మహాపురుషుల జీవితములు/ఈశ్వరచంద్ర విద్యాసాగరులు


ఆమాటలు విని రామమోహనుఁడు కోపోద్దీపితుఁడయి తుచ్చ గౌరవములు సంపాదించుటకయి తానుమతము మార్చుకొననని వానితో స్పష్టముగఁ జెప్పి యానాఁడుమొద లాదొరగారితో స్నేహము మానెను. గ్రంథవిస్తరభయమునమానవలనెగాని రామమోహనుని యౌదార్యవినయశాంతగుణములను దెలుపుకథ లనేకము లున్నవి. అంతటి నీతిశూరుఁడు లోకోపకారియు మరల నిప్పటివరకును మన భరతఖండమున జనియింపక పోవుటయే, యాతఁడు సుగుణసంపదలో నద్వితీయుఁడని చెప్పుటకుఁ దార్కాణము "ఏకమేవా ద్వితీయం బ్రహ్మ" అను నుపనిషద్వాక్యమును నమ్మి యాతఁడు విగ్రహారాధనము నిరాకరించి పరిశుద్ధాస్తికమతము నవలంబించెను. గావున దయామయుఁడగు నాపరబ్రహ్మమే యాతని యాత్మకు శాశ్వతానంద మిచ్చుగాత.


ఈశ్వరచంద్ర విద్యాసాగరులు

హిందూ దేశమున మృతిపొందిన భర్తతో చిచ్చునఁబడిచావ వలసిన యాడువాండ్రను బ్రతికించి దేశమునకు మహోపకారము జేసినయతఁడు రామమోహనరాయలు ; అతని ప్రసాదమున బ్రతికిన వితంతువులను యావజ్జీవ మిహలోక నరకమగు వైధవ్యమునుండి తప్పించి వారిని మరల ముత్తయిదువలఁ జేసి పసపుకుంకుమలు నిలిపిన పరమోపకారి యీశ్వరచంద్ర విద్యాసాగరులు

ఈయన బంగాళాదేశ కులీన బ్రాహ్మణుఁడు. ఈతఁడు 1820 వ సంవత్సరమున హుగ్లీమండలములోని వీరసింఘ గ్రామమున నొక నిరుపేద కుటుంబమునం బుట్టెను. వాని తాతయగు రామజయబెనర్జీ సన్యాసియై దేశాటనముఁ జేయుచు కాలక్షేపము చేసెను. తండ్రి యగు ఠాకరుదాసుబెనర్జీ యొక వర్తకునియొద్ద నెలకు పదిరూపాయిల


వేతనముగల చిన్న యుద్యోగియయి యుండెను. ఈశ్వర చంద్రుఁడు తనయూర బడిలోయున్నంతవఱకు విద్య నేర్చుకొని తొమ్మిది సంవత్సరములు ప్రాయము వచ్చినపుడు సంస్కృత కళాశాలలో విద్య నభ్యసించుటకుఁ గలకత్తా నగరమునకుఁ బంపఁబడి యచ్చట ధర్మ శాస్త్రము, వేదాంతశాస్త్రము, కావ్యాలంకారములు, జ్యోతిశ్శాస్త్రము మొదలగు వానిని నేర్చి యనేకబహుమానము లందెను. అతఁడు తన పదియేడవయేట పండితకోర్టు మునసబుగా నుండఁదగిన పరీక్షయందుఁ దేరెను. ఆకాలమునం దాపరీక్షలో కృతకృత్యుఁ డగుట మిక్కిలి కష్టము. అతఁడా పరీక్షను దేరినతోడనే దొరతనము వారు వానికి న్యాయాధిపతి యుద్యోగము నొసంగిరి గాని యాయూరతిదూరమున నుండుటచే వాని తండ్రి కొడుకును దూరమునకుఁ బంపుట కిష్టము లేక యుద్యోగము మానిపించెను. అందుచేత విద్యా సాగరుఁడు మరిరెండు సంవత్సరములు కళాశాలలోఁ జదువుకొని సాంఖ్య వైశేష కాది షడ్దర్శనములు నేర్చి ప్రవీణుఁడయ్యె. 1833 వ సంవత్సరమున నాతఁడు చక్కని శైలితో చక్కని సంస్కృత వచనమును వ్రాసినందుకు నూరు రూప్యములును బద్యకవిత్వము జెప్పినందు కేఁబది రూప్యములును బారితోషికము బడసెను. మరుచటి సంవత్సరము నీశ్వర చంద్రుఁడు హిందూధర్మశాస్త్ర పరీక్షయందుఁ గృతకృత్యుఁడయి విద్య ముగించి విద్యాసాగరుఁడను బిరుదమును బడసెను. గీర్వాణభాష నభ్యసించెడు కాలముననే యప్పు డప్పుడించుక యింగ్లీషుభాషను సయిత మాతఁడు నేర్చికొనెను. ఈశ్వరచంద్రుఁడు మొట్టమొదట సంస్కృత కళాశాలలో వ్యాకరణపండితుఁడుగఁ గొంతకాలము పనిచేసి, పిమ్మట 1840 వ సంవత్సరమున ఫోర్టు విలియమ్ కళాశాలలో నెలకు నేబదిరూపాయలు జీతముగల ప్రధాన పండితుఁడుగా నియమింపఁబడెను. ఈ కాలమున దేశాభిమానులలో నగ్రగణ్యుఁడగు బాబు సురేంద్ర


