మహర్షుల చరిత్రలు/శ్వేతకేతుమహర్షి

మహర్షుల చరిత్రలు

శ్వేతకేతు మహర్షి

జననము

పూర్వము మహాతపస్వియు, మహాతేజస్వియు, మహాస్వాధ్యాయ వేత్తయు నగుఉద్దాలకుఁ డను మహర్షి యుండెను. ఆతఁడు మంత్ర ద్రష్టయు, మంత్రవేత్తయు, మంత్రమహితుఁడును. అతనికి ధర్మపత్నియందుఁ దొలుత సుజాత యనుకూఁతురు కలిగెను. యుక్తవయసు వచ్చినపిదప నుద్దాలకుఁ డామెను ఏకపాదుఁ డనుమహనీయ తపోనిధి కిచ్చి వివాహముఁ గావించెను. ఆ పుణ్యదంపతులకే అష్టావక్ర మహర్షి యుద్భవించెను. సుజాతకు అష్టావక్రుఁడు జనించిన వేళనే సుజాతతల్లియు ఉద్దాలకునిభార్యయు నగు సాధ్వికి నొక కుమారుఁడు కలిగెను. ఆతఁడు స్వచ్ఛధావళ్యయుత మగుశరీరముతోఁ బుట్టుటచేఁ దండ్రి యాతనికి శ్వేతకేతుఁ డనునామము నొసంగి జాతకర్మాదుల నొనరించెను.

మాతుల భాగినేయులు

సమానవయస్కులు సమానబుద్ధియుతులు నగు శ్వేత కేతుఁడు, అష్టావక్రుఁడు మాతులభాగినేయు లగుట సుజాతచేతను సుజాతతల్లిచే తను మిగుల లాలింపఁ బడుచుండిరి. జనకమహారాజు నాస్థానమున కేగి వందితోడి వాదమున నోడి యేకపాదుఁడు జలమజ్జితుఁడై యుండుటచే అష్టావక్రశ్వేతకేతు లిరువురు ఉపనీతులై ఉద్దాలకునికడనే సమస్త వేదశాస్త్రములు నభ్యసించుచుండిరి. అష్టావక్రుఁడు బాల్యముకతమున ఉద్దాలకుఁడే తండ్రి యనియు శ్వేతకేతుఁడు భ్రాత యనియు భావించు చుండెను. ఒకనాఁడు అష్టావక్రుఁడు చనవుబలిమిని ఉద్దాలకునియొడిలోఁ గూర్చుండెను. అదిచూచి శ్వేతకేతుఁ “ డోరీ ! నాతండ్రియొడిలో నీ వేల కూర్చుంటివి? నీవు నీ తండ్రికడకుఁ బొమ్ము” అని యాతనిని గెంటివేసి తాను దండ్రియొడిలోఁ గూర్చుండెను. అష్టావక్రుఁ డేడ్చుచుఁ దల్లికడ కేఁగి జరిగిన సంగతి చెప్పి తనతండ్రి యెక్కడఁ గలఁడో తెల్పుమని కోరెను. ఆమె జనకసభలో వాదమున నోడి జలమజ్జితుఁడై యాతని తండ్రి యుండె నని చెప్పెను. “ఐనచో నే నేగి నాతండ్రిని విడిపించి తెచ్చుకొందును. అనుమతింపు" మని తల్లినిగోర నామె "బాలవాక్యము బ్రహ్మవాక్యము. ఏమో ! తేజస్వియగుబాలుఁ డంతకుఁ సమర్థుఁడు కాఁడనుకొననేల?” యని యాతని కనుమతి నొసంగెను.

వెంటనే అష్టావక్రుఁడు మేనమామయగు శ్వేతకేతుని కడకుఁ బరుగునఁ బోయి యాతఁడు తన్ను గెంటివేసి యవమానించిన సంగతి యప్పుడే మఱచి, "మామా ! మన మిద్దఱము జనకచక్రవర్తిసభ కేగి వంది నోడించి నా తండ్రిని విడిపించుకొని వత్తము. రమ్ము. వందిని గిందిని పందిని జయింపలేమా మనము? ” అనెను. ఆతఁడును తప్పక పోదము రమ్మనఁగా ముక్కుపచ్చలారని యా ముద్దుబిడ్డ లిరువురుఁ జెట్టాపట్టాలు వేసికొని బాలసూర్యులవలెఁ బయలుదేఱి జనకసభను జేరి వారి వాక్చమత్కృతులచే ద్వారపాలురను జనకుని రంజింవఁ జేసిరి. అష్టావక్రుఁడు వాదమున వంది నోడించి జనకుని గౌరవము లంది తండ్రిని విడిపించుకొని తండ్రియాజ్ఞచే సమంగానదిలో మునిఁగి నిర్వక్రుఁడు దివ్యసుందరుఁడునై తనతోఁ దుల్యుఁ డని జనకాదులచే ననిపించుకొన్న మేనమామ యగుశ్వేతకేతునితో విజయియై యింటికి విచ్చేయఁగా నెల్లరు మాతులభాగినేయుల లోకాతీతశక్తుల కచ్చెరువందిరి.

