మహర్షుల చరిత్రలు (మొదటి భాగము)/గౌతమ మహర్షి

మహర్షుల చరిత్రలు

గౌతమ మహర్షి

శతపథబ్రాహ్మణము ననుసరించి గౌతమమహర్షి బ్రహ్మ మానసపుత్త్రులలో నొకఁడు; సప్తర్షులలో సుప్రసిద్ధుఁడు, శ్రుతుల ననుసరించి గౌతమవంశమున జన్మించిన యొక మహర్షి . ఈ గౌతమ మహర్షి యే గౌతమధర్మ సూత్రకర్త.

అహల్యా గౌతముల వివాహవృత్తాంతము

తొల్లి విష్ణుమూర్తి మోహినీరూపము ధరించి త్రినేత్ర సురా సురుల సైతము మోహింపఁ జేయఁగా నెల్లరును. బ్రహ్మ సృష్టిని జప్పగఁ దలపోసిరి. ఆ కారణమున నధిక ప్రయత్నమున నఖిలలోక మోహనముగా నబ్జభవుఁ డహల్యా మోహనాంగిని సృష్టించి నైష్టిక బహ్మచర్యమునఁ దపము సలుపు గౌతమునకుఁ బరిచర్య చేయ నియోగించెను. అహల్య యంగీకరించి హోమాదికృత్యములం దెల్ల నిచ్చలాతనికి సపర్య లొసరించుచుండెను. గౌతముఁడు నా మెయం దేమాత్రమును లౌల్యము లేకుండ నుండెను. కొంతకాలమున కహల్య యౌవనము నంది సౌందర్యమున నద్వితీయయై యలరారెను. అంత గౌతముఁ డామెను దోడ్కొనిపోయి బ్రహ్మ కిచ్చెను. బ్రహ్మదేవుఁ డామెను గౌతమునికే యిచ్చి వివాహము చేయనెంచెను. కాని, యామె త్రిలోకసుందరి యగుట “మా కిమ్ము మాకి"మ్మని యింద్రాది దేవతలే వచ్చి 'బ్రహ్మ' నడుగఁ జొచ్చిరి. గౌతముఁడు మాత్ర మెన్నఁ డడుగలేదు. బ్రహ్మ యుపాయ మూహించి భూప్రదక్షిణము చేసి యెవరు ముందు తనకడకు పచ్చెదరో వారికే యహాల్య ..................................................................................................................... గౌతమమహర్షి నెమ్మదిగా లేచి యనతిదూరముననే యున్న యొక యుత్తమ గోమాతకుఁ బ్రదక్షిణముచేసి యది భూప్రదక్షిణమునకు సమమే యను శ్రుతివాక్య ప్రమాణబుద్ధితో మఱి యొకపర్యాయ మాగోవుచుట్టును దిరిగి బ్రహ్మకడకు వచ్చి విన్నవించెను. బ్రహ్మ యది సత్యమేయని మిగిలినవారు తిరిగి వచ్చుసరి కహల్యాగౌతముల కిరువురకు దివ్యవైభవముతో నుద్వాహ మొనరించెను. ఇంద్రాది దేవతలును గౌతముని మాహాత్మ్యమునకు మెచ్చి యసూయా పరు లయ్యు నేమియును జేయలేక యహల్యాగౌతముల దాంపత్యమును బహువిధముల నభినందించి వెడలిపోయిరి.[1]

గౌతమమహర్షి క్షామసమయమునఁ బ్రజాసంరక్షణము చేయుట

గౌతమమహర్షి యహల్యాసహితుఁడై దండకావన వాటిక కరిగి మహోగ్రముగ బహుకాలము బ్రహ్మదేవుని గుఱించి తప మొనర్చెను. అంత నాతఁడు ప్రత్యక్షమై గౌతముని కోరిక యడిగెను. అతఁడు. "బ్రహ్మదేవా! నేను విత్తినసస్యము జాములోఁ బరిపాకము నందునట్లు వర మొసంగు "మని వేడుకొనెను. బ్రహ్మ యట్లేయని యంతర్ధానమయ్యెను. పిమ్మట గౌతమమహర్షి యహల్యాసహితుఁడై 'శతశృంగగిరి' కరిగి యొకపర్ణ శాల నిర్మించుకొని యజవరమహత్త్వమున సతిథికోటిని షడ్రసోపేతభుక్తిఁ దనుపుచుండెను.

