మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/వృద్ధిలోకి రావాలనే ఆకాంక్ష
79. వృద్ధిలోకి రావాలనే ఆకాంక్ష
చంటిపిల్లవాడు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. పాపం తల్లి తన చాతనైనదంతా చేసింది - పిల్లవాణ్ణి ఊరుకోబెట్టటానికి. విసుక్కుంది, లాలించింది, ఉయ్యాల ఊపింది. ఏం చేసినా లాభంలేకపోయింది. పిల్లవాడికి పళ్లొస్తూ ఉండి ఉండాలి. రాత్రంతా ఇంట్లో ఎవరికీ నిద్ర లేదు. చీకటిగా ఉన్న చెట్లపైన ఇప్పుడు తెల్లవారుతోంది. చిట్టచివరికి చంటిపిల్లవాడు శాంతించాడు. ఆకాశం వెలుగొందుతున్నకొద్దీ ఒక చిత్రమైన నిశ్చలత ఆవరించింది. ఎండిపోయిన కొమ్మలు సన్నగా బోసిగా, స్పష్టంగా ఉన్నాయి ఆకాశం ముందు. ఓ కుర్రవాడు కేకేశాడు. కుక్క మొరిగింది. లారీ ఒకటి రొదచేస్తూ వెళ్లింది. మరోరోజు మొదలైంది. అంతలోనే ఆతల్లి పిల్లవాణ్ణి ఎత్తుకుని జాగ్రత్తగా కప్పి బయటికి తీసుకువచ్చింది. గ్రామం అవతల ఉన్న దారివెంట తీసుకువెడుతూండి ఉండవచ్చు. ఆవిడ అలసిపోయి పీక్కుపోయినట్లుగా ఉంది రాత్రి నిద్రలేక. చంటిపిల్లవాడు మాత్రం బాగా నిద్రపోతున్నాడు.
త్వరలోనే సూర్యుడు చెట్లమీదికి వచ్చాడు. పచ్చగడ్డి మీద మంచు బిందువులు మెరుస్తున్నాయి. ఎంతో దూరం నుంచి రైలు కూతపెట్టింది. దూరాన ఉన్న పర్వతాలు చల్లగా నీడలా ఉన్నాయి. ఒక పెద్దపక్షి చప్పుడు చేస్తూ ఎగిరిపోయింది. మేము దాని ఏకాంతానికి భంగం కలిగించాం. హఠాత్తుగా సమీపించి ఉంటాం. దాని గుడ్లమీద ఎండుటాకులు కప్పేందుకు సమయం చాలలేదు దానికి. కప్పకపోయినా కొద్దిగా కూడ కనిపించటం లేదు. వాటిని అంత తెలివిగా దాచింది. ఇప్పుడు వాటిని అది దూరాన ఉన్న ఒక చెట్టుమీంచి చూస్తోంది. మేము కొద్దిరోజుల తరవాత ఆ తల్లిని పక్షిపిల్లలతో చూశాం. గూడు ఖాళీగా ఉంది.
దారి పొడుగునా నీడగా చల్లగా ఉంది. ఆ దారి తడిసిన అడవుల గుండా దూరాన ఉన్న కొండ పైదాకా పోతుంది. వెదుళ్లు బాగా వచ్చాయి. కొద్దిరోజుల క్రితం బాగా ఎక్కువగా వాన కురిసింది. మట్టి మెత్తగా దిగబడుతోంది. లేత బంగాళాదుంపల పంటలున్నాయి. లోయకి బాగా దిగువున ఊరు ఉంది. ఆ సువర్ణోదయం అందంగా ఉంది. కొండ దాటిన తరవాత మళ్లీ ఇంటికి వెళ్లే త్రోవ ఉంది.
