మహర్షుల చరిత్రలు/మృగశృంగమహర్షి
మహర్షుల చరిత్రలు
మృగశృంగ మహర్షి
(వత్సమహర్షి)
వత్సుని జననము
తొల్లి కృతయుగమున రథంతరకల్పమందు కుత్సుఁడను విప్రోత్తముఁడు విరాజిలుచుండెను. వేదశాస్త్రాదివిద్యల నేర్చి యాతఁడు కాలక్రమమున కర్దమప్రజాపతికన్యకలలో నొకతెను ధర్మపత్నిగాఁ బరిగ్రహించి గార్హస్థ్యధర్మముల నద్వితీయముగా నడపించుచుండెను. ఇట్లుండ నా మహనీయుని దయవలన గర్భము ధరించి యాతనిపత్ని నవమాసములు నిండినంత నొకసుపుత్రుని గాంచెను. ఆతనికి వత్సుఁ డను పేరిడి తల్లిదండ్రులు పెంచిరి. ఆతఁడు యుక్తవయస్సు గన్నంతనే ఉపనయన మొనరించి కుత్సుఁడు బ్రహ్మచర్యాశ్రమమును నడప నాతని నియోగించెను.
వత్సుని తపశ్చర్య
వత్సుఁడు బ్రహ్మచర్యాశ్రమధర్మముల నతిశ్రద్ధాభక్తుల నిర్వహించుచు దైవికముగా నొకనాఁడు కావేరీతీరమునకు వచ్చెను. సముద్రముఁ జేరునదులలో ఊదగ్వాహినులు పశ్చిమవాహినులు ప్రశస్తములనియు, అవి పవిత్రముచేయు భూభాగములు నివాసయోగ్యములనియు నెఱింగినకారణమున, పశ్చిమముఖముగాఁ బ్రవహించుకావేరీ పవిత్రతీరమున నాతఁడు నివసింపఁ దొడఁగెను. అతఁ డట నుండి శాస్త్రవిధుల ననుసరించి స్నానజప తపోధ్యానపరాయణుఁడై మూఁడు మాసము లుండి తత్త్వజ్ఞానసంపన్నుఁ డై నంత మమత్వమును విడనాడి బయలుదేఱి పోయి సహ్యజానది కుత్తరభాగమునఁ గలనారాయణాద్రియందు నివాస మేర్పఱుచుకొని తపశ్చర్యకుఁ గడంగెను.
వత్సునకు మృగశృంగుఁ డను పేరు కలిగినవిధము
నారాయణాద్రికి సమీపమునఁ గల్యాణతీర్థ మనుపవిత్ర తీర్థముండెను. ఆ తీర్థమునఁ బ్రతిదినము స్నానము చేసి యాతఁ డుగ్ర తపమునకుఁ గూర్చుండి ఆత్మజ్ఞానసంపన్నుఁడై యానందమున సర్వము మఱచి సమాధి నిమాలితాక్షుఁడై యుండెను. ఇట్లు కొంతకాల మగుసరి కాతనికి దేహస్మృతియే పోయెను. ఆతనిశరీర మెండుకట్టెవలె నిలిచియుండెను. ఆ ప్రాంతమున విహరించు లేళ్ళు ఆ తీర్థమునందలి నీళ్ళు త్రాగి తమశృంగములచే మోడువలె నున్న ఋషిశరీరమును ఱాయుచుండెడివి. ఆ మహనీయున కిది తెలియనే తెలియదు. ఇట్లనుదినము మృగశృంగముల ఱాపుడువడుచున్నను తెలియనిస్థితిలో నాతఁడు పెక్కేండ్లుండెను. సమీపమునఁ గల ఋషు లీచిత్రముఁ జూచి యాతనికి మృగశృంగుఁ డనుపే రిడిరి.
