మహాపురుషుల జీవితములు/మహారాజా సర్. రామవర్మ

మహారాజా సర్ రామవర్మ

ఈరామవర్మ వెనుకటి తిరువాన్కూరు మహారాజు. ఈయన 1837 వ సం|| మేనెల 19 వ తారీఖున జన్మించెను. ఆయన తండ్రి గొప్ప సంస్కృత పండితుఁడు. ఇంగ్లీషుగూడ సాధారణముగ నతడు వ్రాయఁ జదువ నేర్చుకొనెను. ఆయన తల్లి రుక్మిణీభాయి సంస్కృతమునందు మంచి సామర్థ్యము గలదై మృదుమధుర శైలిని కవిత్వముఁగూడ చెప్పుచు వచ్చెను. ఆదంపతుల కేడుగురు బిడ్డలు కలిగిరి. అందు మువ్వురు చిన్న తనమందెమృతినొందిరి. ఇద్దరు పిచ్చివారైరి. రామవర్మ కడసారపుబిడ్డఁడు. ఆమృతినొందిన పిల్లలు మువ్వురొక్కమారే రామవర్మజననమున కాఱుదినములు ముందుగ గతించిరి. అందుచేత రామవర్మతల్లి యీబిడ్డనిం గనునప్పటికి మహా దుఃఖ సముద్రములో మునిగియుండెను. తల్లి యవస్థ యట్లుండుటచే నపుడుద్భవించిన రామవర్మ దుర్బలశరీరముతోఁ బుట్టెను. ఈతఁడు పుట్టిన రెండునెలలకే తల్లి మరణ మొందెను. దీనిచేత నతఁడు మఱింత దుర్బలశరీరుఁడయ్యెను. అందుచేత నాబాలుని సంరక్షణము పెద్ద మేనత్త యగు రాణీ పార్వతీభాయి పాలఁ బడియెను.

రామవర్మ యైదేండ్ల బాలుఁడై నప్పు డక్షరాభ్యాసము చేసి తండ్రి సంస్కృతము మళయాళము వానికిఁ జెప్పింప నారంభించెను. అతడు తొమ్మిదవయేట వెనుకటి దివా నగు సుబ్బారా వనువానివద్ద నింగ్లీషు చదువఁ బ్రారంభించెను. ఈసుబ్బారావు కొంతకాల మీ సంస్థానములోనే దివానుపనిచేసి యుద్యోగము మానినపిదప రామవర్మ మేనమామల కింగ్లీషు చెప్పెను. అతని నిప్పటికి నాప్రాంతపు జను లింగ్లీషు సుబ్బారావని చెప్పుకొనుచుందురు. బాల్యమునందు


రామవర్మ రోగపీడితుఁడై నందున చదువు సరిగా జరుగలేదు. కాని చదివినపుడెల్ల నతఁడు మిక్కిలి పూనికతోఁ బనిచేయుచువచ్చెను. ఏపనియయిన సగము సగము చేయుట వానికిఁ జిన్ననాటనుండియుఁ గిట్టదు. తండ్రిశిక్షలో నుండుటచే నీగుణమువానికి మఱింత వృద్ధి నొందెను. అట్లు కఠినమైన పితృశిక్షలో నుండుటచేత వానియందు స్వతంత్రబుద్ధి వర్థిల్లెను. ఈస్వాతంత్ర్యము సత్కార్యములు గావించు వారియెడల వినయమై యకార్యములు గావించువారియెడల యవినయమై నానాట వృద్ధినొందెను.

1849 సంవత్సరమందు వానియందు క్షయరోగ చిహ్నము లంకురించెను. ఆరోగబలముచే నతని శరీరము కృశించినను మనోదార్ఢ్య మంతకంత కతిశయించెను. ఆరోగము కొంచెముపశమించిన పిదప రామవర్మకుఁ దగిన యుపాధ్యాయు నేర్పరుపఁతలంచి తిరువాన్కూరు మహారాజు మంచియొజ్జను బంపుమని చెన్నపట్టణపు దొరతనమువారికి వ్రాసెను. ఆదొరతనమువారు శ్రీమాధవరావుగారిని బంపిరి. ఈయనయే రాజా మాధవరావను బిరుదమునొంది బరోడా సంస్థానమునకు మంత్రియైన ఘనుఁడు. ఈమాధవరావుగారితండ్రియుఁ బినతండ్రియుఁగూడ తిరువాన్కూరులో బూర్వము మంత్రులై యుండుటచేతను మాధవ రావా కాలపు విద్యావంతులలోఁ బ్రథమగణ్యుఁ డగుటచేతను తిరువాన్కూరు యువరాజున కుపాధ్యాయుఁ డగుట కతఁడే తగినవాఁడని దొరతనమువా రంపిరి. 1849 వ సంవత్సరమున మాధవరావు రామవర్మ కొజ్జగా నియమింపఁబడి శిష్యునకు నాలుగేండ్లు విద్యఁగఱపెను. మాధవరావు శిష్యున కింగ్లీషులోని సాహిత్య గ్రంథములు మనోవికాసముఁ గలిగించు ప్రకృతిశాస్త్ర సంగ్రహములు నేర్పెను. రామవర్మ విషయమున గురువు చేసిన శ్రద్ధకుఁ దోడుగఁ దండ్రియుఁ జాల శ్రద్ధచేసి విద్యాబీజములు


