మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/రాజకీయాలు
11. రాజకీయాలు
అటుపైన కొండల్లో రోజంతా వర్షం కురుస్తూనే ఉంది. సన్నని జల్లుగా కాదు. రోడ్లన్నీ ముంచెత్తి, కొండపక్కల ఉన్న చెట్లుపడిపోయేట్లూ, కొండరాళ్లు దొర్లి క్రింద పడేట్లూ, హోరుమంటూ కొన్ని గంటల సేపు నీరు కొట్టుకొచ్చేట్లు కురిసే కుంభవృష్టి అది. చిన్నకుర్రాడొకడు ఒళ్లంతా నీటిలో నానుతూ చిన్న నీటిమడుగులో ఆడుకుంటున్నాడు, వాళ్లమ్మ కోపంతో గొంతుచించుకుని అరుస్తున్నా లెక్కచెయ్యకుండా. ఆ బురద రోడ్డు మీద మేము పైకి నడిచి వెడుతూంటే, ఒక ఆవు క్రిందికి వస్తోంది. మబ్బులు విచ్చుకుని నీళ్లన్నీ, క్రిందికి దిమ్మరిస్తున్నట్లుగా ఉంది. మేము పూర్తిగా తడిసిపోయాం. పై బట్టలన్నీ విప్పేశాం. వాన ఒంటికి తగుల్తూంటే ఎంతో బాగుంది. ఇల్లు పైన కొండవైపున ఉంది. కొండ క్రింద చిన్న పట్నం ఉంది. పడమర వైపు నుంచి బలంగా గాలి వీస్తోంది. దానితోబాటే మరింత ఉధృతమైన కారుమబ్బుల్ని వెంటబెట్టుకొస్తోంది.
గదిలో చలిమంట మండుతోంది. గదిలో చాలామంది వేచి ఉన్నారు ఎన్నో మాట్లాడాలని. వానజల్లు కిటికీల మీద కొట్టి లోపల గదిలో మడుగులా చేసింది. చిమ్నీలోంచి కూడా నీళ్లు క్రిందికి కారి, మంటలకి తగిలి చిటపట మంటున్నాయి.
ఆయన చాలా ప్రఖ్యాతి గాంచిన రాజకీయవేత్త. వాస్తవ దృక్పథం ఉన్నవాడు. ఆయన ఎంతో మనఃపూర్వకంగానూ, హృదయపూర్వకంగానూ దేశాన్ని అభిమానించే మనిషి. సంకుచిత స్వభావంలేదు. స్వలాభాపేక్ష లేదు. ఆయన ఆకాంక్షించేది తన కోసం కాదు, అదర్శం కోసం, ప్రజల కోసం. ఊరికే బల్లగుద్ది ఉపన్యాసాలిచ్చి ఓట్లు సంపాదించేరకం కాదాయన. తన ఆదర్శంకోసం కష్టాలనుభవించాడు. అయినా చిత్రం, ఆయనేమీ విచారించటం లేదు. పండితుడులా ఉన్నాడు గాని రాజకీయవేత్తలా అంతగా లేడు. కాని, రాజకీయాలాయనకి ప్రాణం. ఆయన పార్టీకి ఆయన ఎంత చెబితే అంత - కొంత భయభక్తులతోనే. ఆయన కూడా ఎన్నో కలలు కన్నాడు. కాని వాటన్నిటిని వదిలేసుకున్నాడు రాజకీయాల కోసం. ఆయన స్నేహితుడొకాయన, ప్రముఖ ఆర్థికవేత్త. ఆయన కూడా ఈయనతో పాటు ఉన్నాడు. అపారమైన ప్రభుత్వ ఆదాయపు వివరాలూ, విపులమైన సిద్ధాంతాలూ ఆయనకి తెలుసును. వామపక్షం, దక్షిణపక్షం - ఇరుపక్షాల ఆర్థిక వేత్తలతోనూ ఆయనకు పరిచయం ఉంది. మానవాళి ఆర్ధిక విమోచన గురించి ఆయనవి కొన్ని సిద్దాంతాలు ఉన్నాయి. సునాయాసంగా మాట్లాడతాడు. మాటలకోసం తడుముకోవటం లేదు. వారిద్దరి ఉపన్యాసాలకూ జనం బాగా పోగవుతూ ఉంటారు.
