మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/వ్యక్తిలోని బహుముఖాలు

15. వ్యక్తిలోని బహుముఖాలు

ఒకాయన తన శిష్యుల్ని వెంటబెట్టుకుని మమ్మల్ని చూడటానికి వచ్చాడు. వాళ్లలో అన్ని రకాల వాళ్లూ ఉన్నారు - డబున్నవాళ్లూ; బీదవాళ్లూ, ఒక ఉన్నత ప్రభుత్వోద్యోగీ, ఒక వితంతువూ, మత దురభిమాని ఒకడూ, చిరునవ్వుతో ఉన్న ఒక యువకుడూ. వాళ్లంతా సరదాగా, సంతోషంగా ఉన్నారు. ఆ తెల్లటి ఇంటి మీద నీడలు నాట్యం చేస్తున్నాయి. దట్టంగా ఉన్న ఆకుల మధ్య చిలకలు కీచుగా అరుస్తున్నాయి. ఒక లారీ పెద్ద చప్పుడు చేస్తూ వెళ్ళింది. ఆ వచ్చిన వాళ్లలో యువకుడు, గురువుకి, బోధకుడికి ఎంత ప్రాముఖ్యం ఉందో ఎంతో తీవ్రంగా ఉద్ఘాటిస్తున్నాడు. తక్కిన వాళ్లు అతనితో ఏకీభవిస్తున్నారు. అతడు స్పష్టంగా, నిష్పక్షపాతంగా వాదిస్తూంటే ఆనందంతో చిరునవ్వు నవ్వుతున్నారు. ఆకాశం ఎంతో నీలంగా ఉంది. మెడదగ్గర తెల్లగా ఉన్న ఒక డేగ మాపైన చుట్టూ తిరుగుతోంది. రెక్కలు కొంచమైనా విదల్చకుండా. ఆ రోజు ఎంతో చక్కగా ఉంది. మనం ఒకరినొకరు ఎలా నాశనం చేసుకుంటాం - శిష్యుడు గురువునీ, గురువు శిష్యుణ్ణీ! అనుగుణంగా ఎలా వర్తిస్తూ ఉంటాం, విడిపోయి మరోలా ఎలా రూపొందుతూ ఉంటాం! ఒక పక్షి పొడుగాటి పురుగుని తడిమట్టి లోంచి లాగుతోంది.

మనలో ఉన్నవి ఎన్నో; ఒకటి కాదు. ఆ ఉన్నవన్నీ పోతేగాని ఒకటి అవదు. అవన్నీ ఒకటితో ఒకటి పోట్లాడుకుంటూ రోజూ రాత్రీ, పగలూ గొడవ చేస్తూ ఉంటాయి. ఈ పోరాటమే జీవితంలోని బాధ. ఒకదాన్ని నాశనం చేస్తాం. దాని స్థానంలో మరొకటి బయలు దేరుతుంది. ఈ రకంగా అనంతంగా సాగుతూ ఉన్నట్లుండేదే మన జీవితం. వాటిల్లో ఒకదానికి తక్కిన వాటి కన్న ఆధిక్యాన్నిస్తాం. కాని, ఆ ఒకటి త్వరలోనే అనేకం అవుతుంది. అనేకమైన వాటి గొంతు ఒక్కటిగా వినిపిస్తుంది. ఆ ఒక్క గొంతూ అధికారాన్ని చెలాయిస్తుంది. అయినా, ఆ గొంతు వాగుతూనే ఉంటుంది. మనలో అనేక కంఠాలు, అన్నిటిలోకీ నిశ్శబ్దంగా ఉన్న ఒక కంఠాన్ని వినాలని ప్రయత్నిస్తాం. ఆ ఒక్క కంఠాన్నీ వినటానికి తక్కినవన్నీ నిశ్శబ్దంగా ఉన్నట్లయితే, ఆ ఒక్కదానిలో అనేకం ఉన్నట్లే. కాని, అనేకం ఎన్నటికీ ఆ ఒక్కదాన్ని కనుక్కోలేవు.