అహల్యయుఁ బతిశుశ్రూషయం దేమఱక శ్రద్ధాభక్తులతోఁ జరించుచుండెను. గౌతమమహర్షి తపోమహత్త్వముచే నాతఁడు తపముచేయు నాశ్రమము సుభిక్షమై సస్యశ్యామలమై యొప్పుచుండెను. ఇట్లుండఁగా నొకప్పుడొక మహాక్షామము సంభవించెను. ఒక్క గౌతమాశ్రమ భూములుతప్ప భూ భాగమందెల్లడలను బంటలు నశించెను. జనులు క్షుద్భాధాతురులై చనిపోవఁ దొడఁగిరి. ఆహారముఁ గానక కొందఱు శవములనే తినఁ దొడఁగిరి. ఇట్లుండఁగా ననేకులగు ఋషులు బ్రాహ్మణులు గౌతముని కతిథులుగా రాఁ జొచ్చిరి. గౌతమమహర్షి యహల్యా సమేతుఁడై భక్తిపూర్వకముగా నందఱ నాహ్వానించుచుఁ దనదపశ్శక్తి చే నెల్లరకుఁ గడుపునిండఁ గూడును, గట్ట నూతనాంబరములు నిచ్చుచుండెను గౌతమమాహాత్మ్యము దశ దిశల నెఱుకపడఁగా నానాఁటికి జనులు తండోపతండములుగా వచ్చి యహల్యాగౌతముల యాహ్వానముపై వారు చేయు మర్యాదలకు నిర్విణ్ణులై యచటనే భార్యాపుత్త్రాదులతో నివసింపఁ దొడఁగిరి. ఈ ప్రకారము దినదినము జనులు వృద్ధియగుటచే గౌతమమహర్షి యాశ్రమము సహస్ర యోజనాధికము కాఁజొచ్చెను. గౌతమమహర్షి కీర్తి యింద్రలోకమునకుఁ బ్రాకెను. ఇంద్రుఁడు నారదుఁడు మున్నగువారు వచ్చి యహల్యా గౌతముల వితరణమునకు మెచ్చి నారి ననేకవిధముల శ్లాఘించి పోవుచుండిరి. పార్వతీ తనయుఁడగు విఘ్నేశ్వరుఁడు గౌతముని ప్రతిజ్ఞాభంగ మొదవించు ప్రయత్నమున బ్రాహ్మణరూపధారియై వచ్చి యహల్యా గౌతములచే నధిక సత్కారముల నంది యకృతార్థుఁడై యాయాశ్రమముననే యుండెను,

