మహర్షుల చరిత్రలు/బృహస్పతిమహర్షి

మహర్షుల చరిత్రలు

బృహస్పతిమహర్షి

జననము

కర్దమప్రజాపతి దేవహూతివలనఁ దొమ్మండుగురు కూఁతుండ్రను గాంచి యా నవకన్యకామణులను నవబ్రహ్మలకిచ్చి వివాహ మొనరించెను. అందు శ్రద్ద యనునామె అంగిరసునిఁ బెండ్లియాడి యాతని ధర్మపత్నియై చిరకాలము పతిశుశ్రూష యొనరించెను. ఆ పుణ్యదంపతుల కడుపునఁ బుట్టినమహనీయులు ఉతథ్యుఁడు, బృహస్పతి, సంవర్తుఁడును.

వీరిలో బృహస్పతి పుట్టుకతోడనే లోకాతీత మగు బుద్దివై భవమును సంపాదించి మించెను. ఉతథ్యుఁడు తీర్థయాత్రా ప్రవణుఁడు, తపఃప్రియుఁడు నయ్యెను. సంవర్తుఁడు మహాయోగీశ్వరుఁడు, జ్ఞాన సంపన్నుఁడు నయ్యెను.

బృహస్పతి శాస్త్రవేదియైన విధము

తొల్లి కల్పాదియందు సప్తమహర్షులగు మరీచి, అత్రి, అంగిరుఁడు, పులహుఁడు, పులస్త్యుఁడు, క్రతువు, వసిష్ఠుఁడును స్వాయంభువమనువును విష్ణుమూర్తి నుద్దేశించి చిరకాలము మహాతపము చేసిరి. వారికి విష్ణువు అదృశ్యరూపమున నిట్లు చెప్పెను. "వత్సలారా! మీరు నన్ను ధర్మశాస్త్రబుద్ధులై యాశ్రయించితిరి. భారతి మీ యందు నిలిచి సకలలోకహితకరమును మర్యాదా ప్రవర్తకము నగు ధర్మశాస్త్రము మీకుఁ గరతలామలకము నొనరించును. దాని నెల్ల లోకములవారు శిరసా వహింతురు. మీరు మహోత్తమ మగు నీ శాస్త్రసారమును అంగిరసునికిఁ బుట్టి మహామతియై పర్ధిల్లు బృహస్పతి యందుఁ బ్రతిష్ఠింపుఁడు. బృహస్పతి యీ శాస్త్రరహస్యములను నా భక్తుఁడై జనించు ఉపరిచర వసువునకు బోధించును. ఆతఁడు దానినిఁ జక్కగ ననుష్ఠించి లోకముల నిలుపును." ఇట్లు చెప్పి విష్ణు వదృశ్యుఁ డయ్యెను. ఆ పిదప సప్త మహర్షులు ధర్మసంహితబుద్ధు లైరి. కాలక్రమమున బృహస్పతి జన్మించినపిదప సప్తమహర్షులు విచ్చేసి విష్ణుమూర్తి యాజ్ఞ ననుసరించి సకలధర్మశాస్త్ర రహస్యములను బృహస్పతి కుపదేశించి వెడలిరి. బృహస్పతి ఇందువలన బుద్ధిమంతులనెల్ల బుద్ధిమంతుఁ డయ్యెను. *[1]

దేవగురుత్వము

సర్వశక్తిసంపన్నులు, ప్రజ్ఞానిధు లయ్యు దేవతలు తమకుఁ దగినగురువు లేకపోవుటవలనఁ దగినంతగా రాణింపలే కుండిరి. అపుడు దేవత లందఱును తమకు గురువును బడయ లోకము లెల్ల గాలించిరి. భార్గవవంశమువాఁ డగు శుక్రాచార్యుఁడు, ఆంగిరసుఁ డగు బృహస్పతియు నిరువురే లోకమునఁ గల గురువులలో నగ్రేసరు లని తెలిసికొని, వారు చిరకాల మాలోచించి బృహస్పతియే యిరువురియందు మిన్న యని నిశ్చయించుకొనిరి. అపుడు వారందఱును శ్రద్ధాభయ భక్తి వినయవిధేయతలతో విచ్చేసి బృహస్పతి నాశ్రయించి కోటి మ్రొక్కులు మ్రొక్కి, “మహాత్మా! అజ్ఞానాంధకారమును విజ్ఞానప్రకాశమునఁ బటాపంచలు చేయు సుజ్ఞానభాస్కరుఁడే గురువు. గురుకృపాలబ్దమగు విద్యయే శోభించును. ధర్మార్థకామమోక్షములకు, దై నందినవ్యవహార దక్షతకు గురువే పెన్నిధి. చుక్కానిలేని నావవలె గురువు లేని విద్యార్థి కాంక్షాపారమును గాంచనే లేఁడు. విబుధమణి వగు నీవే దేవతలకుఁ దగిన గురుడవు. కావున అవ్యాజకృపాయ త్తచిత్తమున నుత్తమ గురుఁడవై నీవు మాకు శ్రేయ మొనగూర్పు” మని ప్రార్థించిరి.

బృహస్పతి యాలోచించి “బంగారపుఁ బళ్లెమునకైనను గోడ చేరుపు కావలయునుగదా! లేనినాఁ డది శోభింపదు. జగజెట్టులగు దేవతాధిపతులకు గురుత్వము వహించుటకంటె నాకు వాంఛింపఁ దగిన దేమున్నది? నేను గురువు నగుదు నన్న వా రంగీకరించి యుండక పోవచ్చును. వారంతట వారే వచ్చి ప్రార్థించినపు డంగీకరించుటే యుత్తమమార్గము. దేవగురుత్వము నా ప్రజావై భవమునకుఁ దగిన స్థానము. సిరి రా మోఁకా లొడ్డుట యవివేకము. కావున నంగీకరిం చెద" నని నిశ్చయించుకొని, యైనను వారిని గొంచెము పరీక్షింపఁ దలఁచి యిట్లనెను. "దేవతలారా! దిక్పాలుర వెంటఁబెట్టు కొని మీ యేలిక యగు నింద్రునితో నిట్లు చనుదెంచి సామాన్యుఁడనగు నాకు గొప్పతన మారోపించి గురుత్వము వహింపు మని న న్నర్ధించుట నా యదృష్టము. ఐనను నా కించి ద్జ్ఞతను నేను విన్నవించుకొనుచున్నాను. మీకుఁ దగిన గురువులు నా కంటె మిన్నలు ఎందఱో కలరు. భార్గవుఁడగు శుక్రాచార్యునో భ్రాతృవ్యుఁ డగుసంవర్తమునినో మీ రెన్ను కొనుట యుత్తమము. కాని వారికంటె దీసికట్టును నన్నుఁ గోరుకొను టేమి వివేక?" మని వాదించెను. దేవత లంద ఱొక్క పెట్టున గురుత్వ సామ్రాజ్య సింహాసనము నధిష్ఠించుట కాతని కంటె నధికార్హత గలవా రింకొక్కరు లే రని యందుల కంగీకరింపు మని యాతనిని మఱిమఱి బతిమాలుకొనిరి. తుద కాతఁడు వల్లె యన మహాప్రసాద మని దేవతలు జయజయధ్వానము లొనరించిరి. పిదప దేవతలు దివ్య వైభవముగా దిక్పాలకలు ఇరువై పులఁ గొలువ, అప్సరోవనితలు రాగతాళలయ సంయుక్తముగ నాట్యములు సలుపుచు నడువ, ఇంద్రుని యైరావతమున నింద్రునికి ముం దాసీనునిఁ జేసి మిగిలిన బృందారకులు మందార వృష్టిఁ గురియించుచు నడువ, బృహస్పతిని దేవనగరమునకుఁ గొనిపోయి గురుసింహాసనాసీను నొనర్చి పట్టాభిషేకముచేసి యొక రొకరే యాతని పాదములకు మొక్కిరి.

