మహాపురుషుల జీవితచరిత్రములు (ప్రథమ సంపుటము)/కోరియలేసస్సు

కోరియలేనస్సు

రోములోని కుటుంబములలో 'మార్సి' కుటుంబమువారు మహా కులీనులు. కోరియోలేనస్సు ఈ కుటుంబమువాఁడు. చిన్ననాఁడు తండ్రి మరణము నొందినందున నతఁడు తల్లి సంరక్షణలో నుండెను. తండ్రి మరణముచేతఁ గొన్ని నష్టములు కలిగినను, సజ్జనుఁడై ప్రతిష్ఠను సంపాదించుటకుఁ బురుషునకు వీలగును. దుర్జనులు కొందఱు దానిని కారణముగ నెన్నుదురు, సాగులేని సారవంతమైన క్షేత్రములోగాబు పెరిఁగిన విధమున శిక్షలేని మహా కులీనుల హృదయములలో దుర్గుణములు బయలువెడలు నను నీతివాక్యమున కతఁడు తార్కాణముగ నుండెను. అతఁడు మనోధైర్యమును నిశ్చల బుద్దియుఁ గలిగి ఘనకార్యములను జేసి, ఘనత వహించెను. అతఁ డింద్రియవ్యాపారములకు లోఁబడి, కలహశీలుఁడై మౌర్ఖ్యముగ సంభాషించుటచేత నతనిని పరు లసహ్యించిరి. నిశ్చలబుద్దితో సుఖదుఃఖముల ననుభవించిన న్యాయాన్యాయ విచక్షణుండును, నబ్ధిగంభీరుఁడును మితాహారుఁడును అని యతఁడు. స్తోత్రము నందినను, ప్రజారాజ్యములోని సభలలో నతఁడు నాటోపముగ మాటలాడి దురాచారముగ నడ చినందునఁ బరు లతని నిందించిరి. లోకజ్ఞానమువలన మనుజులకు సుశీలత గలుగును, సమవర్తనము వర్తించును. ఆ కాలములో రోమనులు క్షాత్రధర్మమును మన్నించుటయేగాక, ధర్మమన క్షాత్ర ధర్మమే యని యభిప్రాయపడియుండిరి.

మొదటినుండియు 'కోరియలేనస్సు' యుద్ధమునందు సంచరించెను. చిన్నతనములో నతఁ డందులకుఁ దగిన యా యుధముల నెత్తి దించుచుండెను. శరీరముఁగూడ సాము చేయుటచేత సళాకువలె సాగుచుండెను. అన్నివిధములైన గరిడీవిద్యలలో నతఁ డారి తేరెను. కత్తిసాము, మల్లయుధ్ధము, ముష్టియుద్ధములలో నతఁడు పరిపాటుపడెను. అతఁడు మల్లయుద్ధవిశారదుఁడు. అందులో నతనిని మించిన వారులేరు. బరువుగల మనుష్యుఁ డగుటచే నతని నెవరును నెదిరింపలేకపోయిరి. అతఁడు శీఘ్రకాలములో మహా వీరుఁడను పేరుఁ బొందెను,

స్వల్పబుద్ధి కలవారికి శ్రీఘ్రముగఁ గీర్తివచ్చినయెడల వారు దానితో సంతుష్టి నొందుదురు. అంతటితో వారిపని సరి. ఉదారబుద్ధి కలవారికిఁ గీర్తివచ్చినయెడల వా రంతటితో సంతృప్తిఁ జెందక చేసినవానిని చేయఁబూనినమహత్కార్యముల కభిజ్ఞానముగ నుంచుకొని ముందుకు నడచెదరు. కోరియలేనస్సు పై చెప్పఁబడిన రెండవ పక్షములోనివాఁడు. ఆ కాలమున రోమను లనేక యుద్ధములలో మెలంగు చున్నందున, ప్రతిదానిలో నతఁడు శౌర్యమును గనపఱచి బహూకరింపఁ బడుచుండెను. ఒకదానికంటె నొకటి యధిక మయ్యెను. పరులు కీర్తిని సంపాదించుటకు ధైర్యమును జూపిన, తల్లికి సంతోషముఁ గలుగఁజేయుట కతఁడు శౌర్యముఁ జూపెను. ఆమె యాజ్ఞానుసార మతఁడు పెండ్లియాడి భార్యా పుత్రాదులతో నామె యింటనే యుండెను. .