ఆ దినములలో గౌతమాశ్రమము భూలోకస్వర్గమై పోయెను. క్షణక్షణమును బెరుగుచున్న ప్రజాసముదాయమునకు నిరంతరము నహల్యాగౌతము లేలోపమును లేకుండఁ జూచుచుండిరి. యావత్ప్రపంచము నతిథిలోక మయ్యెను. నిజ తపోవనవద్యతచే నంతలోకమున కొక గౌతమమహర్షియే భిక్షాప్రదాత యయ్యెను. క్షణమైన నేమఱ కహల్యాగౌతము లతిథి సేవలో మునిఁగియుండి యెల్లరకు షడ్రసోపేతముగ విందులొనరించుచు నూతనాంబరము లొసంగు చుండఁ బ్రతిపురుషునకుఁ గలలో సైతము గౌతముఁడును బ్రతిస్త్రీకి నహల్యయు "మీకేమి కావలయును? మీకేమికావలయును? దయతో సెలవిం" డనుచున్న ట్లే గానవచ్చుచుండిరి. ఇట్లుండగా నొకనాఁడు విఘ్నేశ్వరుఁడు తల్లి కొనర్చిన వాగ్దానము ననుసరించి శివజటాజూటమునఁ గల గంగసు భూమికిఁ బంపివేసినచోఁ బార్వతికి సవతిబాధ యుండదని యుపాయ మాలోచింపఁ దొడఁగెను. గౌతమునంతటి మహర్షికిఁ దక్క. నన్యుల కంత పని సాధ్యము కాదనుకొని గౌతము నాపని కై వినియోగించు ప్రయత్నమున నాతఁడుండెను. ఒకనాఁడు బ్రాహ్మణుల నందఱ సమకూర్చుకొని గౌతమాశ్రమమును వీడి పోవ నాతఁడుద్యుక్తుఁ డయ్యెను. ఈ సంగతి యెఱిఁగి గౌతమ మహర్షి వారి నందఱు నటనే యుండి తన యాశ్రమము నింకను బవిత్రము చేయుఁడని కోరుకొనెను. మాయా బ్రాహ్మణుఁడగు విఘ్నేశ్వరుఁడాలోచించి పార్వతి చెలికత్తె నొకతెఁ బిలిచి మాయా గోవై గౌతముని పొలములో మేయు మనియు, గౌతముఁ డేమి చేసినను వెంటనే చనిపొమ్మనియు నియోగించెను. ఆ ప్రకారమామె మాయా గోవై యట మేయఁ జొచ్చెను. గౌతముఁడు దానిని జూచి యొక గరిక విసరఁగనే యది చనిపోయెను, గౌతముని గొప్పతనమున కసూయాగ్రస్తులగు బ్రాహ్మణులందఱొక్క పెట్టున గోహత్యాపాతకుఁడని గౌతముని నిందింపఁ దొడఁగిరి బ్రాహ్మణరూపమున నున్న గణపతియు నాతనిఁ దూఱి బ్రాహ్మణులెల్లరఁ గూడి యటనుండి పోఁబోవు చుండెను. అహల్యావైభవమును దిలకించి మత్సరగ్రస్తలైన స్త్రీలు నిదే సమయమని యహల్యా గౌతముల నిందించిరి.

గౌతముఁ డసూయపడిన బ్రాహ్మణులను శపించుట

అహల్యాగౌతములు తమకుఁ గలిగిన ప్రమాదమున కెంతయుఁ జింతించి వారల నందఱఁ బాపముక్తి యెట్లు కలుగునో చెప్పి కాపాడుఁడని కోరుకొనిరి. కొంతసేపు బతిమాలించుకొని విఘ్నేశ్వరుడు గౌతమునితో “ఋషివరా ! శివునిగుఱించి తపము చేసి యాతని మెప్పించి శివజటాజూటమునఁ గల గంగాభవానీ నిటఁ బ్రవహింపఁ జేసినచో నీ పాపము శమించుటే కాక త్రిజగత్పూజ్యత నీకుఁ గల్గు" నని చెప్పి వెడలిపోయెను. ఈలోపున ఘోరవర్షములు గురిసి క్షామము తలఁగుటచే బ్రాహ్మణులు గౌతముని నిందించుచునే వెడలిపోయిరి. గౌతముఁడు తన కిట్టి తప్పిద మేల వచ్చినదని యోగ దృష్టిచేఁ జూడఁగా విఘ్నేశ్వరుఁడు పన్నిన వ్యూహము. తన యింటి కడఁ దిని యసూయాగ్రస్తులైన బ్రాహ్మణులను గోచరించిరి. గౌతమమహర్షి విఘ్నేశ్వరుని దేవకార్యము సిద్ధింపఁ జేయుటయే తన విధియని నిశ్చయించుకొనెను. కాని, యసూయాగ్రస్తులగు బ్రాహ్మణులు తన్నుఁ దిట్టిన కారణమున వారిని బాషండులు కండని శపించెను. ఈ సంగతి యెఱిఁగి బ్రాహ్మణు లందఱు భయకంపితులై వచ్చి గౌతముని శరణువేఁడిరి. గౌతమమహర్షి కరుణించి తన శాపమమోఘ మనియు వారు కొంతకాలమునకు శ్రీకృష్ణుఁడు జన్మించిన పిమ్మట ముక్తినందుదు రనియు జెప్పెను.[2]