నాధ బెనర్జీగారి తండ్రిగారగు దుర్గచరణ బెనర్జీగారి సహాయమున నీశ్వరచంద్రుఁ డప్పు డప్పుడు మిగుల శ్రద్ధతో నాంగ్లేయభాష నభ్యసించెను. 1846 వ సంవత్సరమున సంస్కృతకళాశాల కతఁడు సహాయ కార్యదర్శిగా నియమింపఁబడి యా యుద్యోగమున నున్నప్పుడే విఠ్ఠల పంచవిశంతి యలు బంగాళీ వచన కావ్యము నొకదానిని వ్రాసి ప్రచురించెను.

ఈశ్వర చంద్రుని పరిశుద్ధశైలియు, రచనా చమత్కృతియుఁ గనుఁగొని దేశస్థు లందఱు బంగాళీభాషనంత రసవంతముగ మనోహరముగ వ్రాయుటకు వీలున్నదని యప్పుడు గ్రహించిరి. ఆ యుద్యోగమున నున్నపు డాయన పలుమార్పులఁ దెచ్చి కళాశాలను వృద్ధినొందించెను గాని చిరకాలముండలేదు. 1849 వ సంవత్సరము నతఁడు ఫోర్టువిలియమ్ కళాశాలలో నెల కెనుబది రూపాయలుజీతము గల మొదటి గుమాస్తాగానే ప్రవేశించి యచట నున్న కాలములోనే స్త్రీవిద్యావిషయమున నాదినములలో గడుబరిశ్రమచేసిన బెత్యూన్ దొరగారి స్నేహము సంపాదించెను. మరుచటి సంవత్సరమున మరల నతఁడు సంస్కృత కళాశాలలో తొంబది రూపాయల జీతముగల పండితుఁడుగాఁజేరి కొలఁది కాలములోనే యాకళాశాల ప్రధానోపాధ్యాయుఁ డయ్యెను. మనపండితులు సంస్కృతభాషను విద్యార్థులకు సుబోధకమగునట్లు తెలుపలేక శిష్యులను బాధబెట్టి తాము బాధ పడుటఁజూచి విద్యాసాగరుఁడు సంస్కృత కళాశాలకుఁ బధానోపాధ్యాయుఁడుగా నున్న కాలమున గీర్వాణభాషను బాలురు చుల్కనఁగ నేర్చుకొనుటకుఁ గొన్ని పద్ధతులఁ గనిపెట్టెను. నాటనుండియు సంస్కృత విద్యాభ్యాసము సులభ సాధ్యమయ్యె. 1851 వ సంవత్సరమున వానిమిత్రుడగు బెత్యూన్‌దొర కాలధర్మమునొంది నప్పటి బంగాళాదేశపు గవర్నరు హాలిడే యను నతఁడు బెత్యూన్ పాఠశాలకు విద్యాసాగరు నధికారిగా నేర్పరచెను. 1885 వ సంవత్సర


మున నీపండిత శిఖామణి హుగ్లీ, నద్యా మొదలగు నాలుగు జిల్లాలకు పాఠశాలా పరీక్షాధికారిగ నియమింపఁబడి నెల కయిదువందల రూపాయిల జీతము నార్జింప నారంభించెను. ఈయుద్యోగమునం దున్న పుడె యాతఁడు హుగ్లీ బర్డ్వాన్ మండలములలో నలువది బాలికా పాఠశాలలు స్థాపించెను.