బృహస్పతి తనకు దేవతలవలన జరిగిన నిరుపమాన గౌరవమున కలరి వారితలలో నాలుకవలె మెలఁగుచుఁ గంటిని ఱెప్పవలెఁ గాపాడుచుఁ దనబుద్ధివై భవమునకుఁ దార్కాణగా వారికిఁ దగుసమయములఁ దగు నాలోచన లొనరించుచు నుండెను.

ఇది యిటు లుండ భృగువంశజుఁ డగుశుక్రాచార్యుఁ డవక్రబుద్ధి విక్రమమున నధికుఁడ నని గర్వించి దేవతలు గురువు నన్వేషించుచున్నా రని విని వారు తప్పక తన కడకే వచ్చి యర్థించి తననే గురువుగా గై కొందు రని యాశించి యుండెను. ఇంతలో దేవతలు బృస్పతిని గురువుగాఁ గైకొని దివ్యవై భవమున నమరావతికిఁ గొనిపోయి పూజించు చుండి రని యెఱిఁగి దేవతలపై మండిపడి వారి శత్రువులగు రాక్షసులకుఁ దాను గురువై యెల్ల దేవతలకును బృహస్పతికిని బ్రక్కలోని బల్లెమువలె నుండి తన కసి దీర్చుకొన నెంచి యుండెను. దేవతలు గురువును సంపాదించి యాతని యనుగ్రహమున గొప్పవారు కానున్నారని విని రాక్షసులును గురుసంపాదనలో నిమగ్ను లైరి. వారును వెదకి వెదకి శుక్రాచార్యునిఁ జేరి ప్రార్థించి యాతనిని దమగురువుఁ జేసికొనిరి. శుక్రుఁడును దేవతలకుఁ దగినబుద్ది చెప్పుట కిదియే మార్గ మనుకొని రాక్షసగురు వయ్యెను.

బృహస్పతి ఉపరిచరవసువునకు గురు వగుట

పూర్వము వసు వను నొక రా జుండెను. ఆతఁడు సత్య శమ దమము లగు సుగుణములకుఁ బుట్టినిల్లు. విష్ణుభ క్తికిఁ బెట్టినది పేరు. క్రతుకుతూహలమునకుఁ దావు. బ్రాహ్మణప్రియతకు నిధానము. ఆతఁడు రాజ్యము చేయనొల్లక వనమున కేగి మహాతప మొనరించు చుండ నింద్రుఁ డాతనికడ కేగి యాతనితోడి మైత్రి నెఱపి “రాజా? నీవు నాకు మిత్రుఁడ వగుము. మా వీటికి వచ్చుచుఁ బోవుచుండుము. భూపరిపాలన మానకుము. నీకు దివ్యత్వ మిచ్చితిని. నీకు రాకపోకల కొక రత్నవిమాన మిచ్చితి" నని యొసంగి యదృశ్యుఁ డయ్యెను. వసురాజు దానిని గైకొని భూమి నేలుచు స్వర్గమున కా విమానమున రాకపోక లొనరించుచుండి యింద్రమితుఁడై “ఉపరిచరవసు” వనఁ బరఁగెను.

ఉపరిచరవసువు ధర్మపరిపాలన మొనరించుచు బృహస్పతికి శిష్యుఁడై యాతనివలన ధర్మశాస్త్రప్రపంచమును గరతలామలక మొనరించుకొనెను. గురుననుమతిఁ గొని యొకప్పుఁ డా రాజొక యశ్వమేధ యాగ మారంభించెను. ఆ యజ్ఞమున సప్తమహర్షులు వారితో సమానులైన మఱికొందఱు మహర్షులు ఋత్విక్కులైరి. బృహస్పతి ఉపదర్శనము నడపింపఁ జొచ్చెను. ప్రజాపతి పుత్తులగు ఏకతుఁడు, ద్వితుఁడు, : త్రితుఁడు నను మునీంద్రులు సదస్యులైరి. రాజు పశుహింస మాని యారణ్య కోద్గీతమైన వాక్యసముదాయమున విష్ణుమూర్తిని యాగభాగమును గాన నాహ్వానించెను. కరుణామయుఁ డగుహరి ఉపరిచరవసువున కొక్కనికే కానవచ్చి యాగభాగమును గొని చనెను. బృహస్పతి తనకుఁ గానరాకుండ హరి పోయె నని దుఃఖించి కన్నీరొలుక వాపోయెను. సదస్యులగు ఋషిసత్తములు రాజు నాతని నూఱడించి హరి యందఱకు లోచనగోచరుఁడు కాఁడనియు, ఐకాంతికభక్తులై యనేక వేలసంవత్సరములు భజించినవారికే యాతఁడు కానఁబడు నని తెలిపిరి. బృహస్పతి యూఱడిల్లి తనశిష్యుని యదృష్టమున కానందించి యా యాగము సువ్రయోగముగా నడపించెను.*[2]

బృహస్పతి యింద్రునికి బోధించిన ధర్మములు

సురాధిపుఁ డగునింద్రుఁడు సురగురు వగు బృహస్పతి నాశ్రయించి సర్వధర్మములు నెఱింగెను. ఆ సందర్భమున “మాట మంచితనమే సమస్త ప్రాణులను సంతోషపెట్టును. దానివలన యశము కలుగును. అది కలవానికి సర్వభూతజాలము సంతోషమున స్వాధీనమగును. చిఱునవ్వు ముఖమునఁ జిందులాడ హితముగను మితముగను మాటలాడ నేర్చినవాని కెల్లరును బ్రసన్ను లగుదురు. మృదు మధుర హితవచనముల నేమి చేసిన నెవ్వనికిని బాధ కలుగదు. మాటమంచి తనమున హింసించినను హింస పొందువాఁడును సంతసించు" నని తెలిపెను.

