మహాపురుషుల జీవితచరిత్రములు (ప్రథమ సంపుటము)/ఆరిస్టైడీసు

ఆరిస్టైడీసు

'ఆరిస్టైడీసు' బీదవాఁడని కొందఱు, కాఁడని కొందఱు చెప్పుదురు. అయిన నతఁడు గొంత స్థితిగలవాఁడని చెప్పవచ్చును. 'ఆథెన్సు'పట్టణములోఁ బ్రజారాజ్యమును స్థాపించిన 'క్లీస్తనీసు'తో నతనికి స్నేహముకలదు. స్పార్టనులలో ధర్మశాస్త్రవేత్తయైన 'లైకర్గసు' నతఁడు వినయముతో గారవించుచుండెను.

ఆరిస్టైడీసు సామంతుల పక్షములోనివాఁడు; థెమిస్టాకిలీసు సంసారుల కక్షలోనివాఁడు. అందుచేత వీ రిరువురికి సహజ శత్రుత్వము. విద్యార్థులుగ నుండు కాలము మొదలు వీరు వైరముగలవారు. ఆటపాటలలో నెగాక, వా రాలోచనాంశములలో భేదించిరి. ఆరిస్టైడీసు శాంతుఁడు; సాత్వికుఁడు; దూరదర్శి; హాస్యములోనైన బొంకులులేనివాఁడు; గంభీరుఁడు; స్థిరుఁడు; ధార్మికుఁడు. థెమిస్టాకిలీసు తొందరపాటుకుఁ దోడు చలచిత్తముకలవాఁడు; చురుకు, నేర్పరి, కార్యములలోఁ దెగించువాఁడు. సరసమైనవాఁడు గనుక నె విశేషముగ స్నేహితులను జాగ్రత్తచేసి, తద్వారా ప్రజారంజకుఁడై గౌరవము పొందెను. “వాఁడు వీఁడని యెంచకపోయిన, నీవు 'అథీనియను'లను బరిపాలించి యుందు'వని యొక రతనితోఁ జెప్ప, "పరులకంటె నా స్నేతులకు హెచ్చుమేలు చేయలేక పోయినపక్షమున నా కీ యుద్యోగమువలన లాభమేమి?”యని థెమిస్టాకిలీసు జవాబుచెప్పెను. ఆరిస్టైడీసు మాత్ర మటులగాదు. వారు వీరని విచక్షణ చేయక, న్యాయముప్రకార వ్యవహారములను విమర్శించుచుండెను. స్నేహితులకు కోపము వచ్చు నేమోయని వారి యన్యాయములను న్యాయము లని యతఁడు తీర్పుచెప్పుట లేదు; అయినను, వారి మాటను త్రోసి వేయుట లేదు. వారి మాట లెంతవఱకు గ్రాహ్యములో, యంతవఱకు వానిని విని యతఁడు వారిని సంతోష పెట్టుచుండెను. ముందు వెనుక లాలోచించక, ప్రజలకు మేలుకలుగునని, థెమిస్టాకిలీసు సభలోఁ గొన్ని యంశములను బ్రసంగించు చుండెను. వానిని 'ఆరిస్టైడీసు' ఖండించుట గలదు. వీ రిరువు రొకప్పుడైనను మిత్రభావమున నుండలేదు; వీరికి ఎప్పుడు షష్ఠాష్టకమె; “మమ్ముల నిరువురిని సముద్రములోఁ బడద్రోసినగాని, అథీనియనుల వ్యవహారములు చక్కఁబడ”వని ఆరిస్టైడీను ముచ్చటించెను. రాజ్యతంత్రములను నడిపించు సమయమున నొకప్పుడు జయము, నొకప్పు డపజయము కలుగును. ఈ జయాప జయములలో నతఁడు మనస్సును కుదురుగ నుంచుకొని న్యాయము విచారించెను; బిరుదులు బొందవలెనను యభిలాష లేదు; ధనముఁ గూడఁ బెట్టవలె నను గోరికయు లేదు. బంధువు లని స్నేహితు లని మార్దవము లేక, శత్రువులని కార్పణ్యము లేక, యతఁడునిష్పక్షపాతముగఁ బ్రజలకు న్యాయమునిచ్చుచుండెను. ఒక సమయమున నతఁ డొక నేరస్థుని నేరస్థుఁ డని నిరూపించిన పైని, వాని వాదము వినకయె, కోర్టువారు వానికి మరణదండన విధించిరి. అప్పుడు వాఁడు తనకు శత్రువైనను, వాని వాదము వినవలసిన దని కోర్టువారి నతఁడు వేఁడెను.