ఆకాలమున బంగాళాదేశమునందలి పాఠశాలలకు "యంగ్" అనునొక దొరగారు డైరెక్టరుగానుండిరి. ఆయన ఇంచుక యధికార గర్వము గలవాఁడగుటచే స్వతంత్రబుద్ధిగల విద్యాసాగరునకు తనపై యధికారితో సరిపడక పొరపులు గలుగుచు వచ్చెను. ఇట్లు క్రమ క్రమముగ మనస్పర్ధ లధికమగుచుండ నొకనాఁడు దొరగారు విద్యాసాగరునిం బిలిచి హిందూకళాశాల ప్రధానోపాధ్యాయుని యొద్దకు బోయి యొకమాట చెప్పిరమ్మని యాజ్ఞాపించెను. విద్యాసాగరున కాపని స్వగౌరవ భంగకరముగాఁ దోఁచినందునఁ తనతో దొరగారు గూడ వచ్చిన యెడల దానచ్చోటికిఁ బోవుదుననియు దానొక్కఁడు బోనొల్లననియు నతఁ డుత్తరము చెప్పెను. విద్యాశాఖకెల్ల సరా కారియగు తన్నుఁ దనచేతిక్రింది యుద్యోగస్థుఁడు తిరస్కరించుటచే దొరగారుకోపించి నీవిది చేయకతప్పదని విద్యాసాగరునితోఁ బలికెను. విద్యాసాగరుఁడు వెంటనే జేబులోనుంచి యొక కాగితముఁదీసి తన యుద్యోగమునకు విడుదల యడిగెను. బంగాళాదేశపు గవర్న రగు 'హాలిడే' యను నాతఁ డీశ్వర చంద్రునకు నాప్తమిత్రుడగుటచే నుద్యోగమును మానుకొన వలదని యతఁ డెన్ని విధములనో విద్యాసాగరుని బ్రతిమాలెను ; కాని వాని ప్రార్థనలు విద్యాసాగరుని నిశ్చల చిత్తమును జలింపఁ జాలవయ్యెను.

ఈవిధముగ దొరతనమువారి కొలువు కట్టడముసేయక నడుమనే ముగించి విద్యాసాగరుఁడు నిర్వ్యాపారుండుగాక తన దేశమునకు మునుపటికంటె నింకను మిక్కిలిగానుపకారమును జేయఁగలవాఁడయ్యె