శ్వేతకేతుఁ డచిరకాలముననే సర్వవేదశాస్త్రములను తద్రహస్యములను, ధర్మమర్మములను దెలిసికొని పున్నమచంద్రునివలె షోడశ కళాపరిపూర్ణుఁడై ప్రకాశింపఁ జొచ్చెను.

శ్వేతకేతుని విజ్ఞానము

శ్వేతకేతుఁడు బ్రహ్మచర్యదీక్ష వహించి మహాతపస్సు చేసెను. ఆ పిమ్మట నాతఁడు బ్రహ్మజ్ఞానమును గడించి వేదతత్త్వము, క్రియా స్వరూపము, కర్మఫలత్యాగములను, ఆత్మజ్ఞానమును సంపాదించెను. ఆతఁడు ప్రాజ్ఞులలో ప్రాజ్ఞుఁడు, పండితులలో పండితుఁడు, జ్ఞానులలో జ్ఞాని, నిష్ఠాగరిష్ఠులలో నిష్ఠాగరిష్ఠుఁడు తపస్వులలో తపస్వియై బ్రహ్మవర్చసము, జ్ఞానతేజము, విజ్ఞానప్రకాశము తన్నావరింప బాలసూర్యునివలెఁ బ్రకాశించుచుండెను.

ప్రాజ్ఞుఁ డగునుద్దాలకుఁడు రూపగుణవిజ్ఞానసంపన్నుఁడగు కొడుకును జూచి “నాయనా! నీవు వివాహయోగ్యుఁడవై యున్నావు. బ్రహ్మచర్యము, తపస్సు, విద్య, విజ్ఞానము, రూపము, గుణము - వీనిని సంపాదించినపిదప ఆత్మజ్ఞానమును గుర్తెఱిఁగిన విప్రుఁడు వినయ వివేకగుణశాలిని యగుకన్యను బరిణయమాడి యుత్తమగృహస్థధర్మమును పాటించి సర్వఋణములను దీర్చి సన్న్యస్తచిత్తుఁడై సర్వేశ్వర సాన్నిధ్య మందుట సద్ర్బాహ్మణలక్షణము కావున, నీవును పావనముగ జీవసము గడప గృహస్థుఁడవు కమ్ము" అని పలికెను. శ్వేతుకేతుడు తండ్రిని గాదనఁజాలక యుత్తమకన్యక లభింపఁగనె తాను దప్పక పరిణయమాడుదు ననిచెప్పి తండ్రి నలరించి బ్రహ్మచర్యవ్రతమును బరిపాలించుచునుండెను.