ఈ సమయములో 'సెనేటు' సభవారికిని . బ్రజలకును నంతః కలహములు పుట్టెను. ఋణదాతలు ఋణగ్రస్తులను బాధించుచుండిరి. అందుచేత ఋణగ్రస్తులు యుద్దములో సహాయము చేయ మనిరి. వారి బాధలను నివృత్తి చేసెదమని సభవారు చెప్పి, వారిని యుద్ధమునకుఁ దీసికొనిపోయి, తదుపరి వారి మాటప్రకారము సహాయముఁ జేయనందున వా రొక్కుమ్మడి రోముపట్టణము వదలి పైదేశములకుఁ బోవ యత్నించిరి. వారిని శాంతముఁ జేయవలసినదని కొందఱును, కూడదని కోరియలేనస్సు మొదలగువారును సభవారికి సలహా యిచ్చిరి. సభవా రేమిచేయుటకుఁ దోఁచక 'అగ్రిప్పా' యనువానిని సంధిచేయుటకు ప్రజలయొద్దకుఁ బంపిరి. 'అగ్రిప్పా' వారికి ప్రశాంతివచనములఁ జెప్పి, "పూర్వకాలమున నవయవములన్నియు జీర్ణకోశముపై తిరుగఁబడెను. అది సోమరిగ నుండుటయు, పనిపాటలు తాము చేయుటయుఁజూచి కినిసి యవి తమతమపనుల మానివేసెను. కొంతకాలమున కవియు జీర్ణిం చెను. అప్పుడు జీర్ణకోశము వానిఁ జూచి "మీరు మందబుద్ధిఁగలవారు. పదార్థములను మీరు తెచ్చి నాయెదుటఁ బెట్టిన నేను వానిని పక్వముచేసి, రక్తముగ మార్చి, దానిని నాళముల ద్వారా మీకుఁ బంపుచుందును. అందుచేత మీరు బలము కలిగి వర్తించుచున్నారు. నేను సోమరిగ నుండలేదని మందిలించినపైని యవయవములన్నియు తమ తమ పనులను నిర్వర్తించుచుండెను. మీరుఁగూడ నా యవయవములవలె మందబుద్ధిఁ గలవా"రని ముచ్చటించి వారి కోపమును మాన్చెను. ప్రజలు వారి వారి పనుల ననుసరించి వెళ్లిరి; రెండవ పర్యాయముఁగూడ వారు యుద్ధమునకు సహాయులై వెళ్లిరి. ఇందులో వారు శత్రువులకు వీపుచూపి పరుగిడుచున్నప్పుడు, వారిని సమావేశముచేసి మఱలించి యుద్ధమునకు దీసికొని పోయి 'కోరియలేనస్సు' జయమును బొందెను. ఇటుల 'కోరియోలీ' యను పట్టణమును పట్టుకొనినందున నతనికి 'కోరియలేనస్స'ను పౌరుషనామము కలిగెను. విజయమును బొంది వారు రాజు ధానిం జేరి మఱుచటిదినమున 'కోరియలేనస్సు'ను వేనోళ్లఁ గొనియాడి మన్నించి బహువిధముల సత్కరించిరి. కొల్ల పెట్టి తెచ్చిన ద్రవ్యములో నొక దశాంశమును నొక శ్వేతాశ్వమును నతనికి బహుమానముగ వారిచ్చిరి. అప్పు డతఁడు సభలో లేచి 'నా విజ్ఞాపన యొకటి యున్నది దానిని తమరు మన్నించవలెను. శత్రుపక్షములోనివాఁ డొకఁడు నా కతిథిసత్కారము చేసినందున వానిని విడుదల చేయవలసిన'దని సభవారిని ప్రార్థించెను. వా రందుకు సమ్మతించి యటులచేసిరి. అప్పుడు జయశబ్దములు మ్రోగెను. ప్రజలు సంతసించిరి. ఈర్ష్యాళురు సహిత మతనిని గౌరవించిరి.