బుద్ధి సర్వతోముఖవ్యాప్తముకాగా నాతఁడు బహుగ్రంథ నిర్మాతయయి విద్యావిశారదుఁడై సంఘసంస్కారకుఁడైఁ భూతదయాళుడై జన్మము చరితార్ధముగఁ జేసికొనెను. బంగాళాభాషలో వానివ్రాతలు మృదువులై మధురములై పరిశుద్ధములై శయ్యా సౌష్ఠవమునకు గణుతి గావించినవి. పై నుదహరింపఁబడిన గ్రంథముగాక బంగాళా దేశ చరిత్రము, సత్పురుషుల జీవిత చరిత్రము, బోధోదయము, సీతా వనవాసము మొదలగు గ్రంథములు రచించి ప్రచురించెను. ఇవిగాక సంస్కృతమున కాళిదాస ప్రణీతమగు శాకుంతల నాటకమును బంగాళీలోనికి భాషాంతరీకరించెను. స్త్రీవిద్య యన్నచో నీతని కభిమాన మెక్కుడగుటచే తద్విషయమయి యావజ్జీవము నధిక పరిశ్రమజేసెను. "బెత్యూను" పాఠశాల యభివృద్ధి నొందుటకుఁ గారణము విద్యాసాగరునకు దానిపైఁగల యభిమానము దానివిషయమయి పడిన పరిశ్రమ కారణము నని గ్రహింపవలెను. స్త్రీవిద్య యెడల నీయనకుఁగల యాదరమునుబట్టి బెత్యూన్ కళాశాలలో మూడవతరగతిలో జదువుకొని ప్రవేశపరీక్షకుఁ బోవఁదలఁచు హిందూబాలికకు విద్యాసాగరుని జ్ఞాప కార్థ వేతన మొకటి యిప్పటికి నీయఁబడుచున్నది. సర్వకళాశాలలో నాంగ్లేయపండితు లుపాధ్యాయులయి యెంతచక్కగఁ బని చేయుదురో స్వదేశీయులు నట్లే యింగ్లీషు భాషలో పండితులై యుపాధ్యాయులై కళాశాలల నిర్వహింప సమర్థులని లోకమునకుం దెలియఁ జేయుటకయి విద్యాసాగరుఁడు మెట్రాపాలిటన్ కాలేజను పేర నొక కళాశాలను స్థాపించెను. ఇది బంగాళా దేశములోని సర్వ కళాశాలలలో శ్రేష్ఠమయినదని కీర్తిబడసినది. దొరతనమువారి క్రింది యుద్యోగమును మానుకొనుటచే నాతనికి ధననష్టమించుకయు గలుగ లేదు. పాఠశాలలలో బాలురు చదువుట కుప యుక్తములగు పుస్తకము లదివరకు బంగాళీభాషలో లేమింజేసి విద్యాసాగరుఁ దుద్యోగము మానిన పిదప నట్టి గ్రంథములు వ్రాసి ప్రచురించెను.


ప్రతిపల్లెయందు ప్రతిపాఠశాలయందు ప్రతిబాలకుఁడు వానిగ్రంథములనే జదువుటచే నాతనికి రమారమి నెల కైదువేల రూపాయలాదాయము కొంతకాలమును మూడువేల రూపాయలు రాబడి కొంత కాలమును వచ్చెను. బంగాళాదేశపు పాఠశాలలో నిప్పటికిని వానిచేత రచియింపఁబడిన సంస్కృత గ్రంథములు బంగాళీగ్రంథములు చదువఁబడుచున్నవి. ఆభాషలో రచనా చమత్కృతిగల పండితు లిటీవల బహుగ్రంథములు రచించిరిగాని యవివిద్యాసాగరుని గ్రంథములకు సరిపోలవయ్యె. అందుచేత బంగాళీభాష కతఁడు గ్రంథ రూపమునఁ జేసిన మహోపకారమునకు వానియెడ దేశస్థులుకృతజ్ఞులై యున్న వారు.

సంఘసంస్కార విషయమున విద్యాసాగరుఁడు చేసినపని యసమానము. ఇతఁడే హిందూ దేశమున స్త్రీపునర్వివాహముల నుద్ధరించిన ప్రధమాచార్యుఁడు. ఇతఁడీపనికిఁ బూనుటను గూర్చి యొక చిన్న కథ గలదు. వాని దగ్గర చుట్టములలో నొకని కూఁతు రతి బాల్యమున వితంతువయ్యెను. తలిదండ్రులామెం దోడ్కొని మార్గవశమున నీపండితుని యింటికిరాఁగా విద్యాసాగరుని తల్లియా బాలిక చక్కఁదనమును లేఁబ్రాయమును జూచి దుఃఖపడి కొడుకు వద్దకుఁ బోయి నాయనా ! నీవింత పండితుఁడవు యీ బాలికను దుర్గతినుండి తొలగించి వివాహము చేయుటకు శాస్త్రములయం దెచ్చట నాధారము లేదా ? యని యడిగెనఁట. తల్లిమాటల నాదరముతో విని బాలికయవస్థకుఁ దానును మనసు కరుగవగచి యా నాఁడు మొదలతఁడు స్త్రీపునర్వివాహ విషయమున నాధారము లున్నవో లేవో కనుఁగొనుటకై శాస్త్రములు శోధించెను. 1854 వ సంవత్సరమున నతఁడు స్త్రీపునర్వివాహము శాస్త్రీయమని సిద్ధాంతీకరించి విధవా వివేకమనుపేర నొక చిన్నగ్రంథము వ్రాసెను. ఆపుస్తకము బయలువెడలిన తోడనే బంగాళా దేశమంతయు సంక్షోభను జెం


