మహాపురుషుల జీవితచరిత్రములు (ప్రథమ సంపుటము)/పెరికిలీసు

పెరికిలీసు

'పెరికిలీసు'యొక్క తల్లిదండ్రుల వంశములవారు 'ఆథెన్సు' పట్టణములో ఘనతకెక్కిరి. ఇతని తండ్రి మహాశూరుఁడు. మైకేలుయొద్ద జరిగిన యుద్ధములో నితఁడు ప్రసిద్ధికెక్కెను. ఒక రోజున సింహపు పిల్లను బ్రసవమైతి నని యతని తల్లి కలఁగనెను. కొన్ని రోజులకు పెరికిలీసు భూపతనమయ్యెను. అతఁడు శరీర సౌష్ఠవము కలవాఁడు. అతని శిరస్సుమాత్రము కొంచెము పొడవుగ నుండెను.

అతనికి సంగీతములోఁ బ్రవేశముగలదు. ప్రకృతిశాస్త్రములోను తత్వములోను నతఁడు వ్యవసాయముఁ జేసెను. తర్క శాస్త్రము నతఁ ఢభ్యసించెను. వాగ్వాదియని యతఁడు గొంత పేరొందెను. 'అనాక్షారుఁ'డను వానివద్ద నీ విద్య నతఁడు నేర్చుకొనెను. గురుశిక్షను బొంది, మృదుమధురమైన రచన గలిగినవాఁడగుట మహత్కార్యములను జేయుట కతని బుద్ది గమనించెను గాని స్వల్ప విషయములలో నది ప్రసరించ లేదు. ఎప్పుడు నతఁడు మౌనముద్రను ధరించి యుండెను; పక పకమని వెఱ్ఱి నవ్వులు నవ్వువాఁడుగాఁడు; మందముగ మాటలాడును; ప్రసన్నవదనుఁ డైనను, ముఖమును చూచిన దీర్ఘా లోచన పరుఁడని తోఁచును; గాంభీర్యము కలవాఁడు; డాంబికముగ దుస్తులను ధరించువాఁడుగాఁడు; అందఱతో మర్యాదగ మాటలాడను. మాటలలో కాపట్యము లేదు. అందుచేతఁ బ్రజ లతనినిఁ బ్రేమించిరి.

ఒక రోజువ, తుంటరి యొకఁ డతనిని ముఖశాలలో దూషించుచుండెను. అతఁడు దానిని లక్ష్యము చేయలేదు. ప్రల్లదములు మాను మని వాని కతఁ డుత్తరువు చేయలేదు. సాయం సమయమున నతఁడు స్వగృహమునకు వచ్చుచున్నపుడు, వాఁడు దారిలో నతనిని నోటికి తోచినటుల మాటలాడుచున్నను వానిని వారింపలేదు. స్వగృహముచేరి, వానియింటిలో వానిని దిగవిడిచి రమ్మనుమని తన పరిచారకునితో నతఁడు చెప్పిపంపెను. ఈ సహనము గురూపడేశమువలన కలిగినదె. ఇదియెకాదు. కారణములు తెలిసికొనలేక, ప్రకృతివిషయములను జూచి భయపడు ప్రాకృత జనులను బోలక, వాని యాదార్థ్యము నతఁ డా కాలమునకు తగినటుల గ్రహించెను.

చిన్నతనమునుండియు నతఁడు ప్రజలయెడ నయముగ భయముగ మెలఁగుచుండెను. 'తెమిస్టాకలీసు' మొదలగు రాజకార్యధురంధరులు మృతినొందినపైని, అతఁడు రాజ్య సూత్రములను ధరించెను. ప్రజారాజ్యము గనుక నతఁ డధనికుల ప్రాపకమును విశేషముగఁ గోరినను ధనికుల నతఁడు నిర్ల క్ష్యము చేయలేదు. సభామంటపమునకుఁ బోవునపుడును మొగసాలకు వెళ్లునప్పుడును నతఁడు రాజమార్గములలోఁ గనఁబడును గాని తదితరసమయములలో నతని దర్శన మగుట దుర్లభము. అతఁ డందఱతోను ముక్తసరిగ మెలఁగును. అతి స్నేహము లేదు; వైరములేదు. చనువుగనుండిన, నధికారముయొక్క మహత్తు చెడునని యతని యభిప్రాయము. ఎవరు పిలిచినను విందుల కతఁడు వెళ్లుటలేదు. అధికారములో నున్నందున వారు తనను విందులకుఁ బిలిచి, ప్రసన్నునిగ చేయఁదలఁచెదరని యతఁ డూహించెను; వెళ్లిన పైని, మనస్సు నిర్మలముగ నుండక వారు చెప్పిన మాటలచేత కలుషమై, ప్రజలకు న్యాయము కలుగ దని యోచించి విందులకు వెళ్లుట మానుకొనెను. న్యాయాధికారు లెప్పుడు సపక్ష పరపక్ష విచక్షణ లేక నిష్పక్షపాతముగ న్యాయము విచారించిన, బ్రజల కనురాగము కలుగునని యాలోచించి యతఁ డా ప్రకారము నడిచెను,