ఇంతలో క్షామము వచ్చెను. ప్రజలకు తినుటకు కూడు లేకుండెను. పదార్థములను కొనుటకు ధనము నిండుకొనెను. అవికూడ సమృద్ధిగ లేకుండెను. దీనికిఁ గారణము ధనికులను ప్రాకృతజననాయకులు వదలివేయుటయే. ఈలోపున 'వెలిట్రి' పట్టణవాసులు పరాభవము నొందినటుల రాయబారులు వచ్చి సభవారితోఁ జెప్పి యా పట్టణము నిర్మానుష్యముగ నుండుటచేతఁ గొందఱి ప్రజల నక్కడకుఁ బంపవలసిన దని వారు వేఁడిరి. ఆప్రకారము కొందఱు సామంతులును సంసారులును బీదలును నా పట్టణమునకుఁ బోవలసినదని సభవా రుత్తరువు చేసిరి. ఈ ప్రకారముచేసిన దుండగీండ్రచేత విడువఁబడి పట్టణము స్వాస్థ్యముఁ బొందు నని సభవా రభిప్రాయపడిరి. ప్రాకృతజననాయకులు ప్రజలను పురికొలిపి వారి యాజ్ఞోల్లంఘనము చేయుటకు సమకట్టిరిగాని 'కోరియలేనస్సు' వారి తుంటరితనము నణఁగఁగొట్టి వారి నా పట్టణమునకుఁ బంపెను. విషవాయువులు విడిచినపైని శరీరము సుఖమును పొందినట్లు వీరు తరలిపోయినపిదప రోముపట్టణము, హాయిగ నుండెను.

కొంతకాలము గడచినపిదప 'కోరియలేనస్సు' యక్ష దర్శకుని పనికి నిలఁబడెను. ఈ పని మనుజులచేతిలోనిది. వారి యంగీకారముపైని యెవరినైన నియోగించుచుండిరి. పని కావలసినవాఁడు శరీరమును దుస్తులతోఁ గప్పికొనక తాను చేసిన మహత్కార్యములను వారితో చెప్పి యందుకు నిదర్శనముగ వాని శరీరముమీఁది గాయములను వాఁడు చూపింపవలయును. కోరియలేనస్సు ఇటులఁ జేసెను. మొదట ప్రజలితని నా పనిలో నియోగించుటకు సమ్మతించిరి కాని వారి చిత్త మంతలో మాఱి సభవారితో నతఁ డేకమై తమరిని నలుఫునను భయము కలిగి యతని కాయుద్యోగము నిచ్చుటకు వారియ్యకొనలేదు. ఆ పనిలో మఱియొకఁడు నియోగింపఁబడెను. ఇటులఁ బరాభవమును బొంది 'కోరియలేనస్సు' స్వగృహమునకు వెళ్లెను.

అతని యహంకార మతనికి ముప్పుఁదెచ్చెను. వినయ విధేయతలు లేక కార్యములను సాధించువిధ మతఁడు బాగుగ గుఱ్తెఱింగినవాఁడు కాఁడు, ప్రభుశక్తి విశేషముగ నతనికిఁ గలదు. అతని యాటోపమునకు రోసి ప్రజ లతనిమీఁదఁ కొన్ని నింద లారోపించిరి. తా ననింద్యుఁడ నని యతఁడు సభలోఁ బ్రసంగించినను నతని మాటలను వినక 'టార్పియను' పర్వతశిఖరమునుండి క్రింది కతనిని దిగఁద్రోయవలసిన దను శిక్షను సభవారు విధించిరి. ధనికులందఱు నతని పక్షమే. కొండమీది కతనిఁ దీసికొని వెళ్లిరి. కాని అతనిని దిగంద్రో య లేకపోయిరి. ధనికాధనికులకుఁ బోరాట మయ్యెను. అప్పుడు సభవారు మరణదండన మాపుచేసి యతనిని దేశోచ్చాటనము చేసిరి. సభవారందుకు విచారించిరి. ధనికులు సన్నమైరి. అధనికులు ప్రసన్నమైరి. మనోధైర్యము చెడక తల్లికి నమస్కారము చేసి భార్యా పుత్రాదులను పలుకరించి వారిని విడిచి యతఁడు నలుగురు భృత్యులతోఁ గలిసి పరదేశమునకుఁ బోయెను.