దెను. పూర్వాచార పక్షమునకు దేశమునందంతట ననేకసభలు జరిగెను, వాదప్రతివాదములు ప్రచురింపబడెను. వంగదేశమునం దంతట వ్యాకరణ శాస్త్రమున నసమానుఁడని పేరుబడిన యొక మహాపండితుఁడు విధవావివేకమును ఖండించుచు నొక గ్రంథమును సంస్కృతమున వ్రాసెను. ఆగ్రంథము జనులకు దెలియని దేశ భాషలలో నుండుటచేత కవులా గ్రంథమును జదువలేక స్వభాషలో రచింపఁబడిన విద్యాసాగరుని పుస్తకమును జదివి దాని సత్యమును గ్రహించిరి. ఈశ్వర చంద్రుని ప్రోత్సాహముచేత దొరతనమువారు స్త్రీ పునర్వివాహములు చేసికొన్న వారికి పిత్రార్జితమగు నాస్తిలో భాగములు పోవని శాసించుచు 1856 వ సంవత్సరమున నొక చట్టమును నిర్మించిరి. అది మొదలు తద్విషయమున బాటుపడి యామహాత్ముఁడు 1865 వ సంవత్సరము డిశంబరు 7 వ తారీఖున కలకత్తాలోఁ దనయింటిలో మొదటి స్త్రీ పునర్వివాహము జేసెను. అది యకార్యమని యతనికి దేశస్థులు తూలనాడిరి. కులస్థులు బహిష్కరించిరి. ఆప్తబాంథవు లావలకుం దొలంగిరి. ప్రాణమిత్రులు బరిత్యజించిరి. ఎల్ల కాలము నతని ప్రక్కను నిలిచి పనిచేయుదమని వాగ్దానములు చేసిన పెద్ద మనుష్యులు మొగముల చాటువేసిరి. ఇట్లు దేశస్థులచే విడువఁ బడియు విద్యాసాగరుఁడు తన కావించిన కార్యంబు శాస్త్రసమ్మత మనియుఁ జగద్ధితకరమనియు నీతిప్రవర్ధకమనియు నమ్మి యించుక యేనియు చలింపక ధైర్యసారము గలిగి పర్వతమువలె చెక్కు చెదరక నిలిచి వివాహము వెంబడిని వివాహముఁ జేయనారంభించెను. ఈ పెండిండ్లు వైభవముతోఁ జేయుటం జేసి యిత డప్పులపాలయ్యెను. ఆసమయమున ధనికులగుమిత్రులనేకులు వచ్చి ద్రవ్యసహాయము చేసి యాదుకొనుటకురాఁగా విద్యాసాగరుఁడు వారివలన నించు కేనియు సహాయముఁ గొనగ యాభారము తానే వహించెను. ఇతరులకు ధర్మోపన్యాసములు చేసి తాము దూరమున నుండునట్టి యీనాటి