తన విశిష్టభావములను మాతృభాషలో వర్ణించి, మృదుమధుర శైలిలో తన యుచ్చస్థితికి తగినటుల మాటలాడుట కతఁడు సమకట్టెను. ఇందు కతని గురూపదేశములు సహాయమయ్యెను. సహజముగ నున్న కల్పనశక్తితో ప్రకృతితత్వశాస్త్రములలో నేర్చిన సంగతులను గలిపి, వక్తలలో నతఁడు శ్రేష్ఠుఁ డయ్యెను, సభలోఁ బ్రసంగించుటకుఁ బూర్వము, శబ్దార్థ దోషములు రాకుండునటుల నతఁడు దేవతలకుఁ బ్రార్థనచేసి తదుపరి మాటలాడుచుండెను.

అతఁడు వ్యవహారములను యుక్తముగ నడిపెను, నీతి మార్గమును తప్పక న్యాయము తీర్చుచుండెను. నాటకముల కని పౌరుష క్రీడలకని మహోత్సవముల కని ప్రజల ధనము వ్యయముకాకుండ రాజ్యాదాయములోని సొమ్ము వ్యయపఱచి ప్రజల నతఁడు సంతోషపెట్టెను. రాజ్యవ్యయము క్రింద లెక్కవ్రాసి, ప్రతిసంవత్సర మరువది నావలను సిద్ధపఱచి, వానిమీఁద నావికాయాత్ర చేయుటకు నెనిమిది నెలలు ప్రజలను బంపుచుండెను. మఱికొందఱి నతఁడు నూతన సీమలలోఁ గాపురముఁ జేయుటకుఁ బ్రయాణముఁ జేసెను. ఇటుల నూతన సీమలకుఁ బంపివేయుటచేత, దుర్మార్గులచేత విడువఁబడి నగరము స్వాస్థ్యముఁ బొందెను. నూతనసీమలలోనివారు విదేశీయులకు భయము కలిగించి, స్వదేశముయొక్క మూలబలమును బ్రకటనఁ జేయుచు, దానికి దూరరక్షకులుగ నుండిరి.

ఇంతకంటె గొప్పకార్యము లతఁడు చేసెను. ఆథెన్సు పట్టణములోని పెద్ద దేవాలయములు, మంటపములు, చిత్రవస్తు ప్రదర్శనశాలలు మొదలగు భవనముల నతఁడు గట్టించెను. దేశ దేశములనుండి పనివాండ్రా పట్టణములో వచ్చి చేరిరి. చిత్రకారులు, తక్షకులు, లేపకారులు, రజ్జుకారులు మొదలగు పనివారు వచ్చిరి. ప్రజల విహారాదుల కొఱ కారామముల నతఁడు వేయించెను. నాట్యశాలలు, గరడీలు గట్టఁబడెను. సరోవరములు ద్రవ్వఁబడెను. పట్టణమంతయు మహావైభవముతోఁ గూడి 'గ్రీసుదేశమునకు నయన'మను ప్రఖ్యాతిని బొందెను. రాజ్యన్యయముక్రింద లెక్క వేసి ఇన్ని గట్టించుటచేతఁ గొంద ఱతనిని దూషించిరి. అప్పు డతఁడు సభలో లేచి, "ప్రజల ధనము వ్యయము చేసి వీనిని నేను కట్టించితినని మీకు తోఁచినపక్షమున వానికైన వ్యయమును నేను భరించి వానిమీఁద నా పేరు వ్రాయించెద"నని చెప్పెను. అతని యౌదార్యమునకుఁ బ్రజలు సంతసించి, “తమ యిష్టానుసారము మా ధనము తమరు వ్యయము చేయవచ్చును; మీరు మంచిపనులు చేయించితి"రని ప్రతివచన మిచ్చిరి. అతనిని దూషించిన వారిలోఁ బ్రధానుఁడైన వానిని వారు దేశోచ్చాటనముఁ జేసిరి.

