంపుచుండువాఁడు. ఆపత్రికాధిపతియైన హరిశ్చంద్రముకర్జీ మృతినొందుటయు నది కారణముగాఁ దత్పత్రిక క్రొత్తచేతులలోనికిఁ బోవుటయుఁ జూచి మంచిపత్రిక మఱియొకటి స్థాపింపవలెనని నిశ్చయించి మానమోహనుఁడు మఱికొందఱి సాయమున 'హిందూదేశ దర్పణము' అని యర్థమిచ్చు 'ఇండియన్ మిర్రరు' పత్రికను ప్రకటింపఁ జొచ్చెను. అది ప్రారంభమున పక్షపత్రికగ ప్రకటింపఁ బడుచువచ్చెను. ఆపత్రికయె యిప్పుడు దినపత్రికయై కలకత్తాలో మిక్కిలి పేరుబడి యున్న యది.

మానమోహనుఁడు సహజముగమిక్కిలి దెలివి తేటలుగలవాఁడయ్యు 1864 వ సంవత్సరమునందును 1865 వ సంవత్సరమునందును గూడ సివిలుసర్విసు పరీక్షలోఁ గృతార్థుఁడు కాలేకపోయెను. అతఁడు పరీక్షయందుఁ దప్పిపోవుటకు వాని తెలివితక్కువ కారణము కాదు. అదివఱకున్న నిబంధనలు కొన్ని మారుటచేతను సంస్కృతము మొదలగు కొన్ని ప్రాగ్దేశపు భాషలకు మునుపటి విలువ తగ్గిపోవుట చేతను మానమోహనుని కృషి వ్యర్థ మయ్యెను. ఇంగ్లాండు దేశములో హిందూ దేశస్థులకు జరుగు సివిల్ సర్వీసు పరీక్షనుగూర్చి యతఁడొక చిన్న పుస్తకమును వ్రాసి యందులో నింగ్లీషువారికిఁ గల లాభములను మనకు గల ప్రతిరోధములను జక్కఁగ విమర్శించి వివరించెను. అతడు సివిలుసర్వీసు పరీక్షకు జదువుచున్న కాలముననే 'బారిష్టరు' పరీక్షకు గూడ జదువనారంభించి, మొదటిదానిలో నెరవేరు యోగము లేకపోయినను రెండవదానిలో గృతార్థుడై 1886 వ సంవత్సరమున బారిష్టరై వచ్చెను. చదువంతయు ముగియకమునుపే తండ్రి పరలోకగతుడగుటచే మానమోహనుడు పరీక్షకాగానే స్వదేశమునకువచ్చి 1867 వ సంవత్సరము జనేవరు 10 వ తారీఖున కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా జేరెను.

కలకత్తా హైకోర్టులో నితడే మొట్టమొదటి బారిష్టరు. ఆ కోర్టులో పనిచేయుచున్న నితనితోడి బారిష్టరులగు తెల్లవారు నల్లవాడని మానమోహనుని తమతో సమానముగా గౌరవింపక యలుసుగ జూచుచు మీదుమిక్కిలి యతడు నిర్ణేతకాలము బారిష్టరు తర గతిలో జదువలేదను నెపమున బని కనర్హుడని తీసివేయించుటకు బ్రయత్నించిరి. ఓర్వ లేమిచే వారలు చేసిన యాక్షేపణము లన్నియు మహాధైర్య సంపన్నుడు దృఢచిత్తుడునగు మానమోహనునియెడ వ్యర్థములయ్యెను. కాలక్రమమున మానమోహనుని దెలివితేటలు బయలుపడుటచే దొరతనమువారతనికి కలకత్తా ప్రసిడెన్సీ మేజస్ట్రీటు పని నియ్యఁ దలఁచిరి. కాని యతఁ దంగీకరింపఁడయ్యె.