తరువాత నతఁడు 'వాల్సియను'లను ప్రజలను పురికొలిపి వారితోఁగూడ దండెత్తి వచ్చి రోమనులను జయించవలె నని ఉద్దేశించెను. ఆ ప్రకార మతఁడు వారి యొద్దకుఁ బోయెను. వారికి రోమనులకుఁ బరమవైరము. వారి నాయకుఁడైన 'టల్లసు', రోమనుల నాయకుఁడు కోరియోలేనస్సుకు, బద్ధద్వేషి. వారి 'కోరియోలి' పట్టణమును ధ్వంసము చేయుటచేత కోరియలేనస్సను పౌరుషనామ మితనికి వచ్చెను. శత్రువుల పట్టణముఁ బ్రవేశించి, 'టల్లసు' గృహమున కితఁడు పోయి లోపలఁ బ్ర వేశించెను. వాని నెవ రాటంక పెట్ట లేకపోయిరి. కావలివారు లోపలకుఁ బరుగెత్తి మహాపురుఁషు డొక్కఁడు వచ్చి సభామండపములో నుండెనని 'టల్లసు'తో మనివిచేసిరి. కోరియ లేనస్సు చేతులతో ముఖము మూసికొని కూర్చునియుండెను. అతనిఁ జూచి 'మీరెవ రండి? ఏమి పనిమీఁద దయ చేసినా' రని టల్లసు' అడిగెను. 'నే నెనరో తమరుపోల్చ లేదా? రోమనులతో కలిసిమీతోపోరాడి, మీ పట్టణమును ధ్వంసముచేసి, కోరియలేనస్సను పౌరుష నామమును బొందినవాఁడను. నీకు ప్రతి వీరుఁడను. ఎవరితో నీవు ,నైరమును సాధించవలె సని కోరితివో యతఁడే నేను. నా దేశస్థులు నన్ను మన్నించక నేను చేసిన మహత్కార్యములకు వారు నన్ను వెడలఁగొట్టిరి. వారిని సాధించవలె నని కోరి నీయొద్దకు వచ్చినాఁడను. శత్రువుల గుట్టు తెలిసినందున నీపక్షమునఁ బోరాడి, పూర్వముకన్న విశేషముగ శౌర్యమును జూపించఁగలను. నా మాటను మన్నించినయెడల యుద్ధసన్నాహము చేయుము. లేనిపక్షమున నన్ను నీ యిష్టాను సారము శిక్షించవచ్చు'నని కోరియలేనస్సు ముఖము మూసికొని ప్రతి వచనమియ్య, అందుకు 'టల్లసు' సమ్మతించి యతనిని కౌఁగిలించుకొనెను. వాల్సియనుల సమావేశము చేసి, వారిని కోరియలేనస్సు పురికొలిపెను. మాటకారియె కాక, పనివాఁడని వా రతనిని శ్లాఘించిరి. వారు రణభేరి వేసిరి. దరువులు ధణధణ మ్రోయఁగ, దళవాయులు వారి దళముల నడిపింప సాగిరి. రోముపురసీమలలో వారు దండువిడిచిరి. రోమనులు: సమరసన్నాహము లేక యున్నందున, భయ కంపితులైరి. కోరియలేనస్సుచేత వాల్సియనులు నడిపింపఁబడి, సమీప పట్టణములను ముట్టడించి వానిని పట్టుకొనిరి. రోమనులు నిశ్చేష్టులై యేమియు తోఁచక యుండిరి.

అప్పుడు రోమనులు సంధిచేయుటకు యత్నించి రాయ బారులను కోరియలేనస్సువద్దకుఁ బంపిరి. అతఁడు సంధికి నొప్పుకొనలేదు. అంతట రోమను లతని తల్లి 'వలుమ్నియా'ను సంధి చేయుటకుఁ బంప, యామె వెళ్లి, “నాయనా, నీవు మమ్ము విడనాడి వెళ్లినది మొదలు మా దురవస్థ చెప్పుటకు వీలులేదు. నీవు రెండు కక్షలవారికి సమాధానము చేయవలెను. లేనిపక్షమున నీ కన్నతల్లిని ముందు సంహరించి రోముపట్టణమును ముట్టడివేయు"మని యతనితోఁ జెప్పెను. అతని దారాపుత్రాదులు పాదాక్రాంతులైరి. వెంటనే నతని మనస్సు కరిగి వాల్సియనులను విడిచి, రోమనుల కమందానందమగునట్లు రోముపట్టణములోఁ బ్రవేశించెను. .

కోరియలేనస్సును దండనాయకుఁడుగ వాల్సియనులు నియమించిరి. 'టల్లసు' మొదలగు శత్రుపక్షమువారు కినిసి యతఁడు చేసిన స్వామిద్రోహమునకు తగిన కారణములను నిరూపించి సేనాధిపత్యమును వదిలివేయవలసిన దని యతనికి వర్తమానముఁ బంపిరి. వాల్సియనులు సభచేయ నతఁ డక్కడకుఁ బోయి, తాను చేసినపనికి సమాధానము చెప్పుచుండ 'టల్లసు' మొదలగువారు లేచి యతనిని కత్తులతో పొడిచి చంపివేసిరి. సెనేటుసభవారు, రోమను లీ వర్తమానము విని పరితోషించలేదు; పరితపించ లేదు.