మఱియొకప్పు డింద్రుఁడు బృహస్పతిని "బ్రాహ్మణోత్తమా! నే నేమి చేసిన, నెట్లు ప్రవర్తించిన జయలక్ష్మీ నన్ను విడనాడదో తెలుపు" మని ప్రార్థించెను. బృహస్పతి యిట్లు పలికెను. "ఇంద్రా! శత్రువుల నై నను గలహముచే నణంవఁ దలంపరాదు. కోపము, విరోధము అవివేకలక్షణములు. కోప భయసంతోషములను మనసులోనే యణంచుకొని పైకిఁ బ్రబల విశ్వాస మున్నట్లు ప్రవర్తించుచు లోపల నెప్పుడును నమ్మక యుండవలయును. శత్రువిషయమునను ప్రియ మునే పలుకవలయును. గాని యప్రియము పలుక రాదు వ్యర్థవివాదముల నుండియు కొండెములు చెప్పుగుణము నుండియుఁ జాలదూరముగా వైదొలఁగ వలయును. వేఁటకాఁడు పక్షికూఁతల నేర్చి పక్షివలెఁ గూయుచు వాని నేమఱుపాటునఁ బట్టునట్లు రాజు శత్రువులను బట్టవలయును. శత్రువు లోడిపోయినను రాజు వారి విషయమున నేమఱి యుండరాదు. జయము సంశయమైన వేళల శత్రువులతోఁ దలపడరాదు. శత్రుబలమును సామదాన భేదోపాయములచేతనే సాధ్యమైనంత వఱకు సమయఁ జేయవలయును. మెత్తగ మాటాడుట నిర్దయతో దండించుట, అలసత్వము, శత్రువంచన నెఱుఁగలేకపోవుట ఈ నాలుగు రాజ్యనాశన హేతువులు. ఒక్కవిషయమున కొక్క మంత్రియే కాని పెక్కురుమంత్రు లుండరాదు. శత్రువులు బలవంతులై యున్నపుడు వారికి నమస్కరించినను దప్పులేదు. నానావిధముల నడవడి కలవడిన వాని యైశ్వర్యమువలె, నానావిధ చిత్తచాంచల్యముగలరాజు రాజ్యము నిలువనేరదు. రా జెంతబలవంతుఁ డై నను బెక్కురతో నొక్కసారి కలహింప రాదు."

మఱియొకప్పు డింద్రుఁడు బృహస్పతిని దుష్టలక్షణములను దుష్టుని దెలిసికొనువిధానమును తెలుపు మని కోరెను. బృహస్పతి యిట్లు తెలిపెను. "ఇంద్రా! పరోక్షమున దోషము లుగ్గడించుట, మంచిగుణముల కసూయపడుట, పరుల సుగుణములను వినలేక పెడమొగము పెట్టుకొనుట, అకారణముగ మాటాడకుండుట, తలపంకించుట, పెదవి విఱుచుట, ఆసంబద్ధముగ మాటాడుట, వ్యర్థ ప్రతిజ్ఞ లొనరించుట, ప్రతిజ్ఞ చేసిన విషయమును గూర్చి మరలఁ బ్రస్తావింపకుండుట మున్నగున వెన్నో దుష్టలక్షణములు గలవు. హితభాషణము, ప్రసన్నత, కృతజ్ఞతాగుణము, ఆనందము, తృప్తి, దయ, దానము, ధర్మము, సత్యము, మున్నగునవి శిష్టలక్షణములు. వీనికి విరోధగుణములే దుష్ట లక్షణములు."

బృహస్పతి వసుమనునకుఁ దెల్పిన రాజధర్మములు

వసుమనుఁ డనురాజు తొల్లి బృహస్పతి నాశ్రయించి రాజధర్మము లాతనివలన నెఱుంగఁ గోరెను, బృహస్పతి యాతనిం గరుణించి యిట్లు తెలిపెను, “లోకములు, లోకధర్మములు రాజమూలములు. ఇంకిపోయిన చెఱువునందలి జలజంతువులగతి యేమగునో రాజరహిత మైన రాజ్యమందలి ప్రజలగతి యట్ల గును. ధర్మప్రభువుపాలన లేకపోవుచో, సూర్యచంద్రులు లేనపుడు దుష్టు లెన్ని పాపములకుఁ గడంగుదురో, యన్నిదురితములు రాజ్యమును నాశనము చేయును. రాజు లేని రాజ్యమున ధనతరుణీమానప్రాణములుఁ దక్కవు. రాజు లేనిచో సర్వము లేనట్లే . రా జున్నచో సర్వము నున్నట్లే. ప్రజలకు యాగభోగత్యాగములు ధర్మములు రా జున్నపుడే కొనసాగును. రాజు లేనపుడు రాగ రోగములే విహరించును. ఉత్తముఁ డగురాజు చారచక్షువై జగముఁ గనునపుడు సూర్యుఁడు, అకార్యకరులఁ దునుమునపుడు యముఁడు, సాధుసజ్జనులఁ బ్రోచునపుడు దేవతాత్మకుఁడు. అట్టి వానినిగుఱించియే సమ్రాట్టు, విరాట్టు అనుశబ్దములు పుట్టినవి. రాజునకుఁ బ్రజ శరీరము ప్రజలకు రాజు ఆత్మ; రక్షార్చనలందు ఉభయులు అన్యోన్య విరాజితులై నపుడు రాజ్యము శోభించును; లేనినాఁడు క్షోభించును.” *[3]