వత్సునకు విష్ణువు ప్రత్యక్ష మగుట
ఇ ట్లనేకవత్సరములు గడచినపిదప వత్సునితపమునకు మెచ్చి విష్ణుమూర్తి వచ్చి యాతనిసహస్రార మంటఁగనే వత్సుఁడు కమ్నలు తెఱిచి యెదుటఁ బ్రత్యక్షమైననారాయణునికి భయభక్తి శ్రద్ధావినయవిధేయతలతో సాష్టాంగనమస్కార మొనరించి, ఆనందవిశేషమున నొడలంతయు గగుర్పొడువ ఆనందబాష్పములు జలజల రాలఁ గడుభక్తి తో నాతని నిట్లు స్తుతించెను. "దేవాదిదేవా ! ధర్మసంస్థాపనార్థము నీవు భూమి నవతరించుచుందువు. విశ్వసృష్టిస్థితిలయములు నీచేతిలోనివి. ఒక్కఁడ వయ్యుఁ బెక్కు రూపమఃలఁ జెలువారు చిత్స్వరూపుఁడవు. నీవు అణువుకంటె నణువవు; మహత్తుకంటె మహత్తువు. అమేయుఁడవు. నిర్వికారుఁడవు. నిర్గుణుఁడవు. నిన్ను నేను శరణుజొచ్చెదను. నన్ను నీవు కాపాడుము."
హరి కరుణించి యాతనితో నిట్లనెను: వత్సా ! నీ భక్తికి మెచ్చితిని. నీ తపశ్శక్తికి దర్శన మొసంగితిని. నీవు భవిష్యజ్జన్మమున ఋభు వనుమహర్షివై జన్మించెదవు. అది నీకుఁ గడపటిజన్న. నేఁటివఱకు నీవు బ్రహ్మచర్యమున ఋషుల సంతోష పెట్టితివి. ఇట్లే యజ్ఞములచే దేవతలను సంతానముచే పితృదేవతలను సంతోషపెట్టుము." వత్సుఁ డమితానందమంది పరమేశ్వరుని యవ్యాజవాత్సల్యమున కంజలి ఘటించి యాతని నా తీర్థమున నిలిచియుండఁ బ్రార్థించెను. శౌరి యట్లే యని యాతని ననుగ్రహించి యదృశ్యుఁ డయ్యెను.
మృగశృంగుఁ డింటి కేఁగి తలిదండ్రులకు జరిగిన సంగతి యంతయుఁ దెలియఁజెప్పి వారి నానందపఱిచి వారికి సేవచేయు చుండెను. కుత్సుఁ డొకనాఁడు తనమిత్రుఁడైన ఉతథ్యునకుఁ దన పుత్రుని వృత్తాంతము:ను వినిపించెను. ఆతఁ డమితానంద మంది తన కూఁతురు సువృత్త యనునామె మూఁడు సంవత్సరము లట్లే మాఘమాసస్నాన మాచరించి వ్రతము సలిపె నని వివరించి సువృత్తను వత్సున కిచ్చి వివాహముచేయ నూహించెను. కుత్సుఁ డాతనియూహ గ్రహించి తనపుత్త్రున కాతనిపుత్తి క నిమ్మని ప్రార్థించెను. ఉతథ్యుఁడు తప్పక యిచ్చెద నని వాక్రుచ్చెను. ఆనందాతిశయమునఁ గుత్సుఁ డింటి కేఁగి సుతుఁ డగువత్సునకు జరిగిన సంగతిఁ దెలిపెను. వత్సుఁడును దనయంగీకారమును దెలిపెను.