దినపత్రికల్లోనూ, తక్కిన పత్రికల్లోనూ రాజకీయాలకూ, రాజకీయ వేత్తల భాషణలకూ, వారి కార్యక్రమాలకూ ఎంత చోటు కేటాయిస్తారో మీరు గమనించారా? ఇతర వార్తలు కూడా ఉంటాయి. నిజమే, కాని రాజకీయ వార్తలకే ప్రాముఖ్యం ఎక్కువ. ఆర్ధిక, రాజకీయ జీవితమే అతి ముఖ్యమై పోయింది. బాహ్య పరిస్థితులు - సుఖం, డబ్బు, హోదా, అధికారం - ఇవే ప్రధాన స్థానం ఆక్రమించి మన బ్రతుకుని తీర్చిదిద్దుతున్నాయి. పై ఆడంబరం, పేరు, వేషం, సలామూ, జండా - వీటికి ప్రాముఖ్యం ఎక్కువవుతోంది. - జీవిత పరమార్ధాన్ని పూర్తిగా మరిచి పోయారు. కావాలనే అడుక్కి తోసేశారు. సాంఘిక, రాజకీయ కార్య రంగంలో పడిపోవటం ఎంతో సులభం - జీవితాన్ని సాకల్యంగా అర్ధం చేసుకోవటం కన్న. ఏదో సిద్ధాంతంతో గాని, రాజకీయ కార్యక్రమంతోగాని, మత సంబంధమైన కార్యక్రమంతో గాని సంబంధం పెట్టుకోవటం వల్ల దైనందిన జీవితంలోని అల్పత్వం నుంచీ, ఆవేదన నుంచీ తప్పించుకోవటానికొక మార్గం లభిస్తుంది. హృదయం సంకుచితమైనదైనా, గొప్ప గొప్ప విషయాల గురించి, ప్రజాప్రియులైన నాయకుల గురించీ మాట్లాడవచ్చు. మీలోని వెలితిని ప్రపంచ వ్యవహారాల చిలుకపలుకులతో కప్పిపుచ్చుకోవచ్చును. మీ అస్తిమితమైన మనస్సు హాయిగా ఉండొచ్చును. ప్రజల ప్రోత్సాహంతో ఒక పాత మతాన్నో, కొత్త మతాన్నో ప్రచారం చేస్తూ స్థిరపడిపోవచ్చును.
ఫలితాలతో రాజీపడటమే రాజకీయాలు. మనలో చాలామంది తాపత్రయ పడేది ఫలితాల కోసమే. ఫలితాలను సాధించి శాంతి భద్రతలను నెలకొల్పాలని ఆశిస్తాం. కాని, దురదృష్టవశాత్తూ అది అంత సులభంకాదు. జీవితం సర్వతోముఖమైన ప్రక్రియ - అంతర్ముఖమైన దానితోనూ, బహిర్ముఖమైన దానితోనూ కూడిన ప్రక్రియ. బాహ్యంగా వున్నదాన్ని ప్రభావం తప్పనిసరిగా అంతర్గతంగా ఉన్నదానిపైన ఉంటుంది. కాని అంతర్గతమైనది ఎప్పటికైనా బాహ్యంగా ఉన్నదాన్ని లోబరుచుకుంటుంది. మీ లోపల ఉన్నదే బయట పడుతుంది. బయటిదాన్నీ, లోపలిదాన్నీ విడదీసి ఒకదానితో మరొకదానికి సంబంధం లేకుండా ప్రత్యేకమైన స్థానాల్లో బిగించి ఉంచలేము. ఎందువల్లనంటే, అవి నిరంతరం ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతూ ఉంటాయి. కాని, ఎప్పుడూ అంతర్గతంగా ఉన్న తృష్ణ, దాగి ఉన్న వాంఛలూ, ఉద్దేశాలూ శక్తిమంతంగా ఉంటాయి. జీవితం రాజకీయ, ఆర్ధిక కార్యకలాపాల మీదే ఆధారపడినది కాదు. జీవితం అంటే పైకి కనిపించేది మాత్రమే కాదు - చెట్టు ఆంటే ఆకుగాని, కొమ్మగాని మాత్రమే కానట్లు. జీవితం ఒక సంపూర్ణ ప్రక్రియ. దాని సమైక్యతలోనే ఉంటుంది దాని అందం. పైకి రాజకీయ, ఆర్ధిక వ్యవహారాలతో సమాధానపడినంత మాత్రాన సమైక్యత సిద్ధించదు. ఆ సమైక్యత కారణాలకీ, ఫలితాలకీ అతీతమైనట్టిది.
మనం ఎంతసేపూ కారణాలతోనూ ఫలితాలతోనూ ఆటలాడతాం తప్ప, వాటికి అతీతంగా పోలేము, మాటల్లో తప్ప. మన బ్రతుకులు శూన్యమైనవి, అర్ధరహితమైనవి. అందువల్లనే రాజకీయ ఉద్రేకానికీ, మతాభిమానానికీ బానిసలమైపోయాం. మన జీవితాలను తీర్చిదిద్దే వివిధ ప్రక్రియలన్నీ సమైక్యం కావటంలోనే ఏదైనా ఆశ ఉంటుంది. మత సంబంధమైనది గానీ, రాజకీయమైనది గానీ, మరే సిద్ధాంతాన్ని గానీ అనుసరించి నందువల్ల సమైక్యత సిద్ధించదు. విస్తృతమైన ప్రగాఢమైన ఎరుక, చైతన్యం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఈ ఎరుక చైతన్యపు లోతుల్లోకి కూడా పోవాలి. ఊరికే పైపై ఫలితాలతో తృప్తిపడితే చాలదు.