అతఁడు కోశాధ్యక్షుఁడుగ నియమింపఁబడెను. చిఠా లను తనిఖీచేసి చూచినపుడు, పూర్వపు కోశాధ్యక్షులు సొమ్ము నపహరించినటు లతనికిఁ దోఁచెను; అటుల తస్కరించిన వారిలో థెమిస్టాకిలీ సొకఁడు. నేరస్థాపనఁ జేసి, విషయమును విచారణలోనికి ఆరిస్టైడీసు తెచ్చెను. ఇతఁడు స్నేహితులు గలవాఁడు గనుక ఆరిస్టైడీసె సొమ్మపహరించె నని సభలో వాదము జేసి, యతనినె ప్రజలు నిందించునటులఁ జేసెను. అందుల కతఁడు సైరించి, తన చేతిక్రింది యుద్యోగస్థులు స్వంతముకు సర్కారుసొమ్మును వాడుకొనుచున్నను, చూచి చూడనటుల నూరకుండెను. అందుకు వా రతనిని వేనోళ్ల శ్లాఘించి, యతఁడె కోశాధ్యక్షుఁడుగ నుండిస బాగుగ నుండు నని ప్రజలతోఁ జెప్పిరి. వీరు సంతసించి, యతని నా యుద్యోగములో నుంచిరి. అప్పుడు “లంచములు పుచ్చుకొని మీ సొమ్మును దినివేయువారిని విచారణలోనికిఁ దెచ్చినపుడు, నే నన్యా యముగ నిందింపఁబడితిని; ఇప్పుడు, వారిని సైరించుటవలన, నేను మంచివాఁడనైతి"నని, యతఁడు ప్రజలతోఁ జెప్పెను. అతనిని వారు స్తోత్రముఁ జేసిరి.

ఈ కాలములోఁ బారసీకచక్రవర్తి 'డరయసు' గ్రీకులపైకి యుద్ధముకు భూమికాసైన్యములను బంపెను. అప్పుడు, మిలిటియాడీసు, ఆరిస్టైడీసు - వీ రిరువురి నథీనియనులు సేనాధిపతులుగ నియమించిరి. వంతుప్రకారము రోజుకొకరు సేనాధిపత్యమును వహించవలసియున్నను, తనవం తారిస్టైడీసుమిలిటియాడీసునకే యిచ్చివేసెను. "సేనాధిపత్యమును నేను బాగుగ వహించలేను. అతఁడు తగిన వాఁడుగనుక చూచుకొను”నని ఆరిస్టైడీసు చెప్పెను. తదనంతరము 'మరాథాను'వద్ద యుద్ధము జరిగెను. అందులోఁ బారసీకు లోడిపోయి, పడవల నెక్కి పరారు లయిరి. వా రాథెన్సుపట్టణమునకుఁ బోవుదు రను భయముచేత, నెనిమిది పటాలములను దీసికొని మిలిటియాడీసుపట్టణమునకుఁ బోయెను. యుద్ధములో దొరికిన ధనమును, శత్రువులను గాపాడుట కారిస్టైడీనుండిపోయెను. ఈ దొరికిన ధనమునకు విలువలేదు. అందులో నొక కాసైన నతఁ డపహరించ లేదు సరేకదా, పరులనైనఁ దీసికొన నియ్యలేదు. అప్పటికిని, గొంద ఱతనికిఁ దెలియకుండ కొంత సొమ్మును దస్కరించుచు వచ్చిరి. ఈ యుద్ధము క్రీ. పూ. 490 సం|| రములో జరిగెను. మరుసటిసంవత్సర మతఁడు 'అర్కను' పేరుగల పెద్ద యుద్యోగములోఁ బ్రవేశించెను. అతఁడు సమవర్తి యని పేరు బొందెను. ధర్మముగ ప్రజలను బరిపాలించెను. పరమేశ్వరుఁడు సకలగుణసంపన్నుఁడు: అమర్త్యత్వము, సమవర్తనము, ప్రభుత్వము కలవాఁడు. వీనిలో మొదటిది మనకు లభింపదు; మిగిలిన రెండును బొందవచ్చును. ప్రభుత్వము దొరికిన, క్రిందుమీదుఁగానక, విఱ్ఱవీగి, లోకకుటుంబములోనివారితో వైరముబొంది, కంటకము పడుదుము. అన్నిటికంటె యెక్కుడైన సమవర్తనమును బొందము. రాజాధిరాజులు సహితము 'సింహబలుఁ'డని, 'దిగ్విజయుఁ'డని, 'నరకాంతకుఁ'డని మొదలగు ప్రభుత్వము, పరాక్రమమును దెలియఁజేయు బిరుదులను బొందగోరెదరు కాని, సమవర్తనమును గలిగియుండవలెసని యభిలషించరు. శాశ్వతమైనదానిని విడిచి, యశాశ్వతమైనదానిని బట్టుకొని పెనుగులాడుచున్నాము. ఆరిస్టైడీసు సమవర్తనము నవలంబించి గీర్తిబొందెను. అది దిగంతములు నిండెను. అందుకుఁదోడు, ప్రజారాజ్యమును బోఁగొట్టి, రాజచిహ్నము లేకున్నను అతఁ డేక రాజ్యాధిపత్యమును వహించినాఁడని యెంచి థెమిస్టాకిలీసు ప్రజలతో మొఱబెట్టెను. అందుపైని వారందఱు కంటగించి, యతనిని దేశోచ్చాటనఁ జేసిరి.