గౌతమమహర్షి గంగను భూమికిఁ దెచ్చుట

గౌతముఁడు వెంటనే బయలుదేఱి యహల్యా సహితుఁడై హిమవన్న గమును జేరి యా నగప్రదేశమున నొక్కచోట సౌధాంబస ధేమయూధని స్స్రుతదుగ్ధధారాధునీతీర పారిజాతవనాంతర చింతామణి స్థలమున విడిసి యేక పాదస్థుఁడై మహోగ్రముగ శివునిఁగూర్చి తపస్సు చేయఁదొడఁగెను. అతని తపోమాహత్మ్యమున కచ్చెరువంది శివుఁడు పత్యక్షమయ్యెను. గౌతమమహర్షి శివు ననేకవిధముల స్తుతించి గంగాదేవిని భూతలమునకుఁ బంపుమని వేఁడుకొనెను. శివుఁడనుగ్రహించెను. గంగాదేవి గౌతముని కోరికపై భూతలమునకు వచ్చి మాయా గోవు చనిపోయినచోటఁ బ్రవహించి గోవును బ్రతికించి భూమిని బవిత్రము చేసెను. ఇంతలో గౌతముని నిందించిన వాహ్మణు లా గంగాజలమున స్నానము చేసి తరింప వచ్చిరి. అంత గంగాదేవి వెంటనే తనరూప ముపసంహరించుకొని యదృశ్య మయ్యెను. గౌతముఁ డెంతయో ప్రార్థింపఁగా నాతని నిందించిన బ్రాహ్మణులు తనలో స్నానము చేయవచ్చి రనియు, వారి మహాపాపమును దాను భరింపఁ జాల ననియు నామె చెప్పెను. గౌతమమహర్షి పరిపరి విధముల నామెను బ్రార్థించి బ్రాహ్మణులను క్షమింపు మనియుఁ దిరిగి భూమిపైఁ బ్రవహింపు మనియుఁ గోరుకొనెను. గంగ యనుగ్రహించి తిరిగి భువిపై నవతరించెను. ఆ గంగామాతయే గౌతముని మూలమున నవతరించుటచే 'గౌతమి' యనియు, గోవును బ్రతికించుటచే 'గోదావరి' యనియు నలరారు చున్నది.[3]