బాలుని మనస్సుమీఁద నాటునట్లుచేసెను. 1853 వ సంవత్సరమున మాధవరావు సంస్థానములో నొక యుద్యోగస్తుఁడుగ నియమింపఁ బడినందున రామవర్మ విద్యాభ్యాస మంతటితో ముగిసినదని చెప్పవచ్చును. గురువువద్ద శిక్షగా విద్య జెప్పుకొనుట మూనినను రామవర్మ విద్యావ్యాసంగము మానక జ్ఞానాభివృద్ధి నిమిత్తము బహుశాస్త్రగ్రంథములు తెప్పించి మునుపటికంటె నెక్కుడు తమకముతోఁ జదువ నారంభించెను. ఆయన విద్యాసక్తిని వానిచేత సంపాదింపఁబడిన గ్రంథ భాండారమే వేయినోళ్ళజాటును ఆగ్రంథావళిలో నాయనఁ జదువని పుస్తకము లేదు.

ఇంగ్లీషులో వచనరచనమునం దాయనకు మిక్కిలి యాసక్తి యుండెను. అది వృద్ధిజేసికొనుటకై రామవర్మ "యుద్ధక్రౌర్యములు ప్రశాంతిలాభములు"నను శీర్షికతో నొక యుపన్యాసమువ్రాసెను. అవి యాకాలమున జరుగుచున్న క్రిమియా యుద్ధమునుగూర్చి యుద్దేశింపఁబడినవి. తిరువాన్కూరులో నప్పుడు రెసిడెంటుగా నున్న కుల్లెన్ దొరగారు వాని యుపన్యాసమును జూచి చాల మెచ్చి యంతటి చిన్న వయసువాడట్టి మంచి యుపన్యాసము వ్రాయుట కష్టమని యభిప్రాయపడిరి. వ్రాసిన ప్రథమోపన్యాసము శ్లాఘనీయముగ నున్నందున రాజకుమారుఁడు సంతసించి వెండియు వ్రాయవలెనని యుత్సాహముగలిగి వార్తాపత్రికలకు వ్యాసములు వ్రాసి పంపుచు వచ్చెను. ఆకాలమునఁ నిప్పుడున్న పత్రికలులేవు. ఆకాలపు పత్రికలలో జాన్ బ్రూస్ నార్టనుగారిచేఁ బ్రకటింపఁబడుచు వచ్చిన యధీనేయమనునది ముఖ్యమయినది. దానికి రామవర్మ బహు విషయములంగూర్చి వ్రాసి పంపుచు వచ్చెను. అతఁడు వ్రాసినవన్నియుఁ బత్రికాధిపతి వందనములతో నందుకొని ప్రకటింపుచు వచ్చెను. రామవర్మ యీ వ్యాసములతోనే కాలము గడుపక ప్రకృతిశాస్త్రపఠనమం దభిరుచి


కలవాఁడయి జ్యోతిశ్శాస్త్రము, ప్రకృతిశాస్త్రము, రసవాదశాస్త్రము, వృక్షశాస్త్రము, మొదలగు ననేక శాస్త్రములలోఁ గృషి చేసెను.