బృహస్పతి మాంధాతకుఁ దెలిపిన గోప్రదానప్రభావము

తొల్లి యొకప్పుడు మాంధాత యనుమహాచక్రవర్తి చక్కగ మేసి నీరు త్రావి మందలో నమందానందమునఁ బరుండియున్న గోవుల కడకు వచ్చి, ప్రదక్షిణించి, నమస్కరించి, పరమ భక్తితో బృహస్పతిని దలంచి కరకమలములు మొగిచి బహువిధములఁ బ్రస్తుతించి ధ్యానించెను. వెంటనే బృహస్పతి యాతని యెదుటఁ బ్రత్యక్షమయ్యెను. మాంధాత మహాభ క్తి నాతనిపాదములకు మొక్కి గోప్రదానవిధానముఁ దెలుపు మని ప్రార్థించెను. బృహస్పతి కరుణించి యిట్లు తెలిపెను. “రాజేంద్రా! భూదేవతల యనుజ్జ నంది పుణ్యదినమున నుపవాసము చేసి గోవులున్న మందకేగి నియమనిష్ఠలతో నొకరాత్రి యొకపగలు నివసించి మఱునాఁ డుదయము గోవును పేరుపేరఁ బిలిచి బ్రహ్మ చెప్పిన "తల్లి గోవు, వృషము తండ్రి, గర్భప్రదేశము స్వర్గము, ధరణి సంప్రతిష్ఠ " అను వాక్యముఁ బలికి పిదప, తనపాపము లన్నియుఁ బోవు టకు బ్రాహ్మణునిచేత నుదకధార విడిచి గోదానము చేయవలయును. శిష్యుఁడు, వ్రతశీలుఁడు-శాంతుఁడు, దాంతుఁడు, అక్రోధనుఁడు నగు.. విప్రుఁడే యిందులకుఁ బాత్రుఁడు. ఇట్టి దానముఁ జేసినవాఁడు చంద్రలోకమున సకలసౌఖ్యములు చిరకాల మనుభవించును. ఆశ్వయుజ మాసమున బహుళాష్టమి మొదలు మూఁడుదినము లుపవసించి పుణ్యమగుపసులసాల నుండి గోమూత్రము, గోమయము గ్రహించి సమస్త కామ్యసిద్ధిని పొందును. "

ఇది విని మాంధాత య ట్లనేకగోదానము లొనరించి యుభయ లోకములందు శాశ్వతకీ ర్తిచంద్రికల నింపెను.*[4]

బృహస్పతి మనువునకుఁ జేసిన జ్ఞానబోధ

ఒకప్పుడు మనువు తనగురువగు బృహస్పతిని జేరి కొలిచి తనకు జ్ఞానయోగముఁ దెలుపు మని ప్రార్థించెను. బృహస్పతి యిట్లు బోధించెను. "అనఘా! సత్కర్మయోగనిష్ఠ జ్ఞానయోగమునకుఁ గారణము. అనిష్టమును పాపుకొనుటకు, ఇష్టమును సంపాదించుకొనుటకు మానవుఁడు కర్మ మొనరించును. నిజమునకు, ఇపు డేవి సుఖములో అవియే కొంతకాలమునకు దుఃఖదాయకము లగును. ఇది తెలిసికొన్న ప్రాజ్ఞుఁడు ఫలవిషయమున నపేక్షలేనివాఁడై సుఖదుఃఖముల కతీతుఁడై కామాదులకుఁ గడుదవ్వగు జ్ఞానవిశేష బుద్ధివలనఁ బరమసిద్ది నందును. మఱియు, పరమవస్తువు ఆలంబము లేనిది; శబ్దస్పర్శరూపరసగంధవిరహితము. అందుచే నది వ్యాప్త మగుచుండునింద్రియములకు వశపడదు. పరతత్త్వమునకు స్త్రీ పుం నపుంసకత్వములు లేవు. అందుచే నది వానివానివ్యాపారముల కతీతమై దేహగత మయ్యు బోధరూపమున దీపించును. వెలుఁగుచున్న దీప మితరవస్తువులఁ బ్రకాశింపఁ జేయునట్లు మహోత్తమమగు నిత్యబోధనజ్యోతి తనప్రభవలన నింద్రియమానసముల దోషములఁ బోఁ గొట్టును. రాజునకు మంత్రులాయా కార్యముల నెట్లు సూచింతురో, అట్లే పురుషున కింద్రియములు క్రియలఁ గల్గించును. కఱ్ఱ కఱ్ఱ ఱాపాడిన నగ్ని పుట్టును, అట్లని గొడ్డళ్ళతోఁ జెట్లఁ గూల్చి ముక్కముక్కలుగా చెక్కపేళ్ళుగాఁ గొట్టినచో అగ్ని కనిపించునా? అట్లే శరీరమును శుష్కింపఁ జేసినంతమాత్రమునఁ బరతత్త్వము కానిపింపదు. కఱ్ఱలకు మథన మవసరమైనట్లు జ్ఞానమునకు ఆగమోక్తమథన మావశ్యకము. ఆకాశమునఁ జూపు నిలువనంత మాత్రమున నాకాశమే లేదనుట యెంత యవివేకమో మనస్సునకు నింద్రియములకు నందనంత మాత్రమునఁ బరతత్త్వము లేదనుటయు నంతియే. వేఁటకాఁడు వల, ఉరి, ఓదము, గాలము మున్నగుసాధనములఁ గొని మృగమును, పక్షిని, ఏనుఁగును, చేఁపను, పట్టునట్లే జ్ఞానులు విజ్ఞానమునఁ బురుషునిఁ జూడఁ గందురు. పాముకాళులు పామునకే తెలియునట్లు బుద్ధివికారములను బోఁద్రోచు ప్రాజ్ఞుఁడు పరమపురుషు నెఱుంగును. అమావాస్యనాఁడు చంద్రుఁడు కానరానంతమాత్రమున నాతనికి నాశము లేనట్లే. మనస్సునకుఁ బట్టువడనంత మాత్రమునఁ బరవస్తువు లేదనుట బుద్దిహీనత. రాహువు మ్రింగినచో రవిబింబము కానరాదు. రాహువు విడువఁగనే యది యథాప్రకారము కాననగును. అట్లే ఆత్మకు అవిరతి, విరతి యనునవి అజ్ఞానమువలననే ఉన్నట్లు తోఁచును. తేఱిననీటఁ బ్రతిబింబము కనిపించును. కలఁగిననీట నది కనిపింపదు. అట్లే మనస్సు ప్రశాంతస్థితి నున్నపుడు పురుషుఁడు తన్నుదాను గనును. అశాంతస్థితిని గానలేఁడు. ఇంద్రియములు యథేచ్ఛముగాఁ దిరిగినచో నవి యనంతదుఃఖములం గొని తెచ్చును. అవి కట్టువడినచో సుఖ మొసంగును. కావున, ఇంద్రియము లను దొంగలబారి నుండి ఆత్మను గాపాడవలయును. మెఱుఁగుటద్దమున ముఖము బాగుగఁ గనఁబడునట్లే, పొపరహితమైన మనస్సున పురుషుఁడు తన్నుఁ దాఁ గనఁగలఁడు. ధ్యానయోగనిశ్చలమగు మనస్సు గుణములను విడిచి శాంతనిర్గుణవస్తువునందుఁ గలియును. అది పరమపదము. దానికిఁకఁ బరము లేదు.