ఆవిడ చాలా తెలివైనది. కొత్తగా వచ్చిన పుస్తకాలన్నీ చదువుతుందిట. కొత్తగా వేసిన నాటకాలన్నీ చూస్తుందిట. ఈ మధ్య బాగా వెర్రెక్కించిన ఏదో వేదాంతం గురించి చాలా వివరాలు తెలుసుకుందిట. ఆవిడ మానసికంగా పరిశీలింపబడిందిట. మనస్తత్వ శాస్త్రం గురించి బాగా చదివినట్లే తోస్తోంది - ఆవిడ ఉపయోగించే ప్రత్యేక శబ్దాలను బట్టి. ప్రముఖ వ్యక్తులందరినీ తప్పకుండా కలుసుకుంటుందిట. ఎవరినో యథాలాపంగా కలుసుకున్నప్పుడు వారు ఆవిణ్ణి ఇక్కడికి తీసుకొచ్చారుట. సునాయాసంగా మాట్లాడుతుందావిడ. హుందాగానూ, ఆకట్టుకునేట్లూ మాట్లాడుతుంది. వివాహం అయిందావిడకి. కాని పిల్లల్లేరు. అదంతా వెనకటి విషయం అన్నట్లుగా ఉంది. ఇప్పుడు ఆవిడ ప్రయాణం వేరు. బాగా డబ్బున్నావిడే అయి ఉండవచ్చు, ఆవిడ దగ్గర కూడా ఆ ధనవంతుల దగ్గర ఉండే చిత్రమైన ధోరణి ఉంది. ఆవిడ మొదలుపెట్టటమే "ప్రస్తుత క్లిష్టపరిస్థితిలో మీరే విధంగా ప్రపంచానికి సహాయపడుతున్నారు" అనే ప్రశ్నతో మొదలుపెట్టింది. ఆవిడ అలవాటుగా వేసే ప్రశ్నలో అదొకటి కావచ్చు. ఇంకా ఎన్నో ఆత్రుతగా అడిగింది - యుద్ధాన్ని నిరోధించటం గురించీ, కమ్యూనిజం వల్ల కలిగే ఫలితాల గురించీ, మానవుని భవిష్యత్తు గురించీ.
యుద్ధాలూ, అధికమవుతూన్న దుర్ఘటనలూ, దుఃఖాలూ, అన్నీ నిత్య జీవితంలోనుంచి వచ్చినవే కాదా? ఈ క్లిష్ట పరిస్థితికి మనలోని ప్రతి ఒక్కరూ బాధ్యులు కారా? భవిష్యత్తు ప్రస్తుతంలోనే ఉంది. ప్రస్తుతాన్ని అర్థం చేసుకోనట్లయితే భవిష్యత్తులో మార్పేమీ ఉండదు. ఈ సంఘర్షణకీ, గందరగోళానికీ మనలో ప్రతి ఒక్కరూ బాధ్యులని మీరు అనుకోరా?
"కావచ్చు. కాని ఆ బాధ్యతని గుర్తించినందువల్ల ఏమవుతుంది? అంత అపారమైన వినాశక చర్యలో నేను తీసుకున్న చిన్న చర్యకి ఏం విలువ ఉంటుంది? నా ఆలోచన మానవుడి తెలివి తక్కువతనాన్ని ఏ విధంగా మార్చగలదు? ప్రపంచంలో జరిగేది ఉత్త తెలివి తక్కువే. నా తెలివి దాన్ని ఏమాత్రం మార్చలేదు. అదీకాక, ఒక వ్యక్తి తీసుకునే చర్య ప్రపంచం మీద ప్రభావాన్ని కలిగించటానికి ఎంతకాలం పడుతుందో ఆలోచించండి."
ప్రపంచం వేరూ, మీరు వేరూనా? సమాజం మీవంటి, నావంటి వారిచేత నిర్మించబడినది కాదా? నిర్మాణంలో మూల పరివర్తన తీసుకురావటానికి మీలో, నాలో మూల పరివర్తన రావద్దా? విలువలలో ప్రగాఢ పరివర్తన ఎలా వస్తుంది అది మీతోనూ నాతోనూ మొదలవకపోతే? ప్రస్తుత క్లిష్టపరిస్థితిలో సహాయ పడటానికి ఒక కొత్త సిద్ధాంతం కోసం, ఒక కొత్త ఆర్థిక ప్రణాళిక కోసం వెతకాలా? లేక తనలోని సంఘర్షణా, గందరగోళమే తాను కల్పించిన ప్రపంచం కూడా కాబట్టి తనలోని సంఘర్షణనీ, గందరగోళాన్నీ అర్థం చేసుకోవటం మొదలుపెట్టాలా? కొత్త సిద్ధాంతాలు మనిషికీ మనిషికీ మధ్య ఐక్యతను కలుగజేస్తాయా? నమ్మకాలు మనిషికీ మనిషికీ మధ్య విరోధాన్ని కలిగించవా? మన మధ్య ఉన్న సిద్ధాంతాలు అనే ఆటంకాలను తొలగించవద్దా - అన్ని ఆటంకాలూ సిద్ధాంత సంబంధమైనవే - మన సమస్యల గురించి ఆలోచించండి, నిర్ణయాలూ, సూత్రాల దృష్టిలో కాదు, సూటిగా దురభిప్రాయమనేది లేకుండా ఆలోచించండి. మన సమస్యలతో మనకెప్పుడూ తిన్నగా సంబంధం ఉండదు. ఎప్పుడూ ఏదో నమ్మకం ద్వారానో, సూత్రీకరణ ద్వారానో ఏర్పడుతుంది. మన సమస్యలతో మనకి ప్రత్యక్ష సంబంధం ఉన్నప్పుడే వాటిని మనం పరిష్కరించగలుగుతాం. మనిషికీ మనిషికీ మధ్య వైరుధ్యం రావటం మన సమస్యల వల్ల కాదు, వాటి గురించి మనకున్న అభిప్రాయాల వల్ల. సమస్యలు మనల్ని దగ్గరికి తెస్తాయి, అభిప్రాయాలు దూరం చేస్తాయి.