ఈనడుమ రామవర్మ కనేక కష్టములు సంభవించెను. 1853 వ సంవత్సరమున తల్లిలేని పసికూనయగు తన్ను దల్లికంటె నెక్కుడుగ బెంచిన రాణీ పార్వతీభాయు పరమ పదమునొందెను. 1857 వ సంవత్సరము వానికున్న యొక్క తోఁబుట్టువు యొక కుమారునింగని మృతినొందెను. ఆకుమారుఁడే యిప్పటి తిరువాన్కూరు మహారాజు. 1858 వ సంవత్సరమున రామవర్మకు దల్లి లేని వెలితిలేకుండ సకలవిధముల గనిపెట్టి పెంచిన తండ్రి లోకాంతరగతుడయ్యెను. ఈ యశుభము లన్నియు నైన పిదప 1859 వ సంవత్సరములో రామవర్మకు వివాహమయ్యెను. తనకు సహధర్మచారిణిగ యావజ్జీవము నుండవలసిన కాంతను దన నిమిత్తము పరులు వెతకి తెచ్చుట మంచిది కాదని రామవర్మ పూర్వ బాంధవ్యముగల యొక సత్కుటుంబమునుండి కన్యను స్వయముగా నేరుకొని వరించెను. ఈ సమయములోనే సంస్థానములో గొప్ప మార్పు జరిగెను. 1857 సంవత్సరం డిశంబరు నెలలో నంతవఱకు దివానుగానుండిన కృష్ణారావుగారు మృతినొంద మాధవరావుగారా మంత్రిపదమున నియోగింపఁబడెను. వెనుకటి రెసిడెంటు కుల్లెను దొరగారికి బదిలీకాగా నతని స్థానమందు మాల్టుబీ దొరగారు నియుక్తులైరి. ఆమంత్రియు నా రెసిడెంటును గలిసి సంస్థానమునకుఁ గావలసిన మంచి మార్పులన్నిటిని దెచ్చిరి. వారు చేయఁదలఁచిన మార్పులన్నిటిలో యువరాజగు రామవర్మ వారికుపదేష్టయయి సహకారియై యుండువాఁడు. చెన్నపట్టణమునందు ప్రచురింపఁబడు వార్తాపత్రికలలో రామవర్మ మారుపేరుఁబెట్టుకొని తిరువాన్కూరు సంస్థాన విషయముల నెన్నిఁటినో గూర్చి యితరులు వ్రాసినట్లు వ్రాసి మాల్టుబీ


దొరగారికి దోఁచని సంగతులు చాలవరకు తెలిసెను. ఆ పత్రికను చదువుకొని మాల్టుబీదొరగారు తానుచేయు మార్పు లెంతవఱకుపయుక్తములో యెంతవఱకు కావో తెలిసికొని మెలకువతో మెలఁగుచు వచ్చెను.

ఆ సంస్థానములో దక్షిణభాగమున గొందఱు క్రైస్తవమతబోధకులుండి వారి పాఠశాలలో మతము బోధించుట యావశ్యకమని చట్టముల నేర్పరచమని తిరువాన్కూరు ప్రభుత్వమువారిని బీడింపఁజొచ్చిరి. పాఠశాలలో మతబోధ విషయమున దొరతనమువారు జోక్యము కలుగఁజేసికొనక పోవుటయే శ్రేయస్కరమని రామవర్మ యొకచిన్న పుస్తకమును వ్రాసెను. అది యిప్పటికిని మనవారందఱు జదువుకొనవలసిన గ్రంథమే. అది వ్రాసిన పిదప గ్రైస్తవ మతబోధకులు తమవాదము గొంతవఱకు విడిచిరి. సంస్కృత విద్యయొక్క యావశ్యకతను గూర్చి రామవర్మ చెన్నపట్టణములోనున్న నార్టను గారికి మంచి యుపన్యాసము వ్రాసి పంపెను. అది చదివి యతఁడు మిక్కిలి సంతసించెను.

1861 వ సంవత్సరమున రామవర్మ చెన్న పట్టణమును జూడఁబోయి యచట గవర్నరుగారి దరిశనము చేసెను. తిరువాన్కూరు రాజకుమారులు చెన్నపురికిఁ బోవుటకు గవర్నరును జూచుటకు నదియే మొదలు ఆయననుజూచి గవర్నరు మిక్కిలి సంతసించి యటువంటి హిందువును తానెన్నఁడు జూచి యుండ లేదని మాల్టుబీదొరగారికి వ్రాసెను. రామవర్మ చెన్నపురిలో నుండినపుడు గవర్నరుతోడను మఱికొందఱు తెల్లవారితోడను కొందఱు స్వదేశస్థులతోడను స్నేహముచేసి స్వదేశమునకుఁ బోయినపిదపఁ గూడ నుత్తర ప్రత్యుత్తరముల మూలమున నామైత్రి నిలుపుకొనెను. గవర్నరు రాజకుమారుని వైదుష్యమునకు మెచ్చి చెన్నపట్టణపు యూనివర్శిటీలో వాని నొక