గౌతముఁ డహల్య కొసఁగిన సంతానము

అహల్యాగౌతము లన్యోన్యముగఁ గాపురము చేయుచుండిరి. అహల్యాసాధ్వి బ్రహ్మర్షి వరుఁ డగు గౌతముని సహధర్మచారిణియై నిజ శుశ్రూషామహత్త్వమున నాథుని యుల్లము రంజిల్లఁ జేయు చుండెను. ఆమె త్రిలోకసుందరి యయ్యుఁ దుచ్ఛకామములకు లోనుగాక పతిసేవయే మహాభాగ్యముగా వెలుఁగొందుచుండెను. ఆ సాధ్వి పాతివ్రత్యమునకు వెఱుఁగొంది యామెఁ దలపోయుటయే యింద్రాదులు సైతము మానుకొనిరి. ఇట్లు పవిత్రహృదయముతోఁ దన్ను సేవించు భార్యను మెచ్చి గౌతముఁడు గృహస్థ ధర్మములోఁ బుత్త్రోత్పాదన ముత్తమవిధి యగుట స్మరించి యహల్యను బిల్చి యొకవరముఁ గోరుకొమ్మనెను. అహల్య కొడుకు ననుగ్రహింప గౌతముని వేఁడుకొనెను. గౌతముఁ డంగీకరించి యామెకుఁ గామవాంఛఁ దీర్ప నామె గర్భిణియై యుక్తకాలమున శతానందుఁడను కుమారుని గనెను. వెంటనే యా బాలుఁడు తపోజీవన మారంభింపఁ దలిదండ్రుల యాజ్ఞ గైకొని వెడలిపోయెను. ఈఁతడే శరద్వంతుఁ డనియుఁ బిలువఁ బడుచు మహాతపస్సంపన్నుఁ డాయెను. కాలక్రమమున నీతని వీర్యమునుండియే కృషి, కృపాచార్యుఁడు జన్మించిరి. మఱియొక పర్యాయము కామవాంచోపహతయైన యహల్యకు గౌతము ననుగ్రహమున గర్భమై యంజన యను కూఁతు రుద్భవించెను. ఈయంజన పితృవాత్సల్యమునకు గుఱియై నిరంతర మహల్యకడనే యుండు చుండెను. ఈమె కొడుకే ఆంజనేయుడు.

మఱికొంతకాలమునకు గౌతముని కృపవలన అహల్య గర్భము ధరించి, మఱియొక కుమార్తెను గాంచెను. ఈ కుమారినే గౌతముఁడు తన శిష్యుఁడగు నుదంక మహామునికి నూతనదేహము నవయౌవనము నొసఁగిన తరువాత నిచ్చి వివాహము చేసెను.[4]