శ్వేతకేతుని వివాహము

ఆ కాలమున మహాతపస్వి, వేదవేత్త, శాస్త్రవిజ్ఞుఁడు, ఆచారవంతుఁడు, ధర్మజ్ఞుఁడు నగుదేవలమహర్షి యా పరిసరప్రాంతముననే నివసించుచుండెను. ఆ మహర్షికి ధర్మపత్నివలన సువర్చల యను నొక కూఁతురు జనించి చక్కనిచుక్కగాఁ బెరుగుచు పుత్తడి బొమ్మవలెఁ బొలుపారుచుండెను. ఆమె తండ్రికడ సర్వవిషయములందును జక్కని వై దుష్య మార్జించెను. అందచందములతో నద్వితీయముగ నలరారు నామెకు విద్యావినయవిజ్ఞానసంవద బంగారమునకుఁ దావి యబ్బిన చందమున నబ్బెను. ఇంతచక్కని చుక్కకు నింతవిజ్ఞానరాశికిఁ దగిన వరు నెక్కడనుండి తెత్తునా యని దేవల మహర్షి తలపోయుచుండెను . తండ్రితలపోఁత తనయ గుర్తెఱింగి " తండ్రీ ! నీవు నాకుఁ దగినవరు నన్వేషింపఁ దలపోయుచుండుట నే నెఱింగితిని. కాని, నాకొక్కకోరిక గలదు. అది నీవు తీర్చకతప్పదు. గ్రుడ్డివాఁడు గ్రుడ్డివాఁడు కాని వాఁడు ఏకకాలముననేయైన మహాత్ముఁ డెవఁడో యాతనికే నీవు నన్నీయవలయును. అన్యున కీయవలదు” అని పలికెను. అందులకు దేవలుఁడు “బిడ్డా! నీకోరిక లోకవిరుద్దము. అంధుఁడై కానివాఁడు, అంధుఁడు కాక యైనవాఁడు-చిత్రమైన మాటలు. అట్టివానిని నీవే చూచుకొనుము. వేదవిదులు, ఆచారవంతులు, ధర్మపరులు, తపశ్ళీలురునగు వటువరులను నేను బిలిపింతును. నీ కోరిక ననుసరించి వారిలో నొక్కనిని నీవే యెంచుకొను” మని పలికెను. సువర్బల యట్లే యొనర్పు మని తండ్రికిఁ బెప్పెను.

దేవలమహర్షి తనశిష్యుల నెల్లరినిఁ బిలిచి "వత్సలారా ! జన్మకుల రూపగుణప్రపర్తనలచే, నుత్తములై వేదాధ్యయనపరులై, బ్రహ్మచర్య వ్రతనిష్ఠులై , తల్లిదండ్రు లుండి వివాహేచ్ఛ గలిగిన వటువరులను సగౌరవముగాఁ దీసికొని రండు. వారిలో నొక్కనిని నాపుత్రిక యగు సువర్చల పరిణయమాడు నని చెప్పి యందుల కంగీకరించిన వారినే తీసికొని రం” డని వంపెను. దేవల శిష్యు లాశ్రమముల కేఁగి సువర్చలావృత్తాంతము, దేవలునికోరిక యెఱిఁగించి పెక్కురు వటువరులను దీసికొని వచ్చిరి.

దేవలుఁడు వారిని సమాదరించి సువర్చలం బిలిచి "తల్లీ ! వీరు వేదవేదాంగవేత్తలు, విద్యాసంపన్నులు, సత్కులీనులు, సచ్ఛీల యుతులు, వివాహసంతానేచ్చ గలవారు. మహావ్రతు లగువీరిలో నొక్కనిని నీవు వరింపుము" అని పలికెను. అందచందములతో నలరారు నా యిందువదన, బంగారమువంటి యొడలికాంతులు విరాజిల్ల, విద్యావినయవివేకవతియై వా రెల్లరికి నమస్కరించి “వటువరులారా ! మీలో అంధానంధుఁ డేకకాలముననే యైనమహనీయుఁ డెవఁడైన నున్న నాతనిని నేను వరించెదను. అన్యులను వరింపఁజాలను, మన్నింపుఁ" డని పలికెను. ఆమెమాటలు విని పెక్కురు తబ్బిబ్బై "యిది మేమి? అంధుఁ డనంధుఁ డెట్ల గును? అనంధుఁడంధుఁ డెట్లగును ! కన్య లక్షణ వతియే కానీ, వక్రబుద్ధి యని యామెగొంతెమ కోరిక చెప్పక చెప్పుచున్నది. ఈమెతో మనకేల ? ” యని మునికుమారు రెల్లరు వచ్చిన త్రోవఁబట్టి పోయిరి. కాని, తండ్రివనువున వచ్చి శ్వేతకేతుఁడు దేవలుని సమీపించెను.