దేశోచ్చాటనమునకు పాత్రులగువారు నేరస్థులనే నిర్ధారణలేదు, శారీర స్నేహధనబలములు గలవాఁ డెవఁడైన ప్రజా రాజ్యమునకు ముప్పుదెచ్చు నని గ్రీకులకుఁ దోఁచినయెడల, వానిని దేశమునుండి వెడలఁగొట్టుచుండిరి. వాఁడు పరదేశములోఁ బదిసంవత్సరము లుండి, తదుపరి స్వదేశమునకు రా వచ్చును. ఈలోపున వాని స్వామ్యము లేవియు పోకుండ గాపాడుట కలదు.

ప్రజలందఱు సమావేశమై, చీట్లు వేసికొని, వానిలో నెవని పేరున హెచ్చుచీట్లు వచ్చిన వానిని పరదేశమునకుఁ బంపుచుండిరి. అప్పుడొకఁ డారిస్టైడీనని తెలియక, యతని వద్దకువచ్చి, చీటిపైని 'ఆరిస్టైడీసు' పేరు వ్రాయమని కోరెను. అందు కతఁ డాశ్చర్యమొంది, “నీ కతఁ డేమైన కీడుచేసెనా" యని వాని నడుగ, "అతఁ డెవఁడో నేనెఱుఁగను. అతనిని సమవర్తి యని పిలిచిన పిలుపులు నా చెవులకు ములుకులవలె నంటుచున్నవి. అందుచేత, అతఁడు దేశమునుండి పోవుట మంచి దని నా యభిప్రాయ”మని వాఁడు బదులు చెప్పెను. అతఁడా ప్రశారము చీటి వ్రాసి వాని కిచ్చివేసెను.

ఇంతలోఁ బారసీకచక్రవర్తి క్షారుఁడు యుద్ధమునకు వచ్చెను. సర్కా రుత్తరువుప్రకారము దేశోచ్చాటనఁ జేయఁబడిన వారందఱు పట్టణమునకు వచ్చిరి. ఆరిస్టైడీసు సహావచ్చెను. అతఁడు, థైమిస్టాకిలీసు కలిసికొని, సఖ్యత జేసికొనిరి. ఒకఁడు దేహబలముచేత, మరియొకఁడు బుద్ధిబలము చేత, 'సలామిసు'వద్ద జరిగిన నౌకాహవములో నథీనియనులకు గ్రీకులకు జయముగలుగునటులఁ జేసిరి.

