మహర్షుల చరిత్రలు (మొదటి భాగము)/దత్తాత్రేయ మహర్షి

మహర్షుల చరిత్రలు

దత్తాత్రేయ మహర్షి

దత్తాత్రేయుని జననము

పూర్వము కౌశికుఁడను బ్రాహ్మణుని పత్ని సూర్యోదయ మైనంతనే తన భర్త మరణించు నని యెఱిఁగి సూర్యోదయము కాఁగూడ దని శాసించెను. ఆ మహాపతివ్రత శాసనమున సూర్యుఁ డుదయింప కుండుటచే లోకములు తల్లడిల్లఁజొచ్చెను. దేవత లత్రిమహర్షి భార్యయగు ననసూయను శరణుజొచ్చిరి. అనసూయ కౌశికపత్ని ననునయించి సూర్యోదయ మగునట్లు చేసి దన ప్రాతివ్రత్య మహిమచే నామెభర్తను బ్రదికించి నవయౌవనుని సుందర గాత్రునిఁ జేసెను. దేవత లామె పాతివ్రత్యమునకు మెచ్చి పుష్పవర్షము కురిపించిరి. దేవదుందుభులు మోయించిరి. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు "తల్లీ ! నీవలన లోకోపద్రవము తప్పినది. మేము సంతుష్టులమైతిమి. ఏదైన వరము కోరుకొని మామాట చెల్లింపు" మని యనసూయను గోరుకొనిరి ఆమె “మీరు మువ్వురును బరమయోగ్యులైన పుత్త్రులై నాకడుపునఁ బుట్టవలయు” నని కోరుకొనెను. బ్రహ్మ విష్ణుమహేశ్వరు లామెకు వరమిచ్చి యంతర్హితులై రి. పిమ్మట నత్రిమహర్షి పుత్త్రకాంక్షియై చేసిన ఘోరతపమునకుఁ ద్రిమూర్తులును మెచ్చి యా వరమునే యొసఁగిరి, అత్రిమహర్షి వీర్యరూపమున విష్ణ్వంశ మనసూయ గర్భమును బ్రవేశించెను. ఆ యంశముచే సనసూయకు జన్మించిన మహాత్ముఁడే దత్తాత్రేయుఁడు,

దత్తాత్రేయుని ప్రవర్తనము

భూమిపై ధర్మక్షయము కలిగి . మ్లేచ్ఛాచారములు హెచ్చి వర్ణ సంకరము కాఁజొచ్చెను. అప్పుడు జాహ్మణ క్షత్త్రియులు యజ్ఞాదికము మాని భ్రష్టులగుచుండిరి. . యోగశాస్త్ర, మడుగంటి క్షీణింపఁగడంగెను. రాక్షసులు ప్రబలులై దేవతలను బాధింపం దొడఁగిరి. ఈ సమయమున దత్తాత్రేయుఁడు జనించి బాల్యము నుండియుఁ బరమయోగియై పెరుఁగఁ జొచ్చెను. ఆతఁడు చిన్న తసమునుండియు నిస్సంగియై కాలము పుచ్చుచుండెను. బాహ్యేంద్రియ నిగ్రహుఁడు నిరంతరాత్మానంద తన్మయుఁడు నగు నాతఁడు తల్లి దండ్రులను సంతోష పెట్టు చుండెను. బాల్యమునుండియు దత్తాత్రేయుఁ డింతటి వాడగుటఁ గన్నులారఁ గాంచిన తోడి మునిభాలు రెల్లపుడు నీతని కడనే యుండుచుండిరి. సంగ రాహిత్యమున కలవడిన దత్తాత్రేయ మహర్షికి వీరి రాకయే పలువిధముల బాధకరముగా నుండెను. అతని స్వేచ్ఛా ప్రవర్తనమునకు వా రడ్డు వచ్చుచుండిరి. ఈ కారణమున నాతఁడు వారి నట్లైనఁ దప్పించుకొన నెంచి యొకనాఁ డొక కొలనులో మునిఁగియుండెను. మునిపుత్త్రులేమైన నాతని విడువ నొల్లక యాతీరభూమినే నిలిచియుండిరి. ఎంతకాలమునకు వారట్లు తన్ను విడువకుండుటఁ జూచి యాతఁడు సంకల్ప మాత్రమున లక్ష్మి నటకుఁ దెచ్చి యామెతోఁ గొలనువీడి బైటకు వచ్చెను. స్త్రీసహితుఁ డైన నాతని నా ఋషిబాలురు విడువక పలువిధములఁ గీర్తించు చుండిరి. అంత నాతఁడు లక్ష్మి సంకితలమునఁ గూర్చుండఁ బెట్టుకొని మద్యపానము చేయుచు నాటలాడుచుఁ బాటలుపాడుచు లక్ష్మితోఁ గామాలాపము లాడ మొదలిడెను. అంత, మునిబాలకు లసహ్యించుకొని యా దత్తాత్రేయుని విడిచి యరిగిరి.

