మహర్షుల చరిత్రలు (మొదటి భాగము)/ఋష్యశృంగ మహర్షి

మహర్షుల చరిత్రలు

ఋష్యశృంగ మహర్షి

తొల్లి కశ్యపుఁడను మునిచంద్రునకు విభాండకుఁడను కుమారుఁ డుదయించెను. విభాండకుఁడు బాల్యము నుండియు నస్ఖలిత బ్రహ్మచర్యదీక్షతోఁ దపము చేయుచుండెను. ఒక్క నాఁ డాతఁ డొక్క మడువున నీళ్ళాడుచున్న సమయమున సురుచిర సురూపసుగుణ సుందరి యగు నూర్వశి యాతనిఁ గానవచ్చి తన విలాసహానములఁ బ్రదర్శించి నంతఁ గామకృతమునఁ బతనమైన యా ముని యమోఘవీర్యముతో మిశ్రమైన జలము నొక మనుఁ బెంటి త్రావి గర్భము ధరించెను.

ఋష్యశృంగుని జననము

ఈ మృగము పూర్వము చిత్రరేఖ యను నొక యప్సరస. ఆమె యింద్రసభలో నాట్యమాడుచుండఁగాఁ గొన్ని లేళ్ళచ్చటికి వచ్చెను. చిత్రరేఖ నేత్రములపై దృష్టినుంచి యానందించుచున్న యింద్రునిఁ జూడక యామె లేళ్ళఁ జూచెను. తనయానందమునకు విశేషభంగము గలిగించిన యా చిత్ర రేఖ నింద్రుఁడు మృగివై పుట్టు మని శపించెను. అప్పు డామె శాపవిమోచనోపాయము కోరుకొనఁగా నింద్రుఁడు కరుణించి విభాండకుఁ డను మహర్షి వీర్యమువలన బుత్త్రునిఁ గనిన పిమ్మట శాపవిమోచన మగునని తెల్పెను. ఆ చిత్రరేఖయే మృగియై దాహము తీర్చుకొనుటకు విభాండకుఁడు స్నానము చేయు జలాశయమునకు వచ్చి జలముతో పాటాతని వీర్యమును గ్రోలి చూలాలయ్యెను.

కొంతకాలమున కా మృగము మనుష్యరూపము గల యొక పుత్త్రునిఁ గని యరణ్యమున విడిచి తనశాపమోక్షణము కాఁగా నింద్ర లోకమునకేఁగెను. ఆ బాలుఁడు మనుఁబెంటికి జన్మించినవాఁ డగుట నాతని నొసట నొక శృంగము నుండెను; దానిమూలమున నాతనికి ఋష్యశృంగుఁ డను నామము కలిగెను. అతఁ డచటఁ బెరుఁగు చుండఁగా నొకనాఁడు వింభాడకుఁడు చూచి దివ్యదృష్టివలన నాతఁడు తన ఫుత్త్రుఁడే యని గ్రహించి వానిని దనయాశ్రమమునకుఁ దీసికొనిపోయి పెంచుచుండెను. బాల్యమునుండియు ఋష్యశృంగుఁడు తండ్రి యాశ్రమము దక్క నన్యమేమియు నెఱుఁగక పరమస్వాధ్యాయ విదుఁడు నద్వితీయ బ్రహ్మచారియునై ఘోరతపము చేయుచుండెను. ఆతని తపోవిశేషమున కచ్చెరు వందిన యింద్రుఁ డాత డెచ్చటనున్న నచ్చట సువృష్టి కలుగు ననియుఁ బ్రజ లాధివ్యాధి రహితులై సుఖ ముందు రనియు నసుగ్రహించెను.