కాని, దైవవశమున నింతలో నొకమహావిపత్తు సంభవించెను. ఒకనాఁ డరుణోదయమున సువృత్త మువ్వురు చెలికత్తెలతోఁ గూడి కావేరీస్నాన మొనరించి తిరిగి వచ్చుచుండఁగా, నొకమదగజము పరుగు పరుగున వారిపైకి రాఁజొచ్చెను. దానిం గని యడలిపోయి పరుగెత్తుచుండఁగాఁ బ్రమాదవశమున నొక పాడునూతఁ బడి సువృత్త చెలికత్తెలతోఁ గూడ మరణించెను. ఈ దుర్వార్త శరవేగమున వచ్చి కొందరు వత్సునకుఁ దెలిపిరి. వత్సుఁడు వారిని బ్రదికింతు ననియు పారిశరీరములను జాగ్రత్తగాఁ గాపాడుచుండుఁ డనియుఁ దెల్ఫి యా వార్త దెచ్చినవారిని బంపి తాను సహ్యజ కేఁగి యందు కంఠముదాఁక నీటిలో నిలఁబడి యేకాగ్రతతో మృత్యుదేవతనుగూర్చి జప మొనరించుచుండెను.
ఇంతలో మదగజము పరుగుపరుగున వచ్చి యా మునిని సమీపించి తనతొండముతో నాతని నెత్తుకొని నెత్తి నిడుకొనెను. వత్సుఁ డడ లక తనమాఘస్నానపుణ్యము నా యేనుఁగుతొండమున ధారవోసెను. వెంటనే ఆ యేనుఁగు తనశరీరమును విడిచి దివ్యశరీరమున నాకాశమున కెగిరి తనపూర్వజన్మవృత్తాంత మాతని కెఱింగించి వెడలిపోయెను.
తనపట్టు విడువక వత్సుఁడు నీటిలోఁ దపము కొనసాగించుచు మృత్యుదేవత నిట్లు ప్రార్థించెను : "ఓసంజ్ఞాతనూభవ ! క్రియాసాక్షి ! ధర్మస్వరూపా ! అధర్మశాస్తా ! వై వస్వత ! కరాళవదన ! ప్రలంబోష్ఠ ! దక్షిణదిఙ్నాథా ! దండధారీ ! మహిషవాహనా ! దీప్తాగ్ని నేత్రా ! సాధు ప్రసన్నా ! అంజనపర్వతసంకాశా! అప్రమేయా ! సంయమనీ పురీశ ! శమనా ! యమునా సహోదరా ! నాకుఁ గన్పట్టుము. " ఇట్లు ప్రార్థింపఁ బ్రార్థింప యముఁడు ప్రత్యక్షమై "వత్సా! నీ తపమునకు మెచ్చితి. నీ కేమి కావలయునో కోరుకొను” మనెను. వత్సుఁడు " దేవా ! చనిపోయిన సువృత్త చెలికత్తెలతోఁ గూడ తిరిగి జీవించునట్లనుగ్రహింపు” మని ప్రార్థించెను. యముఁ డట్లే యగు నని వర మిచ్చి యంతర్హితుఁ డయ్యెను.
వత్సుఁడు వెంటనే బయలుదేఱి సువృత్తాదుల శరీరము లున్న కడకు వచ్చి చేరెను. ఆతఁడు వచ్చుసరికి వారు లేచి కూర్చుండిరి. వారిబంధువు లెల్లరు చనిపోయినవారు తిరిగివచ్చుట వింతలకెల్ల వింత యని యపరిమితానంద మందిరి. అప్పు డాకన్యకలు తాము యమలోకమున కేగి తిరిగి వచ్చుటఁ జెప్పి యమలోకమును సవిస్తరముగ వర్ణించి యెల్లరి కానందాశ్చర్యములఁ గలిగించిరి.