మీరసలు ఈ ప్రస్తుత క్లిష్ట పరిస్థితి గురించి విచారిస్తున్నట్లుగా ఎందుకున్నారో అడగవచ్చునా?
"ఓ, నాకు తెలియదు. అంత బాధ, అంత దుఃఖం, చూస్తుంటే దాని గురించి ఏమన్నా చెయ్యాలనిపిస్తుంది."
మీరు నిజంగా దాని గురించి విచారిస్తున్నారా, లేక కేవలం ఏదో ఒకటి చెయ్యాలనే ఆకాంక్షతో ఉన్నారా?
"మీరు చెప్పినట్లు ఏదో చేసి విజయం సాధించాలనే ఆకాంక్ష ఉందనుకుంటాను."
మనలో ఎంతో కొద్దిమంది యొక్క ఆలోచన మాత్రమే నిజాయితీగా ఉంటుంది. మనం విజయవంతం కావాలనుకుంటాం. మనకోసమే అయినా కావచ్చు, ఒక ఆదర్శం కోసం, మనం ఏకీభవించిన నమ్మకం కోసం అయినా కావచ్చు. ఆదర్శం మనం కల్పించుకున్నదే. మన మనస్సులో పుట్టినదే. మన మనస్సు ప్రభావితం అయిన దాన్ని బట్టి అనుభవం పొందుతుంది. ఈ స్వయం కల్పితమైన వాటికోసం మనం పనిచేస్తాం, బానిస చాకిరీ చేసి, చచ్చిపోతాం. జాతీయత కూడా దైవభక్తి లాగే స్వయం సంకీర్తనమే - తనకు తానే ముఖ్యం. వాస్తవంగా గాని, సిద్ధాంత రీత్యాగాని; అంతేకాని దుర్ఘటనా, దుఃఖమూ కావు. క్లిష్ట పరిస్థితి గురించి మనం నిజంగా ఏమీ చెయ్యాలనుకోము. తెలివైన వాళ్లకి అదొక కొత్త విషయం మాత్రమే, అది సమాజంలో చురుకుగా పనిచేసేవారికీ, ఆదర్శవాదులకీ అనువైన రంగం.
మనం వృద్ధిలోకి రావాలని ఎందుకు ఆకాంక్షిస్తాం?
"మనం అలా ఉండకపోతే ఈ ప్రపంచంలో ఏమీ జరగదు. మనకి ఆ ఆకాంక్ష లేనట్లయితే ఈపాటికింకా గుర్రపుబళ్లనే నడుపుతూ ఉండి ఉండేవాళ్లం. ఆకాంక్ష అభివృద్ధికి మరో పేరు. అభివృద్ధి లేకపోతే మనం క్షీణించి పోతాం. రూపులేకుండా పోతాం."
ప్రపంచంలో పనులు జరిపించటంలో యుద్ధాల్నీ, చెప్పలేనన్ని దుఃఖాల్నీ పెంపొందిస్తున్నాం. ఆకాంక్ష అభివృద్ధా? ఈ క్షణంలో మనం అభివృద్ధి గురించి ఆలోచించటం లేదు, ఆకాంక్ష గురించే. మనం ఆకాంక్షతో ఎందుకుంటాం? మనం విజయవంతం కావాలనీ, ఎవరో అవాలనీ ఎందుకు కోరుకుంటాం? ఇంకా ఉన్నతంగా ఉండాలని ఎందుకు పోరాటం సల్పుతాం? తను ముందుకి తీసుకుని రావటానికి ఎందుకింత కృషి - ప్రత్యక్షంగా గాని, సిద్ధాంతం ద్వారా గాని, ప్రభుత్వం ద్వారా గాని? ఈ విధంగా తన్నుతాను ముందుకి తోసుకుని రావటమే మన సంఘర్షణకీ, గందరగోళానికీ కారణం కాదా? వృద్ధిలోకి రావాలనే ఆకాంక్ష లేకపోతే పాడైపోతామా? వృద్ధిలోకి రావాలనే ఆకాంక్ష లేకుండా భౌతికంగా బ్రతికి ఉండలేమా?