ఉత్తమజ్ఞానమునకు మాయ మాటగును. దానిని దొలఁగించు నుపొయముఁ జెప్పెద, వినుము. భూమిపైఁ బాదము మోపని జంతు వెటు లేగెనో చెప్పుట యెంత కష్టమో మాయ యిట్టి దని చెప్పుట సాధ్యము కాదు. మాయ గుణముల రూపము. దానిని దూరము తొలఁగింపఁగా, దివ్యజ్యోతి కాననగును. అది కనుటయే తన్నుఁ దాను గనుట. సత్త్వము, రజస్సు, తమస్సు అను మూఁడుగుణములు పెనవేసికొని ఆత్మఁబట్టుకొనును. వానిని ద్రించుట వైరాగ్య మనుగొడవలి చేతనే కాని మఱి యొకవిధమున సాధ్యము కాదు.

మఱియు, మణులతోను, బంగారముతోను, వెండితోను, మట్టి మున్నగు వానితోను జేయఁబడిన యనేకములగు పూసలలో దారమున్నట్లు భూతకోటు అన్నింటియందును పురుషుఁ డుండును. ఒకేభూమిమీఁద ననేక విధములగు ఓషధులు పుట్టునట్లె ఒకేబుద్ధివలన ననేకములగు కర్మలు కలుగును. జలము భూమికంటెఁ బెద్ద; తేజ మంతకంటెఁ బెద్ద; వాయు వంతకంటెఁ బెద్ద; దానికంటె నాకాశము పెద్ద; దానికంటె మనస్సు పెద్ద; దానికంటె బుద్ది పెద్ద; పృథివ్యాదిపంచభూతములకంటెను మనోబుద్దుల కంటెను కాలము పెద్ద. కాలాతీతుఁడై పురుషుఁ డి జగములకుఁ బ్రభువై యుండును. ఆతని కాది మధ్యాంతములు లేవు. ఆతఁ డవ్యయుఁడు. వేదములు, నానావిధవాదములు నతనినే కీర్తించును. ఆతఁడు భవ నాశకుఁడు. అనుభవాతీతమగుశాంతమువలనఁ గనుపట్టునది. సత్ప్రకాశము. అది తలఁపులకుఁ బలుకులకు దొరకదు. కర్మములకుఁ గానిపింపదు. ఈ ప్రకాశము అమృతము, అచ్యుతము, అమలము, అమేయము, అవ్యయము, అనంతము. యమాదుల కలవడినచిత్తము శమాతిరేకమును పొందగా దీనిని గాంచును.*[5]

బృహస్పతి అగస్త్యుని బ్రార్థించుట

ఇంద్రాదులకుఁ గాని దేవతలకుఁ గాని కష్టనష్టములు కలిగినపుఁడెల్ల బృహస్పతి వారికై యెవ్వ రెవ్వరిననైనఁ బ్రార్థించి వారికి క్షేమము నొనఁగూర్చువాఁడు. వింధ్యపర్వతము పెరిగి లోక వ్యవహారము తాఱు మాఱు చేయఁగా లోకోపద్రవము వాటిల్లెను. అప్పు డింద్రాదులను వెంటఁగొని బృహస్పతి బ్రహ్మకడ కేగి రక్షింపు మని కోరఁగా నాతఁడు వారి నగస్త్యుని బ్రార్థింపుఁ డని పంపెను. బృహస్పతివెనుక దేవతలెల్లరు భూలోకమునకు దిగి కాశీ పట్టణముఁ జేరి యగస్త్యాశ్రమమును సమీపించి యా మహర్షికి మ్రొక్కి నిలిచిరి. అగస్త్యుఁడు వారి క్షేమ మడిగి బృహస్పతిని బహూకరించి వచ్చినపని యడిగెను. లోపాముద్రాపతిని బృహస్పతి స్తుతించి “ ఋషివర్యా! నీవు ప్రణవమవు. లోపాముద్ర వేదవిద్య. నీవు తపస్సువు. లోపాముద్ర శాంతి. ఈమె సత్కియ. నీవు ఫలము, నీవు సూర్యుఁడవు. ఈమె చై తన్యలక్ష్మి. నీ యందు బ్రహ్మతేజము, ఈ మెయందుఁ బతివ్రతాతేజము ప్రజ్వరిల్లుచు లోక క్షేమముఁ గూర్చుచున్నవి. ఈ రెండుతేజములు కలిసి మాకు క్షేమ మొసఁగుఁగాక " యని పలికి అగస్త్యునిచే వింధ్యగర్వాపహరణముఁ గావించి లోక శ్రేయముఁ గూర్చెను. *[6]

బృహస్పతి శుక్రాచార్యుఁ డగుట

తొల్లి యొకప్పుడు దేవతలకు విజయము పై విజయము రాక్షసులకు పరాజయముపైఁ బరాజయము కలుగుచుండుటఁ గని రాక్షసులు తమగురువగు శుద్రాచార్యునికడ కేఁగి మొఱ్ఱపెట్టిరి. శిష్యవత్సలుఁ డగు శుక్రుఁ డుపాయ మూహించి శంకరుని గుఱించి తప మొనరించి యాతని కరుణ వడసి మంత్రశక్తులు సంపాదించి వానివలన రాక్షసులకు విజయము దేవతలకుఁ బరాజయము సమకూర్ప నిశ్చయించుకొనెను. పిదప నాతఁ డేగి శివుని మెప్పించి యాతని సూచన ననుసరించి యుగ్రతప మొనరించుచుండెను. ఇంద్రుఁ డీసంగతి యెఱిఁగితపోభంగమునకై తనకూఁతురగు జయంతినిఁ బుత్తెంచెను. మహాసౌందర్యవతి, యౌవనవతి, గుణవతి యగు జయంతి శుక్రాచార్యునిఁ జేరి యాతనికి శుశ్రూష లొనరించుచు ననేక సంవత్సరములు గడపెను. తుట్టదుద కాతఁ డామెఁ గనికరించి కావలసినది కోరుకొను మనఁగా నామె యాతనితోడి చిరకాల సంగమసౌఖ్యముఁ గోరుకొనెను. అన్నమాట కా దనఁ జాలక శుక్రుఁడు సంకేతమందిరమున నామెకోరికఁ దీర్చుచు వేలకొలఁది సంవత్సరము లుండిపోయేను. ఈ లోఁగా బృహస్పతి శుక్రాచార్యరూపము ధరించి రాక్షసులకడ కేగి వారు తమగురువే యని నమ్మి సేవింప, వారికి వేదబాహ్య మగు ఆర్హ తమతము ని ట్లుపదేశించెను. “ వేదశాస్త్రములు వట్టిబూటకములు; వాదములకు భేదములకు నవి పనికివచ్చుఁ గాని ముక్తి నీయఁజాలవు. యజ్ఞములపేరఁ జేయుప్రాణిహింస, సురాపానము మిగుల గర్హ్యములు. యజ్ఞమునఁ జంపఁబడిన పశువునకు మోక్షము వచ్చునఁట. అగుచో, యజ్ఞకర్త తనతండ్రినో తల్లినో యజ్ఞపశువుఁ జేసి మోక్ష మిప్పింవరాదా? ఒకఁడు పెండ్లమును నెత్తి కెక్కించుకొన్నవాఁడు; ఇంకొకఁడు వక్షఃస్థలమున నుంచుకొన్న వాఁడు; మఱొక్కఁడు నోటిలో నుంచుకొన్న వాఁడు. ఈ మువ్వురు మోక్ష ప్రదాత లఁట! చిత్రము కాదా?