మృగశృంగుని వివాహ వృత్తాంతము
పిదప, ఉతథ్యుఁడు మునీశ్వరుల నెల్లర నాహ్వానించి తనపుత్త్రి యగుసువృత్తను మృగశృంగమౌని కిచ్చి పరిణయము గావించు ప్రయత్నమున నుండఁగా, ఆమె చెలికత్తెలు మువ్వురునువచ్చి “మునీంద్రా ! మేము మువ్వురమును నిన్నే భర్తగా భావించితిమి. మమ్మును నీవు పరిణయమాడ నీకు క్షేమము కలుగును. నీ వందు కంగీకరింపనియెడల మేము ప్రాణత్యాగము చేయుదు” మని మృగశృంగునితో వాక్రుచ్చిరి. వత్సుఁ డాశ్చర్యభయవిహ్వలుఁడై యేమిచేయుట యని డోలాందోళిత మానసుఁడై యుండ వ్యాసమహర్షి విచ్చేసి యందు దోషములేని దని నల్వురను వివాహమాడి సుఖింపుమని యాదేశించి సౌభరిమహర్షి మాంధాతృచక్రవర్తి కూఁతుండ్ర నేఁబదిమందిని వివాహమాడుట, చంద్రుఁ డిరువదియేడ్గురను పెండ్లిచేసికొనుటయు నుదాహరించెను. వత్సుఁ డాతని పాదములకు మ్రొక్కి యానల్వురు కన్యకా మణులను వేదో క్తవిధిని వివాహమాడెను.
అనంతరము మృగశృంగుఁడు నలువురు భార్యలను దీసికొనిపోయి యాశ్రమము నిర్మించుకొని యందు వారితో గార్హస్థ్యధర్మము లాచరించుచు వారితో నిష్టోప భోగము లనుభవించుచుండెను.
మృగశృంగుని సంతానము
ఇట్లు కొంతకాల మగుసరికి మృగశృంగుని కృపవలన గర్భము ధరించి సువృత్త నవమాసములు నిండినపిదప నొక్క పుత్త్రునిం గాంచెను. భూతభవిష్యద్వర్తమానవేది యగు మృగశృంగుఁడు తపోనిష్ఠాగరిష్ఠుఁడై యుండు నా బాలుని దేహంబును మృగములు రాచుకొను ననెడియర్ధము సూచితముగా నాతనికి మృకండుఁ డని నామకరణము చేసెను.
ఇదేవిధముగా మృగశృంగమహర్షి దయవలన కమల విమల, సురస యనుమిగిలినమువ్వురు పత్నులును గర్భములుదాల్చి కాలక్రమమున మువ్వురు సుతులను గాంచిరి. వారిలో కమలకు జనించిన కొమరుఁడు ఉత్తముఁ డనియు, విమలకు జనించిన పుత్రుఁడు సుమతి యనియు, సురసకుఁ గలిగిన కొడుకు సువ్రతుఁడనియు నన్వర్థ నామధేయముల ధరించిరి.
కొంతకాల మైనపిదప యుక్తవయస్సు రాఁగానే మృకండుమౌని ముద్గలమహర్షికూఁతు రగు మరుద్వతిని బెండ్లాడి తపోగృహస్థజీవనము గడప నారంభించెను. ఉత్తముఁడు కణ్వముని పుత్రిక యగుకుశను, సుమతి సుమతి యనుమునికూఁతురగు సత్యను, సువ్రతుఁడు పృథు పుత్త్రిక యగు, ప్రియంవదను బరిణయమాడి గృహస్థులై రి.
మృగశృంగుఁడు మోక్షమందుట
మృగశృంగమహర్షి యట్లు పుత్త్ర స్నుషా సహితుఁడై సకల సౌఖ్యము లనుభవించి మాఘమాసములం దుషఃస్నానములంజేయుచుఁ దపోవ్రతమును నడపెను. ఆ పిదప విరక్తి జనింప నాతఁ డెల్ల రను విడిచి తపోవనమున కేఁగి సర్వభూతములను ఆత్మసామ్యమునం గనుచు మృగములతోఁ గలిసి నిర్భయముగఁ జరించుచుఁ బరమశాంతి యుతుఁడై కాలము గడపెను.
అంత్యకాలమున మృగశృంగమహర్షి ఆశ్రమమునఁ దనశరీరమును ద్యజించి బ్రహ్మపదమును గాంచి ప్రళయకాలము వఱకు సుఖముగా నుండి యా పిదప శ్వేతవరాహకల్పమున అజపుత్రుఁడుగ ఋభు వనుపేర భూలోకమున జనించి నిదాఘుఁ డనువాని నుద్దరించి తుదకు మోక్షసామ్రాజ్యమును జూఱగొనెను.