సంఘసంస్కారులు కొందరివలె గాక యాపండితుఁడు తనపూనిన పనియందు నిజమయిన యభిమానము గలవాఁడగుటచే దనకుమారున కొక వితంతుబాలికను వివాహముచేసి చెప్పెడు మాటలకును జేసెడు చేతలకును వైరుధ్యము లేదని జగంబునకు వెల్లడిచేసెను. ఈ తెఱంగున పునఃపరిణయంబునఁ గృతకృత్యుఁడై యంతతోఁ దనివి నొందక విద్యాసాగరుఁడు కులీనపద్ధతి యను దురాచారముపై ధ్వజమెత్తి దానిని నిర్మూలించుటకు, బాటుపడెను. ఆదేశమున నగ్ర గణ్యులు కులీన బ్రాహ్మణు లగుటచే వారిలోనొక్కొకఁడు నలువది యాబది యాడువాండ్రను బెండ్లియాడి యేభార్యతండ్రి యెక్కుడు కట్నములు కానుకలు నిచ్చునో యాభార్య నాదరించుచు తక్కిన వారల నిరాకరించుచు పడఁతులను బలువెతలపాలు సేయుచుండును. విద్యాసాగరుఁడు నోరులేని యంగనల పక్షముబూని యనేక సభలు చేసి కొట్టకొన కా దురాచారము నిర్మూలింప నొకచట్టము నిర్మింపడని దొరతనము వారికి వేనవేలు జనులచేత వ్రాళ్ళు చేయించి మహజర్ల నంపించెను. కాని వితంతువివాహ విషయమునందువలె నతడీఁ కార్యమందు సఫలమనోరథుఁడు కాడయ్యెను. హిందువులు వేదశాస్త్రములు తమకుం బ్రమాణములని వాదములు సలుపుటచే స్త్రీ పునర్వివాహాదికార్యము లకార్యములుగావని యా గ్రంథములయందుఁ బ్రమాణవచనములు జూపినచో నంద ఱొప్పుకొందురని విద్యాసాగరుఁడు కొంతకాలము నమ్మియుండెను. కాని శాస్త్రప్రమాణములు జూపిన వెనుక సయితము హిందువులు పునర్వివాహాదుల నిరాకరించి నప్పుడు నిజముగా హిందువులకు వేదశాస్త్రములయందు నమ్మకము లేదని యాతఁ డిటీవల నిశ్చయించుకొనెను. బాలికలకుఁ గడుచిన్న తనమందే వివాహములు సేయుట దురాచారమని యాతని యభిప్రాయము. నమ్మినట్టు నడచుకొనునట్టి యంతఃకరణశుద్ధుఁ డగు


టచే విద్యాసాగరుఁడు తనకూఁతులకు వ్యక్తిరాకమునుపు వివాహములు సేయఁడయ్యె.

విద్యాసాగరుఁడు దయాసాగరుఁడు. ఆర్తజనుల కాపద్బాంధవుఁడు; నిరుపేదలకు నిక్షేపము; మెరమెచ్చుల దాతగాక యాతఁడు పేదలకొరకు ననదలకొరకు గతిలేనివారికొరకు వగచి మనఃపూర్వకముగ ననేక దానములు చేసెను. మధుసూధన దత్తను బంగాళి కవీశ్వరుఁ డొకఁ డప్పులపాలయి ఋణములు దీర్చ లేక చెఱసాలకుఁ బోవుటకు సిద్ధముగ నున్నపుఁడు విద్యాసాగరుఁడు ఋణప్రదాతల కాధన మిచ్చి వాని విడిపించెను. స్థితి చెడియున్న మిత్రుల కుటుంబములకు బంధువుల కుటుంబములకు ధనసహాయ్యముచేసి వారిగౌరవము చెడకుండునట్టు లేర్పాటులు చేసెను. స్వగ్రామమున బీద బాలురు విద్య నేర్చుకొనుటకై యొకధర్మపాఠశాలను దనతల్లిపేర స్థాపించెను. తనయూరికిఁ బోవునపుడెల్ల నైదువందల రూపాయలు విలువగల బట్టలుకొని తీసుకొనిపోయి యచ్చట నిరుపేదల కుచితముగఁ బంచి పెట్టుచుండును. స్వగ్రామమున జనుల సౌఖ్యమునకయి ధర్మవైద్యశాల నొకదానిని స్థాపించి దానికగు వ్యయమంతయుఁ దానేయిచ్చి నిలిపెను. 'ఇండియన్ అస్సోసియేష' నను సభవారు కట్టించిన మందిరమునకు వేయిరూపాయిలు దానమిచ్చెను. హిందూకుటుంబ భరణనిధి (Hindu family annuity fund) యను పేర తక్కువ జీతముగల వారిలాభము నిమిత్త మొకసంఘము వీని సహాయమువలననే బయల వెడలెను. అది వంగ దేశమునందలి సంఘము లన్నిటిలో ముఖ్యమయినదని చెప్పవచ్చును. 1863 వ సంవత్సరమున బంగాళమందు దారుణమగు కాటకము సంభవింప విద్యాసాగరుఁడు దొరతనము వారిని బురికొల్పి కఱవుచేఁ బీడింపఁబడువారికిఁ బనులు గల్పింపఁ జేసియు తాను స్వయముగ నన్న సత్రముల వేయించియు దరిద్రుల ననేకుల రక్షించెను. 1869 వ సంవత్సరమున బర్డ్వాను