గౌతముఁ డహల్యాశత్రుల శపించుట

అహల్యవివాహ మైనప్పటినుండియు నింద్రుడామె లోకాతీత సౌందర్యమునకు వశుఁడై యామెపొందు కోరుచునేయుండెను. కాని యహల్యాసాధ్వి చిత్తవృత్తి యెఱిఁగి గౌతమమహర్షి కోపానలమునకు వెఱచి యుండెను. కాని, యొకనాఁ డింద్రుఁడు తనకోర్కె దీర్చుకొనఁ గోరి యొక యుపాయ మాలోచించి కోడియై గౌతమాశ్రమమునఁ జేరి నాఁటి నడురేయియే కూయఁ దొడఁగెను. ఈ కోడి కూఁతవిని గౌతమమహర్షి కాలకృత్య నిర్వహణమునకు నదీస్నానమునకై యాశ్రమము వీడి వెడలిపోయెను. ఈ యవకాశమును బురస్కరించుకొని యింద్రుఁడు గౌతమవేషముతో నాశ్రమముఁ బ్రవేశించి యహల్యతోడి సంగమ మపేక్షించెను. ఆమె యీ ద్రోహ మెఱుఁగఁజాలక కామోపహతుఁడగు భర్తకు వ్యతిరేకము పలుకలేక యంగీకరించెను. అంత వారిరువురును నొడలు మఱచి సుఖానుభవము నందుచుండ గౌతముఁ డింకను జాల ప్రొద్దు గలదని యాశ్రమమునకు వచ్చి చేరేను. లోపలఁ ప్రవేశింపఁగనే యహల్య యాశ్చర్యపడి “మహాత్మా! ఇంతవఱకు నాతో నున్న నీ విట్లు రెండు రూపము లేల తాల్చితి"వని ప్రశ్నించెను. ఇంద్రుఁడు వణఁకి పోయి పిల్లియై బయటకుఁ బోఁజూచెను. గౌతమమహర్షి యా పిల్లినిజూచి " ఓరీ! నీ విషయమును ద్వరలోఁ జెప్పనిచో దగ్దమై పోదు" వనెను. ఇంద్రుఁడు స్వరూపమును ధరించి . తన యహల్యా పేక్షను క్షమింపు మని కాళ్ళ పైఁ బడెను. అహల్య యాశ్చర్యభరితయై "మహాత్మా ! ఈ మోసము నే నెఱుఁగను. నీవు తిరిగి వచ్చి నా తనుసౌఖ్య మపేక్షించితి వని యెంచి తీర్ప నెంచితిని. ఇంతకు మించి పంచభూతములు తోడుగా నే నొం డెఱుఁగ" నని శపథము చేసెను. వెంటనే యాకాశవాణి యహల్య నిర్దోషిణి యని పల్కెను. గౌతమమహర్షి - యూరకుండక “నీ వెఱిఁగి చేసినను నెఱుఁగక చేసినను దోషము దోషమే. అజ్ఞానముననైన నగ్ని సంస్పర్శనమున హస్తము కాలకుండునా ! కావున, నీవు చైతన్యహీనమగు శిలవై పడియుండు" మని శపించి యింద్రునిఁ జూచి “దుర్మార్గా! దేవేంద్రా ! శచీపతి వయ్యు నీ కామలాలసతకు మితిమేరలు లేకుండఁ బ్రవర్తించితివి. అగ్ని హోత్రముతో నపహాసముచేయు తుంటరిమిడుత వై తివి. ఓరీ! నీచా ! మహాపతివ్రత యగు మహర్షి పత్నిని మోసగించి పరమహేయ మగు పనికిఁ బాల్పడితివి. కావున, నీయండము లూడిపడిపోవుఁగాక ! నీ శరీర మంతయు యోనిమయమై నీకు నిత్యఖేద మొదవించును గాక ! నీ సామ్రాజ్యము శత్రువు లపహరింప నీవు పదభ్రష్టత నంది దైన్యజీవనముఁ గడుపుదువు గాక !" యని తీవ్రముగా శపించెను. వెంటనే యహల్యా సంక్రందను రిరువురు నాతని పాదములపైఁ బడి శాప విముక్తి ననుగ్రహింప వేఁడుకొనిరి. గౌతమమహర్షి కొంత సరికిఁ గటాక్షించి యహల్యవైపు చూచి, “పాపాత్మురాలా! నీవు శిలవై శీతవాతాతపంబులకోర్చి నిరాహారవై రాత్రిందివములు రామస్మరణ పూర్వకముగా సహస్రాధికవర్షములు తపింపుము. ఈ ..................................................................................................................................................... చంద్రుని పాదారవిందరజః పుంజము నీ శిరస్సుపైఁ బడఁగా నే నీకు శాపవిముక్తి యగును. నాఁడు నీవు తిరిగి పవిత్రాంగివై నా కడకు రావచ్చును. పొ"మ్మని పలికి యింద్రునిఁ జూచి ఓ మహాపాపాత్మా! నీ పైని నాకుఁ గరుణ ముదయించినది. మహర్షులకోపము నీటిపై గీచిన గీఁత వంటిది. నీ యోను లితరులకుఁ గనపడకుండ నుండును. అవి నేత్రములవలెఁ బై వారికిఁ దోఁచును. స్వర్లోకసామ్రాజ్యవిహీనుఁడ వయ్యుఁ దిరిగి కొంత కాలమునకు స్వపదప్రాప్తి నందఁగలవు. పొ "మ్మని కరుణించి గౌతముఁడు హిమగిరి కరిగి తపోనియతి నుండెను. ఇంద్రుఁడు నండము లూడి క్రిందఁబడ దేహమెల్లెడ యోను లేర్పడఁ బళ్చాత్తప్తుడై వెడలిపోయెను. గౌతమమహర్షి శాపమున నింద్రుఁడు పదచ్యుతుఁడై తిరిగి కొంతకాలమునకు స్వారాజ్యము నందఁగల్గెను. అహల్యయుఁ జిర కాలమునకు శ్రీరాముని పాదరజము సోఁకఁగనే స్త్రీరూపము నంది పరమేశ్వర పాద సంస్పర్శచేఁ బవిత్రయై గౌతమమహర్షిని శేరి సేవించుచు మహాపతివ్రతయై వెలసెను.