రోమపాదుని వృత్తాంతము

ఇట్లుండఁగా నంగదేశమును బరిపాలించు రోమపాదుఁడను రాజునకు సంతానము లేకపోయెను. ఈతఁడు దశరథుని మిత్త్రుఁడు. ఒకనాఁడతఁ డయోధ్య కరుదెంచి దశరథునకు సురభి యనుగ్రహమునఁ గలిగినశాంత యను కూతుఁగాంచి ముద్దాడి యామెను బెంపిమ్మని యడిగెను. కాని, దశరథునకును బిడ్డలు లేనికారణమున నాతఁ డంగీకరింపఁ డాయెను. అంత దగ్గఱనున్న వసిష్ఠమహర్షి త్రికాలవేది యగుట దశరథునితో శాంతను రోమపాదున కిమ్మనియు నామె వలనఁ ద్వరలో నిరువురకును బురుషసంతానము కలుగు ననియుఁ జెప్పెను. అంధులకు వా రుభయులు నానందించిరి. తుద కాఱు మాసములు దశరథునింట నాఱుమాసములు రోమపాదు నింట శాంత యుండునట్లంగీకరించి రోమపాదుఁడు శాంతనుదీసికొని యంగదేశమున కేఁగెను. తరువాత నాతఁడు పుత్త్ర కామియై బ్రాహ్మణుల కనేక దానధర్మములు చేయుచుండెను. ఒక నాఁ డొక బ్రాహ్మణుఁడు .............................................................................................. బాలుని కొకగోవు నిమ్మని రోమపాదునిఁ గోరెను. అంత నాతఁడు బ్రాహ్మణులు దురాశాపరు లని నిందించెను. ఒక్కగోవు నిచ్చుటకు బదులు సద్ద్విజజాతిని బుద్ధిపూర్వకముగాఁ దెగడిన యా రాజును దండ్రికొమరు లిరువురును గోపించి యంగ రాజ్యము దుర్భిక్షమై యనావృష్ఠిదోష మందుఁగాక యని శపించి యారాజ్యము నుండి వెడలిపోయిరి. తరువాత రోమపాదుఁడు పశ్చాత్తప్తుఁడై గత్యంతర మే మని మిగిలిన బ్రాహ్మణుల నడుగఁగా వారు ఋష్యశృంగుని చరిత్రము వినిపించి యాతఁ డిటకు వచ్చిన నీ యపగ్రహదోషము వాయు నని చెప్పిరి. పిమ్మట రోమపాదుఁ డా బ్రాహ్మణులను బూజించి వారి యనుమతిని గొందఱు వారాంగనఁను సర్వకలాపూర్ణ యను నామె యాధిపత్యమున ఋష్యశృంగునిఁ దోడ్కొని రాఁబంపెను.

సర్వకలాపూర్ణాదివేశ్యలు ఋష్యశృంగుని గొనిపోవుట

నవయౌవనలు నతివిలాసినులు నగు నా వారాంగనలు విభాండకుఁ డాశ్రమమున లేని తరుణమున ఋష్యశృంగునిపాలి కరుదెంచిరి. స్త్రీముఖము చూచి యెఱుఁగవి ఋష్యశృంగుఁడు వారలు మునికుమారు లని యెంచి యర్ఘ్యపాద్యాదులీయ వారు స్వీకరింపక తాము తెచ్చిన దివ్యగంధ మాల్యములు సరసభక్ష్యములు విచిత్ర వస్త్రములు నిచ్చిరి. వారు పిమ్మటఁ దమ నృత్యగీతముల నాతని నానందింపఁజేసి వానిఁ గౌఁగిలింతల నొడలివుడికిళ్ళ మోసపుచ్చి తమ యాశ్రమము సమీపముననే యున్న దనియు నందుఁ దపముచేయ రమ్మనియు నాహ్వానించిరి. పిమ్మట వారు విభాండకునకు భయమొంది నాఁటికి వెడలిపోయిరి. ఋష్యశృంగుఁడు తండ్రిచెప్పిన యగ్ని హోత్రము వేల్వ మఱచి వారి యొప్పునఁదగిలి వారితోఁ దపముచేయ నాసక్తుఁడై యుండెను. ఇంతలో విభాండకుఁడు వచ్చి సుతు నగ్నిహోత్రము వేల్వకుండుటకుఁ గారణ మడిగెను. ఆతఁ దద్భుత సుందరాకారు లగు మునిబాలురు వచ్చిరనియు వారు కట్టిన చీర లతిమృదులము లనియు, వారిశరీరములు రమ్యసౌరభయుతములనియు వారి కలకూజితము లానంద ప్రదము అనియు నం దొక మునిబాలుఁడు తన్నుఁ గౌఁగిలించుకొని నిజాస్య మాసన్నముచేసి యొకమృదుమధురశబ్దము చేసె ననియుఁ జెప్పి వారితోఁ దపముచేయుట కిష్టపడియుంటి నని పలికెను. విభాండకుఁ డవి రాక్షస మాయలనియు వారిదానముణు వర్జనీయము లనియుఁ ప్రబోధించెను.