దేవలుఁడు శ్వేతకేతు నధికముగ నాదరించి సువర్బలం బిలిచి " అమ్మా ! ఈతఁ డుద్దాలకపుత్రుఁ డగుశ్వేతకేతువు. ప్రాజ్ఞుఁడు, విద్యా వినయవివేకనిధి, తపస్వి, ధర్మజ్ఞుఁడు. బ్రహ్మనిష్ఠుఁడు. ఈతఁడు నీకుఁ దగినపతి యని నాకుఁ దోఁచుచున్నది. తరువాత నీయిష్ట” మనెను. సువర్చల యాతనిపైఁ దీవ్రదృష్టి పాఱించెను. ఆమె మాటాడకుండఁ గనే శ్వేతకేతుఁడు " సుందరీ ! యెందుల కీ సందియము? నేను నీకొఱకే వచ్చితిని. నీవు నా దానవే. సందియ మందకుము. నేను లోకవాసనలఁ దగులక లోకవిషయముల నంధుఁడనై యున్నాను. కాని సంశయరహిత మగుజ్ఞాన చక్షువుఁ గలవాఁడ నగుటఁ బద్మపత్రములవలె నాకను లెంత విశాలములో తిలకింపుము. ఇందువదనా ! నీవు న న్నందుము. నిన్ను నా డెందమునకు హత్తుకొందును. మఱియు వినుము. జగమంతయు మిథ్య. ఇందు కనుట, వినుట, తాకుట, మూర్కొనుట, మాటాడుట, కర్మలు చేయుట, మనస్సుచే సంకల్పించుట, బుద్దిచే సత్యము నెఱుంగుట మున్నగు కార్యకలాప మంతయు మిథ్య యని యే జ్ఞాననేత్రమునకుఁ దెలియునో ఆ జ్ఞాననేత్రము లేనివాఁడు గ్రుడ్డివాఁడు. అది నాకుఁ గలదు, కనుక నేను గ్రుడ్డిని కాను. మఱి గ్రుడ్డిని! ఎట్లన, లోకులదృష్టిలో వారికివలె నేను వస్తువులఁ జూచుట లేదు. అనఁగా వారియజ్ఞానదృష్టి నాకు లేదు. కావున, వారి భావనలో నేను గ్రుడ్డివాఁడను. ఈ విధముగ నొకేక్షణమున నేను గ్రుడ్డివాఁడను, గ్రుడ్డివాఁడను గానివాఁడను. ఇంకన వినుము. లోకదృష్టిని నేను నిత్యనైమిత్తికకర్మ లాచరించుచునే యున్నాను. కాని, ఆత్మదృష్టిని నేను నిష్క్రియుఁడను. ఆ కర్మలఫలము న న్నంటదు. కార్య మగుప్రపంచమునఁ గారణ మగుపరమాత్మను నేనే యని యెఱింగినవాఁడ నగుట నేను బరమశాంతుఁడనై యున్నాను. మఱియు నేను గర్మాచరణమునను గర్మఫలత్యాగమునను మృత్యువును జయించి యమృతుఁడనై జ్ఞానప్రాప్త మగునాత్మానందమున మదమాత్సర్యకామ క్రోధాదులు లేక ప్రశాంతస్థిరచిత్తుఁడనై తిని. నీకు నేనే భర్తను. నీవే నాభార్యవు. అది నా కిదివఱకే విదిత మగుట నింతదూరము వచ్చితిని. నచ్చితివా ? ” యని యూరకుండెను.

సువర్చల సిగ్గుపడి వెనుకకుఁ దగ్గెను. దేవలుఁ డానందించి “సువర్చలా! నచ్చెనా? తథా స్తనవచ్చునా!" యని పలుకరించెను. సువర్చల మఱింత సిగ్గుపడి లోనికేఁగి సిగ్గుపెందెరలఁ జీల్చుకొని నచ్చినవరుఁ డని తండ్రిని హెచ్చరించెను. దేవలమహర్షి వెంటనే సగౌరవముగా ఉద్దాలకుని, బంధువర్గమును , ఋషివర్గమును, శిష్యవర్గమును బిలిపించి ముహూర్తనిశ్చయ మొనరించి సర్వసంభారములను సమకూర్చి శాస్త్రోక్తముగ సర్వమునిజన సమక్షమున సువర్చలను శ్వేతకేతున కిచ్చి వివాహమహోత్సవము నిర్వర్తించెను. ఆ దివ్యమంగళ సమయమున “హృత్పుండరీక నివాసుఁడు, సర్వభూతాత్మకుఁడు, సర్వ శోభా సముపేతుఁడు నగుశ్రీహరియే యీ శ్వేతకేతురూపమున నిల్పి యున్నాఁడా? ఆ చల్లనితల్లి మహాలక్ష్మి భూలోకవాసుల లోచనములకుఁ బర్వము గావింప నిటు సువర్చలారూపమున విచ్చేసియున్నదా? లేనిచో ఈ దంపతుల ఆ రూపమునకు దివ్యమంగళవిగ్రహత్వ మెట్టులు వచ్చు?" నని యెల్లరు ననుకొనఁ జొచ్చిరి.