గౌతముఁడు బ్రహ్మదత్తుని శపించుట

మహర్షి సత్తముఁడగు గౌతము డొకనాఁడు బ్రహ్మదత్తుఁ డనురాజు నింటి కేఁగి యాతిథ్య మిమ్మనెను. ఆతఁడు బ్రహ్మానందముతో నా పరమమునీంద్రు నింట నుంచుకొని చిరకాల మాతని కాతిథ్యమిచ్చి పోషించుచుండెను. అశ్రద్ధ కారణముగా నొకనాఁడు గౌతముని భోజన పదార్థములలో నొక మాంసపుముక్క కాననయ్యెను. గౌతముఁ డాదోషపరిహరణార్థమై బ్రహ్మదత్తను గ్రద్దయై పుట్టుమని శపించెను. బ్రహ్మదత్తుఁడు తనయెఱుఁగమిఁ దెల్సి శాప విముక్తిఁ గోరెను. గౌతముఁడు కరుణించి శ్రీరాముని హస్తము సోఁకగనే యాతనికిఁ బూర్వరూపము లభింప వరమిచ్చెను. ఆ ప్రకారము బ్రహ్మదత్తుఁడు గ్రద్దయై పుట్టి యొక నాఁ డొక గ్రుడ్లగూబతో బోరి శ్రీరామునికడకు వచ్చి తగవు తీర్పుమనఁగా నాతఁడు తన పవిత్రహ స్తమున నాగ్రద్దను నిమురఁగా నది శాపవిమోచన మంది బ్రహ్మదత్తుఁడై పోయెను.

గౌతమధర్మసూత్ర - స్మృతి - న్యాయసంహితలు

గౌతమమహర్షి లోకమునకుఁ బ్రసాదించినవానిలో మొదటిది గౌతమధర్మసూత్రములు లేక గౌతమస్సృతి. రెండవ దగు న్యాయశాస్త్రమును ఖండింపఁ జూచిన వ్యాసునిపైఁ గోపించి గౌతముఁడు తనపాదమున నేత్రము సృష్టించుకొని యాతనిఁ జూచెను. నాఁటినుండి గౌతమమహర్షి "అక్షపాదుఁ"డయ్యెను. ఈ గౌతమ న్యాయశాస్త్రము ప్రతిజ్ఞా హేతూదాహరణాది షోడళపదార్థనిరూపకమై పంచాధ్యాయాత్మకమై యొప్పుచున్నది. ప్రథమాధ్యాయ ప్రథమాహ్నికమందుఁ బ్రమాణాది పదార్థనవక లక్షణనిరూపణము, ద్వితీయాహ్నికమున వాదాది సప్తలశణనిరూపణము గలవు. ద్వితీయాధ్యాయ ప్రధమద్వితీయాహ్నికముల సంశయపరీక్షాణాదికము. అర్థా పత్త్యాద్యంత ర్భావనిరూపణము గలవు, తృతీయాధ్యాయమున శరీరేంద్రియార్థబుద్ధిమనఃపరీతణము, చతుర్థాధ్యాయమునఁ బ్రవృత్తి దోషాదికము, దోషనిమిత్తాదికము, పంచమమున భేద, నిగ్రహస్థాన భేద నిరూపణము గలవు.

మూఁడవదగు గౌతమ సంహిత గొప్ప జ్యోతిశ్శాస్త్రగ్రంథము.



  1. బ్రహ్మాండపురాణము.
  2. శివపురాణము, జానసంహిత వరాహపురాణము.
  3. వరాహపురాణము - బ్రహ్మపురాణము.
  4. భారతము - అశ్వమేధపర్వము.