నాఁటినుండియు దత్తాత్రేయుఁ డాంతరంగిక తపోధ్యానపరుఁడై బహిరంగముగా మద్యపానము చేయుచు స్త్రీలోలుఁడై నట్లు నటించుచు నుండఁ దొడఁగెను. మహాయోగులు దక్క. నన్యులాతని నెఱుఁగలేక మూఢాత్ములై మరలిపోఁ జొచ్చిరి. యోగ శ్రీయుతులగువారికి హావ్యసేవనాసవసేవలు సమానమని సామాన్యులు తెలియఁ గలరా? యోగి నెఱుఁగుట యోగికే సాధ్యము కాని యితరులకు సాధ్యము కాదుకదా! [1]

దత్తాత్రేయుఁడు జంభాది రాక్షసులఁ జంపించుట

ఇట్లుండఁగా జంభాది రాక్షసప్రముఖు లింద్రునిపై దండెత్తి దేవతల నోడించుచు ననేకవిధముల బాధలు పెట్టుచుండిరి. ఒక సంవత్సర మా రాక్షసులతోఁ బోరాడియు దేవతలు గెలువ లేకుండిరి. అందుచే నింద్రాదులు భయపడి వాలఖిల్యాది మహర్షులఁ గూడి తమ గురువగు బృహస్పతికడ కేఁగి యుపాయము చెప్పుమని కోరిరి. బృహస్పతి యాలోచించి "ఇంద్రాది దేవతలారా ! నా కొక యుపాయము తోఁచుచున్నది. అత్రిమహర్షి కుమారుఁడు దత్తాత్రేయుఁడను మహాత్ముఁడు కలఁడు. మీరుపోయి వానిని భక్తితో సేవించి భజించినచో నాతఁడు మీకుపకారము చేయఁగలడు. అంతకుమించి గత్యంతరము కానవచ్చుటలే "దని చెప్పఁగా వెంటనే యింద్రాదులు గురుననుమతిఁ గైకొని యతివేగమున బయలు దేఱిపోయి దత్తాత్రేయనాశ్రమమును సమీపించిరి.. అట నాతఁ డనేక కిన్నర గంధర్వగీయమానుఁడై లక్ష్మిసమన్వితుఁడు తేజస్సముజ్జ్వలుఁడునై యుండఁగాంచి దేవత లతి భక్తి యుతులై మ్రొక్కిరి. దత్తాత్రేయుఁడును దన వికృతచేష్టలఁ జూవుచు మద్యము తెండనఁగా వారు మధ్యముఁ గొనివచ్చి యాతని కందిచ్చిరి. అతఁడు లక్ష్మితో దానిం ద్రావి గంతులువేసి పాఱిపోఁ జొచ్చెను. ఇంద్రాదులును వానిని వెనుదగిలి విడువకుండిరి. వారిచే నట్లారాధింపఁబడుచు దత్తాత్రేయుఁడు కరుణించి "మీ రేపనికై వచ్చితి? " రని యడి గెను. వారును జంభాసురుని వృత్తాంతము చెప్పి రాక్షసుల నందఱను జంపి దేవహితము చేయుమనియాతనిఁ బార్థించిరి ఆతఁడు "నేను మద్యాసక్తుఁడను, స్త్రీలోలుఁడను, కర్మభ్రష్టుఁడను, ఉన్మత్తుఁడను, నాకారాక్షసుల గెలువరాదు. పొం”డనెను. వారు "మహాత్మా! నీవు విష్ణుఁడవు. ఆద్యుఁడవు. నీతో నున్న యీమె యిందిర. నీవు సత్యజ్ఞానానందస్వరూపుఁడవు. నీకు విధినిషేధములు లేవు. నీ కన్న సర్వసమర్థుఁ డింకొకఁడు లేఁడు. మమ్ము రక్షింపు"మని వేఁడుకొనిరి. అంత దత్తాత్రేయుఁడు కరుణించి “నన్ను మీరు తెలిసికొంటిరి. దేవహితముకంటె నాకుఁ గావలసిన దేమి? మీరా దైత్యులను యుద్ద వ్యాజమున నిటకుఁ దోడితెండు. క్షణమాత్రములో వారిఁ బరిమారు" నని వారిని బరిపివేసెను.