అంత దేవలుఁడు "శ్రీధవుఁ డగుమాధవుని ప్రీతికొఱ కీకన్యాదానముఁ జేసితిని. ఆతఁడు సంతోషించుఁగాక ! నాపుత్రియు నీపత్ని యునగు సువర్చల పతివ్రతయై పుట్టినయింటికీ మెట్టినయింటికి ఖ్యాతి గొనితెచ్చుఁగాక ! ” యని యామెను శ్వేతకేతునకుఁ దలిదండ్రులకు నొప్పగించెను.

ఆశ్రమనిర్వర్తనము

శ్వేతకేతుఁడు విధ్యుక్తవివాహకార్యకలాప మంతయు ముగిసిన పిమ్మట భార్యను దీసికొని తల్లిదండ్రులయు, అత్తమామలయు దీవెన లంది వేఱుచోట నాశ్రమమును నిర్మించుకొని యందు గృహస్థధర్మము నవలంబించెను. తొలుత నాతఁడు పత్నితో “కాంతా! వేదోక్తవిధులాచరించి మనము దేవపితృముని ఋణములను దీర్పవలయును. నేను నీవు నను భావములతో నున్నాము కనుక మన కీ కర్మకలాపము తప్పదు. నీవు నాతోను నేను నీతోను వీని నాచరించి పిదప జ్ఞానాగ్నియందు వానిని భస్మ మొనరింతము. ఉత్తము లేది చేయుదురో సామాన్యు లది చేయుదురు. అందుచేతనే జ్ఞానులును గర్మమానరు. జ్ఞానముచేతనే వారు మానినను అజ్ఞానులు కర్మమానుటలో మాత్రము వాని ననుసరింతురు. దానివలన లోకము కర్మభ్రష్టమై సర్వభ్రష్ట మగును. కావున, మనము లోకశ్రేయమునకు ఆత్మశ్రేయమునకును సద్గృహస్థకర్మము లాచరింత "మని పలికెను. ఆమె సర్వవిధముల నాతని యడుగుజాడలనుబట్టి నడచుచు నుత్తమ సాధ్వియై యుండెను. రత్నముప్రక్క రత్నముచేరిననే శోభించునుగాని మసిబొగ్గు చేరిన శోభింపదుగదా !

జ్ఞానబోధ

ఈ విధముగా సువర్చలాశ్వేతకేతు లనుపమాన ధర్మము లాచరించుచు నుత్తమపుత్త సంపదఁ బడసి పితరులను, అనేకయజ్ఞము లొనరించి దేవతలను, తపస్స్వాధ్యాయసత్ప్రవర్తనలచే ఋషులను సంతోష పఱిచి యా పుణ్యదంపతు లాత్మజ్ఞానమున ద్వంద్వాతీతులై భువిపై దివి చూచుచుఁ జూపుచు, అన్నిటికి సాక్షిభూతులై మాత్రము తా ముండి, మానవలోకమున నున్నను మాధవలోకమున నున్నట్లు వర్తించి యపూర్వ దంపతులై యలరారిరి.