పట్టణములో మన్నెపుజ్వరములు బయలుదేర జనులు తగిన వైద్య సహాయము లేక వందలకొలఁది మృతినొందిరి. అప్పు డీశ్వరచంద్రుఁడు కావలసిన మందులుకొని యక్కడకుం గొంపోయి యచ్చటి వారి కుచితముగఁ బంచిపెట్టి సాయము చేసెను.

విద్యాసాగరుఁడు పరుల ధనము చిల్ల పెంకువలె జూచునంతటి సత్శీలుఁడు. ఒకమారతఁడు తనధనమంతయు లెక్కజూచుకొనుచుండ లెక్కలంబట్టి తనయొద్ద నుండఁదగిన సొమ్ముకంటె నెక్కువ గానఁ బడియె. అదిచూచి యీశ్వరచంద్రుడు మున్నుతాను పాఠశాలా పరీక్షాధికారిగా నున్న పుడు దొరతనమువారిసొమ్ము కొంతపొరబాటున దనసొమ్ములోఁ బడియుండునని యనుమానించి 'ఎకౌంటెంటు జనరల్‌' గారికి వ్రాసి యాధనము గ్రహింపుమని ప్రార్థించెను. ఆయన యాసొమ్ము దొరతనమువారికి రావలసిన పని లేదని నొక్కి చెప్పినను వినక విద్యాసాగరుఁ డామిక్కిలిసొమ్ము దొరతనమువారి కిచ్చి తనయంతరాత్మను సందేహమునుండి విముక్తిఁజేసెను. ఆహాహా ఇట్టిపరిశుద్ధ చరిత్రమును ఋజుమార్గవర్తనమును గలవానిని వ్రేలు మడచి చూపుట యెంతకష్టమో మీరే యెఱుంగుదురు.

"మిస్ మేరీకార్పెంటరను" దొరసాని కలకత్తానగరమునకు వచ్చి దేశమునందలి బాలికాపాఠశాలలను గొన్నింటిని జూడవలయునని కోరి వానింజూపుటకు విద్యాసాగరునిం దనవెంటఁ బెట్టుకొని పోయెను. అతఁ డామె కాయాస్థానమునములం జూపి మరలివచ్చుచుండ మార్గమధ్యమున దైవవశమున బండి బోల్తపడ విద్యాసాగరుఁడు దెబ్బలచే స్మృతిదప్పి నేలంబడియె. తగుచికిత్సలు చేసిన పిదప కొంత కాలమునకతఁడు మరల బూటుకొనియెకాని తొల్లింటి యారోగ్యము దేహదార్ఢ్యము వెండియు రావయ్యె. ఇట్లు దుర్బల శరీరముతోడనే తరువాత నిరువదియైదు సంవత్సరములు గడపెను. సొంతాలు పరగణాలోనున్న కార్మతారుగ్రామమును దనకు నివాసస్థానముగఁ జేసికొని


యవసానకాల మచ్చట గడప నిశ్చయించుకొని యతఁ డచ్చటికి బోయియుండెను. 1890 వ సంవత్సరమున డిశంబరు నెలలో తన దేహస్థితిబొత్తిగ చెడిపోవుటచేఁ గొంతకాలము చంద్రనగరమునకున బోయియుండి యచ్చట స్వస్థతగానక చిట్టచివరకుఁ గలకత్తానగరము జేరి యంతకంతకు క్షీణించి 1891 వ సంవత్సరము జూలై 29 వ తారీఖున విద్యాసాగరుండు జీవయాత్ర ముగించి లోకాంతరగతుఁ డయ్యెను.