మఱునాఁడు విభాండకుఁ డెప్పటియట్ల వన్యపలముల కరిగిన వెంటనే వేశ్యాంగన లరుదెంచి ఋష్యశృంగుని డాయుడాతఁ డమితానందము నంది వారితో వారివనమున కేఁగుదేర నంగీకరించెను. వారును ధమకోరిక యీడేఱినందుల కానందభరితులై మచ్చికతోడను మేలములగు ముద్దులతోడను నా ముగ్దమౌని నంగదేశనమునకుఁ దోడ్కొ ని వచ్చిరి. అతఁడు రాజాశ్రయ మగు దివ్య భవనమును జేరఁగనే యాతని నివాసశక్తిచే సర్వజన ప్రమోదముగాఁ గుంభవృష్టి కురిసెను. రోమపాదుఁ డమితానందము నంది శాంత నాతని కిచ్చి వివాహము చేయువెఱ నాలోచించుచు నాతనిఁ బూజించుచుండెను.

శాంతా ఋష్యశృంగుల వివాహము

ఒకనాఁడు ఋష్యశృంగుఁడు పరమసౌందర్యనిధియు వినయవిద్యావివేకశీలయు నగు శాంతను జూచి యామె యద్వితీయ సౌందర్యమునకు ముగ్ధుఁడై రోమపాదునిఁ బిలిచి యామె యెవ రని యడిగెను. రోమపాదుఁ డామె దశరథునిపుత్త్రి యనియు దశరథుఁడు దనమిత్త్రుఁ డగుట నామెను బెంఛుకొనఁ దీసికొని వచ్చితి ననియు జెప్పెను. అంత ఋష్యశృంగుఁడు దశరథుని వృత్తాంతమడిగెను. రోమపాదుఁ డాతని చరిత్రమును దెల్పి తొల్లి దశరథుఁడు శాంతా స్వయంవరముఁ జాటుటయుఁ బరశురాముఁ డరుదెంచి యెల్లెరు రాజులతో దశరథునిఁ జంప నుంకించటయు వశిష్ఠమహర్షి కోరికపై దశరథుని కొమార్తెను బ్రాహ్మణునకే యిచ్చి వివాహము చేయవలెనని శాసించి చంపక విడిచి వెడలుటయుఁ జెప్పెను. ఋష్యశృంగుఁ డానందించి శాంతను వివాహ మాడఁగోరెను. రోమపాదుఁ డానందతరంగముల నోలలాడి వెంటనే వివాహ వైభవమును బురమందెల్లఁ జాటఁ బంపెను. తరువాత మహా వైభవముతో శాంతా ఋష్యశృంగుల వివాహము జరిగెను. ఋష్యశృంగుఁడును రోమపాదునివలన బహువిధ సమ్మానముల నందుచుఁ గాంచనమయ శయ్యాసనమున శాంతా సహితుడై రాజమందిరమునఁ జిరకాలము నివసించెను

ఈ సమయముననే రోమపాదునకుఁ బుత్త్రోత్పత్తి నిమిత్తమై ఋష్యశృంగుఁ డంగదేశమున నింద్రునిఁగూర్చి యొక యిష్టి చేయించెను. దానిమూలమున నింద్రుఁడు ప్రీతుఁడై రోమపాదునకుఁ బుత్త్రుఁ డుదయింప వరమిచ్చెను. తరువాత ఋష్యశృంగుని యాశీర్వచనముచే రోమపాదునకుఁ బుత్త్ర సంతానము కలిగెను. నాఁటినుండి రోమపాదుఁడు దినదినవర్ధమాన మగు భక్తి తాత్పర్యముతో ఋష్యశృంగుని శాంతను బూజించుచు వారి యడుగులకు మడుఁగు లొత్తుచుండెను.[1]

శాంతా ఋష్యశృంగు లయోధ్య కేఁగుట

ఇంతలో నయోధ్యానగరమున దశరథునిచేఁ బుత్త్ర కామేష్టిఁ జేయింపఁ దలంచి వశిష్ఠమహర్షి సనత్కుమారుఁడు తొల్లి చెప్పిన వృత్తాంత మంతయుఁ జెప్పి దశరథునిఁ బ్రేరేపించెను. దశరథుఁ డానందముతో వసిష్ఠుని బూజించి చతురంగ బల సమేతుఁడై యంగ దేశమునకు ఋష్యశృంగుని గొనివచ్చుటకు బయలు దేఱెను. సచివులును దాను నంగదేశము సొచ్చి దశరథుఁడు రోమపాదునింటి కేఁగి దీప్తాగ్నివలెఁ దేజరిల్లుచున్న ఋష్యశృంగుని దర్శించి యనేక విధములఁ బూజించెను. రోమపాదుఁడు దశరథు ననేక విధముల సమ్మానించెను. . అంత దశరథుఁడు, శాంతా సహితుండై ఋష్యశృంగుఁడును భార్యాసమేతుఁడై రోమపాదుఁడును దన గృహమునకు విచ్చేయవలయునని ప్రార్థించెను. శాంతా ఋష్యశృంగు లంగీకరించిరి. రోమపాదుఁడు తరువాత వచ్చెద నని కృతాలింగనుఁడై దశరథుని శాంతా ఋష్యశృంగులను వీడ్కొలిపి యయోధ్యకుఁ బంపెను.