ఒకనాఁడు సువర్చల భర్త నిట్లడిగెను. "బ్రహ్మజ్ఞా ! నీ వన నెవరు? పాంచభౌతికమై కంటికిఁ కనఁబడు నీ శరీరమా నీవు? కానిచో నీ వను దానితత్త్వమును నిపుణముగఁ దెలుపుము." ఆమెకు శ్వేతకేతుఁ డిట్లనెను. "కాంతా ! నీవు నన్ను బ్రహ్మజ్ఞా యని పిలిచితివి. అందులోనే నీవు నన్నెఱిఁగినట్లు స్పష్టము. ఇఁక వేఱే యడుగనేల?” "నీ దేహాంతర్గత మగుఆత్మ నడుగుచున్నాను” అని సువర్చల యనెను “అగుచో, ఆత్మ మాటాడదు, తినదు, కనదు, వినదు, పుట్టదు, చావదు. శరీరసంబంధమునఁ జేసి ఆత్మకు జననము కలదని యనుకొనునాఁడు దానికి బంధమును గలదు. నీవు నేను, నేను నేను సర్వము: నేను అని యనుకొనునాఁడు శరీరమే లేదు." అని శ్వేతకేతుఁడు చెప్పెను. ఆ మాటలు విని యామె " మహాత్మా ! నీ వింత ప్రాజ్ఞుఁడవై యుండియు నజ్ఞానివలె సమస్త కర్మలు నొనర్చుచున్నావు. సహధర్మచారిణి నగుట నేను ని న్ననువర్తించుచున్నాను. ఇందు నీ భావ మేమి? దయతో సెల విమ్ము” అని కోరెను. ఆతఁ దిట్లనెను. “సుదతీ! పెద్ద లాచరించినది పిన్నలకు ఒరవడి యగును. లోకవ్యవహారము సక్రమముగ నడచుట కెల్ల రును గర్మ లాచరింపవలయును. కర్మహీనతవలన జాతి నిర్వీర్యమై లోకము చిందరవందర యగును. ధర్మము నశించును. చిన్న చేఁపను మ్రింగు పెద్దచేఁపవలె బలవంతుఁడు బలహీనునిఁ గబళించును. సర్వలోక కర్త భర్త హర్త యగు పరాత్పరున కది యనిష్టము. మఱియు సర్వ జగత్సృష్టియు భగవంతునికిఁ గ్రీడామాత్రము. ఆతని విభూతు లనంతములు. అతని శక్తు లపారములు. సృష్టిస్థితిలయము లను పెనుగహ్వరముల జీవి చిక్కుకొని యున్నది. జననమరణసంసారరూప మగు బంధములఁ దెగద్రెంపుకొని యెవఁ డాత్మజ్ఞానము నందుచున్నాఁడో వాఁడు భగవంతునికిఁ బ్రియుఁడు. అట్లుగాక జనన మరణసంసారప్రవాహ మధ్యమునఁ గొట్టుకొనిపోవుచు దుర్మార్గుఁ డగునిర్భాగ్యుఁడు నరకకూపమున మ్రగ్గుచుఁ దనచుట్టునుగల బంధములఁ ద్రెంచుకొనుటకు బదులు పెంచుకొనుచుండును. దట్టముగ నలముకొన్న యజ్ఞానతిమిరమునఁ బడి యది తన యదృష్టవిశేష మని యహంకరించుచు నిర్భాగ్యుఁ డగు నరుఁడు నిత్యపతనము నందుచునే యుండును. కావున, దేహశుద్ధికొఱకు ఆత్మజ్ఞానవికాసముకొఱకు, లోకమువారికి ఒరవడి యగుట కొఱకు నేను సత్కర్మాచరణముఁ జేయుచున్నాను. దేహపతనపర్యంతము నట్లొనరించుచునే యుండవలయును.”

ఆ మాటలకు మిగుల నానందించి సువర్చల "దేవా! శబ్దము, అర్థము వీనిని వివరింపు" మని కోరెను. " అక్షర సంపుటి నుచ్చరింపఁగా వెలువడునది శబ్దము. ఆ శబ్దముచేతఁ దెలుపఁబడున దేదియో అది యర్థము. శబ్దార్ధములకు నిత్యసంబంధము లేదు. ఉచ్చారణనుబట్టి పరిస్థితులను బట్టి శబ్దార్థము మాఱుచుండును. కావున, వానికిసంబంధ మున్నది, లేదు ” అని శ్వేతకేతుఁ డనెను. "ఐనచో నది పరస్పర . విరుద్ధముగాలేదా?” యని సువర్చల పలికెను. "కాదు. వై రుధ్యమేమియు లేదు. నే ననుశబ్ద మాత్మపరమైనపుడు సత్యము, అనాత్మపరమైనపు డసత్యము. అందుచే నది సత్యము నసత్యమును. మఱియు బ్రహ్మ సత్యము. జగత్తు మిథ్య. మిథ్య యగు జగత్తు లేదా ? ఉన్నది. నిజమున కున్నదా ? లేదు. ఇది తథ్యమిథ్యాతత్త్వము. ఇది తెలిసికొనుట కష్టము. కావున, ఆత్మవాచ్యశబ్దార్థము పరమేశ్వరుఁడు, అనాత్మాశ్రితశబ్దార్థములు రెండును మిథ్య" అని శ్వేతుకేఁతువు బదులు చెప్పెను.