దేవత లొక్కపరుగునఁబోయి జంభాదులను యుద్ధమునకు, బిలుచుకొని వచ్చిరి. జంభుఁడు ససైన్యుఁడై దత్తాత్రేయు నాశ్రమమునకు వచ్చి దత్తాత్రేయుని పార్శ్వమున నున్న లక్ష్మిని జూచి కామమోహితుఁడై నెమ్మదిగా నామెను దొంగిలించి శిబికలో నెక్కించుకొని మోయుచుఁ గొనిపోఁ జొచ్చెను. దత్తాత్రేయుఁ డింద్రాదులఁ బిలిచి “లక్ష్మి దానవుల శిరమెక్కినది. అనఁగా నింక వారిని విడిచి వేయు నన్నమాట. దాని మూలమున దైత్యులందఱు బలహీనులై రి. మీరు యుద్ధము ప్రారంభించి వారిని దునుమాడుఁ" డని చెప్పెను. దేవతలు పూర్వమువలెఁ గాక క్షణములో రాక్షసు లెల్లరఁ జంపి దత్తాత్రేయుని స్తుతించి వెడలిపోయిరి.

దత్తాత్రేయుఁడు కార్తవీర్యార్జునుఁ గటాక్షించుట

ఆ దినములలో హైహయవంశీయుఁడగు కార్తవీర్యార్జునుఁ డను రాజు తండ్రి మరణానంతరము సింహాసన మధిష్ఠించి రాజ్య పరిపాలన మొల్లక మంత్రులఁ బిలిచి “మంత్రులారా! ఈ రాజ్యము నాకక్కఱలేదు. పరస్పర ద్వేషతస్క రాది బాధలనుండి కాపాడుటకై ప్రజలు ధరణిపతికి ధనము చెల్లింతురు. నే నాపనులు చేయఁజాలను. వనమున కరిగి తప మాచరించి యధ్యాత్మయోగసిద్ధి పొంది వచ్చెద" నని చెప్పెను. అందు గర్గుఁ డను మంత్రిపుంగవుఁడు రాజుమాట త్రేయ మహర్షి మహాయోగసంపన్నుఁడు. అతని కృపఁ గాంచినచో నీ యభిమతము సిద్ధించు" నని చెప్పి దత్తాత్రేయుని కటాక్షమున నింద్రుఁడు జంభాది రాక్షసులఁ జంపిన వృత్తాంతము నెఱిఁగించెను. కార్తవీర్యార్జునుఁడు బయలుదేఱి పోయి దత్తాత్రేయు నాశ్రమమున కరిగి యాతనికి నమస్కరించి భక్తితో ననుదినము నాతని పాదము లొత్తుచు మద్యమాంసాదు. లాహారముగాఁ గొనితెచ్చి యిచ్చుచుఁ జందన కర్పూరకస్తూరికాది సమస్త వస్తు ప్రదానముల నాతని చిత్తము రంజించునట్లు పూజించుచుండ నొకనాఁ డాతని యపానవాయువగ్ని హోత్రమై వచ్చి కార్తవీర్యార్జునుని బాహుద్వయమును మాడ్చివేసెను. మఱియు దత్తాత్రేయుఁ డనేకవిధముల నాతని హింసించెను. ఐన, నాతఁడు తనభక్తి విడువక పరమానందముతోఁ బరిచర్య చేయుచుండెను. దత్తాత్రేయుఁ “డోరీ! కాంతాలంపటుఁడను. మద్య పాయిని, నన్నేల సేవింతువురా?" యని యడుగఁ గార్తవీర్యార్జునుఁడు “మహాత్మా ! నీ వంతశ్శుద్దుఁడవు, అసంగుఁడవు. నీవు విష్ణుమూర్తివి. ఆమె పద్మ" యని కేలుమోడ్చి సంస్తుతించెను. దత్తాత్రేయుఁ డాతని భక్తికి సంతసించి యేమి కావలయునో కోరుకొనుమనెను కార్తవీర్యార్జునుఁ డంత వేయి హస్తములు, సమస్త భూమి పాలనసామర్థ్యము, సంగర విజయము, సిరీసంపదలు, ధర్మతత్సర బుద్దియు, శైలాకాశజల భూమిపాతాళములయందుఁ దనరథ మకుంఠితముగా నడచు శక్తి కోరుకొనెను. దత్తాత్రేయుఁడు వానికా వరము లొసఁగి యంతర్హితుఁడగుచు "నోరీ ! నీ రాజ్యమందెల్లెడల నీ బాహుళక్తి మూలమున ధర్మప్రతిష్ఠానము చేయుము. యజ్ఞయాగాదులొనరించు బ్రాహ్మణులకు సమస్త మిచ్చుచుండుము, మద్భక్తి యోగము నెల్లెడఁ జాటుచుండుము. నీ వెన్నండధర్మముగా మహర్షుల ఖాధింతువో యానాఁడే మరణింతువు సుమా" యని ప్రబోధించెను. కార్తవీర్యార్జునుఁడు బ్రహ్మానందముతో నా మాటలెల్ల విని యనంతబలసంపన్నుఁడై మాహిష్మతీపురమున కరిగి రాజ్యమును స్వీకరించెను. నాఁడు మొద లాతఁడు ధర్మబద్దముగా భూపరిపాలనము చేయుచు సనేకయజ్ఞములు చేసి బ్రహ్మర్షి పూజన మొనరించి ధర్మమును బూర్వస్థితికిఁ దీసికొనివచ్చెను. తన బాహుబలమున భూమండల మెల్ల జయించి యందెల్ల ధర్మప్రభుత్వము నెలకొల్పి కార్తవీర్యుఁడు విప్రపూజ చేయుచుండెను. ఆతఁడు ప్రతిదినమును దత్తాత్రేయమహర్షిని బూజించుచు నాతనికిఁ గృతజ్ఞుఁడై యుండెను. తుద కీతఁడు దత్తాత్రేయుఁ డన్నట్లే జమదగ్నిమహర్షి నన్యాయముగా బాధించి పరశురాముని చేతిలో జనిపోయెను.