మీకు నేను గొప్పమత మొకటి బోధించెదను. దానిని మీ రనుసరించితిరా మీకు మోక్షము కలుగును. అదియే ఆర్హత మతము. ఇందు శిఖాయజ్ఞోపవీతము లెల్లరును ద్యజింపవలయును. ఆచారము మానవలెను. దిగంబరులై యథేచ్చముగ నుండవలయును. జాతి మతభేదము లుండరాదు."

ఇట్లు చెప్పి బృహస్పతి రాక్షసు లెల్లరకు ఆర్హతమతము నిప్పించి వారిని ధర్మబాహ్యులను వేదబాహ్యులను గావించెను. ఈ సందర్భమున నిజముగ శుక్రాచార్యుఁడు తనశిష్యులకడకు వచ్చెను. కాని, బృహస్పతిమతము తల కెక్కినరాక్షసులు వానిని నమ్మక ద్రోహియని పాఱఁదోలిరి. బృహస్పతి రాక్షసులను సర్వభ్రష్టులను జేసి యరిగిన పిదప, రాక్షసులు తాము మోసపోయిన సంగతి గ్రహించి ప్రహ్లాదపుర స్కృతులై శుక్రాచార్యునిఁ బ్రార్థించి క్షమింప వేఁడుకొనిరి. ఎట్టకేల కాతఁడు శిష్యవాత్సల్యమున వారి కిచ్చినశాపమున కవధి యేర్పఱిచి యాదరించెను. *[7]

బృహస్పతి మమతం గూడుట

బృహస్పతి పన్నిన కుటిలనీతిమూలముగాఁ దనశిష్యులు తన్నుఁ దృణీకరించి యవమానించిరని దానికిఁ గారకుఁ డగు బృహస్పతి యధర్మముగ మాతృసమానం గూడి శాపపాపహతుఁ డగుఁగాక యని శుక్రాచార్యుఁడు శపించెను. ఈ శాపము కారణముగా బృహస్పతి సర్వ విద్వద్వరేణ్యుఁ డయ్యు, సర్వధర్మవిదుఁడయ్యు సర్వము మఱచిన వాఁడై తిరుగుచుండెను. భూతము సోఁకిన మానవునివలె, సురాపానమున మదమెక్కిన త్రాగుఁబోతువలె బృహస్పతి వివేకవిహీనుఁడయ్యెను. ఆహా ! సత్పురుష శాప మెంతవాని నెంత హీనుఁ జేయును !

ఇట్లుండఁగా నొకనాఁడు బృహస్పతి యన్నయగు ఉదథ్యునాశ్రమమున కేగెను. అట, ఉతథ్యుఁడు తీర్థయాత్రల కేగియున్న కారణమున నాతనిధర్మపత్నియు, అసమానలావణ్యవతియు, విశేషించి గర్భవతియు నైన మమతాదేవిని గాంచెను. శాపోపహతుఁ డగునా సుర గురునకుఁ గామమోహము కలిగెను. ఏకాకినియై యున్న యా సాధ్వి మఱఁది కతిథిపూజ చేసి యాదరించెను. అంత బృహస్పతి మదనా తురుఁడై యామె కరముఁ బట్టి రతిసుఖ మిమ్మని బలవంత పెట్టెను. ఆమె నిశ్చేష్టయై తాను గర్భిణియై యున్నసంగతియు మాతృసమాన యైన సంగతియు నాతనికి గుర్తునకుఁ దెచ్చెను. ఐనను, శుక్రతాప తిమిర బద్దుఁ డగు దేవగురున కది యసమంజసముగఁ దోఁపలేదు. అందుచే నాతఁ డామెను బలవంతమున శయ్యకుఁ దార్బి రమించి కామోపశమనముఁ గావించుకొనెను. తత్పతిత వీర్యమును మమతాగర్భస్థుఁ డగు శిశువు వెలికిఁ దన్ని వేసెను. అమోఘ మగుబృహస్పతి వీర్యము నేలపైఁ బడి తదనంతశక్తివలన వెనువెంటనే బాలుఁ డయ్యెను. ఈ బాలుని మమతాబృహస్పతు లిరువురును విడిచి వేయఁగా భరతుఁ డనురాజు తీసికొనిపోయి పెంచేను. ఈతఁడే భరద్వాజుఁ డయ్యెను.

బృహస్పతికి ఉతథ్యుని శాపము

తీర్థయాత్రలనుండి తిరిగివచ్చిన ఉతథ్యునకు భార్యయగు మమత జరిగిన సంగతి యంతయుఁ దెలిపెను. ఆతఁ డాశ్చర్యపడి సోదరుని చేష్ట కసహ్యించుకొని బృహస్పతిభార్య నొరుఁడు రమించునట్లును, బృహస్పతి యవమానదందహ్యమానమానసుఁ డగునట్లును శపించెను. బృహస్పతి అయోనిజ యగుతార యను సౌందర్యవతిని వివాహమై యామెతో గార్హస్థ్యసౌఖ్యము అనుభవించుచు నుండెను. కొంత కాలమునకు శశాంకుఁడు వచ్చి బృహస్పతికి శిష్యుఁడై తారాబృహస్పతుల కత్యంత ప్రేమపాత్రుఁ డయ్యెను. బృహస్పతి యేకసంధాగ్రాహి యగునాతనికి సమస్తశాస్త్రములు నేర్పుచుఁ బ్రాణసమముగాఁ జూచు చుండెను. ఇట్లుండ నింద్రుఁడు చేయు యాగమున కేగుచు బృహస్పతి తారాశశాంకుల నింటికడ విడిచి చనెను. పరస్పర కామోపహతు లగు న య్యిరువురకు యథేచ్చా వ్యభిచారమునకుఁ దగిన యదను లభించెను. మహాపతివ్రత యయ్యుఁ దార భర్తకుఁ దగిలినశాపము కారణముగా సుతసముఁ డగు శశాంకునిం గూడి యాతనివలన గర్భము ధరించెను. బృహస్పతి తిరిగివచ్చి జరిగిన సంగతి గ్రహించి యిరువురినిఁ జీవాటులుపెట్టి శశాంకుని బంపివేసెను. తరువాత నాతఁడువచ్చి యేకాంతముగ నున్నపుడు తారను దీసికొనిపోయెను. తార బుధుఁ డను కుమారునిం గనెను. బృహస్పతి తన భార్యను దన కిప్పింపు డని ఇంద్రాదులతోడను బ్రహ్మాదులతోడను మొఱవెట్టుకొనవలసివచ్చెను. చంద్రుఁడు తార నిచ్చుట కంగీకరింపని కారణమున నిరుపక్షముల వారికి ఘోర మగుపోరు సంభవించెను. అపుడు బ్రహ్మ వచ్చి శశాంకు నొప్పించి అయోనిజ కావున అపవిత్ర కాని తారను తిరిగి బృహస్పతి కిప్పించి యిరుపక్షములవారికి సఖ్యము నెఱపెను.