“ఆత్మ, అహంకారము వీనినిగూర్చి తెలుపు” మని సువర్చల యడుగఁగా శ్వేతకేతు విట్లు తెలిపెను. "కాంతా ! మట్టియందు ఘట మనుభావ మున్నట్లు, ఆత్మయందు అహంకారము కల్పితమైయున్నది. అచింత్యము, పరము నై నది, ఆత్మవస్తువు. దీనియందు “ నేను నాది, నీవు, నీది, ఇది' అనునవి కల్పితములు. ఈ భావమే అహంకారము. లోకమున నాకాశ మున్నది. కాని రెండింటికి సంబంధములేదు. అదే విధముగాఁ బరిశుద్ధ మగుపర బ్రహము (తెలుప, చూప, శక్యము కానిది) - నుండి జగ ముద్భవించినను దానికి దీనికిని సంబంధము లేదు. మఱియు, ఆకాశమును ముట్ట, పట్ట వీలు లేకపోయినను, వాయువును త్వగింద్రియము చేతను, వాసనను ఘాణేంద్రియముచేతను, చీఁకటి, వెలుఁగు, మేఘములు, నక్షత్రములు మున్నగువానిని చక్షురింద్రియము చేతను మానవుఁడు తెలిసికొనఁగలుగుచున్నట్లు సద్రూప మగు పర బ్రహ్మము ఆకాశమున కాకాశ మని చెప్పఁబడుచున్నను విష్ణ్వాద్యవ తారములచేఁ జూడఁబడుచు, బుద్ధిచేఁ జింతింపఁబడుచు నున్నది. జల మొక్కటే యైనను, అది ప్రవహించు తావులను బట్టి రుచి భేదములను బొందుచున్నట్లే ఆత్మవస్తువుకూడఁ బ్రకృతిసంబంధమువలన వివిధములుగాఁ దోఁచుచున్నది. ఎచ్చటిపరిశుభ్రజలమైనను ద్రావి మానవుఁడు తృప్తిపడునట్లు, ఏరూపమున భావింపఁబడుచున్న పరమాత్మను . సేవించియు నరుఁ డుత్తమఫలితమును బొందఁగలుగును. పర మాత్ముఁడు అవాఙ్మనసగోచరుఁ డయ్యు-సాధనోపదేశమార్గసూచక ఉపలక్షణవ్యాకృతిపద్ధతులచే నాతఁడు వేదవేద్యుఁ డగుచున్నాఁడు. పరిశుద్దజ్ఞానము ఆత్మవిషయికధ్యానముచేఁ గలుగును. దానివలన నుత్తమగతి కలుగును. పరమాత్మ విభూతులు బహుళములు. వాయుదేవుఁడు, అగ్నిహోత్రుఁడు, సూర్యభగవానుఁడుకూడఁ బరమాత్ము నెఱుంగరు. ఆ పరమాత్ముఁడు జగద్వ్యాపి. బ్రహ్మజ్ఞానసంపన్నులు మాత్రమే పరమాత్మ నెఱింగి యది ఆ మగుచున్నారు”

శ్వేతకేఁతుఁ డీ విధముగా నాయాబ్రాహ్మజ్ఞానవిషయములు సమయోచితముగా భార్యకుఁ దెలుపుచు నామెను జ్ఞానవంతురాలిని గావించెను. జ్ఞానసౌభాగ్యమును గాంచిన యా పుణ్యదంపతులట్లు చిరకాలము గృహస్థాశ్రమమున నుండి తుదకు సన్న్యస్తచిత్తులై గోవిందుని పదపద్మముల మనస్సులు నిలిపి మరణానంతర ముత్తమగతులను మోక్షసామ్రాజ్యమును జూఱగొనిరి.*[1]

శ్వేతకేతుతీర్థము

సమంగానది పొంత సోమకశిబి తీర్థముల సామీప్యమున శ్వేతకేతుమహర్షి తపము చేసినచోటు 'శ్వేతకేతుతీర్థ ' మని జగత్ప్రసిద్ధిగాంచెను. ఈ తీర్థప్రదేశమున సకలవృక్షములు సర్వకాల సర్వావస్థలయందు సకల ఫలపుష్పసహితములై బహు రమణీయములై యుండును. ఈ వవిత్రాశ్రమముననే వాగ్దేవత యగు సరస్వతి మానుషదేహధారిణియై శ్వేతకేతునకు దర్శన మొసంగి యాతనికడ నుండి కరుణించేను.†[2]



  1. *భారతము; మోక్షధర్మపర్వము.
  2. †భారతము ; ఆరణ్యపర్వము.