శాంతా ఋష్యశృంగులతో దశరథుఁ డయోధ్యఁ బ్రవేశించుసరికి నగర మంతయు నద్భుతముగా నలంకరింపఁబడి యుండెను. పురసతులు లాజలు, అక్షతలు, దళత్కు సుమములు వారి పైఁ జల్లిరి. నానాజయవాదులై న జనులు మ్రొక్కిరి. అంతలో రాజప్రాసాదమును సమీపింపఁగానే రాజనిభాననలు మహితరత్నసమాన నీరాజనరాజితో నెదురువచ్చి వారికి హారతులిచ్చిరి. అంత దశరథుఁడు రథము దిగి ఋష్యశృంగుని గారవముతో మంగళతూర్యఘోషములతో లోనికి దీసికొనిపోయెను. పుణ్య స్త్రీలు శాంతాదేవి నంతఃపురమునకుఁ గొనిపోయిరి. కౌసల్యా కైకేయీ సుమిత్రాదు లమితానందముతో 'అమ్మా! శాంతా ! ఇఁక నీవు మా బిడ్డవు కావు. మాకుఁ బూజనీయవైన మహర్షి పత్నివి, వందనము లమ్మా!' యని మేల మాడిరి. శాంత చిఱునగవుతో వారిని గౌఁగలించుకొనెను. శాంతా ఋష్యశృంగుల కట ననుక్షణము నధిక పూజలు జరుగుచుండెను.

ఋష్యశృంగుడు దశరథునిచే నశ్వమేధ పుత్త్రకామేష్టులఁ జేయించుట

ఇట్లుండఁగా యజ్ఞనిర్వహణానుకూలమగు వసంతకాల మరుదెంచెను. బహుపాదములతోపాటు దశరధుని మనోవృక్షమును జక్కఁగాఁ జిగిర్చెను. అంత నాతఁడు ఋష్యశృంగుని జేరఁ బిలిచి పుత్త్రకామేష్టిచేయు నుద్యమముఁ దెలుపఁగా నాతఁ డంగీకరించెను, పిమ్మట పశిష్ఠమహర్షి యాదరమున దశరథుఁడు సరయూనదీ ప్రాంతమున నుత్తరముగా యజ్ఞశాల నిర్మింపించెను. అధ్వర సంభారము లన్నియు వెంటనే సమకూర్చెను. ఉత్తమోత్తములగు ఋత్విజులతోడను మహాత్ములగు మంత్రకోవిదులతోడను యజ్ఞము ప్రారంభమాయెమ. మంత్రులధిపునానతిని సర్వము నిర్వహించి యాగాశ్వమును విడిచిరి. సంవత్సరము గడచి తిరిగి వసంత మాసన్నమగు సరికి యజ్ఞాశ్వము సురక్షితముగా వచ్చి చేరెను. అంత దశరథుఁడు గురువరుఁడగు వశిష్ఠునిఁ బూజించి యజ్ఞభారము సమస్తముఁ బూనవలె నని ప్రార్థించెను. వశిష్ఠుని యాజ్ఞచే నతి కర్మఠులు నుత్తమోత్తములగు బ్రాహ్మణు లిష్టకాసహస్రములు దెచ్చిరి. కుండమండపవేది కాదులు, సత్రాగారములు , కాయమానములు మున్నగున వన్నియు నిర్మింపఁబడెను. జనకమహారాజు కేకయ రాజు సింధుదేశవిభుఁడు మున్నగువారాహూతులై వచ్చిరి. ధరణిసురు లెల్లరు విచ్చేసిరి. అంత వశిష్ఠప్రముఖులును భూసురోత్తములును ఋష్యశృంగునిఁ బురస్కరించుకొని యజ్ఞకర్మారంభమున విహిత క్రమమున నా యశ్వమేధమును సమాప్తి నొందించిరి. దశరథుఁ డనేక భూరిదక్షిణల బ్రాహ్మణోత్తముల సంతసింపఁ జేసెను. అంత దశరథుఁడు ఋష్యశృంగునిఁ జేరి " మహాత్మా! మీ దయావిశేషమున నధ్వరము పూర్తియైనది. ఇఁకఁదాముపుత్ర కామేష్టిఁ బ్రియమునఁ జేయుఁ" డని ప్రార్థించెను. ఋష్యశృంగుఁడు నంగీకరించి నానా మంత్రపూతముగా నాహుతుల నగ్నికిడుచుఁ బుత్త్రకామేష్టి చేయుచుండ నా పావనహోమాగ్ని వలనఁ బ్రాజాపత్యపురుషుఁడు దేవనిర్మితము నారోగ్యవర్ధనమును బుత్త్రోత్పత్తికరమును నగుపాయసము నొకపవిత్ర హేమపాత్రమునఁ దెచ్చి దశరథున కొసఁగి యంతర్హితుఁ డయ్యెను. ఋష్యశృంగుఁడు దశరథునిఁ బ్రియమారఁ బిలిచి యా పాయసము నాతని భార్యలకుఁ బంచి యిమ్మని చెప్పెను. ................................................................................................................... పాయసము కౌసల్యకు సగమును మిగిలినసగములో సగము సుమిత్రకును మిగిలినదానిలో సగము కైకకును ద్రావ నిచ్చి యవశిష్టమయిన యష్టమాంశమును మరల సుమిత్రకు నీయ దానిని వారు మువ్వురుఁ బ్రీతిమెయిఁ గ్రోలిరి. దీనిమూలముననే తరువాత గొంతకాలమునకు వారికిఁ గ్రమముగా శ్రీరామ భరతలక్ష్మణ శత్రుఘ్ను లుదయించిరి. పరమశోభాయమానమై యాగము సాంతము కాఁగా ఋష్యశృంగుఁడు శాంతాసహితుఁడై విభాండకుని యాశ్రమమునకుఁ బోయెను. విభాండకుఁడు పుత్త్రుని జగద్ధితమతి నానాఁడే దివ్యదృష్టిఁ దెలిసికొని యుండెఁ గావునఁ గొమరుని గోడలి నెంతయు నాదరించెను. వసిష్ఠున కరుంధతివలె, అత్రి కనసూయవలె, అగస్త్యునకు లోపాముద్రవలె శాంతయు ఋష్యశృంగుని సేవించి చతురంగుఁ డను నుత్తమపుత్త్రునిఁ గనెను.[2]