సభ్యునిగ జేర్చెను. ఈగౌరవ మిప్పుడు చవుక యినను వెనుక మిక్కిలి యరుదయి యుండెను. చెన్నపుర సందర్శనమువలన దేశాటనమందుఁ గుతూహలము కలుగ రాజకుమారుఁడు స్వదేశముఁ జూడవలయునని సంకల్పించెను. సంకల్పించి బయలుదేరి యతఁడు పూనికతో నన్నికొండలను నన్నినదులను నన్ని జలసత్రములను జూచెను. చిత్రమనస్కులైన పురుషులు తిరువాన్కూరులో నెక్కడికైనఁబోయి యొక పాడుదేవాలయమును ప్రాతకోటను యొకపురాతన శాసనమును మఱియే పూర్వకాల చిహ్నమునో జూచి తాము దానిని క్రొత్తగా గనిపెట్టినామని చెప్పుకొన్నప్పుడు తత్ప్రదేశముల నున్నవారు వారిపలుకులు విని నవ్వి "అది యీవఱకు మావైశాఖం తిరువల్ కనిపెట్టినదే క్రొత్తదికా" దని తెలియజేయుచుందురు. వైశాఖం తిరునల్ల ను నది రామవర్మయొక్క రెండవపేరు. ఈ దేశయాత్రలో నతఁడు చిత్రచిత్రములగు మొక్కలను, విత్తనములను, రాళ్ళను, లోహములను, వన్నె పురుగులను, వింతపిట్టలను, చిన్న చిన్న క్రిమిజాతులను బ్రోగుచేసికొని బండ్ల మీఁదవేయించి స్వగృహమునకు దెప్పించుచుండును. మఱియు నతఁ డంతతోఁదృప్తినొందక స్వదేశమునఁ బెరిగెడు యోషధుల యొక్కయు బుష్పముల యొక్కయు లతలయొక్కయుఁ జిత్రవస్తువులయొక్కయుఁ జిత్తరువులు తనకొలువులో నున్న చిత్రకారులచేత వ్రాయించి దగ్గరనుంచుకొనును. ఇట్లు ప్రోగుచేసిన వస్తుసముదాయములనుండి కొన్ని వస్తువులు తీసి యతఁడు విదేశస్థుల కిచ్చి వారివద్దనుండు విచిత్రవస్తువులను తనవానికి బదులు గ్రహించుచుండును.

ఆతఁడు ప్రకృతిశాస్త్రములను జదువుటయేగాక వానియం దనుభవము కలుఁగునట్లు పరిశ్రమచేసెను. ఆయనకు వృక్షశాస్త్రము నందు మిక్కిలి యభిమానముకలదు. దానికిఁదోడుగ వ్యవసాయము


నందును మిక్కిలి యభిరుచియుండెను. ఆ ఆయభిరుచిచేతనే రామవర్మ వటక్కు కొత్తరమనుపేర నొకమందిరమును నిర్మించి దాని చుట్టు మంచి పండ్లతోఁటలు పూఁదోటలు పంటచేలు వేయించి రాజయ్యు గృషీవలుఁడైఁ యుండెను. వంటక్కు కొత్తరమనగా నల్లుని మందిరమని యర్థము. ఈభవనమందు రామవర్మ దనజీవితమునఁ జాలకాలము గడపెను. అన్య దేశములలోఁ బండుధాన్యములు దుంపలు, పొగాకు మొదలగునవి తెప్పించి స్వదేశమున నాటించి యతఁడు కృషి వృద్ధిచేసెను. చిత్తరువులు వ్రాయుటలో నభిరుచి గలవారి కావిద్యలు నేర్పించి ముఖ్యముగా నీటితో రంగులువేయుట చమురుతో రంగులువేయుట నను రెండు కళల విషయమునఁ జాలపని చేసెను.

ఈనడుమ మాధవరావుగారు కొన్ని కారణములచేత సంస్థానములో దివానుపనిని మానుకొనిరి. రామవర్మ కాయన గురువగుట చేత గురుభక్తినిఁజూపుచు నతఁడు మాధవరావుగారిబుద్ధివి శేషమును గొనియాడుచు 'కలకత్తారివ్యూ' యను పత్రికకు మనోహరమయిన యుపన్యాస మొకటివ్రాసిపంపెను. ఆవ్రాత యానాటి విద్యావంతుల మనస్సుల నాకర్షించెను. అప్పటి గవర్నరు జనరలుగారగు నార్తుబ్రూకు ప్రభువుగా రది చదివి మాధవరావు రాజనీతి విశారదు డని గ్రహించి యిందూరు సంస్థాన ప్రభువగు హోల్కారునకు మంత్రి కావలసియుండగా మాధవరావు నంపిరి. ఆ గవర్నరు జనరల్ గారే రామవర్మ బుద్ధికుశలత గూడ గ్రహించి తన యాలోచన సభలో సభ్యుడుగా నుండుమని ఆయనను గోరిరి. కాని యనారోగ్యముచేత రామవర్మ దాని నంగీకరింపలేదు. 1874 వ సంవత్సరమున రామవర్మకు జబ్బుచేసి ప్రాణము మీదికివచ్చెను. అతడు జీవింపడనికొన్ని దినములు బంధువులు నిరాశచేసికొనిరి. ఎట్టెటో దైవానుగ్రహమున