ఇంగ్లాండునుండి వచ్చినది మొదలు మానమోహనుఁడు సివిలుసర్వీసు పరీక్షలో హిందువులకు జరుగు నక్రమములను గూర్చి వరుసగ కొన్ని యుపన్యాసముల నిచ్చెను. 1860 వ సంవత్సరము ఏప్రల్ 20 వ తారీఖున నింగ్లీషు విద్యాభ్యాసము బంగాళీలకుఁ జేయుచున్న చెరుపునుగూర్చి యతఁడొక యుపన్యాసము చేసెను. అది దేశమందు చాల సంక్షోభము గలిగించెను. హిందువులలో ననేకులకు మానమోహనుపై మహాగ్రహము కలిగెను. బారిష్టరుపనిలో మానమోహనునకు హిందువులలోను నింగ్లీషువారిలోను నెవరికి గలుగునంత పేరుం బ్రతిష్టయు లభియించె. అతడు పదవిలో ప్రవేశించిన స్వల్పకాలములోనే యొక గొప్పవానిమీద పెద్దయభియోగము వచ్చెను. అనేరస్థుడు తన పక్షము వాదించుటకు జిర కాలానుభవము గల గొప్ప న్యాయవాది నొకని నేర్పఱచుకొని వానికి సహాయకుడగ నుండుటకు మానమోహనుని గూడ నియమించుకొనెను. దైవవశమున నభియోగము విచారణకు వచ్చునప్పటికి మొదటి యతడు చనిపోవుటంజేసి యాకార్యభార మంతయు మానమోహనునిమీద బడెను. ఆవ్యవహారమున మానమోహనుఁడు గెలువజాలడయ్యెను. కాని వాదము సలుపుటలో నతడు చూపిన సామర్థ్యమునకు బుద్ధి కుశలతకుమెచ్చి ప్రధాన న్యాయాధిపతి వానిని శ్లాఘించెను. కాలక్రమమున నతడు జనుల సన్మానమునకు నాదరమునకు బాత్రుఁడై తఱుచుగ క్రిమినలు వ్యవహారములలో బనిచేయుచు గొన్నియెడల ముద్దాయీలవద్దనుండి ధనము గ్రహింపకయే ధర్మార్థము పనిచేయుచు నిరపరాధుల బెక్కండ్ర నురినుండి దప్పించి పుణ్యము గట్టుకొనెను. బంగాళమునందున్న పోలీసువారియొక్కయు మేజస్ట్రీటుల యొక్కయు నక్రమములను బలుమారతడు వెల్లడిచేయుట జేసి వారి కితని పేరీశ్వర వేరైయుండెను. 1882 వ సంవత్సరమున నవద్వీపము నందు వసియించు మాలక చంద చౌకిదారను నిరుపేద రహితు మీద తొమ్మిదియేండ్ల వయసుగల తన బిడ్డను చంపినట్లు నేరము మోపబడి శిక్ష వేయంబడెను. ఆ వ్యవహారములో మానమోహనుడు ధర్మార్థము పనిచేసి చాల శ్రమపడి శిక్ష కొట్టివేయించి వానిం బ్రతికించెను. ఇది యొక్కటియేగాదు. వ్రాయదలంచుకొన్న నతడు చేసిన ధర్మకార్యము లనేకములు గలవు.

మానమోహనుడు చేసిన మేలు మరువక యా కాపువా డా ఋణము సంవత్సరమునకు రెండుసారులు మానమోహనుని దర్శనముచేసి యోపికకొలది వానికి బహుమానము లిచ్చుచు వచ్చెను. సాక్షుల నడ్డుప్రశ్నలు వేయుటలో మానమోహనున కధిక ప్రజ్ఞ గలదని చెప్పుదురు. ఒకమారొక డిప్యూటీకలెక్టరుగారొక వ్యవహారమున సాక్షిగ వచ్చి మానమోహనుని ప్రశ్నలధాటి కాగజాలక యొకమాట కొకమాట సంబంధము లేన ట్లవకతవకల నెన్నేని పలికి చిట్టచివఱకు సంభ్రాంతుడై మూర్ఛపోయెను.

ఈయనకు జిన్న తనమునుండియు స్త్రీవిద్యయం దత్యంతాభిమానము గలదు. ఆ కారణమున 1873 వ సంవత్సరము మార్చినెల యందతడు బెత్యూనుకాలేజీ వ్యవహారముల జూచుటకు దత్పరిపాలనాసభలో నొక సభ్యుడయ్యెను. పిమ్మట గొన్నినాళ్ళకత డాసభకు గార్యదర్శియై దత్కార్యముల నతిశ్రద్ధతో నిర్వహించెను. 1885 వ సంవత్సరమున ఇంగ్లాండు ప్రజలకు మన దేశస్థితులను జక్కగా విన్నవించుటకు మనవా రొక్కొక్క రాజధానినుండి యొక్కొక్కని బంపదలంచి బంగాళమునుండి మానమోహనుని బంపిరి. హిందూ దేశీయ మహాసభ పుట్టినది మొదలు మానమోహనునకు దానియం దభిమానమే యుండెను. అందుచే 1890 వ సంవత్సరము నందు కలకత్తా నగరమునందు జరిగిన యాఱవ దేశీయ మహాసభ నిర్వహించుట కేర్పడిన సమ్మాన సంఘమున కిత డధ్యక్షుడయ్యెను. అంతేగాక 1896 వ సంవత్సరమున క్రిష్ణఘరు నగరములో జరిగిన బంగాళా రాజధానిసభ కధ్యక్షుడుగ నియమింప బడెను. హిందూ దేశమునం దిప్పటికిని కలక్టర్లకు సిస్తు వసూలుచేయు నధికారమే గాక నేరముల విచారించి దోషుల శిక్షించు నధికారము గూడ కలదు. ఆ రెండధికారము లొక పురుషునియందే యుండుటచేఁ బ్రజలకు విక్కులు మిక్కిలి సంభవించుచున్నవని నమ్మి మానమోహనుఁడా యధికారము వేఱు వేఱు పురుషుల కియ్యవలసినదని పట్టుపట్టి వాదించెను.

