మహాపురుషుల జీవితములు/ప్రసన్న కుమార టాగూరు
ప్రసన్న కుమార టాగూరు
ఈయన 1803 వ సంవత్సరమున జన్మించెను. ఈతనివలన టాగూరు కుటుంబమునకు మిగుల వన్నెయు వాసియు గలిగినవి. ఇంటివద్ద నతఁడు హిందువుల కట్టుబాటులలోనే బెరుగుచు నాకాలమునకుఁ దగినరీతిగా కొంచె మింగ్లీషుగూడ జదివెను. మొట్టమొదట నతఁడు చాందసుఁడెయున్నను తరువాత కొంతకాలమునకు రాజ రామమోహనరాయల వారిమైత్రి గలుగుటఁజేసి యతఁడు హిందువుల యాచారములలో నేవిమంచివి యేవి చెడ్డవని శోధింపనారంభించెను. ఇట్లు శోధించి శోధించి యతడు దేశస్థుల కొక విజ్ఞాపనము వ్రాసి ప్రకటించెను. అందులో విగ్రహారాధనము చేయుట యనుచిత మనియు సర్వలోక సృష్ఠికర్తయు సర్వనియామకుఁడునగు పరమేశ్వరుని మానసిక పూజచేయవలయుననియు నతఁడు నొక్కి వ్రాసెను. అతడు బుద్ధిస్వాతంత్ర్యమును గనబరచుట యొక్క మత విషయముననే గాదు. ఇంకననేక విషయములం జూపెను. తాను స్వయముగ జమీందారుఁడయ్యు జమీందారు లుద్యోగములు చేయగూడదను గర్వము లేక సామాన్యులవలెనే తానును శాస్త్రములఁ జదివి పరీక్షలయందు దేఁరి న్యాయవాది యయ్యెను.
ఈ పనిలోఁ బ్రవేశించునపుడు ప్రసన్న కుమారుని మిత్రుఁడొకడువచ్చి యట్టి గొప్పకుటుంబమున బుట్టిన సంపన్నునకు న్యాయవాదిగ నుండుట యవమానకరమనియు నిరర్ధకమనియుఁజెప్పి మందలించెను. ప్రసన్న కుమారుఁడప్పు డతనితో నిట్లనియె. "మనస్సు గృహమందు జరుగవలసిన యిన్నిపనులను జక్కపెట్టుకొను భార్య వంటిది. నాకు నీలిమందు తోటలు, ఆముదపు యంత్రములు చాల గలవు. అందులో నా కన్యాయముగ నష్టములు కలుగుచున్నవి. నాకు నష్టములు తెచ్చినవారిమీఁద వ్యాజ్యములు తెచ్చితిని. కాని న్యాయవాదుల తెలివి తక్కువ వాదములచేత నా వ్యాజ్యములు పోయినవి. అందుచేతనే నేనే శాస్త్రములు చదువుకొని న్యాయవాదినై నా వ్యాజ్యముల నేనే వాదించెదను" అని చెప్పి న్యాయవాదియై యాపనిలో మిక్కిలి బుద్ధికుశలతఁ జూపి చాల ప్రసిద్ధి కెక్కెను. ఇట్లు కొంతకాలము జరిగినపిదప కలకత్తా కోర్టులో నిదివఱకు గవర్నమెంటు ప్లీడరుగానున్న యొకదొర పనిమానుకొని స్వదేశమునకుఁబోగా దొరతనమువారా యుద్యోగమును ప్రసన్నకుమారునికిచ్చిరి. ప్లీడరుపనివల్ల నతఁడుసంవత్సరంనకు లక్ష యేబదివేల రూపాయల నార్జించెను. ఆ ధనముతోడను సంస్థానమువల్ల వచ్చిన ధనముతోడను ప్రసన్నకుమారుఁ డనేక భూములను కొని జమీ చాల వృద్ధిపరచెను. శ్రీమంతులగు గొప్ప వంశస్థులలో నుద్యోగమునకు వచ్చినవారిలో నితఁడే మొట్ట మొదటివాడు. హిందూకళాశాలలో నతఁడొక సభికుఁడై దాని యభివృద్ధిని గూర్చి చాలపాటు బడియె.