ఇప్పుడు మన సమస్య ఆ ఒక్క గొంతునీ ఎలా వినాలా అని కాదు; మొత్తం వాటి కూర్పుని, అనేకమైనవన్నీ కలిసి మనం ఎలా రూపొందామో అర్థం చేసుకోవటమే మన సమస్య. బహుముఖాల్లో ఒకటి అన్నిటినీ అర్థం చేసుకోలేదు. ఒక రూపం తక్కిన రూపాల్ని అధీనంలో ఉంచుకుని వాటికి శిక్షణ నిచ్చి, వాటిని తన పద్ధతిలో రూపొందించటానికి ప్రయత్నించినా, దాని ప్రయత్నాలన్నీ స్వార్ధపరమైనవి, సంకుచితమైనవి గానే ఉంటాయి. మొత్తాన్ని దానిలోని ఒక భాగం ద్వారా అర్థం చేసుకోవటం సాధ్యంకాదు. అందువల్లనే మనం ఎప్పుడూ అర్థం చేసుకోలేము. మొత్తమంతా మనకెప్పుడూ కనిపించదు. ఆ మొత్తమంతా ఎలా ఉందో మనకు తెలియదు, ఎందుచేతనంటే, మనం ఎప్పుడూ ఒక భాగంతోనే వ్యవహరిస్తూ, తీరిక లేకుండా ఉంటాం. కాని, ఒక భాగం తన్నుతాను అనేకంగా విభజించుకుంటుంది. మొత్తమంతా తెలుసుకోవటానికీ, అనేకమైన వాటి మధ్య జరిగే సంఘర్షణని తెలుసుకోవటానికీ, కోరికని అర్ధం చేసుకోవాలి. కోరికది ఒకే చర్య - అది రకరకాలుగా ఒకదానికొకటి వ్యతిరేకంగా కోరుతూ కృషి చేస్తున్నప్పటికీ, అవన్నీ కోరిక నుంచి పుట్టినవే. కోరికని ఉన్నతమైనదిగా చూడటంగాని అణచి వెయ్యటం గాని చెయ్యకూడదు. దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునేది అనేది లేకుండా అర్థం చేసుకునే రూపం ఒకటి ఉన్నట్లయితే అది కూడా కోరిక రూపమే. అనుభవం పొందేది లేకుండా అర్ధం అయినట్లయితే, అనేకం నుంచీ ఒక్కటినుంచీ కూడ స్వేచ్ఛ లభిస్తుంది.

అన్ని చర్యలూ - అనుగుణమైనవీ, నిరసించేవీ, విశ్లేషించేవీ, అంగీకరించేవీ. అన్నీ అనుభవం పొందే వాడిని. అంతే, అనుభోక్తను మరింత శక్తిమంతంగా చేస్తాయి. అనుభోక్త మొత్తమంతటినీ ఎన్నటికీ అర్థం చేసుకోలేడు. కూడబెట్టుకున్నదంతా కలిసినది అనుభోక్త. గతం నీడలో ఏదీ అర్థం కాదు. గతం మీద ఆధారపడటం వల్ల ఏదైనా మార్గం స్ఫురించవచ్చు. కాని, ఏదో మార్గాన్ని అవలంబించటం అర్థం చేసుకోవటం కాదు. అర్థం అయేది మనస్సుకి చెందినది కాదు. ఆలోచనతో కూడినది కాదు. ఆలోచనకు నిశ్శబ్దంగా ఉండే శిక్షణ నిచ్చి మనస్సుతో ప్రమేయం లేని దానిని పట్టుకోజూచినట్లయితే, అప్పుడు అనుభవంలోకి వచ్చేది గతం యొక్క ప్రతిరూపం మాత్రమే; ఈ ప్రక్రియ అంతా తెలుసుకోవటంలోనే అనుభోక్తతో ప్రమేయం లేని నిశ్శబ్దం ఉంటుంది. ఇటువంటి నిశ్శబ్దంలోనే అవగాహన కలుగుతుంది.