బృహస్పతికిఁ దారవలన సుతుఁడు కలుగుట

ఈ ప్రకారము పరహస్తగతయైన తార తిరిగి బృహస్పతిహస్తమునఁ బడెను. శాపతిమిరము వై తొలఁగినకారణమున నామె మహాపతివ్రతయై యిఁకఁ దప్పుదారులు తొక్కక బృహస్పతినే సేవించుచుండెను. అసమానలావణ్యవతి యగునామెకు బృహస్పతి దయవలన గర్భము నిలిచెను. కాలక్రమమున నామెకు కచుఁ డను కుమారుఁ డుద్బ వించెను. కచుఁడు పెరిగి పెద్దవాఁ డగుచున్న సమయముస శుక్రాచార్యుని మృతసంజీవనీ విద్యవలన రాక్షసులకు విజయము, దేవతలకుఁ బరాజయము కలుగుచుండెను, ఉపాయాంతరమున మృత సంజీవనీ విద్య గ్రహింపవలె నని నిశ్చయించుకొన్న దేవతల కందులకుఁ దగినవాఁడు లభింపఁ డయ్యెను. తుదకు బృహస్పతియనుమతిం గొని సురలెల్ల రుఁ గచుని బ్రార్థించి శుక్రాచార్యునికి శిష్యత్వము నెఱపి మృతసంజీవనీవిద్య పరిగ్రహించి రమ్మని పంపిరి. కచుఁడు దేవహితై షియై యేగి శుక్రాచార్యునికి మిగుల నిష్టుఁడై మెలఁగి యాతనికూఁతు రగుదేవయాని వలపునకు నిలయమై తుదకుఁ బోయిన పనిని సాధించుకొని వచ్చెను.

బృహస్పతి యిచ్చినమాట దాఁటుట

మరుత్తుఁ డనురాజు యజ్ఞము చేయఁ దలఁచి బృహస్పతికడ కేగి భయభక్తియుక్తుల నమస్కరించి తన యజ్ఞమునకు యాజకత్వము వహింపు మని ప్రార్థించెను. బృహస్పతి తన యంగీకారమును దెలిపి యజ్ఞసంభారములను సమకూర్చుకొన మరుత్తున కనుజ్ఞ యిచ్చెను. మరుత్తుఁడును సురగురువు తన యజ్ఞమును నిర్వర్తింప నంగీకరించె నని యపరిమితానంద మంది సర్వసంభారములు సమకూర్చుకొనఁ దొడంగెను. ఇంతలో అసూయాగ్రస్తుఁడగు ఇంద్రుఁ డివిషయ మెఱిఁగి గురువుకడ కేగి తానే యజ్ఞము చేయుదు ననియు నా యజ్ఞమున యాజకత్వము వహింపవలయునే కాని మానవుఁ డగు మరుత్తుని జన్నము నడపింప వల దని ప్రార్థించెను. శిష్యవత్సలుఁ డగుబృహస్పతి యాతని ననునయించి తాను మరుత్తుని యజ్ఞమునకుఁ బో ననియు, ఇంద్రుని యజ్ఞమునే నడిపింతు ననియు శపథము చేసెను.

ఇంతలో సర్వసన్నాహములు సమకూర్చుకొని మరుత్తుఁడు దేవ గురువునకు వచ్చి యజ్ఞ మారంభింపఁజేయు మని వర్తమాన మంపెను. దానికిఁ దాను రాఁజాల ననియు నింకొకనిం బిలిచి యజ్ఞము నడిపించుకొను మనియు బృహస్పతి మరుత్తునకు వర్తమాన మంపెను. బృహస్పతి ప్రతిజ్ఞాభంగమునకు మరుత్తుఁ డెంతయు వగచి కింకర్తవ్యతామూఢుఁడై యుండఁగా నారదమహర్షి విచ్చేసి బృహస్పతితమ్ముఁడు మహాయోగియగు సంవర్తుని బిలిచి యజ్ఞ మొనరింపు మని సూచించి సంవర్తునిఁ గనుంగొను తీరు, ఆతనిని వశపఱచుకొను విధముఁ దెలిపి వెడలెను. మరుత్తుఁ డమితానంద మంది యటు లొనరించి సంవర్తుని బహుగౌరవముగాఁ దీసికొనివచ్చి యజ్ఞ మారంభించెను.

ఈ సంగతి తెలిసి యింద్రుఁ డసూయపడి యెట్లైన యజ్ఞవిఘ్నముఁ గావింపఁ దలఁచి బృహస్పతియే వచ్చి యజ్ఞము నడిపించు ననియు, సంవర్తునిఁ బంపివేయు మనియు మరుత్తునకు వార్తఁ బంపెను. మరుత్తుఁ డంగీకరింపఁ డాయెను. ఇంద్రుఁడు కోపించి వజ్రాయుధమును బంపెను. మరుత్తుఁడు సంవర్తుని శరణుచొచ్చెను. సంవర్తుఁడు వజ్రాయుధము నాపివేసి గాలిపటమువలె గిరగిరఁ దిరుగుచు నొక్కచో నుండిపోవ శాసించెను. అది నిర్వీర్యమై నిలిచిపోయెను. పిదప, నింద్రబృహస్పతులకు బుద్ధివచ్చి తాము స్వయముగా వచ్చి సంవర్తుని క్షమాభిక్షముఁ గోరిరి. సంవర్తుఁడు వారి నాదరించి మరుత్తునియజ్ఞమును నిర్విఘ్నముగను దివ్యముగను జరిపించెను. మరుత్తుఁడు వారిని బూజించెను. ఇంద్రబృహస్పతులు సంతోషించి వెడలిరి. *[8]

బృహస్పతి శనిపీడ నందినకథ

బృహస్పతి దయాళువై భూ జనులకు జ్ఞాన ముపదేశించి బాగుచేయఁ దలఁచి నర్మాదా నదీతీరమునఁ గల యొకపట్టణముఁ జేరి 'వాచస్పతి' యని తనవాఙ్ని పుణతకుఁ బేరువడసి, శిష్యప్రశిష్యులఁ జేరఁదీసి వారికి సమస్తసౌకర్యములు స్వశక్తివలన సమకూర్చుచు నుండెను. పెక్కురు జిజ్ఞాసువు లామహనీయుని శిష్యులై పెక్కు జ్ఞానరహస్యము లాతని వలన నెఱిఁగి సంతోషించుచుండిరి.