ఆ పిమ్మట మృకండుఁడు తనకు సంతానము కలుగని కారణమునఁ దల్లులతోడను భార్యతోడను బయలుదేఱి విశ్వేశ్వర రాజధాని యగు కాశీపట్టణమును జేరి గంగాస్నానాదికృత్యములను యథావిధిగ నొనర్చి డుంఠివిఘ్నేశ్వరునిముందుఁ దనపేర శివలింగమును బ్రతిష్టించెను. దానిముందు సువృత్త సువృత్తేశ్వరలింగమును, దానికిఁ దూర్పు దెసను కమల కమలేశ్వరలింగమును, విమల విమలేశ్వరలింగమును. సురస సురసేశ్వరలింగమును, మరుద్వతి మణికర్ణికకుఁ బడమటి దిక్కుగా మరుద్వతీశ్వరలింగమును బ్రతిష్ఠాపించిరి.
మృకండీశ్వరుని దర్శించుటవలన సర్వకార్యసిద్ధి, కాశీవాసమును; సువృత్తేశ్వరుని దర్శించుటవలన సద్వృత్తి, నిర్విఘ్నతయును; కమలేశ్వర దర్శనమున సర్వకామసిద్ధియు; విమలేశ్వర దర్శనమున విమలజ్ఞాన ప్రాప్తియు; సురసేశ్వర దర్శనమున సుర సామ్రాజ్యలాభమును కాశీ మృతియు; మరుద్వతీశ్వర దర్శనమునఁ బునర్జన్మరాహిత్యము సిద్ధించును.
అట్లు కాశిని సేవించి మృకండుమాతలు వృద్ద లగుటమణికర్ణికా తీర్థమున మాధ్యాహ్ని కస్నానము లాచరించి శ్రీవిశ్వేశ్వరాలయమున కేగి ప్రదక్షిణము లొనర్చుచుఁ గన్నులు తిరుగ నేలపైఁ బడిపోయిరి. అపుడు విశ్వేశ్వరుఁడు వారికర్ణములఁ బ్రణవమంత్రమును జపింపఁగా వారు తనువులు వీడి కైలాసమునకేగిరి.
మృకండుఁడు మాతలకు శ్రద్ధాభక్తులతో నూర్ధ్వదై హికక్రియ లాచరించి తన భార్యతో నచ్చటనే యుండిపోయెను. అట నాతఁడు దినదినము గంగాస్నానము, విశ్వేశ్వరసేవ యొనరించుచుండ కాశీశున కాతనిపైఁ గరుణగలిగి వలసినవర మొక్కటి కోరుకొమ్మనెను. అతఁడు విశ్వేశ్వరునకు మ్రొక్కి యొక్క పుత్రు నిమ్మని ప్రార్థించెను. అంత శివుఁడు షోడశవర్షములు మాత్రమే బ్రదుకు సత్పుత్రుఁడు కావలయునా లేక చిరకాలజీవియగు దుష్పత్రుఁడు కావలయునా యని యడిగెను. మృకండుఁ డప్పుడు షోడశసంవత్సరజీవి యైనను సత్పుత్త్రుఁడే కావలయు నని కోరుకొనెను. విశ్వనాథుఁ డాతనికిఁ గోరిన వర మిచ్చి యదృశ్యుఁ డయ్యెను.
తరువాత మరుద్వతి మృకండుని కతమున గర్భముధరించి నవమాసములు మోసి యొక్క పుత్రునిం గనియెను. ఇతఁడే మార్కండేయ మహర్షి. ఈతఁడు తరువాత మృత్యువును జయించి సర్వలోకారాధ్యుఁడు చిరంజీవి యయ్యెను. ఈ విధముగ జగద్విఖ్యాతి గాంచిన మార్కండేయమహర్షి మృగశృంగమహర్షి పౌత్రుఁడు.