దేశీయమహాసభలో చర్చింపఁబడు నంశములలోనిది ప్రధానమైనది. ఆ విషయమున మానమోహనఘోషుయొక్క వాక్యములు ప్రమాణములు. అతఁడు 1895 వ సంవత్సరమున నింగ్లాండునకుఁ బోయి యీయంశ మాదేశస్థులకు నచ్చఁజెప్పెను. ఆసంవత్సరమున పునహానగరమున జరుగు దేశీయమహాసభకు వచ్చుటకు వీలుండదేమో యను భయమున త్వరపడి స్వదేశమునకు వచ్చి యాసభలో కూడ యీ యంశమును విపులముగఁ జర్చించెను. అనంతర మతఁడు కలకత్తాకువచ్చి రివిన్యూ మేజస్ట్రీటు యధికారములు రెండును జేతిలోనున్న యుద్యోగస్థులు చేసినతీర్పులను వానిలో జరిగిన యన్యాయ ములను రెండుసంపుటములుగఁ బ్రకటించి యీ మార్పుచేయుట యావశ్యకమని యందఱకుఁ దోఁచునట్లుచేసెను. మానమోహనుని వ్రాతలకును బలుకులకు 'సర్ చార్లసు ఇల్లియటు' అను బంగాళా దేశపు గవర్నరొక వార్తాపత్రికలో బ్రత్యుత్తరమిచ్చెను. ఆ దొరగారియుక్తులకుఁదగిన ప్రత్యుత్తరములు మానమోహనుఁడీ దలంచు చుండఁగనె వానినంతలో మృత్యుదేవత తన పొట్టం బెట్టుకొనియె 1896 వ సంవత్సరము అక్టోబరునెలలో మానమోహను ఘోషు స్వస్తానమగు క్రిష్ణఘరు నగరమున మృతినొందెను.

మానమోహనుఁడు కలసిమెలసియుండు స్వభావముగలవాడు. ఎదుటివారిమనసునొచ్చునేమొ యనుభయమున నతఁ డెల్లపుడు మృదుభాషియై దయాళుఁడై యుండెను. సర్వవిధములచేత నతఁడు సజ్జనుఁడని చెప్పవచ్చును. హిందువులయెడ నతని కెంతయాదరము గలదో విదేశీయులగు నాంగ్లేయుల యెడలనునం తేయాదరముగలదు. అతనియెడ వారిరువురకుఁ గూడ నంతెయాదరము గలదు. అతఁడు మృతినొందినపుడు 'నేషనల్ ఇండియన్ అస్సోసియేషన్‌' అను సంఘమువారు హిందువులను నాంగ్లేయులకు నైకమత్యము నొడ గూర్చుటలోను స్త్రీపురుషుల విద్యాభివృద్ధి చేయుటలోను మానమోహనఘోషు చాలశ్రమపడినాఁడని వానియెడల దేశస్థులు కృతజ్ఞులై యుండవలెనని యొకతీర్మానము వ్రాసిరి. అతఁడు చేసిన దానము లనేకములు గలవు. నిరుపేదలకు దోషులకును విద్యార్థి సంఘములకును సత్కార్యములకును ధనలోపముచేఁ బడిపోవుటకు సిద్ధముగ నుండు వార్తాపత్రికలకు మానమోహనుడు కల్పవృక్షమై యడుగుటయె తడవుగ ధనసహాయము చేయుచుండెను, మందభాగ్యుఁ డగు బంగాళీకవి మధుసూదనదత్తునకు మానమోహనుఁడు చేసిన సాయ మింతింతయనరానిది. మధుసూదనదత్తు మరణకాలమున తల్లి లేని తన యిరువురు కుమారులను సంరంక్షింపుమని మానమోహనున కప్పగించెను. పరమదయాళువగు మానమోహనుఁడు తనమిత్రుఁడు చరమావస్థలో చేసిన ప్రార్థనమును మనసున నుంచుకొని యా బాలకుల సంరక్షణకై యొక చిన్నసంఘము నేర్పరచి విద్యాబుద్ధులు చెప్పించెను. మానమోహనుని దయచేతనే యాబాలకులు విద్యావంతులై దొరతనమువారియొద్ద నుద్యోగము సంపాదించి సుఖించిరి.