ఋష్యశృంగుని ద్వాదశవార్షికయాగము

తరువాత ఋష్యశృంగుఁడు కొంతకాలమునకు ర్వాదశవార్షికయజ్ఞము నిర్వర్తించెను. ఆ యజ్ఞమునకుఁ జూలాలైన సీతయు నామె ప్రియమునకై శ్రీరాముఁడు నతనికై లక్ష్మణుఁడు నుండి పోవుటచే వారుదక్క నందఱును విచ్చేసిరి. శుభయజ్ఞ పరిసమాప్తి యైనవెనుక నందఱు వెడలిపోయిరి.[3]

ఋష్యశృంగ స్మృతి

ఋష్యశృంగమహర్షి యొక్కస్మృతి కర్తగాఁ గాన వచ్చుచున్నాఁడు. ఆచారాశౌచ శ్రాద్ధ ప్రాయశ్చి త్తమునకు మితాక్ష రావరార్కస్మృతి చంద్రిక లీ స్మృతినుండి తత్సంబంధ శ్లోకముల నుదాహరించినవి. మితాక్షరమున శంఖుని దని పేర్కొనఁబడిన యొక శ్లోక మును అపరార్కము ఋష్యశృంగ స్మృతిలోని దని పేర్కొన్నది.[4] స్మృతిచం దిక “అపి నాససా యజ్ఞోపవీతార్థాన్ కుర్యాత్, తదభావే త్రివృతా సూత్రేన" అన్నవచనము ఈ స్మృతిలోని దని పేర్కొన్నది. సమగ్రమగు స్మృతి యింకను లభింపవలసియున్నది.

ఋష్యశృంగుఁడు మహోత్తమతపశ్శాలియై శ్రీరామాదుల లోకమునకుఁ బ్రసాదించిన పరమపుణ్యాత్ముఁడు కావున నాతని నామస్మరణ మతిపవిత్రము.


  1. భారతము - అరణ్యపర్వము.
  2. రామాయణము.
  3. ఉత్తరరామాయజాము.
  4. "పూర్వనష్టం తు యో భూమి మేకశ్చేదుద్దరేత క్రమాత్
    యథాంకంతు అతంతేన్యే దత్త్వాంశంతు తురీయతమ్.“