దత్తాత్రేయుఁ డలర్కునకు జ్ఞానము బోధించుట

మదాలసా ఋతుధ్వజుల పుత్రుఁడగు నలర్కమహీపతి రాజ్యముచేయుచుఁ బురుషునకు ముముక్షను బోలిన వస్తు వొకటి లేదనియు దాని నందుటకు సత్సాఁగత్యము దక్క మార్గాంతరము లేదనియు నిశ్చయించుకొనెను. ఇంతలో విరాగియై యడవుల నున్న యీతని యన్న యాసమయముననే కాశీరాజుకడ కేఁగి తన రాజ్యము తన తమ్ముఁడపహరించినాఁ డనియు దానిని తన కిప్పింపు మనియుఁ గోరుకొనెను. కాశీరాజు సనైన్యుఁడై యలర్కుని పై దండెత్తి సామాద్యుపాయములఁ బ్రయత్నించుచుండెను. ఈ సమయమున రహస్యముగా నలర్కుఁడు దత్తాత్రేయుని కడకుఁ బరుగునఁ బోయి దండప్రణామము లాచరించి శరణార్థి యగు తనకు శరణై రక్షింపుమని పరిపరివిధముల దీనుఁడై ప్రార్థించెను. దత్తాత్రేయ మహర్షి యాతనిఁ గరుణించి "ఓయీ! వివేకహీనా! నిను నీవు తెలిసికొనుమోయీ! అంగములఁ జింతించి యంగిఁ జూచి నిరంగునిఁ గనుఁగొని యసంగుఁడవై సర్వాంగముల నుడుఁగు" మని యాతనికిఁ దత్త్వజ్ఞానోపదేశముచేసి "యిఁక విచారమే" మని యడిగెను, అలర్కుఁడు సమ్యగాత్మదర్శనుఁడై దత్తాత్రేయునకు వందనము లాచరించి "నీకృపచే బ్రతికితిని. సుస్థిరజ్ఞాన ముపదేశింపు" మని వేఁడుకొనెను. దత్తాత్రేయుఁడు “మమ యనుట దుఃఖమునకు, నమమ యనుట నిర్వృతికిని మార్గము. అహంకారమను నంకురముచేఁ బుట్టి మమకార మను మొదలు కలిగి గృహము క్షేత్రము నను కొమ్మల నంది పుత్త్రులు భార్య యను పల్లవముల నొప్పి ధనము ధాన్యము నను పెద్ద యాకులు వేసి పుణ్యపాపములను పుష్పములఁ బూచి సుఖదుఃఖములను పండ్లు కాచి చిరకాలము పెరిగి యజ్ఞాన మను కుదుళ్ళతో నిండి ముక్తిమార్గమును గప్పివేసియున్న మమ యను వృక్షమునీడను సంసార పథపరిశ్రాంతు లగు మిథ్యాజ్ఞాన సుఖాధీనులకుఁ బరమ సుఖము పరమ దుర్లభము కావున, నీ మహావృక్షమును విమల విద్యయను గొడ్డలిఁ దీసికొని తత్త్వనిధులు సాధుజనులు వీరితోడిసంగ మసు పాషాణమున బాగుగా మాఱి పదనుపెట్టి యెవరు నఱకుదురో వారు చల్లని బ్రహ్మవనము చొచ్చి నిత్యానందులై యపునరావృత్తి నుందు రని యుపదేశింపఁగా విని యానందియై "మహాత్మా ! నిర్గుణ బ్రహ్మైకత్వమును బోధించు యోగము నెఱిఁగింపు" మని వేఁడుకొనెను. అంత నాతఁడు “వత్సా ! శరీరమునందలి పరమజ్ఞానమునకు గురుఁడే యుపద్రష్ట. మోక్షార్ధికి యోగము జ్ఞానపూర్వకమగును. ప్రకృతి గుణములతో నేకత్వము లేకపోవుటయు బ్రహ్మైకత్వము కలుగుటయు ముక్తి యన నొప్పును. ఆముక్తి పరమయోగమునఁ గలుగును. యోగము సంగత్యాగము వలన సిద్దించును. సంగత్యాగము వలన నిర్మమత్వము దాని వలన వైరాగ్యము దానివలన జ్ఞానము దానివలన మోక్షమును సంభవించును. ?