1877 వ సంవత్సరము జనవరి యొకటవ తారీఖున విక్టోరియా రాణి హిందూదేశ చక్రవర్తినీ మహాబిరుదము ధరించినప్పుడు కలకత్తాలో దొరతనమువారు విద్యాసాగరునకు నొక గౌరవ పత్రికను దయచేసిరి. 1890 వ సంవత్సరమున జనవరి నెలలో జరిగిన దర్బారులో దొరతనమువా రతనికి సి. ఐ. ఇ. బిరుదము నిచ్చిరి. ఈ మహాత్ముఁడు మహాధనవంతుఁడు, విద్యావంతుఁడు, కీర్తివంతుఁడునయ్యు వేష భాషలలో సామాన్యులవలెనుండి నిగర్వ చూడామణియై యుండెను. నిజమయిన దేశాభిమానమును బరోపకారబుద్ధిని ధర్మ కార్య శూరత్వమును వీనివద్దనుండియే నేర్చుకొనవలయును. విద్యాసాగరుఁడు కృపారసంపూర్ణుఁడై గుణరత్న నిలయుఁడై గాంభీర్యనిధియై సర్వ సంపన్నుఁడై భంగసంగతుఁడుగాక మరియాద నతిక్రమింపక సాగర శబ్దము తనయందు సార్థకమగునట్టు నడచిన లోకోత్తర చరిత్రుడు. క్రింది యుద్యోగస్థులు స్వగౌరవమును చంపుకొని తమ యధికారు లేకూఁతలు కూయుమన్న నవికూయుచు నేవ్రాతలు వ్రాయమన్న నవి వ్రాయుచు నేచేతలు చేయమన్న నవి చేయుచుఁ బ్రజలను వేధించు నీకాలములో నెల కైదువందల రూపాయలు జీతము గలిగి అధికారము గలిగి గౌరవమును దెచ్చు నుద్యోగమును దృణప్రాయముగ నెంచి వదలుకొన్న స్వతంత్రుఁ డీవిద్యాసాగరుఁడే. ప్రజల పొగడ్తలకు పొంగక దూషణలకు దుఃఖపడక బహి


ష్కారమునకు భయపడక కష్టములను గణనసేయక తనకు ధర్మకార్యమని తోచిన దానినివిడువక కొనసాగించి "పరోపకారార్థ మిదం శరీర" మనుమాట సార్ధకముచేసిన మహాత్ము డీశ్వర చంద్రుడే. మెత్తని మనసుగలవాడయ్యు దృఢచిత్తుడు. పరమశాంతుఁడయ్యు దుష్టులకు భయంకరుఁడు; నమ్మిన ట్లాచరించుటయందును మనసులో నున్నమాట నిర్భయముగ, బలుకుటయందును పరులసౌఖ్యమునకై స్వసౌఖ్యమును మానుకొని కష్టపడుటయందును నతని కతండె సాటి యనవచ్చును. అతని యౌదార్యము నతని వినయము నతని సౌజన్యము నతని శాంతము వాని విద్యకు వన్నె వెట్టినవి. దేశమున కీతఁ డొనర్చిన మహోపకారమునకు దేశస్థులలో గొందఱు కృతజ్ఞులై వాని గుణగణంబులఁ గొనియాడుచు నెన్నియోపాటలు పద్యములు రచించిరి. అవి యిప్పటికిని బంగాళాదేశమున మారుమూలల సయితము పాడఁబడుచుండును.


మహర్షి దేవేంద్రనాథ టాగూరు


టాగూరనుమాట ఠాగూరను పదమునుండి వచ్చెను. ఈశబ్దమునకు జమీందారుఁడని యర్థము. కాఁబట్టి మహార్షి దేవేంద్రనాథ టాగూరు మిక్కిలి గౌరవముగల జమీందారుకుటుంబములోనివాఁడని మనము తెలిసికొనవచ్చును. ఈటాగూరుల సంస్థానము బంగాళాదేశములో జస్సూరుమండలమున నున్నది. దేవేంద్రనాథుని పూర్వులలో నొకఁడగు పంచాననటాగూరు స్వస్థలమును విడిచి కలకత్తానగరమునకుఁ గాపురము వచ్చెను. వానికొడుకు జయరామటాగూరు దొరతనమువారి యొద్ద గొప్పయుద్యోగముఁ జేసి సాధుర్యఘట్టమున నొక సౌధముఁగట్టి సుప్రసిద్ధుఁడయ్యెను. అతని మునిమనుమఁడగు ద్వారక