ఇట్లుండ, ఛాయాసూర్యతనయుఁ డగుశని తండ్రిని జేరి తనకు విద్యాబుద్ధులు గఱపువిబుధగురుఁ డెట నున్నాఁ డని ప్రశ్నించెను. సూర్యుఁడు "వత్సా! నీకు విద్యాబుద్ధులు గఱపఁ గలదిట్ట యొక్క బృహస్పతియే. ఆతఁ డిపుడు నర్మదాతీరమందలి నగరమున గురుకులా శ్రమమును నిర్మించి నిర్వర్తించుచు సకల జనులకు సర్వవిషయములు చెప్పుచున్నాఁడు. నీ వాతని నాశ్రయించి తగిన విద్యలను గ్రహించి ర"మ్మని పంపెను.

శని విద్యార్థియై విప్రబాలవేషమును ధరించి బృహస్పతి యున్న కడ కేతెంచి యాతనికి సాష్టాంగ మెఱఁగి తాను కపిలవంశీయుఁడ ననియు జ్ఞాన మాశించి వచ్చితి ననియుఁ దనకు సర్వవేదశాస్త్రములు బోధించి జ్ఞానము నొసంగు మనియుఁ బ్రార్థించెను. వాచస్పతి యానందించి శిష్యునిగాఁ జేర్చుకొని యాతనికి సర్వవిషయములు చక్కగ నేర్పెను. ఆతఁ డనతికాలముననే విద్యార్థుల కెల్ల మిన్నయై బుద్ధివిశారదతను గురుహృదయ మాకర్షించెను.

ఇంత బుద్ధిమంతుఁడు వీఁ డెవఁడా యని బృహస్పతి యొకనాఁడు దివ్యదృష్టిని జూడ నాతఁడు సూర్యతనయుఁ డగు శనై శ్చరుఁ డని స్పష్టముగాఁ గాననయ్యెను. బృహస్పతి యాతనిం బిలిచి " నీ వసత్య మాడి నా వలన విద్య అభ్యసించితివి. ఆ దోషమువలన నీకుఁ గ్రూర దృషియు, సర్వజనపీడాకరుఁ డను దుష్కీర్తయుఁ గలుగు నని శపించెను. అది విని శని “నాపీడ నీకును దప్ప" దని ప్రతిశాపమిచ్చి "ఏమైనను, నీవు నాకు గురుదేవుఁడవు. కాన, నాపీడ నీకుఁ బ్రమాద హేతు వెంతమాత్రము కాకుండు” నని పలికి బృహస్పతిని బ్రీతునిఁజేసి వెడలిపోయెను.

బృహస్పతిశాపమువలన శని పాపగ్రహము, క్రూరదృష్టి యుతుఁడు నయ్యెను. శని ప్రతిశాపమువలన నొకనాఁడు బృహస్పతికి రాజశిశుహంత యను నిరాపనింద రాఁగా నాతని కా దేశపురాజు మరణదండన విధింవవలసియు నేమియు ననలేక విచారించుచుండెను. ఇది యంతయు శనిగ్రహదోష మని బృహస్పతి మనమున శనిని ధ్యానింపఁగా నాతఁడు గురుని గౌరవించి యాతఁడు నిర్దోషి యనియు, రాజ శిశు వూయెలలో సురక్షితుఁడై యున్నాఁడనియు నశరీరవాణిచే వెల్లడింపఁజేసెను. బృహస్పతిని రాజు మంత్రులు నెల్లరు గౌరవించి క్షమాభిక్షము కోరిరి. "ఇది మీ తప్పుకాదు. ఎంతటివారికిని శనిపీడ తప్పదు. నాకును దప్పలే"దని బృహస్పతి యందఱ నోదార్చెను. శని యటఁ బ్రత్యక్షమై గురుపాదములఁ బడి క్షమింప వేఁడుకొనెను. దేవగురు వాతని నాదరించి యుత్తముల జోలికిఁ బోవల దని హెచ్చరించి వీడుకొలిపెను.*[9]

బృహస్పతిస్మృతి

బృహస్పతి చెప్పినధర్మము లన్నియు “బృహస్పతిస్మృతి " యను పేర విలసిల్లుచున్నవి. ఇంద్రుఁడు బృహస్పతిని జేరి భయభక్తులతోఁ దనకు ధర్మములు చెప్పు మని ప్రార్థించుటయు బృహస్పతి కరుణించి యాతనికి ధర్మములు వివరించె ననియు నిందుఁ గలదు.

బృహస్పతిస్తుతి

"నమ స్సురేంద్రవంద్యాయ
           దేవాచార్యాయ తే నమః,
 నమస్తే౽నంత సామర్థ్య
           వేదసిద్ధాంతపారగ !
 సదానంద నమస్తేస్తు
           నమః పీడాహరాయ చ,
 నమో వాచస్పతే తుభ్యం
           నమస్తే పీతవాససే.
 నమో౽ద్వితీయరూపాయ
           లంబకూర్పాయ తే నమః,
 నమః ప్రహృష్ట నేత్రాయ
           విప్రాణాం పతయే నమః.

 నమో భార్గవశిష్యాయ
         విపన్నహితకారిణే,
 నమస్తే సుర సైన్యానాం
         విపత్తి త్రాణ హేతవే.
 బృహస్పతిః కాశ్యపేయో
         దయావాన్ శుభలక్షణ,
 అభీష్టఫలద శ్రీమాన్
          శుభగ్రహ నమోస్తు తే."



  1. *భారతము శాంతిపర్వము.
  2. *భారతము ; శాంతిపర్వము.
  3. *భారతము, కొంతివర్వము.
  4. *భారతము, అనుశాసనిక పర్వము.
  5. *భారతము; శాంతిపర్వము.
  6. *స్కాందపురాణము. కాశీఖండము.
  7. *పద్మపురాణము, బ్రహ్మాండ పురాణము
  8. *భారతము. అశ్వమేధపర్వము
  9. *శివపురాణము, సనత్కుమార సంహిత.