యోగికి ముం దాత్మజయము కావలెను. కనుకఁ బ్రాణాయామముచే నాతఁడాత్మదేహదోషము దహింపఁ జేయవలెను. ---జములైన కర్మములు యోగవిఘ్న కార్యములగుట యోగి వానిని ద్యజించి శుద్దాత్ముఁడై పరమాత్మునిలో నైక్యమైపోవును. ఆట్టి యోగికి గౌరవము విషము. అవమానమే యమృత మగును. ఆయోగి తన కున్నదే " యిల్లుగాఁ దన యాఁకలికి దొరకినదియే భోజ్యముగాఁ దనకు గలదియే ధనముగా ముదమంది మమకారము నందఁడు. కావున, నీవు విచారము దక్కి, యట్టి యోగపురుషుఁడవై మోక్షవృత్తి మఱవకు" మని యలర్కునకు బోధించెను. అలర్కుఁడు బ్రహ్మానందముతో గృహమునకేఁగి రాజ్యమును బ్రీతిపూర్వకముగాఁ గాశీరాజున కిచ్చెను. దానిని గాశీరాజలర్కుని యన్న కీయఁబోయెను. అలర్కుని యన్నయు నానందించి తాను సోదరునకు జ్ఞా ప్రబోధము చేయుటకే రాజ్య మర్థించితి ననియు నాపని యగుటచేఁ దనకు రాజ్య మక్కఱలేదని కాశీరాజునకుఁ దత్త్వ ముపదేశించి తన యాశ్రమమునకుఁ బోయెను. కాశీరాజు అలర్కునిఁ బూజించి రాజ్య మాతనికేవిడిచి చనియెను. అలర్కుఁడు సుతునకుఁ బట్టము కట్టి యడవి కేఁగి యోగియై విరాగియై యాత్మసుఖము నందెను.

దత్తాత్రేయమహర్షి సంగమును విడనాడుటకై వివిధవేషములఁ గైకొనువాఁడు. విల్లునమ్ములు కొని వేఁటకుక్కలు వెంట రాఁగాఁ జెంచు వానివలె నుండువాఁడు. కాఱడవిలోఁ గిరాతతతి యుండెడుచో నుండి మద్యమాంసములు సేవించువాఁడు. మాలపల్లికేఁగి చండాలురతోఁ గూడి మద్యమును గ్రోలువాఁడు. ఉన్నత్తుఁడై నట్లు విహరించువాఁడు. ఐన నాతఁడు మహాయోగీశ్వరేశ్వరుఁడు. విచిత్రచరిత్రుఁడు.

"శ్లో॥ విభుర్నిత్యానంద శ్శ్రుతిగణశిరోవేద్యమహిమా
       యతో జన్మాద్యస్య ప్రభవతి వ మాయాగుణవతః, |
       సదాధార స్సత్యో జయతి పురషార్థైక ఫలదః
       సదా దత్తాత్రేయో విహరతి ముదా జ్ఞావలహరిః" ||



  1. మార్కండేయ పురాణము.