స్కంధత్రయము తెలిసి, రోగిని వైద్యుఁ డెటులఁ జూచునో యావిధమున త్రిశక్తులు కలిగిన 'పెరికిలీసు' ప్రజలను బరిపాలించెను. వారిని నడిపించుశక్తి యతఁడు బాగుగ గుఱ్తెఱిఁగి యుండెను. యంత్రకారుని చేతిలో యంత్రములు తిరుగునటుల, ప్రజ లతనియెడఁ బ్రవర్తించిరి.

ఈకాలములో స్పార్టనులకు ఆధీనియనులకు యుద్ధ మారంభమై సుమారు పది పదునేను సంవత్సరములవఱకు ౙరిగెను. అథీనియనులయొక్కయు వారి రాజ్యముయొక్కయు మహోన్నతపదవిని జూచి వారి నా పదవిలోనుండి దిగఁద్రోయుటకు వారి శత్రువు లీ యుద్ధము నారంభించిరి. పెరికిలీసు పూర్ణశక్తితో నీ యుద్ధమును జరిపెను. కొందఱి కతఁ డిష్టుఁ డయ్యెను. స్వదేశాభిమానముచేత, శత్రువులతో నతఁడుఁ బోరాడెను. రెండు కక్షలవారు సమరసన్నాహముఁ జేసిరి. క్రీ. పూ, సం: 431 రములో నీ యుద్ద మారంభమయ్యెను.

ఒక సంవత్సరము యుద్ధము జరిగెను. జయాపజయము లెవరికిని నిర్ణయము కాలేదు. రెండవ సంవత్సరమున, నగరములో మహామారి సంకటము ప్రవేశించెను. వేలకొలఁది జనులు రణములో మడిసిరి. హతశేషులు మహామారినోటిలోఁ బడిరి, నగర మల్లకల్లోలముగ నుండెను. ఎక్కడఁ జూచిన హాహాకారముతప్ప మఱియొకటి లేదు. ప్రజలందఱు పెరికిలీసును దూషించిరి. సేనాధిపత్యము నతఁడే వహించియుండెను. యుద్ధముమాత్రము వారు మానలేదు. మహామారి సంకట మతనికి వచ్చి క్రీ. పూ. సం|| 421 రమున నతఁడు కాలధర్మమునొందెను. అవసానకాలమున నతనియొద్దనున్న వా రతని మహత్కార్యములను జెప్పుకొనుచుండిరి. ఆ మ టలను విని, “అదృష్టము చేత వానిని జేయఁగలిగితిని. అందులో విశేషములేదు. నే నెవరి కొంపతీసితి నని యెవరు చెప్పలేదు” అని పెరికిలీసు మందముగఁ బలికి యూరకొనెను.

ఈ యుద్ధమునకుఁ గారణములు తెలియవు గాని, పెరికి లీసు దానికిఁ గారకుఁడని చెప్పుదురు. ఈ నిందతప్ప మఱియొక టతనికి లేదు. ఇంతకాల మవిచ్ఛిన్నముగఁ జంచలబుద్ధిగల 'నథీనియనుల' నతఁడు పరిపాలించుటచేత నతనికి గుణాధిక్యత కలిగెను. ప్రజా రాజ్యముగ నున్న పట్టణమును మహారాజ్యాధి పత్యములోని నగరముగఁ జేయవలెనని యతఁడు యత్నించెను గాని వ్యవహారలోపములవలననో లేక మఱి యే కారణములచేతనో నది సాగలేదు. ఆది లేకపోయినను, నగరవాసు లందఱు విద్యల నభ్యసించి పట్టణమునకుఁ గీర్తి ప్రతిష్ఠలను దెచ్చిరి. సాహిత్యనాటకాలంకారశాస్త్రములు పరిఢవిల్లెను. వక్తృత్వమును వా రభ్యసించిరి. కవులకుఁ గొదువలేదు. గాయకులు మన్ననలఁ బడసిరి. 'పెరికిలిసు రాజ్య'మని యతని ప్రభుత్వకాలము పేరొందెను.