తనకుమార్తెయు మనమరాలును విద్యావతులు గావలయునని సంకల్పించి యింటివద్ద వారికి విద్య నేర్పించెను. కొంతకాలముగడచిన పిదప ప్రసన్నకుమారుఁడు అనువాదక మనుపేర బంగాళీభాషలో నొక పత్రికను సంఘసంస్కారి యనుపేర నొక యింగ్లీషు పత్రికను బ్రకటింప నారంభించి సంఘసంస్కరణము రాజకీయ వ్యవహారము మతము విద్య మొదలగు విషయములంగూర్చి జనుల బుద్ధులు వికసించునట్లు మంచివ్రాతలను వ్రాయవచ్చె. రాజరామమోహనరాయలు సహగమనమును మానుపించవలసినదని చేసిన ప్రయత్నమునకు విరుద్ధముగా స్వేదేశస్థులు కొందఱు సహగమన ముండి తీరవలయునని దానిని మానుపింపఁ గూడదనియు నింగ్లాండు రాజు గారికిని పార్లమెంటు సభవారికి మహజర్లు వ్రాసిపంపిరి. కాని యా మహజర్లను లెక్క సేయక యింగ్లండు రాజుగారు సహగమనము చేయఁగూడదనియే శాసించిరి. అట్లు శాసించినందుకు శ్రీ రాజుగారికిని పార్లమెంటు మహాసభవారికిని జనులు కృతజ్ఞత దెలుపుటకై ప్రసన్నకుమారుఁ డొక పెద్ద సభచేయించెను. ప్రసన్న కుమారుఁడు మహాదాత. పూర్వము గొప్ప దశలోనుండి కాలవశమున పేదలై యభిమానము కింటనుండి యిడుమలఁ బడువారి కనేకులకు నెల నెలకు జీవితములిచ్చి సహాయములు చేయుచు వచ్చెను. తన సేవకులలో నెవరికి రోగమువచ్చినను వారి కౌషధములను గొనితెచ్చి వైద్యులచేత మందులిప్పించి వారిని బిడ్డలవలె గనిపెట్టు చుండును.
ఆయన పుస్తకభాండారము మిక్కిలి పెద్దది. అందు బహు గ్రంథములుండుటచే హైకోర్టు జడ్జీలు తక్కిన పెద్దమునుష్యులువిద్యార్థులు కావలసినప్పుడు స్వేచ్ఛగవచ్చి జదువుకొనుచువచ్చిరి. ఎల్లకాలము కలకత్తాలోనే వసియింపక ప్రసన్నకుమారుఁడు తరచుగ తన సంస్థానమునకుఁ బోయి చూచుకొనుచు వ్యవహార మంతయు దివానులమీఁదనే వదలివేయక రహితులతోఁ గలసి మాటలాడి వారి సుఖదుఃఖముల నెఱుఁగుచు వారి సౌఖ్యమునిమిత్తము వైద్యశాలలు గట్టించి రహితులకు భారమైనప్పుడు వారివద్దనుంచిపన్నులు పుచ్చుకొనక వారిని వేవిధములఁ గనిపెట్టెను. దొరతనమువారు హిందూ దేశ శిక్షాస్మృతి (ఇండియన్ పీనల్‌కోడ్డు) వ్రాయించినప్పుడు ప్రసన్నకుమారుఁడు వారికి మిగులఁ దోడ్పడియెను. గవర్నరు జనరలుగారి యాలోచనసభలో మొట్టమొదట సభ్యుఁడైనహిందువు డితఁడే కలకత్తా యూనివరుసిటీకి నతడు మూడులక్షలరూపాయలు దానముచేసి దానివడ్డీ నింగ్లీషుధర్మశాస్త్రము (లా)ను నేర్పించుటకు వినియోగింపుమని యానితిచ్చెను. అతని కుమారుడు జ్ఞాన మోహన టాగూరు క్రైస్తవుడై యింగ్లాండునకు బోయి బారిష్టరై వచ్చెను. హిందువులలో నతడే మొదటి బారిష్టరు. అతనికి గవర్నమెంటువారు సి. ఐ. ఇ. అను బిరుదమునుగూడ నిచ్చిరి. అతడు 1862 వ సంవత్సరమున మృతినొందెను. ఆతని యోగ్యతనుబట్టి కలకత్తానగరవాసు లాయన జ్ఞాపకార్థము స్ఫటికశిలతో వాని ప్రతి రూపమును జేయించి నిలిపిరి. అది యిప్పటికి నున్నది.