జాడ్యవిముక్తుడై బ్రదికెను. బలము చేరినది మొదలు రామవర్మ యెప్పటియట్టే చదువునందు వ్రాతయందు తన కాలము గడుపుచు వచ్చెను. మాధవరావు దివానుగానుండిన కాలమున తిరువాన్కూరులో నుపయుక్తములగు మళయాళగ్రంథములు వ్రాయించుటకు చిన్న సభ యేర్పరచెను. ఆ సభకు రామవర్మ మిక్కిలి తోడుపడి సత్య, విద్య, యారోగ్యము మొదలగు విషయములుగూర్చి తాను స్వయముగ చిన్నిగ్రంథములు వ్రాసి యాసభవారికిచ్చుచువచ్చెను. మహారాజు కుమారుఁడయినను పాటుపడవలసినదనియు బాటుపడినందువలన గౌరవ లోపము లేదనియుఁ దానప్పటికి యువ రాజయ్యు కాఫీతోట వేయించి స్వయముగ పనిచేయించెను. ఆతఁడు పండించిన కాఫీతక్కిన కాఫీలకంటె శ్రేష్టతమమయినది. చెన్నపురమందు జరిగిన వస్తుప్రదర్శన సభవారు వానికొక బంగారు పతకమును బహుమాన మిచ్చిరి. బుద్ధికుశలతగల వారితోడను విద్యావంతుల తోడను రామవర్మ తరచుగ సహవాసముచేయ నభిలాష గలవాడు. ఈయభిలాష బంధముచేతనే యతఁడు సర్వకళాశాలలోఁ జదువుకొనుచుండిన కుశాగ్రబుద్ధులకు విద్యార్థులం దనమందిరమునకు రావించి వారితో విద్యాగోష్ఠి జేయుచుండెను. ఇప్పుడా సంస్థానమున గొప్పయుద్యోగములో నున్న పురుషు లనేకులు మొదటరామవర్మ చేరదీసినవారే. మైసూరు సంస్థానమున మంత్రిపదవి నొందిన రంగాచార్యులవారు కూడ మొదట రామవర్మచేత బెంపఁబడినవారే.

1880 వ సంవత్సరమున సంస్థానమును బాలించు మహారాజు మృతినొంద రామవర్మ తిరువాన్కూరు మహారాజయ్యెను. అతని పట్టాభిషేకము 1880 వ సంవత్సరము జూను 17 వ తేదీని జరిగెను. ఈయనవలె సర్వజనులకు నిష్టముగ గద్దెక్కిన మహారాజు మఱియొకఁ డుండఁడు. సకల విశారదుఁ డయి సచ్చరిత్రుఁ డగు రామ


వర్మ సింహాసన మెక్కినతోడనే సంస్థానమందలి ప్రజలందఱు తామదృష్టవంతుల మనుకొనిరి. దక్షిణ హిందూస్థానమందలి విద్యావంతు లందరు వాని మంచి యేలుబడిచేత వాని సంస్థానమేగాక యామార్గ మనుసరించి తక్కిన సంస్థానములుఁగూడ బాగుపడునని తలంచిరి. రామవర్మ గద్దెయెక్కినతోడనే వెంబాకము రామయ్యంగారిని మంత్రిగా జేసికొనెను. రామయ్యంగారి స్వభావము రామవర్మ స్వభావమువంటిదే యగుటచే వారి కొండొరులమీద నంతకు ముందే యిష్టముండెను. ఆయన మంత్రి యయినతోడనే రాజు మంత్రియుఁ గలసి సంస్థానములోఁ బలుమార్పులు చేసిరి. కోర్టులలోను రివిన్యూ వ్యవహారములోను పోలీసులోను ఉప్పు డిపార్టుమెంటులోను ప్రాతపద్ధతులఁ జాలవఱకు తొలగించి యాయన క్రొత్తపద్ధతులఁ బెట్టెను. ఇది యది యని చెప్పనేల ? ఆ మహారాజు గుఱ్ఱములు నేనుఁగులు మొదలగు జంతువుల సంరక్షణమునుగూర్చి సయితము స్వయముగ మార్పులఁ జేసెను. చేయదలఁచిన మంచి యేర్పాటు లన్నియు సత్వరమే చేయవలెనని యతఁడు పోరుచు వచ్చెను. ఏలయన రామవర్మ దుర్బలుఁ డగుటచే నెప్పుడు తనకు మరణము సంభవించునోయని భయపడుచు వచ్చెను. ఆసందేహము మనస్సులో నుంచుకొని యతఁడొకసారి మంత్రి కిట్లువ్రాసెను. "నాకిప్పుడు నలువది యాఱేండ్లున్నవి. ఒక్కరు తప్ప నాపూర్వులెవ్వరు నేఁబదియేండ్లు దాఁటి బ్రతుకలేదు. కాబట్టి నేడు చేయవలసినపనిని రేపటి కాపవద్దు" అట్లు త్వరపడి సంస్థానవ్యవహారమంతయుఁ జాలఁ గట్టు దిట్టముచేసెను. ఆమార్పులు చేసిన పిదప మహారాజుదృష్టి నేలకొలత (సర్వే) పన్ను నిర్ణయము (సెటిల్‌మెంటు) అను రెండు క్రొత్తపద్ధతులమీదికి బోయెను. తిరువాన్కూరు సంస్థానములో భూముల లెక్కలు చిరకాలమునుండి యుండవలసిన విధముగా లేవు.