తదనంతరము, పారసీకులతో పోరాడవలసివచ్చినపు డారిస్టైడీసి డిరువది పటాలములను దీసికొని, స్పార్టనులు మొదలగు గ్రీకులతోఁ బోయి, యుద్ధముజేసెను. ఇదియె 'ప్లెటెయా' యుద్దము. క్రీ. పూ. 488-87 సం|| రములో జరిగెను. ఇందులోఁ బారసీకు లోడిపోయిరి. గ్రీకు లంద ఱతనిని మన్నించిరి.

పారసీకుల దాడికి భయపడి, గ్రీకు లందఱు సమావేశమై, ' దేశసంరక్షణసంఘ'మను పేరున నొక సంఘమును స్థాపించిరి. అందులో, మొదట స్పార్టనులు పెద్దలుగ నుండిరిగాని : వారి గర్వముచేత వారి నందఱు గర్హించి, ఆరిస్టైడీసుయొక్క, సమవర్తనము చేత నతని మూలమున, అథీనియనులను వారు పెద్దలుగాఁ జేసిరి. సంఘమును నిలఁ బెట్టుటకుఁ దగిన సొమ్మును బ్రతివారు నిచ్చుచుండిరి, ఆ యిచ్చుటలో నెచ్చుతగ్గు లుండుటచేత, వారంద ఱారిస్టైడీసును కప్పమును సరి చేయవలసిన దని కోరిరి. అతఁడు న్యాయముగ వారి శక్తికిఁ దగినటుల పన్ను వేసెను. వారందు కంగీకరించి ముదమందిరి. ఎంత గొప్ప పనులను జేసినను, యతఁడు నిరుపేదవాఁడు. ఇటుల సంఘము వారందఱు చెల్లించిన కప్పముసొమ్ము 'డీలాసు' ద్వీపములోఁ బెట్టి, సమయము వచ్చినపు డందఱి సలహాపైని వారు దానిని వాడుకొనుచుండిరి.

వ్యవహారములలో నతఁడు న్యాయముగనుండినను, స్వదేశాభిమానముండుటచేత, గొన్ని పనులలో నధర్మముగ ప్రవర్తింప వలసివచ్చెను. కొన్నిసమయములలో సర్వసమక్షమైన ధర్మములు పక్షము వహించుటచేత నధర్మము లగును. అవి కేవల మధర్మము లని చెప్పలేము. ధర్మ మతిసూక్ష్మము. సంఘమువారి సొమ్ము 'డీలాసు' ద్వీపమునుండి తెచ్చి, 'ఆథెన్సు'పట్టణములో నుంచవలెనని, యథీనియనులు మహాదేశీయుల సభలో ముచ్చటించిరి. అటుల చేయరాదని గ్రీకు లందఱు, చేయవచ్చునని యథీనియనులు; వాదించిరి. అటుల చేసినపక్షమున నథీనియను లా సొమ్ముతో భూ నావికాసైన్యములను బలపఱచి ప్రబలు లగుదురని గ్రీకులు భయపడిరి. అందుచేత వారు కూడదని వాదించిరి. అందఱి సొత్తుగభావింపఁబడినదానిని, యథీనియనులు తమ పట్టణమునకు దీసికొనివచ్చుటకు యత్నించుట యధర్మమైనను, ఆరిస్టైడీసందుల కంగీకరించెను.

విరోధియైన థెమిస్టాకిలీసుని నతఁడు తృణీకరించలేదు; ఇతని సుగుణములనే యెంచెను; పరోక్షమున నితని నెన్నడు నిందించలేదు; ఇతఁడు కష్టములపాలై, దేశోచ్చాటన జేయఁబడి, పరదేశములలోనున్న సమయమున, నితనిని దలఁచు చుండెను. ఆరిస్టైడీసు దరిద్రుఁడైనను, భాగ్యవంతుఁడైన థెమిస్టాకిలీసు నీర్ష్యతోఁ జూచుట లేదు.

ప్రజల చేత మన్ననలు వొంది, పూర్ణాయుర్దాయుఁడై , క్రీ. పూ. 467 సం||రములో ఆరిస్టైడీసు స్వగ్రామములో స్వర్గస్థుఁ డయ్యెను.