"గెలుపు లేకుండా గుర్తింపు లేకుండా ఎవరు బ్రతికి ఉండాలనుకుంటారు?"
ఈ గెలుపునీ, మెప్పుని వాంఛించటం వల్లనే మనలోనూ, మన బయటా సంఘర్షణ రావటం లేదా? ఆకాంక్ష లేకుండా ఉంటే క్షీణించినట్లేనా అర్థం? సంఘర్షణ లేకుండా ఉండటమంటే వృద్ధి లేకుండా స్థిరపడి పోవటమేనా? మందులు పుచ్చుకుని మన నమ్మకాలతో, సిద్ధాంతాలతో సహా మనల్ని మనం నిద్రపుచ్చుకుంటాం. అందువల్ల ఏ గాఢ సంఘర్షణలూ ఉండవు. మనలో చాలా మందికి ఏదో ఒక కార్యకలాపం మందులా పనిచేస్తుంది. నిజానికి అటువంటి పరిస్థితిలోనే క్షయం, వినాశం ఉంటాయి. అసత్యమైన దాన్ని అసత్యమని తెలుసుకోవటంతో మరణం వస్తుందా? వృద్ధిలోకి రావాలనే ఆకాంక్ష ఏ రకమైనదైనా, అది దేవుడికోసమైనా, గెలుపు కోసమైనా, అట్టి ఆకాంక్ష లోపల నుంచి బయట పడకుండా సంఘర్షణ తీసుకొస్తుందని తెలుసుకుంటే, నిజానికి దాని అర్థం - సమస్త కార్యాలకీ, జీవితానికీ అంతం అని కాదు.
మనం వృద్ధిలోకి రావాలనే ఆకాంక్షతో ఎందుకున్నాం?
"ఏదో ఒక ఫలితాన్ని సాధించటానికి కష్టపడే వ్యాపకం లేనట్లయితే, నాకు విసుగెత్తి పోతుంది. నా భర్త అభివృద్ధినే ఆకాంక్షించేదాన్నిదివరకు. నా భర్త కోసం అన్నప్పటికీ, ఆయన ద్వారా నా కోసమే అనుకుంటాను. ఇప్పుడు నా వృద్ధి కోసమే నేను ఆకాంక్షిస్తున్నాను ఒక ఉద్దేశంతో. వృద్ధిలోకి రావాలనే ఆకాంక్ష గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. ఆకాంక్షించానంతే."
మనం ఎందుకు గడుసుగా ఉంటాం, వృద్ధిలోకి రావాలని ఎందుకు ఆకాంక్షిస్తాం? వృద్ధిలోకి రావాలనే ఆకాంక్ష ఉన్నస్థితి నుంచి తప్పించుకోవటానికి కాదా? ఈ గడుసుతనం నిజానికి తెలివి తక్కువతనం కాదా? అసలు మనం తెలివి తక్కువ వాళ్లమే కాదా? ఉన్నస్థితి ఎప్పుడూ ఉండేదే అయితే దాన్నుంచి పారిపోవటం వల్ల ఏం లాభం? తప్పించుకోవటంలో మనం గెలుపొందవచ్చు. కాని మనం ఉన్నస్థితి అలాగే ఉంటుంది సంఘర్షణనీ, సుఖాన్ని సంపాదిస్తూ. మనం ఒంటరితనం అన్నా, శూన్యత అన్నా ఎందుకంత భయపడతాం? ఉన్నస్థితి నుంచి దూరంగా పారిపోవాలని జరిపే ఏ కార్యకలాపమైనా దుఃఖాన్నీ, వైరుధ్యాన్నీ తెస్తుంది. సంఘర్షణ అంటే ఉన్న స్థితిని కాదనటం, ఉన్నస్థితి నుంచి పారిపోవటం - అంతకన్న వేరే సంఘర్షణ ఏమీ ఉండదు. మన సంఘర్షణ అంతకంతకు మరింత గందరగోళంగా, పరిష్కారం లేకుండా ఉంటుంది - మనం ఉన్నస్థితిని ఎదుర్కోము కనుక. ఉన్నస్థితిలో ఏ గందరగోళమూ ఉండదు, దాన్ని తప్పించుకోవటానికి మనం వెతికే మార్గాల్లోనే ఉంటుంది.