అవి చక్కఁజేయుట చాల శ్రమకరమని వెనుకటి మహారాజులు దాని జోలికింబోరైరి. రామవర్మ తన యావచ్ఛక్తి వినియోగించి పంటనేలలన్నియు గొలిపించి వానికిం దగినట్లు పన్నులు గట్టించెను. అది యైన పిదప రామవర్మ చిరకాలమునుండి కొచ్చినుసంస్థానప్రభువులకుఁ దనకుఁగల సరిహద్దుల వివాదమును బరిష్కరించుకొనఁ దలఁచి మధ్యవర్తుల నేర్పఱచుకొని వారు చెప్పినట్లువినుట కొడంబడి యావివాదము నంతమొందించెను. మహారాజున కీ మార్పులు చేయుట యొకయెత్తు సంస్థాన మందలి యుద్యోగస్థుల నదుపులో నుంచుట యొకయెత్తుగ నుండెను. రామవర్మ గద్దెయెక్కినప్పుడు లంచగొండు లందఱు నడుగంటెదరని నాగరికులగు పౌరులేగాక కొండవాండ్రుసయితము సంతోషించిరి. వారి కోరికలు సఫలము లయ్యెను. సర్కారు జీతములుతినుచు దురాశాపాతకులై లంచములకై ప్రజలం బీడించు దుర్వినీతుల నతఁడు నిష్కరుణముగ దండించి రైతులబాధ తొలగించెను. దుర్జనుల దౌర్జన్యము నడచుటలో వాని కెంతజాగ్రతయుండెనో సన్మార్గుల యోగ్యతను మెచ్చి బహుమానము చేయుటలో నంత జాగ్రత్త వానికుండెను. రాచరికము చేయుచున్నాఁడని పేరెగాని రామవర్మ చేసినంత పని యా సంస్థానములోఁ నేయుద్యోగస్థుఁడు చేసి యెఱుఁగడు. దివాను పంపించెడి కట్టలకొలఁది కాగితముల నవలీలగజూచి విషయములు గ్రహించి వాని మీఁద వేయవలసిన యుత్తరువులువేసి రామవర్మ యించుకేని యాలస్యముచేయక మరలఁ బంపుచుండును. అన్ని కాగితములను జూచుకొనుటయేగాక ప్రపంచములోఁ ననేక దేశములందున్న తన మిత్రులకుఁ బ్రతిదినము పలుజాబులు వ్రాయుచుండును. వేయేల సామాన్యుఁ డగు గుమాస్తా యెట్లు పని చేసినో యతఁడు నట్లె పనిచేసెను. ఈ మహారాజు ప్రాతఃకాలమున సూర్యుని కంటె


ముందే మేల్కొని బండి షికారుపోయి తిరిగివచ్చునప్పుడు మధ్య మార్గమున నుదయభానునిం గలిసికొనును. షికారుముగించి యతఁడు గృహమునకుఁబోయి స్నానము, సంధ్యావందనము జపము మొదలగు పారలౌకికకృత్యములు నెర వేర్చుకొని భోజనముచేసి ప్రతిదినము పదునొకండు గంటలకు రాచకార్యముల నిమిత్తము దర్బారునకుఁబోవును.

అది మొదలు రెండుగంటలువఱకు మందిర వ్యవహారములు దేవస్థాన వ్యవహారములు కనుఁగొని చక్కఁజేసి తక్కిన వ్యవహారములలో లేశ లేశములుగూడ పరిశీలించుచుండును. అనంతరము కాఫీత్రాగుటకుఁ బోవును. రెండుగంటలు మొదలుకొని యుద్యోగస్థులు వ్రాసిపంపు రిపోర్టులు చదువుకొనును. కోరినవారికి దరిశన మిచ్చును. సాయంకాల మైనతోడనే మరల నతఁడు సంధ్యావందనము మొదలగు కాలకృత్యములను దీర్చుకొనును. దేహారోగ్యము సరిగా నుండనప్పుడు సయితమతఁడు సంధ్యావందనాదికములు భక్తిశ్రద్ధలతోఁ జేయుచుండును.

గవర్నరులు తన దేశము వచ్చినపుడు దేవతోత్సవము లైనప్పుడు విందులు జరిగినప్పుడు సయితము రామవర్మ రాజ్య కార్యముల నిమిత్తము తా నేర్పరచుకొన్న కాలము వానిక్రింద వృధసేయక తన విశ్రాంతినిమిత్త మేర్పడిన కాలమునందే తత్కార్యములు నెరవేర్చు చుండును.

రామవర్మ యిరువది యైదేండ్ల ప్రాయము మొదలు మరణ పర్యంతము దిన చర్య వ్రాయుచు వచ్చెను. ఎంత ప్రొద్దుపోయినను పండుకొనుటకుఁ బోవక మున్నతఁడు దినచర్య వ్రాసితీరును. ఇన్ని పనుల నడుమ రామవర్మ యింగ్లీషుగ్రంథము లనేకములు చదువుటకును యింగ్లీషుతో నెన్నో యుపన్యాసములు వ్రాయుటకును దీరిక గలవాఁ డయ్యెను. తన సంస్థాన మందున్న పాఠశాలలోఁ జదువు


బాలకుల యుపయోగము నిమిత్తము రామవర్మ యింగ్లీషులోనుండి సత్పురుషులయొక్కయు మంచి స్త్రీలయొక్కయు చరిత్రముల నేరి మళయాళభాషలో వ్రాసెను. మఱియు స్వభాషాభివృద్ధిఁ జేయుట కతఁడు "విద్యావిలాసిని" యను పేరనొక మాసపత్రికనుస్థాపింపఁ జేసి జ్యోతిశాస్త్రాది విషయములను సులభశైలిలో మళయాళభాషలో వ్రాసి యందు బ్రకటించుచు వచ్చెను. చిన్నతనము నుండియు వానికి దేశయాత్రాభిలాష మెండుగ నుండుటచే రాజ్య భారముపై బడిన కతమున వెనుకటియట్లు స్వేచ్ఛగా దిరుగ వలనుపడకున్నను రామవర్మ యుత్తరహిందూస్థానమును జూచి వచ్చెను. తీరిక చాల లేకపోయినందున నతఁడు 1882 వ సంవత్సరమున జనవరి నెలలో బయలుదేరి ముఖ్యస్థలముల గొన్నిఁటిని మాత్రమే చూచి మార్చినెల ముగియకమున్నె రాజధాని జేరెను. అతఁడు చూచిన ప్రతిపట్టణమునందు జనులు వానిదరిశనము జేయవచ్చి వానియుదార గుణముల గొనియాడుచు స్వాగతపత్రికల సమర్పించిరి. 1883 వ సంవత్సరమున నతఁడు చెన్నపురమునకుఁబోయి వెనుకచేసిన కాశియాత్రసఫలము చేయుటకు రామేశ్వరయాత్రచేసెను. రామేశ్వరము నుండి సేతువునకు బోయినపుడు రామవర్మ మహానందభరితుఁడై దినచర్యలో నిట్లు వ్రాసెను. "నేను నేటియుదయమున సముద్రపు బాయ దాఁటితిని. పూజ్యమైన రామసేతువు జూచితిని. ప్రకృతియో దైవమహిమయో నేనెఱుఁగనుగాని యిది మిక్కిలి దర్శనీయమైనది. సమానమైన వెడల్పుఁగలిగి యది గీటుగీచినట్లు తిన్నగ నున్నది. ఈ భాగమే మా దేశమును సింహళద్వీపమును గలుపుచున్నది." రామవర్మ తన రాజ్యములోఁగూడ బూర్వులకంటె నెక్కుడు సారులు పయనములుచేసి పలుతావులు చూచెను. ఆయన తన రాజ్యమునందుఁ గల ప్రతిగ్రామమునకుఁ బోయి చేతిపనులకు గాని


ప్రకృతి వినోదములకు గాని బేరువడసిన గ్రామముల పేర్లు జ్ఞాపకార్థము తనపుస్తకములో వ్రాసికొని యాయా గ్రామములందు కళావిశారదులగు బుద్ధిమంతులు గానఁబడినప్పుడు వారి కేవోపనులు గల్పించి ధనసహాయము జేయుచుండును. చేతిపనులకుఁ దగిన ప్రోత్సాహముఁ గలుగఁజేయుట కాయన యాపనులునేర్పుపాఠశాల నొకటి స్థాపించెను. అతని ప్రోత్సాహము జేతనే క్విలనుపట్టణమందు వస్త్రములునేయుయంత్రములు స్థాపింపఁబడెను. అతనిప్రోత్సాహము చేతనే పూనలూరు గ్రామమున కాగితములుచేయు యంత్రములు స్థాపించుటకుప్రయత్నము గలిగెను. ప్రకృతిశాస్త్రమునం దతనికిగల యభిరుచి నానాటికి హెచ్చ తన రాజధానిలోనున్న కలాశాలలో రసవాదశాస్త్రము (కెమిస్ట్రీ) ప్రకృతిశాస్త్రము నేర్పింపఁ దలఁచి యుపాధ్యాయుల నేర్పఱచెను. అతని శాస్త్ర పరిశ్రమలను బట్టి యూరపుఖండములో నింగ్లాండు మొదలగు దేశములలోనున్న ప్రకృతిశాస్త్రీయసంఘము లనేకములు వానిని సభ్యునిగ జేర్చుకొనియెను. సంస్కృతపాండిత్యమునుబట్టి రాయల్ ఏష్యాటిక్కుసంఘము వారు వానినిఁ దమసంఘములో జేర్చుకొనిరి. భూగోళశాస్త్రపరిజ్ఞానమునుబట్టి భూగోళశాస్త్రీయ సంఘమువారు జేర్చుకొనిరి. ఇట్లతని కీర్తి స్వేదేశమందెగాక దేశాంతరములయందు ద్వీపాంతరముల యందు ఖండాంతరములయందుగూడ వ్యాపించెను. ఈసంఘములవా రందఱు వాని నట్లు గౌరవింపకమునుపే శ్రీవిక్టోరియాచక్రవర్తినిగారు వారికి "సర్. కె. సి. యస్. ఐ." యను బిరుదమునిచ్చిరి. ఈ విదేశపు బిరుదులకుఁ దోడుగ నతఁడుస్వదేశపు బిరుదులఁగూడ గొన్నిఁటి నందెను. అతని పూర్వులందఱు తులాభారముఁదూగి కుల శేఖర పెరుమాళ్ళను బిరుదమును వహించుచువచ్చిరి. ఆవిధముగానే రామవర్మయు నాబిరుద మందెను. అనంతరము కీర్తిపతి యను బిరుదము


బడయవలెనని ప్రయత్నము చేయుచుండనంతలో మృత్యువు వానిం దనవాత బెట్టుకొనియె. ఆయన 1884 వ సంవత్సర మైదవ యాగష్టున కాలధర్మము నొందెను. ఆయన యనుకొన్నట్లె పూర్వులవిధమున నేఁబదియేండ్లు నిండగానే మృతినొందెను. కర్మలయం దాయనకు సంపూర్ణ మయిన విశ్వాసము కలదు. కర్మలు చేయఁదలఁచినప్పుడు సగము సగము చేయక సంపూర్ణముగ జేయవలెనని యాయన యభిప్రాయము. ఏ దేశమునకుగాని రామవర్మవంటి మనుష్యులు ప్రభువులగుట జనుల యదృష్టమని చెప్పవలయును. అంతటి మహారాజును దీర్ఘాయురారోగ్యము లిచ్చి రక్షింపక భగవంతుఁడు నట్ట నడుమ ద్రుంచివేయుట జనుల భాగ్యదోషముననేకదా !

తిరువాన్కూరు మళయాళదేశములోఁ జేరినది. అక్కడ తండ్రియాస్తి కొడుకునకురాక మేనల్లునకుఁ జెందుచుండును. రామవర్మయు వెనుకటి రాజునకు మేనల్లుఁ డగుటచేతనే రాజ్యప్రాప్తి గలిగెను. ఇప్పటి మహారాజు రామవర్మకు మేనల్లుఁడు గావుననే గద్దె యెక్కెను. అక్కడ ధర్మశాస్త్రము మన ధర్మశాస్త్రము వంటిదికాదు.